దొంగ తెలివి
పోలీసులు పట్టుకుంటున్నారు జాగ్రత్త
సాక్షి, సిటీబ్యూరో: బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి నగరానికి వస్తున్న కొందరు ఇక్కడ నేరాలు చేయడానికే మకాం వేస్తున్నారు. ఓ టార్గెట్‌ను ఎంపిక చేసుకుని, అవకాశం కోసం ఎదురుచూసి మరీ పంజా విసురుతున్నారు. ఈ ముఠాల్లోని కీలక సభ్యులు తమ లక్ష్యం ఏమిటన్నది నేపాల్‌లో ఉంటున్న తమ కుటుంబీకులకు చెబుతూ, ఎప్పటికప్పుడు వారి నుంచి అప్‌డేట్స్ తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న నందగిరిహిల్స్‌లో నివసించే ప్రముఖ వ్యాపారి రవీంద్రశర్మ ఇంట్లో ఈ నెల 5న భారీ చోరీ చేసిన నేపాలీ గ్యాంగ్ విచారణలో దీనికి సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భూపేందర్ సాహి అలియాస్ భువన్‌ను ఫోన్‌లో అతడి భార్య పంపిన యూట్యూబ్ లింక్ ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నగరంలో ఉన్న తన భర్త భారీ నేరానికి స్కెచ్ వేస్తున్న విషయం తెలిసిన నేపాల్‌లోని భువన్ భార్య ఇక్కడ జరిగే నేపాలీ సంబంధిత నేరాలు, వాటిలో అరెస్టులు తదితరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. ఈ వార్తల్ని నేపాల్‌లో యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేస్తున్నాయి.
నేరం పకడ్బందీగా చేయాలని సూచిస్తూ..
గత నవంబర్ 16న కార్ఖానా పోలీసుస్టేషన్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో ఓ నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ చేసింది. ఈ ముఠాలోని ఐదుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనిపై గత డిసెంబర్ 8న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇది నేపాల్‌లో ఓ యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారమైంది. దీని లింకునే వాట్సాప్ ద్వారా భువన్ భార్య గత నెల్లో అతడికి పంపి... నేరం జాగ్రత్తగా చేయాలని, హైదరాబాద్ పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నారని హెచ్చరించింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఈ లింకు కనిపించింది. జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులైన జీవన్, కృష్ణ చాంద్ 2023లో మియాపూర్ పరిధిలో మరికొందరితో కలిసి నేరం చేసినట్లు తేలింది. ఆ ఏడాది అక్టోబర్ 15న రాకేష్ విశ్వనాథ్ తన కుటుంబంతో కలిసి కరీంనగర్‌లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఆ ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న నవీన్‌తో పాటు మరో వ్యక్తి రూ.80 లక్షల విలువైన సొత్తు ఎత్తుకుపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్‌ఓటీ టీమ్ నవీన్ సహా ముఠాను పట్టుకోగా... ఈ నేరం వెనుక జీవన్, కృష్ణ చాంద్ ప్రమేయం ఉన్నట్లు తేలింది.
మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు..
జూబ్లీహిల్స్ చోరీ కేసులో నిందితులపై నగరంలోని మరికొన్ని ఠాణాల్లోనూ కేసులు ఉన్నాయి. దీంతో ఆయా అధికారులు పీటీ వారెంట్లుపై అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రవీంద్ర శర్మ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్న భువన్ ఈ నెల 3న కృష్ణ, కమల్‌లను నగరానికి రప్పించాడు. వీళ్లు లక్డీకపూల్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించిన అధికారులు సదరు లాడ్జి నుంచి రికార్డులతో పాటు ఈ ద్వయం దాఖలు చేసిన గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5 రాత్రి రవీంద్రశర్మ కుటుంబం ఫంక్షన్‌కు వెళ్లడంతో అదే రోజు నేరం చేయాలని నిర్ణయించిన భువన్... కృష్ణ, కమల్ వేర్వేరుగా బయలుదేరి క్యాబ్స్‌లో నందగిరిహిల్స్‌కు చేరుకున్నారు. ఆ క్యాబ్ డ్రైవర్లను గుర్తించిన పోలీసులు వారి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు చెల్లింపులకు సంబఽందించిన ఆధారాలూ సేకరించారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
గత డిసెంబర్‌లో నేపాలీ గ్యాంగ్ అరెస్టు
అక్కడ యూ ట్యూబ్ చానెళ్లలో ప్రసారమైన నగర నేర వార్తలు
లింక్‌ను భర్తకు షేర్ చేసిన నిందితుడి భార్య
జూబ్లీహిల్స్ చోరీ కేసులో వెలుగులోకి కీలకాంశాలు


