ఏపీ సర్కార్‌ రాజ్యాంగ ఉల్లంఘన | Sakshi Editorial On AP Chandrababu Coalition govt Constitutional violation | Sakshi
Sakshi News home page

ఏపీ సర్కార్‌ రాజ్యాంగ ఉల్లంఘన

Mar 8 2026 1:18 AM | Updated on Mar 8 2026 1:18 AM

Sakshi Editorial On AP Chandrababu Coalition govt Constitutional violation

జనతంత్రం

చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్‌ చోరీ’ దొంగాట వెక్కిరిస్తున్నది. ‘సంపద సృష్టి’ అనే మాటకు యెల్లో నిఘంటువు అర్థం ‘రుణ సమీకరణ’  అని తేలిపోయింది. తన రాజకీయ వారసత్వం కొనసాగాలంటే తుప్పు పట్టిన అస్త్రతూణీరం అక్కరకు రాబోదని అర్థమైంది. కొత్త బాణాలు కావాలి. అరువు తెచ్చుకున్న నయా తత్వాలు పాడేందుకు సరికొత్త బాణీలు కావాలి. వాటినెలా సాధించాలి? కిం కర్తవ్యం అన్న ప్రశ్నకు ఒకే ఒక మార్గాంతరం ఆయనకు కనువిప్పు కలిగించినట్టుంది.

‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ మతాన్ని పులిమేసుకోవడం మొదలుపెట్టారు. మతాన్ని రాజ కీయాలతో ముడిపెట్టకూడదన్న రాజ్యాంగ స్ఫూర్తినీ, సర్వోన్నత నాయ్యస్థానాల ఆదేశాలనూ ఆయన గణించదలుచుకోలేదు. మనుగడకు మరో మార్గం లేదేమో! ‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్న నానుడి చందంగా  అవసరార్థం మత వేష ధారణ. ఆషాఢభూతిని ఆదర్శంగా తీసుకునేవారికి మతమైనా, రాజకీయమైనా ఒకటే. మతం కూడా రాజకీయమే. 

ఈ కొత్త వేషంలో ఆయనకింకో సౌలభ్యం ఉన్నది. తాను ప్రవచించే తాజా తాత్విక ధారలో కరిగి, జనం ఐహిక విషయాలు వదిలేయాలి. ఆ ట్రాన్స్‌లో మైమరిచిపోవాలి. ‘సూపర్‌ సిక్స్‌’ను సూపర్‌ హిట్‌ చేశానంటే తలలూపాలి. ఇరవై మాసాల్లో ఆరు లక్షల ఉద్యోగాలిచ్చేశానంటే నమ్మేయాలి. తన పేరును పఠించ గానే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులుగా పరుగెత్తుకొని వచ్చా యంటే నిజమే అనుకోవాలి. ఇంకో ఇరవై లక్షల ఉద్యోగాలను చిటికేసి ఇచ్చేస్తానంటే మహాప్రసాదమని మురిసిపోవాలి.

చంద్రబాబు, ఆయన పార్టీ, కూటమి కలిసి మత ఎజెండాను ముందు పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తు న్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తున్నారు. అందుకోసం చట్టసభలను కూడా వేదికలుగా చేసుకోవడానికి తెగించడం తీవ్రంగా ఆందో ళన కలిగిస్తున్నది. ‘‘... శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతా చూపుతాననీ...’’ అంటూ ప్రమాణాలు చేసి చట్టసభల్లో ప్రవేశించిన నేతలు ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజ్యాంగం పట్ల విద్రోహపూరితంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ ఉభయ సభల్లో ఈవారం చోటు చేసుకున్నాయి. 

శాసన మండలిలో గౌరవ సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విజ్ఞులందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘మీరు క్రిస్టియన్‌! మీ నాయకుడు క్రిస్టియన్‌. వెంకటేశ్వర స్వామిపై కక్ష కట్టారు. యేసు మాత్రమే దేవుడా... వెంకటేశ్వరస్వామి కాదా?’... ఈ రక మైన వాచాలతతో ఆయన చెలరేగి పోయారు. శాసనసభలో మంత్రులు మాట్లాడే మాటలను ప్రభుత్వ వాణిగానే పరిగణిస్తారు. 

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. తాను ఒక మతానికి ప్రతి నిధి అన్నట్టుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుగా ఆయన భాషావేశం, భావాభినివేశం తేటతెల్లం చేస్తున్నాయి. ఇది సంపూ ర్ణంగా రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన. శాసనసభ్యునిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజ్యాంగానికి ఆయన అవిధేయతను ప్రకటించినట్టే పరిగణించాలి.

భారత్‌ను లౌకిక (సెక్యులర్‌) రిపబ్లిక్‌గా మన రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. లౌకికత్వమనేది రాజ్యాంగ మౌలిక స్వరూ పంలో భాగమనీ, అది అనుల్లంఘనీయమైన ప్రాథమిక హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో ప్రకటించింది. ఏ మతాన్నీ అధికారిక మతంగా రాజ్యాంగం గుర్తించలేదు.  అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్నీ, సమాదరణనూ ప్రకటించింది. మత, కుల, ప్రాంత, లింగభేదాల ఆధారంగా ఎటువంటి వివక్షా లేదని ప్రాథమిక హక్కుల్లోని 15వ అధికరణం స్పష్టం చేసింది. 

ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం పట్ల ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తే అది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై 356వ అధిక రణం కింద చర్య (ప్రభుత్వ బర్తరఫ్‌) తీసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మతాన్ని రాజకీయాలతో ముడి వేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.

గౌరవ సభాధ్యక్షులు తాను క్రిస్టియన్‌ కాదు, హిందువునని చెప్పినందువలన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు మండలిలో చెప్పారు. అంటే సభాధ్యక్ష స్థానంలో హిందూయేతర వ్యక్తి కూర్చుని ఉంటే అతని మీద నిందలు మోపవచ్చునా? సభాధ్యక్షుడు క్రిస్టియన్‌ అయ్యుంటే తన మాటలను వెనక్కు తీసుకునేవాడిని కాదనే అర్థం ఆయన స్పందనలో ధ్వనించింది. ఇది కచ్చితంగా మత విద్వేష ప్రకటన. మత విషయాల్లో రాజ్యాంగ యంత్రాంగం తటస్థ పాత్ర పోషించాలన్న రాజ్యాగ స్ఫూర్తిని అవహేళన చేశారు. శాసన సభ్యునిగా తాను చేసిన ప్రమాణాన్ని గాలికొదిలి రాజ్యాంగ అవిధేయతకు ఆయన పాల్పడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా ఆయన ఖాతరు చేయలేదు.

శాసన మండలిలో అచ్చెన్నాయుడు ప్రహసనం గురువారం నాడు చోటుచేసుకున్నది. శుక్రవారం నాడు శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రే అచ్చెన్న పాటకు కోరస్‌ అందు కున్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక భారతదేశ చరిత్రలో బహుశా పార్లమెంట్‌లో గానీ, రాష్ట్రాల శాసనసభల్లో గానీ ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో మాట్లాడి ఉండరు. ‘ఏసుక్రీస్తుకయితే క్షమాపణ చెబుతారా... వెంకటేశ్వర స్వామికి మాత్రం చెప్పరా’’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 

తిరుమలలో ఆధ్యాత్మికవేత్తలూ, వేద పండితులూ వద్దువద్దని వారిస్తున్నా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబే ఈ ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక సుధలను అనుదినం ప్రవర్ధితం చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్వీబీసీ భక్తి ఛానల్‌ ఎందుకూ, డబ్బులు దండ గని ఈసడించుకున్న చంద్రబాబే వెంకన్నకు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ‘50 కోట్ల ఖర్చుతో భగవద్గీత పుస్తకాలు అచ్చేశారు. ఏముంది అందులో, ఆ పుస్తకాలను చూస్తే మొహాన ఉమ్మేస్తార’ని చెబుతున్న టీటీడీ బోర్డు అధ్యక్షుని మీద ఈగ వాలకుండా కాపుకాస్తున్న ముఖ్యమంత్రే ఈ ప్రశ్న వేస్తున్నారు.

దేవుని మీద నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా తనకు తెలిసో, తెలియకో తన వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపచారం జరిగిందని భావిస్తే తప్పనిసరిగా క్షమాపణ కోరు తారు. దేవుడిపై నమ్మకం ఉండేవారు శివుడూ, వేంకటేశ్వరుడూ, ఏసుక్రీస్తూ, అల్లా అనే తేడాలు చూడరు. అన్ని రూపాల్లోని అన్ని విశ్వాసాల్లోని దైవత్వాన్ని ఆరాధిస్తారు. ‘మీ దేవుడూ, మా దేవుడూ’ అనే మీమాంస భక్త వేషధారులకుంటుందేమో గానీ భక్తి విశ్వాసాలు కలవారికి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సాక్షిగా ఒక మతం తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్యాంగం నిర్దేశించిన ‘రాజ్య తటస్థత’ నియమాన్ని బాబు ఉల్లంఘించారు.

రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు... సత్యదూరమైన విషయాన్ని ప్రశ్నగా సంధించి ఆయన సభను తప్పుదోవ పట్టించారు. ఏడుకొండల స్వామికి క్షమాపణ చెప్పవలసింది ఎవరు? ప్రభుత్వం ప్రచారం చేసినట్టు జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్‌’ స్పష్టం చేసినా కూడా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వాదిస్తున్నారు కదా! ఆ నెయ్యి శాంపుల్స్‌ ఎప్ప టివి? చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొన్నాళ్ల తర్వాత టీటీడీ నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలివి. పరీక్ష ఫెయిలైన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. ఆ శాంపిల్స్‌ను పరీక్ష కోసం బాబు నియమించిన ఈవో శ్యామలరావు ఎన్‌డీడీబీకి పంపించారు. వెనక్కు మళ్లిన ట్యాంకర్లు ఎన్నడూ లేని విధంగా బాబు ఏలుబడిలోనే తొలి సారిగా డెయిరీ లేబుళ్లు మార్చుకొని తిరుమలకు వెళ్ళాయి.

కూటమి పాలనా కాలంలో, కూటమి నియమించిన ఈవో పంపించిన నెయ్యి శాంపిల్స్‌లో కల్తీ జరిగి ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? నాణ్యతా పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు మళ్లీ తిరుమలలోకి ప్రవేశించాయంటే అందుకు ఎవరిని నిందించాలి? వైసీపీ పాలనా కాలం నుంచే టీడీడీలో నాణ్యతా పరీక్షలకు ఏర్పాట్లున్నాయి. అప్పుడు కూడా చాలా సార్లు పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు మళ్లాయని రికార్డులు చెబుతున్నాయి. అయినా, 2024 జూలై తర్వాత వచ్చిన శాంపిల్స్‌ను  పరీక్షించి అంతకుముందు కాలంలో కల్తీ జరిగిందని తీర్పులు చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ ఆరోపణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ‘మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి’ అన్నాడట వెనుకటికి ఒకాయన! కూటమి తీరు ఆ విధంగానే ఉన్నది.

ఆదాయ వనరుల్లేని వేలాది చిన్న దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలకు నిధులనూ, అర్చక స్వాములకు భృతినీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి మీద, తిరుమలేశుని వైభవానికి దిగంతాల దాకా ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో వేలాది ఆలయాలను నిర్మించిన జగన్‌మోహన్‌రెడ్డి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కూటమి సర్కార్‌ పడరాని పాట్లు పడుతున్నది. ‘బట్ట కాల్చి మీదేస్తాం’ అనే బరితెగింపు ధోరణి ఇది. ఏడు కొండలూ తిరుమలేశునికే చెందుతాయని వైఎస్సార్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పిందెవరు? ఆ వీడియోలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. 

అవి ఫేక్‌ వీడియోలని ఇంకా ప్రకటించలేదెందుకో? ఏ హిందూ పీఠాధి పతులు చెప్పారని తిరుమలలోని వేయికాళ్ల మండపాన్ని కూల్చి వేశారు? వెంకటేశ్వరుని సేవకు ఆధ్యాత్మిక ఛానల్‌ ఎందుకు, డబ్బులు దండగన్నది ఎవరు? హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఏమున్నదని ఎవరి హయాంలోని టీటీడీ అధ్యక్షుడు హేళన చేశారు? ‘దళిత గోవిందం’ పేరుతో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యాన్ని దళితవాడల్లో వినిపించిన పాలకు లపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చూడటం ఎంత దిగజారుడుతనం?...  ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు!!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement