Women’s Day: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకూ.. | Women Are Reshaping Indias Travel Economy | Sakshi
Sakshi News home page

Women’s Day: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకూ..

Mar 7 2026 10:04 AM | Updated on Mar 7 2026 11:01 AM

Women Are Reshaping Indias Travel Economy

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళల ప్రయాణ తీరుతెన్నులు, ఆతిథ్య రంగంలో వారి ఎదుగుదలపై ప్రముఖ గ్లోబల్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ ‘ఏర్‌బీఎన్‌బీ’ (Airbnb) ఆసక్తికరమైన గణాంకాలను విడుదల చేసింది. దేశీయ పర్యాటక ఆర్థిక వ్యవస్థను మహిళలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో ఈ నివేదిక స్పష్టం వెల్లడించింది.

భారతదేశంలో ఏర్‌బీఎన్‌బీ వేదికగా హోస్టింగ్ చేస్తున్న వారిలో దాదాపు 30 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. పర్యాటకులు అత్యధికంగా ఇష్టపడే ‘గెస్ట్ ఫేవరెట్’ విభాగంలోని స్టేయింగ్ ఆప్షన్లలో 35 శాతం మహిళా హోస్ట్‌ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇది వారి నిర్వహణ దక్షతకు, అతిథులకు వారు అందిస్తున్న అద్భుతమైన అనుభూతులకు నిదర్శనం. డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఇంటి వద్దే ఉంటూ ఆదాయాన్ని గడించే అవకాశాలను మహిళలు అందిపుచ్చుకుంటున్నారు. 2024 ఏడాదిలో భారతీయ మహిళా హోస్ట్‌లు ఏర్‌బీఎన్‌బీ ద్వారా సుమారు రూ.260 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. స్థానిక సంస్కృతిని, సంప్రదాయ వంటకాలను పర్యాటకులకు పరిచయం చేస్తూ, వారు తమ ఇళ్లను చిన్నపాటి వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు.

భారతీయ మహిళలు ఇప్పుడు ప్రయాణాల విషయంలో మరింత ధైర్యంగా, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. ఒక తోడుతో కలిసి ప్రయాణించడం ప్రస్తుతం మహిళల్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ట్రెండ్. దీని తర్వాత చిన్న చిన్న బృందాలుగా (Small Groups) వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా ఉత్తర గోవా, బెంగళూరు, గురుగ్రామ్, దక్షిణ గోవా, పూతణె నగరాల కోసం పర్యాటకులు ఎక్కువగా ఆన్‌లైన్లో వెతుకుతున్నారు. అంతర్జాతీయంగా దుబాయ్, లండన్, బ్యాంకాక్, పారిస్, రోమ్ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

కేవలం పర్యాటక ప్రాంతాలే కాకుండా మధుర, దక్షిణ కన్నడ వంటి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాంతాలపై మహిళల్లో మరింతగా ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయంగా జార్జియాలోని 'కాజ్బెగి' వంటి మారుమూల పర్వత ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య పెరగడం విశేషం. ఒకప్పుడు కుటుంబ యాత్రల నిర్ణయాలు పురుషులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. బడ్జెట్ కేటాయింపులు, గమ్యస్థానాల ఎంపిక, భద్రతా ప్రమాణాల పరిశీలన వంటి విషయాల్లో మహిళలే కీలక నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో రివ్యూలు చదవడం, మొబైల్ యాప్‌ల ద్వారా శోధించి మరీ వారు పర్యటనలను ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే, భారతీయ పర్యాటక రంగం ఇప్పుడు పురుషస్వామ్య ధోరణి నుంచి బయటపడి సమ్మిళిత వృద్ధి వైపు పయనిస్తోంది.

ఇది  కూడా చదవండి: ‘శబరిమల’ సెగ ఉధృతం.. పినరయి సర్కారుకు షాక్‌

Advertisement
 
Advertisement
Advertisement