ఆగ్రాలో జరిగిన ఒక వింత సంఘటన పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఆ కొత్త పెళ్లికొడుకు ఆశలను అడియాశలు చేసింది. పెళ్లిలో మూడు ముళ్ల ముచ్చటను పూర్తి చేసుకొని ఫస్ట్‌నైట్ ముచ్చట కోసం ఎదురు చూస్తున్న వరుడుకి భారీ షాక్ తగిలింది. చివరికి ఇది ఘర్షణకు, ఆ తరువాత పోలీస్ కేసు వరకు దారి తీసింది. విషయం ఏమిటంటే..
ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 90 లక్షల డిమాండ్
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జగదీష్‌పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలి రాత్రే వధువు తన భర్తను రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వైరల్‌గా మారింది. ఆగ్రాలోని జగదీష్‌పురా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (ఒక డాక్టర్ తమ్ముడు), హత్రాస్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. సాంప్రదాయం ప్రకారం దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు. ఈ వేడకలో భాగంగా వధువు కొంగున ఎంతో కొంత బంగారం మూట గట్టడం ఆనవాయితీ. కానీ ఈ వధువు తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది. అది ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్తతో చెప్పింది. దీంతో షాకైన భర్తఅందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వధువు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించింది. దీంతో వారొచ్చి నానా హంగామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వరుడి ఇంటిపై దాడి చేసిన వస్తువులను ధ్వంసం చేశారు.
అక్కడితో ఆగలేదు... పెళ్లికొడుకు కుటుంబాన్ని లోపల ఉంచి బయట నుంచి తాళం వేశారు.ఇంట్లో ఉన్న పీఎన్‌జీ (PNG) గ్యాస్ పైప్‌లైన్‌ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టాలని చూశారని ఆపోపణలు. మొత్తానికి పొరుగువారి సహాయంతో వరుడి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. దీంతో నిందితులు, వధువు అక్కడినుంచి పారిపోయారు. పోతూ పోతూ, వధువు తనతో పాటు అత్తగారి నగలను, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది.
ఈ ఘటనపై వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఉద్దేశం పెళ్లి కాదని, కేవలం డబ్బు సంపాదించడమేనని ఆమె లక్ష్యమని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్నివధువు స్వయంగా ఒప్పుకుందని కూడా వారు పేర్కొన్నార. అలాగే గ్యాస్ పేల్చి, అందరినీ చంపేయాలని చూశారని బాధితులు ఆరోపించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో, వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జగదీష్‌పురా పోలీసులు వధువు, ఆమె తండ్రి , ఇతరులపై కేసు నమోదు చేశారు.
ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఇది అసలైన మోసమా లేక వరకట్న వేధింపుల కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసిన గొడవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


