కబళించిన పొగమంచు
● దారి కానరాక డివైడర్‌ను ఢీకొన్న కారు
● లాలాపేటలో ఇద్దరు యువకుల దుర్మరణం
అడ్డగుట్ట: క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు తెల్లవారుజామునే కారులో బయలుదేరిన నలుగురు యువకుల్లో ఇద్దరిని పొగమంచు రూపంలో మృత్యువు కాటేసింది. దట్టంగా ఆవరించిన పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో డివైడర్ కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం ఉదయం లాలాగూడ ఠాణా పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. ఇన్‌స్పెక్టర్ రఘుబాబు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ఆశ్రిత్‌రెడ్డి (22), బాలాజీ మణికంఠ శివసాయి (23), రాహుల్ (23), శ్రీకాంత్ (24)లు స్నేహితులు. వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగులు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మిత్రులు కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు తార్నాకలోని గ్రౌండ్‌కు కారులో బయలుదేరారు. ఆశ్రిత్‌రెడ్డి కారు నడుపుతుండగా పక్క సీటులో బాలాజీ మణికంఠ శివసాయి, వెనుక సీట్లలో రాహుల్, శ్రీకాంత్‌లు కూర్చున్నారు. మౌలాలి నుంచి తార్నాక వెళ్తున్న క్రమంలో తెల్లవారుజామున 6 గంటల సమయంలో భారీగా పొగమంచు కమ్ముకుంది. లాలాపేట ధోబీఘాట్ వద్ద కల్వర్ట్‌పై ఉన్న డివైడర్ పొగ మంచు కారణంగా కనిపించలేదు. దీంతో మౌలాలి బ్రిడ్జిపై నుంచి వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవ్ చేస్తున్న ఆశ్రిత్‌రెడ్డితో పాటు ముందు సీటులో కూర్చున్న బాలాజీ శివసాయి మణికంఠ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లలో కూర్చున్న రాహుల్, శ్రీకాంత్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. స్వల్ప గాయాలైన మరో ఇద్దరు మల్కాజిగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదాలకు నెలవుగా
లాలాపేట కల్వర్టు..
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే లాలాపేట కల్వర్టు రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కల్వర్టుపై ఉన్న డివైడర్ సరిగా కనబడకపోవడంతో గతంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ, ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఇప్పటికై నా ట్రాఫిక్ పోలీసులు డివైడర్‌కు సరైన సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే బారికేడ్లయినా ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ప్రజలు సూచిస్తున్నారు. తద్వారా బ్రిడ్జిపై నుంచి వచ్చే వాహనాలు నెమ్మదిగా వస్తాయని, అప్పుడు ప్రమాదాలు కూడా తగ్గుతాయని పలువురు చెబుతున్నారు.
లాలాపేట కల్వర్టుపై డివైడర్‌ను ఢీకొన్న కారు
ఆశ్రిత్‌రెడ్డి (ఫైల్)
బాలాజీ శివసాయి మణికంఠ (ఫైల్)
కబళించిన పొగమంచు
కబళించిన పొగమంచు


