‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’ | If He is not selected for Indian team: Ex India Star Fights For Shreyas Iyer | Sakshi
Sakshi News home page

‘టీమిండియాకు అతడిని ఎంపిక చేయకపోతే నిరసన చేస్తా’

Apr 13 2026 3:24 PM | Updated on Apr 13 2026 5:50 PM

If He is not selected for Indian team: Ex India Star Fights For Shreyas Iyer

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో శ్రేయస్‌ అయ్యర్‌ హవా కొనసాగుతోంది. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌, బ్యాటర్‌గా ఈ టీమిండియా మిడిలార్డర్‌ ఆటగాడు అదరగొడుతున్నాడు. ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సారథిగా టైటిల్‌ అందించిన శ్రేయస్‌ అయ్యర్‌.. గతేడాది పంజాబ్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

అంతేకాదు 2025లో 17 మ్యాచ్‌లలో కలిపి 604 పరుగులు సాధించాడు అయ్యర్‌. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికి పంజాబ్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచింది. మరోవైపు.. శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు మ్యాచ్‌లలో కలిపి 137 పరుగులు చేశాడు.

శ్రేయస్‌ అయ్యర్‌ దుమ్ములేపుతున్నా..
ఇదిలా ఉంటే.. దేశీ టీ20 ఫార్మాట్‌, ఐపీఎల్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ దుమ్ములేపుతున్నా.. భారత టీ20 జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు. ప్రస్తుతం జట్టులో ఖాళీ లేనందునే ఈ ముంబైకర్‌ను పక్కనపెట్టాల్సి వస్తోందని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ గతంలో పేర్కొన్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి శ్రేయస్‌ అయ్యర్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత చేసినా అయ్యర్‌ను భారత టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే తాను నిరసనకు దిగుతానన్నాడు. ‘‘అతడు గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా
అయినా సరే సెలక్టర్లు గనుక అతడిని జాతీయ టీ20 జట్టుకు ఎంపిక చేయకపోతే.. నాతో పాటు మిగిలిన వాళ్లు కూడా వచ్చి నిరసనకు దిగాలి. అతడి కోసం మనం ఫైట్‌ చేయాలి. జట్టులో చోటుకు అతడు అర్హుడు. ఇప్పటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ ప్రకటించారు.

ఇలాంటి సమయంలో శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాడు జట్టులోకి వస్తే ఉపయోగకరం. అతడు జట్టులో ఉంటే టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవగలదు’’ అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో సెలక్టర్లతో మాటల యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

చదవండి: Vaibhav Suryavanshi: వైభవ్‌ సూర్యవంశీ కూడబెట్టిన ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement