న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) అభివృద్ధి కోసం గతంలో పలు చర్యలు తీసుకున్నప్పటికీ క్యాపిటల్ మార్కెట్స్ కోణంలో అవి ఇంకా భారీగా విస్తరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్స్‌లో లిస్ట్ కావడం వల్ల చిన్న కంపెనీల్లో గవర్నెన్స్ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కానీ క్యాపిటల్ మార్కెట్స్ గురించి అంతగా తెలియకపోవడం వల్ల, మర్చంట్ బ్యాంకర్లు అంత తేలిగ్గా దొరక్కపోవడం వల్ల చిన్న సంస్థలు లిస్టింగ్‌పై సందేహిస్తుంటాయని పేర్కొన్నారు.
ఐపీవోల ద్వారా నిధులను సమీకరించేందుకు వ్యయాల భారం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చని ఇండియా ఎస్‌ఎంఈ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించడం వల్ల గవర్నెన్స్ మెరుగుపడుతుందని, విశ్వసనీయత పెరగడం వల్ల పెట్టుబడి వ్యయాలు కూడా తగ్గుతాయని పాండే చెప్పారు. చిన్న సంస్థలకి వర్తించే మినహాయింపులను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేయడం వల్ల ఎస్‌ఎంఈ ఐపీవోలపై ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంటుకి దారి తీసిందని ఆయన తెలిపారు. అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా నిబంధనలను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలు మెరుగుపర్చాయన్నారు.
ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజీల్లో 1,400 కంపెనీలు లిస్టయ్యాయని, వాటి మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.1 లక్షల కోట్లని పాండే చెప్పారు. ఇందులో 350 సంస్థలు మెయిన్ బోర్డుకి మైగ్రేట్ అయ్యాయని గర్గ్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా 98 సంస్థలు రూ. 9,800 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 232 లిస్టింగ్స్ ద్వారా రూ. 10,500 కోట్లకు సమీకరించినట్లు చెప్పారు.


