ఉవ్వెత్తున ఎగసిన నేపాల్ యువ తరంగంలో ఆర్నెల్లు దాటుతున్నా ఆగ్రహాగ్ని చల్లారలేదని, దాని సంకల్పం చెదరలేదని గత గురువారం నాటి పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. నేరుగా ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్‌ఎస్‌పీ) 125 సొంతం చేసుకుని ప్రజాస్వామ్యంతో ఇన్నాళ్లూ చదరంగమాడిన ప్రధాన పక్షాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసింది. మరో 110 మందిని ఆ యా పార్టీలకొచ్చిన ఓట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ పార్టీకీ తిరుగులేని మెజారిటీ ఉండరాదన్న ఆలోచనతో నేపాల్ దేశ రాజ్యాంగంలో ఈ ప్రాతినిధ్య నిష్పత్తి విధానాన్ని పొందుపరిచారు. తీరా ఆర్‌ఎస్‌పీ దాన్ని సైతం అధిగమించి మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. గెలుపు కోసం ప్రచార పటాటోపం, విచ్చలవిడి వ్యయం అవసరం లేదని, కేవలం హ్యాష్‌టాగ్‌లే ప్రత్యర్థులను మట్టికరిపిస్తాయని ఆర్‌ఎస్‌పీ నిరూపించింది. కీలకమైన అంశం ఏమంటే పట్టణాలు, పల్లెల వ్యత్యాసం లేకుండా అన్నిచోట్లా వామపక్షాలు, నేపాలీ కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యాయి.
నేపాల్ మాదిరే శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కూడా యువత తిరగబడి పాలకులు పదవులు వదిలి పారిపోయేలా చేసింది. కానీ ఆ రెండుచోట్లా ఎన్నికల సమయానికల్లా సంప్రదాయ పక్షాలు ప్రత్యక్షమయ్యాయి. శ్రీలంకలో 1960లో ఏర్పడిన జనతా విముక్తి పెరుమున(జేవీపీ), బంగ్లాలో 1980లో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) విజేతలయ్యాయి. అక్కడ ఉద్యమంలో ముందుండి పనిచేసిన యువతకు అధికారంలో చోటు దక్కలేదు. కానీ నేపాల్ పరిస్థితి వేరు. సామాజిక మాధ్యమాల నిషేధంతో ఆగ్రహించి వీధుల్లోకొచ్చిన యువతకు ఆర్‌ఎస్‌పీకి చెందిన 35 ఏళ్ల బాలేంద్ర షా, ఇతర నేతలు మార్గదర్శనం చేశారు. వారితోపాటే నడిచారు. వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చారు.
పర్యవసానంగా ఈసారి ఎన్నికల్లో పార్టీల, నాయకుల కంచుకోటలు అనుకున్నవి తునాతునకలయ్యాయి. వీటన్నిటా గతానుభవం లేని యువత విజేతలయ్యారంటే సాధారణ ప్రజానీకం పాత తరంతో ఎంత విసుగెత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు. అజేయుడనుకున్న మాజీ ప్రధాని కేపీ ఓలిశర్మ... బాలేంద్ర షా చేతిలో అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు విప్లవ వీరుడిగా నీరాజనాలందుకున్న మావోయిస్టు సెంటర్ నాయకుడు ప్రచండ అతి కష్టం మీద గట్టెక్కారు. ఆయన పార్టీకి ఒక డజను స్థానాలు మించి వచ్చే అవకాశం లేదు.
అయితే ప్రధాని కాబోతున్న బాలేంద్ర షా ముందు ఎవరెస్టు శిఖరాన్ని తలపించేలా సమస్యలున్నాయి. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆర్థిక వ్యత్యాసాలు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. ఉద్యోగాలు లేక జనాభాలో మూడోవంతు మంది చిన్నా చితకా ఉద్యోగాల కోసం భారత్ సహా పలు దేశాలకు వలస పోతున్నారు. వారు ప్రతి నెలా కుటుంబాలకు పంపే డబ్బే నేపాల్ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. నేపాల్ జీడీపీలో ఇది 28 శాతం. జలవిద్యుదుత్పాన మినహా ఖజానా కళకళలాడటానికి తోడ్పడే సహజ వనరులు లేవు. లోటు ఆర్థిక వ్యవస్థ, అరకొర వేతనాలు నేపాల్‌కు శాపాలు. మన దేశం తోడ్పాటునిస్తే ఉపాధి కల్పనకు బాటలు పరిచే ప్రాజెక్టులు వస్తాయని యువత ఆశిస్తోంది. అందుకే కావొచ్చు... ప్రతి ఎన్నికల్లోనూ రివాజుగా కనబడే భారత వ్యతిరేకత ఈసారి దాదాపు కనుమరుగైంది. సుస్థిర పాలన వుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అది లేకపోవటమే నేపాల్ ఎదుగుదలకు ఇన్నాళ్లూ ఆటంకంగా మారింది.
పాలన అంటే నిరసనోద్యమాలు నడపటమంత సులభం కాదు. ఉద్యమకారుడి గెటప్ నుంచి సమర్థ పాలకుడిగా బాలేంద్ర పరివర్తన చెందాల్సి ఉంది. అసలే కోవిడ్ మహమ్మారితో విదేశాల్లో కొలువులు కొడిగడితే, వర్తమాన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆ సమస్యను మరింత పెంచాయి. లుంబినీ వనం, ఎవరెస్టు శిఖరం ఉన్నా పర్యాటక రంగం ఎదుగుదల లేదు. ఇవన్నీ మళ్లీ పట్టాలెక్కాలంటే పారదర్శక పాలన, నిపుణుల తోడ్పాటు, ఇరుగుపొరుగు ఆపన్న హస్తం అవసరం. మూణ్ణెల్లు గడిస్తే చాలు... జనం నిలదీయటం మొదలుపెడతారు. గత పాలకుల కన్నా భిన్నమైనవాడినని నిరూపించుకోవటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించటం బాలేంద్రకు తక్షణ సవాళ్లు.


