తార్నాక ఆర్టీసీ ఆసుపత్రికి జాతీయ అక్రిడిటేషన్
● వైద్య సేవా ప్రమాణాల మెరుగుదలకు మరింత కృషి
● సూపరింటెండెంట్ డాక్టర్ శైలజా మూర్తి
సాక్షి, సిటీబ్యూరో: తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (ఎన్‌ఏబీహెచ్) గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలు, రోగి ఆరోగ్య భద్రతను నిర్ధారించే దిశగా ఆసుపత్రి చేస్తున్న నిరంతర కృషికి ఇదో మైలురాయిగా నిలువనుంది. అధునాతన క్రిటికల్ కేర్ సేవలు, మాడ్యులర్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్ థియేటర్లు, పూర్తిస్థాయి క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు, వివిధ రకాల చికిత్సలు తార్నాక ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సదుపాయాలు రోగులకు ప్రత్యేక వైద్య సేవలను అందించడానికి సహాయపడుతున్నాయి. ఆసుపత్రి విద్యా, శిక్షణ కార్యక్రమాలను కూడా విస్తరించింది. 100 సీట్ల బీఎస్సీ నర్సింగ్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్‌లలో డీఎన్బీ పీజీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు లభించడం పట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి. శ్రీనివాస్ , ఇతర వైద్య బృందాన్ని ఆర్టీసీ సీఎండీ నాగిరెడ్డి అభినందించారు. వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవల్ని సాధించాలనే అచంచలమైన సంకల్పానికి ఇది నిదర్శనమని కొనియాడారు. టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఏబీహెచ్ సర్టిఫికేషన్ దక్కడం సంతోషంగా ఉందని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని సూపరింటెండెంట్ శైలజామూర్తి పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు, నాణ్యత ప్రమాణాలకు ఇది ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు.


