పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.
చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలు
జిన్హువా వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ ప్రతిపాదనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ప్రణాళికను సమర్పించారు.
శాంతియుత సహజీవనం , సంయమనం
సార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.
సార్వభౌమాధికారానికి గౌరవం
ఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొంది
భద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధి
సుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ చట్టాల అమలు
చివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్‌పింగ్ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని చైనా అమెరికాను గట్టిగానే హెచ్చరించింది. ఇరాన్‌తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్‌తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.
అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి.
ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్


