అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్‌..! ఆ శారీ ప్రత్యేకతలివే.. | Kangana Ranaut in an Ultra Rare Kodali Karuppur Saree | Sakshi
Sakshi News home page

అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్‌..! ఆ శారీ ప్రత్యేకతలివే..

Apr 14 2026 2:08 PM | Updated on Apr 14 2026 3:25 PM

Kangana Ranaut in an Ultra Rare Kodali Karuppur Saree

సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్‌ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్‌ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. 

దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్‌ సృష్టించే ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ రాయ్‌ చౌధురి  ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్‌ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్‌ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్‌ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను.  

"వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. 

ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్‌రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్‌లో వెల్లడించారు రాయ్‌.

స్పెషాల్టీ..
కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం  'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. 

కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్‌ డైయింగ్‌ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్‌ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. 

ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్‌కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్‌లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం.

 

(చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్‌)

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement