ఆరు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సుల సరెండర్‌ | RBI confirmed six NBFCs surrendered their licenses | Sakshi
Sakshi News home page

ఆరు ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సుల సరెండర్‌

Feb 11 2026 8:43 AM | Updated on Feb 11 2026 10:53 AM

RBI confirmed six NBFCs surrendered their licenses

లిస్టులో టాటా మోటర్స్‌ ఫైనాన్స్, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 

అనుబంధ సంస్థల్లో విలీనం కావడంతో టాటా మోటర్స్‌ ఫైనాన్స్, పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తమ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్సులను రిజర్వ్‌ బ్యాంకుకి సరెండర్‌ చేశాయి. వీటితో పాటు మరో ఆరు సంస్థలు తమ లైసెన్సులను తిరిగి ఇచ్చేశాయి. ఏఏఆర్‌ శ్యామ్‌ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, రామా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, శ్రీ రామచంద్ర ఎంటర్‌ప్రైజెస్, శ్రీ నిర్మాణ్, అంకిత ప్రతిష్టాన్, మయూఖ ఇన్వెస్ట్‌మెంట్‌ ఈ జాబితాలో ఉన్నాయి. టాటా క్యాపిటల్‌లో టాటా మోటర్స్‌ ఫైనాన్స్‌ గతేడాది మే 8న విలీనమైంది. 2025 సెప్టెంబర్‌లో పిరమాల్‌ ఫైనాన్స్‌లో పిరమాల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలీనమైంది.

మరోవైపు, నిర్దిష్ట ఎన్‌బీఎఫ్‌సీలకు రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనకు సంబంధించిన ముసాయిదా సవరణలపై అభిప్రాయాలు తెలపాల్సిందిగా సంబంధిత వర్గాలకు రిజర్వ్‌ బ్యాంక్‌ సూచించింది. మార్చి 4 లోగా వీటిని ఆర్‌బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిపాదనల ప్రకారం ప్రజల నుంచి నిధులు స్వీకరించని, కస్టమర్లకోసం ప్రత్యేక ఇంటర్‌ఫేస్‌ లేని, అసెట్స్‌ పరిమాణం రూ. 1,000 కోట్ల లోపు ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్‌ చేయించుకోనక్కరలేదు.  

చిన్న ఎన్‌బీఎఫ్‌సీలకు నో రిజిస్ట్రేషన్‌

ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించని చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇకపై ఆర్‌బీఐ వద్ద నమోదు (రిజిస్టర్‌) చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది కూడా రూ.1,000 కోట్ల లోపు ఆస్తులున్న వాటికి రిజి్రస్టేషన్‌ నుంచి మినహాయింపును ఆర్‌బీఐ ప్రతిపాదించింది. వీటిని టైప్‌–ఐగా వర్గీకరించనుంది. ఈ మేరకు ముసాయి దా సర్క్యులర్‌ను జారీ చేసింది. వీటిల్లో రిస్క్‌ తక్కువగా ఉండడం వల్లే ఈ ప్రతిపాదన తెచ్చింది. ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్‌ 45ఏఐ కింద ప్రతీ ఎన్‌బీఎఫ్‌సీ సేవలు అందించేందుకు రిజి్రస్టేషన్‌ పొందడం తప్పనిసరి. కాకపోతే రూ.1,000 కోట్లలోపున్నవి తమ సొంత నిధులనే పెట్టుబడులుగా వినియోగిస్తాయి కనుక, వాటితో వ్యవస్థాగత రిస్క్‌ తక్కువేనని ఆర్‌బీఐ పేర్కొంది. ఒకవేళ ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరిస్తున్నా లేదా కస్టమర్‌ ఇంటర్‌ఫేస్‌ (శాఖలు/యాప్‌/డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు) కలిగి ఉంటే ఇకమీదటా రిజిస్ట్రేషన్‌ తీసుకోవడం తప్పనిసరి అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్‌

Advertisement
 
Advertisement
Advertisement