బ్యాంకు బ్యాలెన్స్ కొన్నిసార్లు అనవసరంగా కట్ అవుతూ ఉంటుంది. ఎందుకు కట్ అయిందో తెలుసుకుందామని బ్యాంకుకు వెళ్తే అప్పుడు తెలుస్తుంది.. ఏ ఇన్సూరెన్సో, మరేదో సర్వీస్ యాక్టివేట్ అయింది... దానికి సంబంధించిన ప్రీమియమే కట్ అయింది అని. ఇది చాలా మంది ఖాతాదారులకు ఎదురయ్యే అనుభవమే. ఇకపై అలా కుదరదు..
బ్యాంకుల్లో తప్పుడు అమ్మకాల (మిస్-సేలింగ్) నిర్వచనాన్ని మరింత కఠినతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు, బీమా సంస్థలు ఇప్పటివరకు వినియోగిస్తున్న కొన్ని రక్షణలను తొలగిస్తూ, కస్టమర్‌కు అనుచితంగా ఉత్పత్తులు విక్రయించినట్లు నిరూపితమైతే పూర్తి రీఫండ్ చెల్లించాల్సిన బాధ్యతను విధించింది.
2026లో అమల్లోకి రానున్న డ్రాఫ్ట్ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంక్స్ – రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్) సవరణ ఆదేశాలు’ ప్రకారం.. కస్టమర్ వయస్సు, ఆదాయ స్థాయి, రిస్క్ స్వభావం వంటి ప్రొఫైల్‌కు సరిపోని ఉత్పత్తి లేదా సర్వీస్‌ను విక్రయించడం ‘తప్పుడు అమ్మకం’గా పరిగణిస్తారు.
అంతేకాదు.. “డార్క్ ప్యాటర్న్స్” (చీకటి నమూనాలు) అనే భావనను కూడా మొదటిసారిగా ఆర్బీఐ నిర్వచించింది. ఇవి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసిన మోసపూరిత యూజర్ ఎక్స్‌పీరియన్స్ నమూనాలు. ఇవి వినియోగదారుల స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసి, వారు ఉద్దేశించని చర్యలకు ప్రేరేపిస్తాయి. ఇటువంటి చర్యలు తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయ వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలకు సమానమని ఆర్బీఐ పేర్కొంది.
ఇప్పటివరకు బ్యాంకులు, బీమా సంస్థలు ‘కొనుగోలుదారు జాగ్రత్త’ (Buyer Beware) విధానాన్ని అనుసరిస్తూ, సంతకం చేసిన పత్రాలు, నిర్ధారణ కాల్స్ ఆధారంగా తమను తాము రక్షించుకునేవి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు విక్రయించిన సంక్లిష్ట బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విషయంలో వివాదాలు ఎక్కువగా వచ్చేవి.
కస్టమర్ సమ్మతి ఉన్నా కూడా, అది అనుచిత అమ్మకాన్ని చట్టబద్ధం చేయదని ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసింది. దీని ద్వారా బ్యాంకులను ‘అత్యున్నత సద్భావన’ (Utmost Good Faith) సూత్రానికి లోబరచి, కేవలం కమీషన్ ఆధారిత మధ్యవర్తులుగా కాకుండా వారు విక్రయించే ఉత్పత్తులు సరైనవిగా ఉండేలా బాధ్యత వహించే సంస్థలుగా నిలిపింది. వినియోగదారుల పరిహారం కోసం ప్రతి నియంత్రిత సంస్థ తప్పనిసరిగా ప్రత్యేక విధానం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ముసాయిదా నిబంధనలు రుణ ఆమోదాన్ని బీమా లేదా ఇతర ఆర్థిక ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానించే తప్పనిసరి బండిలింగ్‌ను నిషేధించాయి. అలాగే, థర్డ్ పార్టీ ఏజెంట్ల పర్యవేక్షణను కఠినతరం చేస్తూ, అన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల తాజా జాబితాను బ్యాంకుల వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని ఆదేశించింది. బ్రాంచీల్లో పనిచేసే ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు వేరువేరని స్పష్టమైన నిర్ధారణ ఉండాలి.
ఈ నిబంధనలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు శాఖల ద్వారా బీమా, పెట్టుబడి ఉత్పత్తుల విక్రయ విధానంలో ఇవి గణనీయమైన మార్పులకు దారి తీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.


