క్యూ3లో రూ. 1,684 కోట్లు
జ్యువెలరీ బిజినెస్ జూమ్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ టాటా గ్రూప్ దిగ్గజం టైటాన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 1,684 కోట్లను తాకింది. దేశీయంగా జ్యువెలరీ అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1,047 కోట్లు ఆర్జించింది. అమ్మకాలు సైతం 42 శాతం ఎగసి రూ. 24,915 కోట్లను తాకాయి. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 23,192 కోట్లకు చేరాయి.
కాగా.. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్ 43 శాతం బలపడి రూ. 25,567 కోట్లకు చేరింది. తనిక, మియా, జోయా, కేరట్‌లేన్ బ్రాండ్ల జ్యువెలరీ బిజినెస్ ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 23,492 కోట్లయ్యింది. వీటిపై 11 శాతం మార్జిన్లు సాధించింది. అంతర్జాతీయ అమ్మకాలు 83 శాతం దూసుకెళ్లి రూ. 1,058 కోట్లను తాకాయి. జ్యువెలరీ బిజినెస్‌లో 49 స్టోర్లను కొత్తగా జత కలుపుకోగా.. వీటిలో 24 కేరట్‌లేన్ విభాగానివే. 22 కొత్త స్టోర్లను జత చేసుకున్న వాచీలు తదితరాల విభాగం 14 శాతం అధికంగా రూ. 1,295 కోట్ల ఆదాయం అందుకుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.25 శాతం బలపడి రూ. 4,267 వద్ద ముగిసింది.


