దళపతి ‘మాయ’.. షాకిస్తున్న ‘హోలోగ్రామ్ విజయ్’ | Hologram Vijay Hits TN Campaign Trail | Sakshi
Sakshi News home page

దళపతి ‘మాయ’.. షాకిస్తున్న ‘హోలోగ్రామ్ విజయ్’

Apr 14 2026 9:27 AM | Updated on Apr 14 2026 9:35 AM

Hologram Vijay Hits TN Campaign Trail

చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించడం అసాధ్యం కావడంతో, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది. ఏఐ సాంకేతికతతో సృష్టించిన విజయ్ 3డీ హోలోగ్రామ్‌లు ఇప్పుడు వీధుల్లో అదరగొడుతున్నాయి. ప్రజలను ఈ హైటెక్ ప్రచారం ఎంతగానో ఆకర్షిస్తోంది.

ప్రచార బరిలో ‘3డీ విజయ్’ హవా
కుంభకోణం టీవీకే అభ్యర్థి వినోద్ రవి ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార రథంపై అభ్యర్థితో పాటు నిల్చున్న విజయ్ 3డీ హోలోగ్రామ్.. అచ్చం ఆయన లాగే కనిపిస్తూ, ఆయన గొంతుతోనే ప్రసంగిస్తోంది. ‘విజిల్ వేయడానికి సిద్ధమా? ఓటు మన హక్కు, దాన్ని ఎవరూ తీసుకోలేరు. మన ఓటు విజిల్ (టీవీకే గుర్తు)కే వేయాలి. మనం ఎవరి మాటలకూ మోసపోం’ అని హోలోగ్రామ్ విజయ్ చెబుతుంటే.. అభిమానులు, ఓటర్లు ఆశ్చర్యంతో చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఈ డిజిటల్ దళపతి  భౌతికంగా ఆయన అక్కడే ఉన్నారన్న భ్రమను కల్పిస్తూ విశేషంగా  ఆకట్టుకుంటోంది.
 

విద్యార్థి మేధస్సుకు ప్రతిరూపం
మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ.. అన్ని చోట్లా విజయ్ సందేశాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం  అమలు చేసింది. తంజావూరు జిల్లా టీవీకే కోశాధికారి విజయ్ చంద్రన్ ఆలోచన మేరకు, ప్రవీణ్  అనే 20 ఏళ్ల ఏఐ, డేటా సైన్స్ విద్యార్థి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. కేవలం మూడు రోజుల్లోనే ఏఐ సాయంతో విజయ్ ప్రసంగాన్ని 50 సెకన్ల వీడియోగా మార్చి, దానిని హోలోగ్రామ్ ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రయోగం ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే పనిలో పార్టీ బిజీగా ఉంది.

డూప్‌ల నుంచి డిజిటల్ దాకా..
ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే శ్రేణులు చేయని ప్రయత్నం లేదు. హోలోగ్రామ్‌ల కంటే ముందు తిరువెరుంబూర్ అభ్యర్థి నావల్‌పట్టు విజి.. విజయ్ మైనపు బొమ్మను (మ్యాన్విన్) ప్రచారానికి వాడారు. అలాగే సీఎం స్టాలిన్‌పై పోటీ చేస్తున్న కొలత్తూరు అభ్యర్థి వీఎస్ బాబు సైతం, అచ్చం విజయ్‌లా ఉన్న డూప్‌లతో ప్రచారం చేయించారు. చెన్నై ఆఫీసులో వందల కొద్దీ విజయ్ బొమ్మలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా డూప్‌లు, బొమ్మలతో మొదలైన వారి ప్రచారం.. ఇప్పుడు ఏఐ, 3డీ హోలోగ్రామ్‌ల స్థాయికి చేరి, రాజకీయ ప్రచార రూపురేఖలనే మార్చేస్తోంది.

ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్‌ జయంతి: ఏవి ఓపెన్‌? ఏవి క్లోజ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement