Hyderabad Latest News
-
అమ్మవార్లకు కోటి దండాలు
● రాష్ట్రంలోనే 7, 8 స్థానాల్లో బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాలు ● ఏడాదిలో రూ.24 కోట్లకు పైగా ఆదాయం బంజారాహిల్స్: దేవాదాయ శాఖ రూపొందించిన 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా నివేదిక ప్రకారం నగరంలోని బల్కపేట శ్రీ ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాల ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. దర్శనం టికెట్లు, హుండీ కానుకలు, ప్రసాద విక్రయాలు, వివిధ సేవల ద్వారా బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయానికి రూ.12.56 కోట్లు, జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి రూ.12.21 కోట్లు సమకూరాయి. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా పెరగడం విశేషం. రాష్ట్రంలోని టాప్– 10 ఆదాయం వచ్చే దేవాలయాల్లో 7వ స్థానంలో బల్కంపేట ఎల్ల్మమ్మ, 8వ స్థానంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలు చోటు సంపాదించుకున్నాయి. -
టాప్–10లో మనోళ్లే
● ఇంజినీరింగ్, అగ్రికల్చర్ పరీక్షల్లో విజయ కేతనం ● ఎప్‌సెట్‌లో హైదరాబాద్‌కు ర్యాంకుల పంట సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ఎంసెట్ (టీజీ ఎప్‌సెట్)–2026 ఫలితాల్లో మహా హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాల్లో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంకులను కొల్లగొట్టి ‘మహా నగరం’ విద్యా హబ్‌గా తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. పట్టుదల, ప్రణాళికాబద్ధమైన కృషితో విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ● ఇంజనీరింగ్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులు సరికొత్త రికార్డు సృష్టించారు. రాష్ట్ర స్థాయి మొదటి (ఫస్ట్) ర్యాంక్‌తో పాటు టాప్–10లో వరుసగా 2, 6, 7, 8, 9, 10 ర్యాంకులను కై వసం చేసుకుని జైత్రయాత్ర సాగించారు. ● అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లోనూ అదే జోరును కొనసాగించారు. రాష్ట్ర స్థాయి రెండో (సెకండ్) ర్యాంక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు, వరుసగా 3, 4, 5, 10 స్థానాలను దక్కించుకుని టాప్‌గా నిలిచారు. ఫలితాల్లో టాప్–10లో మెజారిటీ ర్యాంకులు గ్రేటర్‌కే దక్కడం విశేషం. మురిపించిన ఫలితాలు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల నుంచి ఈ ఏడాది భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరై, అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో మూడు జిల్లాల నుంచి దాదాపు 1.15 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో సుమారు 98వేల మందికిపైగా విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్/ఫార్మసీ విభాగంలో గ్రేటర్ పరిధి నుంచి సుమారు 48వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 41వేల మందికిపైగా అర్హత సాధించి ఉన్నత చదువుల రేసులో నిలిచారు. -
మహాలక్ష్మిపై చిన్నచూపు
సాక్షి, సిటీబ్యూరో: మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ మీదుగా చర్లపల్లి వెళ్లే (49ఎం/250) బస్సు. బంజారాహిల్స్ ఒకటో నంబర్ రోడ్ బస్టాపులో ఇద్దరు మహిళలు ఎదురుచూస్తున్నారు. సుమారు 45 నిమిషాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఆ బస్సును చూసి ఊపిరి పీల్చుకున్నారు. కానీ అది అక్కడ ఆగకుండానే ముందుకు కదిలింది. దాంతో ఆ మహిళలు నిస్సహాయంగా మరో బస్సు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇలా.. ఈ ఒక్క రూట్లోనే కాదు. నగరంలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి. ఒకరిద్దరు మహిళా ప్రయాణికులు కనిపిస్తే చాలు బస్సులు నిలపకుండానే డ్రైవర్లు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా అప్పటికే బస్సులు పూర్తిగా నిండిపోయి అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఏ మాత్రం అవకాశం లేనప్పుడు ఇలా నిలపకుండా వెళ్లిపోవడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా బస్సుల్లో ప్రయాణికులు లేకపోయినా సరే మహిళలు కనిపిస్తే చాలు ఆపడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మహిళల ఉచిత ప్రయాణంపై చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు చులకన భావాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బందితో ఘర్షణ.. ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత సిటీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థినులకు ఇది ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా కనీసం రూ.3000 నుంచి రూ.5000 వరకు చార్జీల రూపంలో చెల్లించాల్సిన డబ్బులు ఆదా అవుతున్నాయి. దీంతో అన్ని బస్సుల్లో 70 శాతం మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. మరోవైపు సిటీ బస్సులు సైతం 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనే చులన భావంతోనే కండక్టర్లులు, డ్రైవర్లు బస్టాపుల్లో బస్సులను ఆపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొందరు మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. జనరల్ సీట్లలో కూర్చోవద్దా..? మహిళా ప్రయాణికులు జనరల్ సీట్లలో కూర్చుంటే లేపేస్తున్నారు. బస్సుల్లో రద్దీ కారణంగా ఒక్కోసారి వెనుక ద్వారం నుంచి కూడా బస్సు ఎక్కాల్సి వస్తోంది. అలా ప్రవేశించేవారిని దింపేస్తున్నారు. ముందు నుంచి రావాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వాళ్లు వెనుక నుంచి ముందుకు వచ్చే లోపు బస్సు కదిలిపోతుంది’ అని బంజారాహిల్స్ నుంచి హబ్సిగూడకు చెందిన ఓ మహిళ విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కండక్టర్లతో గొడవలు తప్పడం లేదని చెప్పారు. గతంలో ప్రతిరోజు 8 లక్షల నుంచి 12 లక్షల మంది మహిళలు ప్రయాణించగా ప్రస్తుతం సుమారు 16 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది ప్రయాణం చేసినట్లు అంచనా. మహిళా ప్రయాణికుల చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తున్నా.. ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటోందని పలువురు మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్టాపుల్లో బస్సులు ఆపకుండానే వెళ్తున్న డ్రైవర్లు కసురుకుంటున్న కొందరు కండక్టర్లు జనరల్ సీట్లలో కూర్చోవద్దంటూ ఇబ్బందులు ఆవేదన వ్యక్తంచేస్తున్న మహిళా ప్రయాణికులు -
అయినా కావాలి..నేపాలీ !
బంజారాహిల్స్: తక్కువ జీతం ఎక్కువ పని.. ఏడాది ఒక్కసారైనా సెలవు తీసుకోకపోవడం.. 24 గంటలూ ఇంటిపట్టునే ఉండడం..ఏ పని చెప్పినా కాదనకపోవడం.. పని ఎగ్గొట్టకపోవడం..ఇదీ నేపాలీ పనిమనుషులు చేస్తున్న పనులు. దీంతో వీరిని తొలగించాలంటే యజమానులు ససేమిరా అంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకున్న నేపాలీ గ్యాంగ్‌ల దొంగతనాల దృష్ట్యా వారిని పనిలో నుంచి తొలగించాలంటూ నగరంలో అన్ని ఠాణాల పోలీసులు వారి వివరాలను సేకరించి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా తమ ఇళ్లల్లో పనిచేస్తున్న నేపాలీ పనిమనుషులను దూరం పెట్టడానికి యజమానులు అంగీకరించడం లేదు. ● ఈ నెల 8వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాసన్‌నగర్‌లో మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజరంజన్‌ను ఆ ఇంటి పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నేపాలీలు కలిసి దారుణంగా హత్య చేసి నగలతో ఉడాయించారు. నేపాలీ పనిమనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీసులు ఈ కాలనీలో నేపాలీ పనిమనుషులను ఎవరెవరు పెట్టుకున్నారో ఆ యజమానులను కలిశారు. మొత్తం 37 ఇళ్లల్లో నేపాలీ పనిమనుషులు ఉన్నారు. ● తమ ఇంట్లో గత 15 సంవత్సరాలుగా నేపాలీ జంట పనిచేస్తుందని, నమ్మకంగా ఉంటున్నారని, ఇప్పుడు వారిని తొలగిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని, వీరి లాగా మరెవరూ పనిచేయలేరని ఓ అధికారి పోలీసుల మొహం మీదనే చెప్పేశాడు. వీరి పనితనం ఏమిటో ఆయన పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు వెనుదిరిగారు. ● బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌తో పాటు వెస్ట్‌జోన్ పరిధిలోని సుమారు 1360 మంది నేపాలీలు ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చి కనీసం వారి వివరాలైనా తీసుకోవాలని చెప్పినా ఒక్కరూ స్పందించిన పాపానపోలేదు. ప్రశాసన్‌నగర్‌లో ఇంత పెద్ద ఘటన జరిగినా నేపాలీ పనిమనుషుల విషయంలో అక్కడి బ్యూరోక్రాట్లు ఏమాత్రం భయపడకపోగా ఏళ్లతరబడి ఇక్కడే పనిచేస్తున్నారని, వారిని తొలగించడం కష్టమంటూ చెప్పేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. తక్కువ జీతం..ఎక్కువ పని.. ఏడాదికోసారి సెలవు అందుకే వారివైపు మొగ్గు దశాబ్దాల తరబడి సేవలందిస్తూ.. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు నేపాలీల పట్ల నమ్మకాన్ని కోల్పోయేలా చేసినా దశాబ్దాల తరబడి నగరంతో వీరి అనుబంధం విడదీయలేనిది. సెక్యూరిటీగార్డులుగా, ఇంటి కాపలాదారులుగా, డ్రైవర్లుగా, పనిమనుషులుగా, వంటవాళ్లుగా చాలా ఇళ్లల్లో దశాబ్దాలుగా వీరి సేవలు కొనసాగుతున్నాయి. వీరు తక్కువ జీతానికి ఎక్కువ పనిచేయడం బాగా కలిసివస్తుంది. ఇళ్లల్లోనే చిన్న గది ఇచ్చినా కుటుంబం అంతా సర్దుకుపోతుంది. వీళ్లు ఏడాది, రెండేళ్లకు ఒక్కసారే వారం రోజులు సెలవుపెట్టి స్వగ్రామమైన నేపాల్‌కు వెళ్తుంటారు. మిగతా ఏడాదంతా ఇంటిపట్టునే ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే వృద్ధులకు వీరి అవసరం ఎంతో ఉంటుంది. అందులోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే వీరి చేసే వంటలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఏరకంగా చూసినా వీరి వల్ల ఎక్కువ లాభాలే తప్పితే అతి తక్కువ నష్టాలు కనబడుతుండడంతో యజమానులెవరూ వీరిని తొలగించడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఇప్పటివరకు ఒక్క యజమాని కూడా తమ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీలను వెళ్లిపోమ్మని చెప్పలేదంటే ప్రతి ఇంటికీ వీరి అవసరం ఎంత ఉందో అర్ధంచేసుకోవచ్చు. -
కే–పాప్ కేక
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కం ఆర్టిస్ట్ సంజీతా భట్టాచార్య సిటీలో సందడి చేశారు. శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ‘ఫస్ట్ గ్లోబల్ గర్ల్ గ్రూప్’ ఆడిషన్స్‌కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కే–పాప్ సాంగ్ ‘స్మూత్ లైక్ బెటర్’ బీటీఎస్ పాటతో అభిమానులను ఉర్రూతలూగించారు. తన కొత్త ఆల్బమ్ లైవ్ కాపీలకు ఆటోగ్రాఫ్ ఇస్తూ, ఫ్యాన్స్‌కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ అలరించారు. కాగా ఈ ఈవెంట్ లైఫ్‌స్టైల్, మేకోవర్, కలర్ అనాలిసిస్, ఫొటోబూత్ ఫన్ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్ క్యాంపస్ వాతావరణాన్ని సృష్టించింది. – సాక్షి, సిటీబ్యూరో -
‘సిమ్ స్వాప్’ ముఠా ఆటకట్టు
● టెలికం వెరిఫికేషన్ పేరుతో సైబర్ మోసాలు ● ఆరుగురు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: సిమ్ స్వాపింగ్తో మోసాలకు పాల్పడతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. విషింగ్, సిమ్ మానిప్యులేషన్, ఓటీపీ డైవర్షన్, మోసపూరిత ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలతో వందలాది బాధితుల నుంచి రూ.77.75 లక్షల సొమ్మును ఈ ముఠా కాజేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ శనివారం మీడియాకు వెల్లడించారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సలీం, సయ్యద్ హషీమ్ రెజా అలియాస్ టిప్పు, బన్సీధర్, అబ్దుల్ అలీం అలియాస్ మిట్టు, మిజానుర్ రెహమాన్ షేక్, మెహబూబ్ ఆలం అన్సారీ అలియాస్ సూరజ్‌లు ముఠాగా ఏర్పడి ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. థర్డ్ పార్టీ నుంచి కస్టమర్ల ఫోన్ నంబర్లు సేకరించి సిటీ బ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డ్ డివిజన్ అధికారులమంటూ వారికి ఫోన్ చేసి నమ్మిస్తారు. టెలికాం శాఖ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ఈ–సిమ్ నుంచి ఫిజికల్ సిమ్ కార్డ్‌లుగా మార్చుకునేలా ప్రేరేపిస్తారు. ఆ తర్వాత మాల్వేర్ ఇన్స్టాల్ చేసిన మొబైల్ ఫోన్లను కొరియర్ సర్వీసుల ద్వారా బాధితులకు ఇంటికే పంపిస్తారు. బాధితులు ఆ ఫోన్లలో ఫిజికల్ సిమ్ కార్డ్‌లను వేయగానే.. వెంటనే, వారికి రావలసిన వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ)లు, బ్యాంకింగ్ అలర్ట్‌లు నిందితులకు డైవర్ట్ అవుతాయి. వీటి ఆధారంగా నిందితులు బాధితుల బ్యాంక్ ఖాతాలకు అనధికారిక యాక్సెస్ పొంది, మోసపూరిత ఆన్లైన్ లావాదేవీలను నిర్వహిస్తారు. ఈక్రమంలో ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ ముఠా సభ్యులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో నిందితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు అక్కడి వెళ్లి ఆరుగురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని నిందితుల నివాసాల నుండి రూ.15 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. -
నృత్య రూపిక
తెలంగాణ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. రవీంద్రభారతి వేదికగా శనివారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నృత్యరూపకాలు మన సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాయి. కాగా కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ అంటే గొప్ప చరిత్ర అని, ఇక్కడి ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ సలహాదారు ఆర్.గోవింద్ హరి, దేవాదాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి -
రెడ్డి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి
రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: రెడ్డి సామాజిక వర్గ్గ కార్పొరేషన్‌కు పాలక మండలి ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర రెడ్డి సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు జైపాల్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గ పేదల సంక్షేమానికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని.. అయితే నేటికీ పాలక మండలి ఏర్పాటు చేయలేదని.. నిధులు కేటాయించలేదని వివరించారు. వివిధ సామాజిక వర్గాలతో పాటు రెడ్డి కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించి, రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. -
బర్త్‌డే పేరిట దోపిడీకి స్కెచ్
● రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నలుగురి అరెస్ట్ ● పరారీలో అసలు సూత్రధారులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించిన నేపాలీ గ్యాంగ్ అల్వాల్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి కౌకూర్‌లోని రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్లోని కార్యాలయంలో మల్యాజిగిరి కమిషనర్ సుమతి శనివారం వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన మీనా అలియాస్ మమత, రాజేష్‌లు కొన్ని నెలల ముందు కౌకూర్‌లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మిల ఇంట్లో పని మనుషులుగా చేరారు. వారిద్దరు ఒంటరిగా ఉంటున్నారని, ఇంట్లో నగదు, బంగారం, వెండి ఉందని పసిగట్టారు. ఎలాగైనా సొత్తు దోచుకోవాలని భావించిన మమత నగరంలో మరోచోట పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన రాజేష్, సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్‌లతో కలిసి పథకం వేశారు. ఈ నెల 11వ తేదీన తన పుట్టిన రోజని అబద్ధం చెప్పి మమత తన గ్యాంగ్‌తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్‌లో వేడుకలను జరుపుకున్నారు. అనంతరం రాత్రి 8:30 గంటల సమయంలో ఈ గ్యాంగ్ ఇంట్లోకి ప్రవేశించి మురళీమోహన్, విజయలక్ష్మిలను బంధించి వారికి మత్తు పదార్థాలు ఇచ్చారు. అనంతరం ఇంట్లోని బీరువాలు పగులగొట్టి దాదాపు 60 తులాల బంగారం, 15 కేజీల వెండి, మూడు వేల డాలర్లను దోపిడీ చేశారు. తర్వాత ఆటోలో కొంతమంది, స్కూటర్‌పై మరికొంత మంది పరారై యాప్రాల్‌కు చేరుకున్నారు. అక్కడ స్కూటర్ విడిచిపెట్టి.. రెండు ట్యాక్సీలు మాట్లాడుకుని నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని దేశం వదిలి నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈనేపథ్యంలో గతంలో మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో మీనా, రాజేష్‌లకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఘటన స్థలంలో జరిపిన వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోలాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సునిత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారని సమాచారం అందడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. గ్యాంగ్ లీడర్ మమత, రాజేష్‌లతో పాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఆమె తెలిపారు. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. వందలకొద్దీ సీసీ కెమెరాల జల్లెడ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు పంపించారు. దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి సమాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. -
నకిలీ యాప్స్.. బీ అలర్ట్!
ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో టోకరా సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కొత్వాల్ వీసీ సజ్జనర్ శనివారం పేర్కొన్నారు. ఆ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయని, అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ’డిస్ట్రిక్ట్’ యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని సజ్జనర్ తెలిపారు. అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇలాంటి ఫేక్ యాప్‌లు, వెబ్ సైట్స్‌పై నిఘా ఉంచామని, ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం..అడ్డుగా ఉన్నాడని దారుణ హత్య
గచ్చిబౌలి: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు మహిళ భర్తను దారుణంగా హత్యచేశాడు. శనివారం శేరిలింగంపల్లిలో డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ● పటాన్చెరులో హోటల్ నిర్వహిస్తున్న బైండ్ల నవీన్(27), ఇస్నాపూర్‌కు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్ రాయిగల్ల శేఖర్(36) స్నేహితులు. తరచూ శేఖర్ ఇంటికి నవీన్ వచ్చేవాడు. ఈ క్రమంలో శేఖర్ భార్య ప్రమీలతో నవీన్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తన భార్య ఓ మహిళ వద్ద ఫోన్ ఉంచి తరచుగా నవీన్‌తో మాట్లాడుతోందని శేఖర్ తెలుసుకున్నాడు. ఇటీవల భార్య గర్భం దాల్చడంతో నవీన్ మూలంగానే గర్భవతి అయిందని అనుమానించి వేధించసాగాడు. ఈ విషయం నవీన్‌తో చెప్పి ప్రమీల వాపోయింది. దీంతో శేఖర్‌ను అంతమొందించాలని నవీన్ ప్లాన్ వేశాడు. మద్యం తాగించి... ఈ నెల 12న రాత్రి శేఖర్‌కు నవీన్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందామని పిలిచాడు. ఇద్దరూ ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. శేఖర్‌కు మద్యం తాగించి గొడవపడ్డ నవీన్ బండ రాయితో తలపై మోది హత్య చేశారు. మృతదేహంపై అట్టముక్కలు కప్పి రాయిని మరోచోట పడేశాడు. ప్రమీలకు ఫోన్‌చేసి నీ భర్తను చంపేశానని చెప్పాడు. మృతుడి ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఔటర్ వద్ద మృతదేహం... మరుసటి రోజు ప్రమీల..తన భర్త ఇంటికి రాలేదని అతను పనిచేసే కంపెనీకి వెళ్లి అడిగింది. ఈ నెల 14న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పటాన్చెరు పోలీసులకు సమాచారం అందింది. ఆ మృతదేహం తన అన్నదే అని శేఖర్ తమ్ముడు గుర్తించాడు. భార్య మాత్రం ఎవరు చంపారో తనకు తెలియదని పోలీసులను నమ్మించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమీల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తమదైన శైలిలో విచారించగా నవీన్ హత్య చేశాడని తెలిపింది. నవీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. బైండ్ల నవీన్‌తోపాటు ప్రమీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బండరాయితో కొట్టి అంతమొందించిన ప్రియుడు మృతుడి భార్య, నిందితుడు అరెస్ట్ -
హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు
బైక్ అదుపుతప్పి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి గచ్చిబౌలి: స్నేహితుడిని బస్‌స్టాప్‌లో దించి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన మేరు.. జార్ఖండ్‌కు చెందిన దిబ్యం కుమార్ (26) కొండాపూర్‌లోని సాయి అర్బన్ విల్లాలో నివాసముంటున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడు సంకల్ప్ సృజన్‌ను కొండాపూర్‌లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ సమీపంలో బస్‌స్టాప్‌లో దించి తిరిగి వస్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ప్రధానం ద్వారం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో దిబ్య కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.వెనుక బైక్‌పై వచ్చిన స్నేహితులు దిబ్య కుమార్‌ను హైటెక్‌సిటీలోని యశోద హస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. దిబ్య కుమార్ హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. -
నేపాలీలను నివారించండి
● ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు ఇతర పనివారి వివరాలూ ధ్రువీకరించుకోండి సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్ రాజధాని వ్యాప్తంగా ఇటీవలి నేరాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలున్నంత వరకు నేపాలీలను పనిలో పెట్టుకోవడాన్ని నిలువరించాలని సూచిస్తున్నారు. ఇతర పనివాళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటూ నగరవ్యాప్తంగా ఇళ్లు, అపార్ట్మెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ దారుణ హత్య, దోపిడీ ఘటన జరిగిన వారం రోజుల్లోనే జవహర్‌నగర్ కౌకూర్‌లో నేపాలీలు మరో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేపాలీల నేరాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తులో పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. ఇక ఇతర పనివారి రికార్డులూ లేకపోవడంతో జరగరానిది జరిగినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఠాణాల వారీగా క్షేత్రస్థాయిలో నేపాలీలు, ఇతర పనివారి వివరాలు సేకరించడంతో పాటు నేపాలీలను నివారించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిలో... కొందరు నేరచరితులు డ్రైవర్లు, కార్మికులు, కేర్టేకర్లుగా చేరి యజమానుల విశ్వాసం పొందుతున్నారు. ఆపై అదును చూసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాళ్లలో నేపాలీలు ఎక్కువ ఉంటున్నారు. ఈ దృష్ట్యా పనిలో పెట్టుకునే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, పనివాళ్ల వివరాలను పోలీసులకు అందించి పూర్వాపరాల పరిశీలన, ధ్రువీకరణ చేసుకోవాలని, వీటిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. వీలున్నంత వరకు నేపాలీ గృహ కార్మికులను నియమించుకోవడాన్ని నివారించాలని, ఒకవేళ నియమించుకుంటే పూర్తి నాగరిక్/గుర్తింపు వివరాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్, ఫొటోగ్రాఫ్, మొబైల్ నంబర్, శాశ్వత చిరునామాను ధ్రువీకరించువాలని, ఈ వివరాలన్నీ రికార్డుల నిర్వహణ కోసం స్థానిక స్టేషన్లో అందించాలని పోలీసులు కోరుతున్నారు. దీంతోపాటు నేరాల నిరోధం, ఆధారాల సేకరణకు సాధ్యమైన చోటల్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. విలువైన వస్తువులు, లాకర్లు, నగదు ఉన్నవాటితో పాటు సున్నిత ప్రాంతాలకు పనివాళ్ల ప్రవేశాన్ని పరిమితం చేయాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపం లేదా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. నేపాల్‌తో సంబంధాలపై ప్రభావం? హైదరాబాద్ పోలీసుల చర్యలు సరిహద్దు దేశమైన నేపాల్‌తో భారత్ సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దేశంతో స్నేహపూర్వక, వర్తక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నేపాలీల అంశంలో జారీచేసిన నోటీసుల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలని చెబుతున్నారు. -
ఒకడు చిక్కాడు
● మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో ముంబయిలో పట్టివేత ● చోరీ ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్ కూడా..! బంజారాహిల్స్: విశ్రాంత ఐపీఎస్ వినయ్‌రంజన్ భార్య తనూజ రంజన్‌ను జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నేపాలీ పని మనిషి కల్పన, మరో ముగ్గురు నేపాలీలు దారుణంగా హత్య చేసిన ఉదంతం దర్యాప్తులో నగర పోలీసులు కొంత పురోగతి సాధించారు. కీలక నిందితుడు సునీల్ పరియర్తో పాటు ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్‌ను ముంబైలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. దోపిడీలో పాల్గొన్న మిగతా ముగ్గురు కల్పన అలియాస్ ధర్మ, సురేష్‌షాహి, గణేష్‌షాహి కోసం ముంబైలో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. తనూజను ఈ నెల 8న నలుగురు నేపాలీలు హత్య చేసి తెల్లవారుజామున 3.30కు నాంపల్లిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. పోలీసుల కళ్లుగప్పేందుకు చర్లపల్లిలో దిగి కారు బుక్ చేసుకుని నగర శివార్ల వరకు వెళ్లారు. కాగా, కల్పన, సురేష్, గణేష్‌ల వద్ద ఫోన్ లేకపోవడంతో పట్టుకోవడంలో జాప్యమవుతోంది. సునీల్ ద్వారా వీరి జాడ కోసం సాంకేతికతను వినియోగించి జల్లెడ పడుతున్నారు. గ్యాంగ్‌లో ఒకరు దొరకడంతో దర్యాప్తు కొంత సులువైంది. కల్పన, సునీల్, సురేష్, గణేష్‌లు తనూజను హత్య చేసి 22 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తు కల్పన దగ్గరే ఉండడంతో ఆమెను పట్టుకుంటే మొత్తం మిస్టరీ వీడనుంది. కాగా, ప్రశాసన్‌నగర్ ఘటనలో ఒకరు పట్టుబడడం పోలీసులకు కొంత ఊరటనిచ్చింది. వీరి ద్వారా నగరంలో తిష్టవేసిన నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. -
ఈవీదే ఠీవీ!
ప్రోత్సాహంగా పన్ను మినహాయింపు.. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్ వాహనాలు సాక్షి, సిటీబ్యూరో కొద్ది రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని వల్లెవేసిన కేంద్రం ఊహించినట్లుగానే పెట్రో బాంబు పేల్చింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని అందరిపైనా పెట్రోల్, డీజిల్ భారం మోపింది. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా ఇంధనం ధరలకు రెక్కలొచ్చేస్తాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ధరలు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు ఈ ధరాఘాతం నుంచి సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి. ఈ వాహనాల వినియోగంతో రోజుకు సుమారు 1.82 లక్షల లీటర్ల చొప్పున ప్రతి నెలా సుమారు 54.86 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నట్లు అంచనా. తద్వారా సుమారు రూ. 56.53 కోట్లు ఆదాయం మిగులుతుంది. అస్థిరమైన పెట్రోల్, డీజిల్,సీఎన్జీ, ఎల్పీజీ, తదితర ఇంధన ధరలను దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాలు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రవాణాశాఖ జీవితకాల పన్నును మినహాయించింది.ఇది విద్యుత్ వాహనాలకు ఎంతో ప్రోత్సాహంగా మారింది. 2024 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యుత్ వాహనాలపైన రూ.810 కోట్ల వరకు ఈ మినహాయింపు లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు.ఆర్టీఏలో నమోదైన 81812 వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 56,465 ఉన్నాయి. వీటిపైన రూ.67.14 కోట్లు, సుమారు 22049 కార్లపైన రూ.741.19 కోట్ల చొప్పున పన్ను మినహాయింపు లభించింది. అలాగే 2608 ఆటోరిక్షాలు, 372 సరుకు రవాణా వాహనాలు, మరో 318 బస్సులకు కూడా జీవిత కాల పన్ను నుంచి ఊరట కల్పించినట్లు జేటీసీ చెప్పారు.హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపును కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ విద్యుత్ వాహనాల వినియోగం వల్ల ప్రతి నెలా 1.31 లక్షల టన్నులకు పైగా కాలుష్య కారకాలు తగ్గుముఖం పట్టినట్లు అంచనా. ప్రతి నెలా రూ.56 కోట్లకు పైగా ఆదా రోజుకు 1.83 లక్షల లీటర్ల ఇంధనం పొదుపు ప్రజా రవాణా సదుపాయంతో మరింత తగ్గనున్న ఖర్చులువాహన రకం సంఖ్య నెల ఇంధన ఆదా (రూ.కోట్లలో) ద్విచక్ర వాహనాలు 56,465 26.68కార్లు 22,049 22.23 ఆటోలు 2,608 2.88 గూడ్స్ వాహనాలు 372 1.23 బస్సులు 318 3.51 మొత్తం వాహనాలు 81,812 56.53 విద్యుత్ వాహనాలతో ఆదా ఇలా.. -
నిమ్స్ మరో రికార్డు
● రోగులకు అవయవాలువిజయవంతంగా అమర్చిన వైద్యులు24 గంటల్లో 2 లివర్.. 3 కిడ్నీ మార్పిడి సర్జరీలులక్డీకాపూల్: నిమ్స్ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్), 3 మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మార్పిడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మార్పిడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు. ● బ్రెయిన్ డెడ్ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు. ● కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ (డీసీఎల్‌డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్ డీసీఎల్‌డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మార్పిడి చేపట్టింది. ● దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్ఆర్డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్సలు జరిగాయి. -
రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం
● మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ● బండ్లగూడ పరిధిలో విషాదం చాంద్రాయణగుట్ట: రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జహంగీరాబాద్‌కు చెందిన వాచింగ్ మిషన్ టెక్నీషియన్ మహ్మద్ ఆమేర్ (26), ఫాతిమా బేగం (22)కు మూడు నెలల క్రితం వివాహమైంది. గురువారం అర్ధరాత్రి ఈ దంపతులు తమ ఆడపడచు పిల్లలు షేక్ సులేమాన్ (9), నౌషిన్ బేగం(11)లతో కలిసి బండ్లగూడలోని బంధువుల శుభకార్యానికి హాజరై జహంగీరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. హాషామాబాద్ యూటర్న్ వద్ద ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన జితేందర్ కుమార్ (22) లారీతో వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఫాతిమా లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పిల్లలు షేక్ సులేమాన్, నౌషిన్ బేగం, ఆమేర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి చెందిన విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. -
నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
● రూ. 3 లక్షల మద్యం సీజ్ చందానగర్ : నకిలీ విదేశీ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని కొండాపూర్ ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ విలేకరుల మాట్లాడుతూ.. లిక్కర్ ఈవెంట్స్‌లో ఒరిస్సాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్లు పని చేస్తుంటారు. కరీంనగర్‌కు చెందిన శరత్ చంద్ర సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అత్తాపూర్‌లో నివాసముంటున్నాడు. లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్లను పరిచయం చేసుకొని ఖరీదైన లిక్కర్ బాటిళ్ళలో చీప్ లిక్కర్ నింపి కొండాపూర్ ప్రాంతంలోని గుట్టల బేగంపేట్‌లో తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందడంతో రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుభాష్ చంద్ర, ఎస్ఐ అఖిల్, సిబ్బందితో కలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని నకిలీ విదేశీ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. -
ఒకేరోజు 3 అగ్నిప్రమాదాలు
హైరైజ్ అపార్ట్మెంట్లో.. మన్సూరాబాద్: మన్సూరాబాద్ ఎంఈ రెడ్డి గార్డెన్స్ ఎదురుగా ఉన్న ట్రెడెంట్ నమశ్రీ హైరైజ్ అపార్ట్మెంట్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 22 అంతస్తుల ఆపార్ట్మెంట్ 4వ అంతస్తులోని ఓ అపార్ట్మెంట్లో శ్రీకాంత్ కుటుంబంతో నివాసముంటున్నారు. సాయంత్రం నివాసితులు దేవుడి గదిలో దేవుడి దీపం పెట్టి బయటకు వెళ్లారు.అయితే దీపం అంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. హయత్‌నగర్‌లో.. హయత్‌నగర్: విద్యుదాఘాతం కారణంగా రెండు షాపులు దగ్ధమయ్యాయి. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన మేరకు.. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఉగాది కాంప్లెక్స్ దుకాణాల సముదాయంలో జయశ్రీ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్‌వేర్ షాపు, లక్ష్మీనర్సింహా కార్ డెకర్స్, ఒక ఫర్నిచర్ షాపులు ఉన్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రిక్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మంటలు పక్కనే ఉన్న రెండు షాపులతోపాటు ఫర్నిచర్ దుకాణానికి అంటున్నాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. కోకాపేటలో మణికొండ: పూజకోసం వెలిగించిన దీపం అంటుకోవడంతో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. కోకాపేట రాజీవ్ గృహకల్పలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో మంటలు అధికంగా వచ్చి పక్కనే ఉన్న కర్టెన్లకు అంటుకుని ఇల్లంతా వ్యాపించాయి. యూపీకి చెందిన ప్రవీణ్ కుమార్‌సింగ్ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి మంటలను అదుపుచేశారు. మహానగరంలో మూడు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. మన్సూరాబాద్, కోకాపేట్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. -
బెట్టింగ్‌కు బానిసై.. ఆర్మీ జవాన్ చైన్ స్నాచింగ్
అల్వాల్: నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆర్మీ జవాన్‌ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. గురువారం నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ యాదగిరిరెడ్డి తెలిపిన మేరకు.. వైఎస్ఆర్ కడప జిల్లా గోరవంద్లపల్లికి చెందిన కుర్రపోతుల రెడ్డి శేఖర్ (31) ఆర్మీలో జనరల్ డ్యూటీ జవాన్‌గా పనిచేస్తూ అల్వాల్‌లోని త్రిశూల్ లైన్ ఆర్మీ క్వార్టర్స్ నివాసం ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి భారీగా అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చేందుకు దొంగగా మారాడు. ఈ నెల 10న సాయంత్రం తన ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్‌ను మార్చుకుని అల్వాల్‌లోని డాల్ఫిన్ వైన్ షాప్ సమీపంలోని పాన్ షాప్ వద్దకు వచ్చాడు. సప్తగిరి కాలనీకి చెందిన మణి మేఘల (57)ను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లి పరారయ్యాడు. పోలీసులు అదే ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్ సరఫరా
ఇద్దరు అరెస్ట్.. రూ. 2.58 లక్షల డ్రగ్స్ పట్టివేత కుత్బుల్లాపూర్: సంపన్న కుటుంబాల పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని ఎకై ్సజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బ్రాంచ్ (ఎస్టీఎఫ్బీ) టీమ్ అరెస్ట్ చేసింది. కొంపల్లి హై టెన్షన్ రోడ్డులో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం మేరకు ఎస్టిఎఫ్బీ టీం ఎస్ఐలు బాలరాజు, సంధ్యతో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఇన్నోవా కారును గుర్తించి ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో ఉన్న ప్రవీణ్ వద్ద బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 3.24 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, ఎలిజర్ అలియాస్ సన్నీ వద్ద 36.90 ఓజి కుష్, 7.73 గ్రాముల చెరస్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 2.58 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను కుత్బుల్లాపూర్ ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టిఎఫ్బి టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. -
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
డీజీపీకి పలువురి వినతిపత్రంసాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోవాలని విద్యార్థి, మహిళా సంఘాల ప్రతినిధులు డీజీపీ సీవీ ఆనంద్‌ను గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ బండి భగీరథ్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారని, ఆరు రోజులుగా అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని నేతలు పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శిపుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆందోళనకుత్బుల్లాపూర్: బాలికపై ఘాయిత్యానికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వం, పోలీసులుబండి సంజయ్ కుటుంబానికి కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఎన్ అశాలత, ప్రజా సంఘాల నాయకులు ఐలాపురం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐసీసీలో గ్రీన్ సిమెంటెక్ సదస్సు
మాదాపూర్: గ్రీన్‌బిల్డింగ్‌లు మౌళిక సదుపాయాలను నిర్మించడంలో సిమెంట్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ సి.శేఖర్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని గురువారం హెచ్ఐసీసీలో వార్షిక కాన్ఫరెన్స్ ఎక్స్పో గ్రీన్‌సిమెంటెక్ 22వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మన జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి తక్కువ కార్బన్ పదార్థాలను స్వీకరించడం చాలా ముఖ్యమన్నారు. సిమెంట్ పరిశ్రమ ఏఐ ఆధారిత పరిష్కారాలను ఎక్కువగా స్వీకరించాలన్నారు. 50 మందికిపైగా ఎగ్జిబిటర్లతో ఎక్స్పో నిర్వహించారు. -
డ్రగ్స్ నిర్మూలన సామాజిక బాధ్యత
మల్కాజిగిరి సీపీ సుమతి సాక్షి, సిటీబ్యూరో: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్, అపూర్వ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 320–ఏ) సంయుక్తంగా రూపకల్పన చేసిన స్టాప్ డ్రగ్ అబ్యూజ్ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్‌కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మత్తులో మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుండి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల మానసిక స్థితిని, వారి స్నేహితులను నిరంతరం గమనిస్తూ వారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అపూర్వ లయన్ చైర్పర్సన్ నైనా దేవి, షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీహెచ్ అశోక్, ఫౌండేషన్ సలహాదారులు హైకోర్ట్ అడ్వకేట్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. -
కులవివక్ష లేని సమాజం నిర్మించాలి
రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ బంజారాహిల్స్: దేశంలో ఇంకా కులవివక్ష ఉందని, ఆధునిక యుగంలో కూడా అది కొనసాగడం దురదృష్టకరమని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి బెజవాడ విల్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో ‘పూర్వ విద్యార్ధుల స్ఫూర్తిదాయక ప్రసంగం’ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో ఇంకా సఫాయి కర్మచారి వ్యవస్థ ఉందని, దానిని నిర్మూలించడానికి చేపట్టిన ఇండియా ఎట్ 80 ఉద్యమానికి విద్యావంతులు, మేధావులు మద్దతు ఇవ్వాలని కోరారు. వైస్‌ఛాన్సలర్ ఘంటా చక్రపాణి ,రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి, విద్యార్ధి సేవల విభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, పల్లవి కాబ్డే, వీసీ ఓఎస్డీ రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు. -
పెళ్లింట విషాదం..
కూతురి వివాహం చేసిన మరుసటి రోజే తండ్రి మృతి శంషాబాద్: సంబరంగా కుమార్తె పెళ్లి చేసిన మరుసటి రోజే ఓ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. మల్కారం గ్రామానికి చెందిన రైతు దండు సురేందర్ (50) పెద్ద కుమార్తె పావనికి ఇబ్రహీంపట్నం గ్రామానికి యువకుడితో వివాహాన్ని బుధవారం నర్కూడ గ్రామంలో ఘనంగా చేశాడు. గురువారం వరుడి ఇంటి వద్ద జరిగే విందు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఉదయమే పొలం పనులు చూసుకోడానికి వెళ్లిన సురేందర్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు. -
వరదలకు అడ్డుకట్ట
టీసీయూఆర్ కోసం భారీ స్టామ్ వాటర్ డ్రైన్ సాక్షి, సిటీబ్యూరో ప్రతి వర్షాకాలంలో ముంచెత్తుతున్న వరద సమస్యలకు శాశ్వత పరిష్కారానికి జీహెచ్ఎంసీ కీలక అడుగు వేసింది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు విస్తరించిన తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్) వరకు సమగ్ర, సమన్వయ స్టామ్ వాటర్ డ్రైన్ మాస్టర్‌ప్లాన్ కోసం ఆర్ఎఫ్పీ టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్ని, 2047 నాటికి రూపాంతరం చెందనున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధమైంది. జీఐఎస్, 2డీ మోడలింగ్‌తో.. ఈ మాస్టర్‌ప్లాన్‌లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్, హైడ్రాలజికల్, హైడ్రోడైనమిక్ 1డీ–2డీ మోడలింగ్ ద్వారా నగరంలోని ప్రధాన, ఉప, చిన్న డ్రైనేజీ వ్యవస్థలను కూడా విశ్లేషించనున్నారు. వరదల తీవ్రత, నీటి ప్రవాహ దిశలు, నీటిమునిగే ప్రాంతాలు, డ్రైనేజీ సామర్థ్యం తదితర అంశాలను కంప్యూటర్ మోడళ్ల ద్వారా అంచనా వేయనున్నారు. ఆక్రమణలపై దృష్టి నగరంలోని చెరువులు, నాలాలు, వాగులు, రోడ్ల పక్కన ఉన్న డ్రైన్లు, కల్వర్టులు, బ్రిడ్జిల పరిస్థితిని పూర్తిస్థాయిలో సర్వే చేయనున్నారు. నాలాలపై ఆక్రమణలు, పేరుకుపోతున్న చెత్త, మురుగునీరు కలుస్తుండటం, కాలుష్యం వంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. చెరువుల సరిహద్దులు, ఫుల్ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్), నీటి నిల్వ సామర్థ్యం, బండ్ల స్థితి, సిల్టింగ్ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. రియల్‌టైమ్ మానిటరింగ్ నగరంలో వరద ముప్పు ప్రాంతాల్లో రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. నీటి మట్టం, వర్షపాతం, నీటి ప్రవాహాలను గుర్తించే ఐఓటీ సెన్సర్లు, డాప్లర్ రాడార్ వ్యవస్థలు, జీఐఎస్ డ్యాష్‌బోర్డులు, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను రూపొందించనున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లతో అనుసంధానం చేసి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఈ వ్యవస్థ పని చేయనుంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతతో, రియల్‌టైమ్ మానిటరింగ్ వ్యవస్థతో, మూడు కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని తాజాగా టెండర్లు పిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. వరద నీటి ప్రవాహ దారిభూగర్భ మౌలిక వసతి రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా మాస్టర్ ప్లాన్ రియల్ టైమ్ పర్యవేక్షణతో వరద హెచ్చరికలు టెండర్లు పిలిచిన జీహెచ్ఎంసీ నిర్వహణ వ్యవస్థకు ప్రత్యేక ప్రణాళిక స్టామ్ వాటర్ డ్రైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనున్నారు. ప్రతి నాలాకు డీసిల్టింగ్ షెడ్యూల్, జీఐఎస్ ఆధారిత మానిటరింగ్, శాఖలవారీ బాధ్యతలు, అత్యవసర స్పందన విధానాలు సిద్ధం చేయనున్నారు. రోబోటిక్, యాంత్రిక పద్ధతుల్లో నాలాల శుభ్రతకు అవసరమైన యంత్ర సామగ్రి వినియోగంపై కూడా అధ్యయనం చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్లు పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో భవిష్యత్ వరద ముప్పును తగ్గించడమే కాకుండా, సమగ్ర పట్టణ ప్రణాళిక, నీటి వనరుల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి సైతం ఉపయోగపడేలా ఈ మాస్టర్‌ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 26. -
మోత మోగిపోద్ది..
● మాడిఫైడ్ సైలెన్సర్లపై పోలీసుల కన్నెర్ర ● ఒక్కరోజే 451 కేసులు, రూ.6 లక్షల ఫైన్సాక్షి, సిటీబ్యూరో: ధ్వని కాలుష్య నియంత్రణే లక్ష్యంగా మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా... వాహనాలకు మార్పులు చేసిన సైలెన్సర్లను అమర్చి, విపరీతమైన శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 451 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. 76 వాహనాల నుంచి అనధికారిక సైలెన్సర్లను అక్కడికక్కడే తొలగించారు. ఉల్లంఘనదారులకు రూ.6.14 లక్షల జరిమానా విధించారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జితేందర్ సింగ్ తెలిపిన మేరకు.. ఉప్పరిగూడకు చెందిన దార శంకర్(53) కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం మల్కాజిగిరి చౌరస్తాలో అపస్మారక స్థితిలో పడివున్న శంకర్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా ప్రాంతానికి వచ్చిన 108 సిబ్బంది అప్పటికే శంకర్ మృతి చెందాడని చెప్పారు. దీంతో పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
క్యూర్ ఐటీ.. ఉమ్మడి కమిటీ
జీహెచ్ఎంసీ విభజన తర్వాత సమన్వయానికి ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఉమ్మడి డిజిటల్ సేవలు, ఐటీ మౌలిక వసతుల నిర్వహణలో సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) పరిధిలో కొనసాగుతున్న సాధారణ ఐటీ సేవల నిర్వహణకు సంయుక్త కమిటీని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ జారీ చేసిన జీఓ నెంబర్ 541 మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ కమిటీకి చైర్మన్. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు సభ్యులుగా, ఆయా సంస్థల ఐటీ విభాగ అదనపు కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. అంతరాయం లేకుండా కార్యకలాపాలు మూడు కార్పొరేషన్లకు ఉమ్మడిగా పనిచేస్తున్న అన్ని ఐటీ ప్రాజెక్టులు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, సాఫ్ట్వేర్ ఒప్పందాలు, క్లౌడ్, హోస్టింగ్ సేవలు, యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్టులు తదితరమైనవాటిని అంతరాయం లేకుండా కొనసాగించనున్నారు. సాధారణంగా వీటి నిర్వహణ వ్యయాన్ని మూడు కార్పొరేషన్లు సమానంగా భరించాల్సి ఉండగా, అవసరాన్ని బట్టి వినియోగం ఆధారంగా వ్యయ పంపిణీపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిటీకి ఇచ్చారు. అమలులో ఉన్న ప్రాజెక్టుల్లో మార్పులు, సాంకేతిక నవీకరణలు, ఆర్థిక సవరణలు, డేటా మైగ్రేషన్ వంటివన్నీ సంయుక్త కమిటీ ఆమోదంతోనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ పరిశీలించాకే.. భవిష్యత్తులో చేపట్టే కొత్త ఐటీ ప్రాజెక్టులు, ప్రాంతీయ స్థాయి ఈ–గవర్నెన్స్ వ్యవస్థలు, ఉమ్మడి డిజిటల్ మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ముందుగా ఈ కమిటీ పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. సాంకేతిక సాధ్యత, ఆర్థిక సామర్థ్యం, సైబర్ భద్రత, డేటా గవర్నెన్స్, విస్తరణ సామర్థ్యం వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తరువాతే ఆమోదించనున్నారు. ప్రతి కార్పొరేషన్ తమ స్థానిక పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్వేర్లనుగానీ, మాడ్యూళ్లనుగానీ స్వతంత్రంగా అమలు చేసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. అయితే అవి ఉమ్మడి సేవలపై ప్రభావం చూపకూడదని, ప్రాంతీయ డిజిటల్ ఏకరీతిని దెబ్బతీయకూడదని షరతులు విధించింది. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, హెచ్ఆర్ఎంఎస్, జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ, ఇంటర్నెట్ లీజ్డ్ లైన్లు, మొబైల్ సిమ్ సేవలు, ఎస్ఎంఎస్ గేట్వేలు, డిజిటల్ ఽధ్రువీకరణ సేవలు వంటి వివిధ ఐటీ సేవల పర్యవేక్షణ బాధ్యతనూ ఈ కమిటీకి అప్పగించారు. నెలకోసారి సమీక్ష.. కమిటీ ప్రతినెలా కనీసం ఒకసారి సమావేశమై ప్రాజెక్టుల పురోగతి, సైబర్ భద్రత, ఆర్థిక వ్యయాలు, డిజిటల్ సేవల నిర్వహణ, రాబోయే ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనుంది. అవసరాన్ని బట్టి అత్యవసర అంశాలపై అవసరమైతే ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ విభజన అనంతరం డిజిటల్ సేవల్లో అంతరాయం లేకుండా కొనసాగించడం, పౌరసేవలను సమర్థవంతంగా నిర్వహించడం, వ్యయ నియంత్రణ, మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం ఈ కమిటీ అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. చైర్మన్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం -
ఆన్లైన్లో అశ్లీల కంటెంట్..కేసు నమోదు
బంజారాహిల్స్: బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ (సీఎస్ఏఎం) ఆన్లైన్లో ప్రసారం చేసినట్లు ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ వైష్ణవీ ప్రకాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేశారు. అనుమానాస్పద ఇన్‌స్ట్రాగామ్ ఖాతా మొబైల్ నెంబర్‌తో ఈ అశ్లీల కంటెంట్ లింక్ అయ్యి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖాతా యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌కు చెందిన ఓ మహిళదిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడికి ఐసీయూలో చికిత్స మన్సూరాబాద్: వీధి కుక్కల దాడిలో గాయపడి ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు అద్వీక్కు ఐసీయూ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నామని కామినేని వైద్యులు తెలిపారు. బాగా లోతైన కుక్క గాట్లు ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకకుండా మందులు ఇస్తున్నామని, ఎప్పటికప్పుడు ఇన్ఫెక్షన్ను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. బాలుడు స్పృహలోనే ఉన్నాడని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నామని, మరో 24 గంటలు గడిస్తే పరిస్థితి తెలుస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. వ్యక్తి ఆత్మహత్య ఉప్పల్: ఆన్లైన్ ట్రేడింగ్‌తో నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యచేసుకున్నాడు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు..రామంతాపూర్ నవరంగ్ గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబిబూద్ధీన్ (36) క్రిప్టో కరెన్సీ అన్లైన్లో ట్రేడింగ్ చేస్తూ నష్టపోయాడు. దీంతో అప్పుల భారం పెరిగి మనస్థాపంతో మంగళవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గుర్తుతెలియని విషంతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
చదువుతో క్రీడల సమన్వయం అవసరం
● మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి బంజారాహిల్స్: విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలను చదువుతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర భద్రతా సలహాదారు, మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘స్పోర్ట్స్ అండ్ వెల్ బీయింగ్ డే’ కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయ వైస్ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపయోగపడే వినూత్న అకడమిక్ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఎండ వేడిమికి పేలిన బ్యాటరీలు
టాటా షోరూంలో అగ్నిప్రమాదం కుషాయిగూడ: కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో నిర్వహిస్తున్న టాటా షోరూంలో డెంటింగ్, పెయింటింగ్ చేసే యూనిట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎండల తీవ్రతకు బ్యాటరీలు పేలి మంటలంటుకున్నాయి. అప్రమత్తమైన షోరూం సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చి షోరూంలో ఉన్న కార్లను బయటకు తీశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా టాటా షోరూం పక్కనే ఉన్న సప్తగిరి హైట్స్ అపార్ట్మెంటు వైపుగా మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన అపార్టుమెంట్‌వాసులు బయటకు పరుగులు తీశారు. సుమారు 20 లక్షల వరకు ఆస్థినష్టం జరిగి ఉంటుందని బాధితులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రదాన కారణం.. అక్రమంగా నిర్మించిన షెడ్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న షోరూంపై చర్యలు తీసుకోకుండా తాత్సారం చేసిన అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణమని 2022లో నోటీసులు జారీ చేసి కూల్చివేతలకు సిద్ధమైన అధికారులు కూల్చివేయకుండా వదిలివేయడంతోనే ఈ రోజు ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా టాటా షోరూం నిర్వాహకులపై స్థానికులు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగవంతం చేయాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రారంభమైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి కోరారు. బుధవారం మీడియా అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టు హౌసింగ్ సోసైటీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ... దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 21న జరిగే క్యాబినెట్ సమావేశం నాటికి హైదరాబాద్‌లో ఉన్న అన్ని సొసైటీల పూర్తి వివరాలను జర్నలిస్టుల సంఖ్యతో కూడిన నివేదికను తయారు చేయాలన్నారు. ఇందుకు అన్ని సోసైటీలు సమష్టిగా సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులను మాత్రమే జాబితాలో చేర్చాలని ఆయన ప్రతినిధులను కోరారు. నూతన డీజీపీలకు సత్కారం సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పోలీసు శాఖలో పదోన్నతులు పొందిన ఉన్నతాధికారులను ఇంటర్నేషనల్ ఛాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ (ఐసీపీఆర్) జాతీయ అధ్యక్షుడు డా. అజయ్ కుమార్ అగర్వాల్ మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. స్వచ్ఛ అధికార్ ఇండియా, టేస్ట్ బడ్డర్స్ డైరెక్టర్ కేతన్ అగర్వాల్‌తో కలిసి ఆయన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, ఆక్టోపస్ డీజీ అనిల్ కుమార్‌ను కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డా. అజయ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత, ఆధునిక పోలీసింగ్ వ్యవస్థ బలోపేతానికి అధికారులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. విజయనగర్‌కాలనీ: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో 2,570 మంది విద్యార్థులకు గాను 2,266 మంది విద్యార్థులు హాజరైనట్లు పరీక్షా కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. -
భరత్‌నగర్ ఆర్వోబీ ఆధునికీకరణ
కొత్త సాంకేతికతతో త్వరలో పనులు కన్సల్టెన్సీలను ఆహ్వానించిన సీఎంసీ సాక్షి, సిటీబ్యూరో: మూసాపేట సర్కిల్లోని భరత్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) ఆధునికీకరణకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) సిద్ధమైంది. పనులు చేయడానికి ముందు కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లు ఆహ్వానించింది. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పునరుద్ధరణ పనులు చేసిన అనుభవం ఉన్న సంస్థలు టెండర్లలో పాల్గొనాల్సిందిగా పేర్కొంది. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు దాఖలు చేయాల్సి ఉంది. టెక్నికల్‌గా అర్హత పొందిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్లు పరిశీలిస్తారు. టెండర్లలో పాల్గొనే ఏజెన్సీ సొంతంగానే పనులు చేయాలి. ఒక ఏజెన్సీ ఒక టెండరు మాత్రమే వేయాలి. పనులు వేగంగా, సమర్థంగా, తక్కువ వ్యయంతో చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ సాంకేతిక విధానాలను ఎంచుకోవచ్చు. బిడ్లు దాఖలుకు ముందు ఏజెన్సీలు ఆర్వోబీని, పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, గర్డర్లు, డయాఫ్రమ్స్, బేరింగ్ రీజియన్స్, పియర్స్ తదితరాల స్థితిగతులు తెలుసుకోవాలని సూచించారు. ఆర్వోబీ డేటా, నివేదికల అధ్యయనానికి సమాచారాన్ని కార్పొరేషన్ అందజేస్తుంది. వాటిని విశ్లేషించడంతో పాటు కావాల్సిన ఇతర వివరాలు సేకరించాల్సిన బాధ్య త ఏజెన్సీదే. కన్సల్టెన్సీ సర్వీసులకు ఎంపికయ్యే సంస్థ మూడు నెలల్లోగా నివేదిక అందజేయాలి. -
ట్రాక్టర్ డ్రైవర్ దారుణ హత్య
ఘట్కేసర్: ఎదులాబాద్ డివిజన్ అంకుషాపూర్‌కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గ్రామానికి చెందిన అన్వర్ (50) పట్టణంలోని ఓ సెకండ్ హ్యాండ్ సేల్ షోరూంలో ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తుంటాడు. షోరూం యజమానులు నిర్మల్ జిల్లా బాన్సువాడలో సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేయగా తీసుకురావడానికి మంగళవారం వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి రావకపోవడం, ఫోన్ స్విచాప్ రావడంతో అన్వర్ భార్య షోరూం యజమానికి తెలిపింది. అప్రమత్తమైన యజమాని తూప్రాన్ సమీనంలోని టోల్ ప్లాజా వద్ద సీసీ పుటేజీలు పరిశీలించగా ట్రాక్టర్ టోల్ దాటలేదని గ్రహించారు. కాగా అన్వర్ ట్రాక్టర్‌ను తీసుకొని ఘట్కేసర్కు వస్తుండగా మెదక్ జిల్లా శభాష్‌పల్లి శివారు పోతారం రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ట్రాక్టర్‌తో పరారయ్యారు. దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో బుధవారం విషయం వెలుగులోకి వచ్చింది. ట్రాక్టర్ లభించకపోవడంతో ఆర్థిక కోణం, వివాహేతర సంబంధం అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా పోతారం రోడ్డుపై దారుణం ట్రాక్టర్ అపహరించిన దుండగులు వివాహేతర సంబంధమే కారణం! -
ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మాదాపూర్: మానసిక ఒత్తిడికి తట్టుకోలేక ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన మేరకు.. పర్వత్‌నగర్ ఎక్స్‌రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో సూర్యాపేటకు చెందిన పూజరెడ్డి (16) ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే సెకెండ్ ఇయర్ తరగతులు ప్రారంభమయ్యాయి. పరీక్షల మానసిక ఒత్తిడితో తన రూమ్‌లో మంగళవారం రాత్రి హాస్టల్లో ఎవరూలేని సమయంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి గోపిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డు.. నెత్తురోడి
మూడు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత● మల్లాపూర్‌లో ఇద్దరు, మియాపూర్, గచ్చిబౌలిలో ఒకరు దుర్మరణంపనులు వెళ్తూ మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు, బంధువుల పెళ్లికని బయలుదేరి మరొకరు మృత్యువాత పడ్డారు. మల్లాపూర్ పారిశ్రామికవాడలో ఇద్దరు, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద, గచ్చిబౌలి ఓఆర్ఆర్ పక్కన ఒకరు చొప్పున దుర్మరణం పాలయ్యారు. జడుపుల గణేష్, దండగల్ల గంగాధర్ (ఫైల్) మల్లాపూర్/మియాపూర్/గచ్చిబౌలి: మీర్పేట్ భక్షిగూడకు చెందిన దండగల్ల గంగాధర్(42), మౌలాలి ఆర్టీసీ కాలనీకి చెందిన జడుపుల గణేష్(49) మల్లాపూర్ పారిశ్రామికవాడలో బండరాళ్లు కొట్టుకుని జీవిస్తున్నారు. మంగళవారం రాత్రి బండరాళ్ల వద్దకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టి కొద్దిదూరం ఈడ్చుకు వెళ్లింది. ఇద్దరూ రోడ్డుపై పడటంతో తలలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వచ్చి ఈసీఐఎల్‌లోని ఓ ప్రయివేట్ ఆసుప్రతికి తరలించగా అప్పటికే మృతిచెందారని వైద్యులు చెప్పారు. కారుడ్రైవర్ పరారీలో ఉన్నాడు. తమకు న్యాయం చేయాలని నాచారం పోలీస్‌స్టేషన్ ఎదుట మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. నాచారం ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌ను ఈడ్చుకెళ్లిన కారుఆగిన డీసీఎంను ఢీ కొట్టి.. అసోంకు చెందిన అమ్దాదుల్లా(23) రెండేళ్లుగా గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో నివాసముంటూ హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నాడు. బుధవారం ఉదయం బైక్‌పై గచ్చిబౌలి నుంచి నానక్‌రాంగూడ రోటరీలో పనికి వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్డు ఎడమ పక్కన డీసీఎం వ్యాన్‌ను ఢీ కొట్టి కింద పడిపోయాడు. కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. తలకు హెల్మెట్ ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే 108లో సమీపంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మూత్ర విసర్జన కోసమని నో పార్కింగ్ వద్ద డీసీఎం వ్యాన్ ఆపిన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. రోడ్డు దాటుతుండగా.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా మన్నెళ్లికి చెందిన అథియా(35), మహ్మద్ యూనస్ దంపతులకు ముగ్గురు కుమారులు. యూనస్ దినసరి కూలీ. మియాపూర్ హాఫీజ్పేట్లో ఈ నెల 15న జరిగే బంధువుల పెళ్లి వేడుకకు బుధవారం స్వగ్రామం నుంచి అథియా, ఆమె తండ్రి హైదర్షా, తల్లి రషీద, చిన్న కుమారుడు అయాన్‌తో కలిసి ఆర్టీసీ బస్సులో నగరానికి వచ్చి మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద దిగారు. హఫీజ్‌పేట్ వెళ్లేందుకు రహదారి దాటుతుండగా చందానగర్ నుంచి మియాపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న శ్రీ లక్ష్మీ నర్సింహ్మ బోర్‌వెల్స్ లారీ ఢీ కొట్టడంతో అథియా అక్కడికక్కడే మృతి చెందింది. రషీదకు స్వల్ప గాయాలయ్యాయి. -
మళ్లీ ఊపిరి.. మళ్లీ మాట..
కేర్ ఆస్పత్రిలో అరుదైన శ్వాసనాళ చికిత్స రాయదుర్గం: హైటెక్‌సిటీ కేర్ ఆస్పత్రి వైద్య బృందం ఓ వృద్ధుడికి అరుదైన శ్వాసనాళ చికిత్స చేసింది.కేర్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ డాక్టర్ సతీష్ సి రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ డాక్టర్ ఎం అబ్దుల్ ఆమ్జద్ఖాన్ తెలిపిన మేరకు.. నగరానికి చెందిన ఓ వృద్ధుడు (60) గతంలో ప్రమాదంలో గాయపడి వెన్నముకకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. శ్వాస సౌకర్యం కోసం ట్రాకియోస్టమీ చేశారు. అయితే ఇటీవల శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో కేర్ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన బ్రోంకోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సాంకేతికతలతో శస్త్ర చికిత్స అవసరం లేకుండా శ్వాసనాళాన్ని పునరుద్దరించి మళ్లీ మాట వచ్చేలా చేయగలిగామన్నారు. నీట్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి సుల్తాన్‌బజార్: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐచే విచారణ జరిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కిషన్, డాక్టర్ బి.అశోక్‌లు బుధవారం డిమాండ్ చేశారు.22 లక్షల మంది భావి వైద్య అభ్యర్థులకు ఘోర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. 2024 నాటి నీట్ పేపర్ లీక్ పరాభవం మళ్లీ పునరావృతం కావడం ఆందోళన కరణమన్నారు. సుమారు 140 ప్రశ్నలతో కూడిన చేతితో రాసిన గెస్ పేపర్ 720 మార్కులలో 600 మార్కులకు సమానమైన అసలు ప్రశ్నలతో సరిపోలిందన్నారు. పరీక్షకు కొన్ని రోజుల ముందే ఈ పేపర్ చలామణి అయ్యిందన్నారు. లీకై న మెటీరియల్ ఉపయోగించిన అభ్యర్థులను శాశ్వతంగా నిషేధించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్: లక్నోలో జరుగుతున్న రెండో ఆలిండియా బ్యాడ్మింటన్–టేబుల్ టెణ్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ పోలీసులు రజత పతకం కై వసం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, హుజురాబాద్ ఏసీపీ మాధవి మిక్స్‌డబుల్స్ కేటగిరిలో రజత పతకం అందుకున్నారు. లక్నోలో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం వీరు తమ సత్తా చాటి రెండో స్థానంలో నిలిచారు. గోల్డ్ మెడల్ ఇంటిలిజెన్స్ బ్యూరో జట్టుకు రాగా, సిల్వర్ మెడల్ కట్టా హరిప్రసాద్, మాధవి గెలుచుకున్నారు. కాంస్య పతకం ఐజీ రవికృష్ణ, ఎస్పీ స్వరూపరాణిలు సాధించారు. -
డీజిల్ చోరీ చేస్తున్న ఇద్దరు అరెస్ట్
కందుకూరు: పార్క్ చేసిన వాహనాల నుంచి రాత్రి వేళ డీజిల్ చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన మేరకు.. మండల పరిధిలోని దిల్వార్గూడ (జండాగూడ)లో రాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు పార్క్ చేసిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలిస్తున్నారు. ఓ ఆర్టీసీ బస్సు నుంచి 110 లీటర్లు, డీసీఎం నుంచి 30 లీటర్లు, టిప్పర్ నుంచి 300 లీటర్లు ఇలా రెండు రోజుల వ్యవధిలో 440 లీటర్లు దోచినట్లు వాహనాల యజమానులు, డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి కారులో రాత్రి సమయంలో ఇద్దరు వచ్చి డీజిల్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. పుటేజీ ఆధారంగా నిందితులు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ సభావత్ రమేశ్(30), మియాపూర్‌లో ఉండే నడిగడ్డతండాకు చెందిన ఆటో డ్రైవర్ ముడావత్ గణేశ్(18)గా గుర్తించారు. వీరిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకొన్నారు. దీంతో వారి వద్ద 330 లీటర్ల డీజిల్‌తో పాటు స్విఫ్ట్ కారు, డీజిల్ అమ్మగా వచ్చిన సొమ్ము రూ.19,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజధానిలో పనిమనుషుల గురించి పోలీసుల ఆరా
సాక్షి, సిటీబ్యూరో నగరంలో నేపాలీ పనిమనుషులు ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంతమంది ఉన్నారు.. ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. మొన్న ప్రశాసన్‌నగర్‌లోని మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే ఇంట్లో... తాజాగా జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఉండే రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో నేపాలీలు పంజా విసిరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లలో సర్వేంట్స్ వెరిఫికేషన్‌ను బుధవారం నుంచి మొదలుపెట్టారు. సరైన రికార్డుల ఉండట్లేదు... రాజధానిలోని ఎగువ మధ్య తరగతి, ఉన్నత కుటుంబాల ఇళ్లకు ఇదివరకు సర్వెంట్స్ ఉదయం, సాయంత్రం వచ్చి పనిచేసేవారు. ప్రస్తుతం ఇళ్లల్లోనే 24 గంటలూ అందుబాటులో ఉండే సంస్కృతి వచ్చింది. దీంతో ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాలతోపాటు నేపాల్‌కు చెందినవారూ ఈ పనిలోకి వస్తున్నారు. సర్వెంట్స్, డ్రైవర్స్, కుక్స్.. ఇలా వివిధ పనుల్లోకి వీరిని యజమానులు నేరుగా, లేదా దళారుల ద్వారా నియమించుకుంటున్నారు. ఆయా సమయాల్లో వారి వివరాల సేకరణ, నమోదు లేకపోవడంతో యజమానుల వద్ద ఎలాంటి రికార్డులు ఉండట్లేదు. గుర్తించే సరికే సరిహద్దులు దాటేస్తూ.. ఏదైనా ఘటన జరిగినప్పుడు పోలీసులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. బరితెగించిన పనిమనుషుల వివరాలు సేకరించడానికి ప్రయాస పడాల్సి వస్తోంది. ఘటనాస్థలి నుంచి కొన్ని కిలోమీటర్ల మేర వందల సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి పరిశీలించాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి నేరగాళ్లు సరిహద్దులు దాటి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా కేసులు కొలిక్కిరాకపోవడమో, నిందితులందరూ అరెస్టు కాకపోవడ మో, రికవరీలు లేకపోవడమో జరుగుతోంది. ఫలితంగా బాధితుడు నష్టపోవడంతోపాటు మరికొంద రు నేరగాళ్లు నేరం చేసేలా ప్రేరణ పొందుతున్నారు. వరుస ఉదంతాల నేపథ్యంలో డీజీపీ ఆనంద్ ఆదేశాలు ఠాణాలవారీగా వివరాలు సేకరిస్తున్న క్షేత్రస్థాయి అధికారులు నాలుగు కమిషనరేట్లలోనూ ప్రారంభమైన ప్రక్రియ 2 రకాలుగా నమోదు.. -
సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికుల సంక్షేమానికి తెలంగాణ మాజీ సైనిక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్.బాబు కోరారు. అలాగే ముఖ్యమంత్రి చైర్మెన్‌గా రాజ్య సైనిక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదనలపై సీఎం సానుకూలంగా స్పందించారు. విధి విధానాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో మాజీ సైనిక కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయో, వాటి విధానాలు, నమూనాలను సేకరించి త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు గవర్నర్ చైర్మన్‌గా ఉన్న స్టేట్ మేనేజింగ్ కమిటీ ఏర్పాటుకు సైతం త్వరలోనే ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.మాజీ సైనికుల సమస్యలపై పూర్తి వివరాలతో నివేదికను అందజేయాలని చెప్పారు.ఆ నివేదికలోని పరిశీలించి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి,తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యంతో పాటు నిబద్ధతతో ప్రజాసేవ
● డీఐజీ రమణారెడ్డి వెంగళరావునగర్ : విధి నిర్వహణలో క్రమశిక్షణ, నైపుణ్యంతో పాటు నిబద్ధతతో ప్రజాసేవ చేయాలని డీఐజీ వి.రమణారెడ్డి తెలియజేశారు. యూసుఫ్‌గూడలోని ఫస్ట్ బెటాలియన్‌లో నాలుగు వారాల పాటు నాసిన్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్, నార్కోటిక్స్) హవల్దార్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ ముగింపు సందర్భంగా బుధవారం హవల్దార్లకు ప్రత్యేక అభినందన సమావేశాన్ని బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమణారెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే సిబ్బంది అధికారులు నిరంతరం నిజాయితీ కలిగి ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి తలొగ్గ వద్దని సూచించారు. ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా సిబ్బందిలో ఆత్మ విశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విధి నిర్వహణలో మెరుగైన సామర్థ్యం పెరుగుతుందని తెలియజేశారు. నాసిన్ జోనల్ డైరెక్టర్ టి.అనంత్ శిక్షణ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ సీహెచ్ సాంబశివరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి సర్టిఫికెట్లు, ప్రత్యేక ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమ ఆల్‌రౌండర్ ప్రదర్శన ఇచ్చన మౌనిక అనే హవల్దార్‌కు సర్టిఫికెట్తో పాటుగా షీల్డ్‌ను అందజేసి అభినందించారు. తొలుత టీఎస్ఎస్పీ ఫస్ట్ బెటాలియన్ సిబ్బంది శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు సైనిక వందనం చేశారు. -
4 కోట్లు వసూలు చేసి రూ. కోటి ఇవ్వండి
బంజారాహిల్స్: మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. సుమారు నాలుగుకోట్ల రూపాయలు వసూలు చేసి, రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోవాలని నిందితులకు యువతి ఆఫర్ చేసింది. అయితే చివరికి ఆ ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు ఈ కేసును ఛేదించి యువతితోపాటు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంకు చెందిన పాయం మౌనిక(25) హైదరాబాద్‌లో నర్సు గా పనిచేస్తోంది. ఆమెకు హయత్‌నగర్‌కు చెందిన మోకురాల నిఖిల్(26)తో ఓ పబ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 9 నెలల సహజీవనం అనంతరం తనను మోసం చేశాడంటూ నిఖిల్‌పై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. నిఖిల్‌పై కేసు నమోదు కాగా, బెయిల్‌పై విడుదలయ్యాడు. నిఖిల్ వద్ద రూ.9 కోట్లు ఉన్నాయని, అందులో సగం వసూలు చేసి రూ.కోటి తనకు ఇచ్చి మిగతా మొత్తాన్ని పంచుకోండని పరిచయస్తులైన రౌడీషీటర్లకు ఆమె ఆశ చూపింది. నిఖిల్‌తోపాటు అతడి స్నేహితులు మహేశ్, సాయిశ్రీకాంత్లను కిడ్నాప్ చేయించి రూ.రూ.13.60 లక్షలు వసూలు చేసింది. సాయిశ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనికతోపాటు అంబర్‌పేట రౌడీషీటర్ అన్వర్‌ఖాన్(60), కాప్రాకు చెందిన సుంకరి ప్రసాద్‌రెడ్డి(56), జవహర్‌నగర్‌కు చెందిన మారెనేని రాజు(48), ఖమ్మంకు చెందిన కనకం సుధీర్, పోల్కంపల్లి నాగరాజు, అల్వాల్‌కు చెందిన జాన్‌లను పట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన కనకం మహేశ్, బంజారాహిల్స్ ఎన్బీటీనగర్కు చెందిన చందు పరారీలో ఉన్నారు. ● మాజీ ప్రియుడి కిడ్నాప్ కేసులో నిందితులకు యువతి ఆఫర్ ● ప్రధాన నిందితురాలు సహా ఏడుగురి అరెస్టు.. పరారీలో ఇద్దరు -
బంధువే దొంగ
24 గంటల్లో చోరీ కేసును ఛే దించిన పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో పక్కదారి అబిడ్స్: గోషామహాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాహినాయత్‌గంజ్ ముల్తానిపురాలో చోరీ కేసులో బంధువే దొంగ అని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనను 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి దొంగను అరెస్టు చేశారు. దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని, ఇతర సామగ్రిని, నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌లో గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముల్తానిపురాలోని 3వ అంతస్తులో నివాసం ఉంటున్న మహేష్ తన కుటుంబసభ్యులతో కలిసి ఐదురోజులుగా ఇంటికి తాళాలు వేసి బంధువుల పెండ్లి సన్నాహాలకు వెళ్తున్న విషయాన్ని మేనల్లుడు దొంతుల రాజేష్ కనిపెట్టాడు. రాజేశ్ కొంతకాలంగా కిరాణాషాప్ నిర్వహిస్తూ, ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటై నష్టాలకు గురయ్యాడు. ముల్తానిపురాలోనే మహేష్ ఇంటి సమీపంలో నివసిస్తున్న రాజేష్ ఆదివారం రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్‌తో తాళాలు తీసి లోపలికి వెళ్లిన మహేష్ బీరువాలోని దాదాపు 30 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, కిలోన్నరకుపైగా వెండి సామగ్రి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రిని దొంగిలించి దర్జాగా ఇంటికి వెళ్లాడు. దొంగిలించిన సొత్తును ఒక సంచిలో పెట్టి లోపలి గదిలో దాచిపెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా రోజుమాదిరిగా ఆటో నడపడానికి వెళ్లాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేష్‌కు తెలిసినవారు, బంధువులే దొంగతనం చేసి ఉండవచ్చని అనుమానించి సమీపంలోని రాజేష్ ఇంటికి వెళ్లారు. అప్పుడే ఇంటికి వచ్చిన అతడిని పోలీసులు ప్రశ్నించగా తడబడ్డాడు. పోలీసులు గట్టిగా నిలదీయడంతో దొంగతనం చేసినట్లు రాజేష్ ఒప్పుకున్నాడు. ఇంట్లో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు, వెండి, నగదును పోలీసులకు అప్పగించాడు. రాజేష్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. గోషామహాల్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్, ఎస్ఐ అజిత్ దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాన్ని ఛేదించిన పోలీసులకు, ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్‌లకు డీసీపీ రివార్డ్స్ అందజేసి ప్రశంసించారు. -
సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేయండి
● నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌పై మంత్రి సీరియస్ ● జూన్ నాటికి జవహర్‌నగర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లుఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశంలో అధికారులకు పొంగులేటి ఆదేశంసాక్షి, సిటీబ్యూరో: అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583లో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ భూముల్లో సుమారు 40 ఏళ్లుగా నివసిస్తున్న వడ్డెర కులస్తులకు నోటీసులు జారీ చేస్తున్నారని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి స్పందించారు. ఇటీవల జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి అధ్యక్షతన వహించి మాట్లాడారు. జవహర్‌నగర్‌లో 6,399 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి అల్వాల్, మల్కాజ్గిరి ప్రాంతాల పేదలకు లాటరీ విధానంలో కేటాయించాలని అధికారులకు సూచించారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించే అవకాశం ఉండగా కేవలం 1,622 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, ఆరికపూడి గాంధీ, వి.పి.గౌతమ్, కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. -
కంపోస్ట్ తయారీపై అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కింద 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ, ఎంఎంసీల్లో రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు కంపోస్ట్ తయారీపై అవగాహన సదస్సులు నిర్వహించారు. గృహస్థాయిలో కంపోస్టింగ్‌ను ప్రోత్సహించడం తద్వారా పర్యావరణ పరిస్థితులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ము ఖ్యోద్దేశమని సంబంధిత యూబీడీ విభాగం అధికారులు పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల విభజన, కంపోస్ట్ బిన్ల వాడకం, నిర్వహణ పద్ధతులు, కంపోస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు హాజరైన వారి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. తమ కాలనీలోకంపోస్టింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. విజయనగర్ కాలనీ: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మాసబ్‌ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చంద్రశేఖర్ తెలిపారు. మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 11 నుంచి 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. ● బండి భగరీథ్ను అరెస్టు చేయాలి ● బీఆర్ఎస్ మహిళా నేతల డిమాండ్ వెంగళరావునగర్: ఎప్పుడూ న్యాయం, ధర్మం అంటూ మాట్లాడే కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఒక ఆడపిల్ల విషయంలో ఎందుకు కొడుక్కి వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ మహిళా సంఘం నేతలు ప్రశ్నించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంజయ్ కుమారుడు భగీరథపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంగళవారం బీఆర్ఎస్కు చెందిన మాజీ జడ్పీ చైర్మన్లు తుల ఉమ, చారులత, జూబ్లీహిల్స్ ఇన్చార్జి మాగంటి సునీత, తదితరులు డిమాండ్ చేశారు. మంగళవారం మధురానగర్‌లోని తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భగీఽరథ్పై పోక్సో కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకుని బాధిత బాలికకు న్యాయం చేయాలని, చట్టం ముందు అందరూ సమానులనే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 16 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ రెగ్యులర్ కోర్సుల 4, 6 సెమిస్టర్ పరీక్షలతోపాటు 1 నుంచి 6 వరకు బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు. -
సంపులో పడి బాలిక మృతి
అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యుల ఆందోళనమియాపూర్: అపార్ట్మెంట్ నీటి సంపులో పడి ఓ బాలిక మృతి చెందింది. అయితే కుటుంబసభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మియాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం మద్దిరాళ్ల తండాకు చెందిన గుగులోత్ చరణ్, రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వలస వచ్చి మియాపూర్‌లోని గోకుల్ ఫ్లాట్స్‌లో చరణ్ కొంతకాలంగా వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిది రోజుల క్రితం శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో వాచ్‌మేన్‌గా చేరాడు. అతడి రెండో కూతురు సారా(13) స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో బోర్ మోటార్ ఆన్ చేయాలని సారాకు చెప్పి చరణ్ బయటకు వెళ్లాడు. 8 గంటలకు తిరిగి వచ్చి చూడగా ఇంట్లో సారా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అనుమానంతో సంపు మూత తీసి చూడగా సారా అందులో పడి ఉంది. వెంటనే బాలికను నిజాంపేట్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సంపును పరిశీలించారు. సంపు నిండిందా అని చూసేందుకు సారా వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన ... సారా మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు, బంధువులు శ్రీ రెసిడెన్సీ అపార్ట్మెంట్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ప్రమాదవశాత్తు బాలిక సంపులో పడిపోతే గాయాలయ్యే అవకాశం ఉందని, కానీ బాలిక శరీరంపై అలాంటివేవీ లేవని పేర్కొన్నారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు ఉన్నా ఫుటేజీని తమకు చూపడంలేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రజారోగ్య పరిరక్షణలో నర్సులే కీలకం
● అంతర్జాతీయ నర్సుల దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాంపల్లి: ప్రజారోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర కీలకమని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నవజాత శిశు సంరక్షణా కేంద్రం నిలోఫర్ ఆసుపత్రిలో మంగళవారం జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రోగులకు వైద్యసేవలతోపాటు మనోధైర్యాన్ని ఇస్తూ మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారని కొనియాడారు. 1,500 మంది అవుట్ పేషంట్స్, 2 వేల మంది ఇన్ పేషంట్స్ ఉన్న ఆసుపత్రిలోని వైద్యులు, నర్సులపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ ఎక్కడా అలసిపోకుండా సేవలు అందించడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం పలువురు నర్సులను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, డీఎంహెచ్ఓ వెంకట్, నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్‌కుమార్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ కె.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సార్.. థ్యాంక్స్
● రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ అభ్యర్థుల క్షీరాభిషేకం లక్డికాపూల్: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థులు 1,175 మందిని ఉపాధ్యాయులుగా నియమించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌కు 2008 డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేశారు. 17 ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమకు సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞత లు తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికల పోస్టింగ్ మార్చాలని సీఎం ప్రజావాణి ఇన్చార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సీఎం ప్రజావాణికి 393 దరఖాస్తులు లక్డీకాపూల్: మహా త్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 221వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 393 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 190, రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇందిరమ్మ ఇండ్ల కోసం 97, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు సంబంధించి 65 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహామండలి చైర్మన్ బీఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
ఎన్టీఏను రద్దు చేయాలని ఆందోళన
● విద్యానగర్ సర్కిల్లో బైఠాయించిన విద్యార్థి జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దు చేయాలని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. సంతలో సరుకులాగా ప్రశ్నపత్రాలను విక్రయించడం వల్ల దిక్కుతోచనిస్థితిలో 28 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యానగర్ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ప్రధానమంత్రి మోదీ వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైద్యవిద్య పరీక్షలను ఆయా రాష్ట్రాలకే అప్పగించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నందగోపాల్, సాయి, సతీష్, ప్రవీణ్, రాజశంకర్, హరిశంకర్, వినయ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్లకు సింహస్వప్నమే
మల్కాజిగిరిలో సైబర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ● విధివిధానాలపై కసరత్తు ● సమగ్ర సమాచార సేకరణ, కార్యకలాపాల నిర్వహణ కదలికలపై నిరంతర నిఘా సైబర్ నేరాలు, మోసాలు చేసి తప్పించుకోలేమన్న భయం కలిగిచడమే లక్ష్యంగా సీసీఐయూ కార్యకలాపాలు సాగిస్తుందని ఓ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి చెప్పారు. సైబర్ నేరస్తుల కదలికలు, నెట్‌వర్క్‌పై నిఘా పెట్టడం, ఆన్లైన్లో సైబర్ నేరస్తుల మూలాలను ట్రాక్ చేయడం, ఆర్థిక లావాదేవీలను ఛేదించడం, ఇతర అంతర్గత భద్రతా అంశాలపై కన్నేసి ఉంచుతారు. క్షేత్ర స్థాయిలో అజ్ఞాత వ్యక్తుల నెట్‌వర్క్‌లను ఛేదిస్తారు. కేసుల నమోదు నుంచి విచారణ, దర్యాప్తు విశ్లేషణ, అభియోగ పత్రాల దాఖలు వరకూ ప్రతి అంశంలోనూ సమర్థంగా ఉంటుంది. సమగ్ర సమాచారం సేకరణ, లోతైన విశ్లేషణ ఉంటుంది. బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలు, టెలికం, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఒకచోట చేర్చి, ఆర్థిక మోసాలపై తక్షణ చర్యలను సులభతరం చేస్తుంది. అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ డేటా పంచుకోవడానికి, విశ్లేషణలోనూ సీసీఐయూ కీలక పాత్ర పోషిస్తుంది. సాక్షి, సిటీబ్యూరో: సమాజానికి సైబర్ నేరాలు పెను ముప్పుగా మారాయి. రోజుకో కొత్త రకం మోసాలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి భరతం పట్టేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సీసీఐయూ) ఏర్పాటు కానుంది. ఈ మేరకు విధి విధానాలు, మార్గదర్శకాలపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో వామపక్ష, నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఏర్పాటైన స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) తరహాలోనే.. సీసీఐయూ కార్యకలాపాలు సాగించనుంది. -
సీఎం మెప్పు పొందేదెవరో?
వచ్చే నెలతో ముగియనున్న నిమ్స్ డైరెక్టర్ పదవీకాలం ● భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ● ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం సాక్షి, సిటీబ్యూరో: వైద్యరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ పదవికి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. 2023 జూన్‌లో నిమ్స్ డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన నగరి బీరప్ప మూడేళ్ల పదవీకాలం మరో నెలరోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పదవి కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా నిమ్స్‌లోని ముగ్గురు సీనియర్ వైద్యుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో కొన్ని కీలక విభాగాల అధిపతులు కూడా డైరెక్టర్ పోస్టు రేసులో ఉన్నామంటున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు సైతం మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైద్యం, పరిపాలనాపరంగా అనుభవం ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ గౌరవం లభిస్తుంది. నిమ్స్ పాలక మండలి అధ్యక్షుడిగా వ్యవహరించే సీఎం ఆదేశాల మేరకే డైరెక్టర్ నియామకం ఉంటుంది. ఎంపిక విధానం ఎలా? నిమ్స్ డైరెక్టర్ పదవీ కాలం ముగిసే సమయానికి ప్రభుత్వం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో సీనియర్ వైద్య నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు ఉంటారు. డైరెక్టర్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దరఖాస్తుదారులు కనీసం 25 ఏళ్లు వృత్తిపరమైన అనుభవం, పదేళ్లకుపైగా టీచింగ్, రీసెర్చ్ రంగాల్లో పనిచేసి, పరిపాలనా అనుభవం ఉండాలి. దరఖాస్తులను సెర్చ్ కమిటీ పరిశీలించి, ప్రతిభావంతులైనవారిలో మూడు నుంచి ఐదు మంది పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తుంది. అందులో ఒకరిని సీఎం డైరెక్టర్‌గా ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో విడులవుతుంది. ఎంపికై న వ్యక్తి మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. -
నిధులెత్తని మూసీ..
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవం పనులకు ప్రభుత్వం మూడేళ్లలో ప్రతి బడ్జెట్లో రూ.1,500 కోట్ల చొప్పున రూ.4,500 కోట్లు ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు రూ.392 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిగాయి. నగరంలో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీ సుందరీకరణలో ఫేజ్–1 అభివృద్ధి పనులకు రూ.5,812.4 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. 2024–25 రాష్ట్ర బడ్జెట్లో మూసీ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించగా.. కేవలం రూ.11.25 కోట్లు, 2025–26 బడ్జెట్లో రూ.1,500 కోట్లకు.. రూ.6.21 కోట్ల నిధులను మాత్రమే వినియోగించారు. 2026–27 బడ్జెట్లో రూ.1,500 కోట్లను కేటాయించగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.375 కోట్లను విడుదల చేశారు. భూ సేకరణ ముమ్మరం.. ఫేజ్–1లో 21 కి.మీ. మేర మూసీ సుందరీకరణ చేపటనున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ., ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ. ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీంతో ఆయా మార్గాల లో భూ సేకరణ కార్యకలాపాలను ఎంఆర్డీసీఎల్ అధికారులు ముమ్మరం చేశారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, గాంధీ సరోవర్ ప్రాంతాలలో బఫర్ జోన్లలోని పలువురు భూ యజమానులకు, సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ● ఇప్పటికే గండిపేట మండలంలోని హిమాయత్‌సాగర్, కిస్మత్పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట, బుద్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (వాలంతరీ), ఎస్సీ/ఎస్టీ స్టడీ సర్కిల్ వంటి సంస్థలకు గతంలో కేటాయించిన సుమారు 734 ఎకరాల భూములను మూసీ ప్రాజెక్ట్‌కు బదిలీ చేశారు. కాగా.. మూసీ సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) ఇంకా పూర్తి కాలేదు. అందుకే నిధుల కేటాయింపులు, వినియోగం ఆశించిన స్థాయి లో లేదని ఎంఆర్డీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పునరుజ్జీవానికి అరకొర కేటాయింపులు తొలి దశ పనుల అంచనా రూ.5,812 కోట్లు ఇప్పటికి విడుదలైంది రూ.392 కోట్లే -
ప్రాణాలు తీసిన ఓవర్టేక్
● ముందువెళ్తున్న లారీని ఢీకొన్న బైక్ ● ఇద్దరు యువకుల మృత్యువాత సనత్‌నగర్: ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సనత్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కోడూరుకు చెందిన సందీప్ (26) నగరంలోని మహేంద్రహిల్స్‌లో, ఇతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌశిక్ (24) రామంతాపూర్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌లో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు కోసం బైక్‌పై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తున్నారు. కౌశిక్ బైక్ నడుపుతుండగా సందీప్ వెనక కూర్చున్నాడు. భరత్‌నగర్ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ముందు వెళ్తున్న లారీలను అతివేగంగా ఓవర్ టేక్ చేయబోవడంతో ప్రమాదం జరిగింది. లారీని ఢీకొనడంతో బైక్‌తో సహా ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్కౌశిక్ -
అప్పుల జలధిలో..
రాబడి కంటే వ్యయం రెండింతలు సాక్షి, సిటీబ్యూరో జలమండలి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నీళ్ల లోతు కష్టాలతో మునిగిపోయింది. మహా నగరానికి తాగునీటి సరఫరా, మురుగు నీటి సేవలు అందిస్తున్న జలమండలి తీవ్రమైన ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ఖర్చుకు, రాబడికి పొంతన లేకపోవడంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి నెలా రూ.వందల కోట్ల నష్టంతో కాలం వెళ్లదీస్తున్న బోర్డు.. అప్పుల ఊబిలోంచి ఎలా బయట పడుతుందో.. అర్థం కాని పరిస్థితి నెలకొంది. జలమండలికి లభిస్తున్న ఆదాయం , చేస్తున్న ఖర్చుకు మధ్య రెండింతలు వ్యత్యాసం కనిపిస్తోంది. తాగునీటి సరఫరా, సీవరేజీ ఛార్జీలు, వాటర్ ట్యాంకర్ల ద్వారా నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం వస్తుండగా.. నిర్వహణ వ్యయం మాత్రం రూ. 306 కోట్లు దాటుతోంది. అంటే నెలకు రూ.174 కోట్ల లోటు కనిపిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి కేవలం నిర్వహణ రూపంలోనే దాదాపు రూ.2,088 కోట్ల భారీ నష్టాన్ని సంస్థ చవిచూస్తోంది. విద్యుత్ చార్జీల మోత.. నగరాభివద్ధిలో కీలకంగా ఉన్న జలమండలికి విద్యుత్ చార్జీలు పెనుభారంగా మారాయి. కృష్ణా, గోదావరి జలాలను వందల కిలోమీటర్ల దూరం నుంచి పంపింగ్ చేయడానికి నెలకు సుమారు రూ.190 కోట్ల వరకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. సంస్థకు వచ్చే మొత్తం ఆదాయం (రూ. 132 కోట్లు) కంటే, కరెంట్ బిల్లులే రూ. 58 కోట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం విద్యుత్ బకాయిలే కొండలా పేరుకుపోతున్నాయి. వడ్డీలు తడిసి మోపెడు తాగునీటి పథకాలు, సీవరేజీ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న, తీసుకుంటున్న రుణాలు ఇప్పుడు జలమండలి మెడకు ఉరితాళ్లుగా మారాయి. అసలు కంటే వడ్డీలే భారీగా పెరిగిపోతున్నాయి. ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందక.. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ రుణాల చెల్లింపులే సంస్థను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఉచిత సబ్సిడీ అరకొర నగర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రవేశపెట్టిన నెలకు 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా పథకం జలమండలిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాంది. ఇటీవల బడ్జెట్లోఉచిత నీటి పథకం బకాయిలు, నిర్వహణ కోసం బోర్డు రూ. 849.63 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 300 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే అవసరమైన దానిలో 40 శాతం కంటే తక్కువ నిధులు కేటాయించడంతో, మిగిలిన రూ. 550 కోట్ల భారాన్ని సంస్థ తన సొంత వనరుల నుంచే భరించాల్సి వస్తోంది.కేటాయింపుల ఆశలపై నీళ్లు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో జలమండలికి తీవ్ర నిరాశే ఎదురైంది. రుణాల చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న అభివద్ధి పనుల కోసం బోర్డు రూ. 8,533 కోట్లు ప్రతిపాదించగా, ప్రభుత్వం కేవలం రూ. 3,305 కోట్లు మాత్రమే కేటాయించింది. అడిగిన దాంట్లో సగం కూడా ఇవ్వకపోవడంతో ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. నిధుల కొరత వల్ల కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కడం గగనంగా మారింది. రుణాలతోనే అభివృద్ధి పనులు భారంగా 20 కేఎల్ ఉచిత నీటి సరఫరా తలకు మించిన భారంగా విద్యుత్ చార్జీలు నెలకు సగటున రూ.132 కోట్ల ఆదాయం నిర్వహణ వ్యయం రూ. 306 కోట్లు నెలకు రూ.174 కోట్ల లోటు రూ.2,088 కోట్ల భారీ నష్టం నీళ్లలోతు కష్టాల్లో జలమండలి -
బీన్స్ @ రూ.145
సనత్‌నగర్: బీన్స్ ధర ౖపైపెకి ఎగబాకింది. రైతుబజార్లోనే కిలో బీన్స్ రూ.145 ఉండగా, బహిరంగ మార్కెట్లో 180–200 వరకు పలుకుతోంది. వెజ్ బిర్యానీలో ప్రధాన ముడిసరుకుగా ఉపయోగించే బీన్స్ ధర అమాంతం పెరగడంతో అటు హోటళ్ల యజమానులు, ఇటు గృహ నివాసితులు కొనాలంటే ఒకింత ఆలోచనలో పడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా దిగుబడి రాకపోవడంతో వ్యాపారులు బీన్స్ ధరను భారీగా పెంచేశారు. వారం క్రితం రైతుబజార్లో రూ.60–70లుగా ఉన్న బీన్స్ ధర ఒక్కసారిగా రూ.115కు పెరిగింది. సోమవారం నాటికి రూ.145కు చేరింది. పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో బీన్స్ ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఉపాధి కల్పనే లక్ష్యం
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు● సరూర్‌నగర్‌లో మెగా జాబ్‌మేళా ● భారీగా తరలివచ్చిన అభ్యర్థులు ● 779 మందికి నియామక పత్రాలు హుడాకాంప్లెక్స్: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 4,318 మంది నిరుద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 3,716 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వీరిలో 1,645 మందితో జాబితా కుదించి, 779 మందికి ఆయా కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. మంత్రి మాట్లాడుతూ చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు ఫార్మా, ఉత్పత్తి రంగాల్లో అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఈఈటీ నిరుద్యోగులు, పరిశ్రమలకు మధ్య వారధిగా పనిచేస్తుందని చెప్పారు. కంపెనీల్లో ఖాళీల సమాచారాన్ని యువతకు చేరవేసి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరుచోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఆత్మహత్య
మియాపూర్: మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజయ్ మెగా పోలీస్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కృష్ణప్రియ (30), మైత్రీనగర్‌లోని ఫేజ్– 2లో నివాసముంటున్న మాధురి (32) బలవన్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. ● కృష్ణ ప్రియ (35), మైనేని మోనిల్ సింహ దంపతులు నివాసముంటున్నారు. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. కృష్ణప్రియ హైటెక్‌సిటీలో పనిచేస్తుండగా భర్త కొద్ది రోజులు బెంగళూరులో, కొద్దిరోజులు స్థానికంగా పనిచేస్తాడు.వేసవి సెలవులు కావడంతో భర్త, కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవాయం సాయంత్రం కృష్ణ ప్రియ సోదరి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో వాచ్‌మన్‌కు సమాచారం ఇచ్చింది. వాచ్ మెన్ వెళ్లి తలుపు తలుపులు బద్దల కొట్టి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయనుకోని మృత దేహాన్ని గాంధీకి తరలించామని తెలిపారు. ● విజయనగరం జిల్లా, నల్లబెల్లి గ్రామానికి చెందిన హరిపాక బ్రహ్మ, చిన్న అమ్ములు కూతురు మాధురి (35)కి 12 ఏళ్ల క్రితం సత్యనారాయణతో వివాహం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మియాపూర్ మదీనాగూడలోని మైత్రీనగర్‌లోని ఫేజ్– 2లో నివాసముంటున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 6 నెలల క్రితం మాధురి భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటినుంచి కుమారుడితో కలిసి ఉంటోంది. 5 రోజుల క్రితం మాధురి తల్లిదండ్రులు మనుమడిని తీసుకుని ఊరికి వెళ్లారు. సోమవారం ఉదయం నుంచి తండ్రి కాల్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఇంటి పక్కనున్న వ్యక్తికి కాల్ చేసి తమ ఇంట్లో చూడమని చెప్పాడు. అతను వెళ్లి కిటికి నుంచి చూడగా మాధురి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే మియాపూర్ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రధాని మోదీ సూచనలు పాటించాలి: ఎంపీ ఈటల
కంటోన్మెంట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనా ధోరణికి అనుగుణంగా ప్రజలు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పరేడ్ గ్రౌండ్లో బీజేపీ సభ విజయవంతం అయిన నేపథ్యంలో ఆయన సోమవారం కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు భానుక నర్మదతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగిన ప్రధాన మంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారని అన్నారు. ముఖ్యంగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, పెట్రో ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. మేక్ ఇన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా కోసం మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని తమతో కలవాలంటూ మోదీ పిలుపునివ్వడాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని ఈటల అన్నారు. ఈ పిలుపుతో బీజేపీలో నాయకత్వ లేమి ఉందని చెప్పడం సరికాదన్నారు. -
రాజ్యాంగం..దేశానికి కాపలా కాసే సైనికుడు
సుల్తాన్‌బజార్ : భారత రాజ్యాంగం సరిహద్దుల్లో అప్రమత్తంగా దేశానికి కాపలా కాసే సైనికుడిలాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌రెడ్డి సహిత్య పురస్కారాన్ని సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేశారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు డాక్టర్ జి.చిన్నారెడ్డి పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ న్యాయవ్యవస్థ పాత్ర అనే అంశంపై సుదర్శన్‌రెడ్డి ప్రసంగింగాచారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ తప్పక జోక్యం చేసుకోవాలన్నారు. తాను ఓడిపోతానని తెలిసినా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడడానికి కారణం దేశం పట్ల ఉన్న నిబద్ధతేనని సుదర్శన్‌రెడ్డి అన్నారు. -
మహా నిదానం
నత్త నడకన ఎలివేటెడ్ స్టీల్‌బ్రిడ్జి భూసేకరణ● రక్షణ శాఖ భూములు ఓకే.. ప్రైవేట్ వాటిపై నిర్లక్ష్యం ● ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు 18.18 కి.మీ. నిర్మాణం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి భూసేకరణ నత్తనడకన సాగుతోంది. రెండేళ్ల క్రితమే ప్రణాళికలను రూపొందించి నిర్మాణ సంస్థ ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు 18.18 కి.మీ. వరకు నిర్మించనున్న ఈ మార్గంలోని రక్షణశాఖ భూముల సేకరణ తుదిదశకు చేరుకుంది. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములపై జాప్యం నెలకొందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో ఈ మార్గం ఉంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు సాగడం లేదనే చర్చ సాగుతోంది. ఈ మార్గంలో భూసామర్ధ్య పరీక్షలను హెచ్ఎండీఏ ఇప్పటికే పూర్తి చేసింది. సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్, మేడ్చల్ మార్గాల్లో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించారు. మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. శామీర్‌పేట్ స్టీల్బ్రిడ్జికే గ్రహణం పట్టుకుంది. కొరవడిన సమన్వయం... వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఈ ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి కారిడార్ నిర్మించనున్నారు. ప్యారడైజ్ నుంచి వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా వరకున్న మార్గం హైదరాబాద్ కలెక్టరేట్ పరిధిలో ఉంది. తిరుమలగిరి నుంచి శామీర్‌పేట్ వరకున్న మార్గం మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో ఉంది. రెండు జిల్లాల అధికారులు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు రెండు జిల్లాల్లో ముగ్గురు కలెక్టర్ల చొప్పున బదిలీ అయ్యారు. రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే భూసేకరణలో జాప్యం నెలకొనడం గమనార్హం. ఈ ప్రాజెక్టు కోసం 9.35 కి.మీ. మార్గంలో 114.50 ఎకరాల రక్షణ శాఖ భూముల సేకరణ తుదిదశకు చేరుకుంది. కానీ, మరో 8.35 కి.మీ. మార్గంలో సేకరించాల్సిన 78.39 ఎకరాల ప్రైవేట్ భూములపై నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ఈ భూమిని సేకరించి హెచ్ఎండీఏకు అందజేస్తే సుమారు 937 ప్రైవేట్ ఆస్తులను తొలగించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. హెచ్ఎండీఏ రూ.4,263 కోట్లతో అంచనాలను రూపొందించింది. అందులో రూ.2,872 కోట్లు నిర్మాణ వ్యయం కాగా, మరో రూ.1,240 కోట్లను భూసేకరణ కోసం వెచ్చించనున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 18.18 కి.మీ. దూరం చేపట్టనున్న ఈ బ్రిడ్జి నిర్మాణంలో 11.52 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ వద్ద 6 లేన్లతో భూమార్గంలో టన్నెల్ నిర్మించనున్నారు. తిరుమలగిరి, అల్వాల్ వద్ద వాహనదారులు బ్రిడ్జిపైకి ప్రవేశించేందుకు, నిష్క్రమించేందుకు ఎంట్రెన్స్, ఎగ్జిట్లు ఉంటాయి. నగరాన్ని రాజీవ్ రహదారికి అనుసంధానం చేసేందుకు ఇది దోహదం చేయనుంది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. మరోవైపు ప్యారడైజ్ జంక్షన్ నుంచి మేడ్చల్ రూట్లో డెయిరీఫామ్ వరకు 5.40 కి.మీ. వరకు చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాథమిక పనులు కొనసాగుతున్నాయి. తాడ్బంద్, బోయిన్పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఈ రూట్లో బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద 600 మీటర్ల టన్నెల్ రానుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1,487 కోట్లు వ్యయం కానుంది. -
1 నుంచి ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ హెల్త్ చెకప్
పంజగుట్ట: తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రెస్ క్లబ్ సభ్యులు అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి సోమవారం సచివాలయంలో మంత్రి దామోదర్ రాజ నరసింహకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా జూన్ 1 నుంచి నిమ్స్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఈ స్పెషల్ డ్రైవ్‌లో మాస్టర్ హెల్త్ చెకప్ ఉచితంగానే చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు నిమ్స్‌లో అవసరమైన ఏర్పాటు చేయాలని దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ఆరోగ్య విభాగం కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. శంషాబాద్ తహసీల్‌లో రోజంతా ఏసీబీ పరిశీలన శంషాబాద్: శంషాబాద్ తహసీల్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ పరిశీలన కొనసాగింది. ఉదయం 10.30కు వచ్చిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌తో పాటు కార్యాలయంలో ఉన్న అందరు అధికారులతో మరోసారి రికార్డుల పరిశీలన చేపట్టారు. శుక్రవారం గైర్హాజరైన కొందరు అధికారులు సోమవారం విధులకు రాగా... వారి రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఇద్దరు ఉద్యోగులు ఆకస్మికంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లినట్లు సమాచారం. రికార్డుల పరిశీలనతో పాటు వివిధ అంశాలపై ఏసీబీతో చర్చించేందుకు రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి రోజంతా తహసీల్దార్ కార్యాలయంలోనే ఉండడం గమనార్హం. -
నా మరదలినే ప్రేమిస్తావా..!
పెళ్లి చేసుకుందామనుకున్నా.. యువకుడి హత్యకేసులో 10 మంది అరెస్ట్ అంబర్‌పేట: చిలకలగూడలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తేలచ్చారు. సోమవారం అంబర్‌పేటలో డీసీపీ రక్షిత కె మూర్తి వివరాలు వెల్లడించారు. నామలగుండుకు చెందిన యవన్(21) చిలకలగూడకు చెందిన యువతి పాఠశాల స్థాయి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇటీవల జవహార్‌నగర్‌లో డబుల్బెడ్రూం కేటాయించడంతో అక్కడికి కుటుంబాన్ని మార్చారు. అయితే యవన్ సోదరి కుటుంబం నామలగుండు ప్రాంతంలో ఉండడంతో వస్తూ పాత స్నేహితులతో పాటు యువతితో సైతం సంప్రదిస్తున్నాడు. యువతి బావ అల్లాబోయిన సాయికిరణ్ సైతం వరసకు యువతి మరదలు కావడంతో పెళ్లి చేసుకుందమని భావించాడు. అప్పటికే సాయికిరణ్ చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడిషీటర్. దీంతో ప్రేమ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించి కుటుంబ సభ్యులతో చర్చించారు. యవన్‌ను హత్య చేయడమే పరిష్కారమని భావించి పథకం వేశారు. ఈ నెల 7న స్నేహితుడు సుబ్బు ఇంటికి యవన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. యవన్‌ను బయటకు పిలిచి దాడి చేశారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్న నా మరదలిని ప్రేమిస్తావా అంటూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. పోలీసులు విచారణ జరిపి యవన్ హత్యకు కారణమైన యువతి బావ అల్లబోయిన సాకిరణ్(27), తండ్రి రాజం నర్సింహాయాదవ్, బాబాయ్‌లు రాజం శ్రీశైలం యాదవ్(48), రాజం మల్లేశ్‌యాదవ్(48), సోదరులు రాజం పరేమేశ్ యాదవ్(19, రాజం వంశీకృష్ణ(19, రాజం మనీష్(21), వీరి స్నేహితులు సిరిగిరి రాహుల్(22), కుచ్చుల శివనందన్‌యాదవ్(20)తో పాటు మరో మైనర్ బాలున్ని అరెస్టు చేశారు. -
ముంబయ్‌లోనే మకాం
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ భార్య తనూజను నేపాలీ గ్యాంగ్ దారుణంగా హత్య చేసి పరారైన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలు, మూడు సీసీఎస్ బృందాలు, ఒక లోకల్ పోలీస్ బృందం పూణె, ముంబాయి, ఢిల్లీ, లక్నోలతో పాటు నేపాలి సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేపట్టాయి. అయితే నిందితులు ముంబయ్‌లో తలదాచుకున్నట్లు సమాచారం. ● నిందితులు కల్పనతో పాటు నేపాల్‌కు చెందిన సుజన్షాహి అలియాస్ సురేష్‌షాహి, గణేష్‌షాహి, భరత్‌లుగా గుర్తించారు. సురేష్‌షాహికి ఈ పథకంలో భాగంగా దేవేందర్ అనే నేపాలీ డబ్బులు సర్దుబాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరంతా ముంబాయిలో తలదాచుకున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ బృందాలు అక్కడే గాలిస్తున్నాయి. ● ముఖ్యంగా ముంబయ్ రైల్వేస్టేషన్లో గాలింపు తీవ్రంచేశాయి. అయితే నిందితుల్లో ఒకరైన భరత్ సరిహద్దులు దాటి నేపాల్‌లోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.ప్రధాన నిందితురాలు కల్పనతో పాటు సురేష్‌షాహి, గణేష్షాహిలను పట్టుకోవడం ద్వారా ఈ మిస్టరీని చేధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ● నిందితుల ఖర్చుల కోసం దేవేందర్ అనే నేపాలీ సురేష్‌షాహికి పంపించగా, ఆయనే గత నాలుగు వారాల నుంచి ఇక్కడ తిష్టవేసి పథకం రచించి రెక్కీ నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ● ప్రధాన నిందితురాలు కల్పనను స్థానికంగా ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ నియమించినట్లు తేలింది. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసులు పూణెలో కల్పన తల్లిదండ్రులను, చెల్లెళ్లను హైదరాబాద్‌కు తరలించారు. వారిని ఒకవైపు విచారిస్తూనే ఇంకోవైపు వారి సహాయంతోనే నిందితులను పట్టుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ● ప్రధాన నిందితుల్లో భరత్ సరిహద్దు దాటివెళ్లగా కల్పన ముంబాయిలో తలదాచుకున్నట్లు తెలియడంతో ఆమె కోసం వేట ముమ్మరం చేశారు. గణేష్‌షాహి, సురేష్షాహిలు ముంబాయిలోనే ఓ చోట తలదాచుకోగా వారిని గుర్తించినట్లుగా సమాచారం అందింది. మొత్తానికి ఒకట్రెండు రోజుల్లో నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకునే దిశగా పోలీసులు ముందడుగు వేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసు నేపాలీగా గ్యాంగ్ కోసం గాలింపు ముమ్మరం సాయిభాస్కర్పై చర్యలు.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ భద్రత నిమిత్తం వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సాయిభాస్కర్ అనే పోలీసును ప్రభుత్వం నియమించింది. ఆయన ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటారు. హత్య, దోపిడీ జరిగిన రోజు రాత్రి ఆయన అందుబాటులో ఉండి ఉంటే ఈ ఘోరం జరగకపోయి ఉండేదని పోలీసులు భావిస్తున్నారు. 24 గంటలు వ్యక్తిగత భద్రత కోసం ఉండాల్సిన పోలీసులు రిలీవర్ లేకపోవడంతో సాయిభాస్కర్ ఒక్కడే ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటూ ఆ తర్వాత వెళ్లిపోతున్నాడు. రాత్రి కూడా ఉండి ఉంటే హత్య, దోపిడీ జరిగి ఉండేది కాదని పోలీసులు అంటున్నారు. -
పెళ్లి సందట్లో ఇల్లు గుల్ల
● షాహినాయత్ గంజ్‌లో భారీ చోరీ ● 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదుతో పరార్ అబిడ్స్: షాహినాయత్‌గంజ్ ముల్తానిపురాలో భారీ చోరీ చోటుచేసుకుంది. గోషామహాల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం... ముల్తానిపురాకు చెందిన మహేశ్ బేగంబజార్‌లోని స్టీల్ దుకాణంలో సేల్స్‌మేన్. లంగర్‌హౌస్‌లో బంధువుల పెళ్లి ఉండటంతో 4, 5 రోజులుగా ఉదయం కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లి వచ్చేసరికి ఇంటి ద్వారం తెరిచి ఉంది. లోపల బీరువా పగలగొట్టి ఉంది. అందులోని 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు, ఇతర సామగ్రి కనిపించలేదు. మహేష్ వెంటనే గోషామహాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ సంఘటనాస్థలానికి వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. 2వ అంతస్తులో తమ్ముడి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నప్పటికీ ఏ వస్తువు కూడా చోరీ కాలేదు. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని స్టోర్‌రూమ్ కానీ, ఫస్ట్ ఫ్లోర్లో తల్లి నివాసం వైపుకానీ కన్నెత్తి చూడలేదు. తెలిసిన వ్యక్తులే రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షల సొత్తు చోరీ అయిందని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
జనగణన వివరాలు అత్యంత గోప్యం
ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి ● ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి ● ప్రిన్సిపల్ ఎన్యూమరేషన్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ బంజారాహిల్స్‌లో జనగణనను పరిశీలిస్తున్న ఆర్వీ కర్ణన్సాక్షి,సిటీబ్యూరో: సెల్ఫ్ ఎన్యూమరేషన్ ముగియడంతో సోమవారం క్యూర్ పరిధిలోని ట్రై కార్పొరేషన్లలో ఇంటింటి సర్వే ద్వారా జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జూన్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. సెన్సస్ యాక్ట్ ప్రకారం ప్రజలు తమ వివరాలివ్వడం తప్పనిసరి అని, ఎన్యూమరేటర్లకు సహకరించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యూర్ పరిధిలోని 60 సర్కిళ్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సర్కిల్‌కు ప్రిన్సిపల్ ఎన్యూమరేషన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు అందుతున్న సంక్షేమ పథకాలకు జనగణనతో గండిపడుతుందనే అపోహలున్నాయని, దీని ద్వారా జనా భా, భవనాల వివరాలు సేకరించడం మినహా, ఇతరత్రా ఏ కార్యక్రమానికీ వినియోగించరని తెలిపారు. ఆర్టీఐ ద్వారా సైతం ఎవరికీ సమాచారం వెళ్లదని, అత్యంత గోప్యంగా ఉంటుందని, జనగణన వివరాలు డౌన్లోడ్, షేర్ చేయలేరని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లకు గుర్తింపు కార్డు, క్యూఆర్ కోడ్ ఉంటాయని, వారితోపాటు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం ఉంటారని పేర్కొన్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే ప్రజలు జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్‌కు చేయవచ్చన్నారు. 19,868 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ క్యూర్ పరిధిలో 19,868 బ్లాకులుగా ఇళ్లను డిజిటలైజ్ చేసినట్లు కర్ణన్ తెలిపారు. ఒక్కో బ్లాక్‌లో 200– 300 ఇళ్లుంటాయని, జనగణన కోసం 25,175 మంది సిబ్బందిని నియమించామని వివరించారు. వివరాల్ని మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారని, జనగణనను డిజిటల్‌గా జరపడం ఇదే తొలిసారని తెలిపారు. ఇంట్లో ఉన్న వారెవరైనా వివరాలు ఇవ్వవచ్చని, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇళ్లలో మాత్రమే కాక సంస్థల పరంగానూ ఎన్యూమరేషన్ జరుగుతుందని, ప్రతి భవనంలో ఉంటున్న వారి వివరాలు సేకరించడమే లక్ష్యమన్నారు. శని, ఆదివారాల్లోనూ ఎన్యూమరేషన్ జరుగుతుందని తెలిపారు. క్యూర్లో 1.27 లక్షల మంది మాత్రమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నట్లు చెప్పారు. వ్యక్తుల వారీ వివరాలు వచ్చే సంవత్సరం ఇది కుటుంబ సర్వే మాత్రమేనని, వ్యక్తుల వారీగా అసలైన జనగణన సర్వే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరుగుతుందని కర్ణన్ తెలిపారు. ఇప్పుడు సర్వే చేసే ఎన్యూమరేటర్లు, ప్రతి ఇంటికీ వెళ్లి ఇంటి నెంబర్, ఎన్యూమరేషన్ నెంబర్ ప్రత్యేకంగా వేస్తారన్నారు. పర్యవేక్షిస్తూ.. పరిశీలిస్తూ.. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–12లోని ఎన్బీటీనగర్లో జనగణనను కర్ణన్ సోమవారం పర్యవేక్షించారు. జనాభా వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టేందుకు, పాలసీలు రూపొందించేందుకు జనగణన ఎంతో కీలకం. దీని ద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలిసిన సాధారణ వివరాలే నమోదు చేస్తారు. అందరూ సహకరించండి. – ఆర్వీ కర్ణన్ -
ముఠా కట్టి.. హవాలా బాట పట్టి..
నాలుగు క్వింటాళ్ల గంజాయి పట్టివేత ● ఏడుగురి అరెస్ట్ గచ్చిబౌలి: కూకట్పల్లి ఎస్ఓటీ, పటాన్చెరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 4 క్వింటాళ్ల గంజాయిని పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సోలాపూర్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మనీషా పడ్వాల్ మరింత గంజాయి కోసం అదే ప్రాంతానికి చెందిన మధ్యవర్తి ప్రతాప్ హరిదాస్ పవార్(24)ను సంప్రదించింది. ఒడిశాకు చెందిన ట్రిబుని వద్ద గంజాయి ఉందని తెలుసుకున్న ప్రతాప్ డీసీఎం యజమాని ఆనంద్యప్ప హోవల్(34), డ్రైవర్లు చందన్షిప్వే అబుంబర్(46), రంజిత్ రాజేందర్ గడాగే(27)లు ఒడిశాలోని మల్కన్‌గిరికి ఈ నెల 8న బయలుదేరారు. డీసీఎం వ్యాన్‌కు ఎస్కార్ట్‌గా కారులో బాలాజీ గణేష్(35), రోహిత్ హోవల్(27), చంద్శివ్ సాహిల్(17) వెళ్లారు. ఖమ్మం జిల్లా వైరాకు వెళ్లగానే మల్కన్‌గిరికి కాకుండా, రాజమండ్రికి రావాలని గంజాయి పెడ్లర్ నుంచి కబురు వచ్చింది. ఈ మేరకు రాజమండ్రిలోని మారుమూల ప్రాంతానికి వెళ్లి రెండు కిలోల బరువు ఉన్న 200 గంజాయి ప్యాకెట్లను డీసీఎంలో లోడ్ చేసుకుని తెలంగాణ మీదుగా బయలుదేరారు. పోలీసులు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ వద్ద డీసీఎంను అడ్డుకున్నారు. ఆరుగురు నిందితులతోపాటు ప్రతాప్ హరిదాస్ పవార్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మనీషా పడ్వాల్, ట్రిబుని పరారీలో ఉన్నారు. 400 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్, కారు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.2 కోట్లు ఉంటుంది. హవాలా ద్వారా డబ్బు చేరవేత ప్రధాన నిందితురాలు మనీషా పడ్వాల్ హవాలా ద్వారా అంతర్రాష్ట్ర ముఠాకు మూడు లక్షల నగదు, గూగుల్ పే ద్వారా చేరవేసింది. మనీషా పడ్వాల్, ట్రిబుని పట్టుబడితే మరింత సమాచారం తెలిసే వీలుందని, వారిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓస్‌ఓటీ డీసీపీ శోభన్ బాబు, ఏడీసీపీ విశ్వప్రసాద్, ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్ , పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, డీఐ రాజు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
● బీఆర్ఎస్ మహిళా విభాగం నిరసనగచ్చిబౌలి: బండిభగీరథ్ను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమా డిమాండ్ చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ముందు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోంశాఖా సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ఎప్పుడూ ధర్మరక్షణ, దేశ రక్షణపై చాలా మాట్లాడతారని.. అతని కుమారుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని, మా బిడ్డను రక్షించాలని కోరిన ఆ తండ్రికి ఏం న్యాయం చేస్తారన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ బేటీ బచావో, బేటీపడావో అని చెబుతుంటారని ఇప్పుడు ఇలాంటి నేరానికి పాల్పిడిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు. నేరం చేసిన వ్యక్తిని కాపాడుతున్న బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి నేరస్తులేనని విమర్శించారు. బీఆర్ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు కొమిరిశెట్టిసాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ కొట్టేస్తున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వాణిజ్య సిలిండర్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గృహావసరాల సిలిండర్లు ఈ దందాకు ‘ఆజ్యం’ పోస్తున్నాయి. డెలివరీ బాయ్స్ చేతివాటంతో సామాన్యుడి గ్యాస్.. వాణిజ్యావసరాలకు మళ్లుతోంది. ఇటీవల పాతబస్తీ గోషామహల్, గాంధీనగర్ ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ దాడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్‌ను మార్చే అక్రమ ప్రక్రియ ఇష్టానుసారంగా సాగుతోంది. అక్రమార్కులు డెలివరీ బాయ్స్ సహకారంతో డొమెస్టిక్ సిలిండర్ నుంచి 2 నుంచి 3 కిలోల గ్యాస్‌ను సేకరిస్తున్నారు. ఇలా పోగైన గ్యాస్‌ను అధునాతన రీఫిల్లింగ్ పరికరాల ద్వారా 19 కిలోల వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నారు. అక్రమార్కులకు కాసుల పంట డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ ధరల మధ్య వ్యత్యాసం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం డొమెస్టిక్ (14.2 కేజీలు) ధర రూ. 965 (కిలో ధర రూ. 67.95), కమర్షియల్ (19 కేజీలు) ధర రూ. 3,315 (కిలో ధర రూ.174.47) ఉంది. వీటి ధరల మధ్య వ్యత్యాసం (కిలోకు) రూ. 106.52 వరకు కనిపిస్తోంది. ఒక కమర్షియల్ సిలిండర్‌ను ఇలా అక్రమ రీఫిల్లింగ్ ద్వారా విక్రయిస్తే, కేవలం గ్యాస్ ధర వ్యత్యాసం ద్వారానే రూ. 1,113 వరకు లాభం వస్తోంది. దీనికి అదనంగా వ్యాపారుల నుంచి మరో రూ. 300 వసూలు చేస్తున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ. 1400 వరకు లాభం గడిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారుల ఆసక్తి.. గంటల్లోనే డెలివరీ మార్కెట్లో అధికారికంగా కమర్షియల్ సిలిండర్ బుక్ చేస్తే వచ్చే సమయం కంటే, బ్లాక్ మార్కెట్లో గంట వ్యవధిలోనే డెలివరీ అందుతుండటంతో వ్యాపారులు సైతం ఆసక్తి కనబర్చుతున్నారు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కేటరింగ్ యూనిట్లు ’క్విక్ సర్వీస్’గా సిలిండర్ అందుతుండటంతో సర్వీస్ చార్జీలుగా అదనంగా రూ. 300 చెల్లించేందుకు వెనుకాడటం లేదు. సామాన్యుడిపై ప్రభావం గ్యాస్ అక్రమ దందా వల్ల అంతిమంగా నష్టపోతోంది సామాన్య వినియోగదారుడే. ఇంటికి వచ్చే డొమెస్టిక్ సిలిండర్‌లో బరువు తక్కువగా ఉండటంతో నెల రోజులు రావాల్సిన గ్యాస్ 20 రోజులకే నిండుకుంటోంది. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నామమాత్రంగా ఉండటం, తూనికల కొలతల విభాగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. డొమెస్టిక్ టు కమర్షియల్ గృహావసరాల సిలిండర్‌లో గ్యాస్ తస్కరణ ఆపై వాణిజ్య సిలిండర్లలోకి రీ ఫిల్లింగ్ -
మోదీ సభకు జనం పోటెత్తేలా..
ప్రచారంలో నిమగ్నమైన గ్రేటర్ బీజేపీ నేతలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన ప్రధాని మోదీ సభకు భారీ జన సమీకరణ చేసేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక్కో డివిజన్‌కు కనీసం 500 నుంచి 1000 మందిని తరలించాలని లక్ష్యాలను నిర్దేశించింది. బీజేవైఎం ఆధ్వర్యంలో డివిజన్‌కు వంద బైకులకు తగ్గకుండా ర్యాలీ తీయాలని నిర్ణయించారు. అదే సమయంలో జనం స్వచ్ఛందంగా తరలి రావాలని కాలనీల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. డివిజన్, నియోజకవర్గ స్థాయి నేతలతో పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, ఇతర జన సమూహ ప్రాంతాల్లో కర పత్రాల పంపిణీ చేస్తున్నారు. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, మహిళా సంఘాలు, కార్మిక, ఇతర సంఘాలను సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మోదీ సభ ప్రత్యేకతలను వివరించడం, గోడలపై పెయింటింగ్స్, ఇతర ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలతో కార్యాచరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా.. పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం, నాయకత్వానికి మేమున్నామని ధైర్యం కల్పించడం, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ సభ బీజేపీకి ఒక ఆయుధంగా ఉపయోగపడతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెండో దశ హైదరాబాద్ మెట్రో, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు, వైద్యం, రైల్వే, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు ఇతర రంగాల్లో కేంద్రం అందించిన రూ.లక్షల కోట్లు నిధులను ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. -
అంగన్వాడీలపై అక్కడికక్కడే నిర్ణయం
ఉద్యోగాల భర్తీ ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం మల్లాపూర్: నగరంలో ఖాళీగా ఉన్న 180 అంగన్వాడీ టీచర్లు, 370 ఆయాల పోస్టుల భర్తీ ఫైల్‌పై గురువారం నాచారం తెలంగాణ ఫుడ్స్‌లో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క సంతకం చేశారు. మంచి ముహూర్తం ఉండడంతో ఇక్కడే ఫైల్‌పై సంతకం చేశామన్నారు. తెలంగాణ ఫుడ్స్‌లో రూ.4 కోట్లతో చేపట్టిన మోడ్రన్ క్యాంటీన్, గోదాం భవనాల పనులకు టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిని ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకే రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందని వివరించారు. సర్కారు లక్ష్యాన్ని టీజీ ఫుడ్స్ నెరవేరుస్తూ, దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోందన్నారు. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులదేనని సూచించారు. నగరంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న కోడి గుడ్లు సరఫరా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బాలామృతం పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సేవల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాలు లేనిచోట, కొత్త భవనాలు పూర్తయ్యే వరకు జూన్ తొలి వారం నుంచి సంచార వాహనాల ద్వారా బాలామృతం, స్నాక్స్ సరఫరా చేస్తామని చెప్పారు. తెలంగాణ ఫుడ్స్ కార్మికుల ఇళ్ల స్థలంపైనా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. వారికి నాణ్యమైన భోజనం అందించేందుకు మోడ్రన్ కిచెన్ నిర్మిస్తామని, టీజీ ఫుడ్స్‌ను మరింత విస్తరించేందుకు అదనంగా ముడి పదార్థాల గోదాం నిర్మిస్తామని తెలిపారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రాంచంద్రన్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్జేడీ అంకేశ్వరరావు పాల్గొన్నారు. -
ఎండల్లో డిమాండ్
భారీగా పెరిగిన బీర్ల విక్రయాలు సాక్షి, సిటీబ్యూరో: మద్యం ప్రియులు చిల్డ్ బీర్‌తో ‘చీర్స్’ కొట్టేస్తున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం బార్లకు పోటెత్తుతున్నారు. అనూహ్యంగా పెరిగిన డిమాండ్ దృష్ట్యా ఎకై ్సజ్ అధికారులు బీర్ అమ్మకాలపై రేషన్ విధించడం గమనార్హం. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అమ్మకాలు అత్యధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే విక్రయాల్లో 45 శాతానికి పైగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సుమారు 3 లక్షల కేస్ల బీర్ల అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎకై ్సజ్ శాఖ లెక్కల ప్రకారం గత సంవత్సరం ఏప్రిల్‌లో 46.46 లక్షల కేస్ల బీర్లు విక్రయిచంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 56.21 లక్షల కేస్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. సుమారు 20 శాతానికి పైగా వినియోగం పెరిగింది. మరోవైపు ఆదాయం కూడా అదేస్థాయిలో పెరిగింది. -
గస్తీకి సుస్తీ
మల్కాజిగిరి పరిధిలో కానరాని నైట్ పెట్రోలింగ్ సాక్షి, సిటీబ్యూరో గల్లీ గల్లీలో గస్తీ. విజిబుల్ పోలీసింగ్‌తోనే నేరాల నియంత్రణ. నేరస్తుల కదలికలపై నిఘా పెడితేనే ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. కానీ.. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో గస్తీ వ్యవస్థకు సుస్తీ చేసింది. పోలీసు కమిషనర్ సుమతీ డెకాయ్ ఆపరేషన్‌తో కమిషనరేట్‌లో డొల్లతనం బయటపడింది. రాత్రి వేళలో స్వయంగా సీపీనే నడి రోడ్డుపై మూడు గంటల పాటు నిల్చున్నా.. ఒక్క పెట్రోలింగ్ వాహనం అటు వైపు కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ సంబంధిత ఠాణా పరిధిలోని అధికారులపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే దిల్సుఖ్నగర్ వంటి కీలకమైన ప్రాంతంలోనే పెట్రోలింగ్ పోలీసుల నిఘా లేకపోవడం మల్కాజిగిరి కమిషనరేట్ గస్తీ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోడ్లపై రౌడీషీటర్ల వీరంగం.. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉంటుంది. పట్టణ ప్రాంతాలకు పోలీసులు చేరుకోవడం కాస్త సులువే అయినా, శివార్లకు చేరుకోవడం కష్టమే. పెట్రోలింగ్ వాహనాలను, బ్లూ కోల్ట్ సిబ్బంది పెంపుతో శివార్లలోనూ గస్తీ పెట్టవచ్చు. కానీ, ఆమేరకు ఆశించినంత చర్యలు కనిపించడం లేదు. ప్రస్తుతం మల్కాజిగిరిలో 75కు పైగా పెట్రోలింగ్ వాహనాలు, రోజుకు 3 వేలకు పైగా బ్లూ కోల్ట్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా తగ్గింది. పోలీసుల గస్తీ తగ్గడంతో రాత్రి వేళల్లో వసతి గృహాలు, పని ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెట్రో స్టేషన్లు తదితర ప్రాంతాలలో రౌడీ షీటర్లు, డ్రగ్స్ పెడ్లర్లు వీరంగం సృష్టిస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లో ఓ హోటల్లో బిల్లు కట్టమని అడిగిన యజమానిపై రౌడీ షీటర్లు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడమే ఇందుకు నిదర్శనం. విమెన్ పెట్రోలింగ్ ఎక్కడ? నిర్మానుష్య ప్రాంతాలు, మహిళా వసతి గృహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసులు నిరంతరం తిరుగుతూ గస్తీ కాస్తుంటారు. 24/7 మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలనే లక్ష్యంతో బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ వాహనాల్లోనూ మహిళా సిబ్బందిని నియమించారు. బ్లూ కోల్ట్ అనేది అత్యవసర సమయంలో స్పందించే బృందం. 24/7 బైక్‌లపై తిరుగుతూ వేధింపులు, చెయిన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాల వంటి నేరాలు జరిగినప్పుడు వేగంగా స్పందించి, ఘటనా స్థలికి చేరుకుంటారు. కానీ, కమిషనరేట్‌లో ఈ వ్యవస్థ అటకెక్కింది. అలాగే స్థానిక మహిళలు, యువతతో పాటు గేటెడ్ కమ్యూనిటీ సంఘాలతో గూఢచారి వ్యవస్థను బలోపేతం చేసుకోవడం గతంలో ప్రారంభించిన సైకిల్ పెట్రోలింగ్ వ్యవస్థ క్రమంగా తగ్గింది. పోలీసు సిబ్బంది సైకిళ్లపై గల్లీల్లో తిరుగుతూ గస్తీ కాస్తుండేవారు. ఇప్పుడా వ్యవస్థ కనిపించడంలేదు. మాటలకే పరిమితం.. విజిబుల్ పోలీసింగ్ రాత్రిపూట రోడ్లపై రౌడీషీటర్ల వీరంగం చిన్నారులు, మహిళల భద్రతకూ సవాళ్లు మూలకు పడిన బైసైకిల్ పెట్రోలింగ్ వ్యవస్థ కమిషనర్ డెకాయ్ ఆపరేషన్‌లో వెల్లడైన డొల్లతనం -
పారిశుద్ధ్య కార్మికులతో కమిషనర్ అల్పాహారం
శ్రీనగర్‌కాలనీ: నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేలా కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. గురువారం యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో, జనగణన–స్వీయ గణనలో పాల్గొని విలువైన అభిప్రాయాలను అందించాలని స్థానిక నివాసితులను, జయప్రకాష్‌నగర్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలా సమస్యల పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వేసవిలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్కిల్ డీఎంసీ సురేష్, డీవైఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఈసీఐఎల్‌లో పీఎఫ్ గోల్మాల్!
రూ.50 లక్షల చెక్కులు మాయం ● ఇప్పటికే రూ.40 లక్షలు విత్ డ్రా ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు కుషాయిగూడ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కార్మికుల ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) నిధులు పక్కదారి పట్టాయి. పీఎఫ్ సెక్రటరీగా కొనసాగుతున్న ఉద్యోగే ఈ నిధులను కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి ఉద్యోగుల చెక్కులను డ్రా చేశారని పీఎఫ్ విభాగం సెక్రటరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుషాయిగూడలోని ఈసీఐఎల్ సంస్థలో సుమారు 10 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన రూ.50 లక్షల చెక్కులు మాయమయ్యాయి. కంపెనీలో పని చేసే దినసరి కూలీ పేరుతో రూ.40 లక్షలు డ్రా చేశారు. ఒకే ఎకౌంట్ నంబర్‌తో పెద్ద మొత్తంలో నగదు డ్రా కావడాన్ని బ్యాంకు అధికారులు పసిగట్టి ఈసీఐఎల్ పీఎఫ్ విభాగానికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు మిగతా చెక్కులను నిలిపివేశారు. రోజూవారీ ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా, ఈ గోల్మాల్ వ్యవహారంలో పీఎఫ్ విభాగం సెక్రటరీపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సాక్షి, సిటీబ్యూరో: వేసవి డిమాండ్ దృష్ట్యా రైళ్ల నిర్వహణ, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సదుపాయాలు, భద్రతపై దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమావేశం నిర్వహించారు. అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వడగాలుల దృష్ట్యా రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలపై జీఎం దిశానిర్దేశం చేశారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ట్రాక్‌లను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, అవసరమైన మేరకు ట్రాక్‌లను కంకరతో నింపాలని సూచించారు. వేడి వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు వేసవి జాగ్రత్తల ప్రాముఖ్యతపై ట్రాక్ పెట్రోల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. రైళ్లలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా నివారించడానికి నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా డ్రైవ్‌ను సమీక్షించారు. ప్రైవేట్ సైడింగ్‌లు, గూడ్స్ షెడ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ప్రవేశాలకు ఆవకాశం ఉన్న కొన్ని ప్రదేశాలలో ట్రాక్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. -
విద్యార్థిని అవయవాల దానం
బంజారాహిల్స్: ఇటీవల వెలువడ్డ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా ఆమె కళ్లతోపాటు ఇతర అవయవాలను తల్లిదండ్రులు దానం చేసి తమ కూతురు మరికొందరికి ప్రాణం పోయాలన్న సంకల్పం నెరవేర్చుకున్నారు. ఫిలింనగర్‌లోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన లావణ్య సాయి(16) ఇంటర్ ఫెయిల్ అయింది. తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. అయితే తమ కూతురు మట్టిలో కలిసిపోకూడదని మరికొందరికి చూపు నివ్వడమే కాకుండా ప్రాణం పోయాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉంగరాల మూర్తి–సుబ్బలక్ష్మి దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. కూతురి అవయవాలను దానం చేస్తూ నిర్ణయం తీసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు. -
జీఓ నెం.7 రద్దు చేయాలి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాంపల్లి: జీఓ నెం.7ను తక్షణమే రద్దు చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు జిఓను తీసుకువచ్చి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్పష్టత లేని జిఓను వెంటనే రద్దు చేయకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం రాత్రి గన్‌పార్కు ఎదుట విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మాకు తెలంగాణ వస్తే మంచి చదువులు వస్తాయని, మా బతుకులు ఎంతో బాగుపడుతాయని ఆశిస్తే విద్యార్థులకు చదువులే లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా తాత్సరం చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నరసింహా నాయక్, విద్యార్థి నేతలు సానియా, అంకిత, వైష్ణవి, సాయి, అర్చన, రమ్య, అశ్విని, కీర్తి, అక్షయ పాల్గొన్నారు. -
ఆర్టీఏలో పైరవీల జోరు
మెసేజ్‌లకే పరిమితమైన ‘సిలిండర్’ బుకింగ్ తర్వాత 15 రోజులు ఎదురుచూపులు కిలో లెక్కన.. ఆకాశమే హద్దు! డొమెస్టిక్,కమర్షియల్ గ్యాస్ ధరలను కిలోల లెక్కన బేరీజు వేస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. గృహ వినియోగ గ్యాస్ కిలో ధర సుమారు రూ. 66.55 పైసలు పలుకుతుండగా, వాణిజ్య గ్యాస్ కిలో ధర సుమారు రూ. 174.47 అంటే, వాణిజ్య గ్యాస్ ధర గృహ వినియోగ ధర కంటే దాదాపు 2.6 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ భారీ లాభాల కోసమే కంపెనీలు కమర్షియల్ ఆర్డర్లకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఐదు రోజులుగా డొమెస్టిక్ రీఫిల్స్ లోడ్ సరిగా రావడం లేదని గ్యాస్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. సాక్షి, సిటీబ్యూరో మహా నగరంలో వంటగ్యాస్ పంపిణీ వ్యవస్థ పడకేసింది. చమురు సంస్థల నిర్లక్ష్యం, డీలర్ల ధనదాహం వెరసి సామాన్యుడి వంటింట్లో ‘గ్యాస్’ మంటలు రేపుతోంది. రీఫిల్ బుక్ చేస్తే మూడు, నాలుగు రోజుల్లో వస్తుందని ఊదరగొడుతున్న చమురు సంస్థలు ఆచరణలో మాత్రం వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. బుకింగ్‌కూ బుకింగ్‌కూ మధ్య గడువు పెంచిన సంస్థలు, తీరా బుక్ చేశాక 15 రోజులు గడిచినా సిలిండర్‌ను గడప దాటించకపోవడం పంపిణీ వైఫల్యానికి పరాకాష్టగా మారింది. ఫోన్లకు వచ్చే సంక్షిప్త సమాచారాలు (ఎస్ఎంఎస్) తేదీల మార్పుతో కాలక్షేపం చేస్తుంటే, అటు డీలర్లు స్టాక్ లేదంటూ కాలయాపన చేయడంతో గ్యాస్ కోసం సామాన్యులు నిరీక్షణ మంత్రం జపిస్తున్నారు. బుకింగ్ ఉంటే.. డెలివరీ గగనం ప్రస్తుతం గ్యాస్ కనెక్షన్ నిబంధనల ప్రకారం ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య 25 రోజుల కనీస గడువు ఉండాలి. అయితే.. బుక్ చేసిన తర్వాత వారం రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందన్న చమురు సంస్థల ప్రకటనలు కేవలం ఫోన్ మెసేజ్‌లకే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి బుకింగ్ చేసిన తర్వాత 15 రోజులు గడిస్తే తప్ప సిలిండర్ గడపకు చేరని పరిస్థితి నెలకొంది. రీఫిల్ బుక్ చేసిన వెంటనే ఒక తేదీని, వారం తర్వాత మరో తేదీని సూచిస్తూ కంపెనీలు పంపుతున్న సంక్షిప్త సమాచారం వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తోంది. కమర్షియల్ లాభం.. డొమెస్టిక్‌పై నిర్లక్ష్యం చమురు సంస్థలు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ కంటే వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ల సరఫరాకే మొగ్గు చూపుతున్నా యనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసమే. తాజాగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ. 993 పెరిగి రూ. 3,315కి చేరింది. 14.5 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 965 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల అసమానత సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బదిలీల జాబితాపై మొదలైన కసరత్తు పక్కదారి పడుతున్న ‘రీఫిల్’ బండి సరఫరా తగ్గిన తరుణంలో అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టాక్‌ను కూడా ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గృహ వినియోగ సిలిండర్లను అధిక ధరలకు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర వాణిజ్య సంస్థలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్ల అక్రమ దందాతో సామాన్య గృహిణులు గ్యాస్ అయిపోయిన వేళ ప్రత్యామ్నాయం లేక అవస్థలకు గురి కావాల్సివస్తోంది. -
జడ్సీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ చాంబర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో ల్యాప్ టాప్‌తో పాటు ఫర్నిచర్ దగ్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం. సెలవు దినం కావడంతో కార్యాయలంలో ఎవరు లేరు. హై వోల్టేజీతో రివర్స్ విద్యుత్ సరఫరా కావడంతో ఈఈ చాంబర్ పక్కనే ఉన్న కేబుల్స్ కాలిపోయాయి. అక్కడి నుంచి రెండో అంతస్తులో జడ్సీ చాంబర్లో మంటలు చెలరేగాయి. ల్యాప్ టాప్, ఫర్నీచర్, విద్యుత్ లైట్లు, ఫ్లోర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో జడ్సీ అమిత్ కాన్ఫరెన్స్ హల్లోనే సోమవారం విధులు నిర్వహించారు.ఇదిలా ఉండగా హై వోల్టేజీ కారణంగా శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలోను కేబుల్స్ కాలిపోయినట్లు తహసిల్దార్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎంఈఓ కార్యాలయం బయట కూడా కొన్ని విద్యుత్ వైర్లు కాలిపోయాయయి. -
హైదరాబాద్
చెత్త ఏరుకునేవారిలాగ వచ్చి.. చీరల చోరీ బంజారాహిల్స్: చెత్త సేకరించే మహిళలు లాగా భుజాలపై సంచులు వేసుకుని వచ్చిన నలుగురు మహిళలు ఓ చీరల దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జహ్నుమా నవాబ్సాబ్ కుంటకు చెందిన ఎండీ సాదిక్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లో చీరల దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నలుగురు మహిళలు భుజాలపై చెత్తను ఏరుకునే సంచులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా ఈ చీరల దుకాణం వద్దకు వచ్చి చెత్త ఏరుతున్నట్లు నటిస్తూ షోరూం తాళాలు పగులగొట్టారు. లోనికి వెళ్లి రూ.2 లక్షల ఖరీదైన చీరలను మూటగట్టుకుని మెల్లగా జారుకున్నారు. సోమవారం ఉదయం షాపు తెరవడానికి వచ్చిన సాదిక్ తాళాలు పగులగొట్టి ఉండడం గమనించాడు. లోపల దుస్తులన్నీ చిందరవందరగా పడి ఉండడం అనుమానం వచ్చింది. చాలామంది చీరలను వర్క్ పనుల కోసం ఆయనకు ఇస్తుంటారు. వాటిని కూడా చోరీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా నలుగురు మహిళలు ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు తేలింది. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నరు. -
శిల్పారామంలోసమ్మర్ ఆర్ట్ క్యాంప్
● ఈనెల 22 వరకు శిబిరం మాదాపూర్: మాదాపూర్‌లోని శిల్పారామంలో సోమవారం సమ్మర్ ఆర్ట్ క్యాంపును ప్రారంభించారు. పాటరీ, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్,ఆక్రలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాప్ట్, వాటర్ కలర్స్, క్లే టాయ్స్, లిప్పన్ ఆర్ట్ తదితర అంశాలలో చిన్నారులకు, పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి ఇటువంటి సాంప్రదాయ పెయిటింగ్స్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారిలో సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. వివరాలకు 8886652030, 8886652004 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
ఒకపూట చిరుధాన్యాల ఆహారంతో ఆరోగ్యం
రాజేంద్రనగర్: రోజూ ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్), న్యూట్రీ హబ్ సహకారంతో మిల్లెట్ మార్వెల్స్ ఆధ్వర్యంలో సోమవారం రాజేంద్రనగర్ ఐఐఎంఆర్‌లో ‘‘రోజుకు ఒక పూట చిరు ధాన్యాల భోజనం’’ జాతీయ మిషన్‌కు వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ తాను చిరుధాన్యాల అహారం తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని తగ్గించుకోగలిగానన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి మాట్లాడుతూ, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక పూట చిరుధాన్యాల ఆహారం తీసుకోవడం మంచిదన్నారు. -
వృక్షాలకు నివాళులర్పించి..
ఆక్సిజన్ మాస్కులు ధరించి..బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణవేత్తలు, వాకర్లు రోజుకో రీతిన వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ సుమారు 1,320 వృక్షాలు కొట్టేస్తుండటంతో పచ్చదనం పూర్తిగా కరువవుతోందని, భవిష్యత్తులో ఆక్సిజన్ అందక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తామంటూ సోమవారం ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి నిరసనకు దిగారు. నేలకొరిగిన వృక్షాలకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. పార్కు చుట్టూ వాక్‌వేలో ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణవేత్తల వినూత్న నిరసన -
ప్రేమ పేరుతో నయవంచన
● సంపన్న యువతులే లక్ష్యంగా మోసాలు ● పోక్సో నిందితుడిని స్వయంగా విచారించిన సీపీ బంజారాహిల్స్: సంపన్న యువతులే లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి వ్యాపారం పేరిట లక్షల రూపాయలు వసూలు చేసిన చీటర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు నాలుగు రోజుల కస్టడీ నిమిత్తం తీసుకువచ్చారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా నిందితుడిని విచారణ చేశారు. కూకట్‌పల్లిలో నివసిస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్లో పని చేస్తున్న కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ (22) ఇన్‌స్ట్రాగామ్‌లో ఖరీదైన కార్లలో తిరుగుతున్నట్లు క్లబ్‌లు, పబ్‌ల్లో మద్యం తాగుతున్నట్లు ఫొటోలు పెడుతూ యువతులను ఆకర్షించేవాడు. ఈ క్రమంలో వెంకటగిరికి చెందిన ఓ బాలిక చంద్రశేఖర్ ఉచ్చులో పడింది. స్టార్టప్ పేరుతో ఆమె నుంచి రూ.13 లక్షలు వసూలు చేశాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాయ మాటలతో యువతులను ఆకర్షిస్తూ చాలా మందిని మోసం చేసినట్లుగా విచారణలో తేలడంతో సోమవారం స్వయంగా సీపీ సజ్జనార్ ఇక్కడికి విచ్చేసి నిందితుడితో మాట్లాడారు. ఎంత మందిని మోసం చేసిన విషయాన్ని కూడా ఆరా తీశారు. సుమారు గంట పాటు సీపీ సజ్జనార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ కేసుపై దృష్టిసారించారు. కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. చంద్రశేఖర్ తల్లి మీనాకుమారితో పాటు మేన మామను కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. -
‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ లోగో ఆవిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ ’(ఈ2ఈ) అంతర్జాతీయ వేదిక లోగోను ఆవిష్కరించారు. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ..2027 మార్చి 31 నాటికి 1,000 వ్యాపారాలు, విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సందీప్ కుమార్ మక్తాలా, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, టీ కన్సల్ట్ డైరెక్టర్ భాగ్య లక్ష్మి వాకిటి తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో గుర్తు తెలియనివ్యక్తి మృతి
విజయనగర్‌కాలనీ: ఎండ వేడిమికి తాళలేక ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సఘటన సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిమల్కాపూర్ విజయశ్రీ అపార్టుమెంట్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి (50) స్పృహ లేకుండా పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా అప్పటికే అతడు మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
గూగుల్‌లో చూసి.. సంతకాలు ఫోర్జరీ చేసి..
మంత్రులు, జడ్జిల పేర్లతో క్రికెట్ అసోసియేషన్లకు టోకరా ఉప్పల్: మంత్రులు, న్యాయమూర్తుల పేరును వాడుకుంటూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లను సంపాదించడంతో పాటు ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను మోసగించిన తీరు విస్తుగొలుపుతోంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు.. ఈ నెల 3న ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు స్టేడియం పార్కింగ్ వద్ద టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పల్ ఎస్ఐ మాధవరెడ్డి బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పదంగా తచ్చాడుతున్న మహీంద్రా థార్ వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. అత్యున్నత స్థాయి వ్యక్తుల సంతకాలు ఫోర్జరీ కేవలం బ్లాక్‌లో టికెట్లు అమ్మడం మాత్రమే కాకుండా, ఈ ముఠా పెద్ద స్కెచ్ వేసింది. గూగుల్ నుండి న్యాయమూర్తలు, మంత్రులు, గవర్నర్ల అధికారిక లెటర్ హెడ్లను డౌన్న్ లోడ్ చేసేవారు. వాటిపై సంబంధిత అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు సమర్పించేవారు. అలా వీవీఐపీల కోటాలో ఖరీదైన ’కాంప్లిమెంటరీ’ టికెట్లను పొంది, ఆ తర్వాత వాటిని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా పట్టుబడ్డారు. చైన్నె ప్రాంతానికి చెందిన ముగ్గురి సహకారంతో వీరు టికెట్లను సంపాదించే వారు. ఈ సీజన్లో ఉప్పల్‌లో రెండు మ్యాచ్‌లకు, బెంగుళూరులో రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను పోందారు. ఉప్పల్‌కు వచ్చే సరికి ఒకసారి టికెట్‌ను ఇచ్చిన హెచ్‌సీఏ అధికారులు రెండవ సారికూడా టికెట్లను అందజేసి చివరకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన గట్టమనేని అశోక్(20) రియల్ ఎస్టేట్ వ్యాపారి, కంకనాల దినేష్(25)పార్టీల జెండాలను తయారు చేసే వ్యాపారం, సింగమనేని వేణుమాధవ్(26)ప్రైవేట్ ఉద్యోగి. ఈ ముగ్గురూ ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం పల్కూరు గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. చైన్నెకి చెందిన మరో ముగ్గురు నిందితులు ఆశిష్, సెంథిల్, తాన్సిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ. 22 వేల విలువ గల 5 టికెట్లు, మహీంద్రా థార్ వాహనం. 5 మొబైల్ ఫోన్లు, 5 ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ టికెట్లు పొంది బ్లాక్‌లో విక్రయం ఉప్పల్ స్టేడియం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్ -
ప్రజావాణిలో 55 ఫిర్యాదులు
లక్డీకాపూల్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి వినతిపత్రాలు సమర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలు 36 వినతిపత్రాలు అందజేశారు. జోన్ వారీగా అందిన ఫిర్యాదుల్లో శంషాబాద్ జోన్లో 2, రాజేంద్రనగర్ జోన్లో 6, చార్మినార్ జోన్లో 3, ఖైరతాబాద్ జోన్లో 2, సికింద్రాబాద్ జోన్లో 6 ఫిర్యాదులు అందాయి. మొత్తం 55 ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమంలో అందినట్లు అధికారులు తెలిపారు. రాంగోపాల్పెట్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 10న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభా వేదిక వద్ద సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంచార్జి అభయ్ పాటిల్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, సభకు 2 లక్షలమందిపైగా హాజరవుతారని రాంచందర్‌రావు తెలిపారు. -
బాలల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి
మణికొండ: బాలలంతా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకునే భరోసా ఇవ్వాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన, పోలీస్ కమిషనర్ ఎం.రమేష్‌లు అన్నారు. నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్‌లో వలస కార్మికుల పిల్లల కొరకు వర్క్ సైట్ స్కూల్‌ను వారు ప్రారంభించారు. నాణ్యమైన విద్యతో వారికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని, ఇది దేశంలోనే మొదటి పాఠశాల అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో వలస కార్మికుల శ్రమ ఎంతో ఉందని, వారి పిల్లల భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, రాజపుష్ప ఫౌండేషన్ ప్రతినిధి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి యువ నాటకోత్సవాలు
గన్‌ఫౌండ్రీ: నాటక రంగం వైపు యువతను ప్రోత్సహించేందుకు బుధవారం నుంచి మూడు రోజుల పాటు రవీంద్రభారతిలో యువ నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలోని అకాడమీ కార్యాలయంలో యువ నాటకోత్సవాల బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 6న డింభక రాజ్యం వీధి, సిరిసిరి మువ్వ కల్చరల్ సంస్థ కళాకారులు గేమ్ సామాజిక నాటకం, నవ క్రాంతి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు శ్రీ మహిషాసుర మర్దిని పద్య నాటకాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు. 7న నిషాహి నిషి వీధి నాటకం, స్వప్నం రాల్చిన అమృతం, స్వామియే శరణం అయ్యప్ప పద్య నాటకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. 8న మాయాజాలం డాట్ కామ్, అమ్మ చెక్కిన బొమ్మ, యయాతి అనే పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. మూడు రోజుల పాటు సాయంత్రం వేళల్లో ప్రదర్శించనున్న నాటకోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. -
ఉత్సాహంగా బాల సమ్మేళనం
సుల్తాన్‌బజార్: బాల సాహిత్యానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని వక్తలు అన్నారు. సోమవారం సాయంత్రం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో బాల సాహిత్య సమ్మేళనం ఘనంగా జరిగింది. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు నుంచి బాల సాహితీ వేత్తలు, బాల సాహిత్య వికాసం కోసం ఉత్తమ అభిరుచితో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు పాల్గొని బాల సాహిత్యాన్నికి ఉన్నత భవిష్యత్తు కల్పించే వివిధ అంశాలపై చర్చలు సాగించారు. పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన శాంత వసంత ట్రస్ట్ సౌజన్యంతో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన సమ్మేళనంలో పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బాల సాహిత్య మిత్ర, బాల సాహితీమూర్తి పురస్కారాలను ప్రధానం చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన బాల సాహితీవేత్తలు -
విమానాలు.. సాంకేతిక చిక్కులు
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి కన్నూర్ బయల్దేరిన ఇండిగో విమానం వెనక్కి వచ్చింది. ఆదివారం 76 మందితో ప్రయాణమైన 6ఈ–7225 విమానంలో కొన్ని నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించారు. పైలట్ తిరిగి తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేసింది. అలాగే.. 180 మందితో బెంగళూరు బయల్దేరిన ఐఎక్స్–1345 విమానంలోనూ సాంకేతిక సమస్యను గుర్తించి రద్దు చేశారు. ప్రయాణికులను మరో విమానంలో పంపారు. హైదరాబాద్ నంచి జల్గావ్ వెళ్లాల్సిన విమానంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. -
ఐస్‌క్రీమ్ తేకపోతే బదిలీ చేస్తా!
ఎస్ఐకి జోన్ ఉన్నతాధికారి హుకుం సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఖరీదైన జోన్లో ఓ ఉన్నతాధికారి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించడంతో పాటు బూతులు మాట్లాడతారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకూ కమిషనర్ అన్ని జోన్ల ఉన్నతాధికారులతో కలిసి చర్చించి ఒకేసారి 65 మంది ఇన్స్పెక్టర్ల బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఓ జోన్ ఉన్నతాధికారి తెల్లవారుజామున 3 గంటలకు ఓ ప్రొహిబిషనరీ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)కు ఫోన్ చేసి ఐస్‌క్రీమ్ తీసుకురావాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ‘మనమే షాప్‌లను బంద్ చేయిస్తున్నాం కదా సార్. ఈ సమయంలో ఐస్‌క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది?’ అని సదరు ఎస్ఐ సమాధానం ఇవ్వగా.. చెప్పింది చేయకుంటే మల్టీ జోన్‌కు బదిలీ చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో చేసేదేం లేక గల్లీ గల్లీ తిరిగి ఆ ఎస్ఐ అధికారులందరికీ ఐస్ క్రీమ్ తీసుకెళ్లక తప్పలేదు. ఇదే జోన్ అధికారి మరో సందర్భంలో ఓ భూ తగాదా కేసులో తాను ఆదేశించినట్లు చేయనందుకు మరో ఎస్ఐపై ఆగ్రహానికి గురై ఫోన్లోనే బూతు పురాణం వినిపించాడు. తిట్ల దండకాన్ని సదరు ఎస్ఐ ఫోన్లో రికార్డ్ చేసి సహచరులకు, పలువురు ఉన్నతాధికారులకు వినిపించి, తన గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. గంటలో రిలీవ్ కావాలంటూ.. కాగా.. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఒకేసారి 32 మంది ఎస్ఐలను చార్మినార్ జోన్‌కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఎస్ఐలు గంటలోపు రిలీవ్ కావాలని సెట్లో కమిషనర్ ఆదేశాలు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోమవారం నిర్ణీత గంట వ్యవధి విధిస్తూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ (ఎస్హెచ్ఓ)లకు ఆదేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. బాస్ ఆదేశాలతో చేసేదేం లేక ఎస్ఐలను రిలీవ్ చేసే పనిలో ఎస్హెచ్ఓలు నిమగ్నమయ్యారు. వివిధ కేసుల్లో కోర్టుకు వెళ్లిన ఎస్ఐలకు మెమోలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ అయిన వారిలో కొందరు ఎస్ఐలు డీజీపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్ధరాత్రి గల్లీ గల్లీ తిరిగి పట్టుకొచ్చిన ఎస్ఐ కేసు దర్యాప్తులో మరో ఎస్ఐపై దుర్భాషలు సైబరాబాద్‌లో చర్చనీయాంశం -
ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు
నలుగురికి గాయాలు.. పగిలిన ఇళ్ల అద్దాలు, పహాడీషరీఫ్: రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఆక్సిజన్ సిలిండర్ల గోదాంలో పేలుడు సంభవించింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి వివరాల ప్రకారం.. జల్పల్లి బాబాకాంట సమీపంలో అబ్దుల్ కరీం, అబ్దుల్ గౌస్, షేక్ మహ్మద్ రిజ్వాన్ అహ్మద్‌లు లైఫ్ కేర్ మెడికల్, ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల గోదాం నిర్వహిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా కర్నూలు, పటాన్చెరు నుంచి భారీ కంటైనర్లను తీసుకువచ్చి, చిన్న కంటైనర్లు, అందులోంచి సిలిండర్లలోకి నింపి ఆస్పత్రులు, పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ కంటైనర్ నుంచి గ్యాస్ లీకై , భారీ శబ్దంతో పేలింది. ఈ ప్రభావంతో మరో కంటైనర్ నుంచి వాయువు విరజిమ్మింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ప్రహరీ కూలి డీసీఎం, పది బైక్‌లు ధ్వంసమయ్యాయి. గోదాం కప్పు దెబ్బతిన్నది. ఇళ్ల కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. కంపెనీ ఆపరేటర్ బృందావన్ దాస్, పక్క షెడ్లోని కార్మికులు తౌఫిక్, సయ్యద్ ఖలీం గాయపడ్డారు. వీరిని మైలార్‌దేవ్‌పల్లిలోని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
విద్యాబోధనలో ఏఐ వినియోగం
కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలసాక్షి, సిటీబ్యూరో : విద్యా బోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడంతోపాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగాన్ని ప్రోత్సహించాలని హైదరాబాద్ కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత పాటించడంతో పాటు మెనూ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు అవసరమైన చోట తరగతి గదుల విస్తరణ, అభివృద్ధి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల పురోగతిని సమీక్షించేందుకు తరచూ పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా వసతులు కల్పిస్తున్నందున, ఫలితాలు కూడా అదే స్థాయిలో రావాలని ఆదేశించారు. విద్యాధికారులు, ఉప విద్యాధికారులు పాఠశాలలను నిరంతర తనిఖీలు నిర్వహించేలా చూడాలని సూచించారు. పర్యవేక్షణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఏడీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓలు, సెక్టోరియల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పంథా మార్చి.. ఏమార్చి
● కస్టమ్స్ అధికారులకు అనుమానం రాకుండా స్మగ్లర్ల కొత్త ఎత్తుగడ ● తాజాగా సికింద్రాబాద్‌లో క్రిస్టల్ మెథ్ స్వాధీనం, అదుపులో ఇద్దరు మహిళలు బంగారం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో క్యారియర్లుగా మహిళలుసాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ స్మగ్లర్లు పంథా మార్చారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాకు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. డీఆర్ఐ, కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల దృష్టి మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ గడిచిన కొన్నాళ్లల్లో 11 మంది మహిళలు పట్టుబడటమే దీనికి నిదర్శనం. తాజాగా మంగళవారం సికింద్రాబాద్‌లో ఇద్దరు మహిళా క్యారియర్లను అదుపులోకి తీసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.4 కోట్ల విలువైన 11.4 కేజీల క్రిస్టల్ మెథ్ స్వాధీనం చేసుకున్నారు. మహిళలు, అందునా నిండుగర్భం, చంకలో పసిపిల్లలు, అంగవైకల్యంతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం అరుదు. ఈ కారణంగానే వివిధ దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపి క్యారియర్లుగా మార్చుకుంటున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటిబిడ్డలతో వస్తున్నవారికి అప్పగించి పంపిస్తున్నారు. మెటల్ డిటెక్టర్లనూ ఏమార్చ వచ్చని.. వివిధ రూపాలు, పంథాల్లో ఒంటిపై బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్(డీఎఫ్ఎండీ) కూడా కొంతవరకు కలిసి వస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగా ధరించే నగల వల్ల శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుందని బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. సూత్రధారులు మాత్రం చిక్కట్లేదు.. ఈ తరహా దందాలో చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా, ముఠా సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టమవుతోందని కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళా క్యారియర్లకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్ళి సరుకు తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. గతంలోనూ ఉదాహరణలు ఎన్నో.. దుబాయ్ నుంచి కొకై న్ క్యాప్సుల్స్‌ను కడుపులో దాచుకుని వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసాను పట్టుకుంటే 793 గ్రాముల డ్రగ్స్ దొరికింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన ఓ మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
హిమాయత్‌నగర్ : బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్‌న్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ బీసీల హామీలు తుంగలో తొక్కి, వారి ఆశల మీద నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎర్ర సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన రెండు బిల్లులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ పాల్గొన్నారు. జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ పదవీ విరమణ సాక్షి, సిటీ బ్యూరో: జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్ పదవీ విరమణ చేశారు. గురువారం ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఎండీ అశోక్ రెడ్డి హాజరై ఘనంగా సన్మానించారు. డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి, ఇతర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ ఆక్టోపస్’తో కదిలిన కేంద్రం
రెండు దఫాల్లో నిర్వహించిన హైదరాబాద్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ ఆదేశాల మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నిర్వహించారు. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడంతో ఆయా అంశాలను వివరిస్తూ సజ్జనర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) లేఖ రాశారు. దీంతో కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఇందులో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి వీసీ సజ్జనర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. సమావేశంలో పాల్గొన్న ఆయన పలు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలను నిరోధించాలంటే లోపాలు అధ్యయనం చేసి, మూలాల్లోకి వెళ్లాలని భావించిన సజ్జనర్ దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ఆక్టోపస్‌ను డిజైన్ చేశారు. తొలుత ఫిబ్రవరిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్–1’ నిర్వహించిన సైబర్ క్రైమ్ పోలీసులు 16 రాష్ట్రాల్లో సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశారు. వీరిలో సైబర్ నేరాలు చేసే వారికి బ్యాంకు ఖాతాలు అందించిన వారు (మ్యూల్ అకౌంట్ హోల్డర్స్), దళారులు ఉన్నారు. వీరి విచారణలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో రెండో విడతగా ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ను ఏప్రిల్‌లో చేపట్టారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు వినియోగించిన 350 బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వీటికి దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని, ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర అమాయకుల ధరాన్ని లూటీ చేశారని వెల్లడైంది. బ్యాంకు అధికారులు మోసగాళ్లతో చేతులు కలిపి నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో బ్యాంకు అధికారుల పనిపట్టడానికి గత నెల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’ చేపట్టారు. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన 16 ప్రత్యేక బృందాలు రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, బీహార్‌ల్లో దాడులు నిర్వహించాయి. ఫలితంగా పట్టుబడిన 52 మందిలో 32 మంది బ్యాంకు అధికారులు కాగా... 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో వివిధ బ్యాంక్‌లకు చెందిన మేనేజర్లు, కేవైసీ అప్రూవర్లు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, క్లర్కులు ఉన్నారు. వీరి విచారణలో వెలుగులోకి వచ్చిన, దర్యాప్తులో గుర్తించిన అంశాలతో సజ్జనర్ ఆర్బీఐకి లేఖ రాయగా దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ సమస్య పరిష్కారం కోసం గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఆర్థిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎం.నాగరాజు, ఉన్నతాధికారులు, సీబీఐ డైరెక్టర్, ఇండియన్ సైబర్ క్రైౖ మ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ కుమార్, వివిధ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో పాటు హైదరాబాద్ కొత్వాల్ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న లోపాలు బహిర్గతం కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ రాష్ట్రం నుంచి హాజరైనహైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ -
అరుదైన కళాకారుడు ‘ఎల్లా’
సూరీడి కర్ఫ్యూ సూరీడి ప్రతాపంతో నగరం ఉడుకుతోంది.. ప్రజలు బయటకు రావాలంటేనే వణికే పరిస్థితి నెలకొంది. ఎలాంటి సమయంలోనైనా నిత్యం రద్దీగా కనిపించే రహదారులు సైతం బోసిపోతున్నాయి. గురువారం చార్మినార్ వద్ద కనిపించిన దృశ్యమిది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గన్‌ఫౌండ్రీ: ప్రముఖ మృదంగ విద్వాంసుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు అరుదైన, అద్భుతమైన కళాకారుడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సోమశేఖర మ్యూజిక్ డాన్స్ కల్చరల్ సొసైటీ, కిన్నెర ఆర్ట్ థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో ఎల్లా వెంకటేశ్వరరావుకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన భట్టి మాట్లాడుతూ..కర్ణాటక సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న గొప్ప కళాకారుడు వెంకటేశ్వరరావు అని కొనియాడారు. 36 గంటల పాటు మృదంగం వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారని గుర్తు చేశారు. 83 సంవత్సరాల వయసులోనూ తన మృదంగంతో ప్రేక్షకులను కనువిందు చేయడం ప్రశంసనీయమన్నారు. అంతకు ముందు చిన్నారుల సినీ గీతాలాపన ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ అలేఖ్య పుంజాల, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సంగీత దర్శకుడు విశ్వనాథ్, ఏపీ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ పెంచలయ్య, కిన్నెర కార్యదర్శి రఘురాం, బాలమురళి తదితరులు పాల్గొన్నారు. -
పట్టాల కింద పైప్‌లైన్ లీక్
అప్రమత్తమైన అధికారులు ● యుద్ధప్రాతిపదికన పనులు సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరి సర్కిల్ మిర్జాలగూడ వార్డు పరిధి దయానంద్ నగర్ రైల్వే ట్రాక్ కింద భారీ నీటి లీకేజీ గమనించిన రైల్వే అధికారులు జల మండలికి సమాచారం ఇచ్చారు. దీంతో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు యంత్రాంగం గురువారం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టింది. సరఫరా సమయంలోనే లీకేజీ బయటపడడంతో ప్రధాన పైప్‌లైన్ నుంచే జరుగుతోందని నిర్ధారించారు. లీకేజీ కొనసాగితే ట్రాక్ దెబ్బతినొచ్చని భావించి మరమ్మతులు పూర్తయ్యే వరకు సరఫరా నిలిపివేశారు. రైల్వే పరిధి వెలుపల రిసెప్షన్ పిట్ వద్ద తవ్వకాలు చేపట్టగా, 20 అడుగుల లోతులో 300 మి.మీ. ఎంఎస్ క్యారియర్ పైప్, 800 మి.మీ. కేసింగ్ పైప్ అమర్చినట్లు గుర్తించారు. భారీ ట్రస్ట్ బ్లాక్ ఉండడంతో పనులు క్లిష్టంగా మారాయి. అందుకని జేసీబీ, ఎయిర్ కంప్రెషర్లు, డీ–వాటరింగ్ పంపులు వాడుతూ పనులు చేపడుతున్నారు. కొత్త పైప్‌లైన్ ఏర్పాటు ప్రస్తుత 300 మి.మీ. ఎంఎస్ పైప్లైనన్ను పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటు చేయడమే శాశ్వత పరిష్కారం అ జలమండలి అధికారులు నిర్ణయించారు. రూ.48 లక్షల వ్యయం అంచనా వేశారు. మరమ్మతులతో వాణీనగర్, భవానీనగర్‌కు సరఫరా అంతరాయం కలిగింది. దీంతో జలమండలి పలు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. వాణీనగర్‌లో దాదాపు 200 కనెక్షన్లకు పాక్షికంగా సరఫరాను పునరుద్ధరించారు. మిగతా ప్రాంతాలకు ఉచిత ట్యాంకర్లు పంపుతున్నారు. -
సరోజీని దేవి కంటి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
గోల్కొండ: మెహిదీపట్నంలోని సరోజీనిదేవి కంటి ఆసుపత్రిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి గ్రౌండ్ ప్లోర్ లోని సెంట్రల్ మెడిసిన్ స్టోర్ రూమ్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను సిబ్బంది ఆర్పివేశారు. కాగా ఇండోర్ ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగంతో పాటు ఇన్‌పేషంట్ విభాగం కూడా ఉండడంతో అక్కడ ఉన్న రోగులు ఔట్పేషంట్కు వచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఏడిఎఫ్వో వి.భానుప్రతాప్ తెలిపారు. -
పని చేస్తున్న చోటే దొంగతనం
మియాపూర్ : భవన నిర్మాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ సామాగ్రిని చోరీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్ డీఐ రమేష్ నాయుడు తెలిపిన మేరకు.. నిజామాబాద్ నవీపేట్‌కు చెందిన కల్లూరి లక్ష్మణ్ (39) జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో నివాసముంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీననం కొనసాగిస్తున్నారు. డబ్బు సరిపోకపోవడంతో చోరీలబాట పడ్డాడు. ఈ క్రమంలో ఓ నిర్మాణ సంస్థలో ఎలక్ట్రికల్ సామాగ్రి మాయమవుతుండటంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం చేసింది కల్లూరి లక్ష్మణ్ అని గుర్తించారు. అతని వద్ద నుండి రూ.1.50 లక్షలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. -
తండ్రి కాలేయంతో బాలుడికి ప్రాణం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు రెండేళ్ల బాలుడికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రెండేళ్ల కుమారుడు మహ్మద్ అఫాన్ కండరాల బలహీనతతో తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. దీంతో తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడు కాలేయసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. కాలేయదానం చేయడానికి తండ్రి అంగీకరించడంతో అతని నుండి 240 గ్రాముల కాలేయాన్ని సేకరించి దాదాపు 14 గంటల పాటు శ్రమించి బాలుడికి విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చు అయ్యే ఇలాంటి శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా నిర్వహించామని.. దాదాపు లక్షమందిలో ఒకరికి ఇలాంటి అరుదైన వ్యాధి ఉండే అవకాశం ఉంటుందని ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. వైద్యుల కృషిని మంత్రి మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. -
నేటినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్
సాక్షి,సిటీబ్యూరో: సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ జరగనుంది. ఇందుకోసం అవసరమైన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు. 2న విశ్వశాంతి సంకీర్తనా యజ్ఞం సాక్షి, సిటీబ్యూరో: యుద్ధ వాతావరణం తదితర సంక్షోభాల నేపథ్యంలో ‘‘అన్నమాచార్య భావనా వాహిని’’ ఆధ్వర్యంలో ‘విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం‘ నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా.నందకుమార్ తెలిపారు. ఈ నెల 2న 618వ అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ఉదయం ట్యాంక్ బండ్‌పై అన్నమయ్య విగ్రహం దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 5న కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష అబిడ్స్: తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మే 5న లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరహార దీక్ష చేపడుతామని టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేన్ పేర్కొన్నారు. గగన్‌విహార్‌లోని టీఎన్జీఓ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎఫ్ రద్దుతో పాటు మరో 64 ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామన్నారు. టీఎన్జీఓస్ నాయకులు కుర్రాడి శ్రీనివాస్, విక్రమ్ కుమార్, కేఆర్.రాజ్‌కుమార్ పాల్గొన్నారు. పదవీ విరమణ చేసిన రోజే పీపీఓలు సాక్షి, సిటీబ్యూరో: పదవీ విరమణ చేసిన రోజే సభ్యుల పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులను జారీ చేయడం లక్ష్యంగా రూపుదిద్దుకున్న ‘ప్రయాస్’ కార్యక్రమంలో భాగంగా గురువారం పలువురు ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపు ఉత్తర్వుల (పీపీఓలు)ను అందజేశారు. కూకట్‌పల్లిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ’ఉద్యోగుల పెన్షన్ పథకం, 1995’ కింద బాలానగర్‌కు చెందిన మెస్సర్స్ మల్హోత్రా షేవింగ్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆర్టిసి సంస్థల ఉద్యోగులకు ఈ పిపిఓలను పంపిణీ చేశారు. గత నెలలో ప్రాసెస్ చేసిన 08 పెన్షన్ దరఖాస్తులకు సంబంధించిన ఉత్తర్వులను సహాయక పీఎఫ్. కమిషనర్ బాబుల్నాథ్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. ● రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారు జితేందర్ రెడ్డి గచ్చిబౌలి: ఒలింపిక్ స్థాయి క్రీడాకాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పని చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహదారులు ఏపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ నిర్వహించారు. యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చి విశ్వవ్యాప్తంగా ఖ్యాతిగడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ విద్యతో పాటు శిక్షణ అందిస్తూ స్థిరమైన క్రీడా వ్యవస్థను నెలకొల్పేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మెన్,ఎండీ సోనీ బాల మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ స్థాయి నుంచి పోటీలు నిర్వహంచి ప్రతిభ వెలికి తీస్తున్నట్లు పేర్కొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కిశోర్ గోపీనాథన్, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘గుండె చికిత్స’పై చర్చా కార్యక్రమం సాక్షి, సిటీబ్యూరో: గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలో నగరం గణనీయ పురోగతి సాధించిందని ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు పేర్కొన్నారు. ‘తీవ్రమైన గుండె వ్యాధుల చికిత్సలో నగరం’అంశంపై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఏఐజి హాస్పిటల్ కు చెందిన కార్డియాక్ క్యాత్ ల్యాబ్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనుజ్ కపాడియా పాల్గొని మాట్లాడారు. కవాట వ్యాధుల విషయంలో, అతి తక్కువ కోతతో చేసే గుండె చికిత్సా విధానాల దిశగా నిరంతర మార్పు కనిపిస్తోందని ఆయన తెలిపారు. -
మేయర్‌కు ఓటు!
క్యూర్‌లోని మూడు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికపై చర్చ ● నీతి ఆయోగ్ సంస్కరణల నేపథ్యంలో.. ● కార్పొరేటర్‌కు ఒకటి, మేయర్‌కు మరో ఓటు ● పొత్తులు, పదవీకాలం పంచుకోవడానికి చెక్ ● ప్రభుత్వంపై ఆధారపడకుండా.. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా.. ● 2002లో ఎంసీహెచ్ మేయర్ ఎన్కిక జరిగిందలాగే.. సాక్షి, సిటీబ్యూరో: క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకమండళ్లకు జరగబోయే ఎన్నికల్లో మేయర్లను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారా? అంటే.. కాదనలేమనే సమాధానమే అధికారుల నుంచి వస్తోంది. పది లక్షల జనాభా దాటిన నగరాల కార్పొరేషన్ల మేయర్ల ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించడంతోపాటు వారికి కార్యనిర్వాహక అధికారాలు కల్పించాలని సూచిస్తూ నీతి ఆయోగ్ ఇటీవల కేంద్రానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చ సాగుతోంది. ‘మూవింగ్ టువార్డ్స్ ఎఫెక్టివ్ సిటీ గవర్నమెంట్– ఎ ఫ్రేమ్ వర్క్ ఫర్ మిలియన్ ప్లస్ సిటీస్’పేరిట అందజేసిన ఈ నివేదికలో మేయర్‌కు అధికారాలుండాలని సూచించింది. మేయర్ పదవికి స్థిరమైన కాలపరిమితి నిర్ణయించడంతోపాటు ప్రజలే నేరుగా ఎన్నుకోవాలని పేర్కొంది. పారిశుధ్యంతోపాటు నీటి సరఫరా, పబ్లిక్ రవాణా వంటి విభాగాలు కార్పొరేషన్ పరిధిలో ఉండాలని కూడా సూచించింది. పెద్ద నగరాల్లో నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉండటంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌తోపాటు చాలా కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికల ద్వారా మేయర్లను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. తద్వారా కార్పొరేషన్లో బలం కోసం పార్టీల మధ్య పొత్తులు, పదవీకాలం పంచుకోవడం వంటివి నగర ఓటర్లకు అనుభవమే. ఇలాంటి ఇబ్బందులు లేని స్థిరమైన పదవీకాలం, స్వతంత్ర నిర్ణయాలు మేయర్‌కు ఉంటే జవాబుదారీతనంతోపాటు నగర పాలనలో స్థిరత్వం, వేగం కూడా ఉంటాయనేది నీతి ఆయోగ్ అభిప్రాయం. సిటీకి కొత్త కాదు.. హైదరాబాద్ నగరానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నిక కొత్తకాదు. జీహెచ్ఎంసీగా రూపాంతరం చెందకముందు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)కు 2002లో జరిగిన మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్‌కు ఒక ఓటు, మేయర్‌కు మరొక ఓటు చొప్పున ఓటర్లు రెండు ఓట్లు వేశారు. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత 2009–14 పాలకమండలిలో కాంగ్రెస్ –ఎంఐఎం పొత్తులో భాగంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని పంచుకున్నాయి. కాంగ్రెస్ తరఫున బండ కార్తీకరెడ్డి, ఎంఐఎం తరఫున మాజిద్ హుస్సేన్‌లు మేయర్లుగా పదవీకాలాన్ని కూడా పంచుకున్న విషయం తెలిసిందే. కార్పొరేషన్ పరిధిలోనే తాగునీరు, డ్రైనేజీ, రక్షణ తదితర విభాగాలుండాలనే ఆలోచనలు గతంలోనూ జరిగాయి. -
సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి
గన్‌ఫౌండ్రీ: సగర కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ సగర కులస్తులను బీసీ– డి నుంచి మార్పు, జీఓ నెంబర్ 59 వంటి విషయాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి బాల మాయాదేవి, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ మారుతీసాగర్తోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఎప్పటికై నా గొప్ప నటి అవుతా..
‘ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026’ ఇందు ఫాల్గుణి పంజగుట్ట: గొప్ప నటి కావాలన్నదే తన ఆశయమని, ఎప్పటికై నా అనుష్కా షెట్టి అంతటి గొప్ప నటిని అవుతానని ‘ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026’ టైటిల్ కై వసం చేసుకున్న చిలకలపూడి ఇందు ఫల్గుణి తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మిస్ ఇండియా పోటీల విశేషాలు వెల్లడించారు. ఏప్రిల్ 18న జరిగిన పోటీల్లో ‘ఫెమీనా మిస్ ఇండియా సౌత్ 2026’ విజేతగా తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి సారి తాను నిలిచానన్నారు. సుష్మితాసేన్, ఐశ్వర్యారాయ్, లారాదత్త ఆదర్శమని, ఎప్పటికై నా ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నటి అనుష్కా షెట్టి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అంతటి నటి అవుతానని తెలిపారు. గుంటూరుకు చెందిన ఇందు ఫల్గుణి నగరంలో శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటూ ఎల్ఎల్బీ చదువుతోంది. మేజిస్ట్రేట్ కావాలన్నది తన కోరిక అన్నారు. -
అక్రిడిటేషన్ కమిటీని మార్చకపోతే ఆందోళన
● ఐ అండ్ పీఆర్ కమిషనర్‌ను కలిసిన జర్నలిస్ట్ సంఘాల నేతలు సాక్షి,సిటీబ్యూరో: ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా సీనియారిటీని విస్మరించి ఏకపక్షంగా ప్రకటించిన హైదరాబాద్ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీని తక్షణమే రద్దు చేసి పునర్వ్యవస్థీకరించకుంటే ఆందోళన తప్పదని పలు జర్నలిస్టు యూని యన్లు హెచ్చరించాయి. గురువారం ఐఆండ్ పీఆర్ కార్యాలయంలో కమిషనర్ ప్రియాంకను కలిసి హైదరాబాద్ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటులో జరిగిన అవకతవకలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన పత్రికల సీనియర్ జర్నలిస్టులను సైతం విస్మరించి తమకు అనుకూలంగా వ్యవహరించేవారికి స్థానం కల్పించారని ఆరోపించారు. అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో పనిచేసే వారికి కూడా కమిటీలో ప్రాధాన్యత కల్పించడంపై అను మానం వ్యక్తం చేశారు. ఫొటో, వీడియో, ఉర్దూ, ఎలక్ట్రానిక్, చిన్న పత్రికల యూని యన్లు ప్రతిపాదించిన అర్హులైన జర్నలిస్టుల పేర్లను పరిగణనలోకి తీసుకోకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్య క్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజిద్, హెచ్ యూజే అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. -
మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం
వినియోగదారుల భద్రతే లక్ష్యం ● కొత్వాల్ సజ్జనర్ సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులు కేవలం కొత్త ఖాతాలు తెరవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయాలని నగర సీపీ సజ్జనర్ అన్నారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో గురువారం ఆయన బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. రెండు దశల్లో నిర్వహించిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన లోపాలకు వారి దృష్టికి తీసుకువచ్చారు. 45 బ్యాంకులకు చెందిన 75 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు ’సేఫ్ కస్టమర్ చాలెంజ్’ను బ్యాంకులు స్వీకరించాలన్నారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ ’జీరో మ్యూల్ అకౌంట్స్’ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్ బాధితులు ఉండకూడదని, నేషనల్ సైబర్ క్రైౖ మ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు. ’ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’లో 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాలను గుర్తించామని, మ్యూల్ ఖాతాల ఓపెనింగ్‌లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. కంబోడియా, వియత్నాం, దుబాయ్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాలు దళారుల ద్వారా స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మకై ్క ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు ‘మ్యూల్ హంటర్’ వంటి టెక్నాలజీని వాడాలని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్1930పై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులు పాల్గొన్నారు. 7సజ్జనర్@సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లో మరోసారి అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న అధికారి కొత్వాల్ పోస్టులో నగర పోలీసు విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఇంతకుముందు పేర్వారం రాములు, అనురాగ్ శర్మ, ఎం.మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్, ఆనంద్, కొత్తకోట శ్రీనివాసరెడ్డిలు ఇలానే వ్యవహరించారు. ఇప్పుడు కొత్వాల్ సజ్జనర్‌కు డీజీపీగా పదోన్నతి లభించింది. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో సజ్జనర్ గురువారం డీజీపీ హోదాలో నగర పోలీసు కమిషనర్‌గా కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. -
ప్రయోగాల పేరుతో మూగజీవులను హింసించకండి
సాక్షి, సిటీబ్యూరో: ప్రయోగాల పేరుతో మూగజీవాలపై జరగుతున్న హింసను ఆపాలని జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా నినదించింది. ప్రధానంగా పాలమూరు బయోసైన్సెస్ సంస్థలో ప్రయోగాల పేరుతో నిర్బంధించిన 1200 జంతువులను పునరావాస కేంద్రాలకు తరలించాలని తీవ్ర నిరన చేపట్టారు. కేబీఆర్ పార్క్ వద్ద పెటా ఇండియా సభ్యులు, వీగన్స్ ఆఫ్ తెలంగాణ మద్దతుదారులు గురువారం ఆందోళన చేపట్టారు. పాలమూరు బయోసైన్సెస్‌లో 1200కి పైగా కుక్కలు, కోతులు, గొర్రెలు, పందులు తదితర జంతువులను బ్రీడింగ్, ప్రయోగాల పేరుతో బందీగా ఉంచారని ఆరోపించారు. 73 బీగిల్ కుక్కలను పునరావాసానికి అనుకూలమని సంస్థే గుర్తించినప్పటికీ, వాటిని విడుదల చేయకుండా నిరాకరిస్తోందని పేర్కొంది. -
నడిరోడ్డుపై కత్తితో గొంతుకోసి దారుణ హత్య
చిలకలగూడ: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన మేరకు.. ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు చెందిన బైక్ మెకానిక్ సయ్యద్ ఇలియాస్ (33), జమిస్తాన్‌పూర్‌కు చెందిన ఏసీ మెకానిక్ మహ్మద్ అలీమ్ (42), అదే ప్రాంతానికి చెందిన జహంగీర్ ముగ్గురు స్నేహితులు. మహ్మద్‌అలీమ్, జహంగీర్లు ఇతరులతో కలిసి నిత్యం పేకాట ఆడేవారు. జహంగీర్ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు మహ్మద్ అలీమ్ తిరిగి ఇవ్వలేదు. అడిగితే రేపు, మాపు అని తిప్పిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు స్నేహితులు కలిసి గురువారం సాయంత్రం పద్మారావునగర్‌లోని కేవీకే వైన్స్ వద్ద మద్యం తాగారు. సిట్టింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోమారు వాగ్వాదం జరిగింది. జహంగీర్, ఇలియాస్‌లు పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో మహ్మద్ అలీమ్పై దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో పడున్న అలీమ్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీఆస్పత్రికి తరలించారు. అప్పటికే మహ్మద్‌అలీమ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భధ్రపరిచారు. చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ రామకృష్ణలు ఘటన స్ధలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఫిర్యాదులు కుప్పలు.. అంతంతే చర్యలు
జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: మహా నగర పరిధిలో అనధికారిక నిర్మాణాలపై జీహెచ్ఎంసీకి కుప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. పరిష్కారం అంతంత మాత్రంగానే ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులతో సరిపెడుతోందని, అత్యంత స్వల్పంగానే ఉత్తర్వులు జారీ చేస్తోందని అభిప్రాయపడింది. ఇంత పెద్ద నగరంలో ఎక్కడా అనధికారిక నిర్మాణాలపై పూర్తి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా వెబ్సైట్ వివరాలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. కోఠిలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి అనధికారిక నిర్మాణం చేపట్టినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాము అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని స్పందన లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుకు ఇది నిదర్శమన్నారు. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేశారు. -
కొత్త రైళ్లకు నిధుల బ్రేక్
ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ ● పదేళ్లు గడిచినా ప్రతిపాదనలకే పరిమితం ● రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు రూ.491 కోట్లు సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ను నిధుల కొరత వెంటాడుతోంది. రెండోదశ విస్తరణలో భాగంగా కొత్త రైళ్లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన పదేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. నగరంలో ఎంఎంటీఎస్ ప్రాజెక్టును దక్షిణమధ్యరైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాయి. స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ని ఏర్పాటు చేశారు. 2003లో రూ.630 కోట్లతో 42 కి.మీ.వరకు చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టు విజయవంతమైంది. అదే పద్ధతిలో 2012లో రెండో దశకు శ్రీకారం చుట్టారు. మొత్తం 6 మార్గాల్లో 86 కి.మీ వరకు రెండోదశ విస్తరణకు చర్యలు చేపట్టారు. రూ.860 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టినా ప్రాజె క్టు నిర్మాణంలో జాప్యం కారణంగా రూ.1,305 కోట్లకు పెరిగింది. ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభు త్వం 2/3 వంతు, రైల్వేశాఖ 1/4వంతు చొప్పున నిధులను అందజేయాలి. ఈ లెక్కన రాష్ట్ర వాటా రూ.870 కోట్లు అందజేయాలి. ఇప్పటి వరకు పలు దఫాలుగా కేవలం రూ.379 కోట్లు ముట్టజెపిపంది. మరో రూ.491 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు లభించకపోయినా దక్షిణమధ్య రైల్వే సొంత నిధులను వినియోగించి కొత్త లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులను పూర్తి చేసింది. సర్వీసులు పెంచాలి.. ప్రస్తుతం 80 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. కోవిడ్‌కు ముందుకు 121 సర్వీసుల్లో సుమారు 1.6 లక్షల మంది పయనించారు. ఇప్పుడు ఆ సంఖ్య 45 వేలకు పడిపోయింది. కొత్తగా విస్తరించిన మార్గాల్లో సర్వీసుల సంఖ్యను పెంచేందుకు రైళ్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా ఎంఎంటీఎస్ రైళ్లలో అన్ని వర్గాల ప్రయాణికులకు ఉచిత సదుపాయం అందజేయాలంటే ఏటా రూ.10 కోట్ల చొప్పున టిక్కెట్ చార్జీలు పెంచాలి. అన్ని రూట్లలో సర్వీసులను పెంచాలి. ఇందుకోసం కనీసం 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం రెండోదశ ఒప్పందం ప్రకారం రూ.491 కోట్ల పెండింగ్ బకాయీలను చెల్లిస్తే ఆ నిధులతో కొత్త రైళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. -
18వ అంతస్తు నుంచి దూకి యువకుడి ఆత్మహత్య!
మణికొండ: తన బాబాయి ఇంటికి వచ్చిన ఓ యువకుడు 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీరంచెరువు పీబీఎల్ సిటీలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు.. సాయి ఆశీష్రెడ్డి(30) తన బాబాయి నివసిస్తున్న పీఈబీఎల్ సిటీకి గురువారం వచ్చాడు. అంతలో ఏమి జరిగిందో 18వ అంతస్తునుంచి దూకాడు. దాంతో అతని తలకు బలమైన గాయాలై చిత్రమయ్యింది. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
కల్తీ టీ పౌడర్ గుట్టురట్టు
గన్ ఫౌండ్రి: నగరంలో మరో భారీ కల్తీ టీ ఫౌడర్ దందా వెలుగు చూసింది. గురువారం హెచ్–ఫాస్ట్ బృందాలు ఏకకాలంలో నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేసి సుమారు 3 వేల కిలోల కల్తీ టీ పొడి, 1,500 కిలోల గడువు ముగిసిన టీ పొడి, వంద కిలోల బెల్లంతోపాటు కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నాయి. పదిమంది నిందితులను అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా పాత బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ వివరాలు వెల్లడించారు. కొంపల్లికి చెందిన పరీష్ రాజన్, పేట్లబురుజుకు చెందిన సంజు అలియాస్ పతి, ముషీరాబాద్‌కు చెందిన సతీష్, బోయిన్‌పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన నరసింహ, రాజేంద్రనగర్‌కు చెందిన చున్నీలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, బీదర్‌కు చెందిన రవీందర్, మల్లేపల్లికి చెందిన వసీం ముఠాగా ఏర్పడ్డారు. వీరు కోల్‌కతా, అస్సాం, కేరళ నుంచి నాసిరకం, వాడిన, గడువు తీరిన టీ పౌడర్లను సేకరిస్తున్నారు. వీటికి బెల్లంపాకంతోపాటు కొన్ని రసాయనాలను కలిపి బ్రాండెడ్ టీ పౌడర్ పేరిట రీ ప్యాకింగ్ చేసి రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లు, ఇతర దుకాణాల్లో విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నారు. కల్తీకి సంబంధించి ఏమైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా హెచ్ ఫాస్ట్ నెంబర్ 87126 61212 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. పదిమంది నిందితుల అరెస్ట్ మూడు వేల కిలోలసరుకు స్వాధీనం -
సదరన్ ట్రావెల్స్‌కు అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థల్లో ఒకటైన సదరన్ ట్రావెల్స్.. వియన్ ఐకానిక్ ట్రావెల్– టూరిజం సమ్మిట్–2026లో ప్రతిష్టాత్మకమైన ‘‘ప్రిఫర్డ్ ఇంటర్నేషనల్ టూర్ ఆపరేటర్’’అవార్డు అందుకుంది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ డైరెక్టర్ అశ్వినీ లోహాని, టూరిజం–హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్ చైర్పర్సన్ జ్యోతి మయాల్ ప్రదానం చేశారు. సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ ఆలపాటి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం గౌరవంగా ఉందని, ఈ గుర్తింపు వినియోగదారుల నమ్మకానికి, సిబ్బంది అంకితభావానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. 56 ఏళ్లు 2 వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజీలు, కార్పొరేట్ ట్రావెల్ సొల్యూషన్లు, కస్టమైజ్డ్ హాలిడే అనుభవాలను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
నల్లాలపై విజిలెన్స్
గ్రేటర్లో అక్రమ మోటార్లకు అడ్డుకట్టసాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం విస్తరిస్తోంది.. జనాభా పెరుగుతోంది.. కానీ నగర దాహం తీర్చే జల వనరులు మాత్రం పదేళ్ల నాటి లెక్కలకే పరిమితమయ్యాయి. సుదూర జలాశయాల నుంచి తరలిస్తున్న నీటి కోటాలో మార్పు లేకపోవడంతో అందుబాటులో ఉన్న జలాలను అందరికీ సమంగా పంచడం జలమండలికి కత్తిమీద సాములా మారింది. దీంతో ప్రతి వేసవిలో నీటి వృథా నియంత్రణ, అక్రమ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నీటి కేటాయింపులు లేకపోవడంతో ఉన్న వనరులనే పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సరఫరాలో అసమానతలను తొలగించేందుకు మండలి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. అక్రమ మోటార్లపై ‘సర్జికల్ స్ట్రైక్’ నల్లా కనెక్షన్లకు నేరుగా విద్యుత్ మోటర్లు బిగించి నీటిని లాగేసే వారిపై జలమండలి కన్నెర్ర చేసింది. పొరుగున ఉన్న ఇతర వినియోగదారులకు లో ప్రెషర్‌తో నీరు అందకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. నీటి సరఫరా సమయాల్లో విజిలెన్స్ బృందాలను రంగంలోకి దింపింది. అక్రమ మోటార్లను స్వాధీనం చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తోంది. సీజ్ చేసిన ప్రతి మోటారుపై వినియోగదారుడికి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు అధికారులు జరిమానా విధిస్తున్నారు. నీటి చౌర్యం కింద క్రిమినల్ కేసులూ నమోదు చేస్తున్నారు నీటివృథాపై జలమండలి కన్నెర్ర తెల్లవారుజామునే అధికారుల దాడులు నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు రంగంలోకి ‘వాటర్ వలంటీర్లు’ నీటిని వృథా చేస్తున్న సమాచారం అందించేందుకు జలమండలి ‘వాటర్ వలంటీర్ల’ను రంగంలోకి దింపుతోంది. పానీ యాప్ ద్వారా కచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేయాలని నిర్ణయించింది. వినియోగదారులు తాగునీటితో వాహనాలు కడగడం, గార్డెనింగ్‌కు వినియోగిస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాలు విధిస్తోంది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే ప్రతి వినియోగదారుడు స్వచ్ఛందంగా నీటిని పొదుపు చేసేలా అవగాహన కల్పిస్తోంది. నగరంలోని గాంధీనగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు తాగునీటి సరఫరా అవుతున్న నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. నివాస సముదాయాల్లో నల్లాలకు అక్రమంగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని తోడటాన్ని గుర్తించారు. సుమారు 17 మోటార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్షం రోజులుగా ఇదే తరహాలో జలమండలి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తోంది. -
ఈ–వేస్ట్‌లో మరో ముందడుగు
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సనత్‌నగర్: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) సరైన నిర్వహణలో జీహెచ్ఎంసీ మరో కీలక అడుగు పడింది. అమీర్‌పేటలోని హ్యాపీ, బిగ్‌సీ స్టోర్లలో ఈ–వేస్ట్ ఎకో సిస్టమ్ కార్యకమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్.. ఎర్త్ సెన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ–వేస్ట్ ఎకో సిస్టమ్ విధానాన్ని వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రజల నుంచి ఈ–వేస్ట్ సేకరణతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తుండగా, ఈ ప్రయత్నాలను దీర్ఘకాలికంగా కొనసాగించేందుకు ప్రత్యేకంగా ఈ–వేస్ట్ నిర్వహణ వ్యవస్థను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఈ కొత్త వ్యవస్థ ద్వారా పౌరులకు మూడు మార్గాల్లో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. -
కల్తీనూనె వంటకాలు.. షాప్ సీజ్
మోతీనగర్: కల్తీనూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు దాడి చేసి ఓ షాప్‌ను సీజ్ చేశారు. సీఐ ఎస్.వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కై త్లాపూర్ ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లోని నసీబ్ బైరిష్టా అనే షాపులో కొంతమంది వ్యక్తులు పాడైన, వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారిణి హృదయ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ నిర్వహించారు. వంద లీటర్ల మేర పాడైన వంటనూనెను స్వాధీనం చేసుకున్నారు. షాపును సీజ్ చేశారు. ఈ కల్తీ నూనెతో ఉల్లిపాయలు వేయించి పెద్ద హోటల్స్‌కు సప్లై చేసి బిర్యాని వంటకంలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారని పేర్కొన్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి ఫిర్యాదుతో అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైబర్ దొంగల బరితెగింపు..
ట్రేడింగ్ పేరిట రూ.12 లక్షలు స్వాహా కీసర: సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ పేరిట ఓ వ్యక్తి నుంచి రూ.12.94 లక్షలు దోచేశారు. కీసర పోలీసులు తెలిపిన మేరకు.. కీసర నాగారం సత్యనారాయణ కాలనీకి చెందిన మహేశ్వర్‌గౌడ్ ఫోన్నెంబరును సైబర నేరగాళ్లు రెండు వాట్సాప్ గ్రూప్స్‌లో చేర్చారు. నిరాలి సంఘీ, సుబ్రతా ముఖర్జీ పేరిట మాట్లాడారు. లాభాలు తెప్పిస్తామని..ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టాలని నమ్మించారు.వారి మాటలు నమ్మిన బాధితుడు మొబైల్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు.ఆ తరువాత రూ.40 వేలు జమ చేశాడు. అనంతరం రూ.15 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. అది నమ్మిన మహేశ్వర్ గౌడ్ రూ.12.94 లక్షలు జమచేశాడు. ఆ తరువాత డ్రా చేసుకునేందుకు యత్నించగా మరింత డబ్బు జమచేయాలని చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ ఉద్యోగం పేరిట మోసం.. సనత్‌నగర్: బేగంపేటకు చెందిన మంగళారపు శ్రీకాంత్‌కు టెలిగ్రామ్‌లో ఓ మెసేజ్ రావడంతో క్లిక్ చేశాడు. ఆరుషి మల్హోత్రాగా పరిచయం చేసుకున్న ఓ మహిళ.. సన్‌టెక్ ఇండియా, క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలలో పెట్టుబడితే 20 నుంచి 40 శాతం లాభాలు వస్తాయంటూ నమ్మబలికింది. ఆ తర్వాత మరో ఇద్దరు కూడా శ్రీకాంత్‌ను సంప్రదించారు. ఆన్లైన్ ఉద్యోగం పేరిట చిన్న చిన్న టాస్క్‌లు చేయించారు. మొదట శ్రీకాంత్ ఖాతాలో రూ.4,265 జమ చేశారు. అనంతరం వీఐపీ టాస్క్‌లు, ట్విన్ మిషన్ల పేరిట ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కోరారు. మోసగాళ్లు ఇచ్చిన లింక్‌ల ద్వారా శ్రీకాంత్ 15 సార్లు రూ.3,82,626 డబ్బు చెల్లించాడు.అయితే కేవలం రూ.11,630 మాత్రమే తిరిగి వచ్చాయి. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింక్ క్లిక్ చేస్తే రూ.91వేలు మాయం నాంపల్లి: శాంతినగర్‌కు చెందిన ఓ యువతి ఇటీవల బీటెక్‌ను పూర్తి చేసింది. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జాబ్ కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో సెర్చ్ చేస్తోంది.ఈ క్రమంలో చేస్తుండగా వచ్చిన ఓ లింకుపై క్లిక్ చేయగా ఆమె అకౌంట్లో నుండి రూ.91,500 మాయం అయ్యాయి. దీంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఐటీకే ఉద్యోగికి రూ.2.60 లక్షలు టోకరా ఉప్పల్: ఐటీ ఉద్యోగికి ఏపీకే ఫైల్ పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.60 లక్షలు అతని బ్యాంక్ అకౌంట్నుంచి స్వాహా చేశారు. ఉప్పల్ పోలీసులు తెలిపిన మేరకు.. సెవన్ హిల్స్ కాలనికి చెందిన సాయి కిరణ్‌కు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పంజాబ్ నేషనల్ బ్యాంకు క్రెడిట్ కార్డు విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పాడు. కొత్త క్రెడిట్ కార్డు కోసం వివరాలను ఇవ్వాలని కోరాడు. ఏపీకే ఫైల్ పంపి యాప్ ద్వారా వివరాలు పూర్తి చేయాల్సిందిగా కోరాడు. యాప్‌ను ఓపెన్ చేయగానే అనుమానం వచ్చి కాల్ కట్ చేసినా కూడా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.2,60,000 ఫిర్యాదు దారునికి తెలియకుండానే ఓటీపీలు చెప్పకుండానే ఖాతా ఖాళీ చేశాడు. దీంతో బాధితుడు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడు. నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రతిరోజూ అవగాహనకార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తులుపంపిన లింకులను ఓపెన్ చేసి.. తీరా డబ్బు పోయిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో నలుగురిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. -
అమ్మవారి విగ్రహం చోరీ
గంటలోపు నిందితుడి అరెస్ట్ బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీ పార్థివాడలోని శ్రీ అడవి మైసమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని చోరీ చేశాడు. దీంతో గాంధీనగర్ పోలీసు అధికారులు దేవాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.అడిషినల్ డీసీపీ నర్సయ్య ఆలయాన్ని సందర్శించారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి గంటలోపే నిందితుడిని అరెస్టు చేసి విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించన్నట్లు దేవాలయం ప్రతినిధులు చెప్పారు. నిందితుడు గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని..ఆటోలో వచ్చి చోరీ చేశాడని పోలీసులు గుర్తించారు. -
నాటు తుపాకీ విక్రయించేందుకు యత్నం
● ఇద్దరి అరెస్ట్ కుత్బుల్లాపూర్: నాటు తుపాకీ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవవవేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నాటు తుపాకీ విక్రయిస్తుననారని పోలీసులకు సమాచారం అందింది. దూలపల్లిలోని వికాస్ గ్యాస్ గోదాము వద్ద నిఘా పెట్టగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని ఆదుపులోకి తీసుకొని విచారించగా తుపాకీ విక్రయం వ్యవహారం బయట పడింది. నిందితులు బీహార్‌కు చెందిన వికాస్కుమార్(22), వంశరాజ్(31) గా గుర్తించారు. వీరు స్థానికంగా కూలీలుగా పనిచేచేస్తున్నారు. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి సిటీలో విక్రయించాలని ప్లాన్ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.7.65 ఎంఎం నాటు తుపాకీతోపాటు 8 బుల్లెట్లు, రెండు ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఎవరెవరికి ఆయుధాలను విక్రయించారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. పరీక్షలు రాస్తూ.. చోరీలు చేస్తూ.. ● ముగ్గురు టెన్త్ విద్యార్థుల అరెస్ట్ మూసాపేట: పదవ తరగతి పరీక్షలు రాస్తూనే బైక్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు బాలురు కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలోనే కూకట్పల్లి బాలాజీనగర్ ఫ్రీడమ్ పార్కు, సప్తగిరి కాలనీ, గాయత్రినగర్, బాలాజీనగర్‌లో పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను దొంగతనం చేశారు. కూకట్పల్లి బస్‌స్టాప్ వద్ద డిటెక్టివ్ ఎస్ఐ రవీందర్ రెడ్డి నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ద్విచక్రవాహనాలు మాయం చేసినట్లు ఒప్పుకున్నారు.వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని ముగ్గురినీ సోమవారం జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో నటి అనసూయ భరద్వాజ్‌ను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటిగా గుర్తించామని డీసీపీ టి.సాయి మనోహర్ సోమవారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి పలువురు వ్యక్తులు సోషల్‌మీడియా పేజీల్లో నటి అనసూయ భరద్వాజ్‌పై అనుచిత, అసభ్యకర పోస్టు చేస్తున్నారు. దీనిపై అనసూయ ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు చంటిని అరెస్టు చేశారు. ఇతడు తన ఇన్‌స్టా ఖాతాలో అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు గుర్తించారు. -
అండర్ గ్రౌండ్ కేబుల్స్ నుంచి మంటలు
అడ్డగుట్ట: ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో ఆదివారం రాత్రి అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో రెండు వారాల క్రితం సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పది రోజులుగా రోడ్డు తవ్వకాలు జరుగుతున్నాయి. విద్యుత్ స్తంభం నుంచి స్థానికంగా ఉండే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సరఫరా అయ్యే విద్యుత్‌కు సంబంధించి ప్యానల్ బోర్డుకు అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్ అమర్చారు. అయితే రోడ్డు తవ్వుతున్న సమయంలో ప్యానల్ బోర్డుకు సంబంధించిన కేబుల్స్ బయటకు వచ్చాయి. సంబంధిత విద్యుత్‌శాఖ అధికారులకు రోడ్డు కాంట్రాక్టర్ సమాచారం ఇవ్వలేదు. ఆదివారం కురిసిన వర్షం కారణంగా వర్షపు నీరు సదరు కేబుల్స్‌లోకి వెళ్లడంతో రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.సకాలంలో విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో మంటలు ఆగిపోయాయి. ఆజాద్ చంద్రశేఖర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద తప్పిన ప్రమాదం భయాందోళనకు గురైన నిర్వాసితులు రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం -
జలమండలికి అవార్డులు
సాక్షి,సిటీబ్యూరో: జలమండలి దక్కించుకున్న మూడు పీఆర్ఎస్ఐ అవార్డులను సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డికి అందించారు. రాష్ట్రీయ స్థాయిలో బెస్ట్ బ్రోచర్, కార్పొరేట్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం, బెస్ట్ లేఅవుట్, డిజైన్ కేటగిరీలో పోస్టర్ కేటగిరీల్లో జలమండలి బహుమతులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) ద్వారా అందుకున్న అవార్డులను ఎండీకి అందజేశారు. కార్యక్రమంలో సీజీఎంలు కిరణ్ కుమార్, రాజ శేఖర్, పీఆర్వో సుభాష్, గ్రౌండ్ వాటర్ ఎక్స్ పర్ట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2న హైబిజ్ టీవీ మీడియా అవార్డులు సాక్షి, సిటీబ్యూరో: మీడియా రంగంలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ప్రతిష్టాత్మక హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2026 (6వ ఎడిషన్)ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం మే 2న హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నామన్నారు.ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, డిజిటల్ మీడియా విభాగాల్లో జర్నలిజం, అడ్వర్టైజ్మెంట్, సర్క్యులేషన్ వంటి కేటగిరీల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. 50కి పైగా విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నలుగురు ప్రముఖ జర్నలిస్టులకు లెజెండరీ పురస్కారాలు అందజేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఏప్రిల్ 26లోపు 8096974747 వాట్సాప్ నంబర్‌కు పంపించాలన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు రూ.2.5లక్షల విలువైన స్కాలర్షిప్స్ అందజేస్తామన్నారు. దక్షిణమధ్య రైల్వేకు పీఆర్ఎస్ఐ పురస్కారాలుసాక్షి, సిటీబ్యూరో: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో, దక్షిణ మధ్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి పురస్కారాలు లభించాయి. ‘‘తెలంగాణ రైజింగ్ 2047: కమ్యూనికేషన్, ఇన్నోవేషన్,ఎంపవర్మెంట్’’ అనే థీమ్‌తో నిర్వహించిన 4వ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డులను అందజేశారు. మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు. -
567 కేసులు.. రూ.1.1 కోట్ల సరుకు
సాక్షి, సిటీబ్యూరో: విద్యా సంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయానికి చెక్ చెప్పడానికి నగర పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో తనిఖీలు చేశారు. శనివారం నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పాన్‌డబ్బాలు, కిరాణా దుకాణాల్లో సోదాలు చేసిన అధికారులు 567 కేసులు నమోదు చేసి, రూ.1.1 కోటి విలువైన పొగాకు ఉత్పత్తులు సీజ్ చేసినట్లు కొత్వాల్ వీసీ సజ్జనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి దిగడానికి విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న దుకాణాలూ కారణమని అధికారులు గుర్తించారు. అనేక కేసుల దర్యాప్తులో భాగంగా గంజాయి, డ్రగ్స్ బానిసలు తాము సిగరెట్లతో మొదలుపెట్టే ఈ విషవలయంలో చిక్కుకున్నట్లు బయటపెట్టారు. దీంతో విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతోనే ఈ ఆపరేషన్ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై కేసులు నమోదు చేసి, నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. అత్యధికంగా చార్మినార్ జోన్ పరిధిలో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్రనగర్ పరిధిలో 102, గోల్కొండ పరిధిలో 98, ఖైరతాబాద్‌లో 78, సికింద్రాబాద్‌లో 64, జూబ్లీహిల్స్ లో 54, శంషాబాద్‌లో 52 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఐదు వేల మందికి పైగా సిబ్బంది, అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేశారు. లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, రిజర్వ్ పోలీసులతో కూడిన బృందాలు తనిఖీలు చేశాయి. విద్యాసంస్థల సమీపంలోని దుకాణ యజమానులు అందరూ కోప్టా చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలు లేదా ఇతర విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా సిగరెట్లు, గుట్కా, ఈ–సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే 100కు లేదా 8712661601కు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో పాల్గొన్న సీపీ నగర వ్యాప్తంగా పాఠశాలల వద్ద పొగాకు దందా విక్రేతల గురించి తెలిస్తే సమాచారం ఇవ్వండి : కొత్వాల్ సజ్జనర్ -
‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సిబ్బంది సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. నారాయణ స్కూల్ గేట్‌కు తాళం మేడిపల్లి: బోడుప్పల్‌లోని నారాయణ స్కూల్ ప్రధాన గేటుకు భవన యజమానులు సోమవారం తాళం వేశారు.ఒప్పందం ముగియడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు.అయితే 2027 మార్చి వరకు ఒప్పందం ఉందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తాము పదేళ్ల లీజుకు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. -
వేర్వేరు చోట్ల ముగ్గురి బలవన్మరణం
సంతానం లేదని గృహిణి.. రాజేంద్రనగర్ : బండ్లగూడ ఎన్ఎఫ్సి కాలనీలో శివ, సుమలత (36) దంపతులు నివాసముంటున్నారు. అనారోగ్య సమస్యలతో పాటు సంతానం కలగలేదని తరచూ సుమలత బాధపడేది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పంచానామ నిర్వహించి బృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి.. మల్కాజిగిరి: న్యూ వెంకటేశ్వరనగర్‌కు చెందిన కోడాటి మధుమోహన్(41) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధుమోహన్ పై గృహహింస కేసు ఉండడంతో పెద్ద మనుషులు సర్దిచెప్పారు. ఈ నెల 19వ తేదీ మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా కవిత పిల్లలతో కలిసి తుకారాంగేట్‌లో పుట్టింటికి వెళ్లింది. 20న మధుమోహన్ పనిచేసే సంస్థలో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. కిటికీకి తాడుతో ఉరి వేసుకున్నట్లు గమనించి అతని సోదరుడు కనకేష్కు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఎన్బీటీనగర్లో విద్యార్థి.. బంజారాహిల్స్: బంజారాహిల్స్ ఎన్బీటీనగర్లో నివసించే దంతాల సంజయ్‌కుమార్ (23) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–4లోని జీవీకే మాల్ ఎదురుగా హెబిటట్ కేఫ్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. కొంతకాలంగా ముభావంగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడడం లేదు. సోమవారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ శ్రీనివాస్ సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.కుటుంబసమస్యలు, వ్యక్తిగత కారణాలతో నగరంలో పలుచోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. రాజేంద్రనగర్, మల్కాజిగిరి,బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి. -
లో ప్రెషర్‌తో నగరవాసుల ఇక్కట్లు
సాక్షి,సిటీ బ్యూరో: మహా హైదరాబాద్ పరిధిలో తాగునీటి సరఫరాలో లోప్రెషర్’(తక్కువ పీడనం)పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు వేసవి ఉష్ణతాపానికి తాగునీటి అవసరాలు పెరుగుతుండగా, మరోవైపు కొందరు నల్లాలకు అక్రమంగా వి ద్యుత్ మోటార్లు బిగిస్తున్నారు. నీటిని స్పీడ్‌గా లాగేయడం సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగునీటి డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యత దెబ్బతింటోంది. ప్రధాన ప్రాంతాల నుంచి శివారు కాలనీల వరకు ‘లోప్రెషర్’సమస్య వెంటాడుతోంది. ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న కాలనీల చివరి ఇళ్లకు నీరు అందని పరిస్థితి నెలకొంది. అంబర్పేట్, ఖైరతాబాద్, బాలానగర్, ఉప్పల్ కూకట్పల్లి, రాజేంద్రనగర్ పరిధిలోని కొన్ని కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. నీరు సరిగా అందక నగరవాసులు అల్లాడుతున్నారు. అక్రమ మోటార్ల వినియోగం.. నీటి సరఫరా సమయంలో నల్లాలకు నేరుగా ఎలక్ట్రిక్ మోటార్లు బిగించి నీటిని లాగేస్తుండటంతో పక్కన ఉన్న ఇళ్లకు ప్రెషర్ తగ్గి నీరు అందడం లేదు. నగరవ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటి వేల సంఖ్యలో బోర్లు ఎండిపోవడంతో నివాస సముదాయాలు నల్లా నీటి సరఫరాపైనే ఆధారపడుతున్నాయి. సాధారణ గృహ అవసరాలకు వాడే మోటార్లతోపాటు మరింత వేగంగా నీటిని తోడేసేందుకు హై–స్పీడ్, ఆటోమేటిక్ మోటార్లు, కొన్నిచోట్ల వ్యవసాయ రంగానికి చెందిన హై–హార్స్పవర్ (2 హెచ్‌పీ అంతకంటే ఎక్కువ) సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా అక్రమంగా అమర్చుతున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన విజిలెన్స్ జలమండలి విజిలెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అక్రమంగా పైపులకు మోటార్లు బిగించేవారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. గత పక్షం రోజుల్లో మెట్రో కస్టమర్ కేర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఽఆధారంగా దాడులు చేయగా పదుల సంఖ్యలో అక్రమ మోటార్ల వ్యవహారం బయటపడింది. రామంతాపూర్ ఉప్పల్, శివనగర్, ఉప్పర్‌పల్లి, ఎస్ఆర్నగర్ తదితర ప్రాంతాల్లో నల్లాలకు అక్రమంగా బిగించిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో తాగునీటి సరఫరా ఇలా .. (ఎంజీడీల్లో) మొత్తం సరఫరా 582.86 కోర్ సిటీ 221.52 జీహెచ్ఎంసీ 203.33 ఓఆర్ఆర్ 86.74 ట్రాన్స్మిషన్ 49.27 ఆర్డబ్ల్యూఎస్ 22.00 ఎత్తైన ప్రాంతాలకు అందని నీరు మరోవైపు నల్లాలకు అక్రమంగా మోటార్లు రంగంలో దిగిన విజిలెన్స్ బృందాలు -
పారిపోయి.. అంతలోనే పట్టుబడి..
ఎస్కార్ట్ వాహనం నుంచి దూకి రిమాండ్ ఖైదీ పరారీ● పెట్రోలింగ్ పోలీసుల సాయంతో నిందితుడి పట్టివేత ● కోర్టు విచారణ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలిస్తుండగా ఘటన సైదాబాద్: సినీఫక్కీలో ఎస్కార్ట్ వాహనం నుంచి కిందికి దూకి పారిపోయిన ఓ రిమాండ్ ఖైదీ కొద్దిసేపటికే పెట్రోలింగ్ సిబ్బంది చేతికి చిక్కాడు. వివరాలు... బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన ఏ–1 సాదుల నరేష్(24), ఏ–2 భూక్యా వంశీ (23), ఏ–3 మల్లెం వంశీ(23)లు ఇటీవల అరెస్ట్ అయ్యారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిని సోమవారం పోలీసులు పీటీ వారెంట్‌పై పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం కోర్టుకు తరలించారు. విచారణ ముగిసిన తర్వాత ఎస్కార్ట్ పోలీసులు వారిని తిరిగి వాహనంలో జైలుకు తరలిస్తుండగా సైదాబాద్ క్రాస్‌రోడ్ సమీపంలోకి రాగానే నరేష్, మల్లెం వంశీ ఒక్కసారిగా ఎస్కార్ట్ పోలీసులను తోసేశారు. డోర్ తీసుకొని పారిపోయేందుకు యత్నించిన వంశీని అడ్డుకోగా, నరేష్ కిందికి దూకి పరారయ్యాడు. వెంటనే ఎస్కార్ట్ పోలీసులు డబీర్‌పురా పోలీసులను అప్రమత్తం చేశారు. కొద్దిసేపటికే నల్లగొండ చౌరస్తా సమీపంలో తమను చూసి దాచుకోవటానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని డబీర్‌పురా పెట్రోలింగ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎస్కార్ట్ వాహనం నుంచి పరారైన రిమాండ్ ఖైదీ నరేష్ అని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేజారిన ఖైదీ మళ్లీ చిక్కడంతో ఎస్కార్ట్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఖైదీల చేతులకు బేడీలు లేకపోవడమే వారు పారిపోయేందుకు అవకాశం ఏర్పడిందని తెలుస్తోంది. -
కథ.. కాంబోడియా నుంచే!
సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన ఆ దేశం ● టెలిగ్రాం గ్రూపుల ద్వారా నగరంలోని దళారులకు ఎర ● వీరి సాయంతో బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలు సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో ప్రతి మూడు సైబర్‌నేరాల్లో రెండు.. కాంబోడియా కేంద్రంగానే సాగుతున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి, గతవారం ఆక్టోపస్ పేరుతో చేపట్టిన ఆపరేషన్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన సైబర్ నేరాల దర్యాప్తు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కీలక సూత్రధారులు అంతా ఆ దేశంతోపాటు మయన్మార్‌లో ఉంటుండగా.. టెలిగ్రాం గ్రూపుల ద్వారా పాత్రధారులను ఎంపిక చేసుకుని కథ నడిపిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, బ్యాంకింగ్ విధానాల్లో లోపాలు సైతం వీరికి కలిసివస్తున్నాయి. ‘ఆపరేషన్ ఆక్టోపస్–2.0’లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన 52 మంది నిందితుల్లో 32 మంది బ్యాంకు అధికారులే ఉండటం గమనార్హం. ఈ అంశాలను వివరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు హైదరాబాద్ పోలీసులు లేఖ రాస్తున్నారు. బుధవారం వివిధ బ్యాంకుల రీజినల్ హెడ్స్‌తో సమావేశం నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే కార్డులు, కాలర్లు... కాంబోడియాలో ఉన్న సూత్రధారులు నగరం నుంచే సిమ్‌కార్డులు, కాల్ సెంటర్లో పనిచేసే టెలీకాలర్లను తీసుకువెళ్తున్నారు. ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డుల ద్వారా వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని, కాంబోడియా నుంచే టెలీకాలర్ల ద్వారా ఫోన్లు చేయించి బాధితుల నుంచి నగదు కాజేస్తున్నారు. వీరి నుంచి డబ్బు డిపాజిట్‌కు, ఆ మొత్తం విత్‌డ్రాకు, క్రిప్టో కరెన్సీగా మార్చడానికి వీరికి మ్యూల్ ఖాతాలు అనివార్యం. టెలిగ్రాం గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తూ కమీషన్ ఆశ చూపి ఎంపిక చేసుకుంటున్నారు. బాధితులు ఈ ఖాతాల్లో డిపాజిట్ చేసే డబ్బు నుంచి ఖాతాదారుడు, దళారి తమ కమీషన్లు తీసుకుంటున్నారు. మిగిలిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు తరలించేందుకు ప్రత్యేక నెట్వర్క్ పని చేస్తోందని పోలీసులు చెప్తున్నారు. సైబర్ నేరాలకు చెక్ చెప్పడానికి ఇటీవల కాంబోడియాలో అమలులోకి వచ్చిన కొత్త చట్టం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తే పదేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధిస్తారు. అరెస్టు అయిన బ్యాంకు అధికారులు.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బ్యాంకు అధికారుల్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లకు చెందిన మేనేజ ర్లు, కేవైసీ అప్రూవర్, క్లర్కులు, ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరి పాత్రను వివరిస్తూ ఆయా బ్యాంకులకు పోలీసు అధికారులు లేఖలు రాశారు. -
‘నారీశక్తి వందన్’.. మోదీకి వందనం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు చందానగర్: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. గురువారం చందానగర్‌లో నారీశక్తి వందన్ పాదయాత్రను మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఓట్ల కోసం మాత్రమే కొన్ని పార్టీలు వాడుకున్నాయని, అమలు చేయడానికి ధైర్యం చూపిన ఏకై క నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని అన్నారు. అనంతరం చందానగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బీహెచ్ఈఎల్ చౌరస్తా వరకు పాదయాత్రలో ఆయన ముందుకు సాగారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజిత్ కుమార్ సేనాపతి, జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
న్యూరో సర్జరీలో రోబోటిక్ మైక్రోస్కోప్ ప్రారంభం
సనత్‌నగర్: బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ న్యూరో సర్జరీలో అత్యాధునిక జైస్ కినెవో 900 రోబోబోటిక్ మైక్రోస్కోప్‌ను గురువారం ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏవీ గురువారెడ్డి ప్రారంభించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక సాంకేతికతతో క్లిష్టమైన మెదడు, వెన్నెముక శస్త్ర చికిత్సల్లో భద్రత, ఖచ్చితత్వం, మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. ఇలాంటి ఆధునిక రోబోటిక్ మైక్రోస్కోప్ దేశవ్యాప్తంగా కొద్ది కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా వాస్క్యులర్ న్యూరో సర్జరీతోపాటు ట్యూమర్ ఫ్లోరసెన్స్ –ట్యూమర్ కణజాలాన్ని ఆరోగ్యకరమైన మెదడు కణజాలం నుంచి వేరు చేయడంలో సహాయపడుతుందన్నారు. సీనియర్ కన్సల్టెంట్, న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ నవీన్ మెహ్రోత్రా మాట్లాడుతూ 3డీ, 4కే విజువలైజేషన్‌తో శస్త్ర చికిత్స బృందం మొత్తం ప్రక్రియను అత్యంత సమర్ధవంతంగా నిర్వర్తించగలదని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యూరో ఫిజీషియన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సీహెచ్ గోపాల్, మోహన శశాంక్ దివి, డాక్టర్ వినోద్‌కుమార్, డాక్టర్ నివేదిత సాయిచంద్ర తదితరులు పాల్గొన్నారు. బేగంపేట కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి -
పెళ్లంటూ మోసగించి రూ.కోటి కాజేశాడు..
పంజగుట్ట: నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి మతం మారినట్లు బోగస్ సర్టిఫికెట్ చూపించి తనను మోసగించి పెళ్లి చేసుకుని, కోటి రూపాయల వరకు కాజేశాడని ఓ బాధితురాలు (26) ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్‌పల్లికి చెందిన బాధితురాలు మాట్లాడుతూ తాను సాఫ్ట్వేర్ డవలపర్నని, కూకట్‌పల్లిలో తన ఇంటి కింద ఉన్న షాపులో నవాజ్ ట్రేడింగ్ సొల్యూషన్ ఆఫీస్ పెట్టుకుంటానని 2025 మే నెలలో వచ్చి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. కొన్ని రోజులకే వివాహం చేసుకుంటానని తన వెంటపడ్డాడని పేర్కొంది. హిందువుగా మతం మారానని బోగస్ సర్టిఫికెట్ చూపించడంతో నమ్మి గత ఏడాది జూలైలో వివాహం చేసుకున్నట్లు చెప్పింది. వివాహమైనరోజే బేగంపేటకు తీసుకువెళ్లి తనకు జ్యూస్‌లో మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయాక నవాజ్ సోదరులతో సామూహిక అత్యాచారం చేయించాడని తెలిపింది. శంషాబాద్‌లో ఉన్న తమ ఫ్లాట్ అమ్ముకున్నాడని, తమ బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నాడని, మొత్తం కోటి రూపాయల వరకు మోసం చేశాడని బాధితురాలు పేర్కొంది. అతనికి అంతకు ముందే రెండు వివాహాలైనట్లు, పిల్లలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత తెలిసిందన్నారు. గట్టిగా ప్రశ్నించగా, తన చెల్లిని కూడా ఇలానే గ్యాంగ్ రేప్ చేయిస్తానని, అమ్మను చంపి సహజ మరణంగా చిత్రీకరిస్తానని బెదిరించాడని తెలిపింది. దీంతో తాను కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితునిపై కేసు నమోదైందని పేర్కొంది. సనత్‌నగర్: యువతిని మోసగించిన కేసులో నవాజ్‌తోపాటు అతని సోదరులు ఇస్మాయిల్, లీలాపుద్దీన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న స్నేహితులు షారూక్, మునావర్ల కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో నవాజ్ తల్లి, ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే రిమాండ్‌లో ఉన్న నవాజ్, ఇస్మాయిల్, లీలాపుద్దీన్‌లను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న అనంతరం అన్ని కోణాల్లో పోలీసులు విచారించనున్నారు. బాధితురాలి తల్లి పేరుపై ఉన్న ఇంటిని నవాజ్ వేరొకరికి విక్రయించిన విషయంపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోలీసులు లేఖ రాసినట్లు తెలిసింది. విలేకరుల సమావేశంలోబాధితురాలి ఆవేదన -
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
మన్సూరాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడంటూ అతడి బంధువులు, స్నేహితులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. రోగి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బలుపాల గ్రామానికి చెందిన చిక్కా నరేష్(38) కొంతకాలంగా కుంట్లూర్‌లోని నారాయణ కాలేజీలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. నరేష్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. గుండెలో నొప్పి వస్తోందంటూ అతడు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించాడు. వైద్యులు పరీక్షించి గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు అతడు ఈ నెల 11న శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేరాడు. బుధవారం ఉదయం 8.30 గంటలకు వైద్యులు శస్త్రచికిత్సను ప్రారంభించారు. అయితే బుధవారం రాత్రి 9.30 గంటలకు నరేష్ మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. కాగా, అనుభవంలేని జూనియర్ డాక్టర్లు శస్త్రచికిత్స చేయడం వల్లే నరేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతడి బంధువులు, నారాయణ కాలేజీ సిబ్బంది పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో ఎల్బీనగర్ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని బందోబస్తు చేపట్టారు. అదుపులేని రక్తస్రావం వల్లే.. నరేష్‌కు బెంటాల్ సర్జరీ పూర్తయినప్పటికీ, అదుపులేని రక్తస్రావం తలెత్తడంతో విషాదం జరిగిందని, వైద్యపరంగా ఉత్తమ చికిత్సను అందించామని వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం, జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించారనే ఆరోపణలో నిజం లేదని కామినేని హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన -
మోయ‘బడి’...
నాంపల్లి: విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బడిలో పిల్లలు బరువుపనుల్లో నలిగిపోతున్నారు. ఆయాలు, సబార్డినేట్లు చేయాల్సిన పనులను విద్యార్థులకు అప్పగిస్తున్నారు రెడ్‌హిల్స్‌లోని సైఫాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో. ఉపాధ్యాయులే వీరి చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా వాహనాల్లో వచ్చే ఆహార పదార్థాలను పిల్లలే పాఠశాల లోపలికి మోసుకొస్తున్నారు. అన్నం, గుడ్లు, పప్పు వంటి వాటిని లోనికి తెచ్చుకుని, ఎవరికివారే వడ్డించుకుంటున్నారు.నల్లా దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధికారి వివరణ.. నాంపల్లి మండల డిప్యూటీ ఈవో వీరలక్ష్మిని వివరణ కోరగా.. ఆ విషయం తన దృష్టికి రాలేదని, త్వరలోనే పాఠశాలను సందర్శించి విచారణ చేపడతానని చెప్పారు. విద్యార్థులతో పాఠశాలలో పనిచేయించడం తప్పేనని, విచారణలో ఆ విషయం తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. -
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మేడ్చల్ రూరల్ : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 252 జీవోలో..అవసరమైన మేరకు సవరణలు చేసి డీపీఆర్‌ఓలకు పంపిస్తామన్నారు. గురువారం శామీర్‌పేట్‌లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన నిర్వహించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులకు జారీ చేసే అక్రెడిటేషన్ కార్డుల విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, గతంలో కంటే మెరుగైన జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. జర్నలిజంతో సంబంధం లేని వారికి అక్రెడిటేషన్లు జారీ కాకుండా యూనియన్ బాధ్యులు జాగ్రత్త వహించాలని సూచించారు. కమిటీ సభ్యులకు త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సంఘం సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ మాజీద్ పాల్గొన్నారు. -
ఉస్మానియా మెడికో ఆత్మహత్య
మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇచ్చుకుని.. మాత్రలు వేసుకుని..అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆస్పత్రి పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ కుమార్ (26) బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. సీనియర్లు పెట్టిన పని ఒత్తిడి తట్టుకోలేక తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఆరోపిస్తుండగా.. కోర్సుపై అతడికి ఆసక్తి లేకపోవడంతో ఒత్తిడికి గురై ప్రాణం తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జడ్చర్లకు చెందిన సురేష్‌కు పీజీ నీట్ ద్వారా ఉస్మానియాలో సర్జరీ విభాగంలో సీటు వచ్చింది. దాదాపు పది నెలల క్రితం కోర్సులో చేరిన అతను ఆఖరి కౌన్సెలింగ్ వరకు కోర్సు మార్చుకోవడానికి ప్రయత్నించారు. మూడు రౌండ్లలోనూ అది సాధ్యం కాలేదు. నిబంధనల ప్రకారం కోర్సు మధ్యలో వదిలి వెళ్లాలంటే భారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ గదిలో అచేతనంగా.. ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన సురేష్ బుధవారం రాత్రి ఎక్కువ మోతాదులో మత్తు ఇంజెక్షన్లు, మాత్రలు వేసుకుని తన హాస్టల్ గదిలో ఉన్నారు. గురువారం ఉదయం ఆయన తల్లి, కుటుంబీకులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇక్కడ ఉన్న సురేష్ స్నేహితులకు కుటుంబీకులు విషయం తెలిపారు. వాళ్లు వెళ్లి సురేష్ గది తలుపులు తెరిచి చూడగా అచేతనంగా పడి ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సురేష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. బంధువులు, సహచరుల ఆందోళన.. ఆస్పత్రి వద్ద సురేష్ కుటుంబీకులతో పాటు సహచర విద్యార్థులు నిరసనకు దిగారు. సీనియర్లు అతనితో ఎక్కువ పని గంటలు పని చేయించారని, సుదీర్ఘంగా డ్యూటీలు వేశారని, ఆ ఒత్తిడి తట్టుకోలేకే సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు మృతదేహానికి పోస్టుమార్టం పరీక్షలు చేయనీయమని అడ్డుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పి, పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందించారు. సురేష్ ఆత్మహత్యపై కుటుంబీకులు చేస్తున్న ఆరోపణల్నీ పరిగణనలోకి తీసుకున్నామని, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని అధికారులు ప్రకటించారు. -
శభాష్ రాముడు
అంబర్‌పేట: అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన కరుడుగట్టిన నేరస్తుడు అబ్దుల్ మన్నన్‌ను పట్టించిన ఆర్మీ మాజీ జవాన్ రాముడిని కొత్వాల్ వీసీ సజ్జనర్ గురువారం సన్మానించారు. అంబర్‌పేట ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద మంగళవారం రాముడు బస్సు దిగుతున్నారు. ఆ సమయంలో ఆయన మెడలోని బంగారు గొలుసు లాక్కుపోవడానికి మన్నన్ ప్రయత్నించగా రాముడు ప్రతిఘటించారు. తన వయస్సును కూడా లెక్కచేయకుండా అతడిని ఒడిసిపట్టుకున్నారు. డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న అంబర్‌పేట పెట్రోలింగ్ సిబ్బంది నిమిషాల వ్యవధిలో అక్కడకు చేరుకుని మన్నన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మల్లేపల్లికి చెందిన ఇతడిపై 31 పాత కేసులు ఉన్నాయి. అబ్దుల్ మన్నన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఇతడి అనుచరులు కోటేష్, మల్లేష్ కోసం గాలిస్తున్నారు. రాముడితోపాటు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించిన ఎస్సై సురేష్, కానిస్టేబుళ్లు దినేష్‌రెడ్డి, భరత్ కుమార్‌లను కొత్వాల్ గురువారం బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌కు పిలిపించి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీ సెల్ డీసీపీ సీహెచ్ రూపేష్ పాల్గొన్నారు. కరుడుగట్టిన నేరస్తుడినిపట్టించిన రిటైర్డ్ ఆర్మీ జవాను అభినందించిన సీపీ సజ్జనర్ -
అంతారాలు
ఒకవైపు ఉన్నత వర్గాలు.. మరోవైపు పేదలు సాక్షి, సిటీబ్యూరో నగరం విభిన్న అంశాల సమాహారం. ఏ రంగంలో చూసినా, ఏ అంశంలో చూసినా ఈ విషయమే తేటతెల్లమవుతుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ‘సోషియో– ఎకనమిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే–2024’ సైతం ఇదే అంశాన్ని వెల్లడించింది. నగరంలోని అసమానతలు, ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవని స్పష్టం చేసింది. సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కులాలు, ఆదాయ స్థాయి, నివాస సదుపాయాల విషయంలో స్పష్టమైన అసమానతలు ఉన్నట్టు బయటపడింది. ఒకవైపు అధిక ఆదాయ వర్గాలు, మరోవైపు మౌలిక వసతుల కోసం పోరాడే వర్గాలున్న నగర భిన్న రూపం వెల్లడైంది. సర్వే మేరకు పట్టణ గృహాలు 20,17,409. బీసీల్లో ముస్లిం మైనార్టీలను, మైనార్టీయేతరుల వారీగానూ వివరాలు పొందుపర్చారు. ఎస్సీల గృహాలు 2,19,587, ఎస్టీల గృహాలు 55,017, ముస్లిం మైనార్టీలో బీసీల గృహాలు 3,65,578 ఉన్నాయి. కులాల వారీగా విభజన కులాల వారీగా చూస్తే బీసీలే అధికం. గృహాల పరంగా చూస్తే బీసీలు గృహాలు దాదాపు 29.58% ఉండగా, ఓసీ వర్గాలవి 38.68% ఉన్నాయి. ముస్లిం మైనారిటీలవి 25.40% వాటా కలిగి ఉండటం నగర ప్రత్యేకతను చూపుతోంది. ఎస్సీలు, ఎస్టీల గృహాలు వీరికంటే తక్కుగా ఉన్నాయి. కొన్ని వర్గాలకు చెందిన కుటుంబాలు అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లలో నివసిస్తుండగా, మరికొన్ని వర్గాలు కనీస సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తున్నాయి. ఉన్నత వర్గాల్లో ఎక్కువ గదులతో విశాలమైన ఇళ్లు కనిపిస్తుండగా.. వెనుకబడిన వర్గాల్లో ఒకటి లేదా రెండు గదుల ఇళ్లలోనే జీవిస్తున్నాయి. పిల్లలు తక్కువే.. 0–5 ఏళ్ల చిన్నారులు జీహెచ్ఎంసీ జనాభాలో 6.8% మాత్రమే. దీనిని జనన రేటు తగ్గుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నగరంలో పక్కా ఇళ్ల సంఖ్య పెరిగినా, అద్దె ఇళ్లపై ఆధారపడే కుటుంబాలు కూడా గణనీయంగా ఉన్నట్టు సర్వే నివేదిక సూచించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి ఉన్నప్పటికీ, సమాన అవకాశాల విషయంలో ఇంకా పెద్ద సవాళ్లు ఉన్నాయని నివేదిక తేటతెల్లం చేసింది. కొన్ని కులాల యువతలో ఆంగ్ల మాధ్యమ విద్య ఎక్కువగా ఉండగా, మరికొన్ని వర్గాల్లో అది చాలా తక్కువగా ఉంది. కొందరికి సమకూరుతున్న సకల వసతులు మరికొందరి పరిస్థితి జీవన పోరాటం అభివృద్ధితో పాటు అసమానతలు సైతం.. కులాల వారీగా బీసీ జనాభే అధికం నగర పరిస్థితులపై సమగ్ర సర్వేలో వెల్లడి -
క్రైమ్ కథా చిత్రమ్!
సిటీలో బెంగళూరు పోలీసుల ఆపరేషన్ సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు పోలీసులు నగరంలోని మాదాపూర్, కొండాపూర్‌ల్లో నిర్వహించిన ఆపరేషన్ ఓ ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చింది. అక్కడి సేగెహళ్లికి చెందిన వివాహితను మోసం చేసిన మహేష్ అనే వ్యక్తి దాదాపు కిలో బంగారం కాజేశాడు. ఏడాదిన్నర పాటు సాగిన ఈ క్రైమ్ కథలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి కూడా నిందితుడు. అతడినీ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్‌లోని పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌పై దాడి చేసిన ప్రత్యేక బృందం మహేష్‌ను అరెస్టు చేసి, రెండు బ్యాంకులు, మరో ఫైనాన్స్ దుకాణం నుంచి రూ.85.6 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుంది. ఇటీవల జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను వదిలి.. మహిళల్ని టార్గెట్ చేసి... నిజామాబాద్‌కు చెందిన పి.మహేష్ వివాహితుడు. కొన్నేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో నివసిస్తూ.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వివాహిత మహిళల్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాడు. వారిని బ్లాక్మెయిల్ చేసి అందినకాడికి దండుకుని విలాసాలకు ఖర్చు చేస్తాడు. ఏడాదిన్నర క్రితం ఇతడికి స్నాప్‌చాట్ ద్వారా బెంగళూరులోని సేగెహళ్లికి చెందిన మహిళతో (32) పరిచయమైంది. ఈమెతో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తనను పూర్తిగా నమ్మిన ఆ వివాహిత నమ్మకాన్ని మహేష్ క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. బెంగళూరులోని పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. స్థిరాస్తి వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, నమ్మించి.. ఆమె నుంచి పలు దఫాల్లో దాదాపు కిలో బంగారం తీసుకున్నాడు. ఇందులో కొంత అమ్మేయగా 571 గ్రాముల్ని మాదాపూర్, కొండాపూర్ల్లోని రెండు బ్యాంకులు, ఓ ఫైనాన్స్ దుకాణంలో తాకట్టు పెట్టి జల్సాలకు వినియోగించాడు. భర్త నిలదీయడంతో.. ఇంట్లోని బంగారం కనిపించకపోయేసరికి భర్త నిలదీయడంతో బాధితురాలు మహేష్‌పై ఒత్తిడి చేసింది. వెంటనే ప్లేట్ ఫిరాయించిన అతగాడు తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ విషయాన్ని భర్తకు చెప్పడంతో పాటు మార్ఫింగ్ ఫొటోలు పంపిస్తానని బెదిరించడం మొదలెట్టాడు. ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకువెళ్లింది. ఫిబ్రవరి 10న బెంగళూరులోని ఆర్కేపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల ఓ ప్రత్యేక బృందం నగరానికి వచ్చిన మహేష్‌ను అరెస్టు చేసి, సొత్తు రికవరీ చేసుకువెళ్లింది. దర్యాప్తులో భాగంగా సదరు మహిళను అనంతపురానికి చెందిన స్వామి అనే యువకుడు ఇలాగే మోసం చేసినట్లు తేలింది. అతడిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. జైలుకు చేరే వరకు మహేష్, స్వామిలకు ఒకరి విషయం మరొకరికి తెలియకపోవడం విశేషం. మాదాపూర్‌లోని పీజీ అకామిడేషన్‌పై దాడి సేగెహళ్లి మహిళను ముంచిన మహేష్ మోసగాడిని అరెస్టు చేసిన ప్రత్యేక బృందం అనంతపురం వాసీ.. కటకటాల్లోకి.. -
ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దాలి
సాక్షి, సిటీబ్యూరో: నగరాన్ని ప్రమాద రహిత నగరంగా తీర్చిదిద్దడంలో రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుల పాత్ర అత్యంత కీలకమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తున్న ‘అరైవ్ – అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా బుధవారం టీజీఐసీసీసీ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుందని, అలా జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వాహనదారులు భద్రతా నియమాలను ఒక పవిత్రమైన క్రతువులా పాటించాలని సూచించారు. ప్రతి కాలనీ, అపార్ట్మెంట్ అసోసియేషన్లు తమ ప్రాంగణాల్లో ’నో హెల్మెట్ – నో ఎంట్రీ’ బోర్డులను ఏర్పాటు చేసి కఠినంగా అమలు చేయాలన్నారు. స్థానిక ట్రాఫిక్ సమస్యలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువస్తే, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారంతో పాటు చట్టపరమైన రక్షణ కల్పిస్తోందని, కాబట్టి భయపడకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరితో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అదనపు డీసీపీ రాములు, ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలు పెద్ద సంఖ్యలో రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 400 మంది కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ అంతకుముందు, ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ’బాలల రహదారి భద్రతా దినం’ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 అగ్రసేన్ కూడలిలో సీపీ సజ్జనర్ చిన్నారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే 4 ఏళ్లు పైబడిన పిల్లలందరికీ తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేయాలని వాహనదారులకు అవగాహన కల్పించారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ -
మామూళ్లు వసూలు చేస్తే కఠిన చర్యలు
చార్మినార్: చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ బుధవారం సాయంత్రం చార్మినార్ నడిరోడ్డులో దుకాణదారులు, వీధి వ్యాపారుల సమక్షంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చార్మినార్ కట్టడం ప్రాంగణంలో రోడ్డుపై కూర్చోబెట్టి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. చార్మినార్ పరిసరాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వారిని పిలిపించి.. ఎలాంటి బెదిరింపులకు పాల్పడవద్దని కఠినంగా హెచ్చరించారు. తమ హెచ్చరికలను లెక్కచేయని వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నామన్నారు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపామమన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని.. వినకపోతే..రౌడీ షీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు తమతో పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్, చార్మినార్ ఎస్హెచ్ఓ రాంబాబు పాల్గొన్నారు. రౌడీషీటర్లతో చార్మినార్ జోన్ డీసీపీ -
ఐఎఫ్ఎస్ వర్సెస్ ఐఆర్ఎస్
ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వివాదం ● బంజారాహిల్స్ పోలీసుల దర్యాప్తు బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో కుక్క పంచాయితీ చివరికి ఠాణాకు చేరింది. బాధిత మహిళా ఐఆర్ఎస్, పోలీసుల మాటల్లోనే పూర్తి వివరాలు.. ‘2016 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి ఎస్పీ సుతన్ సైఫాబాద్‌లోని అరణ్య భవన్లో విధులు నిర్వర్తిస్తూ.. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఇదే క్వార్టర్స్‌లో ఐఆర్ఎస్ అధికారి నితికాసింగ్ సైతం నివసిస్తున్నారు. సుతన్ క్వార్టర్స్‌లో న్యూసెన్స్ చేసేవారు. రెండు రోజుల క్రితం నితికాసింగ్ క్వార్టర్ వద్దకు వచ్చి హంగామా చేశారు. ఆమె పెంపుడు కుక్క తన ఇంటి వద్ద అపరిశుభ్రతకు కారణమైందని మండిపడ్డాడు. ఇంటి సిబ్బందితో పాటు పెంపుడు కుక్కపై దురుసుగా ప్రవర్తించారు. నితికాసింగ్ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో ఆమె ఇంటి వద్ద పూల కుండీని పగులగొట్టారు. సుతన్ న్యూసెన్స్‌ను తట్టుకోలేక బాధిత ఐఆర్ఎస్ అధికారిణి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుతన్‌పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 75, 79, 324 (4), 351 (2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం’ అని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం బుధవారం సుతన్ను ఠాణాకు పిలిపించారు. ఆయనకు డ్రగ్ టెస్ట్ చేసి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. సుతన్ ప్రవర్తన అసహజంగా ఉండటంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు గతంలో ఆయనను సెలవుపై పంపించినట్లు గుర్తించారు. ఇటీవల చికిత్స చేయించుకుని మళ్లీ విధుల్లో చేరారు. తాజాగా ఆయన మీద కేసు నమోదు కావడంతో అరణ్య భవన్ నుంచి దూలపల్లి అటవీ ప్రాంతానికి మంగళవారం బదిలీ చేశారు. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన సుతన్ (33) అవివాహితుడని తేలింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు పేర్కొన్నారు. -
రూ.కోట్లల్లో సర్కారు సొమ్ము స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏజన్సీల మాయాజాలం ఒక్కటొక్కటిగా బయటపడుతోంది. లేని ఉద్యోగులను ఉన్నట్లుగా రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలువురు ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఉస్మానియా ఆసుపత్రి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ● ఉస్మానియా ఆసుపత్రిలో ప్రభుత్వం అధికారికంగా నెలకు 787 మంది కార్మికులకు వేతనం చెల్లిస్తోందని, వాస్తవంగా పనిచేస్తున్నది సుమారుగా 400 మంది మాత్రమే ఉంటారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ● ఆరు నెలల క్రితం సిబ్బంది ఎంత మంది పనిచేస్తున్నారు. వారి వివరాలపై ఆరా తీయగా కొంత మంది ఏక కాలంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిల్లో పనిచేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో ఏజన్సీలను మందలించి, మరో మారు అలా జరగకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ● అయితే ఈదందా ఇక్కడితో ఆగలేదని తాజాగా మరోమారు తేటతెల్లమైపోయింది. రాష్త్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికుల ఆధార్ కార్డులను శాలరీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించనపుడు వేలాది మంది రెండు అంత కంటే ఎక్కువ చోట్ల వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ● పేషెంట్ కేర్ కోసం ప్రైవేటు సంస్థల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మ్యాన్ పవర్‌ను తీసుకుంటున్నారు. ఈ విధానంలో ప్రభుత్వం ఒక్కో బెడ్‌కు రూ.7,500 చెల్లిస్తోంది. వంద పడకలు ఉన్న ఆసుపత్రిలో 45 మంది సిబ్బందిని నియమించాలని నిబంధనలు పెట్టింది. ● ఇందులో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ విభాగాల్లో సిబ్బంది పనిచేస్తారు. అయితే ఏజన్సీలు ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నట్లు సమాచారం. తప్పుడు నివేదికలతో రూ.కోట్లలో సొమ్ము స్వాహా చేస్తున్నాయన్న ఆరపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరిన్ని అక్రమ బాగోతాలు వెలుగు చూస్తాయని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ● పనిచేస్తున్న కార్మికులకు సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని, వేతన చెల్లింపుల్లోనూ కోతలు విధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏజెన్సీల మాయాజాలం ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ చోట్ల పని చేస్తున్నట్లు లెక్కలు అక్రమాలపైప్రభుత్వానికి ఫిర్యాదులు -
నాలుగేళ్లు నిండితే హెల్మెట్ తప్పనిసరి
నగరంలో ‘అరైవ్–అలైవ్’ నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో/విజయ్‌నగర్‌కాలనీ: ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నగర పోలీసు విభాగం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. బుధవారం చిన్నారుల భద్రత, దానికి సంబంధించిన నిబంధనలపై నగర వ్యాప్తంగా అవగాహన కల్పించింది. వివిధ పాఠశాలలతో పాటు కూడళ్లలో శిబిరాలు నిర్వహించిన పోలీసులు చిన్నారులకు హెల్మెట్లు పంపిణీ చేయడంతో పాటు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారూ (పిలియన్ రైడర్) కచ్చితంగా హెల్మెట్ ధరించాలి. తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల మధ్య ఉన్న చిన్నారులను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ హార్నెస్గా పిలిచే బెల్ట్ కచ్చితంగా ఉండాలి. నాలుగేళ్ల పై బడిన వారూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ‘అరైవ్–అలైవ్’లో భాగంగా ఈ విషయాన్ని నగర పోలీసులు ప్రచారం చేశారు. బుధవారం విజయ్‌నగర్‌కాలనీలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్, కలెక్టర్ హరిచందన దాసరి పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు 30 హెల్మెట్లు, 200 వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులతో పోలీసులు అరైవ్–అలైవ్ ప్రతిజ్ఞ చేయించి హెల్మెట్లు అందజేశారు. -
‘ఏరోస్పేస్’ రంగంలో గత పదేళ్ళలో ఎంతో పురోగతి
చందానగర్: ఏరో స్పేస్ రంగం గత పదేళ్ళ కాలంలో ఎంతో పురోగతి సాధించిందని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్, ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా(ఏఈఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజబాబు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్‌లో రెండు రోజులపాటు నిర్వహించే 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సు సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ..ఏరో స్పేస్ రంగంలో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఉత్పత్తి, సర్టిఫికేషన్ అనేవన్నారు. ఈ నెల 17,18 తేదీలలో ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 74వ వార్షిక సర్వసభ్య సమావేశం, జాతీయ సదస్సును ఎస్కీ క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, నీతిఆయోగ్‌కు చెందిన డాక్టర్ వికె సారస్వత్, సీఎస్ఐఆర్ ప్రతినిధి డాక్టర్ ఎన్ కళైసెల్వి, డీఆర్డీఓ మాజీ చైర్మన్డాక్టర్ జి సతీష్‌రెడ్డి, డాక్టర్ ఎస్ సోమనాథ్ వంటి నిష్ణాతులు పాల్గొంటారని ఆయన వివరించారు. – డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్, ఏఈఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజాబాబు -
‘గాంధీ’లో అమర్నాథ్ యాత్ర మెడికల్ సర్టిఫికెట్ల జారీ
ఈ నెల 18న ప్రారంభం.. ప్రతి శుక్రవారం వైద్యపరీక్షలు గాంధీ ఆస్పత్రి: అమర్నాథ్ యాత్రికులకు మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా సర్టిఫికెట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు. జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు అమర్నాథ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యాత్రికులు నిర్దేశిత మెడికల్ బోర్డు నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలనే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఫల్మనాలజీ, కార్డియాలజీ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, హారిక, గోపికృష్ణ, శ్రీనివాస్, నోడల్ ఆఫీసర్ యోగేందర్లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. వివరాలకు గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్ రికార్డు సెక్షన్ (ఎంఆర్డీ)ను సంప్రదించాలి. -
హాయ్ బ్రదర్.. ఎట్లుంది మా హైదరాబాద్?
● విదేశీ పర్యాటకునితో మంత్రి జూపల్లి ముచ్చట ● చౌమొహల్లా ప్యాలెస్‌లో ఆసక్తికర సన్నివేశం సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్‌లో బుధవారం ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్యాలెస్ సందర్శనకు వచ్చిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు బ్రిటన్ నుంచి వచ్చిన ఓ విదేశీ పర్యాటకుడు తారసపడ్డారు. దీంతో మంత్రి అతడితో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ పర్యటన ఎలా సాగుతోందని మంత్రి ఆయనను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఇంకా ఏయే ప్రదేశాలు చూశారని వాకబు చేయగా.. ఇప్పటికే తాము కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించినట్టు ఆ పర్యాటకుడు బదులిచ్చారు. భాగ్యనగర ఆతిథ్యం ఎలా ఉంది? ఇక్కడి వంటకాలు నచ్చాయా? అని మంత్రి వాకబు చేశారు. పర్యాటకుల నుంచి లభించే సలహాలు, సూచనల ఆధారంగా రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల వద్ద సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు.


