న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, ఇది కేవలం విద్వేషాన్ని పెంచే సాధనంగా మారిందని ఆయన విమర్శించారు. అయితే ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మద్దతుగా నిలిచారు.
‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ ఈ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘కేరళ సంస్కృతి, అక్కడి సంప్రదాయాలపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. అందుకే ‘ది కేరళ స్టోరీ 2’ వంటి చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక వర్గాన్ని కించపరచడానికి, సమాజంలో చీలికలు తీసుకురావడానికి సినిమాలను వాడుకుంటున్నారు. దీనివల్ల కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి పొందుతుంటే, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు’ అని రాహుల్‌పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై కూడా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఎవరైనా తమ గొంతు వినిపించాలని చూస్తే వారిపై దాడులు జరుగుతున్నాయి. అయితే కొన్ని వర్గాలకు అనుకూలమైన కథనాలను యధేచ్ఛగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు’ అని రాహుల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాహుల్ విమర్శలకు భిన్నంగా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘లోకం అన్న తర్వాత రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇంటి వద్ద కూర్చుని విమర్శలు చేసే కంటే, థియేటర్లకు వెళ్లి సినిమా చూడమని నేను కోరుతున్నాను. ఆ తర్వాతే ఇది ప్రచార చిత్రమా లేక సమాజానికి అద్దం పట్టే వాస్తవమా అనేది అర్థమవుతుంది. హిందూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులకు ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు


