ఆయన.. ఒక పారిశ్రామికవేత్తగానే కాకుండా, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిగానూ పేరొందారు. అతని హృదయం వెన్నలాంటిదని, బంగారంలాంటి మనసు కలిగిన వారని సన్నిహితులు చెబుతుంటారు... ఆయనే దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.. ఈ రోజు ఆ స్ఫూర్తిదాయకుని జన్మదినం. 1937, డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా.. టాటా గ్రూప్ ఛైర్మన్‌గానే కాకుండా, అత్యుత్తమ జీవన ప్రమాణాలకు మారుపేరుగా నిలిచాయి. ఆయన ఆలోచనలు, పనులు.. ఆయనలోని గొప్ప మనిషిని ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, అతని జీవితంలో మానవత్వాన్ని చాటిన ఐదు అరుదైన సంఘటనలను గుర్తు చేసుకుందాం.
పెంపుడు కుక్కకు అనారోగ్యం.. బ్రిటన్ యువరాజు ఆహ్వానం తిరస్కారం!
రతన్ టాటా సన్నిహితుడు సుహేల్ సేథ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 2018లో బ్రిటన్ యువరాజు (ప్రస్తుత రాజు) ప్రిన్స్ చార్లెస్.. రతన్ టాటా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించారు. ఈ నేపధ్యంలో ‘బ్రిటిష్ ఏషియా ట్రస్ట్’ ఆధ్వర్యంలో రతన్ టాటాను సన్మానించేందుకు లండన్‌కు ఆహ్వానించారు. అయితే ఆ పర్యటనకు కొన్ని గంటల ముందు టాటా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కారణం ఏమిటంటే.. ఆయన పెంపుడు కుక్కలు 'టాంగో', 'టిటో'లలో ఒకటి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ‘నా పెంపుడు శునకాలను ఈ స్థితిలో వదిలి నేను రాలేను’ అని రతన్ టాటా సందేశం పంపారు. దీనికి ప్రిన్స్ చార్లెస్ ఆశ్చర్యపోతూ.. ‘టాటా గొప్పతనం ఇదే.. అందుకే టాటా సామ్రాజ్యం అంత పటిష్టంగా ఉంది’ అంటూ ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

‘తాజ్’లో మూగజీవాలకు రెడ్ కార్పెట్
ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్ మహల్ హోటల్ ద్వారం వద్ద ఒక వీధి కుక్క ప్రశాంతంగా నిద్రపోతున్న దృశ్యాన్ని చూసిన ప్రముఖ హెచ్‌ఆర్ ప్రొఫెషనల్ రూబీ ఖాన్ ఆశ్చర్యపోయారు. దీని గురించి ఆమె ఆరా తీయగా.. హోటల్ సిబ్బంది ఒక ఆసక్తికర విషయం చెప్పారు. ‘హోటల్ లోపలికి వచ్చే మూగజీవాలను ఎంతో ప్రేమతో చూడాలని రతన్ టాటా నుంచి మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి’ అని వారు తెలిపారు. కేవలం తాజ్ హోటల్‌లోనే కాదు.. దక్షిణ ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’లో కూడా వీధి కుక్కలకు స్వేచ్ఛా ప్రవేశం ఉంటుంది. అక్కడ వాటికి ఆహారం, ఆశ్రయంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు.

26/11 ముంబై దాడుల బాధితులకు అండగా..
భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన 26/11 ముంబై ఉగ్రదాడులకు తాజ్ హోటల్‌కు చెందిన 80 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఆ క్లిష్ట సమయంలో రతన్ టాటా స్వయంగా ఆ 80 మంది ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి, వారిని పరామర్శించారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబాలకు టాటా గ్రూప్ పూర్తి ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, మరణించిన లేదా గాయపడిన ఉద్యోగుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చును కూడా భరించింది.

డ్రైవర్ పక్కన నిరాడంబరంగా..
కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయినప్పటికీ రతన్ టాటా నిరాడంబరతకు నిలువెత్తు రూపంగా కనిపిస్తారు. ఆయన కారులో వెళ్లేటప్పుడు తరచుగా డ్రైవర్ పక్క సీటులోనే కూర్చునేవారు. మనుషులందరూ సమానమేనని, ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వాలని ఆయన చెప్పేవారు. డ్రైవర్ అందుబాటులో లేనప్పుడు, ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లేవారట.

ఆదర్శప్రాయమైన దాతృత్వం
రతన్ టాటా తన జీవితకాలంలో చేసిన సేవా కార్యక్రమాలు అమోఘమైనవి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకునేందుకు రతన్ టాటా ఉదారంగా విరాళాలు అందించారు. దేశవ్యాప్తంగా పలు పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణాలకు ఆయన సాయం అందించారు. జంతువులపై అమితమైన ప్రేమతో 2024లో ముంబైలో ఒక అత్యాధునిక జంతువుల ఆసుపత్రిని కూడా నిర్మించారు. రతన్ టాటా 2024, అక్టోబర్ 9న కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు, పాటించిన విలువలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి.



