హై హై.. రైజింగ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో రియల్‌ఎస్టేట్ మందగించిందని చెబుతున్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో గడచిన (2025) సంవత్సరంలో హైరైజ్ (బహుళ అంతస్తుల) భవనాలు పెరిగాయి. అంతకుముందు 2024 సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ నుంచి 69 హై రైజ్ భవనాలకు అనుమతులివ్వగా, 2025లో 103 బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చారు. ఇతర భవన నిర్మాణ అనుమతులు మాత్రం కొంత తగ్గాయి. 2024లో 11,855 భవన నిర్మాణ అనుమతులు జారీ కాగా, 2025లో 11,166 భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ఇవి తగ్గినప్పటికీ, హైరైజ్ భవన నిర్మాణ అనుమతులు, లే ఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ పెరగడంతో టౌన్‌ప్లానింగ్ విభాగం ఆదాయం పెరిగింది.
2024లో రూ.1,114.24 కోట్ల ఆదాయం రాగా, 2025లో రూ. 1,272.36 కోట్ల ఆదాయం లభించింది. గత సంవత్సరం మార్చినుంచి అమల్లోకి వచ్చిన ఏఐ ఆధారిత బిల్డ్ నౌ అప్లికేషన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు.. ముఖ్యంగా భారీ భవంతులవి త్వరితంగా ఇవ్వడం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. 2024లో కేవలం 12 లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులివ్వగా 2025లో 30 లేఔట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులిచ్చారు. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 2024లో 2,125 జారీ కాగా, 2025లో 2,401 జారీ అయ్యాయి.
భూసేకరణ పనులు..
భవన నిర్మాణ అనుమతులతో పాటు టౌన్‌ప్లానింగ్ విభాగం వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణలు కూడా పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. వీటిలో ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించే జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్‌ల నుంచి హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)ప్రాజెక్ట్ కింద వివిధ ఫ్లై ఓవర్లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణ చేసినట్లు తెలిపింది. వీటితో పాటు గోషామహల్‌లో నిర్మించనున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనానికి అప్రోచ్, లింక్‌రోడ్లకు ప్రాధాన్యమిచ్చి భూసేకరణల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసినట్లు పేర్కొంది.
రహదారుల విస్తరణకు..
ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులకు 2024లో ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరితగతిన జరిగేందుకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. నాలుగు ప్రధాన రహదారులకు సంబంధించి 696 ఆస్తులకుగాను 134 ఆస్తుల సేకరణ పూర్తి కాగా.. మిగతా ఆస్తుల సేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు పేర్కొంది.
జంక్షన్ల పనులు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.233 కోట్లతో 90 జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించగా, 74 జంక్షన్లలో పనులు చేసేందుకు ప్లాన్‌లను ఆమోదించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో పెరిగిన హైరైజ్ భవనాలు
2025లో 103 బహుళ అంతస్తులకు అనుమతులు
ఆశాజనకంగా టౌన్‌ప్లానింగ్ ఆదాయం


