భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా... దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ "మేం వేసే ప్రతి అడుగు... చేసే ఆలోచన భావితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా రేపటి తెలంగాణ కోసమే" అని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
"ఫీనిక్స్" పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూమన్ క్యాపిటల్, సస్టైనబులిటీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా రాష్ట్రాన్ని మార్చాలనే లక్ష్యంతోనే "తెలంగాణ రైజింగ్"కు శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్‌మెంట్స్, టెక్నలాజికల్ డిస్రప్షన్, క్లైమేట్ అన్‌సెర్టెనిటీ లాంటి సవాళ్లను అవకాశాలుగా మార్చుకొని 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు అడుగులు వేస్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ ప్రయాణంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం వేసిన తొలి అడుగు "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025" అని అన్నారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2024 - 2025 లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు అయ్యిందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు, జాతీయ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువ అని వివరించారు.
అదేవిధంగా రాష్ట్ర ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రేటు 7.6 శాతం కాగా, జాతీయ సగటు 6.6 శాతం మాత్రమే అన్నారు. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11.9 శాతం కాగా, అదే జాతీయ సగటు 10.7 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 12.6 శాతం వృద్ధి రేటుతో రూ.2.46 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మైనింగ్, క్వారీయింగ్, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇతర యుటిలిటీస్ లాంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలోనూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమని శ్రీధర్ బాబు తెలిపారు.
దేశంలోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్ గా మారిన మంథని అనేది ఒక మారుమూల గ్రామమని కాని ఆచిన్న ఊరే "రేపటి తెలంగాణ"కు మార్గదర్శిగా నిలిచిందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ ఐటీఐలు, ఏఐ ఆధారిత అకడమిక్ కరిక్యులం, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, లైఫ్ సైన్సెస్ హబ్ "వన్ బయో", సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ లాంటి విప్లవాత్మక అడుగులు ప్రపంచపటంలో "తెలంగాణ"ను ప్రత్యేకంగా నిలుపుతాయన్నారు.
రేపటి కోసం, భవిష్యత్ తరాలకు భరోసాగా తెలంగాణతో కలిసి భవిష్యత్తును నిర్మించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణులకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు.


