తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రముఖ ప్రపంచ నాయకుల గౌరవార్థం హైదరాబాద్‌లోని కీలక రహదారులకు వారి పేరుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ ద్వారా తెలియజేయనుంది.
గ్లోబల్‌గా గుర్తింపు కోసం..
రాష్ట్రాన్ని ఆవిష్కరణలతో నడిచే భారతదేశానికి చిహ్నంగా నిలబెట్టే విస్తృత వ్యూహంలో ఈ నామకరణ ప్రతిపాదనలు ఒక భాగమని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (USISPF) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ముఖ్యమైన రోడ్లకు ప్రముఖ గ్లోబల్ కార్పొరేషన్ల పేర్లు పెట్టాలని ప్రతిపాదించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.
ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు..
డొనాల్డ్ ట్రంప్ అవెన్యూతో పాటు మరికొందరు ప్రముఖ వ్యక్తులు, కార్పొరేషన్ల గౌరవార్థం ఇతర రోడ్లకు కూడా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గౌరవార్థం నగరంలోని రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును కలిపే రాబోయే గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు తన పేరు పెట్టాలని నిర్ణయించింది.
గూగుల్ స్ట్రీట్
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా బయట అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయడాన్ని గుర్తించి ఈ లేన్‌ను గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఎస్‌బీఐ ఉద్యోగులకు జాక్‌పాట్


