రతన్ టాటా అప్పుడా పని చేసుంటే.. | If Ratan Tata Had Chosen Other, What Would Tata Be Today? | Sakshi
Sakshi News home page

రతన్ టాటా అప్పుడా పని చేసుంటే..

Dec 28 2025 2:35 PM | Updated on Dec 28 2025 2:59 PM

If Ratan Tata Had Chosen Other, What Would Tata Be Today?

రతన్‌​ టాటాను (Ratan Tata) ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అందరూ పుడతారు.. కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. నేడు రతన్ టాటా జయంతి. ఈ సందర్భంగా ఆయన కెరియర్‌ ప్రస్థానం.. ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం ఈ కథనంలో..

1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా నాయకత్వం, సమగ్రతకు ప్రతిరూపంగా ఎదిగారు. నాణ్యత, సామాజిక బాధ్యత, నైతిక విలువలకు కట్టుబడి ఉంటూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రతన్ టాటా జీవన ప్రయాణం సంకల్పం, క్రమశిక్షణ, ప్రేరణలతో నిండినది.

టాటా గ్రూప్‌లో తొలి అడుగులు
కార్నెల్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, 1961లో రతన్ టాటా టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM) నుంచి జాబ్‌ ఆఫర్ వచ్చింది. అయితే తన ప్రతిభను విదేశీ సంస్థకు ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. దీంతో ఆ అవకాశాన్ని వదులుకుని టాటా స్టీల్‌లో కొనసాగారు. ఆయన నాయకత్వంలో సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అప్పుడాయన ఆ ఉద్యోగంలో చేరిపోయి ఉంటే ఇప్పుడున్న ‘టాటా’ ఎలా ఉండేదో..

టాటా గ్రూప్ పగ్గాలు
1991లో జేఆర్‌డీ టాటా తర్వాత రతన్ టాటా టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య సమస్యల కారణంగా జేఆర్‌డీ టాటా సంస్థ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. రతన్ టాటా పదవీకాలంలో టాటా గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008) వంటి అంతర్జాతీయ సంస్థల కొనుగోళ్లతో టాటా గ్రూప్ గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మారింది.

ఇ‍క్కడో విషయం చెప్పుకోవాలి.. ఒకానొక సమయంలో టాటామోటర్స్‌  ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్‌ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. చర్చల సందర్భంగా ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు ఎగతాళి చేశారు. దీంతో ఆ డీల్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు టాటా. తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఫోర్డ్.. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను అమ్మకానికి పెట్టగా టాటానే కొనుగోలు చేశారు. టాటాకు ఫోర్డ్‌ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరిందన్నమాట.

పురస్కారాలు
2012లో టాటా సన్స్ ఛైర్మన్ పదవికి వీడ్కోలు పలికిన రతన్ టాటా, 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, మానవతావాదిగా, విలువల ప్రతీకగా గుర్తింపు పొందిన రతన్ టాటా 86వ ఏట 2024 అక్టోబర్ 9న ఈ లోకాన్ని వీడినా ఆయన పంచిన స్ఫూర్తి కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement