ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్‌తో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విరాట్.. ముంబై బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
తొలుత దూకుడుగా ఆడిన కోహ్లి, మిడిల్ ఇన్నింగ్స్‌లో కాస్త నెమ్మదించాడు. ఫిల్ సాల్ట్‌తో కలిసి తొలి వికెట్ ఏకంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
కోహ్లి సాధించిన రికార్డులు ఇవే
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, సీఎస్‌కేపై 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.
అదేవిధంగా టీ20ల్లో అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(29), పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం(28)లను కోహ్లి అధిగమించాడు.


