ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరు ఇప్పుడు పొరుగు దేశాలకు విస్తరిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా రక్షణ మంత్రి ఖాలీద్ బిన్ సల్మాన్ తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భద్రతా సమీకరణలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ‘ఉమ్మడి వ్యూహాత్మక రక్షణ ఒప్పందం’ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో ఈ చర్చలు సాగాయి.
ఈ భేటీ అనంతరం సౌదీ రక్షణ మంత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా ‘పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిం మునీర్‌తో సమావేశమయ్యాను. సౌదీపై జరుగుతున్న దాడులు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి. వీటిని అడ్డుకోవడంలో మా ఉమ్మడి రక్షణ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ విజ్ఞతతో వ్యవహరించి, పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
2025 సెప్టెంబరులో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య కుదిరిన చారిత్రక రక్షణ ఒప్పందం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించి, పరస్పరం సైనిక సహాయం అందించుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో, సౌదీ భూభాగంపై ఇరాన్ దాడులు కొనసాగితే, పాకిస్థాన్ ప్రత్యక్షంగా యుద్ధ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా పాక్ సైనిక బృందాలు ఇప్పటికే సౌదీలో శిక్షణ, రక్షణ విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ప్రస్తుతం పాక్ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం, మరోవైపు దేశీయంగా ఉగ్రవాద సవాళ్లతో సతమతమవుతున్న ఇస్లామాబాద్.. ఇరాన్‌తో దౌత్యపరమైన వైరాన్ని పెంచుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే తన ఇరాన్ సహచరుడికి గట్టి హెచ్చరికలు పంపినట్లు సమాచారం. సౌదీ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లితే, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారని సమాచారం.
Met with Pakistan’s Chief of Army Staff and Chief of Defense Forces, Field Marshal Asim Munir. We discussed Iranian attacks on the Kingdom and the measures needed to halt them within the framework of our Joint Strategic Defense Agreement. We stressed that such actions undermine… pic.twitter.com/OuELnf9LU6
— Khalid bin Salman خالد بن سلمان (@kbsalsaud) March 7, 2026


