నారాయణవనంలోని శ్రీపద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం(మే 28) ధ్వజారోహణ మహోత్సవంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య శుభ మిధున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు.
ధ్వజస్తంభం వద్ద విశేష పూజలు, భేరితాడనం, ధ్వజపటం, ఆస్థానం వంటి కైంకర్యాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.
పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, వివిధ పండ్లరసాలతో అభిషేకాలు నిర్వహించి విశేషారాధనలు చేపట్టారు.


