నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది | Srilalitha Kanaka Durga Maha Prabhavita Madanajanaka Sodari | Sakshi
Sakshi News home page

నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది

Apr 12 2026 2:51 AM | Updated on Apr 12 2026 2:51 AM

Srilalitha Kanaka Durga Maha Prabhavita Madanajanaka Sodari

విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్‌ చేయడంతో వైరల్‌గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.

‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్‌ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్‌లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. 

పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్‌ ఫ్రైజ్‌ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్‌ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని.

ఒడిలో కూర్చోబెట్టుకొని...
పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్‌ రైమ్‌ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. 

మూడేళ్ల వయసులోనే...
మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్‌ క్లాస్‌ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్‌కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్‌ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్‌ పాటలే! 

దీక్ష తీసుకునేవాళ్లం..
మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్‌కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్‌ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్‌గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. 

సాధన మానకూడదు..
ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్‌ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్‌ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. 

ఆరేళ్లపాటు యూ ట్యూబ్‌లో..
దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్‌ చానెల్‌ ఓపెన్‌ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్‌ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. 

మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.
∙ నిర్మలారెడ్డి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement