సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్‌ను కేరాఫ్‌గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేళ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు.
అలాగే, ప్రతీరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్‌కు రేవంత్ వచ్చారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ఏం మాట్లాడినా అబద్ధమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పెళ్లిళ్లకు, సీఎల్పీ మీటింగ్‌లకు ప్రజాభవన్‌ను వాడుతున్నారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన.. రెండేళ్ల పాలనలో రేవంత్ చేసింది ఒక్కటైనా చెప్పగలడా?. అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలి. ఫైనాన్స్‌లో బిల్లు రావాలి అంటే 30 శాతం ఇవ్వాలి. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్, ఉత్తమ్, ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకువచ్చారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలి’ అని కామెంట్స్ చేశారు.


