ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయని పలువురు టెక్ నిపుణులు చెబుతున్నవేళ.. సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు.
ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీ.. ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి.. దీనికి అనుగుణంగా నియంత్రణ వ్యవస్థలు సైతం అభివృద్ధి చెందాలని పాండే పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్‌ను ఉటంకిస్తూ.. రాబోయే ఏఐ, సింథటిక్ బయాలజీ వంటివన్నీ మానవాళికి సవాలుగా మారుతాయని వెల్లడించారు. ఈ సాంకేతికతలు మన జీవితాలను మెరుగుపరచగలిగినప్పటికీ.. సరైన నియంత్రణ లేకపోతే సమస్యలను కూడా సృష్టించగలవని అన్నారు.
ఇదీ చదవండి: ఏఐ రేసులో భారత్.. మూడేళ్లలో రూ.6 లక్షల కోట్లు!
ఏఐ టెక్నాలజీనీ దృష్టిలో ఉంచుకునే.. సెబీ సూపర్‌టెక్ (సూపర్‌వైజరీ టెక్నాలజీస్) & రెగ్‌టెక్ (రెగ్యులేటరీ టెక్నాలజీస్) వంటి సాంకేతిక పద్ధతులను అమలు చేస్తోంది. అంతే కాకుండా.. సైబర్ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా పరిపాలనను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకుంటోంది. సెక్యూరిటీస్ మార్కెట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ & దీర్ఘకాలిక సాంకేతిక వ్యూహ పథకాన్ని రూపొందించడానికి ఒక ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందని పాండే పేర్కొన్నారు.


