breaking news
Funday
-
రుచి... ఆరోగ్యం... సింపుల్ కుకింగ్!
ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తోనే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన బ్రెడ్ ఉప్మా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచి ఇచ్చే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.కావలసినవి:5 నుంచి 6 బ్రెడ్ స్లైస్‌లు, నూనె లేదా బటర్: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, మినపప్పు: 1/2 టీస్పూన్, ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది), టొమాటో: 1 (చిన్నగా తరిగినది), పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తరుగు: 1/2 టీస్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, పసుపు: 1/4 టీస్పూన్, కారం: 1/2 టీస్పూన్, నిమ్మరసం: టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడాతయారీ:- ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ప్యాన్ పై కొద్దిగా కాల్చుకుని, చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.- ఆ తరువాత తాలింపు కోసం ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయండి.- అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చిటపటలాడనివ్వండి.-ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు వేయించండి.- అందులోనే తరిగిన టొమాటో ముక్కలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.-టొమాటోలు మెత్తగా అయ్యే వరకు 2–3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి, మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలా చిన్నగా కలపండి.-బ్రెడ్ క్రిస్పీగా అయ్యేంతవరకు 2–3 నిమిషాలు వేయించండి. చివరగా నిమ్మరసం పిండి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి. అంతే వేడివేడిగా సర్వ్ చేయడమే!క్యారెట్ పొరియల్కావలసినవి: 5 క్యారెట్లు: 250 గ్రాములు (తురుము లేదా సన్నని ముక్కలు), నూనె: టేబుల్ స్పూన్, ఆవాలు: 1/2 టీ స్పూన్, మినపప్పు: టీ స్పూన్, శనగపప్పు: టీస్పూన్, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), ఎండుమిర్చి: 1, కరివేపాకు: ఒక రెమ్మ, ఇంగువ: చిటికెడు, ఉల్లిపాయ: 1 (చిన్నగా తరిగినది), పచ్చి కొబ్బరి తురుము: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:- ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనిచ్చిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి పప్పులు దోరగా మారే వరకు వేయించండి.- అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువతో పాటు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. అవి మెత్తబడే వరకు 2 నిమిషాలు వేయించండి.- ఇప్పుడు తరిగిన క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.- మూత పెట్టి సన్నని మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి.- క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.- మరింత హెల్తీ ఫుడ్‌గా మారాలంటే 15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పును కూడా క్యారెట్‌తో పాటు వేసి వేయించుకోవచ్చు. అంతే! కలర్‌ఫుల్ క్యారెట్ పొరియల్ రెడీ!సూజీ కేక్ కావలసినవి: ఉప్మా రవ్వ: కప్పు, పెరుగు: 1/2 కప్పు, చక్కెర: 3/4 కప్పు, పాలు: 1/2 కప్పు (కాచి చల్లార్చినవి), నూనె లేదా వెన్న: 1/4 కప్పు, ఏలకుల పొడి లేదా వెనిలా ఎసెన్ ్స: 1/2 టీస్పూన్, బేకింగ్ పౌడర్: టీస్పూన్, బేకింగ్ సోడా: 1/4 టీస్పూన్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్: 2 టేబుల్ స్పూన్లు.తయారీ:- ఒక బౌల్లో పెరుగు, పంచదార పొడి, నూనె వేసి పంచదార కరిగే వరకు బాగా కలపండి.- ఇప్పుడు అందులో రవ్వ, సగం పాలు పోసి బాగా కలిపి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టండి.- ఇపుడు ఒక పెద్ద ప్రెజర్ కుక్కర్ లేదా మందపాటి కడాయిలో అడుగున కప్పు ఉప్పు లేదా ఇసుక వేసి, దానిపై ఒక స్టాండ్ ఉంచండి.- విజిల్, గాస్కెట్ తీసేసి మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ప్రీ–హీట్ చేయండి.- ఆ తరువాత కేక్ గిన్నెకి కొద్దిగా నూనె రాసి, పొడి పిండి చల్లండి లేదా బటర్ పేపర్ వేసి పక్కన పెట్టండి.- నానిన రవ్వ మిశ్రమం గట్టిపడితే మిగిలిన పాలు పోసి కేక్ బ్యాటర్‌ని చక్కగా కలుపుకోవాలి.- ఇప్పుడు అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఏలకుల పొడి/వెనిలా ఎసెన్ ్స వేసి ఒకే దిశలో నెమ్మదిగా కలపండి.- ఈ మిశ్రమాన్ని కేక్ టిన్ లో పోసి, పైన టూటీ ఫ్రూటీ లేదా జీడిపప్పు ముక్కలు చల్లండి.- ప్రీ–హీట్ చేసిన కుక్కర్లో ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 35 నుంచి 45 నిమిషాలు బేక్ చేయండి.- తరువాత కేక్ మధ్యలో టూత్‌పిక్ లేదా చాకు గుచ్చి చూడండి.- అది క్లీన్ గా బయటకు వస్తే కేక్ సిద్ధమైనట్లే! కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నె నుంచి బయటకు తీసి ముక్కలుగా కోయాలి. -
క్లిక్... క్లిక్... కింగులు! వీటితో షూట్ చేస్తే రీల్స్ నెక్స్ట్ లెవెల్!
క్లిక్ చేయడమే కాదు, షాక్ కూడా ఇస్తాయి ఈ కెమెరాలు! సైజు చూసి తక్కువ అంచనా వేయకండి. ఈ మినీ కెమెరా గాడ్జెట్లు చేసే పని మాత్రం పక్కా ప్రొఫెషనల్. తక్కువ ధరలో ఎక్కువ క్రియేటివిటీ కావాలంటే వీటికి, మీ కార్ట్‌లో కచ్చితంగా చోటు ఇవ్వాల్సిందే!సీసీ కెమెరాకు మినీ తమ్ముడు!కరెంట్ పోయిందేమో... తీగలు వేయాలేమో... పెద్ద సీసీ కెమెరా పెట్టాలేమో... ఇలాంటి టెన్షన్లన్నింటికీ గుడ్‌బై చెప్పేయండి! ఈ మినీ వైఫై కెమెరా ఉంటే చాలు. అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నగా ఉంటుంది కానీ, ఇంటిపై నిఘా మాత్రం పెద్ద సీసీ కెమెరాలా ఉంచుతుంది. ఎక్కడైనా పెట్టేయొచ్చు; మొబైల్‌తో కనెక్ట్ చేసుకుని ఎక్కడి నుంచైనా ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోచ్చు. కదలిక కనిపించగానే వెంటనే మీ ఫోన్‌కు సమాచారం పంపిస్తుంది. చీకట్లో కూడా నైట్ విజన్ తో స్పష్టంగా రికార్డు చేస్తుంది. పిల్లలు, పెంపుడు జంతువులు లేదా ఇంటి భద్రత కోసం సింపుల్‌గా వాడుకునే పోర్టబుల్ సీసీ కెమెరా ఇదే. ధర కేవలం రూ. 600 మాత్రమే!పాకెట్లోనే స్టూడియో!ఫోన్ కెమెరా బాగానే ఉంటుంది... కానీ వెలుతురు లేకపోతే ఫొటో వెలవెలబోతుంది! అందుకే, ఈ చిన్న మాగ్నెటిక్ సెల్ఫీ లైట్ మీ జేబులోనే తిరిగే మినీ స్టూడియోలా పనిచేస్తుంది. మొబైల్‌కు టక్కున అతుక్కుని... మీ ముఖంపై సమంగా వెలుతురు పడేలా చేస్తుంది. ఇక సెల్ఫీలు, రీల్స్, వ్లాగ్స్, వీడియో కాల్స్... ఏదైనా ప్రొఫెషనల్ లుక్‌లో కనిపిస్తాయి.ఇందులో మూడు రకాల లైటింగ్ మోడ్స్, కావాల్సినంత బ్రైట్నెస్, 360 డిగ్రీలు తిరిగే డిజైన్ , 270 డిగ్రీలు మడిచే సౌకర్యం ఉన్నాయి. అంతేకాదు, చిన్న అద్దం కూడా ఉండటంతో మేకప్ టచప్ కోసం మరో అద్దం వెతకాల్సిన అవసరం లేదు. ఫోన్ స్టాండ్లాగానూ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే గంటల తరబడి పనిచేస్తుంది. ధర రూ. 1,800.ఎగిరేది పక్షి కాదు... డ్రోనే! ట్రావెల్‌కు వెళ్లినా... ఫ్యామిలీ ఫంక్షన్ అయినా... పైనుంచి తీసిన వీడియోలు చూస్తేనే అసలు కిక్! అయితే ఆ షాట్స్ కోసం పెద్ద డ్రోన్ ను బ్యాగ్‌లో మోసుకెళ్లాల్సిన పని లేదు. ఈ ఫోల్డబుల్ డ్రోన్‌ను మడిచేస్తే మీ జేబులోనే ఇమిడిపోతుంది. బయటకు తీస్తే మాత్రం ఆకాశంలో ఎగిరే మీ పర్సనల్ కెమెరామ్యాన్ గా మారిపోతుంది. ఒక్క బటన్ తో టేకాఫ్, ఒక్క బటన్ తో ల్యాండింగ్.కొత్తవాళ్లు కూడా భయపడకుండా సులభంగా ఎగరేయొచ్చు. హై క్వాలిటీ కెమెరాతో ఫోటోలు, వీడియోలు స్పష్టంగా రికార్డ్ అవుతాయి. ఫోన్‌తో నేరుగా కనెక్ట్ చేసుకుని లైవ్‌లోనే చూడొచ్చు. కెమెరా యాంగిల్‌ను కూడా అవసరానికి తగ్గట్టు మార్చుకోవచ్చు. చేతితో సైగ చేస్తే సెల్ఫీ తీయడం, ఒకే ఎత్తులో స్థిరంగా ఎగరడం, గాలిలో 360 డిగ్రీల ఫ్లిప్స్ చేయడం వంటి ఫీచర్లు దీనిని మరింత సరదాగా మారుస్తాయి. ధర రూ. 1,500 మాత్రమే! -
అశ్వనీకుమారుల శాపవిమోచనం!
పూర్వం భరద్వాజ వంశంలో సుతపుడు అనే విప్రుడు ఉండేవాడు. శ్రీహరి భక్తుడైన అతడు హిమాలయాలపై నివసించేవాడు. శ్రీకృష్ణుడి ప్రీతి కోసం హిమాలయాలలో అతడు సుదీర్ఘకాలం తపస్సు చేశాడు. తపస్సు కొనసాగిస్తున్న సుతపుడు బ్రహ్మతేజంతో వెలుగొందసాగాడు. గగనమార్గంలో సంచరించే దేవ గంధర్వ కిన్నర కింపురాషుదులు సుతపుడి తపోనిష్ఠకు, అతడి తేజస్సుకు విస్మయం చెందేవారు. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు సుతపుడికి సాక్షాత్కారమిచ్చాడు.‘వత్సా! నీ తపస్సుకు సంతసించాను. వరమేదైనా కోరుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడి దర్శనం కలగడంతో సుతపుడు పరమానంద పరవశుడయ్యాడు. శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి, వేనోళ్ల స్తుతించాడు.‘ప్రభూ! నేను ఆత్మనిష్ఠుడను. నాకు మోక్షం అక్కర్లేదు. అనునిత్యం నీ సన్నిధిలో ఉండేలా అనుగ్రహించు. నీ పట్ల అనన్య దాస్యభక్తిని ప్రసాదించు. అంతే చాలు!’ అని కోరుకున్నాడు.‘మునివర్యా! ముందుగా నువ్వు వివాహమాడు. సంసార జీవితంలో నీ ప్రారబ్ద కర్మలు క్షీణించిన తర్వాత నీకు నా దాస్యభక్తి తప్పక లభించగలదు’ అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు.సుతపుడు తనకు తగిన వధువు కోసం అన్వేషిస్తూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడు అతడికి పితృలోకానికి చెందిన మానసి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపించాడు. కొన్నాళ్లకు మానసి గర్భం దాల్చింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. సుతపుడు ఆ బాలుడికి కల్యాణమిత్రుడు అని నామకరణం చేశాడు. కల్యాణమిత్రుడు అశ్వనీదేవతల అనుగ్రహంతో జన్మించాడు. సుతపుడు ఈ సంగతిని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే తన భార్యను విడిచిపెట్టాడు. అశ్వనీదేవతలపై ఆగ్రహం చల్లారక ‘నాకు ద్రోహం తలపెట్టిన మీరు రోగగ్రస్తులవుతారు.మీకు యజ్ఞయాగాదులలో హవిర్భాగాలకు అర్హత లేకుండా పోతారు’ అని శపించాడు. తర్వాత కొడుకును వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సుతపుడి శాప ఫలితంగా అశ్వనీదేవతలు రోగగ్రస్తులయ్యారు. యజ్ఞయాగాదులలోని హవిర్భాగాలు దక్కక వారు బలహీనులైపోయి నానాటికీ క్షీణించసాగారు. దేవవైద్యులైన అశ్వనీకుమారులే రోగులుగా మారడంతో దేవలోకంలో కల్లోలం రేగింది. శాపవశాన సోకిన వ్యాధిని నయం చేసుకునే మార్గం తోచక అశ్వనీదేవతలు తమ తండ్రి సూర్యభగవానుడి వద్దకు వెళ్లి, తమ గోడు చెప్పుకున్నారు. సూర్యుడు వారిద్దరినీ సుతపుడి వద్దకు తీసుకుపోయాడు.‘మునిపుంగవా! నా తనయుల అపరాధాలను మన్నించు. నీవంటి సద్బ్రాహ్మణుడు సంతుష్టుడైతే సాక్షాత్తు శ్రీహరి సంతుష్టుడవుతాడు. శ్రీహరి సంతుష్టుడైతే, సకల దేవతలూ సంతుష్టులవుతారు. కాస్త దయ చూపు. నా తనయులకు శాపవిమోచనం కల్పించు’ అని అభ్యర్థించాడు.సూర్యభగవానుడి ప్రార్థనకు సుతపుడి మనసు కరిగింది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. తన తపోబలంతో అశ్వనీదేవతలకు తక్షణమే రోగ విముక్తులను చేశాడు.‘దివాకరా! త్వరలోనే నీ తనయులకు యజ్ఞ యాగాదులలో హవిర్భాగాలు పొందే యోగ్యత కూడా లభిస్తుంది’ అని పలికాడు.సుతపుడి సహృదయానికి సూర్యుడు వేనోళ్ల కీర్తించాడు. ‘శ్రీహరి భక్తులైన నీవంటి సద్బ్రాహ్మణులే లోకాలకు వెలుగు చూపగలరు. నా తనయులకు శాపవిమోచనం కలిగించావు. ధన్యోస్మి!’ అని పలికాడు.రోగ విముక్తులైన అశ్వనీదేవతలు ఆనంద బాష్పాలతో సుతపుడికి సాష్టాంగపడ్డారు. అశ్వనీదేవతలకు శాపవిమోచనం కలిగించాక సుతపుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి బయలుదేరాడు. సూర్యుడు తనయులతో కలసి తన స్వలోకానికి బయలుదేరాడు.- సాంఖ్యాయన -
కూలీ నుంచి రాజకొలువుకు... కారణం ఇదే!
కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద పడుకునేవాడు. చిన్ననాటి నుంచి గుడి పూజారి దగ్గర ధర్మబద్ధంగా జీవితం ఎలా గడపాలో నేర్చుకున్నాడు. తను ఒక చోట కూలీ పనికి ఒప్పుకుంటే మరొకరు వచ్చి ఎక్కువ కూలీ ఇస్తామన్నా ససేమిరా ఒప్పుకునే వాడు కాదు. ఊరి వాళ్ళు, తోటి కూలీలు ఇతని నిజాయతీని చూసి నవ్వుకునే వాళ్ళు. కేశవుడు మాత్రం ధర్మం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని నమ్మేవాడు.ఒకరోజు కోసల రాజు విక్రమసేనుని ఉద్యానవనంలో తోటపని చేయడానికి ముకుందపురం నుంచి కూలీలతో పాటు కేశవుడు కూడా వెళ్ళాడు. కేశవుడు తోటలో పని చేస్తున్నప్పుడు ఒక రంగురాయి దొరకటంతో దాని గురించి ఎవరికీ చెప్పకుండా బొడ్లో జాగ్రత్తగా దాచుకున్నాడు. సాయంత్రం వరకు తోటలో పనిచేసి, కూలి డబ్బులు తీసుకున్నాడు. ఇంటికి బయలుదేరుతూ, మెల్లగా రాజప్రాసాదంవైపు అడుగులు వేశాడు. సింహద్వారం వద్ద భటులతో తను రాజుగారిని కలవాలి అని చెప్పాడు. విషయం ఏమిటని భటులు ప్రశ్నిస్తే విషయం కేవలం రాజుగారికి మాత్రమే చెబుతాను అనటంతో ఒక భటుడు అంతఃపురంలోకి వెళ్ళి వచ్చి, ‘‘రేపు ఉదయం వరకు రాజుగారిని కలవటం కుదరదు, పొద్దున్నే రాపో’’ అని చెప్పారు.కేశవుడు చేసేది లేక ఊరికి వెళ్లకుండా, సింహద్వారం పక్కగా ఒక చోట ఒదిగి కూర్చొని రాత్రంతా అక్కడే గడిపాడు. అలసిపోయి అక్కడే పడుకున్న కేశవుడిని ఉదయాన్నే ఒక భటుడు నిద్రలేపి, ‘‘రాజుగారు పిలుస్తున్నారు’’ అని చెప్పటంతో భయం భయంగా కోటలోకి అడుగు పెట్టాడు. కోసల రాజు విక్రమసేనుడు కేశవుడిని చూసి ‘‘నన్ను ఎందుకు కలవాలనుకున్నావు?’’ అని అడిగాడు. కేశవుడు రాజుగారికి నమస్కరించి, ‘‘మహారాజా! నిన్న తమరి తోటలో పనిచేస్తుంటే, నాకు ఈ రంగురాయి దొరికింది. తమరి వస్తువు తమరికే అప్పగించి పోదామని వచ్చాను’’ అని చెప్పి, తన బొడ్లో జాగ్రత్తగా దాచుకున్న రంగురాయిని విక్రమసేనుడికి అప్పగించాడు. రంగురాయిని తీసుకున్న విక్రమసేనుడు ‘‘దీని విలువ ఎంతో నీకు తెలుసునా?’’ అని అడిగాడు. ‘‘నాది కాని వస్తువు విలువ ఎంత అయితే నాకెందుకు మహారాజా!’’ అన్నాడు కేశవుడు వినయంగా.ఇంతలో అక్కడకు వచ్చిన మహామంత్రి సూరవర్మ ‘‘ప్రభూ! మన ఖజానాలో పని చేయటానికి నిజాయతీ గల వ్యక్తి కావాలన్నారు కదా, అందుకు ఇతనే సరైన వ్యక్తి. నిజాయతీ గల వ్యక్తి కోసం వెదుకులాటలో భాగంగా తమరి తోటలో చాలా రంగు రాళ్లని నేనే కావాలని భూమిలో పాతించి, కూలీలను అందులో పనికి పురమాయించి, దూరం నుంచి గమనిస్తూనే వున్నాను. ఇతనితో పాటు మరికొందరికి ఈ రంగురాళ్ళు దొరికాయి.ఇవి విలువ చేయని రంగురాళ్ళు అని తెలియక మిగతా అందరూ లోలోపల సంతోషపడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు. కాని, ఇతను మాత్రం ఆశకు లోను కాకుండా నిజాయతీగా ఈ రంగురాయిని తమకు అప్పగించడానికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా నేను కావాలనే ఇతనికి తమ దర్శన భాగ్యం కలిగించలేదు. ఆ రంగురాయి ఒక రాత్రంతా ఇతని దగ్గర వుంటే ఇతని మనసు ఏమైనా చాంచల్యానికి లోనవుతుందేమో అనుకున్నాను. అయినా, ఇతను తన నిజాయతీని కోల్పోలేదు’’ అని చెప్పాడు.‘‘మహామంత్రీ! మీరు చెప్పింది నిజమే, తక్షణమే ఇతనిని మన ఖజానా ఉద్యోగిగా నియమించండి. వెంటనే ఇతని నివాసానికి రాజోద్యోగుల భవంతిని ఒకటి సిద్ధం చేయండి’’ అని చెప్పి విక్రమసేన మహారాజు లోనికి వెళ్లిపోయాడు.ముకుందపురం చేరుకున్న కేశవుడు గుడి పూజారిని కలుసుకొని, తనకు వచ్చిన కొలువు గురించి చెప్పి, పాదాలకు నమస్కరించాడు. ‘‘నీ నిజాయతీనే నిన్ను కాపాడింది. లే నాయనా!’’ అని కేశవుడిని లేవదీసి, ఆలింగనం చేసుకున్నాడు పూజారి.- ఎన్.వి.శ్రీధర శర్మ -
ఈ గ్యాడ్జెట్ ఉంటే సెలూన్ అవసరమే లేదు!
తలకు మర్దన చేయించుకోవడానికి ఇకపై సెలూన్‌కో, బ్యూటీపార్లర్కో వెళ్లనక్కర్లేదు. ‘ఎలక్ట్రిక్ హెడ్ అండ్ స్కాల్ప్ మసాజర్’ చెంతనుంటే చాలు. ఇంట్లోనే కూర్చుని మర్దన చేసుకోవచ్చు. దీనిని తలకు ఆనించి, తల చుట్టూ తిప్పుతూ ఉంటే ఇది జుట్టు కుదుళ్ల వరకు మసాజ్ చేస్తుంది.ఇందులోని సిలికాన్ బ్రష్ ఫ్లెక్సిబుల్‌గా ఉండి, జుట్టుపై సున్నితంగా పనిచేస్తుంది. ఐదు రకాల వైబ్రేషన్ మోడ్స్‌లో ఇది పనిచేస్తుంది. ఈ మసాజర్ రక్తపోటును అదుపుచేసి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మైగ్రేన్ సహా రకరకాల తలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలపై చర్మంలో సహజమైన తేమ ఆరిపోకుండా చేసి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించిన ఈ పరికరాన్ని ఎక్కడికైనా ఇట్టే తీసుకుపోవచ్చు. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని తక్కువ సమయంలోనే చార్జ్ చేసుకోవచ్చు.ఇలా చేస్తే కళ్లకు కొత్తందం!అమ్మాయిల ముఖంలో మొదటి చూపులోనే ఆకట్టుకునేవి కళ్ళు. మరి ఆ కళ్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే కేవలం ఆకారం మాత్రమే సరిపోదు, కాంతిమంతంగా అవి మెరుస్తూ ఉండాలి కూడా. ఇందుకోసం చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే చిరునవ్వు, ఆత్మీయత, ఆత్మవిశ్వాసం కళ్ళకు అసలైన అందం.ఇందుకోసం ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కీరాదోస రసంలో ముంచిన కాటన్ ప్యాడ్స్‌ను కళ్లపై ఉంచడం ద్వారా కళ్ల అలసట తగ్గి కళ్లు తాజాగా మారుతాయి. వాడిన గ్రీన్ టీ బ్యాగ్స్‌ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత వాటిని తరచుగా కళ్లపై పెట్టుకోవడం వల్ల కంటి వాపు, కళ్లకింద వచ్చే నల్లటి వలయాలు తగ్గుతాయి. విల్లులాంటి కనుబొమ్మలు, ఒత్తయిన కనురెప్పలు కళ్ల రూపాన్ని రెట్టింపు చేస్తాయి. నిద్రించే ముందు కనురెప్పలకు కొద్దిగా ఆముదం రాసుకోవడం వల్ల కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. అలాగే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం ద్వారా కళ్లు అలసట లేకుండా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు కంటి ఆరోగ్యానికి, అందానికి సరైన పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. -
తిమింగలాల వమనంతో పరిమళద్రవ్యం..!
సాధారణంగా పర్ఫ్యూమ్ల తయారీలో పువ్వులు, వేర్లు; కొన్నిరకాల జంతువుల నుంచి సేకరించిన పదార్థాలను ఉపయోగిస్తారు. తిమింగలాల వమనం(వాంతి)తో కూడా పర్ఫ్యూమ్ను తయారు చేస్తారంటే నమ్మశక్యంగా ఉండదు గాని, ఇది నిజం.ఈజిప్టు నాగరికత కాలం నుంచి వాడుకలో ఉన్న అత్యంత పురాతన పరిమళద్రవ్యం ఇది. తిమింగలాలు తినే కదంబ చేపలు, కనవ చేపలలోని అరగని భాగం గట్టి వ్యర్థపదార్థంగా మారి, తిమింగలాల వమనంలో బయటకు వస్తుంది. దీనిని ‘అంబర్గ్రిస్’ అంటారు. దీనిని ఇప్పటికీ పర్ఫ్యూమ్ల తయారీలో వినియోగిస్తున్నారు. -
చైన్ స్నాచింగ్.. నగర కమిషనర్ భార్య నిహారిక మెడలో..
నగర కమిషనర్ భార్య నిహారిక మెడలోని ఐదు తులాల బంగారు గొలుసు పట్టపగలే చోరీకి గురైంది. వీఐపీ ఏరియాలో జరిగిన ఈ సంఘటన పోలీస్ శాఖ ప్రతిçష్ఠకు సవాలుగా మారింది. కమిషనర్ ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్నకు అప్పగిస్తూ, ‘ఇది మన పోలీస్ శాఖకే కాదు, వ్యక్తిగతంగా నాకు కూడా ఇబ్బందికరమైంది. మీ గురించి తెలుసు కాబట్టి ఈ కేసును మీరే సాల్వ్ చేయగలరని నమ్ముతున్నాను.’ అన్నాడు కమిషనర్.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న రంగంలోకి దిగి సీసీటీవీ విజువల్స్‌ను నిశితంగా పరిశీలించాడు. దొంగలు బైక్‌పై వచ్చిన విధానం, చైన్ లాగిన తీరు చూస్తే ఎక్కడో తేడాగా అనిపించింది. సాధారణంగా చైన్ స్నాచర్లు గొలుసు లాగేటప్పుడు మహిళలు కింద పడిపోవడం లేదా మెడకు గాయాలు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిహారికకి చిన్న గీత కూడా పడలేదు. పైగా, దొంగలు వస్తున్నప్పుడు ఆమె ముందే అలర్ట్ అయినట్లు కెమెరాలో కనిపించింది.ప్రద్యుమ్న నిహారిక కాల్ డేటాను పరిశీలించాడు. ఒక గుర్తుతెలియని నంబర్‌తో ఆమె గత రెండు రోజులుగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ నంబర్ ఆధారంగా చైన్ స్నాచర్ ‘రాకీ’ని ప్రద్యుమ్న సీక్రెట్‌గా పట్టుకుని విచారించాడు.∙∙ కమిషనర్ ఇంటికి వచ్చాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.‘రండి తను ఇందాకే వెళ్లారు. చైన్ స్నాచర్ దొరికాడా?’ అడిగింది నిహారిక.‘దొరికాడు. రాత్రంతా స్టేషన్లో థర్డ్ డిగ్రీ అప్లై చేస్తే నిజం కక్కాడు’ చెప్పాడు నిహారిక వంకే చూస్తూ...‘కొట్టారా... నిజం చెప్పాడా?’ నిహారిక మొహం పాలిపోవడం గమనించాడు.‘యస్ మేడం... ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి. మీరే ఇదంతా చేశారని చెప్పమంటారా? వాడికి మరో నాలుగు తగిలించి వాడే నేరం చేశాడని లోపల వేయమంటారా?’‘వద్దు వద్దొద్దు... నా కోసం అనవసరంగా చేయని నేరానికి వాడిని శిక్షించొద్దు... నా భర్త నన్ను నిర్లక్ష్యం చేయడం భరించలేకపోయాను. పాత నేరస్తుడు చైన్ స్నాచర్ వివరాలు తెలుసుకోవడం కమిషనర్ భార్యగా కష్టం కాదు. రాకీకి డబ్బులు ఇచ్చి డ్రామా ఆడాను. అలాగైనా నా భర్త నా భద్రత గురించి భయపడి, నాతో ఎక్కువ సమయం గడుపుతాడని పూలిష్‌గా చేశాను.’ రియలైజ్ అవుతూ చెప్పింది.‘పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మీకు తెలియంది కాదు. మీ బాధ అర్థమైంది. మీ బాధను సూటిగా చెప్పండి. నేరుగా మాట్లాడితే, మనసు విప్పి మాట్లాడితే చాలా అపోహలు తొలగిపోతాయి. రాకీని ఏం చేయలేదు. నిజం చెప్పినందుకు క్షమించాను. మీరిచ్చిన డబ్బుతో నిజాయితీగా బ్రతకమని చెప్పాను. ఇక మీరు కేసు గురించి ఆలోచించకండి. పొరపాటున కిందపడిందని, చైన్ స్నాచింగ్ జరగలేదని నమ్మించడం నాకు కష్టమైన పని కాదు. దయచేసి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి.‘ చెప్పి బయటకు నడిచాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.∙∙ అయితే, అదే సమయంలో అనుకోకుండా ఇంటికి వచ్చిన కమిషనర్.. ప్రద్యుమ్న, తన భార్య మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా విన్నాడు. ఒక నిష్ఠుర నిజం తెలుసుకున్నాడు. భార్య చేసిన పని కన్నా, ఆ పని చేయడానికి కారణాన్ని అర్థం చేసుకున్నాడు.వెనక్కి తిరిగి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆఫీస్ పని ముగించుకుని పెందరాళే ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో కూర్చున్న భార్య దగ్గరకు వెళ్లి, ‘నిహారికా.. ఇవాళ మనం సినిమాకు వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు’ అన్నాడు. షాకైంది నిహారిక. ఈ సమయంలో తను చేసిన పని భర్తకు చెప్పకూడదని, ఎప్పటికీ చెప్పకూడదని, భర్త వృత్తిని అర్థం చేసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది నిహారిక.కమిషనర్ తన భార్యను సినిమాకు తీసుకువెళ్లాడు. థియేటర్లో సినిమా ఇంటర్వెల్ సమయంలో ఆయన సీటులోంచి లేచి పక్కకు వచ్చి ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్నకు ఫోన్ చేశాడు.ఫోన్ ఎత్తగానే, ‘థాంక్యూ ప్రద్యుమ్న! మీరు కేవలం క్రిమినల్ కేసులను మాత్రమే కాదు. మనుషుల మనసులను కూడా పరిశోధించి సమస్యలను సాల్వ్ చేస్తారు.’ మనస్ఫూర్తిగా అన్నాడు కమిషనర్.అవతలి వైపు నుంచి నవ్వుతూ, ‘అప్పుడప్పుడు ఇలాంటి సమస్యల్లో అసలు సాక్ష్యాన్ని కనిపెట్టాలిగా’ నవ్వుతూ అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.- శ్రీసుధామయి -
గుడ్డు.. ‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’
‘‘నువ్వు ఇంటికి తిరిగి వెళ్తూండగా మరణించావు.’’‘‘నీకు పిచ్చా?’’ వెంటనే అడిగాను.‘‘అదో కారు ప్రమాదంలో జరిగింది. నువ్వు నీ భార్యని, ఇద్దరు పిల్లలని వదిలి ఇక్కడికి వచ్చావు. నీది బాధలేని తక్షణ మరణం.’’‘‘నేను... నేను నిజంగా చచ్చిపోయానా?‘‘అవును.’’ నేను చుట్టూ చూశాను. అంతా శూన్యం. ఆశ్చర్యంగా భూమి కాని, ఆకాశం కాని కనపడలేదు. కేవలం అతను, నేను మాత్రమే ఉన్నామని గ్రహించాను.‘‘ఈ ప్రదేశం ఏమిటి? ఇదేనా మరణానంతర జీవితం?’’ అడిగాను.‘‘అవును.’’ అతను చెప్పాడు.‘‘నువ్వు దేవుడా?’’ ‘‘అవును. నేను దేవుడిని.’’ అతను బదులు చెప్పాడు.నేను ఆసక్తిగా చూశాను. అతను దేవుడిలా కనిపించలేదు. సర్వశక్తిమంతుడిలా కూడా కాదు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిలా కనిపించాడు.‘‘నా భార్య, పిల్లలు నా గురించి ఏడుస్తున్నారా?’’‘‘నీ భార్య పైకి ఏడుస్తూ లోపల ఉపశమనం పొందుతోంది. ఐతే నీకు ఊరటని ఇచ్చేది, ఉపశమనం పొందినందుకు ఆమెలో చాలా అపరాధభావం ఉంది.’’‘‘ఇప్పుడు నేను స్వర్గానికో, నరకానికో లేక ఇంకెక్కడికైనా వెళ్తానా?’’ అడిగాను.‘‘రెండూ కాదు. నువ్వు పునర్జన్మ ఎత్తుతావు.’’‘‘అంటే భగవద్గీతలో చెప్పింది నిజమే అన్నమాట.’’‘‘ప్రతి మతం దాన్నే తనదైన పద్ధతిలో చెప్పింది.’’‘‘నేను మళ్ళీ జన్మించాక ఓ ఖాళీ పలకలా ఉంటానా? పసిబిడ్డలా. ఈ జీవితంలో నేను నేర్చుకున్నవి, నా అనుభవాలు ఏవీ నాతో రావా?’’‘‘నీ గత జన్మలన్నింటి జ్ఞానం నీలో ఉంది. కాని అవి నీకు ఇప్పుడు గుర్తులేవు. నీ ఆత్మ ఎంత అద్భుతమైందో, విశాలమైందో నీకు తెలీదు. నీ మనసు నీలోని అత్యంత చిన్న భాగాన్ని మాత్రమే ఇముడ్చుకోగలదు. అది నీళ్ళు వేడిగా ఉన్నాయో, చల్లగా ఉన్నాయో చూడటానికి గ్లాసు నీళ్ళలో వేలు ముంచడం లాంటిది. దాన్ని తిరిగి బయటకి తీసినప్పుడు, అది పొందిన అనుభవాలన్నీ నీలో నిక్షిప్తమవుతాయి. నువ్వు ఇంకా విస్తరించలేదు. నీ అపారమైన చైతన్యంలోని మిగిలినవన్నీ నువ్వు అనుభూతి చెందలేదు.’’‘‘నేను ఎన్నిసార్లు పునర్జన్మ ఎత్తాను?’’‘‘చాలాసార్లు. ఎన్నో రకాల జీవితాల్లోకి ప్రవేశించావు. సాంకేతికంగా చెప్పాలంటే నీకు తెలిసిన కాలం నువ్వు జీవించిన విశ్వంలో మాత్రమే ఉంటుంది. కాని కాలం నిజం కాదు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు.’’‘‘నేను గతంలో మరణించినప్పుడల్లా నీతో ఇలా సంభాషించానా?’’‘‘అవును. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నువ్వు గుడ్డు మాత్రమే కాబట్టి అది నీకు గుర్తు లేదు.’’‘‘దీని ప్రయోజనం?‘‘‘‘నేను ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణం, నువ్వు పరిణతి చెందడమే.’’‘‘నేను మాత్రమేనా? లేక మానవాళి మొత్తం పరిణతి చెందాలనా?’’‘‘లేదు. కేవలం నువ్వు మాత్రమే. నేను ఈ విశ్వాన్ని నీ కోసమే సృష్టించాను. ప్రతి కొత్త జీవితంలో నువ్వు ఎదుగుతూ, పరిణతి చెందుతూ మరింతగా విస్తరిస్తావు.’’‘‘నేనేనా? అంతానా?’’‘‘మరెవరూ లేరు. ఈ విశ్వంలో నువ్వు మాత్రమే ఉన్నావు.’’నేను అతని వంక పిచ్చివాడిని చూసినట్లుగా చూశాను.‘‘భూమి మీది ప్రజలందరి మాటేమిటి?’’‘‘అంతా నువ్వే. అవన్నీ నీ విభిన్న అవతారాలు.’’‘‘ఆగాగు. నేను అందరినా !?’’‘‘ఇప్పుడు నీకు అర్థమవుతోంది.’’‘‘ఇప్పటివరకు జీవించిన ప్రతి మానవుడినీ నేనే?’’ తెల్లబోతూ అడిగాను.‘‘అవును.’’‘‘నేను గాంధీనా?’’‘‘నువ్వు గాడ్సేవి కూడా.’’‘‘నేనే హిట్లర్నా?’’ దిగ్భ్రాంతిగా అడిగాను.‘‘అతను చంపిన లక్షలాదిమంది కూడా నువ్వే. నువ్వు ఎవరినైనా బాధించిన ప్రతిసారీ, నువ్వు నిన్నే బాధించావు. నువ్వు ఇతరులకి చేసిన ప్రతి మంచి పనీ నీకోసమే చేసుకున్నావు. ఏ మనిషైనా అనుభవించిన ప్రతీ సంతోషం, ప్రతీ బాధ నువ్వే అనుభవించావు, ఇకపైనా అనుభవిస్తావు.’’ అతను చెప్పాడు.‘‘ఇదంతా ఎందుకు?’’‘‘ఎందుకంటే ఏదో రోజు నువ్వు నాలా మారడానికి. నువ్వు నాలాంటి వాడివే. నిజానికి నువ్వే నేను. నేనే నువ్వు.’’‘‘అంటే నేను కూడా దేవుడినా?’’‘‘ఇంకా కాదు. నువ్వు నా ఊహవి. నేను నీ ఊహని. నువ్వు ఇంకా ఎదుగుతున్నావు. సకల కాలాల్లోని ప్రతి మానవ జీవితాన్నీ నువ్వు గడిపిన తర్వాత, ప్రతీ జన్మలోనూ ఎదుగుతూంటావు.’’‘‘ఐతే నేనో గుడ్డుని అన్నమాట.’’ నేను చెప్పాను.‘‘అవును. నేను కూడా నీ గుడ్డుని. ఇప్పుడు నువ్వు నీ తర్వాతి జీవితానికి వెళ్ళే సమయం వచ్చింది.’’ అతను చెప్పాడు.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ!
సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు కనిపిస్తున్నాయి.ఆమె ఆ ఊరికి రావడం ఇదే మొదటిసారి. కానీ, ఆమె అడుగులు మాత్రం వడివడిగా ముందుకు పడుతున్నాయి. ఆమెతోపాటు ఉన్న 15 మంది ప్రముఖులు ఒకింత ఆశ్చర్యం, మరికొంత ఉత్కంఠతో వెనకే వెళ్తున్నారు. ఆ బాలిక ఓ ఇంటి ముందు ఆగి, ‘ఇదే నా ఇల్లు..’ అని చెప్పి తలుపు తట్టింది. లోపలి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘ఏవండీ ఎలా ఉన్నారు’ అని అడిగేసరికి వారంతా నిర్ఘాంతపోయారు.1926 డిసెంబరు 11న ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది శాంతిదేవి. నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అందరిలాగా ఆటపాటలతో గడిపింది. కానీ, మాటలు స్పష్టంగా వస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు రాసాగింది. అద్దం ముందు నిలబడి.. ‘ఇది నేను కాదు, నా ముఖం ఇలా ఉండదు’ అని విచారంగా అనుకునేది.మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చెప్పే మాటలు వారిని భయాందోళనలకు గురిచేశాయి. ‘నా పేరు శాంతిదేవి కాదు, నేను లుగ్దీదేవిని. మధుర నా సొంతూరు. నాకు పెళ్లయింది. నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే. ఒక బాబుకు జన్మనిచ్చిన తొమ్మిది రోజులకే నేను కన్నుమూశాను’ అంటూ ఏడ్చేది. ఈ విషయం శాంతిదేవి చదువుకునే స్కూలు టీచరుకు తెలియడంతో ఆయనకు ఆసక్తి కలిగి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు.ఆశ్చర్యం.. అక్కడ నుంచి జవాబు వచ్చింది. తన పేరు కేదార్నాథ్ చౌబే అని, లుగ్దీదేవి తన భార్యే అని, ఆమె 1925లో చనిపోయిందని చెప్పడంతో ఆ టీచరుకు నోటమాట రాలేదు. వెంటనే కేదార్‌నాథ్‌కు విషయాలన్నీ వివరించి ఢిల్లీ రావాలని కోరారు. ఈ విషయాలేవీ శాంతిదేవికి చెప్పకుండా కేదార్‌నాథ్‌ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆయన్ను చూసిన శాంతిదేవి– ఎంతో ఉద్విగ్నతకు లోనై, ‘ఏవండీ..’ అంటూ పిలిచేసరికి కేదార్నాథ్ బిత్తరపోయారు. ఎందుకంటే తనను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన భార్య మాత్రమే. కానీ ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఓ చిన్నారి అలా పిలిచేసరికి ఆయన షాక్‌లో ఉండిపోయారు. తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఎన్నో వ్యక్తిగత విషయాలను శాంతిదేవి ప్రస్తావించడంతో ఆమె గత జన్మలో తన భార్యే అని కేదార్నాథ్ నిర్ధారణకు వచ్చారు.ఈ వార్త మహాత్మా గాంధీ వరకు చేరింది. దీంతో 1935లో శాంతిదేవిని, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. చిన్నారి చెప్తున్న విషయాల్లోని నిజాయతీని గమనించిన ఆయన.. లోతైన విచారణ కోసం 15 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ సభ్యులు శాంతిదేవిని తీసుకొని 1935 నవంబరులో ఢిల్లీ నుంచి మధురకు రైలులో బయలుదేరారు. ఢిల్లీ దాటి ఎప్పుడూ వెళ్ళని ఆ బాలిక మధుర స్టేషన్ రాగానే స్థానిక ‘బ్రజ్’ యాసలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్టేష¯Œ లో దిగగానే, గత జన్మలో తన భర్తకు పెద్దన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టింది. అక్కడి నుంచి తన పాత ఇంటికి వారందరినీ తీసుకువెళ్లింది.ఒక గదిలో నేల కింద తాను దాచిన డబ్బు గురించి చెప్పింది. అయితే అక్కడ తవ్వగా ఖాళీ డబ్బా మాత్రమే దొరికింది. కమిటీ సభ్యులు శాంతిదేవి వైపు అనుమానంగా చూశారు. ఆ క్షణంలో కేదార్నాథ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఆ డబ్బు లుగ్దీదేవి చనిపోయాక నేనే తీశాను’ అని అంగీకరించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అలాగే తమ కుమారుడి చిన్నప్పటి గుర్తులు కూడా చెప్పి అందరినీ విస్తుపోయేలా చేసింది.శాంతిదేవి చెప్పిన చాలా అంశాలు వందకు వంద శాతం సరిపోయాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పలువురు పారానార్మల్ పరిశోధకులు కూడా శాంతిదేవి కేసును పునర్జన్మలకు సంబంధించిన బలమైన ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఏకాభిప్రాయం రాలేదు. కొందరు దీనిని పునర్జన్మకు ఆధారంగా పేర్కొన్నారు. మరికొందరు మెదడులోని పాత జ్ఞాపకాల పొరలని వాదించారు.ఓవైపు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.. మరోవైపు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు.. ఇలా జీవితాంతం రెండు జన్మల మధ్య బతికిన శాంతిదేవి వివాహం చేసుకోకుండా తన 61వ ఏట 1987లో మరణించారు.- కె.సత్యకిశోర్ -
15 చెర్రీలు.. ధర లక్షల్లో! జపాన్ పండుకు ప్రపంచం ఫిదా!
మామూలుగా చెర్రీ ధర కిలోకు రెండువందల నుంచి నాలుగువందల రూపాయలు ఉంటుంది. కొన్ని అరుదైన రకాల చెర్రీ ధర కిలోకు మూడువేల రూపాయల వరకు కూడా ఉంటుంది. జపాన్‌లో పండే ఈ అత్యంత అరుదైన చెర్రీ ధర మాత్రం చుర్రుమనిపిస్తుంది.ఈ చెర్రీ రకం పేరు ‘అమరీ హార్ట్‌బీట్’. జపాన్‌లో పండించే చెర్రీ రకాలలో ఇవి అత్యంత అరుదైనవి. వీటిని కిలోల లెక్కన కాకుండా, పదిహేనేసి చొప్పున ప్యాక్‌చేసి, అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఇవి ఇతర రకాల చెర్రీల కంటే ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిలో చక్కెర శాతం మిగిలిన చెర్రీ రకాల కంటే ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది.ఈ చెర్రీలను ఎక్కువగా వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. వేలంలో పదిహేనేసి చెర్రీలు ఉండే ఒక్కో ప్యాకెట్ ధర నాలుగున్నర లక్షల నుంచి ఆరులక్షల యెన్ల వరకు పలుకుతుంటుంది. ‘అమరీ హార్ట్‌బీట్’ చెర్రీలలో అత్యంత నాణ్యమైన వాటిని వేరుచేసి, వేలంశాలల్లో విక్రయిస్తుంటారు. మిగిలిన వాటిని లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో అమ్ముతుంటారు. లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో వీటి ధర ఒక్కో ప్యాకెట్‌కు యాభైవేల యెన్ల వరకు ఉంటుంది. -
పుచ్చకాయలో దాగిన ఆరోగ్య రహస్యాలు..
పుచ్చకాయకు దాదాపు నాలుగువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి దారుల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తప్పనిసరిగా వెంట తీసుకుపోయేవారు.ఆఫ్రికాలో మొదలైన పుచ్చకాయ ప్రస్థానం దాదాపు ప్రపంచమంతటా పాకింది. పుచ్చకాయ ఏడాది పొడవునా పండుతుంది. వేసవి ప్రారంభం నుంచి వేసవి ముగిసే లోపు అత్యధికంగా పండుతుంది.పుచ్చకాయలో అత్యధిక శాతం నీరు ఉంటుంది. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కోసం బాగా పనికొస్తుంది. పుచ్చకాయలో అనేక విలువైన పోషకాలు కూడా ఉంటాయి. రుచులకు మెచ్చుకాయ అయిన పుచ్చకాయ విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
ఒక్క పోజ్... వెయ్యి లైక్స్!
‘ఫొటో తీస్తా... పోజ్ ఇవ్వు!’ అని ఫ్రెండ్ అన్న వెంటనే... ఏం చేయాలో తెలియక చేతులు జేబుల్లో ఎట్టుకుని, తల ఎటు తిప్పాలో అర్థం కాక కెమెరానే చూస్తూ స్టాచ్యూ అయిపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!నడవట్లేదు... మ్యూజిక్ నడుస్తోంది!కెమెరా ముందు బిగుసుకుని నిలబడాల్సిన పని లేదు. ఫ్రెండ్‌ను చూసి నడుస్తూ ఒక కాలు ముందుకు మరో కాలు మడమను పైకి లేపి ఆగండి. ఇక ఒక చేయి జేబులో... మరో చేయి ముందుకు ఊపితే చాలు... ఫొటోలో సినిమా హీరో ఎంట్రీ వైబ్ వచ్చేస్తుంది. ఈ పోజ్ ఎక్కువగా రోడ్డు, పార్క్, కాలేజ్ క్యాంపస్, మాల్‌లలో బాగుంటుంది.సైడ్ లుక్... ఫుల్ హుక్!కెమెరా వైపు ఎప్పుడూ చూడాల్సిన రూల్ లేదు. చిన్ను కొద్దిగా పైకి ఎత్తి, పక్కకు చూస్తే, చూసేవాళ్లే ‘ఏమో... ఏదో ఆలోచిస్తున్నాడు!’ అనుకుంటారు. అసలు మీరు ఆలోచించేది ఇంటికి వెళ్లాక ఏం తినాలన్నదే అయినా... ఫొటోలో మాత్రం చాలా డీప్ థింకర్లా కనిపిస్తారు!ఫ్రెండ్‌తో కలిసి పోజ్... డబుల్ స్టయిల్!ఒక్కడిగా ఫొటో బాగుంటుంది. కాని, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే స్టయిల్లో నడిస్తే, అది వేరే లెవెల్. ఇద్దరూ ఒకే స్టయిల్లో నడవడం, ఒకే డైరెక్షన్ లో చూడడం, ఒకే టైమ్‌లో పోజ్ ఇస్తే, ఫొటోకు సినిమాటిక్ ఫీల్‌ను తీసుకొస్తుంది. ఫ్రెండ్స్‌తో రీల్స్ లేదా ఫొటోషూట్ చేస్తే ఈ పోజ్ తప్పక ట్రై చేయండి. కానీ ఒకడు హీరోలా నడుస్తుంటే, ఇంకొకడు చెప్పు జారి బ్యాలెన్స్ పట్టుకుంటే మాత్రం కామెడీ షో పోస్టర్ అయిపోతుంది!నవ్వాలా? సీరియస్‌గా ఉండాలా?ప్రతి ఫొటోలో పళ్లన్నీ చూపిస్తూ నవ్వితే టూత్‌పేస్ట్ యాడ్‌లా బాగుండదు. అందుకే, కొన్నిసార్లు చిన్న స్మైల్... ఇంకొన్నిసార్లు సైలెంట్ లుక్. ముఖ్యంగా కళ్లలో కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఫొటోకి అదే అసలైన ఫిల్టర్! గుర్తించుకోండి. పోజ్ అంటే శరీరాన్ని వంచడం కాదు, కాన్ఫిడెన్స్‌ను చూపించడం! అందుకే, కెమెరా ముందు సహజంగా ఉండండి. మీ స్టయిల్‌ను మీరే ఎంజాయ్ చేయండి.చేతులే చాలు.. కాన్ఫిడెన్స్!చేతులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడేవాళ్లకు ఇది లైఫ్సేవర్ పోజ్. ఒక చేయి లేదా రెండు చేతులు వెనక షర్ట్ లేదా హెయిర్ అడ్జస్ట్ చేస్తున్నట్లు పెట్టండి. అలాగే, భుజాలను నిటారుగా ఉంచి, ఛాతీని కొద్దిగా ముందుకు తీసుకొస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. అయితే, ఫొటో దిగేటప్పుడు జేబులో మొబైల్, వాలెట్, బైక్ కీ... అన్నీ నింపేస్తే మాత్రం పోజ్ కంటే జేబే హైలైట్ అవుతుంది!నిజం చెప్పాలంటే... మంచి డ్రెస్ వేసుకోవడం కంటే మంచి పోజ్ ఇవ్వడమే చాలా కష్టం. డ్రెస్ షాపులో దొరుకుతుంది. కానీ, స్టయిల్ మాత్రం మీలోనే ఉండాలి! అందుకే, ఇక్కడ కనిపించిన పోజులు పెట్టి ఫొటోలు దిగండి. అప్పుడు ఎక్కువ కష్టపడకుండానే స్టయిలిష్‌గా కనిపిస్తారు. -
సొంతకథను చెప్పుకున్న 'పరదేశి'!
కెజువో ఇషిగురో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత. కవనం లాంటి వచనం రాయగలిగిన ఈ నవలా రచయిత మొదట్లో కథానికలతోనే పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ రెండు ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యి అనిపించుకోవడానికి ముందు కెజువో తను రాసుకున్న పాటలను తానే స్వరబద్ధం చేసుకుని గిటారు మీద వాటిని పలికిస్తూ అనేక యూరపియన్ దేశాల్లో పర్యటించాడు.అయితే, కెజువోను వాగ్గేయకారుడిగా గుర్తించడానికి యూరప్ పెద్ద ఆసక్తి చూపించలేదు. ఆ దశలోనే అతనికి స్టేసీ కెంట్–జిం టాంలిన్సన్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ఆశావాదంతో పొంగిపొర్లే గీతాలను మాత్రమే పాడాలన్నది వారి నియమం! దాంతో, కెజువో భావనా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసినట్లయింది. అయినప్పటికీ, కెజువో వాళ్ళకోసం 16 ఆల్బమ్‌లను రూపొందించారు! అది వేరే విషయం. తన జీవితానుభవంలోని చీకటినీడలను చిత్రించే నిమిత్తం కెజువోకు వచనాన్ని ఆశ్రయించక తప్పలేదు! చిత్రమేమిటంటే, అతగాడికి కథానికలూ– నవలల రచయితగానే ఎక్కువ పేరొచ్చింది. బుకర్ ప్రైజ్ మొదలుకొని నోబెల్ సాహిత్య పురస్కారం వరకూ అతన్ని వరించి వచ్చాయంటే అందుకు కెజువో వచన రచనలే కారణం. 1950 దశకం నాటి ఇతివృత్తాలతో రూపొందించిన నవలలూ కథానికలవి. అంతకన్నా నాలుగడుగులు వెనక్కి వేసి, మరికొన్ని రచనలు కూడా చేశాడు కెజువో. బహుశా ఆ కారణంగానే జేన్ ఆస్టిన్, చార్ల్స్ డికెన్స్, షార్లట్ బ్రాంట్, జార్జ్ ఇలియట్ లాంటి పందొమ్మిదో శతాబ్ది మహామహులతో కెజువో ఇషిగురోను పోల్చింది పాశ్చాత్య ప్రపంచం!రెండో ప్రపంచయుద్ధం ముగిసిపోతున్న తరుణంలో, అమెరికా తను రూపొందించిన అణుబాంబు విధ్వంసం ఎంత తీవ్రంగా వుంటుందో ప్రపంచానికి చూపించాలనుకొంది. 1945, ఆగస్ట్ తొమ్మిదో తేదీన ఈ దారుణానికి వేదిక అయిన దౌర్భాగ్యం నాగసాకి నగరానిది. అదే కెజువో స్వస్థలం. ప్రపంచయుద్ధం ముగిసిన తొమ్మిదేళ్ళకు, 1954లో కెజువో అక్కడ పుట్టాడు. 1959లో అయిదేళ్ళ కెజువోను వెంటబెట్టుకొని అతని తల్లితండ్రులు బ్రిటిష్ గడ్డపైకి వలస వచ్చేశారు. పరాయిగడ్డపై తన జాతీయతకు సంబంధించిన కెజువో ఆలోచనలే అతని తొలి రెండు నవలలకు ఇతివృత్తంగా అమిరాయి. ఆ మాటకొస్తే అతని మొత్తం సాహిత్య జీవితమంతా ఇవే నీడలు పరుచుకుపోయాయి.నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి మూడున్నర దశాబ్దాలకు ముందే –1982లో– కెజువో ‘దూరపుకొండల అస్పష్ట దృశ్యం’ అనే నవల రాశారు. ‘అది చదివినప్పటి నుంచీ కెజువో రచనారీతిని నేను అభిమానిస్తున్నాన’న్నారు సల్మాన్ రష్డీ. ఎత్సుకో అనే నడివయసు జపనీస్ మహిళ విషాద గాథ ఈ నవలకు ఇతివృత్తం. తన కుమార్తె ఆత్మహత్య సంఘటన మిగిల్చిన గాయం నుంచి బయటపడేందుకు ఎత్సుకో చేసే ప్రయత్నాన్నే ‘దూరపుకొండల అస్పష్ట దృశ్యం’లో కవితాత్మకంగా వర్ణించారు కెజువో. రెండో ప్రపంచయుద్ధం ముగింపు సందర్భంగా 1945లో నాగసాకి నగరం ఎలావుండేదో ఎత్సుకో నెమరేసుకోవడం ఈ నవలకు ఇతివృత్తం. ఈ నవలలో, ఎత్సుకో జ్ఞాపకాలుగా చిత్రితమైన చాలా విషయాలు వాస్తవానికి కెజువో తల్లితండ్రుల అనుభవాలేనంటారు.1986లో కెజువో తన రెండో నవల ‘తేలుతున్న ప్రపంచంలో మునుగుతున్న చిత్రకారుడు’ రాశారు. మసూజీ ఓనో అనే వృద్ధ చిత్రకారుడి ఉత్తమ పురుష కథనంగా ఈ నవలను రాశారు కెజువో. టోజో నియంతృత్వానికి చెక్కభజన చేసేందుకే తన కళను వినియోగించిన గతం మసూజీది. ఆ రోజుల్లో గొప్ప చిత్రకారుడిగా ఓ వెలుగు వెలిగిన మసూజీ, తర్వాతి రోజుల్లో అప్రతిష్ఠ పాలవుతాడు. ఆ విషయమే తలచుకుని బాధపడుతుంటాడు మసూజీ. ఈ వృద్ధ చిత్రకారుడు చివరికి సమాధానపడి, టై కట్టుకుని కూలిపని చేసుకునే ఆధునిక కార్మికులను గౌరవించి, తప్పుకున్నట్లు చిత్రిస్తూ ఈ నవలను ముగించాడు కెజువో.మొత్తం మీద, కెజువో నాలుగుసార్లు బుకర్ బహుమతి కోసం నామినేట్ అయినప్పటికీ ఒక్కసారి మాత్రమే ప్రైజు పొందారు. 1989లో వెలువడిన ‘పగళ్ళ మిగుళ్ళు‘ అనే నవలకే కెజువో బుకర్ ప్రైజ్ గెల్చుకున్నారు. 1930 దశకం నాటి ఓ ప్రేమపురాణాన్ని– అదేకాలంలో ఆసియన్ దేశాల్లో వ్యాపించిన బ్రిటిష్ ప్రభుభక్తి గాథనూ పడుగుపేకలుగా అల్లిన యాత్రాచరిత్ర ఈ నవల. కథానాయకుడు స్టీవె¯Œ ్స అనే జపనీస్ బట్లరు. చివరికి, అటు ప్రేమపురాణం వల్ల కానీ, ఇటు బ్రిటిష్ ప్రభుభక్తివల్ల గానీ మన బట్లరు దొర బావుకున్నదేమీ లేదని తేల్చి, 1950 దశకంలో కథ ముగిస్తాడు కెజువో. సల్మాన్ రష్డీతో సహా, ఎందరో ప్రముఖులు ఈ నవలను కెజువో సాధించిన పరిణతికి నిదర్శనంగా ఎంచారు.కెజువో నవలల్లో, ప్రయోగాత్మక రచన ‘నెవర్ లెట్ మి గో‘ (నన్నెన్నడూ పోనియ్యకు!) అంటారు విమర్శకులు. 1990 దశకంలో పాశ్చాత్య దేశాల్లో విశేషంగా చర్చకు వచ్చిన విషయాల్లో ‘ఆర్గన్ హార్వెస్టింగ్‘ ఒకటి. కోరుకున్న మొక్కలను అంటుకట్టడం– లేదా ఆయా మొక్కల జన్యు కణ ప్రతిరూపాలను వేరే మొక్కల్లో పెంచడం లాంటిదే ‘ఆర్గన్ హార్వెస్టింగ్‘ కూడా. లోపభూయిష్ఠమైన అవయవాలకు జన్యు ప్రతిరూపాలను రూపొందించి, వాటిని వేరే శరీరాల్లో ‘పెంచుతారు.‘ మూల వ్యక్తులకు అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చేసి అవయవాల మార్పిడి చేస్తారు. ఈ ప్రక్రియనే ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవలే ‘నెవర్ లెట్ మి గో‘. 2005లో ఈ నవలకు ఆర్థర్ క్లార్క్ పురస్కారం దక్కింది. వివాదాస్పదమైన ఇలాంటి అంశాలపై రాసే నవలలు దూషణభూషణలు రెండింటినీ స్వీకరించక తప్పదు కదా!‘ఈ ప్రపంచంతో మనకు ఉందనుకునే కల్పిత సంబంధానికి అట్టడుగున ఉన్న అధోలోకం పైన మూతను తొలగించిన రచయిత’గా కెజువో ఇషిగురాను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ. 2017లో నోబెల్ సాహిత్య పురస్కారం గురించిన ప్రకటనలో సారా డేనియస్ చెప్పిన మాటలివి. అవి అక్షర సత్యాలు!- మందలపర్తి కిషోర్ -
పచ్చిగెడ్డి... ఆకలి ఇద్దరికీ ఒకటే!
ఎండ సుర్రని కొడ్తాంది. పిల్లోళ్ళు కాళ్ళకి చెప్పులేసుకోని, టోపీలు పెట్టుకోని, బ్యాటు బాల్‌లు తీసుకోని కిర్కేట్ ఆడుకున్నేకి పోతాన్నారు. ఇంటి ముందర అరుగుల మింద నీడ పోయి ఎండొచ్చింది.సందులోకి చూస్తే ఎవురూ కనపడల్యా, అందురూ ఎండ తట్టుకోల్యాక ఎవురింట్లో వాళ్ళున్నారు.ఆవులకి నీళ్ళు తాపిద్దామని అమీనా పశువుల కొట్టంలోకి పోయింది. అన్ని ఆవులు బానే ఉండాయి. ఒకే ఒక్క ఆవు మాత్రం ముడ్చుక్కోని పండుకుంది. దాని ముందర ఏసినే ఎండుగెడ్డి అట్లనే ఉంది. కొంచెం కూడా తినల్యా. ఆవుని అట్ల చూస్తానే పాణమంతా ఎట్లో అయింది అమీనాకి. గెడ్డి చేతిలోకి తీసుకోని తినిపించేకి చూసింది. ఆవు అమీనా తుక్కు చూసి చేతిలో ఉన్నే గెడ్డి తినింది.హమ్మయ్య అనుకోని ఇంగ రొంత గెడ్డి తీస్కోని తినిపించింది. ఆవు కొంచేపు తిని మొగం పక్కకి తిప్పుకుంది. కడుగు నీళ్ళల్లో అన్నం, తౌడు కలిపి తీసుకొచ్చింది. అది గూడా రోంత తినింది. ఇంగ సాల్లే అనుకోని నీళ్ళు తాపిచ్చింది. నీళ్ళు తాగి పనుకుంది ఆవు.‘‘ఎంతసేపు ఆ ఆవు దగ్గరే ఉంటావు, ఇంట్లో పని మీ నాయినొచ్చి చేస్తాడా?’’ ఇంట్లో నుండేఅరిసింది అమీనా వాళ్ళత్త హుసేన్ బీ.ఇంకేం ఆలోచన చేయకుండా పరిగెత్తి ఇంట్లోకి పోయింది అమీనా. బట్టలు నానేసి, సామాన్లు కడిగేసి, ఇంట్లో మిగిలిండే పనులు చేసేసి కుచ్చుంది. కిటికీ లోనుండి ఆకాశం కనిపిస్తాంది. దూరంగా విండుమిల్లులు కనిపిస్తాన్నాయి. అవి తిరుగుతా ఉంటే వాటినే చూస్తా చూస్తా అమీనా ఆలోచనల్లో పడిపోయింది.∙∙ అమీనాకి పెళ్ళై సంవత్సరం దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. అమీనా మీద వాళ్ళత్తకున్న కోపానికి అది కూడా ఒక కారణం. సేద్యం చేసే కుటుంబం కావడంతో చిన్నప్పట్నుండి ఆవులు, గేదెలు, ఎద్దులు చూస్కుంట పెరిగింది. పదో తర్తి వరకు ముక్కీ మూలిగి సదివి ‘కాలేజీకి పోను’ అని చెప్పేసింది. ఇంట్లో పనులు చేసుకుంట, సేన్లో పనులు, పాలు పిండేది, పచ్చిగెడ్డి కోసుకొచ్చి పశువులకి పెట్టేది ఒకటని కాదు. ఇంట్లో వాళ్ళమ్మ చేసే ప్రతిపనీ అమీనా కూడా చేసేది.ఒక అన్న, ఇద్దురు అక్కలు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. వయసులో అమీనా కంటే చానా పెద్దోళ్ళు కావడం మూలాన పెద్దగా మాట్లాడేది కాదు వాళ్ళతో. ఇంటిదగ్గర నేస్తులున్నా, వాళ్ళతో మాట్లాడేదీ తక్కువే. ఎప్పుడూ ఆవుల కొట్టంలోనే. వాటితోనే మాట్లాడేది. అవి తిరిగి మాట్లాడతాయని నమ్మేది. అన్నిటికంటే ఒక ఆవంటే రోంత ఎక్కువిష్టం అమీనాకి.అమీనా వచ్చి పక్కన నిలబడకుంటే ఏం తినేది, తాగేది కాదా ఆవు. ఎవురన్న వచ్చి ‘‘ఇప్పుడంటే ఇట్లుంది. రేప్పొద్దున పెండ్లయి వేరే ఊరికి పోతే ఎట్లమ్మే?’’ అనడిగితే, ‘‘ఎట్ల ఏం ఎట్ల? నాతో పాటు దీన్ని కూడా తీసకపోతా’’ అనేది చానా మామూలుగా.‘‘అట్లయితే పొలం, పశువులు ఉన్నే ఇంటికి, యాదో ఒక పల్లెటూరికి ఇయ్యబడ్తాది’’ అనేటోళ్ళు.‘‘పుట్టిండేది పల్లెటూర్లోనే, పెరిగిండేది ఈడనే. ఇంగ పెళ్ళి చేస్కోని పొయ్యేది పల్లెటూరికైతేనేం?’’ అనేది.‘‘కొంతమంది పొలం, పశువులు లేని ఇంటికి పోవల్ల అనుకుంటారు కదా, అట్ల అన్యాం లే’’ అనంటే, ‘‘నాకట్లాటివి ఏం లేవుబ్బా’’ అనేది.ఒకనాడు బంధువుల్లో ఒకాయప్ప వచ్చి ‘‘తెలిసినోళ్ళ పిల్లోడుండాడు తలారి చెరువులో. కొండమింద ఉంటాది ఆ ఊరు. పొలాలున్నాయి, పక్కనే సిమెంటు ఫ్యాక్టరీలో ఉజ్జోగం కూడా ఉంది, చానా ఆవులు, గేదెలు ఉన్నాయి’’ అని చెప్పినాడు. పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళొచ్చి చూసి పోయినారు, వీళ్ళు పోయి చూసొచ్చినారు. పెళ్ళి ఖాయమైంది. ఆ కొండమిందే ఉన్న హాజివలి దర్గా ఉర్సుకి చానాసార్లు పొయ్యొచ్చింది అమీనా. అదే ఊరికి పెళ్ళి చేస్కోని కోడలి మాదిరి పొయ్యేదంటే భలే సంబరమైంది అమీనాకి. రెండు నెలలు తిరక్కతలికే పెళ్ళయిపోయింది.అమీనా చెప్పినట్లే అత్తారింటికి పోతా పోతా ఆవుని కూడా పిల్చుకోని పోయింది. కొత్త పెళ్ళికూతురు కావడంతో పశువుల కొట్టం తుక్కు పంపీలేదు అమీనాని కొన్నిరోజులు. ఆవు తింటాందో లేదో అనే దిగులు. సరిగ్గా తినలేదు ఆవు.కొన్నిరోజులకి సేన్లో పని, పశువులకి మేత వేసేది, పాలు పిండేది మొదులుపెట్టింది. ఆవు మాత్రం కొంచెం కొంచెమే తినేది. ‘ఎందుకుబ్బా’ అని ఆలోచించుకుంది అమీనా.ఇంటిపనుల్లో, అత్త భయంతో తొందరగా గుర్తుకురాలేదు కానీ, మళ్ళా తెలిసింది అసలు సంగతి. పశువులకి పచ్చిగెడ్డే లేదని. ‘ఎందుకుబ్బా ఇట్లా?’ అనుకోని ఆ పొద్దు అట్లే ఉంది.మరుసటి నా పొద్దు కొడవలి తీసుకోని పచ్చిగెడ్డి కోసరం పోయింది. ఇండ్లన్ని దాటుకొని సేన్ల వైపు నడిసింది. ఎక్కడే గానీ రోంత కూడా పచ్చిగెడ్డి కనపరాల్యా. ఒక్కో సేను దాటుకోని పోతాంది. శనగలు, కుసాలు, ఆముదం తప్పించి వేరే పంట లేదు. ఎంతదూరం పోయినా ఇదే కత.విండు మిల్లులు దాటి పోయింది. అవి నిదానంగా తిరుగుతా ఉంటే వాటి తుక్కే చూసుకుంట నిలబడిపోయింది. తన జీవితం కూడా వాటి మాదిరే, అంత నిదానమైపోయినట్లు అనిపిస్తాంది. లోపలంతా ఏందో తెలియని నిస్సత్తువ. నడిసినంత దూరం నడిసి ఇంగ చేతకాక ఎనక్కి తిరిగింది. దర్గా దగ్గర నీడలో కొంచేపు కుచ్చుంది. ఉత్త చేతులతో ఇంటికొచ్చింది. ‘ఏందిబ్బా ఇంత తమాషా!’ అనుకుంది. ఇంట్లో అత్తని అడుగుదామనుకుంది. ఆయమ్మ మాట్లాడేది తక్కువా, అరిసేది ఎక్కువా అని మానుకుంది.సాయంకాలమైనాక ఇంటి పక్కన ముసిలాయమ్మొచ్చి బయట అరుగు మింద కుచ్చుంది. కసువు నూకుదామని పరక తీస్కోని బయటికొచ్చిన అమీనాని చూసి ‘‘ఏం పాపా, ఎట్లున్నావు?’’ అని ఎచ్చరిచ్చింది.‘‘బాగున్నా అవ్వా, నువ్వెట్లున్నావు?’’ అనడిగింది అమీనా.‘‘ఊరు పొమ్మంటాంది, కాడు రమ్మంటాంది. అట్లనే బతుకుతాండా’’ అని చెప్పింది ముసిలాయమ్మ.అమీనాకి నవ్వొచ్చింది కానీ ఆపుకోని ‘‘కాపీ తాగినావావ్వా?’’ అనడిగింది.‘‘ఇంగా లేదుమ్మా, కాపీ మాటేం గానీ నువ్వు కొడవలి తీసుకోని యాడికో పోతివే పొద్దన. సేను కాడికా?’’ అనడిగింది ముసిలాయమ్మ.‘‘అవునువ్వా, పశువులకి రోంత పచ్చిగెడ్డి ఏమన్నా దొరుకుతాదేమోనని పోతిని. యాడే గాని కనపరాల్యా’’ అని చెప్పింది కసువు నూక్కుంట.ముసిలాయమ్మ నగింది. నోట్లో మిగిలినే నాలుగు పళ్ళు కనిపిచ్చేటట్లు నగింది.‘‘ఏం వ్వా, అట్ల నగుతాన్నావ్?’’ అనడిగింది అమీనాకి అర్థంకాక.‘‘ఈ ఊర్లో పచ్చిగెడ్డి యాడిది పాపా. ఎనభై ఏళ్ళయింది నేను పుట్టి. ఈ ఊర్లోనే పుట్టి, ఈడే పెండ్లి చేస్కోని కాపురం చేసినా. నా పిల్లోళ్ళ పిల్లోళ్ళు కూడా పెద్దగైనారు. ఈ పొద్దుటిదాంక పచ్చిగెడ్డి అనేదే పెట్టింది లేదు పశువులకి’’ అని చెప్పి ఆపింది.ముసిలాయమ్మ ఏం చెప్తాందో అర్థం కాలేదు అమీనాకి.మళ్ళా ముసిలాయమ్మే ‘‘మనూరు కొండమింద గదా ఉండేది. బోరుకి నీళ్ళు పడవు. పడినా తాగేకి సరిపోతాయి గానీ సేద్యానికి సాలవు’’ అని చెప్పింది.దావెంబడి ఎంతసేపు నడిసినా శనగలు, కుసాలు, ఆముదాలే ఎందుకు కనపడినాయో అప్పుడర్థమైంది అమీనాకి.‘‘ఈ మాటే తెలీదువ్వా నాకు’’ అనింది అమీనా.‘‘తెలీక ఏం పాపా, కొండ మింద ఉన్నే ఊర్లో ఇట్లే ఉండేది.’’‘‘ఏమో, మా ఆవు వట్టిగెడ్డి సరిగ్గా తినడం ల్యా. మా ఊర్లో పచ్చిగెడ్డి బాగలవాటు. అందుకే దొరుకుతాదేమో అని పోతిని’’ కసువు నూకేది అయిపోయింది.‘‘యాడ పచ్చిగెడ్డిలే పాపా, పశువుల గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తాది. ఈ ఊర్లోని పశువులకి అసలు పచ్చిగెడ్డి అనేది ఒకటుంటాదని గూడా తెల్దు. శనగపొట్టు, సొప్ప, కడుగునీళ్ళల్లో అన్నం కలిపి పెట్టేది, పశువుల దాణా నీళ్ళల్లో కలిపి పెట్టేది – ఇవే తిండి. పాపం ఇవి తినే, పాలు ఇంతగా ఇస్తాన్నాయి. ఇంత ఆరోగ్గెంగా ఉంటాన్నాయి. ఇంగ పచ్చిగెడ్డి గనక దొరికితే ఇంగెన్ని పాలిస్తాయో, ఇంగెంత ఆరోగ్గెంగా ఉంటాయో...’’ అని చెప్తా పోతాంది ముసిలాయమ్మ.కసువు దిబ్బలో పోసొచ్చి పక్కనే కుచ్చుంది అమీనా.‘‘పెళ్ళికో, తిరుణాలకో వేరే ఊరు పోతే ఆడున్నే పశువులని చూసి ఇవి ఎంత అదృష్టం చేసుకున్నాయో అనుకుంటా. మనూరి పశువులు గుర్తుకొస్తాయి అప్పుడు. మనూరోళ్ళు ఎవురన్నా పశువులని కొండ కిందున్నే ఊర్లకి అమ్మితే పచ్చిగెడ్డి తిని బాగా బతుకుతాయిలే ఇంగ అనుకుంటారు. ఎంతో అవసరమయితే తప్ప వేరే ఊరి నుండి మనూరికి పిల్చుకోని రారు.ఈడే పుట్టిండేటివి అయితే ఇట్లే అలవాటు పడతాయిలే. అట్లాటిది మీ ఊరి నుండి తెచ్చినావు పాపా ఈ ఆవుని. యాడ అలవాటైతాది?’’ అనడిగింది అమీనాని.‘‘అదేవ్వా, నేను కూడా అదే అనుకుంటాన్నా నువ్వు చెప్తాంటే’’ అనింది అమీనా.ముసిలాయమ్మ ముందుకి వంగి ‘‘అవు పాపా, మీయత్త బానే ఉంటాదా నీతో, గొడవలేం పడదా?’’ అనడిగింది గుసగుసలాడుతున్నట్లే.అమీనా ఆ పక్కా, ఈ పక్కా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకోని సన్నగా ‘‘ఏం చెప్పేదిలేవ్వా. చానా అద్మానం మనిషి. అన్నం ఎక్కువసేపు తింటే గొడవే. అందరికన్నా ముందే తిన్నా గొడవే. తిండిలేని చోటు నుండి చేసుకొచ్చుకున్యాం. అదీ ఇదీ అని ఎన్ని మాటలంటుందో’’ అని చెప్పింది.‘‘అంటే అనుకోనీలే పాపా, నువ్వు ఆయమ్మ నోటికి తగలాకు. గొడవేస్కుందంటే ఇంగ అయిపాయ. పనికి పోయినే సాట ఆయమ్మని ఎచ్చరించల్లన్నా భయమే...’’ అని చెప్పి చిన్నగ అరుగు మింది నుండి లేసింది ముసిలాయమ్మ.ఎట్లా పచ్చిగెడ్డి దొరకదని తెలిసినాక ఇంగ ఉండే వాటిల్లోనే ఆవు ఏమి బాగ తింటుందో చూసి కడుపు నిండా కాకపోయినా ఒకరకంగా తినేటట్టు ప్రయత్నిస్తాంది అమీనా.అట్లనే ఆరు నెలలు గడిసిపోయినాయి. ఆవుకి ఇంగా అలవాటు కాలేదు ఊరు. అమీనాకి అప్పుడప్పుడే అలవాటయితాన్నాయి ఆ ఇల్లు, అత్త తిట్లు. ‘‘ఏమ్మా, ఏమన్నా విశేషమా?’’ అని అడిగేటోళ్ళు ఎక్కువైనారు. ఇంగా ఏమీ లేదు అని చెప్పేకి సాలయితాంది అమీనాకి. ఇంగో వైపు వాళ్ళత్త. కొంచేపు కుచ్చోని కనిపిస్తే సాలు యాదో ఒక పని చెప్తుంది. చేసేది కొంచెం ఆలస్యమైనా నోటికొచ్చిండేది తిడ్తుంది. ఆ తిట్టేది గూడా పని చేసేటప్పుడు కాక అన్నం తినేకి కుచ్చుంటానే మొదులుపెడ్తుంది. ఆ తిట్లు తినుకుంట అన్నం లోపలికి పోదు. చెయ్యి కడుక్కోని మళ్ళా పనిలో పడిపోతుంది అమీనా.మొగునికి చెప్పి చూసింది, లాభం లేదు. పుట్టింట్లో వాళ్ళకి చెప్పి చూసింది. ‘‘మామూలేమ్మా ఇంగా, సర్దుకుపోవల్ల’’ అని చెప్పినారు. ఎవరికీ పట్టినట్టు అనిపించల్యా. ఇంగో పక్క ఆవు పరిస్థితి బాల్యాకుండా పోతాంది. జీవితమంతా ఎట్లో అనుకుంటే, ఇంగెట్లో పోతాన్నెట్లు అనిపిస్తాంది.ఇంట్లో పని, సేన్లో పని, పశువుల పని ఈ మూడింటితోనే సరిపోతాంది. పెండ్లిగాకముందు కూడా చేసేది ఇవే పనులే అయినా ఏందో ఇప్పుడంతా మారిపోయినట్లు అనిపిస్తాంది. చుట్టూ యాడ చూసినా పచ్చటిపొలాలు కనపడే ఊరి నుండి వచ్చినే అమీనాకి ఆ సిమెంటు ఫ్యాక్టరీ, ఆ విండు మిల్లులు, గెడ్డి లేని సేన్లు చూస్తాంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చి పడినానో అనిపిస్తాంది.ఊర్లో ఉన్నెప్పుడు సేనుకి పోయి వస్తా వస్తా పెన్నేట్లో ఆడుకున్నేది గుర్తుకొస్తాది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు పచ్చిగెడ్డి మోపు తీసుకొచ్చి పశువులకి పెట్టేది గుర్తుకొస్తాది. టీవీ ఆన్ చేస్కోని తట్టలో అన్నం, పప్పు, చెనిక్కాయల పొడి, నెయ్యి పెట్టుకోని టీవీ చూస్కుంట ఎంచేపు కావల్సింటే అంచేపు తినేది గుర్తుకొస్తాది. కాపీ చేస్కోని లోటాలో ఏస్కోని బయట అరుగుమింద కుచ్చోని తాగేది గుర్తుకొస్తాది.మళ్ళా ఇంతకుముందు మాదిరి ఎప్పుటికైనా అయితాదా అని ఆలోచించీ, ఆలోచించీ ఒక నిర్ణయానికొచ్చింది. తనకెట్లా తప్పదు. యాదో ఒకరోజు తనకి నచ్చినట్లు మార్చుకోనీకి ప్రయత్నించల్ల.అప్పుటిదాకా ఇట్లనే. కానీ ఆవెందుకు ఆకలికి ఉండల్ల. దాని తిండిని, దాని ఆరోగ్యాన్ని నా మూలాన ఎందుకు దూరం చేయల్ల అనుకుంది.పుట్టింటోళ్ళని పిలిపిచ్చింది. ఆవుని తీస్కోపొమ్మని చెప్పింది. ఒకనాడు లగేజ్ ఆటో తెచ్చి ఆవుని తీసకపోయినారు పుట్టింటోళ్ళు. చానా బాధ పడతానే పంపింది. ఆవు పోనంటే పోనని మొండికేసి పోయింది.ఆరోజంతా ఏడూస్తానే పండుకుంది అమీనా. మళ్ళా ఇంటికి పోన్ చేసి ‘ఆవెట్లుంది, బాగా తింటాంద్యా లేదా’ అనడిగింది. ‘బాగా తింటాంది, ఇప్పుడు బాగుంది’ అని చెప్తే సంబరపడిపోయింది.ఆవిప్పుడు కడుపు నిండా తింటాంది, అమీనా తినేది ఎప్పుడో..!?- మొహమ్మద్ గౌస్ -
కరీబియన్ వేడుక... కెనడా వేదిక
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్ ఆగస్టు ఒకటిన టొరంటో ఎగ్జిబిషన్ ప్లేస్‌లో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. కరీబియన్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు టొరంటోకు చేరుకున్నారు.ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు..ప్రస్తుతం ఈ కార్నివాల్లో భాగంగా కంటికిఇంపుగా సాగే భారీ పరేడ్లు, సంగీత పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీబియన్ దీవుల నుంచి వచ్చిన కళాకారుల సంగీత హోరు, రంగురంగుల దుస్తులలో నృత్యాలు చేస్తూ సాగే పరేడ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకనాడు చిన్నగా ప్రారంభమైన ఈ పండుగ, నేడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగి, టొరంటో నగర వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది.టొరంటో ఆర్థిక వ్యవస్థకు ఏటా అర బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే ఈ కరీబియన్ కార్నివాల్ ఉత్సవ ప్రస్థానం 1967లో ప్రారంభమైంది. కెనడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, అక్కడ నివసిస్తున్న కరీబియన్ సమాజం తమ సాంస్కృతిక మూలాలను చాటుకోవడానికి 1967లో ‘కరిబానా’ పేరుతో ఈ వేడుకను మొదటిసారిగా ప్రారంభించింది. నాటి యోంగ్ స్ట్రీట్‌లో జరిగిన తొలి పరేడ్‌లో దాదాపు యాభైవేల మంది పాల్గొన్నారు. కెనడాకు కరీబియన్ ప్రజలు అందించిన ఈ బహుమతే, కాలక్రమేణా నేటి భారీ అంతర్జాతీయ ఉత్సవానికి బలమైన పునాదిగా మారింది.కరీబియన్ ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ వేడుక ‘కరీబానా’ పేరుతో మొదలైంది. తరువాతి కాలంలో ఈ పేరును ‘టొరంటో కరీబియన్ కార్నివాల్‘గా మార్చారు. కెనడాలో స్థిరపడిన కరీబియన్ ప్రజల సాంస్కృతిక పరిరక్షణకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ వేడుక ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- రమా జంబుల -
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్‌కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్‌గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్‌ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్‌లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ -
అది అంత ప్రమాదమా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!
మా ఏడేళ్ల బాబుకు తరచు దగ్గు వస్తోంది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. పిల్లికూతలు కూడా వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇన్ హేలర్ వాడమన్నారు. కానీ ఇంట్లో వాళ్లు ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం అదే వాడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. నిజంగానే ఇన్ హేలర్ అంత ప్రమాదకరమా? అది అలవాటు అవుతుందా?– సుమలత, విజయవాడ.ఇది మీ ఒక్కరి సందేహం కాదు. పిల్లలకు దగ్గు, వీజింగ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు ప్రతి పేరెంట్ అడిగే మొదటి ప్రశ్న ఇదే. నిజానికి ఇన్ హేలర్ వల్ల పిల్లలకు ప్రమాదం ఉండదు. కాని, సరైన సమయంలో ఇన్హేలర్ను ఆలస్యం చేయడమే అసలు ప్రమాదం. సమయానికి సరైన చికిత్స అందకపోతే ఊపిరితిత్తుల్లో వాపు పెరిగి, శ్వాస సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. భయంతో చికిత్సను వాయిదా వేయడం కంటే, సరైన నిర్ధారణ చేయించుకుని వైద్యుడి సూచన మేరకు చికిత్స ప్రారంభించడం మంచిది. అందుకే ఇప్పుడు ఇన్ హేలర్, ఉబ్బసం, అలాగే ఆధునిక లంగ్ ఆసిలోమెట్రీ పరీక్షల గురించి ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం.ఇన్ హేలర్ అంటే స్టెరాయిడ్స్ మందా? అది ప్రమాదకరమా?కాదు. ఇది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఇన్ హేలర్లోని మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. అందుకే చాలా తక్కువ మోతాదులోనే మంచి ఫలితం ఇస్తుంది. శ్వాసనాళాల్లోని వాపు తగ్గి, పిల్లికూతలు, రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతాయి. పిల్లలు మళ్లీ హాయిగా పరుగులు తీస్తూ ఆటలు ఆడగలుగుతారు. వైద్యుడి సూచన మేరకు వాడితే ఇన్ హేలర్ పూర్తిగా సురక్షితమైన చికిత్స.ఒకసారి ఇన్ హేలర్ మొదలుపెడితే జీవితాంతం వాడాలా?అసలు కాదు. ఇన్ హేలర్ అలవాటు చేసే మందు కాదు. అవసరమైనంత కాలం మాత్రమే వాడాల్సిన చికిత్స. పిల్లల ఆరోగ్యం మెరుగైతే వైద్యుడు మోతాదును క్రమంగా తగ్గిస్తారు. చాలామంది పిల్లల్లో పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితి వేరు కాబట్టి, చికిత్స వ్యవధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది.వీజింగ్ ఉన్న ప్రతి చిన్నారికీ ఇన్ హేలర్ అవసరమా?అన్ని వీజింగ్లూ ఆస్తమా కావు. వైరస్ ఇన్ ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర శ్వాస సమస్యల వల్ల కూడా వీజింగ్ రావచ్చు. అందుకే కారణం తెలుసుకోకుండా ఇన్ హేలర్ ప్రారంభించకూడదు. ముందుగా సరైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించడం చాలా ముఖ్యం.లంగ్ ఆసిలోమెట్రీ పరీక్ష అంటే ఏమిటి?పిల్లల ఊపిరితిత్తుల పనితీరును సులభంగా అంచనా వేసే ఆధునిక పరీక్షే లంగ్ ఆసిలోమెట్రీ. ఇందులో సూదులు ఉండవు, నొప్పి ఉండదు, బలంగా ఊదాల్సిన అవసరమూ లేదు. మూడేళ్ల నుంచి చిన్నారులకు కూడా ఈ పరీక్ష చేయవచ్చు. కొద్ది నిమిషాల్లో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా ఉబ్బసం ఉందా, చిన్న శ్వాసనాళాల్లో వాపు ఉందా, ఇన్ హేలర్ అవసరమా, ఇస్తున్న చికిత్స సరిగా పనిచేస్తోందా వంటి విషయాలను వైద్యుడు కచ్చితంగా గుర్తించగలుగుతారు. దీంతో అవసరమైన పిల్లలకు మాత్రమే సరైన చికిత్స అందించి, అనవసరంగా ఇన్ హేలర్ వాడాల్సిన పరిస్థితిని నివారించవచ్చు.ప్రతి దగ్గుకూ ఇన్ హేలర్ అవసరమా?లేదు. దగ్గు రావడానికి వైరస్ ఇన్ఫెక్షన్లు, ముక్కు అలర్జీ, సైనస్ సమస్యలు, కడుపులోని ఆమ్లం పైకి రావడం, అడినాయిడ్ సమస్యలు, వాతావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు ఉంటాయి. పిల్లవాడు బాగున్నాక కూడా పరీక్ష అవసరమా?అవసరం ఉండొచ్చు. బయటకు దగ్గు, దమ్ము తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో స్వల్ప వాపు కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిని ఈ పరీక్ష ద్వారా గుర్తించి చికిత్స కొనసాగించాలా, తగ్గించాలా లేదా పూర్తిగా ఆపాలా అనే విషయాన్ని వైద్యుడు నిర్ణయిస్తారు.వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు పిల్లలకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తే, పెదాలు లేదా గోళ్లు నీలిరంగులోకి మారితే, పిల్లలు మాట్లాడలేకపోయినా, తినలేకపోయినా, ఇన్ హేలర్ వాడిన తర్వాత కూడా ఉపశమనం లేకపోయినా, తరచు వీజింగ్ వస్తున్నా లేదా రాత్రిపూట దగ్గు వల్ల నిద్రపట్టకపోయినా వెంటనే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇన్ హేలర్ అనేది భయపడాల్సిన చికిత్స కాదు. సరైన సమయంలో ప్రారంభిస్తే అది పిల్లల ఊపిరితిత్తులను రక్షించే నమ్మకమైన మిత్రుడు. అవసరం లేనప్పుడు వాడకూడదు. అవసరమైనప్పుడు మాత్రం ఆలస్యం చేయకూడదు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్మేనిమాట..నమలడానికి పని ఇస్తే మెదడు మేల్కొంటుంది! గట్టిగా ఉండే పండ్లు, కూరగాయలు నమలడం వల్ల దవడలకే కాదు, మెదడుకూ మేలు జరుగుతుంది. నమిలే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి, అప్రమత్తత మెరుగుపడుతుంది. అంటే... ఒక యాపిల్ తినడం కూడా మెదడుకు చిన్న మేల్కొలుపే! -
నకిలీ వారసుడు! తల్లి అనుమానమే నిజమైంది!
‘కావమ్మ మొగుడు... కావమ్మ మొగుడు అని అందరూ అంటుంటే... కామోసనుకున్నాను నాకేం తెలుసు’ అన్నాడట ఒకడు. అలా అందరూ ‘అతడు తప్పిపోయిన మీ కొడుకే, అచ్చం అలాగే ఉన్నాడ’ని చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి నిజమే అని నమ్మాడు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొడుకు తిరిగొచ్చాడని, ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. కానీ, కన్నపేగు కదా! ఆ తల్లి ఆ వ్యక్తిని తన కొడుకుగా అంగీకరించలేకపోయింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు చేరింది. 41 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎవరో తేలింది.‘వారసుడొచ్చాడు’ సినిమాలో వెంకటేష్‌లా, ‘అతడు’లో మహేష్‌బాబులా... కొడుకుగా ఆ వ్యక్తి మరొకరి ఇంటికెళ్లాడు. ఆ సినిమాల్లో హీరోలు ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు వారసులుగా వెళ్లారు. కానీ ఈ వ్యక్తి ఆస్తులు కొట్టేసి, విలాసంగా జీవించేందుకు నకిలీ వారసుడిగా ఆ ఇంట అడుగుపెట్టాడు. అయితే నిజం నిలకడమీద తెలిసింది. అతని మోసం బట్టబయలైంది. ఆ తల్లి నమ్మకమే నిజమని రుజువైంది.బీహార్‌లోని నలందా జిల్లా ముర్గావస్ గ్రామానికి చెందిన కామేశ్వర్ సింగ్ ఓ భూస్వామి. 1977లో అతని ఏకైక కుమారుడు కన్హయ్య పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతగా గాలించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి జాడ తెలియలేదు. చివరికి కామేశ్వర్ సింగ్ ఓ మంత్రగాడిని కలిశాడు. కొడుకు ఆచూకీ కోసం ఆరా తీశాడు. ‘మీ కొడుకు బతికే ఉన్నాడు. త్వరలోనే తిరిగొస్తాడ’ని అతడు చెప్పాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొడుకు తిరిగి రాలేదు. ఆ బెంగతో కామేశ్వర్ ఆరోగ్యం క్షీణించింది. అయితే తన కొడుకు తిరిగొస్తాడనే ఆశ చావలేదు. కన్హయ్య తప్పిపోయిన నాలుగేళ్లకు అతడి ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి ఓ యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. తాను ముర్గావస్ గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామస్థులు అతడే కన్హయ్య అని భావించారు. ఆ విషయాన్ని కామేశ్వర్సింగ్కు చెప్పారు. ‘వయోభారంతో నా చూపు మందగించింది. అతడ్ని సరిగా గుర్తించలేకపోతున్నాను. మీరందరూ నాకొడుకే అని చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి అతడ్ని నా ఇంటికి తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు.అంగీకరించని తల్లి..తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్న కామేశ్వర్ సింగ్ భార్య రామ్సఖీదేవికి కుమారుడు తిరిగొచ్చాడనే విషయం తెలిసింది. ఆ వ్యక్తిని చూసి తమ కుమారుడు కాదని స్పష్టంగా చెప్పింది. అయితే అతడు వచ్చిన తర్వాత నుంచి తన భర్త ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో కొంతకాలం వేచి చూసింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి తల ఎడమ వైపున గాయం గుర్తు ఉండేదని, ఈ యువకుడి తలపై అలాంటి గుర్తులేవీ కనిపించడం లేదని తెలిపింది. తమ బంధువులు, ఉపాధ్యాయుల్ని సైతం ఆ వ్యక్తి గుర్తించలేదని పేర్కొంది. తమ కుమారుడి వేషంలో వచ్చిన అతడు ఓ మోసగాడని తేల్చి చెప్పింది.నాలుగు దశాబ్దాలు అదే కుటుంబంలోతల్లి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తానే కన్హయ్యను అంటూ తిరిగి అదే ఇంటికి వెళ్లాడు. తండ్రి అతడ్ని నమ్మి ఇంట్లోనే ఉంచుకున్నాడు. అక్కడే ఉంటూ క్రమంగా ఆ కుటుంబంలో సభ్యుడిగా మారాడు. కన్హయ్య పేరుతో గుర్తింపు కార్డులు పొందాడు. డిగ్రీ పూర్తి చేశాడు. వివాహం చేసుకున్నాడు. నాలుగు దశాబ్దాల పాటు నకిలీ గుర్తింపుతో కొనసాగాడు. ఈలోగా భూస్వామికి చెందిన కొంత భూమిని సైతం విక్రయించాడు.చివరికి మిస్టరీ వీడిందిదయానంద్ గోసాయి పేరుతో జముయి జిల్లాలోని అతడి స్వగ్రామం చిరునామాతో ఉన్న ఓ లేఖ పోలీసులకు లభించింది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి విచారించారు. అతడి ఫొటో చూసిన కొందరు గ్రామస్థులు అతడు దయానంద్ గోసాయిగా గుర్తించారు. దీంతో అతడు దయానంద్ పేరుతో మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. అందులో 1982లో మరణించినట్టు నమోదు చేశారు. అయితే డెత్ సర్టిఫికెట్ 2014లో జారీ చేశారు. 32 ఏళ్ల తర్వాత జారీ చేయడంతో కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి తోడు కన్హయ్య పేరుతో జారీ అయిన గుర్తింపు పత్రాల్లోనూ పుట్టిన తేదీ వేర్వేరుగా ఉండడాన్ని కోర్టు గుర్తించింది.డీఎన్ఏ పరీక్షలకూ నిరాకరణకామేశ్వర్ సింగ్ కుటుంబ వారసుడా? కాదా? అని తేల్చేందుకు ఆధారమైన డీఎన్ఏ పరీక్షకు సైతం అతడు నిరాకరించాడు. తానే కన్హయ్య అని నిరూపించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అతడు ఉపయోగించుకోలేదు. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు అతడు కన్హయ్య సింగ్ కాదు దయానంద్ గోసాయి అని నిర్ధారించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఐపీసీ సెక్షన్ 419 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 420 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 120 బి కింద ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2022లో ఈ తీర్పు వెలువడింది. అప్పటికే ఆ తల్లిదండ్రులిరువురూ మృతి చెందారు. అయితే అసలు కన్హయ్య ఏమయ్యాడనే మిస్టరీ మాత్రం వీడలేదు.- దిలీప్ మాదిరెడ్డి -
కరీబియన్ వేడుక... కెనడా వేదిక
ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్ కార్నివాల్’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్ పరేడ్ ఆగస్టు ఒకటిన టొరంటో ఎగ్జిబిషన్ ప్లేస్‌లో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. కరీబియన్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు టొరంటోకు చేరుకున్నారు.టొరంటో ఆర్థిక వ్యవస్థకు ఏటా అర బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే ఈ కరీబియన్ కార్నివాల్ ఉత్సవ ప్రస్థానం 1967లో ప్రారంభమైంది. కెనడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, అక్కడ నివసిస్తున్న కరీబియన్ సమాజం తమ సాంస్కృతిక మూలాలను చాటుకోవడానికి 1967లో ‘కరిబానా’ పేరుతో ఈ వేడుకను మొదటిసారిగా ప్రారంభించింది. నాటి యోంగ్ స్ట్రీట్‌లో జరిగిన తొలి పరేడ్‌లో దాదాపు యాభైవేల మంది పాల్గొన్నారు. కెనడాకు కరీబియన్ ప్రజలు అందించిన ఈ బహుమతే, కాలక్రమేణా నేటి భారీ అంతర్జాతీయ ఉత్సవానికి బలమైన పునాదిగా మారింది.కరీబియన్ ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ వేడుక ‘కరీబానా’ పేరుతో మొదలైంది. తరువాతి కాలంలో ఈ పేరును ‘టొరంటో కరీబియన్ కార్నివాల్‘గా మార్చారు. కెనడాలో స్థిరపడిన కరీబియన్ ప్రజల సాంస్కృతిక పరిరక్షణకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ వేడుక ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలుప్రస్తుతం ఈ కార్నివాల్లో భాగంగా కంటికిఇంపుగా సాగే భారీ పరేడ్లు, సంగీత పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీబియన్ దీవుల నుంచి వచ్చిన కళాకారుల సంగీత హోరు, రంగురంగుల దుస్తులలో నృత్యాలు చేస్తూ సాగే పరేడ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకనాడు చిన్నగా ప్రారంభమైన ఈ పండుగ, నేడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగి, టొరంటో నగర వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది. ∙ రమా జంబుల -
అతిపెద్ద పిగ్గీబ్యాంకు
పిగ్గీబ్యాంకులు సాధారణంగా పిల్లలు తేలికగా పట్టుకొనేలా ఉంటాయి. పిగ్గీబ్యాంకులతో ఆడుకుంటూ, వాటిలో చిల్లర డబ్బులు దాచుకుంటూ, పిల్లలు తొలి పొదుపు పాఠాలు నేర్చుకుంటారు. కొలంబియాలోని ఒక థీమ్ పార్కులో ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద పిగ్గీబ్యాంకు బొమ్మను ఏర్పాటు చేశారు. రకీరా నగరంలోని ‘ప్యూబ్లిటో డి బారో’ అనే థీమ్ పార్కులో 29.6 అడుగుల ఎత్తు, 33.11 అడుగుల పొడవు ఉన్న పిగ్గీ బ్యాంకు బొమ్మను ప్రత్యేక ఆకర్షణగా ఇటీవలే నెలకొల్పారు.దీని బరువు దాదాపు ముప్పయి టన్నులు. మామూలు పిగ్గీ బ్యాంకుల మాదిరిగానే దీనికి కూడా కాయిన్ స్లాట్ ఉంది. సందర్శకులు ఇందులో వేసే డబ్బులను కొలంబియా ప్రభుత్వం జంతు సంరక్షణ కేంద్రాల నిర్వహణ కోసం ఖర్చు చేయనుంది. మానో డెల్ ఆర్టిసానో అనే కొలంబియన్ శిల్పి దీనిని రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పిగ్గీబ్యాంకుగా దీనికి గిన్నిస్ రికార్డు కూడా దక్కడం విశేషం. -
చాక్లెట్ స్టార్!
క్యాడ్బరీ యాడ్‌లో ఓ చిరునవ్వుతో మెరిసిన అమ్మాయే– నేడు కుర్రాళ్ల కొత్త క్రష్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ అందాలభామ ప్రయాణమంతా రంగులే కాదు. నవ్వించే కథలూ ఉన్నాయి; కన్నీళ్లు పెట్టించే జ్ఞాపకాలూ ఉన్నాయి! ఆ స్ట్రగుల్స్, స్టార్డమ్, సరదా ముచ్చట్లు అన్నీ భాగ్యశ్రీ బోర్సే మాటల్లోనే!అమ్మకు ఇచ్చిన మాట!నేను పుట్టిన కొద్దిరోజులకే నాన్న ఉద్యోగం పోయింది. ‘నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏదైనా పని ఇవ్వండి’ అని ఆయన ఉద్యోగాల కోసం తిరిగిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు నుంచి ఒకటే నిర్ణయం తీసుకున్నా– బాగా డబ్బు సంపాదించాలి. మా నాన్న మళ్లీ ఎప్పుడూ తలవంచకూడదు.రూ.300తో గడిచిన రోజులు!మా ఇంట్లో ఒక చిన్న డైరీ ఉండేది. అందులో రూ.10 పచ్చిమిర్చి, రూ.10 పాలకూర... ఇలా ప్రతి ఖర్చూ రాసుకునేవాళ్లు. వారానికి కేవలం రూ.300తో ఇంటిని నడిపిన రోజులు చూశాను. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రతి విజయానికి విలువ తెలుసు.నైజీరియాలో బుల్లీయింగ్!నా చిన్నతనంలో ఏడేళ్లు నైజీరియాలో గడిచాయి. అక్కడ నా యాస, భాష కారణంగా చాలాసార్లు బుల్లీయింగ్‌కు గురయ్యాను. అప్పట్లో నలుగురి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. అలాగే, ఎత్తంటే కూడా... అందుకే, దుబాయ్‌లో స్కైడైవింగ్ చేశా. అలా ఇప్పుడిప్పుడే నా భయాలన్నింటిని నెమ్మదిగా తగ్గించుకుంటున్నాను.మోడల్‌గా మొదలైన ప్రయాణం!సినిమాల కంటే ముందే యాడ్స్ నా జీవితంలోకి వచ్చాయి. ముఖ్యంగా క్యాడ్బరీ డెయిరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో చాలామంది నన్ను గుర్తుపట్టారు. అక్కడి నుంచే సినిమాల ప్రయాణం మొదలైంది.నా డైలాగ్స్ నేనే చెబుతా!తెలుగు నా మాతృభాష కాదు. కానీ ప్రేక్షకులకు నిజాయితీగా కనిపించాలంటే నా డైలాగ్స్ నేనే చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే ‘మిస్టర్ బచ్చన్’ కోసం చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను.పెళ్లి ప్రశ్నతో వైరల్!ఒక కాలేజ్ ఈవెంట్లో ‘ఫ్రెండ్, డేట్, మ్యారీ’ గేమ్ ఆడుతూ... నా సినీ హీరోలందరూ అప్పటికే పెళ్లైన వారే, వారిని మళ్లీ ఎలా మ్యారీ చేస్తానని చెప్పా. ఆ తర్వాత వచ్చిన మీమ్స్ చూసి బాగా నవ్వుకున్నా! ఏదో సరదాగా చెప్పిన మాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు.రాజమౌళి సర్‌తో సినిమా... నా డ్రీమ్!ప్రతి నటికి ఒక డ్రీమ్ లిస్ట్ ఉంటుంది. నా లిస్ట్‌లో రాజమౌళి సర్, త్రివిక్రమ్ సర్లతో కలిసి పని చేయడం మొదటి స్థానంలో ఉంటుంది.హైదరాబాద్... నా కర్మభూమి!నేను ఎన్నిసార్లు కిందపడినా, మళ్లీ లేవడానికి బలం ఇచ్చింది ప్రేక్షకుల ప్రేమే! ముఖ్యంగా హైదరాబాద్ నాకు చాలా స్పెషల్. ఈ నగరాన్ని నేను నా ‘కర్మభూమి’గా భావిస్తాను. -
కాలం చెరపలేని బంధం నేస్తనిధి
హాట్‌స్పాట్ అడగకుండానే ఆన్ చేసేవాడు... ఓటీటీ పాస్వర్డ్ లాంగ్ టైమ్ షేర్ చేసేవాడు... బిర్యానీ ఆర్డర్ చేస్తే బిల్ కట్టేవాడు... బ్రేకప్ స్టోరీని వందోసారి చెప్పినా ఓపిగ్గా వినేవాడు... అర్ధరాత్రి ఫోన్ చే సినా సొల్యూషన్ తో రెడీగా ఉండేవాడు.. మెంటల్ పీస్ పోయిన ప్రతిసారీ మందులా పని చేసేవాడు... జీవితంలో లోబ్యాటరీ అనిపించిన ప్రతిసారీ పవర్‌బ్యాంక్‌లా నిలిచేవాడు... ఇంట్లో వాళ్లకు తెలియని మన మరో వెర్షన్ మొత్తం తెలిసిన ఏకైక వ్యక్తి... వాడే... మన బెస్ట్ ఫ్రెండ్! జీవితంలో నవ్వులను పెంచి... బాధలను పంచుకుని... ప్రతి జ్ఞాపకాన్ని మరింత అందంగా మార్చిన ప్రతి నేస్తానికి... హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!జీవితంలో కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి... కొన్ని పెళ్లితో వస్తాయి... కానీ మనమే ఎంచుకునే ఏకైక బంధం – స్నేహం! అయితే, ప్రతి స్నేహానికి ఒక సినిమా ఉంటుంది. మొదటి పరిచయం... మొదటి గొడవ... మొదటి బంక్... మొదటి బర్త్‌డే సర్ప్రైజ్... మొదటి బ్రేకప్‌కి ఇచ్చిన ఓదార్పు... మొదటి జాబ్ సెలబ్రేషన్ ... ఏళ్ల తర్వాత కలిసినా... ‘ఇంకా బతికే ఉన్నావా?’ అని ఆటపట్టించడంతోనే మొదలవుతుంది ఈ బంధం. వీరికి మన పుట్టినరోజు అంతగా గుర్తుండదు... కానీ పదేళ్ల క్రితం జరిగిన మన పరువు తీసిన సంఘటన మాత్రం బాగా గుర్తుంటుంది. అది పట్టుకుని మన జీవితాంతం ఆటపట్టిస్తూనే ఉంటాడు. మాటలతో అల్లరి చేయడం, కలిసిన ప్రతిసారి నవ్వుకోవడం... అవసరం వచ్చినప్పుడల్లా అడగకుండానే అండగా నిలవడం... ఇవన్నీ కలిస్తేనే నిజమైన స్నేహం. అందుకే, ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా... ప్రతి స్నేహితుడిలో దాగి ఉండే ఈ సరదా, ఈ భావోద్వేగం, ఈ ప్రత్యేకత గురించి తెలుసుకునేలా ఈ ప్రత్యేక కథనం... ఫ్రెండ్ కోసం... క్యాలెండర్లో ఒక రోజు పుట్టింది!ఆగస్టు మొదటి ఆదివారం అంటే చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవడం, పాత ఫొటోలు స్టేటస్‌లో పెట్టడం, ‘హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!’ అని ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం మాత్రమే చాలామందికి తెలుసు. కాని, ఈ రోజు వెనుక ఒక పెద్ద ఆలోచన దాగి ఉందని కొంతమందికే తెలుసు. ఈ కథ మొదలైంది 1930లో. ప్రముఖ హాల్‌మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు జాయిస్ హాల్ ఒక చిన్న ప్రశ్న వేశారు... ‘జీవితంలో మనల్ని ఎక్కువగా భరించే ఫ్రెండ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు ఉండకూడదు?’ అని. ఆ ఆలోచన అలా గాల్లో కలిసిపోలేదు.దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, 1958లో పరాగ్వేకు చెందిన డాక్టర్ రామోన్ ఆర్టెమియో బ్రాచో దాన్ని ‘వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్’ ఉద్యమంగా మార్చారు. అలా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా ప్రజాదరణ పొందింది. ఆ సంప్రదాయాన్ని భారత్, అమెరికా, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాలు కూడా కొనసాగించాయి. ముఖ్యంగా ఆదివారం కావడంతో స్కూల్, కాలేజీ, ఉద్యోగాల ఇబ్బంది లేకుండా స్నేహితులు కలుసుకునేందుకు ఇది అనువుగా మారింది. తర్వాత 2011లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతి, స్నేహాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో జూలై 30వ తేదీని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించినా... అప్పటికే ప్రజల జీవితాల్లో ఆగస్టు మొదటి ఆదివారం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోవడంతో, భారత్ సహా అనేక దేశాలు ఇప్పటికీ అదే రోజున ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నాయి.దేశానికో తీరు సెలబ్రేషన్స్!భారత్‌లో అయితే చేతికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టకపోతే ఆ రోజు పూర్తయినట్టే కాదు! అమెరికాలో చిన్న కార్డు, కాఫీ ట్రీట్‌తో స్నేహాన్ని సెలబ్రేట్ చేస్తే... పరాగ్వేలో ‘సీక్రెట్ ఫ్రెండ్’ ఆటతో ఎవరికీ తెలియకుండా గిఫ్ట్‌లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తారు. అర్జెంటీనాలో మాత్రం ఆ రోజు మొబైల్ నెట్‌వర్క్‌లకే ఊపిరాడనంతగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో విష్ చేసుకుంటారు. ఇక ఫిన్ లాండ్, ఎస్టోనియా లాంటి దేశాల్లో స్నేహితులతో కలిసి భోజనం చేయడం, సమయం గడపడానికే పెద్ద ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఇప్పుడు దాదాపు ప్రపంవ్యాప్తంగా ఫార్వర్డ్ మెసేజ్‌లు, పాత ఫొటో స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీడియో కాల్స్, ఆన్ లైన్ గేమింగ్ సెషన్ లతో స్నేహాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.గ్యాంగ్‌లోని అరుదైన పాత్రలు!ప్రపంచంలో వింత జీవులు చాలా ఉంటాయి... కానీ వాటిలో అత్యంత అరుదైన జాతి మాత్రం ఫ్రెండ్స్! వీళ్ల పనులకు లాజిక్ ఉండదు... మాటలకు హద్దులు ఉండవు... టైమింగ్‌కు గడియారం పనిచేయదు. ఇక అల్లరికైతే బ్రేకులు ఉండవు. అయినా వీళ్లు లేకపోతే జీవితం చాలా బోరింగ్ అయిపోతుంది. మరి... మీ ఫ్రెండ్ ఏ కేటగిరీకి చెందుతాడో ఈ సరదా జాబితాలో చూసేయండి!టిఫిన్ టెర్రరిస్ట్!స్కూల్లో లంచ్ బెల్ కొట్టగానే మీ పక్కనే ప్రత్యక్షమయ్యే మొదటి వ్యక్తి ఇతనే! ‘మీ అమ్మ చేసిన ఆలుగడ్డ కూర సూపర్ రా!’ అంటూ తన టిఫిన్ తెరవకముందే మీదే ఖాళీ చేసేవాడు. ఇప్పుడు టిఫిన్ బాక్స్ స్థానంలో స్విగ్గీ, జొమాటో వచ్చినా సరే, ఇతని స్వభావం ఏమాత్రం మారి ఉండదు. ‘నేను ఏమీ తినను!’ అంటూనే మీరు ఆర్డర్ చేసిన బిర్యానీలో సగం తన ప్లేట్లోకి షిప్ట్ చేసుంటాడు. బిల్ గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించడు. మీరు ఆకలిగా ఉన్నా లేకున్నా మీ ఆత్మారాముడితో పాటు తన ఆత్మారాముడిని కూడా సంతోషంగా ఉంచడమే ఈ ఫ్రెండ్ లక్ష్యం!రేపటి రాజుస్కూల్‌లో ఐదు రూపాయలు... కాలేజీలో యాభై... ఇప్పుడు రెండు వేలైనా, పదివేలైనా ‘రేపు పంపిస్తా’ అనేది వీళ్ల ట్రేడ్‌మార్క్ డైలాగ్. గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ అన్నీ వాడతాడు... కానీ మీ డబ్బు తిరిగి పంపడానికి మాత్రం నెట్వర్క్ పనిచేయదు! ఆశ్చర్యమేంటంటే... కొత్త ఫోన్ , కొత్త బైక్, వీకెండ్ ట్రిప్‌ల స్టేటస్లు మాత్రం రెగ్యులర్‌గా అప్డేట్ అవుతూనే ఉంటాయి. అయితే, ఈ రాజులందరూ ఒకేలా ఉండరు. మీ పది రూపాయలు తిరిగి ఇవ్వడానికి నెలలు పట్టొచ్చు. కానీ మీకు కష్టం వచ్చిందని తెలిసిన పది నిమిషాల్లో మీ ముందు నిలబడతారు. అందుకే కొన్నిసార్లు, వీళ్ల బాకీ డబ్బు కంటే, వీళ్ల తోడు విలువ ఎక్కువ!నడిచే గూగుల్ఈ ఫ్రెండ్‌కు ప్రపంచం మొత్తం తెలుసు... ఒక్క తన వస్తువులు తప్ప! షేర్ మార్కెట్ నుంచి స్పేస్ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స వరకు... ఏ విషయం అడిగినా ఐదు నిమిషాల్లో క్లాస్ చెప్తాడు. మీ కెరీర్, మీ డైట్, ఏ మొబైల్ కొనాలి, ఏ వెబ్‌సిరీస్ చూడాలి... అన్నింటికీ రెడీగా సలహాలు ఇస్తాడు. కానీ తన జీవితంలోని చిన్న నుంచి పెద్ద పెద్ద నిర్ణయాలన్నింటికీ మీతోనే చర్చిస్తాడు. ఎందుకంటే... వాటి గురించి ఆలోచించడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడని వీళ్ల పూర్తి నమ్మకం! ఆ దురదృష్టవంతుడు మీరే అయితే బాధపడకండి.రీల్స్ రాక్షసుడుమీరు ఇన్‌స్టంట్‌గా నవ్వాలంటే ఇతనొక్కడే చాలు! ఎందుకంటే, ఈ ఫ్రెండ్ రోజుకు ఇరవై రీల్స్, ముప్పై మీమ్స్, నలభై వీడియోలు ఫార్వర్డ్ చేస్తాడు. కానీ ‘పని ఉంది. రారా!’ అని మెసేజ్ పెడితే మాత్రం రెండు రోజుల తర్వాత ‘సారీ రా... ఇప్పుడే చూశా!’ అని చెప్తాడు. ఆశ్చర్యంగా మీరు పెట్టిన స్టేటస్‌కు మాత్రం నిమిషానికే కామెంట్ చేస్తాడు. ఒకవేళ ఈ ఫ్రెండ్ ఒక గంట పాటు ఒక్క రీల్ కూడా షేర్ చేయలేదంటే... వెంటనే కాల్ చేయండి! బ్యాటరీ అయిపోయిందో... ఫోన్ పోయిందో... లేక నిజంగానే ఏదైనా సమస్య వచ్చిందో చెక్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ మీదే!క్యాండిడ్ కలెక్టర్!ఒక్క ఫొటో కోసం వంద పోజులు! ఈ ఫ్రెండ్‌తో బయటకు వెళ్లడం అంటే ట్రిప్ కాదు, ఫొటోషూట్! తినే ముందు ఫొటో.. తాగేముందు ఫొటో.. నవ్వేముందు ఫొటో.. ఆఖరికి మీరు తుమ్మినా... ‘మరోసారి తుమ్ము... వీడియో తీయాలి!’ అంటాడు. అలా టీ చల్లారిపోవచ్చు... ఐస్‌క్రీమ్ కరిగిపోవచ్చు... కానీ ఫొటో పర్ఫెక్ట్గా రావాలి. యాభై క్లిక్స్ తీసి, నలభై తొమ్మిది డిలీట్ చేసి, చివరికి మీరు కళ్లు మూసుకున్న ఫొటోనే ‘క్యాండిడ్!’ అంటూ పోస్ట్ చేస్తాడు. ఈ ఫ్రెండ్‌తో చాలా జాగ్రత్త! మీ బాగున్న ఫొటోలు కంటే, బాగాలేని, అన్లిమిటెడ్ ఎంబరాసింగ్ ఫొటో కలెక్షన్ మొత్తం సేఫ్‌గా ఈ ఫ్రెండ్ దగ్గరే ఉంటుంది.బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్! ఈ ఫ్రెండ్ గడియారం మిగతా ప్రపంచంతో పని చేయదు. అంతా రెడీ అయ్యి, మీరు టీ తాగి, బజ్జీలు తిని, మరోసారి టీ ఆర్డర్ చేసి కాల్ చేసినా, ఇంకా ‘దగ్గర్లోనే ఉన్నా!’ అనే అంటాడు. అయితే, ఇదే ఫ్రెండ్‌కు మీరు ‘చాలా అర్జెంట్!’ అంటే మాత్రం ఆశ్చర్యపరుస్తూ నిజంగానే మీ ముందు ప్రత్యక్షమవుతాడు. అందుకే... వీళ్ల టైమింగ్ కంటే, కష్టకాలంలో వీళ్ల తోడును మాత్రం కచ్చితంగా నమ్మొచ్చు!కష్టకాల కింగ్!ఈ ఫ్రెండ్ రోజూ ఫోన్ చేయకపోవచ్చు. మెసేజ్‌లు పెట్టకపోవచ్చు. పుట్టినరోజుకు ఆలస్యంగా విషెస్ చెప్పొచ్చు. కానీ మీకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం వీళ్లదే! ఉద్యోగం పోయినా... ప్రేమ విఫలమైనా... ఇంట్లో గొడవైనా... డబ్బు అవసరమైనా... ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా... అర్ధరాత్రి ఒక కాల్ చేసినా కూడా, మీ సమస్యకు ఏ తీర్పులు చెప్పడు... తప్పులు వెతకడు... ముందుగా మీ పక్కన నిలబడతాడు. జీవితంలో ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉంటే, మీరు ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులని అర్థం.మ్యారేజ్‌తో మిస్సింగ్ ఫ్రెండ్!పెళ్లికి ముందు రోజూ గ్రూప్‌లో హడావుడి చేసే ఇతను, పెళ్లయ్యాక మొత్తం మెసేజ్‌లు తగ్గిపోతాయి. కలవడం కొన్నిసార్లు సంవత్సరాలకూ చేరుతుంది. అయితే, ఇక్కడ స్నేహం తగ్గిందని అనుకోవద్దు... జీవితానికి కొత్త బాధ్యతలు చేరాయని మాత్రమే అర్థం. ఇక్కడ మారేది ఫ్రెండ్ కాదు, టైమ్‌టేబుల్ మాత్రమే! ఎందుకంటే, ఈ ఫ్రెండ్ ఫోన్లో ఐదు నిమిషాలు మాట్లాడుతూనే, ‘ఒక్క నిమిషం రా... బాబు ఏడుస్తున్నాడు!’ అంటూ మల్టీటాస్కింగ్ చేస్తూనే మీతో నవ్వుతుంటాడు. ఇదే అసలు అడల్ట్ ఫ్రెండ్షిప్... కాల్స్ తగ్గినా, కనెక్షన్ మాత్రం ఫుల్ సిగ్నల్‌లోనే ఉంటుంది!ట్రిప్ ప్లానర్స్!ఫ్రెండ్ వాట్సాప్ గ్రూప్‌లో అడుగు పెట్టాడంటే చాలు... ‘ఈసారి గోవా పక్కా!’, ‘తర్వాత బాలి!’ అంటూ ప్రపంచ పర్యటన మొదలైపోతుంది. గూగుల్ షీట్స్, బడ్జెట్, హోటళ్లు, చూడాల్సిన ప్రదేశాలు... అన్నీ ఫుల్ డీటెయిల్స్‌తో రెడీ! కానీ బయలుదేరే రోజు వచ్చేసరికి ‘లీవ్ రాలేదు రా!’, ‘ఈ నెల కాస్త టైట్!’ అంటూ మొదట క్యాన్సిల్ చేసేది కూడా వీళ్లే. చివరికి గోవా ట్రిప్ ప్లాన్ చేసి... దగ్గర్లోని టీ బండి దగ్గరే గ్రూప్ ఫొటో తీసుకుని స్టేటస్ పెడతారు. నిజం చెప్పాలంటే... వీళ్లతో ట్రిప్ కంటే ట్రిప్ ప్లానింగ్‌లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం.వైఫై పెరిగితే... వైబ్ తగ్గిందా? ఒకప్పుడు ఫ్రెండ్‌ను పిలవాలంటే ఇంటి ముందు నిలబడి ‘ఒరేయ్... బయటికి రా!’ అని అరిస్తే చాలు. లేదంటే ఓ విజిల్ వేస్తే ఐదు నిమిషాల్లో గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పుడు మాత్రం పరిస్థితి రివర్స్! మూడు కాల్స్... ఆరు వాట్సాప్ మెసేజ్‌లు... రెండు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేసిన తర్వాత కూడా మూడు గంటలకు ‘ఏమైంది రా?’ అనే ఒక రిప్లై పడుతుంది. అయితే, సోషల్ మీడియాను పూర్తిగా తప్పుపట్టలేం.ఏళ్లుగా కనిపించని స్కూల్ ఫ్రెండ్‌ను మళ్లీ కలిపింది కూడా అదే. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నేహితుడిని ఒక్క వీడియో కాల్‌తో పక్కనే కూర్చున్నట్టు మాట్లాడే అవకాశం ఇచ్చింది. పుట్టినరోజులు గుర్తు చేస్తోంది... ఒక మీమ్‌తో నవ్వులు పంచుతోంది... ఒక స్టేటస్‌తో పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తోంది. అందుకే టెక్నాలజీ స్నేహాన్ని మార్చలేదు, స్నేహం చేసే విధానాన్ని మాత్రమే అప్డేట్ చేసింది! ఒకప్పుడు ‘రా... గ్రౌండ్‌కి!’ అనే ఆహ్వానం... ఇప్పుడు ‘రా... వీడియో కాల్లోకి!’ అనేదిగా మారింది. కానీ నిజమైన స్నేహం ఇప్పటికీ వైఫై కంటే స్ట్రాంగ్ కనెక్షనే!ప్రపంచాన్ని కదిలించిన నిజమైన ఫ్రెండ్షిప్ కథలుఫ్రెండ్ కోసం మనం ట్రీట్ ఇస్తాం... బిల్ కడతాం... అవసరమైతే అసైన్ మెంట్ కూడా రాసిపెడతాం! కానీ ప్రపంచంలో కొంతమంది స్నేహితులు మాత్రం తమ స్నేహం కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. ఇవి సినిమా కథలు కాదు... నిజంగా జరిగిన సంఘటనలు.భుజాలపై మోసింది... స్నేహాన్నే!చైనాకు చెందిన చిన్నారి ‘టాంగ్ యుయాన్ ’ తన కండరాల వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితమైన సహ విద్యార్థి ‘హి షియాంగ్హాంగ్’కు మూడేళ్ల పాటు ప్రతిరోజూ తోడుగా నిలిచాడు. మెట్లు ఎక్కించడం నుంచి భోజనం చేయించడం వరకు ప్రతి పనిలో భుజం అందించాడు. అతను నిరూపించిన విషయం ఒక్కటే... స్నేహానికి బలం చేతుల్లో కాదు, మనసులో ఉంటుంది.ఎవరెస్ట్ కంటే... ప్రాణమే ఎత్తు!2023లో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకునే సమయంలో నేపాల్‌కు చెందిన షెర్పా ‘గెల్జే’ మంచులో అపస్మారక స్థితిలో ఉన్న పర్వతారోహకుడిని చూసి తన కలను పక్కన పెట్టాడు. శిఖరాన్ని వదిలేసి అతడిని భుజాన మోసుకుంటూ సురక్షితంగా కిందికి తీసుకొచ్చాడు. రికార్డుల కంటే ప్రాణం విలువైనదని ప్రపంచానికి చాటి చెప్పాడు.ఒక కిడ్నీ... రెండు జీవితాలు!అమెరికాకు చెందిన ‘జేజే’ తన ప్రాణ స్నేహితుడు ‘జే’కు కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ ఒకరి పెళ్లిలో మరొకరు బెస్ట్మెన్ గా నిలిచారు. కొంతమంది స్నేహితులు గిఫ్ట్‌లు ఇస్తారు... ఇంకొందరు జీవితాన్నే గిఫ్ట్‌గా ఇస్తారు.యాభై ఏళ్ల తర్వాత... అదే స్నేహం!అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు మనవడు ‘అనీష్ భగత్’ ఆమె యాభై ఏళ్లుగా దూరమైన చిన్ననాటి స్నేహితురాలిని సోషల్ మీడియా సాయంతో వెతికి మళ్లీ కలిపాడు. ఒక కౌగిలితో యాభై ఏళ్ల దూరం కరిగిపోయింది. స్నేహానికి క్యాలెండర్ ఉండొచ్చు... ఎక్స్పైరీ డేట్ మాత్రం ఉండదు.ఎనభై ఏళ్ల స్నేహం!ఇంగ్లాండ్‌కు చెందిన కెన్ , ఆర్థర్లు వారి చిన్నప్పటి నుంచి మొదలైన స్నేహాన్ని ఎనభై ఏళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగించారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన తర్వాత ఒకే కేర్ హోమ్‌లో ఉంటూ ప్రతిరోజూ కలిసి సమయం గడిపారు. కొన్ని స్నేహాలు వయసుతో ముసలివి కావు... జ్ఞాపకాలతో మరింత అందంగా మారుతాయని నిరూపించారు.స్నేహం వెనుక దాగిన సైంటిఫిక్ నిజాలు!స్నేహితులు ఉంటే నవ్వులు మాత్రమే కాదు... ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి స్నేహితులు ఉన్నవారిలో ఒత్తిడి, ఒంటరితనం తక్కువగా ఉండటమే కాదు; ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా మంచి స్నేహితుడు కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్ ్సలాంటివాడే! అయితే, అబ్బాయిలు– అమ్మాయిలు స్నేహాన్ని వ్యక్తపరచే తీరు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది.అబ్బాయిలు...⇒ మాటల కంటే చేతలతోనే స్నేహాన్ని చూపిస్తారు. ⇒ సమస్య వస్తే ముందుగా పరిష్కారం వెతుకుతారు.⇒ ఆటపట్టించడం, అల్లరి చేయడాన్నే అనుబంధంగా భావిస్తారు.⇒ ‘నేనున్నా!’ అని చెప్పడం కంటే... అవసరమైనప్పుడు పక్కన నిలబడటానికే ప్రాధాన్యం ఇస్తారు.అమ్మాయిలు⇒ సంభాషణలతో స్నేహాన్ని మరింత బలపరుస్తారు. సంతోషం, బాధ... రెండింటినీ ముందుగా స్నేహితులతో పంచుకుంటారు.⇒ చిన్న జ్ఞాపకాలు, ప్రత్యేక రోజులను ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు.⇒ ‘తిన్నావా?’, ‘ఇంటికి చేరావా?’ వంటి చిన్న శ్రద్ధలతోనే ప్రేమను వ్యక్తం చేస్తారు.చివరగా... స్నేహం అమ్మాయిదైనా... అబ్బాయిదైనా... తీరు మాత్రమే వేరు. స్నేహం మాత్రం ఒకటే. మీరు నవ్వినా... పడిపోయినా... నవ్వుతూ చేయి అందించేవాడే అసలైన స్నేహితుడు!జీవితంలో జీతం పెరుగుతుంది... ఇల్లు పెద్దదవుతుంది... కారు మారుతుంది... కానీ... చిన్నప్పటి స్నేహితుడు మాత్రం రీప్లేస్ అవడు. ఎందుకంటే... స్నేహితులు అంటేనే కాలం కూడా అంతం చేయలేని ఆనందాలు. ∙కొండి దీపిక -
అడుగు పడితే, లైట్ పడుతుంది!
రోజూ చేసే చిన్న చిన్న పనులే ఎక్కువ సమయాన్ని తినేస్తుంటాయి! అలాంటి పనులను చిటికెలో పూర్తి చేసి, కాస్త స్మార్ట్‌గా మార్చే గాడ్జెట్లు ఇప్పుడు మార్కెట్లో బోలెడున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైనవే ఇవి!సోలార్ వాల్ లైట్దొంగలను భయపెట్టి, బయటపెట్టే లైట్స్ ఇవి. రాత్రి అందరూ నిద్రలో ఉంటారు... కానీ ఈ లైట్ మాత్రం డ్యూటీలో ఉంటుంది! ఎవరైనా ఇంటి గుమ్మం దగ్గరకు రాగానే ‘ఇదిగో దొంగ.. దొంగ!’ అన్నట్లు టక్కున వెలిగిపోతుంది. మోషన్ సెన్సర్‌తో పనిచేసే ఈ సోలార్ వాల్ లైట్ దొంగలకు చిన్న షాక్ ఇవ్వడమే కాదు... ఇంటి చుట్టూ ఏ కదలిక జరిగినా వెంటనే వెలుతురు వెదజల్లుతుంది. పగలంతా సూర్యరశ్మితో చార్జ్ అవుతుంది కాబట్టి కరెంట్ బిల్లు పెరుగుతుందేమోనని ఆందోళన అక్కర్లేదు. వర్షం వచ్చినా, ఎండ మండినా వాటర్‌ప్రూఫ్ బాడీతో చక్కగా పనిచేస్తుంది. గుమ్మం, బాల్కనీ, తోట, మెట్లు– ఎక్కడ పెట్టినా వెచ్చని పసుపు వెలుతురుతో ఇంటికి అందాన్ని, భద్రతను ఒకేసారి అందిస్తుంది. ధర కేవలం రూ. 300 మాత్రమే!లెక్కలతో పాటు... లెటర్స్ కూడా!కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... మళ్లీ పక్కన కాగితం కోసం వెతుకుతుంటారా? ఇక ఆ పని లేదు! ఈ టూ ఇన్ వన్ కాలిక్యులేటర్ ఒకేసారి లెక్కలూ వేస్తుంది, పక్కనే నోట్స్ కూడా రాస్తుంది. ఎంత ఖర్చయ్యింది? ఎంత బ్యాలెన్స్? వెంటనే రాసేసి, పని అయిపోయాక ఒక్క బటన్ తో చెరిపేయొచ్చు. కాగితాలు చింపాల్సిన పని లేదు, చిన్న చిట్టీలు పోగొట్టుకునే టెన్షన్ లేదు. మడతపెట్టే డిజైన్ తో జేబులోనో, బ్యాగులోనో హాయిగా సరిపోతుంది. స్టూడెంట్స్, టీచర్లు, ఆఫీస్ ఉద్యోగులు, లెక్కలతో పని ఉన్నవాళ్లందరికీ ఇది చిన్న సైజ్‌లో ఉండే పెద్ద హెల్పర్. కాలిక్యులేటర్ ఒకటి కొంటే, నోట్‌ప్యాడ్ కొనాల్సిన అవసరమే లేదు. ధర సుమారు రూ.600.కత్తెరకు కన్ను!కత్తిరిస్తుంటే... సరైనా కొలత ఒక వైపు, కత్తెర మరోవైపు వెళ్లిపోతున్నాయా? ఇక ఆ టెన్షన్ కు కట్! ఈ లేజర్ కత్తెర ముందే ఎర్రటి లేజర్ గీతను చూపిస్తూ ‘ఇదే దారి... ఇటే కట్ చెయ్!’ అని గైడ్ చేస్తుంది. కాబట్టి వంకర టింకరలు లేకుండా సూటిగా కత్తిరించొచ్చు. బట్టలు, గిఫ్ట్ పేపర్లు, కార్డ్‌బోర్డులు, క్రాఫ్ట్ పనులు... ఏది కత్తిరించినా ఫినిషింగ్ మాత్రం ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు పదునుగా ఉండటంతో ఎక్కువ శ్రమ కూడా ఉండదు. చేతికి నొప్పి కలగకుండా సౌకర్యవంతమైన పట్టుతో డిజైన్ చేశారు. ఇంట్లో చిన్న చిన్న క్రాఫ్ట్ పనులు చేసే వాళ్ల నుంచి టైలర్లు, బొటిక్ యజమానుల వరకు అందరికీ ఇది సూపర్ హెల్పర్. ఇకపై ముందు గీత గీసే పని లేకుండా, లేజర్ చూపించిన దారిలో కట్ చేయడమే! ధర కేవలం రూ. 350 మాత్రమే! -
జామపండ్లలో మనమే టాప్!
జామపండ్లు మన స్థానికమైనవే అనుకుంటాం గాని, ఇవి పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా మన దేశానికి వచ్చాయి. అప్పటి నుంచి తోటల్లోనే కాదు, ఇళ్ల పెరళ్లలోనూ జామచెట్లను విరివిగా పెంచడం మొదలైంది.జామపండ్లను పండించడంలో ఇప్పుడు మన భారత దేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. జామపండ్లలో నాలుగువందలకు పైగా రకాలు ఉన్నాయి. వీటిలో 160 రకాలు మన దేశంలో పండుతాయి. పోషకాల గని అయిన జామపండ్లు ఎక్కువగా ఆగస్టు–ఏప్రిల్ మధ్యకాలంలో దొరుకుతాయి. కొన్ని రకాలు ఏడాది పొడవునా దొరుకుతాయి. జామపండ్ల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...జామపండ్లలో పోషకాలుజామపండ్లలో పిండిపదార్థాలు, చక్కెర, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు సహా కీలకమైన విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి వందగ్రాముల జామపండ్లు 68 కిలోకేలరీల శక్తినిస్తాయి. వీటిలో నీరు 80 శాతానికి పైగా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల జామపండ్లలో ఉండే పోషకాల వివరాలను గణాంకాల్లో చూద్దాం... -
శ్వేతమాధవుడు: పూర్వం కృతయుగంలో శ్వేతుడు..
పూర్వం కృతయుగంలో శ్వేతుడు అనే రాజు సమస్త భూమండలాన్నీ పరిపాలించేవాడు. అతడి పరిపాలనలో ప్రజలు సర్వసుభిక్షంగా జీవించేవారు. అతడి రాజ్యంలో మనుషులకు పదివేల ఏళ్ల పరమాయువు ఉండేది. అకాల మరణాలు ఉండేవి కాదు. రోజులిలా సాగుతుండగా, ఒకసారి అనుకోని విపత్తు సంభవించింది.శ్వేతుడి రాజ్యంలో కపాలగౌతముడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. అతడికి కొడుకు పుట్టాడు. ఆ బాలుడు ఇంకా నోట్లో దంతాలు రాకముందే అకాల మృత్యువు చెందాడు. దుఃఖితుడైన కపాలగౌతముడు తన పుత్రుని మృతదేహంతో రాజాస్థానానికి వచ్చాడు.పసిబాలుడి మృతదేహాన్ని చూసిన శ్వేతుడు చలించిపోయాడు. ‘ఈ బాలుడిని పునర్జీవితుడిని చేయలేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను’ అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు.అప్పటికప్పుడు పరమశివుడి కోసం శ్వేతుడు తపస్సు ప్రారంభించాడు. నీలపద్మాలతో పరమశివుడిని అర్చిస్తూ, ప్రార్థించాడు. శ్వేతుడి భక్తికి సంతసించిన పరమశివుడు పార్వతీ సమేతంగా అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ భక్తికి సంతుష్టి చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అన్నాడు.శ్వేతుడు పార్వతీ పరమేశ్వరులకు భక్తిగా నమస్కరించి, ‘పరమేశ్వరా! అభం శుభం తెలియని ఈ పసిబాలుడు అకాలమరణం చెందాడు. ఇతడిని పునర్జీవితుడిని చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా ప్రతిజ్ఞ మేరకు ఈ బాలుడిని తిరిగి బతికించు. నా రాజ్యంలో అకాల మరణాలు లేకుండా అనుగ్రహించు’ అని కోరాడు. పరమశివుడు ‘తథాస్తు’ అని పలికాడు. మరుక్షణమే యమకింకరులు ఆ బాలుడి ప్రాణాలను తీసుకువచ్చారు. నిద్రలోంచి మేల్కొన్నవాడిలా ఆ బాలుడు పునర్జీవితుడయ్యాడు. పుత్రుడు పునర్జీవితుడు కావడంతో కపాలగౌతముడు పరమానందం పొందాడు.శ్వేతుడు ఎలాంటి చీకుచింతలు లేకుండా పదివేల ఏళ్లు రాజ్యపాలన చేశాడు. లౌకిక ధర్మాలన్నీ నెరవేర్చాక ఐహిక సుఖాలపై విరక్తి చెందాడు. పురుషోత్తమ క్షేత్రంలో శేషజీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, జగన్నాథుడి సన్నిధానానికి సమీపంలో శ్వేతపర్వతంపై సువిశాలమైన ప్రాసాదాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రాసాద మధ్యభాగంలో మాధవమూర్తిని ప్రతిష్ఠించాడు. మాధవ ప్రతిష్ఠాపన సందర్భంగా వేలాది విప్రులకు, సాధువులకు, తపస్వులకు భూరి దానాలు చేశాడు.శ్వేతుడు అక్కడే నివాసం ఏర్పరచుకుని, ఒక తటాకం ఒడ్డున తపోనిష్ఠతో ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ, మాధవుడిని ఆరాధించసాగాడు. కొన్నాళ్లకు పూర్తిగా నిరాహారుడై శ్రీమహావిష్ణువును ధ్యానించసాగాడు. ధ్యాన స్థితిలో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. శ్వేతుడి భక్తికి శ్రీమహావిష్ణువు పరవశుడయ్యాడు. సకల దేవతా పరివారం వెంట రాగా, శ్రీమహాలక్ష్మీ సమేతంగా శ్వేతుడి ఎదుట సాక్షాత్కరించాడు. ‘వత్సా! నీ భక్తికి పరమానందం చెందాను. వరమేమి కావాలో కోరుకో!’ అని పలికాడు.‘భక్తవత్సలా! పుండరీకాక్షా! జగన్నాథా! పాహిమాం... పాహిమాం... నన్ను నీ భక్తులలో ఒకరిగా పరిగణించి, వైకుంఠవాస యోగ్యత కల్పించు. అంతకు మించి నాకంటూ నేను కోరేదేమీ లేదు’ అన్నాడు శ్వేతుడు.‘రాజా! నువ్వు మరికొన్నాళ్లు రాజ్యభోగాలను అనుభవించిన తర్వాత నా లోకానికి చేరుకోగలవు. నీ తపోమహిమతో ఈ ప్రదేశం పునీతమైంది. నీకు సన్నిహితంగా నేను ఇక్కడే సమస్త దేవతా పరివారంతో కలసి శ్వేతమాధవుడిగా కొలువుంటాను. ఈ తటాకం శ్వేతమాధవ తీర్థంగా ప్రసిద్ధి పొందుతుంది. శ్వేతమాధవ తీర్థంలోని జలబిందువులు కుశాగ్ర పరిమాణంలో తాకినా భక్తులను పునీతులను చేస్తాయి.’ అని శ్రీమహావిష్ణువు వరమిచ్చాడు. శ్వేతుడికి ఇచ్చిన వరం ప్రకారం అక్కడే శ్వేతమాధవుడిగా వెలిశాడు.కొంతకాలం రాజ్యపాలన సాగించిన తర్వాత శ్వేతుడు ఒకనాడు అనాయాసంగా కాలధర్మం చెందాడు. వైకుంఠం నుంచి విష్ణుభక్తులు వచ్చి, అతడిని తమతో పాటు దివ్యవిమానంలో వైకుంఠంలోని విష్ణు సన్నిధానానికి తీసుకుపోయారు.పురావిశేషం..ఇది వేదవ్యాసుడి గుహ. కృష్ణద్వైపాయనుడైన వేదవ్యాసుడు వినాయకుడి సాయంతో ఇదేచోట మహాభారత రచన చేశాడని భక్తుల నమ్మకం. ఇది బదరీనాథ్ క్షేత్రానికి చేరువలోని మాణా గ్రామంలో ఉంది. ఈ గ్రామాన్ని భారతదేశంలోని చిట్టచివరి గ్రామంగా చెబుతారు. సముద్ర మట్టానికి 10,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహను సందర్శించడం అంత తేలికకాదు. ఇక్కడ గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
నోబెల్ శిఖరమెక్కిన జాణపదం!
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా టాగోర్ గీతరచనను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.పరిపూర్ణమైన కౌశలంతో నిండివుండే టాగోర్ కవితావేశం ఆయన (ఆంగ్ల) గీతాలను పాశ్చాత్య సాహితిలో భాగంగా మార్చిందని స్వీడిష్ ఎకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. నాటికి నూట మూడేళ్ళు మరో పదమూడు రోజుల్లో పూర్తి అవుతాయనగా– 2016, అక్టోబరు 13న– మరో గీతరచయిత బాబ్ డిలాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు అదే ఎకాడెమీ ప్రకటించింది. ‘మహత్తరమైన అమెరికన్ గీతరచన సంప్రదాయ పరిధిలోనే కొనసాగుతూ, సరికొత్త కవితాత్మక భావప్రకటనలు చేసినందుకు’ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ తన అభినందన సందేశంలో ప్రకటించింది. అలా, నూరేళ్ళ తర్వాత, గీతరచనకు రెండోసారి నోబెల్ పురస్కారం సంపాదించిపెట్టిన వాగ్గేయకారుడిగా బాబ్ డిలాన్ చరిత్ర సృష్టించాడు.కెనడా సరిహద్దుల్లో వుండే అమెరికన్ స్టేట్ మిన్నెసోటా. అక్కడి ఆదివాసుల జానపద గీతాలు చరిత్రప్రసిద్ధాలు. పద్దెనిమిదో శతాబ్ది చివర్లో, జంతువుల చర్మాల కోసం ఇక్కడికి వచ్చే ఫ్రెంచ్ యాత్రికులు తమ గీతాల బాణీలతో ఇక్కడి స్థానిక గీతాలను మేళవించి కొత్తరకం జానపద గీతాల సంప్రదాయం సృష్టించారంటారు. బాబ్ డిలాన్ కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది ఈ జానపద గీతాలు పాడే! సాధారణంగా జానపద బాణీలో రాసిన గీతాలనగానే, మనకి విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలూ’, నండూరి ‘ఎంకి పాటలూ’, కొనకళ్ళ ‘బంగారిమామ పాటలూ’ గుర్తుకురావడం సహజం.అయితే, బాబ్ డిలాన్ గీతసాహితి ఆ బాపతు కాదు. 1960 దశకం మొదట్లో, 22 యేళ్ళ బాబ్ ‘ఉత్తరాది పల్లెటూరి పడుచు పిల్లా’, ‘కుండపోతగా వాన కురవనుంది పిల్లా’ లాంటి పాటలు రాసి పాడకపోలేదు. కానీ బాబ్ డిలాన్ బాణీకి పేరుతెచ్చిపెట్టినవి అలాంటి పాటలు కావు. అమెరికాలో యుద్ధ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో బాబ్ పాడిన ‘పెనుగాలి వీస్తోంది’, ‘కాలం మారుతోంది’ లాంటివే బాబ్ డిలాన్ బాణీ ఇలాంటిదనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ పాటల్లో డిలాన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఆ రోజుల్లో సామాన్య పౌరులందరి మనస్సులనూ కలవరపరుస్తున్నవే! వాటికి ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదనే విమర్శ లేకపోలేదు. అయితే, అది కవిగారి పని కాదనే వాదన కూడా వినవచ్చింది! పాయింటేమిటంటే, అప్పట్లో– 1965 నాటికి– బీజప్రాయంగా మాత్రమేవున్న ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ (కౌంటర్ కల్చర్) చాయలు ఆ పాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అదీ అసలు విశేషం! బాబ్ డిలాన్ అనేది కవిగారి పెట్టుపేరు– రాబర్ట్ యాలెన్ జిమ్మెర్మన్ అతగాడి పుట్టుపేరు. దాన్నిబట్టి, బాబ్ యూదు మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టి పెరిగాడని అర్థమవుతుంది. అతని తండ్రి రష్యన్ జాతీయుడు కాగా, తల్లి లిథువేనియా జాతీయురాలు. (ఈ రెండు జాతులూ 1918 మొదలుకొని 1990 వరకూ సోవియెట్ యూనియన్‌లో భాగంగా వున్న సంగతి ఆధునిక రాజకీయ చరిత్ర తెలిసినవారికి వేరే చెప్పనవసరంలేదు! ఆ తర్వాత అవి తిరిగి ‘స్వతంత్ర’ దేశాలుగా ఆవిర్భవించాయి) రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో బాబ్ తల్లితండ్రులు అమెరికా చేరి అక్కడే మనువాడారు. మతానికి సంబంధించి, బాబ్ డిలాన్ అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1970–’80 మధ్యకాలంలో బాబ్ క్రైస్తవమతంలోకి మారి, కొద్దికాలానికే తిరిగి యూదుమతంలోకి మారిపోయారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి– వాటినలా వదిలేయండి!దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర, అమెరికన్ జానపద– రాక్ సంగీత సంప్రదాయానికి చెందిన ఈ వాగ్గేయకారుడి సొంతం. పన్నెండున్నర కోట్ల రికార్డులను అమ్మి, బాబ్ డిలాన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. అమెరికాకు పన్నెండో నోబెల్ సాహిత్య పురస్కారం సంపాదించి పెట్టిన అతగాడు. (అమెరికన్ రచయిత్రి లూయీజ్ గ్లిక్ –2020లో– పదమూడోసారి ఇదే పురస్కారాన్ని గెల్చుకున్న సంగతి చదువుకున్న మిత్రులకు తెలిసిన విషయమే!) ‘ప్రామాణిక సాహిత్యం అందించే మేధాసంపదతో సమృద్ధమైన సంస్కారం కలిగినవాడు బాబ్ డిలాన్. ఆయన 1960 దశకంలోనే, అమెరికన్ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశార’ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా శ్లాఘించింది. 85 సంవత్సరాల వయసున్న ఈ సుప్రసిద్ధ వాగ్గేయకారుణ్ణి, ఆధునిక పాఠక–శ్రోతలకు ఇప్పుడు పరిచయం చేయాలనుకోవడం దుస్సాహసమే!- మందలపర్తి కిషోర్ -
శత్రుత్వం వద్దు..
పైడి పర్వతం పక్కన ఉన్న కందర్ప రాజ్యం రాజు వివేక వర్మ సుపరిపాలన సాగిస్తూ, ప్రజలకు ఎంతో మేలుచేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. పైడి పర్వతంలో పుట్టిన ధారావళి నది కందర్ప రాజ్యంలోని పొలాలను సస్యశ్యామలం చేస్తూ రాజ్యాన్ని పచ్చగా ఉంచుతోంది.ఆ సుభిక్షం వలన మంత్రి సుహస్తుడి ప్రణాళికల వలన పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. ధారావళి నది కందర్ప రాజ్యం నుంచి పక్కనే ఉన్న ప్లవంగ రాజ్యంలోనూ ప్రవహిస్తూ ఆ రాజ్యంలోని పొలాలను కూడా సస్యశ్యామలం చేస్తోంది.ప్లవంగ రాజ్యాన్ని విజయ వర్మ పాలిస్తున్నాడు. ఆయన కూడా ప్రజలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్లవంగ రాజ్యంలోనే ఉన్న రసోపర్వతంలో అనేక రసాయన రాళ్ళు ఉన్నాయి. వాటితో మనుషులకు, జంతువులకు ఉపయోగపడే ఎన్నో మందులు ప్లవంగ రాజ్యంలో శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. ఆ రాళ్ళను కందర్ప రాజ్య శాస్త్రవేత్తలు కూడా ఉపయోగిస్తున్నారు.విజయవర్మ ప్రధానమంత్రి దురోత్తుడికి కొంత వక్రబుద్ధి ఉంది. ఒకరోజు ఆయన రాజు గారితో, ‘మహారాజా ఆ రసోపర్వతం వలన మనరాజ్యం సుభిక్షంగా ఉంది కాని, మనం కందర్పరాజ్యం నుండి వచ్చే ధారావళి నది నీటిని ప్రజల అవసరాలకు ఉపయోగిస్తూ మన రాజ్యంలోని పొలాలు పండించుకుంటున్నాం. భవిష్యత్తులో వారు ధారావళి నది మీద ఆనకట్టలు కడితే మనకు నీటి కొరత రావచ్చు. అందువలన మనం కందర్ప రాజ్యాన్ని ఆక్రమిస్తే అటు నీటి లభ్యత, ఇటు మనరాజ్యం పరిశ్రమలతో ఒకే రాజ్యంగా శోభిల్లుతుంది’ అని మంత్రి తన దురాలోచనను రాజు విజయవర్మకు చెప్పాడు.మంత్రి చెప్పిన దానిమీద రాజు విజయవర్మ ఒకింత ఆలోచించి మూడు నెలలలో కందర్ప రాజ్యం మీద దండయాత్ర చేయాలని నిశ్చయించి, కందర్ప రాజ్యం రాజుగారు వివేకవర్మకి దూతద్వారా ఒక సందేశం ఈ విధంగా పంపాడు:‘మీరాజ్యాన్ని మాకు శాంతియుతంగా అప్పగించండి లేకపోతే ఉభయ రాజ్యాలకు యుద్ధం తప్పదు, రక్తపాతం తప్పదు’ఇట్లు,విజయవర్మ,ప్లవంగ రాజ్య రాజుఆ సందేశం చూసి వివేక వర్మ ఆశ్చర్య పోయాడు. ఇన్నేళ్లు శాంతియుతంగా ఉన్న ప్లవంగ రాజుకు ఈ బుద్ధి ఎలా పుట్టిందో వివేక వర్మకు అర్థం కాలేదు. వెంటనే మంత్రి సుహస్తుడిని ఈ విషయం మీద సలహా అడిగాడు.‘మహారాజా ఈ బుద్ధి విజయ వర్మకు పుట్టినది కాదు. ఎవరో ఆయన మెదడులో విషబీజం నాటారు. నేనే వెళ్ళి విజయవర్మతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అని చెప్పాడు సుహస్తుడు.రెండో రోజే సుహస్తుడు ప్లవంగ రాజ్యానికి వెళ్ళి రాజు విజయవర్మను కలిసి ఈ విధంగా చెప్పాడు: ‘మహారాజా ఇన్ని సంవత్సరాలు మన రెండు రాజ్యాలు పాడి పంటలతో సుఖశాంతులతో ఉన్నాయి. ఇటువంటి సమయంలో మన మధ్య యద్ధాలు రక్తపాతాలు ఎందుకు? దానివలన ఇరు దేశాల ప్రజల జీవితాలు దెబ్బతింటాయి. మా వలన మీకు మీ రాజ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా రాజు వివేకవర్మ సంగతి మీకుతెలుసు కదా! ఎవరికీ హాని చేయడు. ఎవరికైనా అవసరం ఉంటే సహాయమందించే మంచి మనస్తత్వం కల మంచి మనిషి. ఆలోచించండి మహరాజా!’ వివరించాడు సుహస్తుడు.సుహస్తుడి మాటలతో విజయవర్మను ఆలోచనలో పడ్డాడు.తన రాజగురువుతో మాట్లాడాక యుద్ధాన్ని ఉపసంహరించుకున్నట్లు రాజు వివేక వర్మకు సందేశం పంపించాడు. తరువాత తన మంత్రి దురోత్తుడితో, ‘మంత్రిగా తమరు అన్ని పరిస్థితులూ గమనించి లాభనష్టాలు బేరీజు వేసి నాకు సలహాలు ఇవ్వాలి. మీరు ఆలోచించకుండా సలహాలు ఇవ్వకండి’ అని మందలించాడు.విజయ వర్మ సందేశం చూసి వివేకవర్మ ఆనందించాడు. విజయవర్మను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పి, మంచి బహుమతులు ఇచ్చాడు. వివేకవర్మ మంచి మనసుకు విజయవర్మ సంతోషించాడు. వివేకవర్మ తన మంత్రి సుహస్తుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించినందుకు ఆయనకు కూడా మంచి బహుమతులు ఇచ్చాడు. ఆవిధంగా ఇరు రాజ్యాల ప్రజలు సంతోషాలను ప్రకటించారు.హితవచనం..అనిన్ద్యమపి నిన్దన్తి స్తువన్యస్తుత్యముచ్చకైఃస్వాపతేయకృతే మర్త్యాః కిం కిం నామ న కుర్వతే- మనుషులు డబ్బు కోసం చెయ్యరాని పనులన్నీ చేస్తారు. నిందిచరాని వాళ్లను నిందిస్తారు. పొగడతగని వాళ్లను పొగుడుతారు.- కంచనపల్లి వేంకట కృష్ణారావు -
వాయిదాల నవగ్రహాలకి.. భయమే అడ్డంకా?
సమయం దొరికితే చాలు పనులను రేపటికి వాయిదా వేస్తున్నారా? అయితే మీరు ఏ రకమైన ‘ప్రొక్రాస్టినేటర్’ (వాయిదా వేసే వ్యక్తి) అయి వుండవచ్చో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కేవలం బద్ధకం వల్లే కాకుండా భయం, ఒత్తిడి, ఆలోచనా తీరు మొదలైన వాటి వల్ల పనులను వాయిదా వేసే 9 రకాల మనుషులను పరిశోధకులు గుర్తించారు.అయినా, సమయం దొరికితే చాలు పనులు చక్కబెట్టుకోవాలి కానీ, వాయిదా వేసుకోవటం ఏంటి?! ఈ అలవాటు మీ సమయాన్ని దొంగిలించకుండా, మీ కెరీర్‌ను దెబ్బతీయకుండా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలంటే, వాయిదా వేయకుండా ఈ రెండు ముక్కలూ చదివేయండి.టాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడాన్ని వాయిదా వేయటం, ముఖ్యమైన పనులను చివరి నిమిషం వరకు చేయకుండా వదిలేయడం లేదా అత్యవసరమైన ఈమెయిల్‌కు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం.. ఇలా మనమందరం అప్పుడప్పుడు పనులను తాత్కాలికంగా ‘తప్పించుకుంటూనే’ ఉంటాం. అయితే, పనులను తాత్సారం చేయటం అనేది కేవలం ఉత్సాహం లేకపోవడం లేదా సమయం విలువ సరిగ్గా తెలియకపోవడం వల్ల మాత్రమే జరగదు.‘‘పనులను వాయిదా వేయడం అనేది – పని చేయవలసిన అవసరానికీ, చేయొచ్చులే అనే అలసత్వానికి మధ్య జరిగే ఒక రకమైన ‘తాడు లాగే ఆట’ (టగ్ ఆఫ్ వార్) లాంటిదిట’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ డాక్టర్ ఇటామర్ షాట్జ్ అంటున్నారు. ఆయన తన కొత్త పుస్తకం ‘సాల్వింగ్ ప్రొక్రాస్టినేషన్: ది సైన్స్ ఆఫ్ వై వి పుట్ థింగ్స్ ఆఫ్ అండ్ హౌ టు (ఫైనల్లీ!) స్టాప్’లో.. వాయిదా మనస్తత్వాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వందలాది పరిశోధనా ఫలితాలను పరిశీలించిన మీదట, ఆయన.. ఈ వాయిదా వేసే వ్యక్తులను 9 భిన్నమైన రకాలుగా వర్గీకరించారు. (ఈ పుస్తకం ఆగస్టు 25న విడుదల అవుతోంది).వాయిదా తత్త్వాలు– పరిష్కారాలువాయిదా వేసే అలవాటును వదిలించుకోవడం అంటే రోజంతా పడీ పడీ చేస్తూనే ఉండటం కాదు, ఎలాంటి అపరాధ భావం లేదా ఒత్తిడి లేకుండా అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయటం. అయితే మీరు ఏ రకమైన స్వభావం గల వ్యక్తి అనే దానిని బట్టి మీ వాయిదా తత్వానికి పరిష్కారాలు మారుతుంటాయి. ఈ తొమ్మిది తత్వాలలో మీది ఏ తత్వమో చెక్ చేసుకోండి.1. వర్రీయర్లు (ఆందోళన చెందేవారు)లక్షణం: తాము ఏదైనా పని చేస్తే ఎక్కడ తప్పు జరుగుతుందో అని ఎప్పుడూ భయపడుతుంటారు. సమస్యల్లో పడకుండా ఉండటం కోసం అసలు చేయాల్సిన పనినే వదిలేస్తుంటారు.పరిష్కారం..మీ భయాలను స్పష్టంగా గుర్తించాలి. పెద్ద పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలనే పట్టుదలను వదిలిపెట్టి, మీపై మీకు నమ్మకాన్ని పెంచుకోవాలి.2. పెసిమిస్ట్లు (నిరాశావాదులు)లక్షణం: తాము విజయం సాధించే అవకాశం చాలా తక్కువ అని ముందే ఊహించుకుంటారు. దీనివల్ల అసలు ప్రయత్నించడంలో కూడా ఎలాంటి అర్థం లేదని భావిస్తారు.పరిష్కారం..మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోవాలి. భయాలను స్పష్టంగా గుర్తించి, మీకు మద్దతుగా నిలిచే సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి.3. పర్ఫెఫెక్షనిస్టులు (అన్నీ కచ్చితంగా ఉండాలనుకునేవారు)లక్షణం: ప్రతిదీ అక్షరాలా పర్ఫెఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. కానీ, తప్పులు చేస్తామనే భయం వల్ల లేదా అందుకోలేని ప్రమాణాలను నిర్దేశించుకోవడం వల్ల ఏ పనీ చేయలేక అక్కడికక్కడే ఆగిపోతారు.పరిష్కారం..‘ఇది చాలు’ అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇతరుల ప్రమాణాల కంటే మీ సొంత లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలి. మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం మాని, మిమ్మల్ని మీరే సమర్థించుకోవాలి.4. డ్రీమర్లు (ఊహాలోకంలో విహరించేవారు)లక్షణం: ప్రస్తుతం చేయాల్సిన పనులను పక్కన పెట్టేసి, భవిష్యత్తు గురించి ఊహల్లో తేలిపోతూ సమయాన్ని గడుపుతుంటారు.పరిష్కారం..పగటి కలలు మీ ఉత్పాదకతను ఎప్పుడు దెబ్బతీస్తున్నాయో గుర్తించాలి. లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన కచ్చితమైన అంశాలను విడమర్చి రాసుకోవాలి. అసలు ఊహాలోకంలో ఎందుకు చిక్కుకుపోతున్నారో (ఉదాహరణకు పర్ఫెక్షనిజం భయం) గుర్తించి సరిచేసుకోవాలి.5. జిగ్జాగర్స్ (ధ్యాస మళ్లేవారు)లక్షణం: తమ దృష్టిని ఆకర్షించే వేర్వేరు పనుల వైపు చాలా త్వరత్వరగా మారిపోతుంటారు. దీనివల్ల వారు నిజంగా చేయాల్సిన పనిపై ఎక్కువ సేపు నిమగ్నం కాలేరు. పరిష్కారం..కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి అవసరమైన పనులను కాగితంపై రాసి పెట్టుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.6. థ్రిల్ సీకర్లు (సాహసాలు కోరుకునేవారు)లక్షణం: డెడ్‌లైన్ కంటే కాస్త ముందు మాత్రమే, ఎంతో ఒత్తిడి మధ్య చాలా వేగంగా పని చేయడాన్ని ఇష్టపడతారు. ఆ హడావిడి వీరికి ఒక థ్రిల్‌ను ఇస్తుంది.పరిష్కారం..కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. మీ ధ్యాస మరలకుండా ఉండేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవాలి.7. రెబెల్స్ (తిరుగుబాటు స్వభావం గలవారు)లక్షణం: తమ జీవితంపై తమకు తగినంత నియంత్రణ లేదని భావిస్తారు. అందుకే తమ స్వేచ్ఛను చాటుకోవడానికి, పైఅధికారులపై లేదా వ్యవస్థపై నిరసన చూపించడానికి పనులను వాయిదా వేస్తారు.పరిష్కారం..ఒక పనిని వెంటనే చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఆలోచించాలి. ఇతరుల కఠినమైన నిబంధనలను పక్కన పెట్టి, మీ సొంత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీపై ఇతరుల నియంత్రణ తక్కువగా ఉండే వాతావరణాన్ని ఎంచుకోవాలి.8. హెడోనిస్టులు (సౌఖ్య వాదులు)లక్షణం: ఆ క్షణంలో లభించే ఆనందానికి, తక్షణ సంతృప్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి చాలా తక్కువగా ఆలోచిస్తారు.పరిష్కారం..మిమ్మల్ని ముందుకు నడిపించే బాహ్య/అంతర్గత ప్రేరణలను కనుగొనాలి. మీ ధ్యాసను మళ్లించే ఆకర్షణలను మీ చుట్టుపక్కల నుండి పూర్తిగా తొలగించాలి.9. బర్న్అవుట్లు (తీవ్రంగా అలసిపోయినవారు)లక్షణం: చాలా ఎక్కువగా కష్టపడి ఉండటం వల్ల లేదా ఒత్తిడితో కూడిన, అర్థం లేని పనులు చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఉంటారు. అందుకే చేయాల్సిన పనిని చేయడానికి ఓపిక లేక వాయిదా వేస్తారు.పరిష్కారం..మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నిద్ర, విశ్రాంతి లభించేలా చూసుకోవాలి. పని భారాన్ని తగ్గించుకోవాలి. ఈ ఏఐ యుగంలో వ్యక్తిగత ఉత్పాదకతకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వాయిదా వేసే అలవాటు వినడానికి సాధారణ విషయంగా అనిపించినప్పటికీ, దీనిని నిర్లక్ష్యం చేస్తే జీవితాలను, కెరీర్లను తీవ్రంగా దెబ్బతీస్తుందని డాక్టర్ షాట్జ్ హెచ్చరిస్తున్నారు.గుణాల దశావతారాలు..పనులను వాయిదా వేసే స్వభావాలపై పరిశోధన వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల ముందే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్, సోషల్ థియరిస్ట్ డాక్టర్ మారియస్ ఓస్ట్రోవ్స్కీ మనుషుల ఆలోచనా సరళిపై మరో ఆసక్తికరమైన పరిశోధన చేశారు. సైకాలజీ, సోషియాలజీ ఆధారంగా ఆయన 10 రకాల ఆలోచనా విధానాలను (సిగ్నేచర్ థింకింగ్ స్టయిల్స్) వర్గీకరించారు. అవి..1. హ్యాపీ క్యాంపర్ : ఏ పరిస్థితినైనా సానుకూలంగా, మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించే స్వభావం కలవారు.2. జోక్స్టర్ : క్లిష్టమైన విషయాలను కూడా హాస్యస్ఫూర్తితో, తేలికగా తీసుకుంటూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరదాగా మార్చేవారు.3. హాట్హెడ్ : పరిస్థితులకు చాలా త్వరగా, తీవ్రంగా స్పందిస్తూ ఆవేశంతో లేదా కోపంతో నిర్ణయాలు తీసుకునే ఆలోచనా సరళి గలవారు.4. కీన్ బీన్ : ఏ పనిలోనైనా విపరీతమైన ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపిస్తూ ఎల్లప్పుడూ చురుగ్గా పాలుపంచుకునేవారు.5. క్విబ్లర్ : ప్రతి చిన్న విషయానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, లోపాలను ఎత్తిచూపుతూ వాదించే స్వభావం గలవారు.6. గ్లూమ్స్టర్ : ఎప్పుడూ నిరాశావాదంతో ఉంటూ, ఏ పని చేసినా ఫలితం ప్రతికూలంగానే వస్తుందని ముందుగానే ఊహించేవారు.7. ఎగోనైజర్ : చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా తీవ్రంగా సతమతమవుతూ, విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే ఆలోచనా విధానం కలిగినవారు.8. కూల్ క్యాట్ : ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అస్సలు కంగారు పడకుండా ఎంతో స్థిరంగా, హుందాగా ఆలోచించేవారు.9. వర్రీవార్ట్ : జరగబోయే పనుల గురించి, లేనిపోని సమస్యల గురించి అనవసరంగా ముందే ఆందోళన చెందే స్వభావం కలవారు.10. రెవెలర్: జీవితాన్ని, ప్రస్తుత క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటూ ఉల్లాసంగా, సంబరంగా ఆలోచించే వారు.అయితే ప్రతి ఒక్కరూ వీటిలో ఒకటి కంటే ఎక్కువ ఆలోచనా విధానాల మిశ్రమంగా కూడా ఉండే అవకాశం ఉందని మారియస్ ఓస్ట్రోవ్స్కీ వివరించారు. మనుషుల పెంపకం, వారి అనుభవాలు, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఈ ఆలోచనా సరళిని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.ఇందులో మీరు స్వాభావికంగా ఏ రకానికి చెందిన వారో గుర్తించి, నేడే మార్పు వైపు అడుగులు వేయండి! వాయిదా వేసే అలవాటును వదులుకుని, మీ సమయాన్ని ఎలా గడపాలో మీరే నిర్ణయించుకునేలా మారటమూ గొప్ప విజయమే.- సాక్షి స్పెషల్ డెస్క్ -
తైలవర్ణ చిత్రం.. 'మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో..'
‘‘మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది. ‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు. సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మీ మామయ్య దుర్గ గుడిలో అకౌంటెంట్ కదా. ఆయనకి మీ బదిలీ సంగతి చెప్తే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రతంత్రాలు తెలిసిన చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు మనుషుల్ని వశీకరణ మంత్రాలతో ఆకర్షించి డబ్బు, బంగారం తీసుకోగలరట. ముఖ్యంగా నల్ల బట్టలు ధరించే అఘోరీలని అసలు నమ్మద్దని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర చాలా దుష్ట మంత్రశక్తులు ఉంటాయట.’’తన భర్త ఇంటికి రాగానే సుధీర ఆ సంగతులన్నీ చెప్పింది.‘‘అయితే మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అతను చెప్పాడు.రెండు వారాల తర్వాత వాళ్ళు వరంగల్ నించి చంబాకి బయలుదేరారు.∙∙ సుధీర భర్త కొత్త బ్రాంచ్‌లోని సిబ్బందితో మాటల్లో తన మామగారు చెప్పింది చెప్పి అడిగాడు.‘‘అది నిజమా?’’‘‘అవును. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ రాత్రికి శవాన్ని ఇవ్వమంటారు. సాధువుల్లా కనపడే కాషాయరంగు దుస్తులవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్షుద్రపూజలో వారికి శవం అవసరం అవుతుంది.’’∙∙ చంబాకి వచ్చిన రెండేళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవం కలగకపోవడంతో క్రమంగా భయంపోయింది.రోజూ రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చే సుధీర భర్త ఓరోజు బ్రాంచ్ నించి రాత్రి పదకొండైనా రాలేదు. పదకొండుకి బ్రాంచ్‌కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ చేశాడు.‘‘ఎవరూ లేరు మేడం. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.’’ చెప్పాడు.తెల్లవారుజామున మూడు దాకా ఆమె మేలుకునే ఉంది. తన భర్త రాకపోవడంతో ఉదయం పదిన్నరకి బేంక్‌కి ఫోన్ చేసింది. రాలేదని తెలిశాక పోలీసులకి ఫిర్యాదు చేసింది.ముందుగా పోలీసులు అతని బ్రాంచ్‌కి వెళ్ళి కేష్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఉందని తెలిశాక అతని కోసం వెదికారు. అతని జాడ తెలీలేదు.మర్నాడు మధ్యాహ్నం ఓ కాన్ స్టబుల్ వారింటికి వచ్చి అడిగాడు.‘‘మీవారి స్కూటర్ రోడ్ మీద ఎవరి ఇంటి ముందో ఉందట. అది దొంగిలించబడిందనే అనుమానంతో ఒకరు ఫోన్ చేశారు. చంపావతి నగర్లో మీకు బంధుమిత్రులు ఉన్నారా?’’ ‘‘లేరండి. అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారు?’’ సుధీర ఆదుర్దాగా చెప్పింది. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఎదురింట్లోంచి ఫిర్యాదు చేసిన ముసలాయన బయటికి వచ్చి చెప్పాడు.‘‘రాత్రి నించి ఇది ఇక్కడే ఉండటంతో ఎవరో దొంగిలించి ఇక్కడ వదిలారని అనుమానించాను.’’ ‘‘మీ ఎదురింట్లో ఎవరు ఉంటారు?’’ స్కూటర్ ఆ ఇంటివైపు పార్క్ చేసి ఉండటంతో పోలీస్ కానిస్టేబుల్ అడిగాడు. ‘‘అది ఖాళీ. అందులో ఎవరూ లేరు. అక్కడో సంఘటన జరిగాక ఎవరూ అద్దెకి రాలేదు.’’ ఆయన నెమ్మదిగా చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సుధీర వెంటనే అడిగింది. ‘‘నాలుగైదేళ్ళ క్రితం ఆ ఇంటావిడ అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుని మరణించింది. రాత్రుళ్ళు మగాళ్ళు ఆ ఇంటి పక్కనించి వెళ్తూంటే రమ్మని ఇంట్లోంచి ఆడవాళ్ళ పిలుపు వినిపిస్తుంది.’’కాన్ స్టబుల్ ఓ అపార్ట్మెంట్కి వీధివైపున్న సీసీటీవీ కెమెరాని గమనించి దాన్ని చెక్ చేస్తే, రెండు రోజుల క్రితం చీకటి పడుతూండగా సుధీర భర్త దాని డోర్ బెల్ నొక్కడం, తలుపు తెరుచుకున్నాక లోపలికి వెళ్ళడం కనిపించింది. తర్వాత రికార్డ్ అయినదంతా చెక్ చేశారు కాని, ఆ ఇంట్లోంచి సుధీర భర్త మళ్ళీ బయటకి రావడం కనిపించలేదు. ‘‘సందేహం లేదు. ఆయన ఏ కారణంగానో లోపలే ఉన్నారు.’’ సుధీర కంగారుగా చెప్పింది. ‘‘అదెలా జరుగుతుంది? దాని తాళంచెవులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మా బాబాయి కొన్నారు.’’ ముసలాయన ఆశ్చర్యంగా చెప్పాడు. తాళం తెరిచి అంతా లోపలికి వెళ్ళగానే సుధీర గట్టిగా అరిచింది.‘‘ఏమండీ? ఉన్నారా?’’ పాతికేళ్ళ క్రితం కట్టిన ఆ ఆరు గదుల ఇంట్లోని ప్రతీ గదిని వెతికారు. బూజు. ఎవరూ లేరు. కాన్ స్టబుల్ ప్రతి అల్మరా తలుపులు తెరిచి చూస్తే లోపలా లేడు. పడక గదిలో గోడకి వేలాడే తైలవర్ణచిత్రంలో జలతారు చీరలోని అందమైన ఏభై ఏళ్ళ స్త్రీ కనిపించింది.‘‘ఆ తైలవర్ణచిత్రం మరణించిన ఆవిడది... అరే. ఈ బొమ్మలోకి కొత్తగా ఎవరో వచ్చారే? దీన్ని ఈ బొమ్మలో ఎవరు గీశారో?’’ ఎదురింటి ఆయన సంభ్రమంగా చెప్పాడు. ‘‘అది మా వారే.’’ సుధీర కెవ్వున అరిచి చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఏమిటీ ఈ పిచ్చి? ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?
అది 1518 జూలై– ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరం– ఆకాశం నిర్మలంగా ఉంది. నగర వీథులు ఎప్పటిలాగే జనసమ్మర్దంతో సందడిగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఇరుకైన సందులోంచి ఓ మహిళ రోడ్డుపైకి పరుగున వచ్చింది. ఆమె పేరు ఫ్రావ్ ట్రోఫియా. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం; కళ్లల్లో విపరీతమైన ఆందోళన. కానీ విచిత్రంగా ఆమె కాళ్లు మాత్రం అసంకల్పితంగా నర్తించడం ప్రారంభించాయి. చుట్టుపక్కల వాళ్లంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘ఏమిటీ పిచ్చి? పండగ లేదు, పబ్బం లేదు– ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?’ అని గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు. అయినా సరే ట్రోఫియా నృత్యం ఆపలేదు. సూర్యుడు అస్తమించాడు; చీకటి పడింది; తెల్లవారింది. అయినా ట్రోఫియా కాళ్లు ఆగడంలేదు. ఆమె శరీరం చెమటతో తడిసి ముద్దవుతోంది. ఊపిరి కూడా సలపడంలేదు. స్పృహ తప్పి కింద పడిపోతోంది. కానీ కళ్లు తెరవగానే, మెదడుకు ఏదో కరెంట్ షాక్ తగిలినట్లు మళ్లీ లేచి డ్యాన్స్ చేస్తోంది. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు– ఏకధాటిగా ఆరు రోజుల పాటు ఆమె మృత్యునృత్యం చేస్తూనే ఉంది.ట్రోఫియాను చూసి నగర ప్రజలు నవ్వుకుంటుండగానే, మొదటి వారం ముగిసేసరికి మరో 34 మంది వీథిలోకి వచ్చి ఆమెతో జత కలిశారు. వాళ్లకు కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిని చూసి ఒకరు– అలా కేవలం నెల రోజులు గడిచేసరికి దాదాపు 400 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి, పిచ్చిపట్టినట్లు నృత్యం చేయడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు, యువకులు ఉన్నారు. అదొక వింతైన అంటువ్యాధిలా మారిపోయింది. చూసేవాళ్లకు అది డ్యాన్స్‌లా లేదు. ఏదో అదృశ్య శక్తి వారి చేతులకు, కాళ్లకు దారాలు కట్టి బొమ్మలా ఆడిస్తున్నట్లు ఉంది.పగలూ రాత్రీ తేడా లేదు. ఎండా వానా తేడా అసలే లేదు. కాళ్లు అరిగిపోయి, పాదాలు చిట్లి నెత్తురోడుతున్నా, నర్తించడం మాత్రం ఆపలేకపోతున్నారు. విపరీతమైన డీహైడ్రేషన్, గుండెపోటు కారణంగా రోజుకు కనీసం 15 మంది వరకు రోడ్లపైన డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు విడిచారు. ఈ వింత పరిస్థితిని చూసి నగర పాలకులు, వైద్యులు తలలు పట్టుకున్నారు. ‘ఇది వేడి రక్తం వల్ల వచ్చే శారీరక సమస్య. దీనికి విరుగుడు ఒక్కటే– వాళ్లను ఇంకా ఎక్కువగా డ్యాన్స్ చేయనివ్వండి. రక్తం చల్లబడితే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది!’ అని కొందరు వైద్యులు సలహా ఇచ్చారు.అంతే! అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల కోసం నగరంలో పెద్ద పెద్ద హాల్స్, స్టేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి ప్రత్యేకంగా డ్రమ్మర్స్, సంగీతకారులను పిలిపించి మరీ వాయించారు. కానీ ఈ నిర్ణయం మరింత బెడిసి కొట్టింది. హోరెత్తించే డ్రమ్స్ శబ్దాలు వినబడటంతో నగరంలోని మరికొంతమంది సాధారణ ప్రజల మెదళ్లు కూడా పాడైపోయి, ఆ డ్యాన్స్ గ్రూప్‌లో చేరిపోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. చివరకు ప్రభుత్వం భయపడి నగరంలో డ్యాన్స్‌ను పూర్తిగా నిషేధించింది. బాధితులను బలవంతంగా ఒక పర్వత గుహలోని చర్చికి తరలించి, ప్రత్యేక పూజలు చేయించాక, సెప్టెంబర్‌లో ఈ కరాళ నృత్యం నెమ్మదిగా ముగిసింది.శతాబ్దాలుగా ఈ ‘డ్యాన్సింగ్ ప్లేగ్’పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆధునిక శాస్త్రవేత్తలు దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. అప్పట్లో ప్రజలు తినే రాగులు, గోధుమల లాంటి ధాన్యాలకు ‘ఎర్గోట్’ అనే ఒక రకమైన ఫంగస్ పట్టేది. ఈ ఫంగస్ ఉన్న ఆహారాన్ని తింటే మనుషుల్లో భ్రమలు, ఫిట్స్, విపరీతమైన నరాల కదలికలు వస్తాయి. అంటే ఇది ఇప్పటి ఎల్ఎస్డీ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌లా పనిచేస్తుంది. అందువల్లే వారు అలా భయంకరంగా నర్తించి ఉంటారనే అంచనాకు వచ్చారు. అలాగే 1518 కాలంలో ఆ నగరంలో తీవ్రమైన కరవు, భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఆ విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ప్రజల మెదడు ఒకేసారి ఆల్టర్నేట్ మోడ్‌లోకి వెళ్లిపోయి ‘మాస్ హిస్టీరియా’కు దారితీసి ఉండవచ్చనే వాదనలూ ఉన్నాయి.అయితే, ఒక ఫంగస్ వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల మనుషులు ఏకధాటిగా రోజులు తరబడి ప్రాణాలు పోయేంత వరకు ఎలా డ్యాన్స్ చేయగలరు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సైన్స్ దగ్గర పూర్తి స్పష్టమైన సమాధానం లేదు. తమ నియంత్రణలో లేని శరీరాలతో, మరణం వైపు అడుగులు వేస్తూ ఆనాడు ఆ నాలుగువందల మంది అనుభవించిన నరకం ఎలాంటిదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనిషి మెదడుతో ప్రకృతి ఆడిన ఈ వింత ఆట చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక వీడని మిస్టరీనే!- సత్యకిశోర్ -
బాలి దీవిలో ఘనంగా గాలిపటాల వేడుక..
బాలి దీవిలో ఆకాశంపైకి ఎటు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే దృశ్యం బాలి దీవికి కళ తీసుకొస్తుంది. ఈ గాలిపటాల వేడుకను దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో బాలి దీవికి చేరుకుంటారు. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఏటా జరిగే ‘బాలి కైట్ ఫెస్టివల్’ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.కైట్స్ ఫెస్టివల్ బాలి అంతటా వివిధ ప్రాంతాలలో జరుగుతుంది. అయితే, ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం సనుర్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పడంగ్గలక్ బీచ్‌లో నిర్వహిస్తారు. ఈ వేడుకలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు మస్కెటి బీచ్, మెర్తాసరి బీచ్, కుటా, ఉబుద్, దెన్ పసార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతాయి. ఈ వేడుకల సమయంలో ప్రతిచోటా వినిపించే బాలి సాంప్రదాయ సంగీతమైన ‘గమేలాన్ ఆర్కెస్ట్రా’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, ఈ గాలిపటాల పండుగ కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. పంటలు సమృద్ధిగా పండినందుకుగాను దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ఆశీస్సులు కోరుతూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ‘బంజర్’ అని పిలిచే స్థానిక యువజన సంఘాలు, వారి ‘సెకా లాయంగన్’ అంటే గాలిపటాల బృందాలతో కలిసి ఈ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి కోసం తలపడతాయి. ప్రతి బృందంలో 70 నుంచి 80 మంది సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి గాలిపటాలను సిద్ధం చేయడం, వాటిని గాల్లోకి ఎగరేయడం ఒక అద్భుతమైన టీమ్‌వర్క్. ఈ పోటీలలో అత్యంత సృజనాత్మకమైన, వినూత్నమైన గాలిపటానికి ‘న్యూ క్రియేషన్’ అవార్డుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా అందజేస్తారు. త్రీ–డైమెన్షనల్ రూపాలు, వివిధ రకాల మస్కట్ల ఆకృతులలోని గాలిపటాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.త్రిమూర్తుల సంకేతం..ఈ ఉత్సవాల్లో మూడు రకాల గాలిపటాలను తయారుచేస్తారు. జాంఘన్ అనే గాలిపటం పక్షి ఆకారంలో ఉంటూ, దాదాపు 100 మీటర్ల కంటే పొడవైన తోకను కలిగి ఉంటుంది. రెండవది బెబీయన్ అని పలిచే గాలిపటం. ఇది చేప ఆకారంలో ఉండి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. ఇక మూడోది పెకుకాన్ గాలి పటాలు. ఇవి ఆకు ఆకారంలో ఉండి గాలిలో స్థిరంగా ఉండవు. అందువల్ల దీన్ని గాలిలో ఎగురవేయడానికి 10 మందికి పైగా నిపుణులైన ఫ్లైయర్స్ అవసరమవుతారు.అంతేకాకుండా ఈ సాంప్రదాయ గాలిపటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు హిందూ త్రిమూర్తులను సూచిస్తాయి. ఎరుపు రంగు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడిని, తెలుపు రంగు రక్షకుడైన విష్ణుమూర్తిని, నలుపు రంగు లయకారుడైన శివుడిని సూచిస్తాయి. అలాగే అష్టదిక్పాలకులను గౌరవిస్తూ పసుపు రంగును కూడా జోడిస్తారు. -
దెయ్యం అనుకుని చంపాను...
మనిషి భయంతో ఉన్నప్పుడు తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనిషిని కూడా దెయ్యంలా భ్రమింప చేస్తుంది. ఆ రాత్రీ సరిగ్గా ఇలానే జరిగింది. ఎదురుగా చీకట్లో కనిపిస్తున్న మహిళలే ఆ ఊరికి పట్టిన దెయ్యాల్లా ఓ వ్యక్తి భావించాడు. చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేశాడు.ఓ మహిళ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కొంతసేపటికి అతని భ్రమ తొలగింది. వాస్తవం అర్థమైంది. భయం కారణంగా నేరానికి పాల్పడితే చట్టం రక్షిస్తుందా? భ్రమలో ప్రాణం తీస్తే శిక్ష ఉండదా? ఇదో అరుదైన కేసుగా నిలిచింది.ఆశ కేన్సర్ ఉన్న వాడ్ని కూడా బతికిస్తుంది. భయం ఏ రోగం లేని వాడిని కూడా చంపేస్తుంది. అలాంటి భయం– దెయ్యాలున్నాయనే ఓ గూర్ఖా నమ్మకం ఒక అమాయక మహిళ ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచింది. అతడ్ని నిందితుడ్ని చేసింది. భ్రమలో జరిగిన నేరంగా పరిగణించాలని నిందితుడు, ఐపీసీ సెక్షన్ 79 ఇతడికి రక్షణ కల్పించదని ప్రభుత్వం – ఇరు పక్షాలు కోర్టులో వాదించాయి. చివరకు ఈ కేసును ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది.ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని రాసగోవింద్‌పూర్ గ్రామానికి సమీపంలో ఓ పాడుబడిన విమానాశ్రయం ఉంది. అక్కడ ఉన్న పాత వస్తువులను కొనేందుకు కలకత్తాకు చెందిన ఛటర్జీ అనే వ్యక్తి తన సేవకుడు, నేపాల్‌కు చెందిన గూర్ఖా రామ్ బహదూర్ థాపాతో అక్కడికి వెళ్లాడు. ఆ విమానాశ్రయ ప్రాంతాన్ని ‘దెయ్యాలు తిరిగే ప్రదేశంగా’ ఆ సమీప గ్రామాల ప్రజలు భావించేవారు. ఆ భయంతో రాత్రిపూట ఆ దారి గుండా తమ గ్రామాలకు ఒంటరిగా వెళ్లేందుకూ భయపడేవారు.చీకట్లో ఘోరం..సమీపంలోని తేల్కుండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా తన గ్రామానికి వెళ్లేందుకు భయపడి రాసగోవింద్‌పూర్ గ్రామంలోనే ఉండిపోయాడు. ‘నీ ఊరికి వెళ్లేందుకు మేము తోడుగా వస్తామ’ని చటర్జీ, థాపా ఆ వ్యక్తికి చెప్పారు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక అటవీ ప్రాంతంలో మసక వెలుతురులో మూడు నల్లటి ఆకారాలు వీరి కంటపడ్డాయి. దీంతో వీరి పైప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికిపోయారు. అవి దెయ్యాలే అని బలంగా నమ్మారు. ఆ ఆకారాలు దగ్గరకు రాగానే వెంటనే థాపా కత్తితో ఆ ముగ్గురిపై దాడికి దిగాడు. హాహాకారాలు వినిపించడంతో తేరుకున్న థాపా– పరీక్షించి చూడగా వారు సమీప గ్రామానికి చెందిన మహిళలు. అడవిలో విప్ప పూలను సేకరించేందుకు అక్కడికి వచ్చారని తెలిసింది. అప్పటికే ఓ మహిళ చనిపోయింది. మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.కోర్టులో విచారణ..థాపాపై ఐపీసీ 302, 326,324 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ‘తాను మనుషులపై కాకుండా దెయ్యాలపై దాడి చేస్తున్నాననే భ్రమలో ఈ చర్యకు పాల్పడినట్టు సెషన్స్ కోర్టుకు థాపా వివరించాడు. ఐపీసీ సెక్షన్ 79 ప్రకారం రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడలేదు. మంచి విశ్వాసంతో జరిగిన పొరబాటు చర్యగా కోర్టు భావించింది. సెక్షన్ 79 వర్తిస్తుందని సెషన్స్ కోర్టు అతడ్ని నిర్దోషిగా విడుదల చేసింది.హైకోర్టులో వాదనలు..సెషన్స్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దాడి జరిగిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ ఘటన జరిగేది కాదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అతని చేతిలోని టార్చ్ వేసి ఆ ఆకారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించాడు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా, అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మరణానికి, మరో ఇద్దరు గాయపడడానికి కారణం అయ్యాడని కోర్టుకు వివరించాడు. ఐపీసీ సెక్షన్ 304ఏ, 336 కింద శిక్షార్హుడని వాదించాడు. సాక్షుల విశ్వసనీయతపైనా కోర్టు పలు సందేహాలు వెలిబుచ్చింది. ఛటర్జీ సాక్ష్యం మాత్రమే స్థిరంగా, విశ్వసనీయంగా ఉందని దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ‘ఒక వ్యక్తి తాను చేస్తున్న పని చట్టపరంగా సరైందే అని అతను నమ్మితే సరిపోదు; ఆ నమ్మకం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో పొరపాటు; ఆ పని నిజాయితీతో, తగిన జాగ్రత్తతో ఉండాల’ని కోర్టు పేర్కొంది. ‘జాగ్రత్త’ అనే ప్రమాణాన్ని అన్ని సందర్భాల్లో, అందరికీ ఒకేలా వర్తింప చేయలేమని పేర్కొంది. వ్యక్తులు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండొచ్చని వెల్లడించింది. వేర్వేరు కేసుల్లో ఇది మారొచ్చని చెప్పింది. ఈ కేసులో అక్కడి పరిస్థితులు, అతని మానసిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. మరింత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించి ఉంటే ఈ ఘటనను నివారించగలిగే వాడనే కారణంగా సెక్షన్ 79 రక్షణను నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తర్వులు సరైనవేనని ధ్రువీకరిస్తూ, అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
ఆ గదిలో... చీకటిలో...!
విశాలమైన మేడల్లో కాదు... ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పిందెవడో కానీ, వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కృష్ణానగర్, బీ బ్లాకులోని, పూర్ణా టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే పన్నెండో నెంబరు పచ్చ రంగు బిల్డింగులో ఓ ఇరుకైన గదిలో అద్దెకు దిగినప్పటి నుంచి ఈ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది. పెళ్లయి వారం తిరక్కుండానే గౌరిని తీసుకొని హైదరాబాద్ బయల్దేరబోతోంటే, అమ్మ ముత్యాలమ్మ కూడా సంచి సర్దేసుకుంది.‘కొత్తగా పెళ్లయిన జంట... మధ్యలో నువ్వెందుకు’ అని బంధువులంతా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ‘అమ్మకు నేను తప్ప ఎవరున్నారు.. నేనెక్కడుంటే తనూ అక్కడే’ అని సూరిబాబు అందామనుకొన్నాడు. కానీ ముత్యాలమ్మ ఆ అవకాశం తన కొడుక్కి ఇవ్వలేదు. ‘పెళ్లయి వారం అయ్యిందో లేదో.. నన్నూ నా బిడ్డనీ దూరం చేస్తారే.. ముదనష్టపు ముండల్లారా’ అని ఆరున్నొక్క రాగం అందుకుంది. అమ్మలక్కలు టీవీ సీరియల్ చూసినట్టు చూశారు. ఒకరిద్దరు ముత్యాలమ్మ నోటికి జడుసుకొని పారిపోయారు. ఓ అరగంట గ(ఏ)డిచాక.. ముత్యాలమ్మ ఏడుపులోనూ నిజం ఉందనిపించింది అందరికీ. దాంతో ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు.ఊర్లో రైలెక్కినప్పుడు ఏం అనిపించలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి, 10హెచ్ బస్సు అందుకున్నప్పుడు కూడా ఏ భయమూ వేయలేదు. అరవై రూపాయల స్టీలు కోటింగు గోద్రేజ్ తాళం చాలా కష్టపడి తీస్తున్నప్పుడూ కంగారు పడలేదు. కానీ, ఒక్కసారి రూమ్‌లో అడుగుపెట్టేసరికి సూరిబాబు వాస్తవంలోకి రాలేక తప్పలేదు.‘దీన్ని కూడా ఇల్లంటారా’ అనబోయి ‘ఇదే మన ఇల్లా’ అని కాస్త డిగ్నిఫైడ్‌గా అడిగింది గౌరి.నాలుగ్గోడలు నిలబెట్టి, ఓ రేకు అడ్డంగా పరిస్తే తయారైన కుటీరం అది. దీనికంటే పిట్టలు కట్టుకొనే గూడే కాస్త పటిష్ఠంగా ఉంటుంది. మహానగరంలో మూడువేలకు ఇంతకు మించిన ఆవాసం దొరకడం ఎంత కష్టమో సూరిబాబుకి తెలుసు. బీటలు వారిన గోడలు, వాటి మధ్యే కాపురం ఉంటున్న బల్లులు, ‘ఇదే మన సామ్రాజ్యం’ అని యథేచ్ఛగా తిరిగేస్తున్న బొద్దింకలు. ఆ మూల ఎప్పుడూ మూడున్నర కేజీల గ్యాసే పట్టే ఐదు కేజీల సిలిండర్, ఈ మూల ఓ చాప, రెండు మాసిన దిండ్లు. ఆ మధ్యలో తన జీవితంలానే అస్తవ్యస్తంగా ఉన్న అల్మరా. ఇద్దరు అటూ ఇటూ తిరుగుతుంటే మూడో మనిషి నిలబడడానికే జాగా ఉండదు. అలాంటి చోట.. మూడో మనిషితో పాటు.. అది కూడా పెళ్లైన కొత్తలో కాపురానికి దిగాడంటే.. సూరిబాబుది ఎంత గట్టి గుండెనో అర్థం చేసుకోవొచ్చు.‘ఇదేం ఇల్లురా.. సూరి. ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నావా’ అంటూ ఊర్లో మధ్యలో ఆపేసిన ఏడుపు హైద్రాబాద్ మహానగరంలో కొనసాగించింది ముత్యాలమ్మ.‘నువ్వు ఏడుస్తూనే ఉండు.. నేను టిఫిన్లు తీసుకొస్తా..’ అని బయల్దేరబోతోంటే గౌరి ఆపింది. ‘ఇప్పుడు ఆ ఖర్చెందుకు.. నేను ఏదోటి చేస్తాగా’ అని చురుగ్గా కదిలింది. చిందరవందరగా ఉన్న వస్తువుల్ని చిటికెలో సర్దేసింది. చీపిరి అందుకొని చకచక ఊడ్చేసింది. తడిగుడ్డ పెట్టింది. స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. డబ్బాల్లో ఏమున్నాయో వెదికింది. అవన్నీ కలిపి ఓ వంటకం సిద్ధం చేసింది. అందులోనే కొంత మిగిల్చి మధ్యాహ్నం క్యారియర్‌కి సర్దింది. ‘తొమ్మిది వేల ఆరొందల జీతంతో జీవితం హాయిగా గడిచిపోతుందిలే’ అనే భరోసా భర్తకి ఇచ్చింది. గౌరిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తొలిసారి గర్వంగా ఫీలయ్యాడు సూరిబాబు.పొద్దస్తమానం కష్టపడి వస్తాడు సూరిబాబు. ఉన్నదాంట్లో రుచికరంగా వండుతుంది గౌరి. ‘నేనొండినట్టు ఎక్కడుంది’ అంటూ నిష్టూరపోతూనే మెతుకు మిగల్చకుండా లాగించేస్తుంది ముత్యాలమ్మ. ఆమెకు కాస్త పెందలాడే పడుకోవడం అలవాటు. చేతులు ఆరవు. కంచం కూడా తీయదు. తిన్న వెంటనే ముసుగేస్తుంది. ఆ ఇరుకైన గదిలోనే ముగ్గురికి పక్క సర్దుతుంది గౌరి. ముత్యాలమ్మ అటు తిరిగి పడుకొంటే.. ఇటు కొత్త దంపతులు సర్దుకుపోతారు.సూరి – గౌరి ఇద్దరూ కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకొంటారు. మూగగా ప్రేమించుకుంటారు. అదే వారి ఏకాంతం. కాసేపు ఆ నాలుగు చేతులూ మాట్లాడుకుంటాయి. అరికాళ్లు ఆవిర్లు పంచుకుంటాయి. ఆ ఊపిర్లు వెచ్చగా పలకరించుకుంటాయి. అంతే వారి శృంగారం. గౌరిని దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది. ముద్దు చేయాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై కోపం వస్తుంటుంది.బయట వాన పడుతుంటుంది. సూరి శరీరం వెచ్చబడుతుంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌరిని చుట్టేసి కాస్త చల్లబడాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిని మర్డర్ చేయాలనిపిస్తుంది.సాయంత్రం వస్తూ వస్తూ బేరమాడకుండానే మూర మల్లెపూలు పట్టుకొస్తాడు. అదే తన విలాసం. అందులోనూ ముత్యాలమ్మ వాటాకొస్తుంది. ధర్మబద్ధంగా పావు మూర కోడలి కొప్పుకి చేరుతుంది. కనీసం ఆ మల్లెల వాసనైనా మనస్ఫూర్తిగా అనుభవిద్దాం అనుకుంటాడు. కానీ వెనకే ముత్యాలమ్మ నీడ వెంటాడుతూ ఉంటుంది. ఇది తన విలాపం.అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై పూట పూటకూ పగ పెరుగుతూనే ఉంటుంది.‘అసలే కొత్త జంట.. వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వూ.. అన్నీ తెలిసినదానివి ఇంతకంటే ఏం చెబుతాం’ అని ఎవరో ముత్యాలమ్మకు ఫోనోపదేశం చేశారు ఓసారి. అప్పట్నుంచి రాత్రి భోజనాల తరవాత బయటకు వెళ్లి పచార్లు చేయడం అలవాటు చేసుకొంది. అదీ కా..సే...పే.ఎంత సేపంటే.. తలుపు వేసి గౌరిని అల్లుకునేంత సేపు.ఎంత సేపంటే.. ఆ బుగ్గల నునుపెంతో చూసేంత సేపు.ఎంత సేపంటే.. ఆ విరహం దూరమెంతో కొలిచేంత సేపు. అంతే!‘మాయిదారి నిద్ర.. మాయిదారి నిద్ర.. కళ్లు మూతలు పడుతున్నాయనుకో..’ అంటూ మూసి ఉన్న తలుపుల్ని గభాల్న తోసుకొంటూ వచ్చేస్తుంటుంది. అత్తగారికి ఎక్కడ దొరికిపోతామో అన్న భయం ఆ కోడల్ని వెంటాడుతుంటుంది. ‘కన్నతల్లిని పక్కన పెట్టుకొని ఏమిటీ రాసలీలలు’ అని ఆ కొడుకు మనసు క్షోభిస్తుంటుంది. కథ మామూలే! ఇలా ఎలాంటి రసాస్వాదన లేకుండా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.‘పట్నం ఎలా ఉందో చూసి రాకూడదమ్మా.. బస్సు కూడా ఫ్రీనే..’ అన్నాడు కొడుకు ఓ ఆదివారం పూట.‘కోడల్ని కూడా తీసుకెళ్తా.. తనక్కూడా ఫ్రీనే కదా’ అని వెంటబెట్టుకుపోయింది. ‘ఏనాడు చేసుకొన్న పాపమో ఇది..’ అని తల గోడకేసి కొట్టుకోబోయి.. అది ఎక్కడ పడిపోతుందో అని భయం వేసి ఆగిపోయాడు.‘పెద్దమ్మ గుడి పక్కనే... ఓసారి దండం పెట్టుకొని వచ్చేయ్’ అంటే ‘మీ నాన్న నన్ను వదిలిపెట్టి పోయినప్పుడే దేవుడిపై నమ్మకం పోయింది’ అంటూ ట్యాపు విప్పింది. అవి కన్నీళ్లు కావు. ఎండాకాలం కూడా ప్రవహించే కుళాయి.ఆ కొత్త పెళ్లికూతురు మాత్రం ఎన్నిరోజులు భరిస్తుంది? ఎంతని సహిస్తుంది? ‘ఇక జీవితాంతం ఇంతేనా?’ అని అలక‘చాప’ ఎక్కింది. అటు తిరిగి పడుకొని, తన నిరసన తెలిపింది. పాపం.. అంతకంటే ఏం చేయగలదు?‘నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మ.. నీ కాటుక కళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా..’ కింది ఫ్లోరు నుంచి పాట వినిపిస్తోంది మంద్రంగా.∙∙ రెండు గదులున్న ఇంట్లోకి మారే స్తోమత తనకు ఇప్పట్లో లేదు. అదెప్పుడొస్తుందో కూడా తెలీదు. ఈలోపు గౌరిని శాంతపరచాలి. అందుకేం చేయాలి? అందుకే బాగా ఆలోచించి.. ‘ఓయోకి వెళ్దామా..’ ఏదైతే అది అయ్యిందని తెగించి అడిగేశాడు.‘ఓయోనా.. అదేంటి?’ అని తన అమాయకమైన మొహాన్ని మరింత అందంగా మార్చేస్తూ అడిగింది ఆ కొత్త పెళ్లి కూతురు. ఓయో అనగానేమి, అక్కడ దొరికే సౌలభ్యాలేమిటి అనేవి పూసగుచ్చినట్టు వివరించేశాడు.‘ఇదేం ఖర్మండీ మనకూ. నేను రానుగాక రాను..’ అని మొదట్లో నొచ్చుకొంది. కానీ కొన్ని రాత్రుల విరహం తనని కూడా కరిగించింది.ఓయో రెంటు తొమ్మిదొందలు. సూరిబాబుకి వచ్చే ఆ అరాకొరా జీతంలో తొమ్మిదొందలు ఒక్క పూట కోసం పక్కన పెట్టడం కష్టమే.‘రేపట్నుంచి మల్లె పూలొద్దు’ ఆర్డరేసింది గౌరి. ‘టీ’ తన టైమ్ టేబుల్ మార్చుకొని, ఒక్క పూటకు కుంచించుకుపోయింది. రెండు ఆదివారాలు కోడికూర లేకుండానే గడిచిపోయాయి.‘ఎందుకిదంతా..?’ అని అడిగితే... ‘రూపాయా, రెండ్రూపాయలా? తొమ్మిదొందలు. మన జల్సాలకు ఖర్చు చేస్తున్నాం కదా, ఈ మాత్రం ఆదా చేయకపోతే ఎలా’ అంది. దిగువ మధ్యతరగతివాడి సరసం కూడా విలాస వస్తువుల ఖాతాలో చేరిపోయిందన్నమాట.నెల రోజుల ఆదాతో ఆ తొమ్మిదొందలూ పూడాయి. ఆ ఆదివారం భార్యాభర్తలిద్దరూ టిప్పుటాపుగా రెడీ అవుతుండడం మూల నుంచి ముత్యాలమ్మ గమనిస్తూనే ఉంది.‘సినిమాకెళ్తున్నాం.. పెందలాడే వచ్చేస్తాంలే..’ అని తొలిసారి అబద్ధమాడాడు సూరి.‘సినిమానా.. నేనూ వద్దును కదర్రా.. ఎన్నాళ్లయ్యిందో చూసి’ అని తెగ బాధ పడిపోయింది ఆ తల్లి. ‘టికెట్లు రెండే దొరికాయి.. కొత్త సినిమా కదా..’ అంటూ మరో అబద్ధాన్ని అప్పటికప్పుడు అల్లి బయల్దేరారు ఇద్దరూ.దారి వెంబట ఎన్ని కలల్ని, ఎన్ని ఊహల్ని, ఎన్ని కోరికల్ని మోసుకెళ్లారో. మధ్యలో ఆగి ఓ మూర మల్లెలు కొన్నాడు. ఈసారి పూర్తిగా తన భార్యకే.ఓయో వచ్చింది. భయం, బిడియం కలిసిన అడుగులు తడబడుతూ హోటల్ మెట్లెక్కాయి.‘పేరేంటి..’ అడిగాడు ఓయో అబ్బాయి.‘సూరిబాబు..’‘ఎన్ని రోజులు ఉంటారు?’‘రోజులా.. ఈ ఒక్క పూటకే..’‘ఐడీ కార్డు..’‘ఐడీ కార్డా... మర్చిపోయా..’ అంటూ జేబులు తడుముకొన్నాడు. పాపం నిజంగానే మర్చిపోయాడు.‘సర్సరేలే.. ఇలాంటివన్నీ మామూలే..’ అనుకొంటూ గౌరి వంక కాస్త వంకరగా చూశాడు. ఆ చూపుల భావమేంటో గౌరికి అర్థం కానందుకు సూరిబాబు కాస్త స్థిమితపడ్డాడు. అడ్వాన్సు అందుకొన్న ఓయో అబ్బాయి ‘రూమ్ నెంబరు 203’కి దారి చూపిస్తూ తాళం అందించాడు. లిఫ్టు రెండో ఫ్లోరులో ఆగింది. ఎవరైనా చూస్తారేమో అనే కంగారు పడుతూనే 203లోకి దిగబడింది ఆ జంట. ఓ థర్డ్ క్లాస్ లాడ్జ్ అది. గోడలకు వేసిన రంగు మాసిపోయి చాలా కాలమైంది. ఆ దుప్పటి కూడా ఎప్పుడు ఉతికారో ఏమిటో? రూమ్ నిండా అదోరకమైన వాసన. కానీ గౌరి ఇవేం పట్టించుకోవడంలేదు. సూరికి కూడా ఇవేం అక్కర్లేదు.తాము కాపురం వెలగబెడుతున్న ఆ ఇరుకు గదితో పోలిస్తే ఈ రూము విశాలంగా ఉంది.‘ఇంత పెద్ద మంచమా..’ అంటూ గౌరి కళ్లు విప్పారాయి. ఆ రూమంతా ఓసారి ఇష్టంగా కలయితిరిగింది. నెత్తి మీద ఫ్యాను తిరుగుతోంది. టీవీ కూడా ఉంది. ఇంత కంటే విలాసం.. తాను చూడగలదా? ఆనందంతో భర్తని కౌగిలించుకుంది. తొలిసారి మల్లెపూలకు ఎంతటి మహత్తు ఉందో తెలుసుకుంటున్నాడు సూరి. పెళ్లయిన ఇంత కాలానికి తనకూ, తన భార్యకూ దొరికిన ఏకాంతం అది. ప్రతీ క్షణమూ మధురమే. ఈసారి సూరిబాబు కౌగిలి బిగించాడు. గౌరికి ఊపిరి ఆడడం లేదు. అయినా బాగుంది. సూరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అయినా హాయిగానే అనిపిస్తోంది. కాసేపు పట్టు విడిచాడు. కళ్లల్లో కళ్లు పెట్టి చూశాడు. గౌరి పెదవులు తమని ఆక్రమించుకొమ్మని ఆహ్వానలేఖ పంపాయి. వాటిని అందుకోబోతుండగా...‘టింగ్’ అంటూ మోగింది కాలింగ్ బెల్. స్వప్నలోకాల నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టు అనిపించింది. సూరి, గౌరి మొహమొహాలు చూసుకొన్నారు. తొలిసారి కంగారు పడ్డారు. గౌరి చీర సర్దుకొంది. సూరి తమాయించుకుంటూనే తలుపు తీశాడు. ఎదురుగా ఇద్దరు కానిస్టేబుళ్లు. ‘ఇద్దరు కరడుకట్టిన అల్‌కాయిదా తీవ్రవాదుల్ని పట్టేసుకున్నాం’ అనేంత గర్వం వాళ్ల కళ్లల్లో.∙∙ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పటిలా చాలా రద్దీగా ఉంది. పోలీస్ స్టేషన్ చూడడం గౌరికి అదే తొలిసారి. అందుకే శరీరంలో అణువణువూ ఒణుకుతోంది. సినిమాల్లో పోలీస్ స్టేష¯Œ ని చాలాసార్లు చూశాడు సూరిబాబు. కానీ అవి ఇలా లేవు. అందుకే తాను కూడా కంగారు పడుతున్నాడు. కానీ బయటపడడం లేదు.‘మేమిద్దరం భార్యాభర్తలం సార్..’ అని హెడ్ కానిస్టేబుల్ దగ్గర వేసిన క్యాసెట్టే వేస్తున్నాడు. రైడింగ్‌లో పట్టుబడ్డోళ్లంతా ఇలానే చెబుతార్లే అన్నట్టు హెడ్డుగారు అసలు పట్టించుకోవడమే లేదు.‘ఏమిటండీ.. ఇదంతా.. ఇప్పుడు ఏం జరుగుతుంది’ గౌరి దాదాపు ఏడ్చినంత పని చేసింది. ‘నువ్వేం కంగారు పడకు.. నేను చూస్తాగా..’ అంటూ హెడ్ కానిస్టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టాడు.‘సార్.. నిజంగానే తను నా భార్య సార్’ ఈసారి దాదాపు కాళ్లు పట్టుకొన్నంత పని చేశాడు.‘మరి సాక్ష్యం’‘తాళిబొట్టు ఉంది కదా’‘అది సరిపోదు.. ఇంకేమైనా..’‘మా అమ్మ ఉంది..’‘ఎక్కడ..’సూరిబాబు అడ్రస్ చెప్పాడు. ఓ కానిస్టేబుల్ వెళ్లి కాసేపటి తరవాత ముత్యాలమ్మని వెంటబెట్టుకొచ్చాడు. స్టేష¯Œ లోకి అడుగు పెడుతూనే కొడుకూ కోడళ్లిద్దరి వైపు ముత్యాలమ్మ చూసిన చూపు ఈ హెడ్ కానిస్టేబుల్ మాటల కంటే భయంకరంగా అనిపించాయి. ఏం జరిగిందో ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ముత్యాలమ్మకు ఎంతోసేపు పట్టలేదు. సంతకాలు పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటపడ్డారు ముగ్గురూ.అమ్మ కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు సూరికి. అత్తతో మాట్లాడేంత తెగువ లేదు గౌరికి. వాళ్లద్దరినీ మళ్లీ కదిపే సాహసం చేయలేదు ముత్యాలమ్మ.‘నన్ను మన ఊరి బస్సెక్కించేయ్ రా’ పావుగంట తరవాత ముత్యాలమ్మ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అది. సూరి ఏం మాట్లాడలేకపోయాడు.‘నేనూ మీ వయసు దాటొచ్చినదాన్నే.. మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది.. ఊరి నిండా మనోళ్లే కదా. నేనక్కడ బాగానే ఉంటా. అప్పుడప్పుడూ మీరే వస్తుండండి’అమీర్ పేటలో ముత్యాలమ్మని బస్సెక్కించి, ఆటోలో ఇంటికి బయల్దేరారు ఆ భార్యాభర్తలు. నెల రోజుల నుంచి పడుతున్న తపన.. ఈ రోజు జరిగిన తతంగం అంతా కళ్ల ముందు కదలాడింది. కాసేపు బాధ పడ్డారు. ఆ తరవాత చిన్నగా నవ్వుకున్నారు. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి గొడవా లేకుండా బయటపడడంతో కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఇద్దరి కళ్లూ కలిశాయి. ఇంటికి వెళ్తే.. కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందన్న ఆలోచన ఇంకాస్త ఆనందాన్ని కలిగించింది. మల్లెల దండ ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంది. సూరిలోని రొమాంటిక్ ఫెలో మళ్లీ నిద్ర లేచాడు. ఆటో యూసుఫ్‌గూడా రోడ్లు దాటుతూ కృష్ణానగర్‌లో ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్న తలపు.. వాళ్లిద్దర్నీ మరింత తొందరపెట్టింది. అరవై మెట్లు తొలిసారి ఆయాస పడకుండా ఎక్కేస్తున్నారు. ఫ్లోరు దాటుతున్న కొద్దీ ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగి పొర్లుతోంది. త్వరగా ఒక్కటైపోవాలన్న తపన తొందర పెట్టిస్తోంది. ఐదు ఫ్లోర్లు పూర్తయ్యాయి. తమ గదికి చేరువైపోయారు. ఆఖరి మెట్టు దగ్గర ఇద్దరూ సడన్ బ్రేకు వేసినట్టు ఆగిపోయారు. ఎందుకంటే గుమ్మం ముందు ఓ శాల్తీ కాచుకొని కూర్చుంది. ఈ భార్యాభర్తల్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది.‘ఏమైపోయావ్ గౌరీ ఇంతసేపూ..’ అని రాగానే బలవంతంగా కావలించేసుకొంది.‘ఎవరీవిడ..’ అర్థం కానట్టు అడిగాడు సూరి.‘మా అనసూయత్త చిన్నప్పటి నుంచీ నన్ను పెంచి పోషించింది. మన పెళ్లికి కూడా వచ్చింది’‘ఇప్పుడిక్కడికెందుకు వచ్చినట్టు?’ మెల్లగానే అన్నా, ఆ మాట అనసూయకు వినిపించింది. ‘నాకు మీరు తప్ప ఎవరున్నారు గౌరీ.. మీ మావయ్య కూడా కాలం చేశాడు. ఒక్కదాన్నే ఊర్లో ఉండబుద్ది కాలేదు. కూతురులాంటి నువ్వు గుర్తొచ్చావు. కలో గంజో కలిసే తాగుదాం అనిపించి వచ్చేశాను..’ అంటూ ఇంకోసారి బావురు మంది.‘ఈ ఇరుకింట్లోనా?’ ఈసారి వినిపించేలానే అన్నాడు సూరి.‘సుఖమన్నది విశాలమైన మేడల్లో కాదు బాబూ.. ఇలాంటి ఇరుకైన ఇళ్లల్లోనే ఉంటుంది’ అంది పెద్ద తత్వవేత్తలా.ఆ ఒక్క మాటతో సూరిబాబు గుండెలో వంద గ్రెనేడ్లు పేలాయి.- మహమ్మద్ అన్వర్ -
గాల్లోని దోమలు గాల్లోనే మటాష్!
అరచేతిలో తేలికగా ఇమిడిపోయే ఈ పరికరం ఒక మైక్రోడ్రోన్. ఇది గాల్లోని దోమలను గాల్లోనే మటాష్ చేసి పారేస్తుంది. దోమల బెడద నివారించడానికి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన సాధనాలన్నీ ఒక తీరు అయితే, ఈ మైక్రోడ్రోన్ మరో తీరు. ఇది గాల్లో శరవేగంగా ఎగురుతూ కనిపించిన దోమనల్లా క్షణాల్లోనే వేటాడి మట్టుబెట్టేస్తుంది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఈ మైక్రోడ్రోన్ కదలికలను స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా నియంత్రించే వెసులుబాటు ఉంది.దోమల నివారణ కోసం రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ ఏఐ మైక్రో డ్రోన్‌ను ‘టోర్న్యాల్’ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ రూపొందించింది. ఈ డ్రోన్ల తయారీకి స్టార్టప్‌లను ప్రోత్సహించే ‘వై కాంబినేటర్’ ఆర్థిక సాయం అందిస్తోంది. కేవలం నలభై గ్రాముల బరువు ఉండే ఈ డ్రోన్ పనితీరుపై ‘టోర్న్యాల్’ ఇటీవల విడుదల చేసిన వీడియో జనాలను విశేషంగా ఆకట్టుకుంది. -
యూత్ క్వీన్
అమ్మ కలను తన కలగా మార్చుకున్న నటి మీనాక్షి దినేష్ (Meenakshi Dinesh). కెమెరా ముందు హీరోయిన్ గా మెరిసినా... కెమెరా వెనుక మాత్రం కొత్త రుచుల కోసం ఊరంతాచుట్టేసే ఫుడీ! గాసిప్స్‌ను నవ్వుతూ పక్కన పెట్టే ఈ ‘యూత్’ హీరోయిన్ మనసులోని ముచ్చట్లు... మీకోసం.ఆయన ఫ్యాన్ గర్ల్‌ని!సూర్య సర్ అంటే నాకు చెప్పలేనంత అభిమానం. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే... టెన్షన్ లో నా డైలాగులే మర్చిపోతానేమో! అలాగే నాని సర్ సినిమాలు కూడా చాలా ఇష్టం. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాను నేను లెక్కలేనన్ని సార్లు చూశాను.నా కల కాదు!హీరోయిన్ అవ్వాలనేది నా ప్లాన్ కాదు... పూర్తిగా మా అమ్మ కల! నాలో ఏదో స్పార్క్ ఉందని మొదట గుర్తించింది ఆమే. నాతో ఆరేళ్ల వయసులోనే ఫొటోషూట్లు చేయించి, ఆడిషన్స్‌కు తీసుకెళ్లేది. పన్నెండేళ్లకే ‘పాండియన్ స్టోర్స్’ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పుడు వచ్చిన నా తొలి పారితోషికం రూ.3,000. ఆ డబ్బు చూసి నేను ఆస్కార్ గెలిచినంతగా మా అమ్మ సంబరపడిపోయింది.క్యాట్ ఫైట్స్... అంతా కథే!నాతో పాటు అనిష్మ, ప్రియాన్షి లాంటి యంగ్ నటీమణులు ఉండటంతో మా మధ్య గొడవలు ఉన్నాయంటూ ఎన్నో గాసిప్స్ వచ్చాయి. కానీ సెట్స్‌లో మేమంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లం. ఈ ఇండస్ట్రీలో ఎవరూ శత్రువులు కాదు... ప్రతి రోజూ కొత్తగా నేర్చుకునే సహనటులే. అందుకే నాకు ఎవరితోనూ పోటీ అనే భావనే లేదు.సెలెక్టివ్‌గా ఉండడంలో తప్పేంటి?‘యూత్’ విజయం తర్వాత నేను కథల విషయంలో చాలా కండిషన్స్ పెడుతున్నానని, డిఫికల్ట్‌గా మారానని రాస్తున్నారు. కానీ మంచి పాత్రలు కోరుకోవడం తప్పా? ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే పాత్ర కోసం ఎదురు చూడాల్సి వచ్చినా నేను సిద్ధమే. డైరీ నింపుకోవడానికి సినిమాలు చేయను... గుర్తుండిపోయే పాత్రల కోసమే ఎదురుచూస్తాను.ఎలాగోలా పాస్ అయ్యేదాన్ని!నా చిన్నతనం అంతా ఒకవైపు స్కూల్, మరోవైపు యాడ్ షూటింగ్స్‌తోనే గడిచిపోయింది. సినిమాల్లో చూపించినంత కలర్ఫుల్గా నా స్కూల్ లైఫ్ ఉండేది కాదు. పరీక్షల్లో ఎలాగోలా పాస్ అయితే చాలు అనుకునే సాధారణ స్టూడెంట్‌ని.డైటింగ్ నా వల్ల కాదు!నేను పక్కా ఫుడీని. ‘యూత్’ సినిమాలో నా పాత్రకు తిండి అంటే ఎంత ఇష్టమో... నిజ జీవితంలో నాకు కూడా అంతే. ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అందరూ షెడ్యూల్స్‌లో బిజీగా ఉంటే... నేను మాత్రం బెస్ట్ బిర్యానీ, బెస్ట్ లోకల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని వెతికేదాన్ని. -
ఒక్క జత స్నీకర్స్... ఐదు స్టయిల్స్!
కొత్త డ్రెస్! అనిపించాలంటే ప్రతిసారి కొత్త బట్టలు కొనాల్సిన పనిలేదు. ఒక్క జత వైట్ స్నీకర్స్ ఉంటే చాలు! ఇవి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న ప్రతి డ్రెస్‌తో ఫ్రెండ్షిప్ చేసి, ప్రతిసారి కొత్తగా చూపిస్తాయి. క్యాజువల్ నుంచి సెమీ ఫార్మల్ వరకు... ఒక్క జతతో ఎన్నో లుక్స్ క్రియేట్ చేయొచ్చు. మరి వైట్ స్నీకర్స్‌ను స్టయిలిష్‌గా ఎలా ధరించాలో ఇక్కడ చూద్దామా!సింపుల్ సూపర్!కొన్ని లుక్స్ ఎక్కువ కష్టపడితే రావు... తక్కువ కష్టపడితేనే అదిరిపోతాయి! తెల్లటి టీషర్ట్, గ్రే డెనిమ్, వైట్ స్నీకర్స్... అంతే. ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఔటాఫ్ ఫ్యాషన్ కాదు. సింపుల్‌గా కనిపించినా, అదే ఈ లుక్ ప్రత్యేకత. చేతికి ఓ వాచ్, కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకుంటే... సింపుల్ లుక్ కూడా స్టార్ ఎంట్రీ ఇస్తుంది.ఓపెన్ షర్ట్... ట్రెండీ టచ్!వైట్ టీషర్ట్‌పై చెక్స్ షర్ట్ వేసుకోండి. కానీ ఓ చిన్న కండిషన్ ... బటన్లు మాత్రం వేయొద్దు! అదే ఈ లుక్‌లో అసలు ట్విస్ట్. బ్లూ జీ న్స్, వైట్ స్నీకర్స్‌తో బయటికి వస్తే... ‘ఈయన చాలా క్యాజువల్‌గా రెడీ అయ్యాడు... కానీ ఎందుకింత స్టయిల్‌గా ఉన్నాడు?’ అని జనాలు ఒక్కసారి చూసి మళ్లీ మళ్లీ చూస్తారు!కూల్ హీరో!షార్ట్స్‌తో ఏ షూ పడితే అది వేసుకుంటే... ‘వాకింగ్కా? వర్కౌట్కా?’ అనే డౌట్ వస్తుంది. అందుకే స్లిమ్, లో–కట్ వైట్ స్నీకర్స్ ఎంచుకోండి. సాక్స్ కూడా కనిపించకుండా చూసుకోండి. అప్పుడు సమ్మర్లో కూడా మీ స్టయిల్... ఐస్‌క్రీమ్‌లా కూల్‌గా ఉంటుంది!చినోస్‌తో స్మార్ట్ లుక్రోజూ అదే జీ న్స్నా? ఒక్కరోజు చినో ప్యాంట్‌ను బయటకు తీయండి. దానికి తెల్లటి షర్ట్ లేదా సాలిడ్ కలర్ షర్ట్ జత చేయండి. ఇంకో లెవల్‌కు వెళ్లాలంటే బ్లేజర్ కూడా వేసేయండి. ఆఫీస్‌లో అయినా... డేట్లో అయినా... ‘డ్రెస్ సె న్స్ బాగుంది!’అనే కామెంట్ గ్యారంటీ!సూట్‌తో స్నీకర్స్... కొత్త ట్రెండ్! సూట్ అంటే ఫార్మల్ షూలే అనుకునే రూల్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ వచ్చేసింది! ఇప్పుడు సూట్‌తో వైట్ స్నీకర్స్ వేసుకోవడం హాట్ ట్రెండ్. అయితే ఒక చిన్న సీక్రెట్... లోపల తెల్లటి షర్ట్ లేదా వైట్ టీషర్ట్ ఉంటే మొత్తం లుక్ చాలా నీట్‌గా, క్లాస్‌గా కనిపిస్తుంది. ఫార్మల్‌లో కూడా ఫ్యాషన్ కి ఫుల్ మార్కులు కొట్టేయొచ్చు!స్టయిలింగ్ టిప్వైట్ స్నీకర్స్ అందంగా కనిపించాలంటే వాటిని తెల్లగానే ఉంచాలి! మట్టి, దుమ్ము పట్టిన స్నీకర్స్‌తో ఎంత ఖరీదైన డ్రెస్ వేసుకున్నా... స్టయిల్ కంటే ‘షూ కడుక్కోలేదా?’ అనే ప్రశ్నే ముందొస్తుంది. కాబట్టి... స్నీకర్స్‌ను క్లీన్ గా ఉంచి, మీరు అడుగులు ముందుకు వేస్తే, ఎందరి చూపులో మిమ్మల్నే ఫాలో అవుతాయి.∙కొండి దీపిక -
కోపం ఎవరిపై చూపించాలో అర్థం కాకపోతే... ఇలా చేయండి!
పని మధ్యలో చిన్న బ్రేక్ కావాలన్నా, కోపాన్ని తగ్గించుకోవాలన్నా, చికాకును దూరం చేసుకోవాలన్నా, టెన్షన్‌ను కాస్త పక్కకు పంపాలన్నా, పిల్లలు సరదాగా ఆడుకోవాలన్నా... ఈ కూల్ గాడ్జెట్లు ఉండాల్సిందే! చేతులను బిజీగా, మనసును హ్యాపీగా ఉంచే బెస్ట్ టైమ్‌పాస్ గాడ్జెట్లు ఇవే!కొట్టు... కూల్ అవ్వు!బాస్‌పై కోపమా? మీటింగ్ వల్ల చిరాకా? చదువుతుంటే బుర్ర వేడెక్కిందా? ఎవరిపై చూపించాలో అర్థం కాకపోతే... ఈ డెస్క్‌టాప్ పంచింగ్ బ్యాగ్ రెడీగా ఉంది. టేబుల్‌పై దీన్ని అతికించి, కోపం వచ్చినప్పుడల్లా ఒక్క పంచ్ ఇవ్వండి. బలమైన స్ప్రింగ్ ఉండటంతో అది వెంటనే మళ్లీ మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు కొట్టండి– అది తిరిగి లేస్తుంది. ఇలా మీ కోపం తగ్గే వరకు కొనసాగించొచ్చు! బలమైన సక్షన్ బేస్ ఉండటంతో టేబుల్‌కు గట్టిగా అతుక్కుపోతుంది. ఆఫీస్ డెస్క్, చదువుకునే టేబుల్, ఇంటి వర్క్‌స్టేషన్ – ఎక్కడైనా సులభంగా అమర్చుకోవచ్చు. చిన్న సైజులో ఉండటంతో ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. ధర కేవలం రూ. 500 మాత్రమే.నొక్కు... నవ్వు!బస్ కోసం వెయిట్ చేస్తున్నా; టైమ్ పాస్ కావాలన్నా; క్లాస్‌లో బోర్ కొడుతున్నా; చేతులు ఖాళీగా ఉంటే నిమిషం కూడా గడవదా? అయితే ఈ ఫిడ్జెట్ ప్యాడ్ మీ కోసమే! చూడటానికి చిన్న గేమింగ్ కంట్రోలర్‌లా కనిపించే ఈ గాడ్జెట్‌లో ఒకటి కాదు, ఏకంగా ఎనిమిది రకాల ఫిడ్జెట్ ఫీచర్లు ఉన్నాయి. బటన్లు నొక్కడం, జాయ్‌స్టిక్‌ను తిప్పడం, గేర్‌ను తిప్పడం, స్లైడర్‌ను జరపడం, స్విచ్‌ను క్లిక్ చేయడం... ఇలా వేళ్లకు ఎప్పుడూ చిన్న పని ఉంటుంది. బోర్ కొట్టినా, టెన్షన్ పెరిగినా, ఎదురు చూస్తున్నా– చేతులు మాత్రం బిజీగా ఉంటాయి. చిన్నగా, తేలికగా ఉండటంతో జేబులో వేసుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఆఫీస్, కాలేజీ, ట్రావెల్– ఎక్కడైనా క్షణాల్లో బోర్ను తరిమికొట్టే సరదా గాడ్జెట్ ఇది. ధర రూ. 500. -
స్టయిల్‌ను మడతపెడుతున్నారా?
షర్ట్ మడతేస్తే.. మాస్ కాదు. కరెక్ట్‌గా వేస్తే క్లాస్ కూడా! షర్ట్ వేసుకున్నాక స్లీవ్స్‌ను మడతపెట్టడం ప్రతి అబ్బాయి చేసే పని. కాని, చాలామంది ఇప్పటికీ పాత పద్ధతిలో ఫాలో అవుతూ.. షర్ట్ చేతులతో పాటు స్టయిల్‌ను కూడా మడతపెట్టేస్తుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్స్ తెలుసుకోవాల్సిందే.ఇదే అసలు స్లీవ్ హ్యాక్!స్లీవ్స్‌ను ఒక్కో మడతగా పైకి చుడుతూ టైమ్ వేస్ట్ చేయొద్దు. షర్ట్ కఫ్‌ను పట్టుకుని ఒకేసారి మోచేతి వరకు పైకి లాగండి. ఇప్పుడు కింద మిగిలిన ఫ్యాబ్రిక్‌ను ఒక్కసారి మడత వేయండి... అంతే! స్లీవ్స్ బిగుసుకుపోవు, రోజంతా కంఫర్ట్‌గా ఉంటాయి, పైగా షర్ట్ ఫిట్‌గా, షార్ప్‌గా కూడా కనిపిస్తుంది. సాయంత్రం మళ్లీ స్లీవ్స్‌ను దించాలనిపిస్తే కఫ్‌ను ఒక్కసారి కిందకు లాగితే చాలు. మడతలు విప్పడానికి కుస్తీలు పట్టాల్సిన పనిలేదు!ఏ సందర్భానికి ఏ రోల్?క్లాసిక్ రోల్ – ఎప్పటికీ హిట్! రెండు లేదా మూడు మడతలు వేసి మోచేతి కింద ఆపేస్తే చాలు. ఆఫీస్, కాలేజ్, క్యాజువల్ మీట్... ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్. చినో ట్రౌజర్స్, తెల్లటి స్నీకర్స్, చేతికి మెటల్ వాచ్ జోడిస్తే లుక్ ఒక రేంజ్లో ఉంటుంది.ఇటాలియన్ రోల్ – జెంటిల్మన్ ల సీక్రెట్!: కఫ్ బయటకు కనిపిస్తూ ఉండటమే ఈ స్టయిల్ స్పెషల్. లినెన్ , ఆక్స్ఫర్డ్ షర్ట్‌లకు సూపర్‌గా సెట్ అవుతుంది. చేతికి లెదర్ స్ట్రాప్ వాచ్ ఉంటే, స్టయిల్‌కు అడ్రెస్‌లా మారిపోతారు.హాఫ్ రోల్ – డేట్ నైట్ స్పెషల్!: మరీ పైకి మడతపెట్టకుండా, కఫ్‌ను ఒక్కటి లేదా రెండు మడతలు మాత్రమే వేయండి. రిలాక్స్డ్గా కనిపిస్తూనే క్లాస్‌ను మెయింటైన్ చేస్తుంది. డార్క్ చినో, లోఫర్స్, తేలికపాటి పెర్ఫ్యూమ్... అంతే, కాన్ఫిడెన్స్ కూడా మీతో పాటు నడుస్తుంది.హై రోల్ – వర్క్ మోడ్ ఆన్ !: మోచేతి పైన వరకు స్లీవ్స్‌ను మడతపెడితే పని చేయడానికి చేతులు ఫ్రీగా ఉంటాయి. కానీ... మీటింగ్‌లో ఇలా వెళ్తే ‘ఇప్పుడే పెయింటింగ్ వేసి వచ్చారా?’ అనిపించే చాన్ ్స ఉంది. కాబట్టి ఈ స్టయిల్‌ను సందర్భాన్ని బట్టి మాత్రమే ఎంచుకోండి.వన్ ఫోల్డ్ – మినిమల్ మ్యాజిక్!: డెనిమ్ లేదా మందమైన షర్ట్‌లకు ఒక్క మడత చాలు. ఎక్కువగా మడతపెడితే షర్ట్ కంటే స్లీవ్స్కే ఎక్కువ బిల్డప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది!ఎక్స్పర్ట్స్ చెప్పేదేంటంటే...?స్లీవ్స్‌ను ఎప్పుడూ మోచేతి కింద లేదా మోచేతి దగ్గర ఆపితేనే బ్యాలెన్ ్సడ్ లుక్ వస్తుంది. రెండు చేతుల మడతలు ఒకే ఎత్తులో ఉండాలి. ఒకటి పైకి... ఒకటి కిందకి ఉంటే అది స్టయిల్ కాదు... తొందరపాటు!అలాగే, స్లీవ్స్‌ను బిగుతుగా చుట్టేయొద్దు. చేతికి వాచ్ లేదా బ్రేస్లెట్ ఉంటే వాటిని దాచేయొద్దు... అవే మీ లుక్కు చిన్న హైలైట్. అయితే బ్లేజర్ లేదా కోట్తో మాత్రం స్లీవ్స్ మడతపెట్టే ప్రయోగాలు వద్దు. అలాగే ఐదు, ఆరు మడతలు వేసి చేతులను మమ్మీలా చుట్టేయడం, ఒక చేతికి మాత్రమే మడతపెట్టడం, ప్రతి షర్ట్కీ ఒకే ఫోల్డ్ వేయడం, భుజాల వరకూ స్లీవ్స్‌ను ఎక్కించి ‘జిమ్ నుంచి ఇప్పుడే వచ్చా!’ అన్నట్టు తిరగడం లాంటి తప్పులు చేయకండి. ఫ్యాషన్ అంటే ఖరీదైన బట్టలు మాత్రమే కాదు, వాటిని ఎలా క్యారీ చేస్తామన్నదే. షర్ట్ స్లీవ్స్ కూడా అందులో భాగమే. చిన్న ఫోల్డ్ కూడా మీ మొత్తం లుక్‌ను మార్చేస్తుంది!- కొండి దీపిక -
వైభవంగా గియాన్ మత్సూరీ సంబరాలు..
జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.దైవదూతగా స్థానిక బాలుడు!క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.ఆకట్టుకునే భారీ రథాలుఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్ పార్టీలు!జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.- రమా జంబుల -
ఐరావతం సాయం
సుందరవనంలో ఐరావతం అనే ఒక ఏనుగు ఉండేది. అది అన్నింటికీ సాయం చేసేది. ఇలా ఉండగా, ఒకరోజు ఒక జింక పిల్ల ఆహారం కోసం బయలుదేరింది. దానికి ఎదురుగా ఆకస్మికంగా ఒక పెద్దపులి కనబడింది. వెంటనే అది ఆ పెద్దపులిని చూసి భయంతో ఆగిపోయింది. ఆ పులి భయానికి అది తప్పించుకోవడానికి దారి లేక అది తనకు చావు తప్పదని భావించి అక్కడ ఉన్న చోటనే కళ్ళు మూసుకొంది.ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన ఐరావతం అది చూసి, పరిగెత్తి వస్తున్న ఆ పులిని ఆగమని చెప్పింది. కానీ ఆ పెద్దపులి దాని మాటను పట్టించుకోకుండా ఆ జింక పైకి దూకాలని పరుగున వచ్చింది. వెంటనే ఆ ఐరావతం ఆ కళ్ళు మూసుకున్న ఆ జింకను తన తొండంతో ముందుకు ఒక్క తోపు తోసింది.ఆ జింక కొంత ముందుకు వెళ్లి నేలపై పడిపోయింది. ఆ పులి తన పరుగును అదుపులో పెట్టుకోలేక అడ్డుగా అక్కడ జింక లేకపోవడంతో దాని వెనుక ఉన్న గోతిలో అమాంతంగా పడిపోయింది. ఆ జింక కళ్ళు తెరిచి చూసి తన ప్రాణాలు దక్కాయని సంతోషించి తనకు సాయం చేసిన ఏనుగుకు ధన్యవాదాలు తెలిపి సంతోషంతో వెళ్ళిపోయింది ఆ గోతిలో పడిన పెద్దపులి ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నీవు అందరికీ సాయం చేస్తావే! మరి నన్ను కూడా కాపాడవా!’ అని అరిచింది.వెంటనే ఏనుగు ‘ఓ పులి రాజా! నేను ఆగమని చెబితే నీవు నా మాట వినలేదు. ఇక్కడ గొయ్యి ఉందని నాకు తెలిసే నేను నిన్ను ఆగమన్నాను. కానీ నీవు ఆగకుండా ఆ జింకపై దాడి చేయాలని చూశావు. అందుకే దాన్ని ముందుకు తోసి కాపాడాను. ఇప్పుడు నిన్ను కూడా కాపాడుతాను. నీవు భయపడకు’ అని కొన్ని కలప దుంగలను, ఆకులు అలములు తెచ్చి ఆ గోతిలో వేసి దానిని కూడా కాపాడింది. ఆ పులి కూడా ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయింది. తర్వాత ఆ ఏనుగు నడిచి పోతుండగా, దానికి ’కాపాడండీ! కాపాడండీ’ అని అరుపులు వినిపించాయి. ఆ ఏనుగు పరుగున వెళ్లి ఆ అరుపులు వచ్చిన వైపుకు వెళ్లింది.అక్కడ దానికి ఒక చిట్టి చిలుకను పట్టుకున్న ఒక నక్క కనిపించింది. ఆ చిట్టి చిలుక ఆ ఏనుగును చూసి, ‘ఓ ఐరావతమా! నన్ను ఈ నక్క నుండి కాపాడవా!’ అని దీనంగా అరచింది. ఆ ఏనుగు అది విని నక్కతో ఆ చిలుకను వదిలిపెట్టమని కోరింది. కానీ ఆ నక్క దాని మాటను వినలేదు. ‘ఓ ఐరావతమా! నేను దొరికిన ఆహారాన్ని వదలిపెట్టేంత మూర్ఖురాలిని కాదు. నీవు ఇక్కడి నుండి వెళ్లు’ అంది. అప్పుడు ఏనుగు ఒక కర్రను తన తొండంతో తీసి ఆ నక్క పైకి విసిరింది. ఆ నక్కకు ఆ కర్ర తాకి అది ‘కుయ్యో! మొర్రో!’ అని అరిచింది. వెంటనే దాని నోరు వదులై ఆ నోటిలోంచి ఊడిపడ్డ చిట్టి చిలుక రివ్వున ఎగురుకుంటూ ఏనుగుకు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. తనపై కర్రను విసరిన ఏనుగును చూడగానే నక్కకు చాలా కోపం వచ్చింది. అది ఏనుగుతో ‘ఓ ఐరావతమా! నాకు ఆహారం లేకుండా చేస్తావా! నీ సంగతి మృగరాజు సింహానికి చెబుతాను’ అని సింహం వద్దకు వెళ్లి ఐరావతం తనపై కర్రతో దాడి చేసిందని ఫిర్యాదు చేసింది.సింహం నవ్వి ‘నీవు చిట్టి చిలుకను పట్టుకొన్నావన్న సంగతి చెప్పడం లేదెందుకు? నాకు ఒక కాకి అంతా చెప్పిందిలే! ఆ చిట్టి చిలుకను నీవు పట్టుకొంటావా! చిన్న పిల్లల్ని పట్టుకోవద్దని, వారికి హాని చేయవద్దని నేను నీకు చెప్పలేదా! నీకు తగినశాస్తి జరిగింది’ అని నక్కను మందలించింది. నక్క చేసేది లేక ఉస్సూరుమనుకొంటూ అక్కడి నుంచి కదిలింది. తర్వాత ఆ సింహం ఐరావతాన్ని పిలిపించి అది చేసిన సాయానికి మెచ్చి, దానిని జంతువుల ముందు ప్రశంసించి ఘనంగా సత్కరించింది. - సంగనభట్ల చిన్న రామకిష్టయ్య హిత వచనం..తనతో ఏ వైరం లేకుండా సుఖంగా ఉన్నవాడికి దుఃఖం కలిగించినవాడు జన్మజన్మాంతరాలలో దుఃఖం పొందుతాడు. ఇందులో సందేహం లేదు. -
సోల్ మిస్టరీ..
చెన్నైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ముత్తుస్వామి హైదరాబాద్ వచ్చాడు. కోట్ల విలువైన వజ్రాలు అతని వద్ద ఉన్నాయి. ఆధునిక స్టార్ హోటల్స్‌లో దిగితే నిఘా ఉంటుందని, ఎవరికీ అనుమానం రాకూడదని అతను హైదరాబాద్ లోని ఒక పాతకాలం నాటి లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు.పెద్ద శబ్దంతో తిరిగే పాతకాలం నాటి ఫ్యాన్... ప్లాస్టిక్ మగ్...రాత్రి పదకొండు నలభై ...ముత్తుస్వామి రూమ్ తలుపులు వేసుకుని, పడుకునే ముందు తన సూట్‌కేస్ తెరిచాడు. అందులోని చేతి సంచీని తీసి, కాసేపు ఆ వజ్రాల మెరుపులను చూసుకుని, మళ్లీ వాటిని జాగ్రత్తగా సంచీలో పెట్టి, పడుకున్నాడు. అయితే, అతను వజ్రాలు చూసుకుంటున్నప్పుడు కిటికీ సందులో నుంచి రెండు కళ్లు తనను నిశితంగా గమనిస్తున్నాయనే విషయాన్ని ముత్తుస్వామి గమనించలేకపోయాడు.తెల్లవారింది. ముత్తుస్వామి రూమ్ తలుపు కాస్త నెట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూసిన రూమ్ బాయ్ గట్టిగా కేక పెట్టాడు. ముత్తుస్వామి మంచంపై రక్తపు మడుగులో శవమై పడి ఉన్నాడు. సూట్‌కేస్ తెరిచి ఉంది, వజ్రాల సంచీ మాయమైంది.∙∙ క్రైమ్ సీన్..సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. హత్యా స్థలాన్ని పరిశీలిస్తుండగా, మంచం కింద ఒక వస్తువు దొరికింది. అది మహిళలు ధరించే ఒక సరికొత్త ‘హైహీల్’ చెప్పు. ఒకే ఒక్క చెప్పు అక్కడ పడి ఉంది.‘సార్, దీన్ని బట్టి చూస్తే రాత్రి ఎవరైనా లేడీ లోపలికి వచ్చి, ముత్తుస్వామిని చంపి వజ్రాలు ఎత్తుకెళ్లినట్టు ఉంది’ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తల అడ్డంగా ఊపి అన్నాడు. ‘ముత్తుస్వామి గొంతును ఒక్క చేత్తో బలంగా నొక్కి, మరో చేత్తో గుండెల్లో పొడిచారు. ఆ పట్టు చూస్తే అది కచ్చితంగా ఒక బలమైన పురుషుడి పనే.’ కేవలం పోలీసుల దారి మళ్లించడానికే ఆ హైహీల్ చెప్పును అక్కడ వదిలేశారని గ్రహించాడు. అంతేకాదు, ఆ చెప్పు సైజు ‘9’. సాధారణంగా మహిళలకు అంత పెద్ద సైజు పాదం ఉండదు.చుట్టుపక్కల చూశాడు. అనుమానించదగ్గ ఆధారాలు కానీ పనికి వచ్చే క్లూస్ కానీ దొరకలేదు. చేతికి గ్లౌస్ ధరించి ఆ హైహీల్ చెప్పును చేతిలోకి తీసుకున్నాడు. లాడ్జికి చుట్టుపక్కల ఉన్న చెప్పుల షాపుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూశాడు.లాడ్జికి కొద్ది దూరంలోనే ఉన్న ఒక పెద్ద చెప్పుల షాపు సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేయగా అసలు నిజం బయటపడింది. ఒక వ్యక్తి ఆ షాపుకు వెళ్లి, తొమ్మిదో నంబర్ లేడీస్ హైహీల్ చెప్పులు కొంటున్న దృశ్యం అందులో స్పష్టంగా కనిపించింది.∙∙ లాడ్జిలో ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ఎదురుగా లాడ్జి సిబ్బంది, లాడ్జిలో బస చేసిన కస్టమర్లు నిలబడి వున్నారు.ప్రద్యుమ్న వెంటనే లాడ్జిలో ఉన్న సిబ్బంది అందరినీ లైన్లో నిలబెట్టి, వారి పాదాలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించాడు. లాడ్జిలో ఆగిన మగవాళ్ళు ‘అదేంటి ఇన్స్పెక్టర్, మమ్మల్ని అనుమానిస్తున్నారా? అయినా మేము హైహీల్ చెప్పులు వేసుకోవడం ఏమిటి?’ అన్నారు.‘ఇది హత్యకేసు. అందరూ సహకరించాల్సిందే.’ కఠినమైన స్వరంతో చెప్పాడు.అందరూ నిలబడ్డారు. తన చేతిలో ఉన్న హత్యాస్థలంలో దొరికిన హైహీల్ చెప్పును కిందపెట్టి, ఒకొక్కరిని వచ్చి చెప్పులో కాలు పెట్టమని చెప్పాడు. రూమ్ బాయ్ మొదలు అందరూ వచ్చి ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న చెప్పినట్టు ఆ హైహీల్ చెప్పులో పాదం పెట్టారు. చివరికి మిగిలిన ఒకే ఒక వ్యక్తి మెల్లిగా వెనక్కి జరిగాడు.ఆ వ్యక్తి మేనేజర్ కిరణ్... ముందుగా గింజుకున్నా ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న మొహంలో కోపం చూసి పాదం పెట్టాడు. కిరణ్ పాదాల సైజు కచ్చితంగా తొమ్మిది (9). అంతేకాదు, కిరణ్ కుడికాలి చర్మం కాస్త చిట్లిపోయి, చిన్న గాయం అయి ఉండటాన్ని ప్రద్యుమ్న గమనించాడు.‘చెప్పు మిస్టర్ కిరణ్! ఇంకో హైహీల్ చెప్పు ఎక్కడ?’ కూల్‌గా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న. ఆ కూల్నెస్లోని సీరియస్‌నెస్ అర్థమైంది కిరణ్‌కు...‘నాకు... నాకేం తెలుసు?’ బింకంగా అన్నాడు.‘నాకేం తెలుసు అన్నావు గానీ, నేను ఈ హత్య చేయలేదు అనలేదు. కొత్త హైహీల్ చెప్పు కాబట్టి కరిచింది. చర్మం చిట్లిపోయి ఉంది. చెప్పుల షాప్‌లో సీసీ ఫుటేజ్‌లో నువ్వు హైహీల్ చెప్పులు కొంటున్న విజువల్ వుంది. మమ్మల్ని డైవర్ట్ చేయడానికి నువ్వాడిన డ్రామా– హైహీల్ చెప్పుతో తప్పుదారి పట్టించాలనుకున్నావు. అదే ఇక్కడ సాక్ష్యాధారంగా మారింది.’ అంటూ ప్రద్యుమ్న కిరణ్‌ను తన స్టైల్లో విచారించడంతో కిరణ్ నిజం ఒప్పుకున్నాడు. అతను దొంగిలించిన వజ్రాలు ఎక్కడా కనిపించలేదు. కిరణ్ రూమ్ అంతా వెతికినా లాభం లేకపోయింది. అప్పుడు ప్రద్యుమ్న చూపు కిరణ్ రూమ్‌లో ఉన్న రెండో హైహీల్ చెప్పుపై పడింది.ప్రద్యుమ్న ఆ రెండో చెప్పును తీసుకుని గట్టిగా లాగి, దాని అడుగు భాగాన్ని (సోల్) విరిచి చూశాడు. అంతే, అందరి కళ్లు బైర్లు కమ్మాయి! కిరణ్ చాలా తెలివిగా ఆ హైహీల్ చెప్పు సోల్ భాగాన్ని కట్ చేసి, అందులో కోట్ల విలువైన వజ్రాలను దాచి మళ్లీ గ్లూతో అంటించాడు. కిరణ్ వేసిన మాస్టర్ ప్లా¯Œ ను ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన చాకచక్యంతో ఛేదించి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు.- శ్రీసుధామయి -
అమ్మా... 'నేను లారీ కింద పడి చనిపోయాను..!'
కొలీన్ హాకిన్ కిచెన్‌లో పనిచేసుకుంటోంది. హాల్లో ఆడుకుంటున్న ఆమె మూడేళ్ల చిన్న కుమారుడు బ్లేక్ హాకిన్ భయంతో గట్టిగా అరిచాడు. బయట రోడ్డుపై స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న తన అన్నయ్యను ఉద్దేశించి ‘రోడ్డుపై నుంచి పక్కకు రా... బస్సు వచ్చేస్తోంది!’ అంటూ కేకలు వేశాడు.కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చిన తల్లి కొలీన్ కు... బ్లేక్ తన ఎడమ చెవిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని, నొప్పితో విలవిలలాడుతూ ఏడవడం కనిపించింది.‘ఏమైంది నాన్నా?’ అంటూ బ్లేక్‌ను గుండెలకు హత్తుకుంది. ఒళ్లు వణుకుతుండగా వాడు చెప్పిన మాటలకు కొలీన్ మైండ్ బ్లాక్ అయింది ‘అమ్మా! నన్ను ఒక పెద్ద లారీ ఢీకొట్టింది. నేను ఆ భారీ చక్రాల కింద పడిపోయాను!’ అని చెప్పాడు. కొలీన్ బయటకు పరుగెత్తి చూసింది.కానీ అక్కడ ఎలాంటి లారీ లేదు. మొదట ఆ చిన్నారి ఏదో కార్టూన్ చూసి ఊహించుకుని చెప్తున్నాడని అనుకుంది. కానీ, బ్లేక్ ఆ ప్రమాదం గురించి చెప్తున్నప్పుడు తన ముఖంలో కనిపించిన భయం ఆమెను ఆలోచనలో పడేసింది. కొలీన్ ఆ చిన్నారి కళ్లల్లోకి చూస్తూ, ‘నువ్వు చనిపోయావా బ్లేక్?’ అని అడిగింది. ఆ బాలుడు ఏమాత్రం తడబడకుండా, ‘అవును’ అని బదులిచ్చాడు!ఆ ఒక్క సంఘటనతో బ్లేక్ జీవితం తలకిందులైంది. ఎప్పుడూ ఇల్లంతా పరుగెడుతూ, నవ్వుతూ ఉండే ఆ చిన్నారి... ఒక్కసారిగా తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయాడు. శూన్యంలోకి చూస్తూ గంటల తరబడి ఒకే చోట కూర్చునేవాడు. ప్రతిరోజూ తన ఎడమ వైపు ఉన్న చెయ్యి, కాలు లేదా కన్ను విపరీతంగా నొప్పి పెడుతున్నాయంటూ ఏడ్చేవాడు. వైద్య పరిభాషలో దీనిని ‘ఫాంటమ్ పెయిన్’ అంటారు. అంటే ప్రస్తుతం ఎలాంటి దెబ్బ తగలకున్నా, గతంలో అనుభవించిన తీవ్రమైన శారీరక నొప్పులు మెదడుకు గుర్తుండిపోయి మళ్లీ బాధించడం!ఆ భయంకరమైన నరకాన్ని మాటల్లో చెప్పలేక, బ్లేక్ తెల్ల కాగితాలపై పెన్నుతో పిచ్చి గీతలు గీస్తూ, తల్లి దగ్గరకు తెచ్చి, ‘అమ్మా... చూడు, ఇవే నా ఒంటిపై ఉన్న గాయాలు’ అని చూపిస్తూ ఏడ్చేవాడు. బ్లేక్ మానసిక స్థితిని చూసి తట్టుకోలేక, కొలీన్ పునర్జన్మలపై పరిశోధనలు చేసే ప్రముఖ థెరపిస్ట్ క్యారల్ బోమన్‌ను సంప్రదించింది.ఇలాంటి పరిస్థితుల్లోనే, ఆ కుటుంబం క్రిస్మస్ కోసం అమెరికా నుంచి లండన్ వెళ్లింది. అక్కడ రద్దీగా ఉన్న ఒక రోడ్డు పక్కన బ్లేక్ చిన్న పిల్లల స్ట్రాలర్లో కూర్చుని ఉన్నాడు. హఠాత్తుగా ఓ లారీ తమ వైపు వేగంగా రావడం చూశాడు. వెంటనే స్ట్రాలర్ లోంచి బయటకు దూకి, నేరుగా దూసుకొస్తున్న ఆ లారీ ముందుకు పరుగెత్తాడు. చుట్టుపక్కల వాళ్లంతా గట్టిగా కేకలు వేశారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న బ్లేక్ తండ్రి క్షణాల వ్యవధిలో బ్లేక్‌ను వెనక్కి లాగాడు. గత జన్మలో లారీ కింద పడి చనిపోయిన ఆ భయంకరమైన సంఘటనను బ్లేక్ ఈ జన్మలో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని తల్లి కొలీన్ భయంతో వణికిపోయింది. ఈ విషయం తెలుసుకున్న క్యారల్ బోమన్... కొలీన్కు ఒక ఉపాయం చెప్పింది.క్యారల్ చెప్పినట్లే ఆ రాత్రి కొలీన్.. బ్లేక్ మంచం దగ్గరకు వెళ్లి, తన తలపై ప్రేమగా నిమురుతూ, ‘కన్నా.. నువ్వు గతంలో లారీ కింద పడి చనిపోయావు కదా, అది నిజమే. కానీ నా బంగారు కొండా... అది నీ గత జన్మ. అప్పుడు నీ శరీరం వేరు, నిన్ను కన్న తల్లి వేరు. ఇప్పుడు నువ్వు నా కడుపున పుట్టావు. ఇది నీ కొత్త జీవితం. ఇక్కడ నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఆ పాత లారీ నిన్ను ఏమీ చేయలేదు...’ అని చెప్పింది.ఆశ్చర్యం! ఆ మాటలు వినగానే ఆ మూడేళ్ల చిన్నారి ముఖంలో తెలియని ఒక ప్రశాంతత కనిపించింది. మరుసటి రోజు ఉదయం నుంచే బ్లేక్ ఆ పాత జ్ఞాపకాలను, ఆ భయాన్ని పూర్తిగా మరచిపోయాడు. తన శరీరంలో ఎడమవైపు వస్తున్న ఆ ‘ఫాంటమ్ పెయిన్స్’ కూడా మాయమయ్యాయి! మళ్లీ ఎప్పటిలాగే నవ్వుతూ, ఆడుకుంటూ సాధారణ స్థితికి వచ్చాడు.సైన్స్ పరంగా పునర్జన్మలను నిరూపించడానికి లేదా పూర్తిగా తోసిపుచ్చడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ బ్లేక్ హాకిన్ అనుభవం, తన మెదడులో దాగున్న కాలం దాటిన జ్ఞాపకాలు మాత్రం ప్రకృతి మానవాళికి వదిలేసిన అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయాయి!- సత్యకిషోర్ -
యుద్ధానికి మగువ మనసులేదు: స్వెత్లాన!
దూరాన వినిపించెనొక తల్లి నోట, చిరుమువ్వ సడి పోలు ఓ జోలపాట అంతమెరుగని భయము, హద్దులెరుగని వగపు ఆ జోలపాటగా అల్లుకున్నాయి; రణభూమి వెలువర్చు ప్రతి ఒక్క గుండు, బలి తీసుకుంటుంది ఒక తల్లి గుండె విజయమెవ్వరినైన వరియించవచ్చు– తల్లి గుండెలు మటుకు తల్లడిలితీరు!కరుణరసార్ద్రమైన ఈ శాంతిమంత్రాన్ని గానంచేసిన కవి పేరు కైసీన్ కులియేఫ్. ఒకప్పటి సోవియెట్ యూనియన్‌లో సుప్రసిద్ధుడైన ఈ కవి 1977లో బల్కార్ భాషలో ప్రచురించిన కవితా సంకలనంలోనిది ఈ గీతం. ఈ కవితా సంకలనానికి అప్పట్లోనే ‘గ్రాస్ అండ్ స్టోన్ (గడ్డి–రాయి)’ పేరిట ఆంగ్లానువాదం కూడా వెలువడింది. ఇది నాలుగుపాదాల చిరుకవిత మాత్రమే కాదు– ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకించిన జాతి, ప్రపంచానికి వినిపించిన మాతృశోకమిది!ఇక, నోబెల్ పురస్కారాల విషయానికి వస్తే– నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళలో జర్నలిస్టులు సప్తర్షుల్లా ఏడుగురంటే ఏడుగురే! వాళ్ళలో నలుగురు– రడ్యార్డ్ కిప్లింగ్ (1907), ఎర్నెస్ట్ హెమింగ్వే (1954), అల్బర్ట్ కామూ (1957), స్వెత్లాన అలెక్సియేవిచ్ (2015) నోబెల్ ‘సాహిత్య’ పురస్కారం గెల్చుకున్నారు. ఇక, కార్ల్ ఫాన్ అసియేట్స్కియ్ (1935), మారీ రేజ– ద్మిత్రీయ్ మురతోఫ్ (2021) నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకోగలిగారు. నోబెల్ బహుమతుల్లో ‘జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా కేటాయించినవి’ అంటూ ఏవీ లేకపోవడంతో, నోబెల్ విజేతల్లో ఎవరికీ ఆ బహుమతులు జర్నలిస్టులుగా రాలేదు. దాని మీద పత్రికల్లో పెద్ద చర్చే జరిగింది కానీ, పెద్ద ఫలితం లేకపోయింది.తాను పుట్టడానికి మూడేళ్ళు ముందే ముగిసిన రెండో ప్రపంచ యుద్ధానిది మానవ నైజానికి– ముఖ్యంగా స్త్రీ ప్రకృతికి– విరుద్ధమైన స్వభావమని స్వెత్లాన తన రచనల్లో తీర్మానించారు. వాస్తవానికి, ప్రపంచ చరిత్రలో జరిగిన ఏ యుద్ధ స్వభావాన్ని పరిశీలించినా, దానికి స్త్రీ నైజం లేదనే అర్థమవుతుందంటారామె. స్త్రీల –అందులోనూ, మాతృమూర్తుల– శోకం చరిత్ర రచనల్లో సక్రమంగా నమోదు కాలేదన్నది స్వెత్లాన నిశ్చితాభిప్రాయం. 1983లో వెలువడిన స్వెత్లాన రచన ‘సమరానికి మగువ మనసు లేదు!’ ఇదే విషయాన్ని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది. రెండో ప్రపంచయుద్ధం గురించిన బెలరూస్ స్త్రీల మనోభావాలను స్వెత్లాన నమోదుచేశారు. ఈ రచనను ‘భావోద్వేగాల చరిత్ర’గా పేర్కొంటూ, దాన్ని ‘సరికొత్త సాహిత్య ప్రక్రియ’గా అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.అయితే పాఠకులుగా మనం ఇక్కడ మనసులో పెట్టుకోవలసిన విషయం ఒకటుంది– ఈ ధోరణి స్వెత్లానతోనే మొదలు కాలేదు! గోర్కియ్, షలహోఫ్, యెసినీన్, పస్తర్నాక్, మయాకఫ్స్కియ్ మొదలుకొని చింగిజ్ ఐత్మతోఫ్ వరకూ ఎందరో ప్రసిద్ధులు యుద్ధాన్ని ఏనాడో వ్యతిరేకించారు. లెనిన్ నాయకత్వంలో సోవియెట్ యూనియన్ జారీ చేసిన మొట్టమొదటి శాసనమే శాంతి శాసనం. ‘కత్తులను నాగేటి కర్రులుగ తీర్చుదాం!’ అన్నది దానికిచ్చిన శీర్షిక. కొందరు పాశ్చాత్య విమర్శకులు చిత్రించినట్లుగా స్వెత్లాన రచనకూ మిహయీల్ గొర్బచ్యేఫ్ ‘గ్లాస్నస్త్’కూ కూడా ఏ సంబంధం లేదు. స్వెత్లాన రచన వెలువడిన రెండేళ్ళకు–1985లో– గానీ మిహయీల్ గొర్బచ్యేఫ్ సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎన్నికకాలేదు! మరో మూడేళ్లకు గానీ గ్లాస్నస్త్ రంగం మీదికి రానేలేదు!!1945లో ముగిసిన రెండో ప్రపంచయుద్ధం నుంచి, 1979లో మొదలై– పదేళ్ళపాటు సాగిన అఫ్గాన్ దురాక్రమణ యుద్ధం వరకూ జరిగిన ఎన్నెన్నో పరిణామాలు మిగిల్చిన విషాద స్మృతులను ఆమె తన రచనల్లో– ముఖ్యంగా, 1992లో ఆంగ్లానువాదంగా వెలువడిన ‘జింకీ బ్రదర్స్’లో– నమోదుచేశారు. అలాగే, ‘వాయిసెస్ ఫ్రం చెర్నోబిల్’(2005) లో కూడా అధికారిక చరిత్రకెక్కని వాస్తవాలను ఆమె నమోదుచేశారు. మరో ఒకటిన్నర దశాబ్దానికి వెలువడిన ‘లాస్ట్ విట్నెసెస్’లో కూడా, రెండో ప్రపంచయుద్ధ కాలంలో బాలలుగా వుండినవారి జ్ఞాపకాలను నమోదు చేశారు. ఇదే కోవకు చెందిన మరో రచన ‘సెకండ్ హ్యాండ్ టైం.’ గడియారం ముళ్ళను ఇంగ్లిషులో హ్యాండ్స్ అంటారు. వర్తమానాన్ని రచయిత్రి – చమత్కారంగా– ‘సెకండ్ హ్యాండ్ టైం’ అన్నారు.ఇవన్నీ వాగ్రూపంలో వున్న చరిత్రను అక్షరబద్ధం చేసే క్రమంలో స్వెత్లాన రచించిన పుస్తకాలు. వీటిని ‘పాలీఫోనిక్’ రచనలుగా పాశ్చాత్య విమర్శకులు పరిగణించారు. సాధారణంగా చరిత్రగ్రంథాల్లో రచయిత దృక్కోణం ఒక్కటే స్ఫుటంగా కనిపిస్తుంది. కానీ వాగ్రూప చరితలకు మూలం వ్యక్తుల జ్ఞాపకాలు. అవన్నీ ఒకే కోణం నుంచి చూసిన దృశ్యాలు కానవసరంలేదు. అంచేత వాటి దృక్కోణం బహుళంగా వుండవచ్చు. స్వెత్లాన రచనల్లో అలా వుంటాయి కూడ! అందుకే అవి అక్షరాలా ‘పాలీఫోనిక్’ రచనలు.స్వెత్లానా అలెక్సియేవిచ్ లాంటి రచయితలు రాసిన పుస్తకాలు, పాఠకుల వ్యక్తిగత పరిమితులూ– విస్తృతులకు తగినట్లుగా అర్థమవుతాయి. ఇప్పుడు చదివితే ఒకలా అనిపించి, తర్వాత చదివినప్పుడు మరోలా అనిపించవచ్చు కూడా. మనుషుల్లో మార్పు సహజం కదా! నన్నడిగితే, 2013లో రాసిన ‘సెకండ్ హ్యాండ్ టైం’ అనే పుస్తకాన్ని స్వెత్లాన ఇప్పుడు తిరిగి రాస్తే, అది అలా వుండదు. లుకాషెంకో పాలనతో సోవియెట్ పాలనను పోల్చుకున్న బెలారూస్ పౌరులు ఇంతకుముందు మాట్లాడినట్లే ఇప్పుడూ మాట్లాడతారనుకోను!- మందలపర్తి కిషోర్ -
మొక్కజొన్న పొత్తు'పొడుపు'
ప్రపంచవ్యాప్తంగా పండే తృణధాన్యాలలో మొక్కజొన్నను రారాజుగా చెప్పుకోవచ్చు. మొక్కజొన్న నిజానికి మన దేశంలో స్థానిక పంట కాదు. పోర్చుగీసువారి ద్వారా ఐదు శతాబ్దాల కిందట మనకు మొక్కజొన్నతో పొత్తు కుదిరింది. వానాకాలంలో చిరుజల్లులు కురుస్తున్నప్పుడు బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తుల్లోని గింజలను ఒలుచుకుంటూ తినడం ఒక చక్కని కాలక్షేపం.ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న గింజలను నేరుగాను, పిండి రూపంలోను రకరకాల వంటకాల్లో వినియోగిస్తారు. మొక్కజొన్నను మద్యం సహా వివిధ ఉత్పత్తుల తయారీ కోసం కూడా వినియోగిస్తారు. పదహారో శతాబ్ది వరకు మొక్కజొన్న అంటే ఏమిటో ఎరుగని మన దేశం– ఇప్పుడు మొక్కజొన్న ఉత్పాదనలోని టాప్–10 దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. మొక్కజొన్న విశేషాలు గణాంకాల్లో తెలుసుకుందాం.మొక్కజొన్నలో పోషకాలు..మొక్కజొన్న అత్యంత శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో ఒకటి. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు పుష్కలంగా పీచుపదార్థం, స్వల్పంగా కొవ్వు పదార్థాలు, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రతి వంద గ్రాముల మొక్కజొన్న 96 కిలోకేలరీల శక్తినిస్తుంది. మొక్కజొన్నలో ఉండే పోషకాలు ఇవీ: -
ఈ వారం కథ: 'తరువుకి కాయ భారమా!'
ఓటమి అనేది ఎవరికైనా బాధాకరం. జీవితంలో ఎంతో సాధించాక, ఎన్నో మెట్లెక్కాక, ‘నువ్వు ఓడిపోయావు’ అని నీ జీవితం నీతో చెబితే అది ఎంత విషాదకరం. రఘురాం పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ఎక్కడో పల్లెటూర్లో పుట్టిన వాడు. కష్టపడి చదువుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఢిల్లీ దాకా ఎదిగిన వాడు. కానీ ఏం లాభం? ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే, సాధించిందంతా శూన్యం అని తెలిసి వచ్చింది. భార్య, పిల్లలు అందరూ అతన్ని ఒక చేతగాని వాడు అని తీర్మానించి వదిలారు. వయసు మళ్ళిన అతను ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే అది నిజమా లేక కేవలం వారి అభిప్రాయం మాత్రమేనా అన్న సంశయం అతన్ని పీడించసాగింది. ఎటూ తేల్చుకోలేక నిరంతరం ఆలోచనల్లోకి జారిపోతున్నాడు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతున్నాడు!∙∙ ‘రఘూ... అన్నం తిను నాన్నా’ అని బతిమాలుతున్న తల్లిని కోపంగా చూశాడు రఘురాం. అన్నపూర్ణకు కూడా కోపం వచ్చింది. ఎంతసేపూ చదువు చదువు అంటూ తిండీ తిప్పలు మానేస్తున్నాడు రఘురాం. ఇలా అయితే పిల్లాడు ఎలా బలంగా ఉంటాడు అని ఆమె బాధ. అసలే పల్లెటూరు, తిండి తినకుండా అనారోగ్యం పాలైతే వైద్య సౌకర్యం లేదు. ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న టౌన్ హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తుంది.చాలాసేపు బతిమాలాక పుస్తకం ముందు నుండి లేచాడు రఘురాం. తల్లి పెట్టిన అన్నం కూర తిని పెరుగు కూడా వేసుకున్నాడు. సంతృప్తిగా చూసింది అన్నపూర్ణ.‘ఏరా...అన్నం తిన్నావా?’ ప్రేమగా అడిగాడు అప్పుడే పొలం నుండి వచ్చిన శంకరయ్య.‘తిన్నాను నాన్నా’ అని చెప్పి మళ్ళీ పుస్తకం అందుకున్నాడు రఘురాం. ముసి ముసిగా నవ్వుకుంది అన్నపూర్ణ.రఘురాం చాలా మంచి విద్యార్థి. రోజూ ఇంటి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌కి వెళుతూ బుద్ధిగా చదువుకుంటాడు. టీచర్లకు కూడా అతనంటే ఎంతో ఇష్టం. చదువు పట్ల అతని శ్రద్ధను చూసి మురిసిపోతారు అన్నపూర్ణ శంకరయ్యలు. ఊరి వాళ్ళు కూడా ‘మంచి కొడుకుని కన్నావమ్మా’ అని చెబుతూ ఉంటారు అన్నపూర్ణతో!కాలచక్రం గిర్రున తిరిగింది. రఘురాం ఇంజినీరింగ్ పూర్తి చేసి కేంపస్ ఇంటర్వ్యూలో క్లియర్ అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో జూనియర్ ఇంజినీర్ పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యాడు. అతని విజయాన్ని చూసి గ్రామస్థులు వేనోళ్ళ పొగిడారు. కొడుక్కి దిష్టి తీసి హైదరాబాద్ పంపించింది అన్నపూర్ణ.జాబ్‌లో జాయిన్ అయి సెటిల్ అయ్యాక తల్లిదండ్రులని రమ్మన్నాడు రఘురాం.ఒక మంచిరోజు చూసుకుని హైదరాబాద్ వచ్చారు వాళ్ళు. కొడుకు ఉంటున్న కంపెనీ క్వార్టర్‌ని, ఆ నాగరిక వాతావరణాన్ని చూసి మురిసిపోయారు. తమలాంటి వాళ్ళ కడుపున పుట్టి ఇక్కడి దాకా ఎదిగిన కొడుకు మీద వారి ప్రేమ రెట్టింపయింది. ఉన్నన్నాళ్ళు వాళ్ళకి హైదరాబాద్‌లో ఉన్న అన్ని టూరిస్ట్ ప్రదేశాలను తిప్పి చూపించాడు రఘు. సంతోషపడిపోయారు వాళ్ళు. కొన్ని రోజుల పాటు కొడుకుని బాగా చూసుకుని తమ ఊరు వెళ్ళడానికి బయలుదేరారు. సికింద్రాబాద్ స్టేషన్ లో వాళ్ళను ట్రైన్ ఎక్కించి బయటకు వస్తూ చిన్న పిల్లాడిలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురాం.చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాడు. ఇంకోవైపు రైల్లో వెళుతున్న అతని తల్లిదండ్రుల పరిస్థితి కూడా అదే. కొడుకును వదిలి ఎప్పుడూ ఉండలేదు వాళ్ళు!∙∙ వృత్తిలో ఎదుగుతున్నాడు రఘురాం. ఒక గ్రేడ్ ప్రమోషన్ పొందాక పెళ్ళి మీద మనసయింది అతనికి.కొలీగ్ రవళి అందుకు కారణం. అందం, తెలివితేటలతో అతని మనసు దోచుకుంది.అమాయకంగా కనపడుతూ కష్టపడే మనస్తత్వం ఉన్న రఘురాం కూడా ఆమె మనసుని కొల్లగొట్టాడు. ఈ విషయం తెలిసి ఎంతో సంబరపడిపోయారు అన్నపూర్ణమ్మ దంపతులు.ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంత పీట వేసి కొడుక్కి పెళ్ళి చేశారు. మనసారా దీవించి దగ్గరుండి దంపతులతో కాపురం పెట్టించారు. శోభనం ముహూర్తం పెట్టి, ఆ అద్భుత క్షణాల్లో రఘుని, రవళిని గదిలోకి పంపించారు. రఘు మనసు ఉద్విగ్నంగా ఉంది. అనుభవించబోయే సుఖాన్ని తలచుకుని అతని మనసు గాల్లో తేలుతోంది. రవళిని ఆశగా దగ్గరకు తీసుకున్నాడు.సున్నితంగా అతన్ని విడిపించుకుని దూరంగా జరిగింది రవళి. నవ్వుకున్నాడు రఘు. తొలి కలయిక పట్ల ఆమెకు భయం ఉంది అనుకున్నాడు.రవళి సిగ్గుపడుతూ ‘ఇంట్లో మీ అమ్మా నాన్న ఉన్నారు కదా... నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది.వాళ్ళు ఊరు వెళ్ళిపోయాక మనం కలుద్దాం. అప్పటిదాకా వద్దు’ అంది.ఆమె చెప్పిన లాజిక్ అర్థం కాలేదు రఘుకి. అయినా ‘సరే ’ అన్నాడు. తర్వాత మంచంపై విడిగా పడుకున్నారు ఇద్దరూ.తర్వాతి రోజు నుంచే కోడలి మనస్తత్వం అర్థం చేసుకున్నారు రఘు తల్లిదండ్రులు. తాము ఉండటం ఆ అమ్మాయికి ఇష్టం లేదు అని తెలుసుకున్నారు. ఆ విషయాన్ని గొడవగా మారిస్తే కొడుకు మనసు బాధపడుతుందని మిన్నకుండిపోయారు.‘ఊళ్లో పనులు ఉన్నాయిరా... వెళ్తాం’ అని కొడుకుతో అన్నారు. వెంటనే, ‘సరే...’ అన్నాడు రఘు.సికింద్రాబాద్‌లో వాళ్ళని రైలు ఎక్కించి బయటకు వచ్చాక ‘హమ్మయ్యా’ అని రిలీఫ్‌గా ఫీలయ్యాడు.ఆ రాత్రి రవళి కౌగిలిలో కరిగిపోతూ స్వర్గాన్ని చూశాడు.కొడుకు సుఖాన్ని కోరుకున్న రఘు తల్లిదండ్రులు ఆ తర్వాత ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. ఏదైనా అవసరం ఉంటే రఘు మాత్రమే ఊరు వెళ్ళి వస్తూ ఉండేవాడు.తొలిసారిగా కొడుకు పుట్టాడు రఘు దంపతులకి. వాళ్ళ ఆనందం అంబరాన్ని అంటింది.నామకరణం రోజున రమ్మని తల్లిదండ్రులకు కబురు చెప్పాడు రఘు.ఆ రోజుకి హైదరాబాద్‌లో దిగారు వాళ్ళు. ప్రేమగా ఆహ్వానించాడు రఘు. రవళి మాత్రం వాళ్ళతో మాట్లాడలేదు. మనవడ్ని చూసి మురిసిపోయారు అన్నపూర్ణమ్మ దంపతులు.ఆ పసివాడికి తమ కులదైవం పేరు పెట్టాలని అడిగారు రఘుని. అది విన్న రవళి ‘నా కొడుక్కి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టొద్దు. నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళిపోండి’ అని కఠినంగా చెప్పింది. దెబ్బ తిన్న పక్షుల్లా చూశారు వాళ్ళు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వాళ్ళకి. రఘు అయితే నోట మాటరాక అలా నిలబడిపోయాడు.అసలు కోడలికి తమ మీద ఎందుకంత ద్వేషమో అర్థం కాలేదు వాళ్ళకి. నామకరణ కార్యక్రమం అయిన మర్నాడే తమ ఊరు వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ, ‘మమ్మల్ని ఇంకెప్పుడూ పిలవకురా’ అని రఘురాంతో చెప్పారు. అభావంగా చూశాడు రఘు.∙∙ శంకరయ్య దిగులుతో మంచం పట్టేశాడు. కొడుకు దగ్గర ఉంటూ శేష జీవితాన్ని హాయిగా గడపాలనుకున్న అతని కల నెరవేరక మనోవ్యాధిగా మారింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు.ఇక బ్రతకడం కష్టం అని డాక్టర్స్ చెప్పాక రఘుకి కబురు పెట్టింది అన్నపూర్ణమ్మ. బిజీ (?)గా ఉండటం వల్ల వెంటనే ఊరికి వెళ్ళలేకపోయాడు రఘు. చివరి చూపులు కూడా దక్కకుండా కన్ను మూశాడు శంకరయ్య. ఆ విషయం రఘుకి చేరవేశారు ఊరి వాళ్ళు. తండ్రి మరణ వార్త విని మనసులో విపరీతంగా దుఃఖించాడు రఘు.‘నాన్నగారు ఇక మనకి లేరు’ అని రవళితో ఏడుస్తూ చెప్పాడు.పెద్దగా బాధ పడలేదు ఆమె. మామగారితో అంత అనుబంధం లేదు కదా ఆమెకు.‘సరే... వెళ్ళి జరగాల్సిన కార్యక్రమాలు చూసుకుని తిరిగి వచ్చెయ్’ అని చెప్పింది. వెంటనే బయలుదేరి ఊరికి వెళ్ళాడు రఘురాం.ఊరి వాళ్ళంతా ‘ఇప్పుడా రావడం’ అన్నట్టు అతన్ని ఒక దోషిలా చూడసాగారు. మనసులో బాధ పడుతూనే తండ్రికి అంత్యక్రియలు జరిపించాడు. తల్లికి జాగ్రత్తలు చెప్పి హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు.అన్నపూర్ణమ్మ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇన్నాళ్ళూ తోడు ఉన్న భర్త చనిపోవడంతో ఒంటరితనం చుట్టుముట్టింది ఆమెను. కొడుకు దగ్గరకి వెళ్ళి ఉండమని గ్రామస్తులు సలహా ఇచ్చారు.ఒక రోజు రఘుకి ఫోన్ చేసి ‘బాబూ... నీ దగ్గరకు వస్తానురా... ఇక్కడ నాకు భయంగా ఉంది’ అని అడిగింది. గొంతులో ఏదో అడ్డు పడినట్టు ఏమీ చెప్పలేకపోయాడు రఘు.‘మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా’ అని కాల్ కట్ చేశాడు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ‘అమ్మ ఫోన్ చేసింది. ఇక్కడకు వస్తాను అంటోంది’ అని రవళితో చెప్పాడు.‘అనుకున్నాను... ఇలాంటి రోజు వస్తుందని. నాకు అయితే ఆవిడ రావడం ఇష్టం లేదు. నీకు నచ్చితే పిలిపించుకో’ అని తేల్చేసింది రవళి. తల పట్టుకున్నాడు రఘురాం.బాగా ఆలోచించాక, తల్లిని అలా వదిలేస్తే లోకం నిందిస్తుందని భయపడి ఏదైతే అది అయిందని తల్లిని తన దగ్గరకు రమ్మని ఫోన్ చేశాడు. ఒక రోజు పొద్దున్నే హైదరాబాద్‌కి చేరుకుంది అన్నపూర్ణమ్మ. తల్లిని రైల్వే స్టేషన్ నుండి పికప్ చేసుకుని తీసుకొస్తూ, దారిలో బోలెడన్ని జాగ్రత్తలు చెప్పాడు రఘు. రవళితో ఎక్కువగా మాట్లాడొద్దని, తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాడు. అన్నిటికీ తలూపింది అన్నపూర్ణమ్మ.ఇంట్లోకి వచ్చిన అత్తను చూసి తల తిప్పుకుంది రవళి. ఈ చర్యతో చెప్పలేని బాధకు గురయింది అన్నపూర్ణమ్మ. భర్త చనిపోయి ఇక్కడికి వస్తే కనీసం పలకరించే దిక్కు లేదు అని మథనపడింది. రఘురాం ఇది గమనించినా, తెలియనట్టు తప్పుకున్నాడు.అత్తాకోడళ్ళు ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు ఇంట్లో. రఘు వాళ్ళిద్దరి మధ్యన నలిగిపోతున్నాడు. మనవడు ఆదిత్య మాత్రం, నాన్నమ్మతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. అది కొంత ఉపశమనం కలిగించేది అన్నపూర్ణమ్మకు.రఘురాంకి ఆఫీసులో ఇది ప్రమోషన్ రావాల్సిన టైము. కష్టపడి పని చేసి బాస్‌ని ఇంప్రెస్ చేస్తున్నాడు. రోజూ ఆఫీసు నుండి లేట్‌గా వస్తున్నాడు. రవళి కూడా వర్క్‌లో బిజీగానే ఉంటోంది.ఆదిత్య తన స్కూల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చెయ్యడం, స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూడటంతో ఎవరినీ పట్టించుకునే స్థితిలో ఉండడు. వీటన్నిటి వల్ల అన్నపూర్ణమ్మ ఒంటరిగా ఫీల్ అవసాగింది. కొడుకు దగ్గర ఉంటే మనసు కుదుట పడుతుందని వస్తే అది మరింత మానసిక ఒంటరితనం కలిగించడం ఆమెకు నచ్చడం లేదు. అలాగని ఊరు తిరిగి వెళితే అది మరింత పరువు పోయే చర్య అవుతుంది.కొడుకు ఉంచుకోలేక పంపించేశాడు అని నవ్వుతారు ఊళ్ళో వాళ్ళు. అందుకే మనసు చంపుకుని కాలం వెళ్ళదీయసాగింది.ఒక రోజు ఆఫీసు నుండి వస్తూనే అసహనంగా అరవసాగాడు రఘురాం.‘ఏమైంది... ఇలా డిస్టర్బ్డ్గా ఉన్నావు?’ అని అడిగింది రవళి.‘ఎలా ఉంటాను... నా పేరు ప్రమోషన్ లిస్ట్‌లో లేదు’ అని ఏడుపు మొహం పెట్టాడు రఘు.‘అందుకే నేను ఎప్పటి నుండో చెబుతున్నాను. ఆ దరిద్రాన్ని ఇంట్లో నుండి పంపెయ్యమని. మీరు వినడం లేదు. తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇక ప్రమోషన్ ఎలా వస్తుంది’ అని అగ్నికి ఆజ్యం పోసింది.‘అవును... నిజమే’ అని కోపంగా రగిలిపోతూ తల్లి దగ్గరకు వచ్చి, ‘అమ్మా... నువ్వు ఊరెళ్ళిపో’ అని గట్టిగా అరిచాడు.హతాశురాలైంది అన్నపూర్ణమ్మ. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తనకు సంబంధం లేని ఈ గొడవకు తాను కారణం ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోయింది.కొడుకుని కష్టపడి పెంచి పెద్దచేసి ఒక స్థాయికి తీసుకువస్తే ఇవాళ అతని కంటికి తానొక దరిద్రంలా కనబడటం జీర్ణించుకోలేకపోయింది. ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోయింది. ఇక కొడుకు దగ్గర ఉండటం అర్థరహితం అని నిర్ణయించుకుని మర్నాడే ఊరు బయలుదేరింది.సికింద్రాబాద్ స్టేషన్లో ఆమెను రైలు ఎక్కించి బయటకు వచ్చాక ‘హమ్మయ్యా... దరిద్రం వదిలింది’ అని రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు రఘురాం.∙∙ ‘తల్లి’ అనే దరిద్రం వదిలాక వృత్తిలో ఎదగసాగాడు రఘురాం. ప్రమోషన్ కూడా వచ్చింది.అయితే ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చారు. వెళ్ళక తప్పని పరిస్థితి. రవళిని, కొడుకు ఆదిత్యని వదల్లేక వదల్లేక వదిలి ఢిల్లీ వెళ్ళి ఆఫీసులో జాయిన్ అయ్యాడు. అక్కడే క్వార్టర్స్‌లో మకాం పెట్టాడు. వంటకు అదీ ఇబ్బంది లేదు. వేళకు తిండి తినడం, ఆఫీసుకు వెళ్ళి పని చేయడం ఇదే అతని దినచర్య. ఇక్కడ హైదరాబాద్‌లో రవళి , తన కొడుకు ఆదిత్యను బాగా చదివిస్తూ బిజీగా అయిపోయింది.కొన్నాళ్ళ తర్వాత పై చదువులకు విదేశాలు వెళ్ళిపోయాడు ఆదిత్య. అటు భర్తకు దూరంగా ఉండటం, ఇటు కొడుకు ఎబ్రాడ్ వెళ్ళడంతో ఒంటరితనం ఆవరించింది రవళికి. ఆమె మనసు స్వేచ్ఛను, ఆనందాన్ని కోరుకోసాగింది.ఒకరోజు రఘురాం రవళితో ఫోన్ లో అన్నాడు. ‘నువ్వు జాబ్ మానేసి ఢిల్లీ వచ్చెయ్. హాయిగా కలిసి ఉందాం’ అని. ఒళ్ళు మండింది రవళికి.‘నేను జాబ్ ఎందుకు మానాలి? నువ్వే మానేసెయ్. నేను కూడా కెరీర్లో ఎదగాలి కదా?’ అని మండిపడింది. ఇక నోరు తెరవలేకపోయాడు రఘురాం.ఒకసారి ఎందుకో భార్యను చూడాలి అనిపించి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చాడు. కానీ తీరా ఇంటికి వచ్చేటప్పటికి రవళి లేదు. సెల్‌కి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఇక చేసేదేమీ లేక వెయిట్ చెయ్యసాగాడు. ఎప్పుడో రాత్రికి వచ్చింది రవళి. రఘురాంని చూసి షాక్ అయింది.‘ఏంటి చెప్పకుండా దొంగలా వచ్చావు? నా మీద అనుమానమా?’ అని వెటకారంగా అంది.నిజానికి ఆమె తన వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్‌తో ఊరి చివర రిసార్ట్‌కి ఔటింగ్‌కి వెళ్ళింది. బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి వచ్చింది.‘అలా ఎందుకు అనుకుంటావు. రావాలి అనిపించింది వచ్చాను. ఇందులో తప్పేం ఉంది?’ నెమ్మదిగా అన్నాడు రఘురాం.‘తప్పేం లేదు. నిన్ను నమ్మడం నాదే తప్పు’ అని విసుక్కుంది. ఆ రాత్రి ఆమెను దగ్గరకు తీసుకోవాలి అనుకున్నాడు కానీ రవళి అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. భౌతికంగా దూరమైన వారి మధ్య ఇప్పుడు మానసిక దూరం కూడా పెరిగిపోయింది. తెల్లారి లేచి ఢిల్లీ వెళ్ళిపోయాడు రఘురాం.ఎందుకో తెలీదు కానీ క్రమంగా అనారోగ్యం పాలయ్యాడు రఘురాం. బీపీ, షుగర్ అతన్ని ముట్టడించాయి. రోజు రోజుకీ బాగా నీరసించిపోతున్నాడు.ఇక తప్పక ఒక రోజు భార్యకు ఫోన్ చేసి, ‘నాకు దగ్గరగా ఉండు... సమయానికి చేసే వాళ్ళు లేక ఇబ్బందిగా ఉంది.. ఇక్కడికి వచ్చెయ్’ అని బతిమాలాడు.గట్టిగా నవ్వింది రవళి. ‘ఏం మాట్లాడుతున్నావు? నేను అన్నీ మానుకుని వచ్చి నీకు సేవలు చెయ్యాలా? ఏ కాలంలో ఉన్నావు? నాకు నా లైఫ్ ముఖ్యం. నీ బాగోగులు చూసుకుంటూ నా లైఫ్ వృథా చేసుకోలేను... బై’ అని ఫోన్ పెట్టేసింది. కొడుకు ఆదిత్యకు కాల్ చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు వాడు. గుండె ముక్కలు అయింది రఘురాంకి. తన శక్తియుక్తులన్నీ కుటుంబం కోసమే ధారపోశాడు. తన బంధువులందరినీ వదులుకుని, భార్య, కొడుకు చుట్టూనే తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. కానీ తను కొంచెం బలహీనం అయ్యేసరికి ఎవరికీ అక్కరలేకుండా పోయాడు. ఇదేనా కుటుంబ బంధాలకు ఉన్న విలువ? ఇందుకోసమేనా తన జీవితాన్ని పణంగా పెట్టింది అన్న ప్రశ్నలు అతన్ని వేధించ సాగాయి. మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశాడు. మూటా ముల్లె సర్దుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌కి వచ్చి టికెట్ కొనుక్కుని ఫ్లయిట్లో కూర్చున్నాడు. ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది.∙∙ ఉరుము లేని పిడుగులా ఊడిపడ్డ కొడుకుని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయింది అన్నపూర్ణమ్మ.‘రా నాయనా... రా...’ అని ప్రేమగా ఆహ్వానించింది. తల్లిని చూసి పసివాడిలా కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురాం. చిన్నప్పుడు తల్లి తనని వదిలి ఏదైనా ఊరు వెళితే ఆమె వచ్చేదాకా ఎదురు చూసి రాగానే, ‘అమ్మా ...’ అంటూ కౌగలించుకునేవాడు. ఎంత నిశ్చింతగా ఉండేదో అప్పుడు.ఇప్పుడు కూడా అలాగే నిశ్చింతగా, సెక్యూర్డ్‌గా ఫీల్ అయ్యాడు. తనకు ఇంక ఏ భయమూ లేదని ఆనంద పడ్డాడు.‘అమ్మా... ఇక నిన్ను విడిచి నేను ఎక్కడికీ వెళ్ళనమ్మా...’ అని చిన్న పిల్లాడిలా చెప్పాడు. నిండుగా నవ్వింది అన్నపూర్ణమ్మ.‘అలాగే నాయనా... ఎక్కడికీ వెళ్ళొద్దు... నాతో పాటే నువ్వూ ... నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను’ అని దగ్గరకు తీసుకుంది. తల్లి ఒడిలో పసివాడిలా ఒదిగిపోయాడు పెద్ద రిటైర్డ్ ఆఫీసర్ రఘురాం... భార్యా కొడుకులకు భారం అయిపోయిన రఘురాం!!- డా. సన్నిహిత్ -
'ఆవిరి..' - ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి..
ప్రాచీన్ కారు కొన్నప్పటి నుంచి గమ్యం దృష్టిలో ఉంచుకొని అటు వైపు డ్రైవ్ చేస్తూంటాడు. ఆ మధ్యాహ్నం మాత్రం అతను కారుని గమ్యం లేకుండా డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారెక్కి అరగంట దాటుతోంది. ట్రాఫిక్ పల్చగా ఉంది. ఎండ వల్ల హైద్రాబాద్ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని ప్రాచీన్ గుర్తించాడు. ఎన్నడూ లేనంతగా మండుటెండలు కాస్తున్న ఆ వేసవిలో ఆ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని బయలుదేరేముందు టీవీలో చదివిన స్క్రోల్ గుర్తొచ్చింది. కారులో ఏసీ ఆన్ లో ఉన్నా, అది సౌకర్యంగా చల్లబరచలేకపోతోంది.ప్రాచీన్ వయసు ముప్ఫై మూడు. అతనికి పెళ్ళై రెండేళ్ళైంది. అతని ఆ ప్రయాణానికి కారణం, అతని భార్య. పెళ్ళయ్యాక మొదటిసారి వారి మధ్య తీవ్రమైన పోట్లాట జరిగింది. అతనికి ఆ తర్వాత ఇంట్లో ఉండటం ఇష్టంలేక బయటికి వచ్చి, రోడ్ మీద పార్క్ చేసిన కారెక్కి డ్రైవ్‌కి బయలుదేరాడు.తన తప్పు ఉందా అని అతను జరిగినది ఓసారి నెమరువేసుకున్నాడు.వేసవి సెలవులకి అతని అక్కయ్య, ముగ్గురు పిల్లలు హైద్రాబాద్‌లోని అతని ఇంటికి వచ్చారు. అందరితో కలిసి ఉండాలని ప్రాచీన్ తల్లిదండ్రులు కూడా పల్లెటూరి నుంచి అతని ఇంటికి వచ్చారు. జనగామ దగ్గర ఉన్న వారి చిన్న ఊరు ఇప్పుడు పల్లెటూరు కాదు. జనాభా పెరిగినా దాన్ని వాళ్ళు పల్లెటూరు అనే పిలుస్తారు.ఇంట్లో పెంపుడు కుక్కతో కలిపి తొమ్మిదిమందిని చూసుకునే బాధ్యత ప్రాచీన్ భార్య మీద పడింది. వాళ్ళు వచ్చి రెండు వారాలు దాటుతోంది. ప్రాచీన్ భార్య అందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజనం వండుతోంది.ప్రాచీన్ అక్కకి కంటికి ఆపరేషన్ అవడంతో కొంతకాలం పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదన్న కంటి డాక్టర్ సలహా వల్ల ఆవిడ అసలు వంటగదిలోకి వెళ్ళదు. ప్రాచీన్ తల్లికి అనారోగ్యం. ఆవిడ కూర్చున్న చోటు నుంచి కదలదు. మనవళ్ళతో కాలక్షేపం చేస్తుంది. ప్రాచీన్ భార్యకి వంటతో పాటు అందరి విడిచిన బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి ఉతకటం, ఆరేయడం, ఆరాక మడతలు పెట్టడం అదనపు బాధ్యత.తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన పనిమనిషి అదే సమయంలో సొంత ఊరికి వెళ్ళింది. సంతకం చేస్తే కాని ప్రభుత్వ ఉచితాలు రావు కాబట్టి తరచూ ఆమె తన ఊరు వెళ్ళి సంతకం చేసి వస్తూంటుంది. వెళ్ళినప్పుడల్లా రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తుంది. కాని ఈసారి హైద్రాబాద్ ఎండలకి జడిసో, లేదా అంతమంది చుట్టాల వల్ల పని పెరగటం వల్లో వారమైనా తిరిగి రాలేదు. దాంతో ఇల్లు, పాత్రలు శుభ్రంచేసే పని కూడా ప్రాచీన్ భార్య చేయాల్సి వస్తోంది. పైగా కుక్కని వాకింగ్‌కి తీసుకెళ్లాలి. ప్రాచీన్ దంపతుల మధ్య ఆరోజు పోట్లాట చినుకుల్లా మొదలై తుఫానులా పరిణమించింది. అతిథులంతా సాలార్జంగ్ మ్యూజియం చూడటానికి వెళ్ళారు.కూరలు కొని తెచ్చి అతను తన భార్యతో చెప్పాడు.‘‘మా అక్కయ్యకి పాఠోళీ ఇష్టం. బీన్స్ తెచ్చాను. అది చెయ్యి.’’‘‘బంగాళదుంపల కూర చేస్తాను.’’ అతని భార్య చిరాగ్గా చెప్పింది.‘‘నేను చెప్పింది చేయొచ్చుగా?’’ భార్య చిరాకుని గమనించని ప్రాచీన్ చెప్పాడు.‘‘బీన్స్‌ని వలవాలి. కిలో బీన్స్ వలవటానికి చాలా టైం పడుతుంది. బంగాళదుంపల కూర తేలిగ్గా వండొచ్చు.’’ప్రాచీన్ కి ఆడవారి కష్టం, ముఖ్యంగా ఇంటికి అతిథులు వచ్చాక భార్య పడే కష్టం తెలీదు. దాంతో అడిగాడు.‘‘వాళ్ళు ఇంకో రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నారు. నేను అడిగిన ఈ ఒక్కటి చేయొచ్చుగా?’’వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. తనవాళ్ళు రావడం తన భార్యకి ఇష్టం లేదని ప్రాచీన్ కి అనిపించింది.‘‘అదేం కాదు. నేను అంతమందికి చాకిరీ చేసి డస్సిపోయాను.’’ ప్రాచీన్ భార్య చెప్పింది.మాటా మాటా పెరిగింది. ప్రాచీన్ బయటకి వచ్చి కారెక్కి డ్రైవ్‌కి బయలుదేరాడు.గరగర చప్పుడుకి ఆలోచనల్లోంచి బయటపడ్డాడు. కారు ఆగిపోయింది. అతను మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కాని అది స్టార్ట్ కాలేదు. కొంత మెకానిజం తెలుసు కాబట్టి అతను కారు దిగి వెళ్ళి బానెట్ తలుపు ఎత్తి చూశాడు. వెచ్చగా తెల్లటి ఆవిరి బయటికి వచ్చింది. ఇంజిన్ వేడెక్కిందని గ్రహించాడు.కూలెంట్ ఉన్నా, బయటి అసాధారణ వేడికి, పైగా ఏసీ కూడా ఫుల్ కెపాసిటీలో ఆన్ లో ఉండడంతో ఇంజిన్ వేడెక్కిందని అర్థమయ్యాక అతను ఇంజిన్ వంక కొద్దిసేపు చూశాడు. అతనిలో కొత్త అవగాహన కలిగింది.ఎన్నడూ తనతో పోట్లాడని తన భార్య అంతగా ఎందుకు పోట్లాడిందో అతనికి ఇంజన్ నుంచి వెలువడే ఆవిరిని చూస్తూంటే అర్థమైంది.గత రెండు వారాలుగా శక్తికి మించి చేస్తున్న పనివల్ల కలిగిన అలసటతో ఆమె నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి తప్ప, తనవాళ్ళు రావటం ఇష్టంలేక కాదని అతనికి స్ఫురించింది. అతనిలో ఏదో ఆవిరై పోయిన భావన కలిగింది.అతను జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి తన భార్యకి ఫోన్ చేసి చెప్పసాగాడు.‘‘సారీ... నిన్ను అపార్థం చేసుకున్నందుకు వెరీ సారీ... వస్తున్నాను.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
చిన్నదని వదిలేస్తే... పెద్ద సమస్య కావచ్చు!
మా ఐదేళ్ల బాబు రాత్రంతా నోరు తెరిచే నిద్రపోతాడు. గురక కూడా బాగా పెడుతున్నాడు. చిన్నపిల్లలకు ఇది సహజమే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆందోళనగా ఉంది. – కీర్తి, నంద్యాలపిల్లల్లో తరచు గురక పెట్టడం, నోరు తెరిచి నిద్రపోవడం సాధారణం కాదు. ఇవి శ్వాస మార్గంలో ఉన్న సమస్యకు సంకేతాలు కావచ్చు.ఈ సమస్య ఎందుకు వస్తుంది?సాధారణంగా మనం ముక్కు ద్వారానే శ్వాస తీసుకుంటాం. ముక్కు గాలిని శుభ్రపరచి, తేమను కలిపి, సరైన ఉష్ణోగ్రతకు మార్చి ఊపిరితిత్తులకు పంపుతుంది. కానీ ముక్కు మూసుకుపోయినప్పుడు పిల్లలు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి.1. అలర్జీ: దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, డస్ట్‌మైట్స్ లేదా పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల ముక్కులో వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.2. అడినాయిడ్స్ పెరగడం: ముక్కు వెనుక భాగంలో ఉండే అడినాయిడ్స్ అనే కణజాలం చిన్నపిల్లల్లో ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే తరచు ఇన్ ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా ఇవి పెద్దవై గాలి వెళ్లే మార్గాన్ని ఇరుకుగా చేస్తాయి. దీంతో పిల్లలు నోటి ద్వారానే శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారినప్పుడు గాలి ప్రవాహం వల్ల కంపనం ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల గురక అనేది కేవలం శబ్దం మాత్రమే కాదు, శ్వాసకు ఆటంకం ఏర్పడుతోందని శరీరం ఇస్తున్న హెచ్చరిక.నిర్లక్ష్యం చేయకండి...కొంతమంది పిల్లల్లో గురకతో పాటు నిద్రలో కొద్ది క్షణాలు శ్వాస కూడా ఆగిపోవచ్చు. దీనివల్ల మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందక, దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదయం అలసటగా లేవడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం, చిరాకు, అతి చురుకుదనం, ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకునే పిల్లల్లో దవడ, పళ్ల అమరిక, ముఖ ఆకృతిలో కూడా మార్పులు రావచ్చు.ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?మీ బిడ్డ గురకను లేదా నోరు తెరిచి నిద్రపోవడాన్ని కేవలం ఒక అలవాటుగా భావించకండి. ప్రతిరోజూ నోరు తెరిచి నిద్రపోవడం, వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగినట్లు కనిపించడం, పగటిపూట ఎక్కువ నిద్రమత్తుగా ఉండడం, తరచూ చెవి ఇన్ ఫెక్షన్లు రావడం, ముక్కు ఎప్పుడూ మూసుకుపోవడం లేదా ఎప్పుడూ నోటి ద్వారానే శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని సంప్రదించాలి. శస్త్రచికిత్స అవసరమా?అసలు అవసరం లేదు. ఇది చాలా పెద్ద అపోహ. చాలామంది పిల్లల్లో అలర్జీని నియంత్రించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి సెలైన్ నాసల్ డ్రాప్స్, నాసల్ స్ప్రేలు, అలర్జీ మందులు సూచిస్తారు. అలాగే దుమ్ము, పొగ, సిగరెట్ పొగ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. అయితే నిద్రలో శ్వాస ఆగిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో పదేపదే ద్రవం చేరడం లేదా మందులతో ప్రయోజనం లేకపోతే అడినాయిడ్స్‌ను తొలగించే శస్త్రచికిత్స అవసరం కావచ్చు.తల్లిదండ్రులకు సూచనలుగురకను చిన్న విషయంగా తీసుకోవద్దు.నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ఒక అలవాటు కాదు, అది ఒక లక్షణం.తరచూ జలుబు లేదా ముక్కు మూసుకుపోవడం ఉంటే అలర్జీ ఉందేమో పరీక్ష చేయించండి.పిల్లలకు ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని కల్పించండి. నిద్రకు ముందు మొబైల్, ట్యాబ్ లేదా ఇతర స్క్రీన్ ల వినియోగాన్ని తగ్గించండి.సమస్య కొనసాగితే పిల్లల వైద్యుడు లేదా ముక్కు–చెవి–గొంతు నిపుణుడిని ఆలస్యం చేయకుండా సంప్రదించండి.పిల్లల నవ్వు, చదువు, ఎదుగుదల ఎంత ముఖ్యమో; వారి నిద్ర కూడా అంతే ముఖ్యం.గురక అనేది నిద్రలో వచ్చే శబ్దం మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం గురించి శరీరం పంపించే ఒక ముఖ్యమైన హెచ్చరిక.సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే పిల్లల నిద్ర, ఎదుగుదల, ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యం మెరుగుపడతాయి. మంచి నిద్రే ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మొదటి మెట్టు.- డా. కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
గోవర్ధన తీర్థం: ఒకానొకప్పుడు జాబాలి అనే..
ఒకానొకప్పుడు జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు ఉండేవాడు. వ్యవసాయంలో పొలం దున్నడానికి నాగలికి జోడెద్దులను కట్టేవాడు. అతడు ఎడ్లను సరిగా చూసుకునేవాడు కాదు సరికదా, నీరసించిన ఆ ఎడ్లు వడి వడిగా పొలం దున్నలేకపోతే, చీటికి మాటికి వాటిని మునికోలతో కొడుతూ, పొడుస్తూ హింసించేవాడు. పాపం! నోరులేని ఆ మూగజీవాలు అతడు పెట్టే బాధలకు భరిస్తూ, లోలోన దుఃఖిస్తూనే పనిచేస్తుండేవి.ఒకనాడు గోమాత అయిన కామధేనువు ఆ ఎద్దుల బాధను చూసింది. వాటి బాధలకు కలత చెందింది. ఆమె నందీశ్వరుడి వద్దకు వెళ్లి, ఆ ఎద్దులు పడే బాధలు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కామధేనువు ద్వారా అంతా విన్న నందీశ్వరుడు ఆ వృషభాలపై జాలి చెందాడు. తన ప్రభువైన పరమశివుని వద్దకు వెళ్లి, జాబాలి వద్దనున్న ఎద్దులు పడే బాధలు చెప్పాడు. ‘నందీ! నువ్వేమీ దిగులు చెందకు. ఈ విషయంలో నువ్వు తలచినది జరిగేలా వరమిస్తున్నాను. నీకు ఇష్టమైన రీతిలో నీ కోరిక నెరవేర్చుకో’ అన్నాడు పరమశివుడు.నందీశ్వరుడు వెంటనే ముల్లోకాలలో ఉన్న గోజాతిని సమావేశపరచాడు. ‘మీరెవ్వరూ ఇక్కడి నుంచి మరెక్కడికీ పోవద్దు. మీరు ఎవ్వరికీ కనిపించవద్దు’ అని ఆదేశించాడు.రోజులు గడుస్తున్నా, గోజాతి కనిపించకపోవడంతో ముల్లోకాలలోనూ గగ్గోలు మొదలైంది. దేవతలందరూ పరుగు పరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, మొరపెట్టుకున్నారు.‘బ్రహ్మదేవా! ఏమైందో ఏమో గోజాతి అంతా ఒక్కసారిగా మాయమైంది. ముల్లోకాలలోనూ ఒక గోవూ కనిపించడం లేదు. గోవులు లేకుండా ముల్లోకాలలో జనులు జీవించడమెలా?’ అని వాపోయారు.‘దేవతలారా! ఇందులో నేను చేయగలిగినదేమీ లేదు. మీరంతా పశుపతి అయిన పరమశివుని వద్దకు వెళ్లి ప్రార్థించండి. అతడే తరుణోపాయం చెప్పగలడు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.దేవతలంతా కైలాసానికి చేరుకున్నారు. పరమశివుని స్తుతించి, ముల్లోకాలలోనూ గోగణాలు కనిపించకుండా పోయిన సంగతిని విన్నవించుకున్నారు.‘గోగణాల సంగతి నాకేం తెలుసు? నా వాహనం నందీశ్వరుడిని అడగండి’ అని చిద్విలాసంగా చెప్పాడు పరమశివుడు.దేవతలు నందీశ్వరుడి వద్దకు వెళ్లారు.‘నందీశ్వరా! పరోపకారీ! దయచూపి, మాకు గోప్రదానం చేసి, లోకాలను రక్షించు’ అని వేడుకున్నారు.‘దేవతలారా! గోసంతతికి చెందిన వృషభాలను జాబాలి అనే బ్రాహ్మణ కర్షకుడు బాధలు పెడుతున్నాడు. అందుకు ప్రతిగానే నేను గోగణాలను నా ఆశ్రయంలో ఉంచాను. మీరందరూ గోమతీ తీరానికి వెళ్లి, అక్కడ గోసవన యాగం చేయండి. గోహింసను పాపంగా ప్రకటించండి. అక్కడకు ముల్లోకాలకు చెందిన గోవులన్నీ వచ్చి, మిమ్మల్ని సంతుష్టులను చేస్తాయి’ అని పలికాడు.నందీశ్వరుడు చెప్పినట్లే దేవతలు గోమతీ తీరంలో గోసవన యాగం ప్రారంభించారు. యాగం మొదలైన కొద్దిసేపటిలోనే ముల్లోకాల గోగణాలన్నీ లెక్కకు మిక్కిలిగా అక్కడకు చేరుకున్నాయి. నేల ఈనినట్లు గోమతీ తీరమంతా ఎటు చూసినా గోగణాలతో కళకళలాడింది. దేవతలు, మానవులు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. గోవులు తిరిగి కనిపించడంతో వారంతా పరమానందం చెందారు.దేవతలు చేపట్టిన గోసవన యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. నాటి నుంచి ముల్లోకాలలోను గోవులకు పూజ్యత హెచ్చింది. దేవతలు గోసవన యాగం చేపట్టిన ప్రదేశం గోవర్ధన తీర్థంగా ప్రసిద్ధి పొందింది.పురావిశేషం..ఈశాన్య రాష్ట్రాల్లోని అరుదైన పురాతన దేవాలయాల్లో మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని మహాబలి ఆలయం ఒకటి. దీనిని క్రీస్తుశకం 1725లో నాటి రాజు గరీబ్ నివాజ్ నిర్మించాడు. అతడిని స్థానికంగా ‘మహారాజా పామ్హీబా’ అని పిలుస్తారు. అప్పట్లో మణిపూర్‌లోని సన్యాసి శాంతిదాస్ గోసాయి బోధనలకు ఆకర్షితుడైన గరీబ్ నివాజ్, ఆయన వద్ద రాముడిని ఆరాధించే ‘రామానంది’ మతాన్ని స్వీకరించాడు. రామదూత హనుమంతుడు మూలవిరాట్టుగా ‘మహాబలి’ ఆలయాన్ని ఇంఫాల్ నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయ నిర్మాణం బెంగాలీ ‘దో–చాలా’ శైలిలో ఉంటుంది. ఆలయ గర్భగుడిలోని హనుమంతుడి విగ్రహం నృత్యభంగిమలో ఉండటం విశేషం. గరీబ్ నివాజ్ మరణానంతరం మణిపూర్‌లో రామానంది మతం కనుమరుగై, గౌడీయ వైష్ణవం ప్రాబల్యం పుంజుకుంది. ఈ ఆలయంలో ఏటా హనుమజ్జయంతి, దీపావళి, హోలీ వేడుకలు విశేషంగా జరుగుతాయి.- సాంఖ్యాయన -
డైవర్స్ కావాలి: భర్త - బిడ్డను కనాలి: భార్య
భార్య నుంచి విడాకులు కావాలని భర్త, ఆ భర్త ద్వారా తనకు రెండో సంతానం కావాలని భార్య– ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. ఎవరి హక్కుల గురించి వారు వాదించారు. ఎలాగైనా ఒప్పించాలని భార్య; బంధమే వద్దనుకుంటే బిడ్డను కనడానికి ఎందుకు సహకరిస్తానని భర్త– చివరికి ఫ్యామిలీ కోర్టుకు ఈ వివాదం చేరింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భర్త హైకోర్టులో అప్పీలుకు వెళ్లాడు. బిడ్డను కనే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ రెండూ అవసరమే కానీ, అంతిమంగా ఏది ముఖ్యమో బాంబే హైకోర్టు తేల్చింది. కుటుంబ వివాదానికి ఓ పరిష్కారం చూపింది.భార్య తనతో క్రూరంగా ప్రవర్తిస్తోందని, అసభ్య పదజాలంతో దూషిస్తోందని, మానసికంగా హింసిస్తోందని తమ బంధాన్ని కొనసాగించలేనని విడాకులు మంజూరు చేయాలని ఓ భర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భర్తపై భార్య వేధింపుల కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసు కొనసాగుతుండగానే, నాందేడ్ ఫ్యామిలీ కోర్టులో భార్య మరో పిటిషన్ వేసింది. ఇది సంచలనంగా మారింది.భార్య ఏం కోరింది?తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని కోరింది. తమకు ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. కానీ, ‘నాకు మరో బిడ్డ కావాలి. నా వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. పిల్లలు కనడానికి తగిన వయసు. ఈ కేసు పూర్తవ్వడానికి కనీసం మరో 15 ఏళ్లు పట్టొచ్చు. అప్పుడు నాకు సంతాన సాఫల్య సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పైగా పిల్లాడికి తోబుట్టువులు లేకపోతే మానసికంగానూ ఇబ్బంది పడతాడు. ఒంటరిగా మిగిలిపోతాడు. నాకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. అందువల్ల నా భర్తతో శారీరకంగా లేదా ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చేలా ఆదేశించాలి’ అని కోర్టును అభ్యర్థించింది. రెండో బిడ్డ పెంపకానికి ఎలాంటి ఆర్థిక సాయం కోరనని, భర్తపై పెట్టిన కేసునూ ఉపసంహరించుకుంటానని కోర్టుకు తెలిపింది.ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇలాబిడ్డల విషయంలో భార్యాభర్తలిద్దరికీ హక్కులు ఉంటాయి. వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఈ కేసులో రెండో బిడ్డ కోసం భార్యకు సహకరించాలని, ఐవీఎఫ్ ద్వారా బిడ్డ కావాలనుకుంటే అందుకు అవసరమైన తోడ్పాటును అందించాలని ఆదేశించింది. భార్యతో కలిసి ఐవీఎఫ్ కౌన్సెలింగ్‌కు వెళ్లాలని పేర్కొంది.హైకోర్టులో అప్పీలుఫ్యామిలీ కోర్టు తీర్పుపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు. ఈ తీర్పు తన వ్యక్తిగత హక్కుకు, స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని వాదించాడు. అతను లేదా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా రెండో సంతానం కోసం బలవంతం చేసే అధికారం న్యాయస్థానానికి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మహిళకు తల్లి అయ్యే హక్కు ఉన్నట్టే, తన సమ్మతి లేకుండా తండ్రి కాకూడదనే స్వేచ్ఛ భర్తకు ఉంటుందని పేర్కొంది. ఒకవేళ బిడ్డ ఈ విధంగా పుడితే, పెరిగి పెద్దయ్యాక తన జననానికి దారి తీసిన పరిస్థితులు తెలిస్తే అతని మానసిక ఎదుగుదలపైనా ప్రభావం ఉంటుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఫ్యామిలీ కోర్టు భర్త సమ్మతి గురించి చెబుతూనే రెండో బిడ్డకోసం సహకరించాలని చెప్పడం పరస్పర విరుద్ధంగా పేర్కొంది. ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లాలన్న ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వును రద్దు చేసింది. భార్య దాఖలు చేసిన ఎగ్జిబిట్–35ను తిరస్కరించింది. భవిష్యత్తులో వారి మధ్య సఖ్యత ఏర్పడి మళ్లీ కలిసి జీవిస్తే అప్పుడు రెండో బిడ్డ గురించి ఆలోచించడం వారి వ్యక్తిగత విషయం అని పేర్కొంది. కానీ కోర్టు ప్రస్తుతం బలవంతంగా రెండో బిడ్డ కోసం సహకరించాలనే ఆదేశాలను ఇవ్వజాలదని తేల్చి చెప్పింది. బిడ్డకు జన్మనిచ్చే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, పుట్టబోయే బిడ్డ సంక్షేమం మధ్య సమతుల్యం ఎలా ఉండాలో ఈ తీర్పు స్పష్టంగా వివరించింది.- దిలీప్ మాదిరెడ్డి -
నాకు ఫొటో గ్రఫీ అంటే ఇష్టం
‘తూ చీజ్ బడీ హై మస్త్...’ అంటూ ఒకప్పుడు రవీనా టాండన్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘ఉయి అమ్మ...’ అంటూ ఆమె తనయురాలు రాషా తడానీ కుర్రకారు హార్ట్ బీట్‌ను పెంచింది. తొలి చిత్రం ‘ఆజాద్’తోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న రాషా ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం కానుంది. ఈ యంగ్ హీరోయిన్ గురించి కొన్ని విశేషాలు ఆమె మాటల్లోనే...‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలోని హీరోయిన్ పాత్ర (మంగ) కోసం దర్శక– నిర్మాతలు నాకు అవకాశం కల్పించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాను. జేకే (జయకృష్ణ ఘట్టమనేని) నా బెస్ట్ కో స్టార్. మోహన్ బాబు, వాసుగార్లు ఇలా టీమ్ అందరూ నాకు హెల్ప్ చేశారు. నాకు తెలుగు భాష పూర్తిగా రాదు. కొంచెం కొంచెం వచ్చు. అయితే తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను మహేశ్‌బాబుగారికి అభిమానిని. అలాగే కృష్ణగారికి కూడా. తెలుగు ప్రేక్షకులు నా నటనను మెచ్చుకునేలా యాక్ట్ చేస్తాననే అనుకుంటున్నాను.ఉయి అమ్మ... అని గట్టిగా అరిచాడు‘ఆజాద్’ సినిమాలోని ‘ఉయి అమ్మ’ పాట నన్ను చాలా పాపులర్ చేసింది. ఒకసారి బిల్‌బోర్డ్‌పై ఉన్న నా సినిమా పోస్టర్‌ను నేను ఫోటో తీసేందుకు నా కారును ఆపి, కారు అద్దాన్ని కిందకి దించాను. అప్పుడు అక్కడే వీధిలో ఉన్న ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి... ‘అరే... ఈమె ఉయి అమ్మ’ అని గట్టిగా అరిచాడు. ఈ పాట నన్ను అంతలా ప్రేక్షకులకు చేరువ చేసింది.నాన్న చాలా సపోర్ట్ చేస్తారుమా నాన్న (డిస్ట్రిబ్యూటర్– నటుడు అనిల్ తడానీ) నన్ను చాలా సపోర్ట్ చేస్తుంటారు. నేను ఆర్టిస్ట్‌గా చేయాలనుకున్నప్పటికీ నాన్న చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తిగా ఉంది. నా ఇంట్రస్ట్‌ని అర్థం చేసుకుని, నాన్న వ్యాపార మెలకువలు చెబుతుంటారు. అయితే మా అమ్మలానే నాన్న కూడా నా నిర్ణయాలను నన్నే తీసుకోమంటారు. మా అమ్మే స్ఫూర్తిమా అమ్మ నటిగా పరిచయం అయినప్పుడు నాకంటే రెండేళ్లు చిన్నది. ఇప్పుడు నా వయసు 21. అంటే... అమ్మ స్క్రీన్‌కి పరిచయం అయినప్పుడు తనకు 19. ఇప్పుడున్నంత సౌకర్యాలు అప్పట్లో ఉండేవి కావని తను చెబుతుంటుంది. అది నిజమే. అప్పట్లో నటీమణులతో పోల్చితే ఇప్పుడు మాకు ‘వ్యానిటీ వాన్’ సౌకర్యం ఉంది. కష్టం విషయంలోనూ అప్పటివాళ్లతో పోల్చితే మాకు తక్కువే. మా అమ్మ ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో కష్టపడింది. ఒక నటిగా ఆమె ప్రయాణం నాకు స్ఫూర్తినివ్వడమే కాకుండా, ఒక వ్యక్తిగా కూడా ఆమె నాకు స్ఫూర్తి. ’అందాజ్ అప్నా అప్నా’ సినిమాలో మా అమ్మ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నటించి, నేను చూసిన తొలి సినిమా కూడా ఇదే.అద్దం ముందు నటనమా అమ్మను కెమెరా ముందు చూడటం మొదలుపెట్టినప్పటి నుంచే నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. నాకు క్రియేటివ్ జాబ్ అంటే చాలా ఇష్టం. స్కూలు రోజుల్లో సృజనాత్మక కళల పట్ల ఆసక్తి ఉండేది. అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకుంటూ నాట్యం చేయడం, పాటలు పాడటం చేసేదాన్ని. పాడటం, పియానో ??వాయించడం చేస్తున్నట్లుగా నటించేదాన్ని. నటన అంటే అంత ఇష్టం ఉన్నప్పటికీ ఒకానొక దశలో నేను వెట్ (పశు వైద్యురాలు) కావాలని కూడా అనుకున్నాను. నాకు ఫొటోగ్రఫీ ఇష్టం. యానిమల్స్ ఫొటోలు తీయడం చాలా ఇష్టం. -
ఫస్ట్ తెలుగు సోషల్ ఫిల్మ్ @ 90 ఏళ్లు
ఇప్పటికి సరిగ్గా తొంభై ఏళ్ళ క్రితం తొలి తెలుగు సోషల్ ఫిల్మ్ – ‘ప్రేమ విజయం’ వచ్చింది (రిలీజ్ 1936 జూలై 20). ఇవాళ మనం చూస్తున్న అన్ని సోషల్ సినిమాలకూ అదే పునాది. చరిత్రలో అంతటి ప్రాధాన్యం ఉన్నా, ఇవాళ్టికీ అరకొర సమాచారమే తప్ప పూర్తి వివరాలు ఎవరికీ తెలియని చిత్రం అది. మైలురాయి లాంటి ఆ సినిమా చరిత్రను తవ్వి తీసిన వివరాలతో తొలిసారి అక్షరబద్ధం చేస్తున్న ఈ పరిశోధనాత్మక తెర వెనుక అసలు కథ ‘సాక్షి’కి ప్రత్యేకం.తెలుగు సినిమా అంటే ఒకప్పుడు పౌరాణికం, జానపదం... ఇలా రకరకాల జానర్లుండేవి. ఇవాళ అత్యధిక భాగం సాంఘికమే. తొంభై ఏళ్ళ క్రితం తెలుగు తెరపై సాంఘిక చిత్రాలు తీయడం ఓ విడ్డూరం. పౌరాణిక, జానపద కథలదే రాజ్యమైన తెరపై, సామాజిక వాతావరణాన్ని చూపెట్టి నెగ్గుకు రాగలమా అన్న బాక్సాఫీస్ భయం. ఆ పరిస్థితుల్లో తెలుగులో వచ్చిన ఫస్ట్ సోషల్ ఫిల్మ్ ‘ప్రేమ విజయము’.అది... పేరులోనే లవ్ స్టోరీ పెట్టుకున్న తొలి తెలుగు సినిమా. కాలేజీ చదువులు, ప్రేమలు, వితంతు వివాహాలు, వివాహేతర వ్యామోహాలు, సంఘంలోని దురాచారాలు... ఇలా ఎన్నెన్నో అంశాలను తొలిసారిగా తెలుగు తెరపై చర్చించిన సినిమా. అనేక కష్టనష్టాలకు ఓర్చి, బాక్సుల్లో నుంచి బయటపడ్డ సినిమా. చూద్దామంటే సినిమానే కాదు, పాటలు, ఫొటోలు సైతం కనిపించని అరుదైన సినిమా. ఇంకా చెప్పాలంటే, చిత్ర నిర్మాణమే ఓ పెద్ద సినిమా స్టోరీని తలపించే సినిమా. చారిత్రక ప్రాధాన్యమున్న రాజమండ్రి ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్ళలో తెలుగునాట సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ముఖ్యకేంద్రమైంది. నాటకం సామాన్య వినోదంగా మారిన ఆ రోజుల్లో నాటక సంస్థలకూ కేంద్రస్థానమైంది. తెలుగు గడ్డపై తొలి సినిమా స్టూడియో వెలసిందీ రాజమండ్రిలోనే. అలాగే, తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయము’ చిత్ర నిర్మాణంతోనూ ఆ ప్రాంతానిదే అనుబంధం.సాహసించి... తొలి అడుగు!అది 1935–36 నాటి సంగతి. పాపులర్ స్టేజ్ నాటకాలు, పౌరాణిక గాథలు... అన్నీ అప్పటికే వెండితెర మీదకొచ్చాయి. అయితే, రాజమండ్రి వాస్తవ్యులైన రంగస్థల దిగ్గజం కృత్తివెంటి నాగేశ్వరరావు మాత్రం ధైర్యం చేసి, తొలి సినీ ప్రయత్నంలోనే సాంఘిక గాథ తీసుకున్నారు. అప్పట్లో అందరూ దాన్ని ఓ ప్రయోగంగా చూశారు. అందుకే, ఓ పక్క తెలుగులో తొలి సోషల్ టాకీ తయారవుతున్నా... వారంతా ‘కనకతార’ లాంటి ఇతర పాపులర్ స్టేజ్ డ్రామాలు, ‘మోహినీ రుక్మాంగద’ లాంటిపురాణగాథల మీదే దృష్టి పెట్టారు. ‘ప్రేమ విజయము’కు నిర్మాత కృత్తివెంటి నాగేశ్వరరావు అని చరిత్రలో చాలామంది తెలిసీ తెలియక రాస్తుంటారు కానీ, నిజానికి ఆయన దర్శకుడు. పెట్టుబడి పెట్టిన నిర్మాతలతో పాటు తానూ నిలబడి, సినిమా మొత్తాన్నీ నిర్వహించిన సారథి. అయితే, ఆయనకు నాటకానుభవమే తప్ప సినీ సాంకేతిక పరిజ్ఞాన అనుభవం లేదు. అందుకని, బొంబాయిలో పని చేసి, రికార్డింగ్, లేబరేటరీ పనుల్లో అనుభవమున్న ద్వారకానాథ్‌ను టెక్నికల్ డైరెక్టర్‌గా తీసుకున్నారు. కాపీరైట్ గొడవల్లో నాటకీయ కథ కృత్తివెంటి వారి నాటక సమాజానుభవానికీ, ఈ ‘ప్రేమ విజయము’ చిత్రకథకూ దగ్గరి సంబంధం ఉంది. వారి డ్రామా సంస్థ ఆడిన ‘కాలేజి గరల్’ నాటకమే ఈ సినిమాకు మూలం. ఆ సంస్థ 1934లో మద్రాసులో ఆ నాటక ప్రదర్శనలు ఇచ్చాక ఆ కథనే సినిమా తీయాల్సిందిగా మిత్రులు ప్రోత్సహించారు. ఆ నాటకం కథన, కల్పన వగైరా అంతా కృత్తివెంటిదే. రచయిత కాళ్ళకూరి హనుమంతరావుతో చెప్పి రాయించారు. నాటకం వేసిన ప్రతి పట్టణంలో రంగస్థలానికి అనుకూలంగా మార్చుకుంటూ ప్రదర్శించారు. ప్రదర్శనల సమయంలోనే పేచీలు పెట్టిన కాళ్ళకూరి ఆ నాటకాన్ని తన పేరు మీద పుస్తకంగా వేసుకున్నారు. అది తాము సినిమా తీయడానికి అడ్డంకి అవుతుందని కృత్తివెంటి భావించారు. వెంటనే తాము నాటకాన్ని ప్రదర్శిస్తున్న పద్ధతిలోనే కవి వేదుల సత్యనారాయణశాస్త్రితో సరికొత్తగా నాటకం రాయించారు. దానికి ‘ఎక్స్ కాలేజి గరల్’ (లేదా ‘న్యూ కాలేజి గరల్’) అని పేరు పెట్టారు. అదే ఈ సోషల్ ఫిల్ముకు మూలాధారమైంది. ఇలా ఉండగా, ‘కాలేజి గరల్’ నాటకంపై కృత్తివెంటి మీద కాళ్ళకూరి కోర్టులో తెచ్చిన చార్జీని కొట్టేశారు. దీని కన్నా ముందే మరో సోషల్!?అసలు ఈ ‘ప్రేమ విజయము’ కన్నా ముందే తెలుగులో వేరే సోషల్ టాకీ తీసే ప్రయత్నాలు జరిగాయి. ఆ సినిమా పేరు ‘విజయ’. ఆ తొలి ప్రయత్నాలు చేసింది కూడా ఈ ‘ప్రేమ విజయము’ నిర్మాతలే! వారు చెన్నపట్నంలోని ‘ది మద్రాస్ పీపుల్స్ బ్యాంక్ లిమిటెడ్’ యజమానులు. మరికొందరితో కలసి వాళ్ళు విజయ సౌండ్ ఫిలిమ్స్ లిమిటెడ్, ఇండియన్ ఆర్ట్ సినీటోన్ అనే కంపెనీలు పెట్టారు. పౌరాణిక చిత్రం ‘సేతుబంధనం’, సాంఘిక చిత్రం ‘విజయ’... రెండూ తీయాలనుకున్నారు. దర్శకుడు ఐ. రాజారావు నాయుడు. షూటింగ్ కూడా మొదలైంది. తీరా దర్శకుడితో విభేదాలతో, ‘విజయ’ అటకెక్కింది. నిర్మాతలకు అప్పుడు గతంలో తాము చూసిన పాపులర్ డ్రామా ‘కాలేజి గరల్’ గుర్తొచ్చింది. ఆ నాటక ప్రయోక్త కృత్తివెంటి నాగేశ్వరరావును రప్పించారు. తన ‘న్యూ కాలేజి గరల్’ నాటకాన్ని ‘నియో కాలేజి గరల్’ పేరిట ఫిల్మ్ తీసేందుకు కృత్తివెంటి ఒప్పుకొన్నారు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అప్పట్లోనే అన్ని రకాల జోక్యాలూ! నెలరోజుల్లోనే అందరినీ బుక్ చేసి, సినేరియో (స్క్రీన్‌ప్లేకు అప్పటి పేరు), వగైరా సిద్ధం చేశారు కృత్తివెంటి. తీరా సినీ నిర్మాణ సంస్థ పక్షాన అన్ని విషయాల నిర్వహణా చూసే జనరల్ మేనేజర్‌గా నియమితులైన అడ్వకేట్ గారికి సినేరియో నచ్చలేదు. అందులో ఎన్నికలు, కట్నం లేని పెళ్ళి లాంటి ఘట్టాలు చేర్పించి, కలగాపులగం చేసి, కొత్త సినేరియో తయారు చేయించారు. చివరకు కట్నాల కథ తీసేసి, ఎన్నికల అంశం మాత్రం ఉంచేలా రాజీ కుదిరింది. కానీ, కథనంతా మార్చేసి మళ్ళీ కొత్తగా రాయాల్సి వచ్చింది. ‘కాలేజి గరల్’ టైటిల్‌ను ‘ప్రేమ విజయము’ అని మార్చాల్సొచ్చింది. ప్రింట్ లేని ఆ చిత్రకథేమిటంటే...సినిమా ప్రింట్, పాటల పుస్తకం మాట దేవుడెరుగు, కనీసం ఫొటోలు దొరకడమే గగనమైన ‘ప్రేమ విజయము’ చిత్రకథ స్థూలంగా ఇదీ: వెంకట్రావు మంచి చిత్రకారుడు. చిత్రకళాశాలలో అతని సహాధ్యాయిని రుక్మిణి బాల వితంతువు. వెంకట్రావుకు స్నేహితులు కృష్ణారావు, రామారావు. అప్పటికే పెళ్ళయిపోయిన కృష్ణారావు పాతకాలపు చాదస్తాలు నిండిన తన భార్య పట్ల విముఖుడై రుక్మిణి పట్ల ఆకర్షితుడవుతాడు. ఒకపక్క కృష్ణారావు స్వగ్రామంలో జిల్లా బోర్డుకు ఎన్నికలు. ఎన్నికల్లో గెలవాలని అప్పు కోసం తన పడుచు కూతురు లక్ష్మిని ఓ ముసలి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్‌కి ఇచ్చి అయిదోపెళ్ళి జరిపించేస్తాడు రావుబహద్దూర్ గోపాలరావు. ఆ అమ్మాయికేమో చిన్నప్పటి నుంచి మేనబావ రామారావు అంటే ఇష్టం. ఇక్కడ ఇంకోపక్కేమో... భర్త కృష్ణారావు తనను ప్రేమించడం లేదని భార్య దిగులుతో కృశిస్తూ ఉంటుంది. బాలవితంతువు రుక్మిణేమో అప్పటికే పెళ్ళయిన కృష్ణారావునే వివాహమాడాలని తపిస్తుంటుంది. వేరొకపక్క చిత్రకారుడైన వెంకట్రావేమో, రుక్మిణిని పెళ్ళి చేసుకోవాలని తహతహలాడుతుంటాడు. చివరకు ఏం జరిగిందన్నది మిగతా సినిమా.ఆ నటీనటులు ఎవరంటే...ఇండియన్ ఆర్ట్ సినీటోన్ పతాకంపై తయారైన ఈ తొలి తెలుగు సాంఘిక చిత్రంలో హీరో ప్రభల కృష్ణమూర్తి. ‘‘హీరోయినేమో తర్వాతి రోజుల్లో నటి – నిర్మాత సి. కృష్ణవేణి నిర్మించిన ‘దాంపత్యం’లో హీరోగా నటించిన విజయకుమార్ తల్లి. ఆమె పేరు రాజ్యలక్ష్మి అని గుర్తు’’ అని విమర్శకులు వి.ఏ.కె. రంగారావు మాట. అయితే, కృష్ణవేణి కుమార్తె – నిర్మాత అనూరాధాదేవి మాత్రం, ఆమె పేరు సుగుణమ్మనీ, ఆమెకు సినిమాలతో సంబంధమే లేదనీ అన్నారు. ఏమైనా, లభిస్తున్న ఆధారాల మేరకు ఈ చిత్రంలో మిస్ (గుంటూరు) భానుమతి కీలక పాత్రధారిణి. పి.యస్. శర్మ, పి. రామారావు, మిస్ నూకరాజు, మిస్ రాజ్యం, బి. రాజ్యలక్ష్మమ్మ భాగవతార్, ఎం. రామచంద్రమూర్తి, కె. రంగారావు తదితరులు నటించారు. తర్వాత గయ్యాళి పాత్రలతో పేరొందిన నటి (జవ్వాది) గంగారత్నం హాస్యపాత్ర ధరించారు. ‘గౌతమీ కోకిల’ సాహిత్యం! కాకినాడ మాస్టారి సంగీతం!‘ప్రేమ విజయము’ సంగీతం, పాటలకూ ఓ చరిత్ర ఉంది. ప్రసిద్ధ భావకవి ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి సాహిత్యం అందించారు. కాకినాడకు చెందిన సంగీత విద్వాన్ మునుగంటి వేంకటరావు పంతులు సంగీతం సమకూర్చారు. అలా సాహిత్య, సంగీత రంగాల్లో దిగ్దంతులైన ఇద్దరు పనిచేయడం ఆ సినిమా ప్రత్యేకత. ఈమని శంకరశాస్త్రి, ఓలేటి వెంకటేశ్వర్లు, వింజమూరి సిస్టర్స్ (అనసూయ – సీత)... మునుగంటి వారి శిష్యులే. ‘గానకళ’ మాసపత్రికను నడిపిన సంగీత విమర్శకులు మునుగంటి శ్రీరామమూర్తి వారి కుమారుడే! ‘ప్రేమ విజయము’ కోసం మునుగంటి కట్టిన బాణీలు, ఆ పాటలు స్వర్గీయ వింజమూరి అనసూయ ఈ వ్యాసకర్తకు గతంలో వివరిస్తూ, ‘‘మా గురువు గారు ఆ సినిమాలో ఓ వేషం కూడా వేశారు. ఓ పాట పాడారు. ఎక్కువగా శివరంజని రాగంలో వరసలు కట్టారు’’ అని చెప్పారు. ‘పాడు స్వార్థములు అనుమానాలు...’, ‘ఏటికీ ఈ మగవారలు...’, అలాగే ‘చీకటుల పాలేనా...’ అనే పాటలను ఆమె గుర్తుచేసుకున్నారు. అతి పొదుపుగా... అదీ నెల రోజుల్లో... ‘ప్రేమ విజయము’ చిత్రీకరణ కూడా నానా అవస్థలతో నడిచింది. అప్పటికే విజయ సినీటోన్ పక్షాన మొదలైన ‘సేతుబంధనం’లో ఖర్చు తప్పితే, పురోగతి లేదు. దాంతో, నిర్మాతలు ఆ చిత్ర డైరెక్టర్ రాజారావు నాయుడు ట్రూప్‌ను స్టూడియో నుంచి బయటకు పంపేసి, విజయ సినీటోన్‌కు చరమగీతం పాడేశారు. అప్పటికే బొంబాయి నుంచి కెమెరా, రికార్డింగ్ ట్రక్కులు వగైరా తెచ్చి చాలా రోజులైంది. వాటి కాంట్రాక్ట్ కాలం నెలరోజులే మిగిలింది. ఆ వ్యవధి లోపలే ‘ప్రేమ విజయము’ షూటింగ్ అయిపోవాలన్నారు ఫిల్మ్ కంపెనీ తాలూకు ట్రస్టీలు. అంతా హడావిడే. అతి పొదుపుగా షూటింగ్ ఏర్పాటు జరిగాయి. ఎలాగోలా నెల రోజుల్లో షూటింగ్ అంతా ముగించారు. తొలి సోషల్... ఓ పెద్ద ఫ్లాప్!1936 జూలై 20న ‘ప్రేమ విజయము’ రిలీజైంది. ‘‘పుక్కిటి పురాణాల ఫిలిమ్స్‌తో విసిగిపోయిన ఆంధ్రులకు ఒక కొత్త కానుక... ఒక కళోపహారం’’ అంటూ అప్పట్లో ఈ సినిమాకు పబ్లిసిటీ చేశారు. అలా మన తొలి సోషల్ టాకీయే ‘స్త్రీ స్వాతంత్య్ర సంకల్పం’, ‘బాల్యవివాహాలతో అనర్థాల’ను వెండితెరపై చూపడం పెద్ద విశేషమే! సినిమా ముందుగా గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడల్లోనే రిలీజైంది. కథ, సాంకేతికతల రీత్యా సినిమా వట్టి అతుకులబొంతగా మిగిలింది. పెద్దగా ప్రజాదరణ పొందలేదు. తెరపై తెలుగు సమాజం, వాతావరణం!తెలుగులో వచ్చిన తొలి సోషల్ టాకీ ఆశించిన విజయం సాధించకున్నా, తర్వాత వరుసగా సోషల్ టాకీలు వచ్చేందుకు బీజం వేయగలిగింది. ఆ సినిమా వచ్చిన 20 నెలలకు, తెలుగులో రెండో సోషల్ టాకీ హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ‘గృహలక్ష్మి’ (1938 మార్చి 12) వచ్చింది. ఆ వెంటనే గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’ (1938), ‘రైతుబిడ్డ’ (1939), వై.వి. రావు ‘మళ్ళీ పెళ్ళి’ (1939 డిసెంబర్ 17) లాంటివి వరుసగా వచ్చి, తెలుగు సినిమాను సమకాలీన సాంఘిక మార్గం పట్టించాయి. అలా తెరపై మన జీవితాన్నీ, కట్టూ, బొట్టునూ చూపించాల్సి వచ్చింది. తొంభై ఏళ్ళ కాలంలో సంఘ ప్రబోధం, సెంటిమెంట్ దగ్గర మొదలై స్మగ్లింగ్ కథల దాకా తెలుగు సోషల్ సినిమా ఎన్నో కోవల్లో, ఎంతో దూరం ప్రయాణించింది. హీరో మంచివాడన్న మాటకు కాలం చెల్లి, యాంటీ హీరోయే అసలు హీరో అనే టాక్సిక్ వాతావరణానికి వచ్చేశాం. తెలుగు సినిమాల్లో తెలుగు సమాజం ఎంత అంటే నీళ్ళు నమలాల్సిన పరిస్థితీ వచ్చింది. మనదైన జీవితమే లేని సినిమాలే మన సినిమాగా చలామణీ అవుతున్న దౌర్భాగ్యమూ దాపురించింది. బాక్సాఫీస్ లెక్కల్లో మాత్రం పాన్ ఇండియా కోటలు దాటామని తృప్తి పడాల్సిన పరిస్థితి. సంఖ్య, విస్తృతి, వసూళ్ళపరంగా అనూహ్య ప్రగతి సాధించాం సరే, సరుకులో నాణ్యత మాటేమిటన్నది మాత్రం బేతాళ ప్రశ్నే!ఎవరీ కృత్తివెంటి నాగేశ్వరరావు? నాటకకళే జీవితంగా బతికిన నటుడు, తొలితరం నాటక సమాజ నిర్వాహకుడు, ప్రయోక్త కృత్తివెంటి నాగేశ్వరరావు. ఆయన పుట్టింది బందరులో అయినా, పెరిగింది రాజమండ్రిలో! అక్కడే పార్శీ నాటకాలు చూసి, ప్రేరణ పొంది, ప్రసిద్ధ ‘హిందూ నాటక సమాజం’లో తొలుత స్త్రీ పాత్రలు ధరించారు. ఉర్దూ నాటకాలు కూడా ఆడారు. 1908లో సత్యవోలు గున్నేశ్వరరావు గారి నాటక కంపెనీలో చేరి, దాని నిర్వహణ బాధ్యతలు చూశారు. తర్వాత కొన్నాళ్ళకు ఇద్దరూ విడిపోయారు. కృత్తివెంటి సొంత నాటక సమాజం పెట్టారు. దాదాపు 12 ఏళ్ళు 150 మంది నటుల్ని పోషించారు. నాటకకళ కోసం ఆస్తినే కాదు, జీవితాన్ని కూడా ఖర్చుపెట్టిన కృత్తివెంటి ‘ప్రేమ విజయము’ తర్వాత మళ్ళీ సినిమాలు తీయలేదు. వారి ఏకైక కుమారుడు కె. హరనాథ్ మాత్రం సినిమాల్లోకే వచ్చారు. వాహినీ స్టూడియో శబ్దగ్రహణ శాఖలో వల్లభజోస్యుల శివరామ్ మార్గదర్శకత్వంలో ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్‌తో కలసి సుదీర్ఘకాలం రికార్డిస్ట్‌గా పనిచేశారు.గుడిలో షూటింగ్... ఆలయ సంప్రోక్షణ!‘ప్రేమ విజయము’లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మద్రాసులోని ట్రిప్లికేన్‌లో ప్రసిద్ధ శ్రీపార్థసారథి స్వామి గుడిలో జరిగింది. ‘పవిత్రమైన ఆలయంలో సినిమా షూటింగ్ చేయనిస్తారా’ అంటూ అప్పట్లో పెద్ద వివాదమే చెలరేగింది. ఆలయ భక్తులందరూ స్థానిక మండపంలో బహిరంగ సమావేశమై, షూటింగ్ వ్యవహారాన్ని నిరసించారు. జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆలయ ‘సంప్రోక్షణ’ జరపాలని నిర్ణయించారు. ఆ వివాదం నాటి సాంఘిక పరిస్థితులకు అద్దంపడుతుంది.పారితోషికంలోనూ పేచీలే! సినిమాల్లో రెమ్యూనరేషన్ వివాదాలు ‘ప్రేమ విజయము’ నాటికే ఉన్నాయి. ఆ సినిమా పూర్తయ్యాక నిర్మాతలు రైల్వే చార్జీలు మినహా అంతా ఇచ్చి, ఆర్టిస్టుల్ని పంపేశారు. రచయితకు ఇవ్వాల్సిన మిగతా సొమ్ము, నటీనటుల రైలుఖర్చులు కొన్ని నెలల పాటు తిప్పించి గానీ ముట్టజెప్పలేదు. కృత్తివెంటి కోర్టుకెక్కారు. అయితే, అన్నివిధాలా నష్టపోయి, దెబ్బతిన్న ఆయన చివరకు తనకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ మాట దేవుడెరుగు, కనీసం పెట్టిన ఖర్చయినా వస్తే చాలనుకొని రాజీకి వచ్చారు. తెలుగు సినీరంగంలో రెమ్యూనరేషన్ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం బహుశా అదే తొలిసారి.3 భాషల్లోనూ... నాటకాలే! సైలెంట్ సినిమాల రోజుల్లోనే దక్షిణాదిన సోషల్ కథలు వచ్చినా, మూకీలు పోయి మాటలు, పాటలున్న టాకీలు మొదలయ్యాక తెలుగులో సోషల్ సినిమా రావడానికి అయిదేళ్ళు పట్టేసింది. తెరపై పూర్తి నిడివి టాకీ చిత్రాల విషయంలో తమిళం సహా ఇతర దక్షిణాది భాషల కన్నా మనమే ముందున్నా, తెరపై సాంఘిక చిత్రం మాత్రం తమిళం తర్వాత కానీ మనకు రాలేదు. తమిళంలో తొలి సోషల్ టాకీ ‘మేనక’ (1935 ఏప్రిల్ 6). ఇక, తెలుగు తర్వాత నెల రోజుల చిల్లరకే కన్నడంలో తొలి సోషల్ టాకీ ‘సంసార నౌక’ (1936 ఆగస్టు 27) వచ్చింది. అటు తమిళం, ఇటు తెలుగు, ఆ తర్వాత కన్నడం... మూడింటిలోనూ ఫస్ట్ సోషల్ టాకీలు రంగస్థలం నుంచి వెండితెరకెక్కిన నాటకాలే కావడం గమనార్హం.∙రెంటాల జయదేవ -
అత్యంత ఖరీదైన ఉత్తరం
ప్రపంచంలోనే అతి ఖరీదైన ఉత్తరం అంటే, ఇదేదో ప్రసిద్ధుల ప్రేమలేఖ అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే! ఇది ఒక వర్తకుడు మారిషస్ నుంచి ఫ్రాన్స్‌లో ఉన్న తన వ్యాపార భాగస్వాములకు రాసిన ఉత్తరం. దీనిని సింగపూర్‌లోని పురావస్తు సేకర్త ఒకరు సేకరించారు. బ్రిటిష్ అధీనంలోని మారిషస్ రాజధాని పోర్ట్ లూయీ నుంచి ఎడ్వర్డ్ ఫ్రాన్సిస్ అనే మద్యం వర్తకుడు 1847 అక్టోబర్ 4న ఫ్రాన్స్‌లో లావాదేవీలు నిర్వర్తిస్తున్న తన వ్యాపార భాగస్వాములకు రాశాడు. ఫ్రాన్స్ నుంచి నౌకలో పంపిన 48 పీపాలు అందాయని, వాటిలో తాను దాదాపు మూడోవంతు అమ్మేశానని ఈ ఉత్తరం సారాంశం.ఈ ఉత్తరానికి అప్పట్లో అతికించిన స్టాంపుల విలువ కొన్ని పెన్నీలు మాత్రమే! ఇప్పుడు ఆ అరుదైన స్టాంపుల విలువ కొన్ని మిలియన్ల డాలర్ల మేరకు ఉండవచ్చని పురావస్తు సేకర్తల అంచనా. ఈ ఉత్తరం ఉన్న ఎన్వలప్‌పై అతికించిన స్టాంపుల్లో ఒకటి అత్యంత అరుదైన ‘మారిషస్ బ్లూ’ స్టాంపు. ఈ ‘మారిషస్ బ్లూ’ స్టాంపు 1993లో వేలానికి వచ్చినప్పుడు సింగపూర్ వ్యాపారి ఒకరు ఏకంగా 17 మిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ధర ఎంత ఉండవచ్చో ఊహించుకోవాల్సిందే! -
అతిపెద్ద వెల్లుల్లి
సాధారణంగా ఒక్కో వెల్లుల్లి ముప్పై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు బరువు తూగుతాయి. బ్రిటన్‌లోని గ్లూసెస్టర్‌షైర్‌కు చెందిన గ్రాహమ్ బారాట్ తన పెరటితోటలో ఇటీవల పండించిన వాటిలో ఒక భారీ వెల్లుల్లి ఏకంగా 1.75 కిలోల బరువు తూగి, గిన్నిస్ రికార్డు సృష్టించింది.ఈ వెల్లుల్లి వ్యాసం 19 సెంటీమీటర్లు. ఇది ‘ఎలిఫెంట్ గార్లిక్’ రకానికి చెందినది. బారాట్ తన పెరటితోటలో పదేళ్లు భారీ సైజు వెల్లుల్లి రకాలను పెంచుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు అతడు పండించిన వాటిలో ఇదే అత్యంత భారీ వెల్లుల్లి కావడం విశేషం. -
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను చైనా నిర్మించింది. చైనా నైరుతి ప్రాంతంలోని చాంగ్కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా రూపొందించింది. దీని విస్తీర్ణం 1.22 మిలియన్ చదరపు మీటర్లు. ఇది న్యూయార్క్‌లోని గ్రాండ్ సెంట్రల్ స్టేషన్ కంటే ఆరురెట్ల పెద్దది. చాంగ్కింగ్–ఈస్ట్ రైల్వేస్టేషన్లో దాదాపు అరకిలోమీటరు పొడవైన 29 ప్లాట్‌ఫామ్స్, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అనువైన 15 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి.ఎనిమిది అంతస్తుల ఈ రైల్వేస్టేషన్ భవంతిని అత్యధునాతనమైన హంగులతో నిర్మించారు. గంటకు 16 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ రైల్వేస్టేషన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. దీని నిర్మాణం కోసం 40 వేల మంది కార్మికులు, రోబోటిక్ యంత్రపరికరాలతో స్టేషన్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో కేవలం 38 నెలల్లోనే పూర్తి చేశారు. -
ఈ ఆదివారం పసందైన వంటకాలు ట్రై చేయండిలా..!
మూలీ పరాఠాకావలసినవి: ముల్లంగి తురుము: 2 కప్పులు, గోధుమ పిండి: 3 కప్పులు, పచ్చిమిర్చి తరుగు: టీస్పూన్, అల్లం తురుము: టీస్పూన్, కారం: 1/2 స్పూన్, వాము: 1/2 స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, గరం మసాలా: పావు చెంచా, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, నెయ్యి లేదా నూనె: పరాఠాలు కాల్చడానికి.తయారీ: ముల్లంగి తురుములో కొద్దిగా ఉప్పు కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఉప్పు వేయడం వల్ల ముల్లంగిలోని నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక కాటన్ బట్టలో లేదా చేతులతో ముల్లంగి తురుమును గట్టిగా పిండి, నీటిని పూర్తిగా వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి, ముల్లంగి తురుమును పిండగా వచ్చిన నీటిని ఉపయోగించి చపాతీ ముద్దలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. తర్వాత నీరు తీసేసిన ముల్లంగి తురుములోకి పచ్చిమిర్చి, అల్లం తురుము, వాము, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చిన్న పూరీలా ఒత్తి, దాని మధ్యలో రెండు చెంచాల ముల్లంగి మిశ్రమాన్ని ఉంచాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న పిండిని పైకి తెచ్చి స్టఫింగ్‌ను పూర్తిగా క్లోజ్ చేయాలి. ఆ తర్వాత పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా తయారుచేసుకున్న వాటిని పెనంపై వేసి రెండు వైపులా దోరగా కాల్చాలి. కాల్చేటప్పుడు నెయ్యి లేదా నూనె రాస్తే పరాఠాలు రుచిగా వస్తాయి.స్టఫ్డ్ డేట్స్ కావలసినవి: ఖర్జూరాలు: 15–20, బాదం పప్పులు: 10, జీడిపప్పు: 10, పిస్తా పప్పులు: స్పూన్ (సన్నని తరుగు), పీనట్ బటర్ లేదా ఆల్మండ్ బటర్: 4 స్పూన్లు, డార్క్ చాక్లెట్: 1/2 కప్పు, సీ సాల్ట్ : ఒక చిటికెడు, (టేస్ట్ పెంచడానికి)తయారీ: ముందుగా ఖర్జూరాలను తడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఖర్జూరాన్ని ఒక వైపు మాత్రమే చాకుతో నిలువుగా కట్ చేసి, లోపల ఉన్న గింజను జాగ్రత్తగా తీసేయాలి. ఖర్జూరం రెండు ముక్కలుగా విడిపోకుండా కేవలం మధ్యలో పాకెట్ లాగా ఓపెన్ అవ్వాలి. ఒక చిన్న పాన్‌లో నూనె లేదా నెయ్యి లేకుండా బాదం, జీడిపప్పులను లో–ఫ్లేమ్‌పై దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గింజ తీసేసిన ప్రతి ఖర్జూరం మధ్యలో పావు చెంచా పీనట్ బటర్‌ను నింపాలి. ఆ తర్వాత దానిపై ఒక వేయించిన బాదం పప్పు, ఒక జీడిపప్పు ముక్కను గట్టిగా నొక్కి పెట్టాలి. చివరగా పైభాగంలో సన్నగా తరిగిన పిస్తా ముక్కలు, ఒక చిటికెడు సీ సాల్ట్ చల్లాలి. చివరిగా ఈ స్టఫింగ్ చేసిన ఖర్జూరాలను కరిగించిన డార్క్ చాక్లెట్లో ముంచి, ఒక ప్లేట్లో పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. చాక్లెట్ గట్టిపడిన తర్వాత ఇది హోమ్మేడ్ క్యాండీ బార్ లాగా మారుతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో దాచుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.కుర్కురీ భేండికావలసినవి: శెనగపిండి: 4 స్పూన్లు, వరిపిండి: 2 చెంచాలు, కారం: స్పూన్, పసుపు: పావు చెంచా, ధనియాల పొడి: స్పూన్, జీలకర్ర పొడి: 1/2 స్పూన్, నిమ్మరసం: స్పూన్, వాము: 1/2 స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: డీప్ ఫ్రైకి తగినంత.తయారీ: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి కాటన్ బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు వాటికి ఇరువైపులా తొడిమలు తీసేసి, నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని, ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, వాము వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో శెనగపిండి, వరిపిండి చల్లి చేతులతో కలుపుతూ పిండిని బెండకాయ ముక్కలకు బాగా పట్టించాలి. బెండకాయలో ఉండే సహజమైన తేమ వల్ల పిండి ముక్కలకు అంటుకుంటుంది. ఇపుడు బాండీలో నూనె పోసి బాగా కాగాక, సిద్ధం చేసుకున్న బెండకాయ ముక్కలను విడివిడిగా వేస్తూ, మంటను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచి వేయించాలి. బెండకాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారి, కరకరలాడే వరకు వేయించి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే వేడివేడి కుర్కురి భేండి సిద్ధం. ఈ ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా చల్లుకుని, కొన్ని చుక్కల నిమ్మరసం పిండుకుని తింటే రుచి అమోఘంగా ఉంటుంది.(చదవండి: 'వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..!) -
ఇంతకాలం ఇవి లేకుండా ఎలా మేనేజ్ చేశాం?
ఇంటి పనులు ఎప్పుడూ తగ్గవు... కానీ వాటి కష్టం మాత్రం తగ్గించొచ్చు! చిన్నగా కనిపించే ఇవీ అవసరమైనప్పుడు పెద్ద సహాయం చేస్తుంది. ఇంట్లో ఒక్కసారి చోటు దక్కితే చాలు... ‘ఇంతకాలం ఇవి లేకుండా ఎలా మేనేజ్ చేశాం?’ అనిపించే స్మార్ట్ గ్యాడ్జెట్లు ఇవే!మ్యాజిక్ బ్యాగ్!షాపింగ్‌కు వెళ్లినప్పుడు వాన పడితే... ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో సరుకులు! వాటిని తడవకుండా కాపాడేలోపే గొడుగే పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి టైమ్‌లో ఈ రోల్–అప్ షాపింగ్ బ్యాగ్. చూడటానికి చిన్న క్యాప్సూల్లా కనిపించే ఈ బ్యాగ్‌ను విప్పగానే పెద్ద షాపింగ్ బ్యాగ్‌గా మారిపోతుంది. పని అయిపోయాక మళ్లీ చుట్టి చిన్న కేసులో పెట్టేస్తే చాలు. దీనికి ఉన్న క్లిప్‌తో హ్యాండ్‌బ్యాగ్, పర్స్‌కి తగిలించుకుని ఎప్పుడూ వెంట తీసుకెళ్లొచ్చు. వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌తో తయారైన ఈ బ్యాగ్‌లో కూరగాయలు, పండ్లు, మందులు, రోజువారీ సరుకులు... ఇలా చాలానే తడవకుండా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వానాకాలంలో ‘అయ్యో... బ్యాగ్ తీసుకురాలేదే!’ అనే టెన్షన్‌కు ఫుల్స్టాప్ పెడుతుంది. ధర కేవలం రూ. 260 మాత్రమే!చిట్టి వాషింగ్ మెషీన్!చిన్న బట్టల కోసం పెద్ద వాషింగ్ మెషీన్‌ను ఆన్ చేయడం కాస్త ఓవర్ అనిపిస్తుందా? ముఖ్యంగా చిన్నారుల బట్టలు, లోదుస్తులు, సాక్స్ లాంటి వాటిని విడిగా ఉతకాల్సి వచ్చినప్పుడు ఈ మినీ పోర్టబుల్ వాషింగ్ మెషీన్ మీ పనిని చాలా ఈజీ చేస్తుంది. చూడటానికి చిన్నగా ఉన్నా, పనిలో మాత్రం పెద్ద మెషీన్‌కే పోటీ ఇస్తుంది. బలమైన వాటర్ సర్క్యులేషన్‌తో దుమ్ము, చెమట, రోజువారీ మరకలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. సున్నితమైన వస్త్రాలకు ఎలాంటి హాని కలగకుండా ఉతకడం దీని ప్రత్యేకత. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ మినీ వాషింగ్ మెషీన్‌ను ఇంట్లోనే కాదు... ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, క్యాంపింగ్‌లకు కూడా వెంట తీసుకెళ్లొచ్చు. ఎల్ఈడీ డిజిటల్ డిస్ప్లేతో బ్యాటరీ స్థాయి, వాషింగ్ మోడ్‌లను సులభంగా చూసుకోవచ్చు. ధర రూ. 1,600 మాత్రమే!క్షణాల్లో బట్టలు ఆరుతాయి!వానాకాలంలో బట్టలు ఉతికేయడం ఈజీ... కానీ వాటిని ఆరేయడమే అసలు తలనొప్పి! ఒక్కోసారి కుర్చీలు, తలుపులు, కిటికీలు కూడా డ్రైయింగ్ స్టాండ్‌లా మారిపోతుంటాయి. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకే వచ్చింది ఈ 360 డిగ్రీల రొటేటింగ్ డ్రైయింగ్ స్టాండ్. ఈ ఒక్క స్టాండ్‌లోనే షర్ట్లు, ప్యాంట్లు, చీరలు, టవల్స్, సాక్స్, చిన్నారుల దుస్తులు.. ఇలా ఒకేసారి చాలా బట్టలను ఆరేయొచ్చు. 360 డిగ్రీలు తిరిగే డిజైన్ ఉండటంతో స్టాండ్‌ను కదపాల్సిన అవసరం లేదు. ఒకే చోట నిలబడి అన్ని వైపులా ఉన్న బట్టలను సులభంగా అందుకోవచ్చు. గాలి అన్ని వైపుల నుంచి తగలడంతో బట్టలు త్వరగా ఆరిపోతాయి. బట్టలు తీసేసిన తర్వాత ఈ స్టాండ్‌ను మడిచి మూలన పెట్టేస్తే చాలు. పెద్దగా స్థలం కూడా ఆక్రమించదు. బాల్కనీ, బాత్రూమ్, టెర్రస్, యుటిలిటీ ఏరియా... ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. ధర రూ. 2,500. -
కథ: నిజమైన నాయకత్వం!
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా శక్తిమంతమైనది, కానీ శక్తికి మించిన గర్వం దాని సొంతం. ప్రతిరోజూ ఉదయాన్నే ఆ సింహం చేసే భయంకరమైన గర్జనలకు అడవిలోని చెట్లు సైతం వణికిపోయేవి. ‘ఈ అడవికి నేనే సర్వాధికారిని, నా మాటే వేదవాక్కు’ అని అది విర్రవీగుతూ, మిగిలిన జంతువులను చులకనగా చూసేది. జంతువులన్నీ దాని నీడ కనిపిస్తేనే ప్రాణభయంతో చెల్లాచెదురైపోయేవి.ఒక మధ్యాహ్నం మండుతున్న ఎండలో ఒక ఏనుగు చెరువు దగ్గర ప్రశాంతంగా నీళ్లు తాగుతోంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన సింహం, ఏనుగును చూడగానే అహంకారంతో ఊగిపోయింది. ‘ఓయ్ నల్ల బండా! నా దారికి అడ్డుగా నిలబడతావా? నేనెవరో తెలుసా? వెంటనే ఇక్కడి నుండి తప్పుకో!’ అని గర్జించింది. ఏనుగు చాలా సంస్కారవంతురాలు కాబట్టి, ఎంతో వినమ్రంగా ‘క్షమించు రాజా, దాహం వేసి ఇప్పుడే వచ్చాను, నీళ్లు తాగి వెళ్ళిపోతాను’ అని బదులిచ్చింది. కానీ సింహం శాంతించలేదు, ‘క్షణంలో నా కంట పడకుండా వెళ్ళిపోకపోతే నీ అంతం చూస్తాను’ అని హెచ్చరించింది. ఏనుగు ఏమీ మాట్లాడకుండా, ఆ గర్విష్టి సింహానికి తలవంచి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది.మరుసటి రోజు అడవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్మి, భయంకరమైన తుఫాను మొదలైంది. ఉరుములు, మెరుపుల ధాటికి అడవి అంతా అతలాకుతలమైంది. పెనుగాలికి ఒక భారీవృక్షం వేళ్లతో సహా పెకలించుకుపోయి, సరిగ్గా గుహ బయట ఉన్న సింహం మీద పడింది. ఆ బరువుకు సింహం కింద పడిపోయి, కదలలేని స్థితికి చేరుకుంది. ‘ఎవరైనా కాపాడండి! చనిపోతున్నాను!’ అని ఎంత ఆక్రందన చేసినా, దాని గర్వానికి భయపడి ఏ జంతువూ దరిదాపుల్లోకి రాలేదు.అదే సమయంలో అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటి సింహం పడుతున్న యాతనను చూసి చలించిపోయింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్లి, ఆ భారీ చెట్టును పక్కకు జరపడానికి తన శక్తినంతా ధారపోసి ప్రయత్నించింది. కానీ ఒక్క ఎలుగుబంటి వల్ల అది సాధ్యం కాలేదు. అప్పుడు ఎలుగుబంటికి ఏనుగు గుర్తుకు వచ్చింది. సింహం చేసిన అవమానాన్ని మరచిపోయి, అడవి రాజు ప్రాణాలు కాపాడమని ఏనుగును వేడుకుంది. ఏనుగు క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి చేరుకుని, తన బలమైన తొండంతో ఆ భారీ వృక్షాన్ని ఒక్క ఊపున పక్కకు విసిరేసింది.ప్రాణాలు దక్కించుకున్న సింహం కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘గజరాజా! నిన్న నిన్ను అంతగా అవమానించినా, నా ప్రాణాలు ఎందుకు కాపాడావు?’ అని పశ్చాత్తాపంతో అడిగింది. అప్పుడు ఏనుగు చిరునవ్వుతో ‘రాజా! ఇతరులను భయపెట్టడం అధికారం కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన శక్తి’ అని హితవు పలికింది. ఎలుగుబంటి కూడా తోడై ‘ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు’ అని వివరించింది. ఆ మాటలతో సింహం అహంకారం పూర్తిగా నశించిపోయింది.అయితే, అడవిలో శాంతి నెలకొంటున్న తరుణంలో ఒక కొత్త ముప్పు పొంచి వచ్చింది. కొంతమంది వేటగాళ్లు అత్యాధునిక ఆయుధాలతో అడవిపై దాడి చేయడానికి సరిహద్దుల్లో తిష్ట వేశారు. గతంలో అయితే సింహం ఒంటరిగా వెళ్లి వారితో పోరాడి గాయపడేది, కానీ ఇప్పుడు అది ఏనుగు, ఎలుగుబంటితో కలిసి యుద్ధ తంత్రాన్ని రచించింది. పక్షులు ఆకాశం నుండి వేటగాళ్ల కదలికలను గమనించాయి, కోతులు చెట్లపై నుండి రాళ్లు రువ్వాయి, ఎలుగుబంటి తేనెటీగల గుంపును వారిపైకి ఉసిగొల్పింది. చివరగా సింహం, ఏనుగులు కలిసి చేసిన మెరుపు దాడికి వేటగాళ్లు ప్రాణభయంతో అడవి విడిచి పారిపోయారు.అడవిలో మునుపెన్నడూ లేని ఐక్యత కనిపించింది. సింహం తన గర్వాన్ని వదిలి, ఏనుగును తన మంత్రిగా, ఎలుగుబంటిని రాజ్య వైద్యుడిగా నియమించుకుంది. ప్రతి జంతువు సమస్యను స్వయంగా విని పరిష్కరించే నాయకుడిగా సింహం పేరు తెచ్చుకుంది. అడవిలో క్రూరత్వం పోయి అనురాగం పెరిగింది, బలహీనమైన జంతువులకు రక్షణ దొరికింది. శక్తికి వివేకం తోడైతే, అధికారం సేవగా మారితే ఎంతటి మార్పు వస్తుందో తెలుసుకుంది సింహం.- ముద్దు హేమలత -
Health: నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా?
నా వయస్సు 22 సంవత్సరాలు. నాకిప్పుడు ఏడోనెల. ఇటీవల పరీక్ష చేయించుకుంటే రక్తపోటు ఎక్కువగా ఉందని డాక్టర్ చెప్పారు. మందులు కూడా వాడమన్నారు. ఈ సమస్య వల్ల నాకు లేదా నా బిడ్డకు ఏమైనా ప్రమాదమా? ఈ మందులు గర్భంలో సురక్షితమేనా? – చైత్ర, మంచిర్యాల.గర్భధారణ సమయంలో మొదటిసారిగా అధిక రక్తపోటు రావడాన్ని ‘ప్రీఎక్లాంప్సియా’ అంటారు. సాధారణంగా రక్తపోటు ‘140/90 ఎమ్ఎమ్హెచ్జీ’ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు దీనిని అనుమానిస్తారు. కొంతమందిలో దీనితో పాటు మూత్రంలో ప్రొటీన్ కనిపించడం, రక్తపరీక్షల్లో మార్పులు లేదా కాలేయం, మూత్రపిండాల పనితీరులో లోపాలు కూడా ఉండవచ్చు. కొన్ని పరిస్థితుల్లో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చడం, చాలా చిన్న వయస్సులో లేదా ఎక్కువ వయస్సులో గర్భం ధరించడం లేదా గత గర్భంలో అధిక రక్తపోటు వచ్చినా, కవల పిల్లలు గర్భంలో ఉన్నా, గర్భానికి ముందే రక్తపోటు లేదా మధుమేహం ఉన్నా, అధిక బరువు ఉన్నా లేదా సంతానలేమి చికిత్సల ద్వారా గర్భం దాల్చినా ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా 20 వారాల తర్వాత ప్రారంభమవుతుంది. ఎక్కువగా మూడో త్రైమాసికంలో కనిపిస్తుంది. అరుదుగా ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు కూడా రావచ్చు.చాలామంది గర్భిణీల్లో ఈ సమస్యకు మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణ గర్భధారణ పరీక్షల్లోనే ఇది బయటపడుతుంది. అయితే కొందరిలో అకస్మాత్తుగా బరువు పెరగడం, శరీరం మొత్తం వాపు రావడం, స్కానింగ్‌లో బిడ్డ ఎదుగుదల తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు. అయితే కొందరిలో తీవ్రమైన తలనొప్పి, చూపు మసకబారడం లేదా వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం, వాంతులు, ముఖం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా వాపు రావడం, మూత్రం తగ్గిపోవడం, కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి, తీవ్రమైన పరిస్థితుల్లో మూర్ఛలు (సీజర్లు) రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.ప్రీఎక్లాంప్సియా నిర్ధారణ అయితే రక్తపోటును నియంత్రించేందుకు మందులు అవసరం అవుతాయి. సాధారణంగా ‘లాబెటాలోల్’లేదా ‘నైఫెడిపిన్’ వంటి మందులు గర్భధారణలో సురక్షితంగా పరిగణించబడతాయి. వైద్యుడి సూచన మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. స్వయంగా మందులు ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకూడదు. గర్భధారణ ప్రారంభ దశలో చేసిన ఎన్ టీ స్కాన్, ఇతర రక్తపరీక్షల ఆధారంగా ప్రీఎక్లాంప్సియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తిస్తే, నివారణ కోసం కొంతమందికి తక్కువ మోతాదులో మందును సూచిస్తారు.ప్రీఎక్లాంప్సియాను నిర్లక్ష్యం చేస్తే తల్లికీ, బిడ్డకీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో రక్తపోటు మరింత పెరగడం, మూర్ఛలు రావడం, కాలేయం లేదా మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, ముందస్తు ప్రసవం లేదా అత్యవసర శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చు. బిడ్డలో ఎదుగుదల తగ్గిపోవడం, గర్భాశయంలో నీటి పరిమాణం తగ్గడం, ముందుగానే పుట్టడం లేదా పుట్టిన తర్వాత కొంతకాలం ప్రత్యేక సంరక్షణ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు.అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి, రక్తపోటును నియంత్రిస్తూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ, బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకే గర్భధారణ సమయంలో ప్రతి పరీక్షను సమయానికి చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడటం, తలనొప్పి, చూపు మసకబారడం, శరీరం ఎక్కువగా వాపు రావడం లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. సరైన సమయంలో గుర్తించడం, సరైన చికిత్స తీసుకోవడం, నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉండడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందకుండా మీ వైద్యుల సూచనలు తప్పకుండా పాటించండి.- డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
భయం అంచులో...
కర్పూరవల్లి ఏర్ ఇండియా విమానం దిగి న్యూయార్క్ ఏర్పోర్ట్కి చేరుకున్నాక, ఇమిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కేరసోల్ దగ్గరకి వెళ్ళింది.ఓ కుక్క కిందకి దింపిన సూట్‌కేస్‌లను వాసన చూడటం గమనించింది. ఆ కుక్క ఆవిడ సూట్‌కేస్ దగ్గరకి వచ్చి వాసన చూసి, ఓదాని మీద ముందు కాళ్లు ఉంచి నిల్చుంది. వెంటనే యూనిఫాంలోని సెక్యూరిటీ గార్డ్ తన జేబులోంచి ఏదో తీసి ఆ కుక్క నోటికి అందించి దాన్ని నిమిరాడు. ఆవిడ అతన్ని నవ్వుతూ చూస్తూ అడిగింది.‘‘నైస్ డాగ్. వాట్స్ హిజ్ నేమ్?’’‘‘ఈ రెండు సూట్‌కేసులు మీవేనా?’’ అతను కర్పూరవల్లిని అడిగాడు.‘‘అవును.’’‘‘మీ సూట్కేసులని మీరే పేక్ చేసారా?’’‘‘అవును. నేనే.’’‘‘ఈ సూట్‌కేసుల్లో ఏమేం ఉన్నాయో మీకు గుర్తుందా?’’ అతని తర్వాతి ప్రశ్న.‘‘ఉంది. నా బట్టలు, మందులు, బహుమతి వస్తువులు.’’‘‘మీరు నా వెంట రావాలి.’’ అతను ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పి ఎడమ భుజం దగ్గరున్న వైర్లెస్ సెట్లో ఎవరికో ఏదో చెప్పాడు.కొద్ది క్షణాల్లో యూనిఫాంలోని ఇద్దరు సెక్యూరిటీ పోలీసులు ట్రాలీతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆవిడ సూట్‌కేసులను జాగ్రత్తగా ట్రాలీ మీదకి ఎక్కించి నడిచారు.‘‘నాతో రండి.’’ ఆ గార్డ్ ఆవిడతో చెప్పాడు.‘‘ఎందుకు?’’ ఆవిడ అతని వెంట నడుస్తూ అడిగింది.అతను ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ‘ఇ¯Œ స్పెక్షన్’ అని రాసున్న తలుపులోంచి లోపలికి తీసుకెళ్ళాడు.‘‘మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?’’ లోపల కూర్చున్న ఓ అధికారి ప్రశ్నించాడు.‘‘అవును.’’‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు?’’‘‘నా కూతురితో గడపడానికి. మీరీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?’’ కర్పూరవల్లి ప్రశ్నించింది.అక్కడికి మరొక కుక్కని తెచ్చారు. అది కూడా సూట్‌కేసుల చుట్టూ తిరిగి ఇందాకటి సూట్‌కేస్ మీద ముందు కాళ్ళు పెట్టింది. దాని శిక్షకుడు కూడా దానికి బహుమతిగా తినడానికి డాగ్ బిస్కెట్ ఇచ్చి, దాన్ని దువ్వి తీసుకెళ్ళిపోయాడు. ఆవిడకి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడింది.‘‘మీకు ఏదైనా టెర్రరిస్ట్ సంస్థ మీద సానుభూతి ఉందా?’’ ఆ అధికారి ప్రశ్నించాడు.‘‘లేదు.’’ ఆవిడ తుళ్ళిపడి జవాబు చెప్పింది.గార్డ్ ఆవిడ హేండ్‌బేగ్‌ని తీసుకుని అందులోని వస్తువులన్నీ బల్ల మీద పోశాడు.‘‘ఈ సూట్‌కేస్‌లో మీరు ఏం తీసుకొస్తున్నారు? అంగీకరిస్తే తక్కువ శిక్ష పడుతుంది. మా అంతట మేమే కనుక్కుంటే శిక్ష పెరుగుతుంది.’’ అధికారి చెప్పాడు.‘‘శిక్షా? బయటే ఉంటాడు. మా అల్లుడికి ఫోన్ చేస్తాను.’’ కర్పూరవల్లి భయంగా చెప్పింది.‘‘తర్వాత. నా ప్రశ్నకి జవాబు చెప్పండి.’’‘‘నేనే నిషిద్ధ వస్తువులు తీసుకురాలేదు.’’ ఆవిడ భయంగా చూస్తూ చెప్పింది.ఇద్దరు గార్డ్లు ఆ సూట్‌కేసులు తెరిచి ఒక్కొక్క సామాను బయటకి తీయసాగారు. ప్రతి డ్రెస్ లైనింగ్ తడిమి, లోపల ఏదైనా ఉంచి కుట్టారా అని తనిఖీ చేయసాగారు. కర్పూరవల్లి భయంగా, ఆశ్చర్యంగా జరిగేది చూస్తోంది.ఆవిడ మొబైల్ తీసుకుని పాస్వర్డ్ అడిగి తెరిచి, అందులోని కాంటాక్ట్ నంబర్లలోని వారి పేర్లు ఒకొక్కటీ అడిగి వారు ఏమవుతారు అని ప్రశ్నించాడు. అవన్నీ ఇండియాలోని పేర్లు. కొన్ని పేర్లు అతనికి నోరు తిరగలేదు కూడా. ఆవిడలో భయం అధికం అవసాగింది. వాళ్ళు వెతుకుతూంటే అధికారి ఆవిడని ప్రశ్నించసాగాడు.‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు? మీ అల్లుడు ఏం చేస్తూంటాడు? మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇదివరకు ఎప్పుడైనా అమెరికాకి వచ్చారా? మీరు వచ్చిన పని ఏమిటి? ఇండియాలో ఏం చేస్తూంటారు?’’చివరికి ఆ పెట్టెలో వారు వెతికేది కనిపించింది. వెంటనే ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.‘‘వీటిని ఎందుకు కొన్నారు?’’ ఓ గార్డ్ ఒకటి తీసి చూపిస్తూ ప్రశ్నించాడు.‘‘బహుమతిగా కొన్నాను.’’‘‘ఎవరికి?’’‘‘మా అల్లుడికి. కిందటిసారి ఇండియా వచ్చినప్పుడు అతను తెచ్చినవి వాళ్ళ స్పాటీకి బాగా నచ్చాయట. వీటిని కొని తెమ్మని మెసేజ్ ఇచ్చాడు.’’వాళ్ళు ఆ పేకెట్స్ని విప్పి క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో డ్రగ్స్ గాని, పేలుడు పదార్థాలు కాని లేవని రూఢీ చేసుకున్నాక వివిధ జాతుల కుక్కల బొమ్మలున్న డాగ్ ఫుడ్ పాకెట్స్ చూపించి నవ్వుతూ చెప్పారు.‘‘వియార్ సారీ. చిన్న పొరపాటు. మా రెండు కుక్కలు తమ ఆహారాన్ని పసికట్టాయి. మేం ఇంకేదో అని ఊహించాం.’’వాళ్ళు బయటికి తీసిన వస్తువులని లోపల ఉంచి మూత మూస్తే అది మూసుకోలేదు. అది గమనించి ఆవిడ మళ్ళీ సర్ది ఒక గార్డ్ని కోరింది.‘‘మా వారు నాతో రాలేదు. దయచేసి మీరు దీని మీద నిల్చుంటే జిప్ వేస్తాను.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మౌనం – అది అద్భుతం, వాస్తవికం!
‘రచయితలు తమకు తెలిసింది మాత్రమే రాయగలరు; అది కూడా, తమకు సహజమైన పద్ధతిలో మాత్రమే రాయగలర’న్నారు ప్రపంచ ప్రసిద్ధ చైనీస్ రచయిత మో యాన్. అది ఆయన అసలు పేరు కాదు– పెట్టుకున్న కలంపేరు. దానికి ‘మాట్లాడ వద్దు!’ అని అర్థం. మో బతికి బట్టకట్టిన వ్యవస్థలో, పాలకులకు భజన చేసేవారికి తప్ప మరెవరికీ మాట్లాడే హక్కు లేదు. నిజానికి కొద్దిపాటి మినహాయింపులతో, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ అదే పరిస్థితి నెలకొని వుందిప్పుడు! చైనా ఆర్థిక– సామాజిక– సాంస్కృతిక వ్యవస్థలోనూ అదే పరిస్థితి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది.‘ప్రజా రిపబ్లిక్’ పేరుగొప్ప, ఊరుదిబ్బగా మిగిలింది. 1980 దశకంలో, ఇందులో కొద్దిపాటి మార్పులు రాకపోలేదు– కానీ, మానవ హక్కుల కోసం ఆజన్మాంతం పోరాడిన లియూ జియావ్బో లాంటి వాళ్ళు కన్నుమూయడానికి కొద్దికాలం ముందువరకూ కారాగారంలోనే గడపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఓ రచయిత పెట్టుకోదగిన కలంపేరునే, మో యాన్ ఎంచుకున్నాడు! అంతటి విచక్షణ ఉన్నందువల్లనే 2012లో మో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోగలిగాడు. అప్పటికే ఆయన స్వదేశంలోనూ, విదేశాల్లోనూ సుప్రసిద్ధుడు!మనం నివసించే వ్యవస్థలో, చెప్పే మాటకూ చేసే పనికీ మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడిన నేపథ్యంలో రచయితలూ కళాకారులూ ఏం చెయ్యగలుగుతారు? అది రష్యాలోనైనా సరే, చైనాలోనైనా సరే, లాటిన్ అమెరికన్ దేశాల్లోనైనా సరే –మరే దేశంలోనైనా సరే– ఇలాంటి విరోధాభాస పాతుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెయ్యగలరు పాపం? అద్భుత వాస్తవికత అనే కాల్పనిక వటవృక్షం నీడలో రవంత ఊరట పొందగలుగుతారంతే! మిహయీల్ బుల్గాకఫ్ రచనల్లో చేసిందే ఆంద్రెయ్ తార్కఫ్సి్కయ్ సినిమాల్లో చేశాడు. గాబ్రియల్ గార్సియా మార్కెజ్ మెక్సికోలో చేసిందే జిగ్మండ్ స్కూజి¯Œ ‡్ష లాత్వియాలో చేశాడు. మో యాన్ అదే పని చైనాలో చేశాడు! నోరు తెరవని మౌనిగా ఉంటూనే, తను చెప్పదల్చుకున్న కథలన్నీ చెప్పేశాడు మో.చైనా చరిత్రను– ముఖ్యంగా మో యాన్ లాంటి రైతుబిడ్డల జీవితాలను– 1966 నాటి చైనా సాంస్కృతిక విప్లవం పెనుమలుపు తిప్పింది. మలుపులన్నీ మంచి వైపే తిరగాలన్న రూలేం లేదని చదువుకున్న పాఠకులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చైనా చరిత్ర చదువుకున్న వాళ్ళెవరూ, సాంస్కృతిక విప్లవం తెచ్చిపెట్టిన మార్పులన్నీ మంచివేనని అనుకోరు, అనలేరు! ఆ సంవత్సరమే మో బడి వదిలిపెట్టి మడిలోకి దిగాల్సివచ్చింది. అప్పటికి ఆయన అయిదో తరగతి చదువుతూండేవాడు. తన కుటుంబానికి సొంతమైన ఓ మడిచెక్కలో, పశువులను మేపుకుంటూ ఆరేడేళ్ళపాటు అలాగే గడిపేశాడు మో. బళ్ళో ఒంటబట్టించుకున్న అక్షరమ్ముక్కల్ని మర్చిపోకుండా వుండేందుకు మో‘షిన్ హువా నిఘంటువు’ను రోజంతా తిరగేస్తూవుండేవాడు. ఒంటరితనం శాపమే అతని పాలిట వరమైంది. తనలోకి తాను తొంగిచూసుకోగల రచయితకు పురుడుపోసిన మంత్రసాని ఆ ఒంటరితనమే! పల్లెపదాలు వింటూ పల్లెప్రజలు ఆడే బొమ్మలాటలూ, బయలాటలూ చూస్తూ పెరగడం వల్లనే మో మాటకు ఆ మట్టివాసన అంత గట్టిగా అంటుకుంది. అద్భుత వాస్తవికతను కూడా చైనా వాసులకు సొంతంచేసింది ఈ మట్టివాసనే!తనలాగే అర్ధాంతరంగా చదువులు మానేసిన మరికొందరు రైతుబిడ్డలతో కలిసి, మో యాన్ 1973లో ఓ నూలుమిల్లులో కూలిపనికి చేరాడు. అప్పటికే వాళ్ళలో కొందరికి కళలూ, సాహిత్యంలో వైవిధ్యంతో పరిచయం ఉంది. వాళ్ళ సాహచర్యం మో జీవనాన్ని మరో మలుపు తిప్పింది. విలియం ఫాక్నర్, మార్కెజ్ లాంటి అద్భుత వాస్తవిక వాదులను చదువుకున్న తరమది. మో యాన్‌కు వాళ్ళను పరిచయం చేసింది ఈ చదువుకున్న అబ్బాయిలే! చైనా ఆర్థిక వ్యవస్థను ‘సోషలిస్ట్ మార్కెట్ వ్యవస్థ’గా మార్చిన పుణ్యం కూడా ఈ చదువుకున్న అబ్బాయిలకే దక్కుతుంది. సదరు సోషలిస్ట్ మార్కెట్ వ్యవస్థే, చైనా పారిశ్రామిక రంగంలో స్వెట్ షాప్ విధానాన్ని ప్రవేశపెట్టిందని చరిత్ర చెప్తోంది. అది వేరే విషయం అనుకోండి!!మో యాన్ రచనల విషయానికి వస్తే, 1984లో ఆయన రాసిన ‘గాజు ముల్లంగి’, నవలిక అతనికి రచయితగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ యేడాదే, మో ‘చైనా ప్రజా విమోచన సైన్యం లలితకళాక్షేత్రం’లో చేరిన మాట నిజమే. అయితే, అతగాడు అంతకు ముందునుంచీ రాస్తూవున్న మాటా నిజమే! మరో రెండేళ్ళకు మో రాసిన ‘ఎర్రజొన్నలు’ నవల సంచలనాన్ని రేకెత్తించింది. కాలక్రమంలో నడవని ఈ కథను, ఓ గొర్రెల కాపరి కుర్రాడు చెప్తాడు. అది రచయితేనని విమర్శకుల నమ్మకం.ఈ నవలను మూలకథగా చేసుకుని జ్షాంగ్ యిమో దర్శకత్వంలో రూపొందిన సినిమాకు బర్లినాల్ (బర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం)లో గోల్డెన్ బేర్ పురస్కారం దక్కింది. ఈ రెండు రచనలకూ మధ్యలో మో ‘ఆనందం’ అనే నవలిక రాశాడు కానీ, అది పాలకుల కన్నెర్రకు గురైంది. అలాగే, 1987లో చైనా మార్కెట్లను ముంచెత్తిన వెల్లుల్లి సంక్షోభాన్ని ఇతివృత్తంగా తీసుకుని మో ‘వెల్లుల్లి వీరగాథ’ అనే నవల రాశాడు. పాలకులు ఈ రచనను– మొదట్లో– చూసీ చూడనట్లు వదిలేశారు. తీరా 1989లో తియానాన్మెన్ స్క్వేర్ అణచివేత నేపథ్యంలో ‘వెల్లుల్లి వీరగాథ’ నవలను నిషేధించారు. ఈ నిషేధాన్ని చైనాకు మాత్రమే పరిమితం చెయ్యడం గమనార్హం!ఇలాంటి అనుభవాలు మో యాన్‌కు మంచి పాఠమే నేర్పించాయి. దాంతో మో కాస్తో కూస్తో లౌక్యం ఒంటబట్టించుకున్నారు. 2012 మే నెల్లో యానాన్ ప్రసంగానికి నూరు ప్రతులు తయారు చేసే బృందంలో చేరి తన ‘బుడతా భక్తి’ ప్రదర్శించాడు. అంతటి లౌక్యుడికి నోబెల్ సాహిత్య పురస్కారం ఏమిటి, దేశాధ్యక్ష పదవి దక్కినా ఆశ్చర్య పడనక్కర్లేదు!- మందలపర్తి కిషోర్ -
ఏమంటావు?
‘‘వినీతా! ఓ నాలుగుసార్లు ఇంటికి రాగానే మనిషి ఎలాంటోడో తెల్సిపోడు...’’ అంటూ కూతురుకు ఇంకేదో చెప్పబోయాడు. తండ్రి మాటలకు అడ్డు పడుతూ వినీత, ‘‘డాడీ! ప్రాక్టికల్‌గా ఆలోచించు. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసే కాలం కాదిది. సుదీప్ నాకు ఇంజనీరింగ్ నుంచి తెలుసు. హాలిడేస్‌లో తప్ప మేము కలవని రోజులు తక్కువే. చివరి సెమిస్టర్‌లోనే మాది స్నేహం కాదు, ప్రేమ అని గ్రహించాం. చదువయ్యాక ఇద్దరం ఒకే కంపెనీలో ప్లేస్ కావాలనుకున్నాం. ఒకరి ఇష్టాలు ఒకరికి తెలుసు. సుదీప్ నా కన్నా ఓపికవంతుడు కూడా. ఒక ఇంటివారమవడం తప్ప ఏ విషయంలోనూ మేం తక్కువ లేము. ఇంత పాజిటివ్‌నెస్‌ని వదిలి తెలియని ముఖాన్ని పెళ్లి చేసుకుని బతికే అవసరం నాకేముంది!’’ అంది. తండ్రీ కూతుళ్ల సంవాదం వినేందుకు భానుమతి పిల్లిలా హాల్లోకి వచ్చింది. భర్తను కూతురు నిలదీయడం చూస్తుంటే ఆమెకు లోలోపల ఎందుకో కొత్త కొత్తగా, ఆత్మతృప్తిగా ఉంది. మరి ఆయనకెలా ఉందో! గయ్యిమని లేస్తే ఎలా అనుకుంటూ కూతురు వైపు ‘నాన్నతో ఇంత వాదన పెట్టుకుంటావా’ అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది.నేలకేసి చూస్తూ ఆలోచనలో ఉన్నాడు సుగుణారావు. ‘ఎదిగిన కూతురు మాట వినాలా, నేను చూసిన వాణ్ణే పెళ్లి చేసుకోవాలి అని ఆంక్షలు పెట్టాలా’ అనే సందిగ్ధం ఆయన్ని పరీక్షిస్తోంది. సుగుణరావుకు జాతి పట్టింపులు ఎక్కువ. రూపురేఖలతో, పేర్లతో, మాటలతో ఎవరే ఇంట్లో పుట్టారో చెప్పగలడు. ఇదే అదునుగా తల్లి సమక్షంలోనే దాని క్లారిటీ కూడా ఇచ్చేస్తే ఓ పనైపోతుంది అనుకుంది వినీత.‘‘అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకి వచ్చాక క్యాస్ట్ ఫీలింగ్ చాలా తగ్గింది డాడీ! మా క్లాస్మేట్స్, బ్యాచ్‌మేట్స్ ఎందరో కాలేజీలో ప్రేమించుకొని, జాబ్స్ వచ్చాక పెళ్లి చేసుకున్నారు. హాయిగా ఉంటున్నారు. ఇప్పటికి వాళ్ళు ఫ్రెండ్సా, మ్యారీడ్ కపుల్సా అన్నట్లు ఉంటారు. లక్కీ ఫెలోస్ కదా!’’ అంది భుజాలు ఎగరేస్తూ. వినీత మాటల ఘాటుకు మారిన సుగుణారావు బాడీ లాంగ్వేజీని గమనించినా, భానుమతికి ఎందుకో లేవాలనిపించలేదు. కూతురు ముచ్చట్లు ఆమెకు చాలా ముచ్చటగా ఉన్నాయి. వినీత ఇలాగే ఇంకా మాట్లాడితే బాగుండు అనుకుంది. కూతురు వాదన బేషుగ్గా ఉన్నా, నోరిప్పి ఓ మాట చెప్పే సాహసం మాత్రం తనకు చేతనవడం లేదు. ఉండబట్టలేక ‘మీ నాయన పోజు చూశావా’ అన్నట్లు కూతుర్ని చూస్తూ కళ్లతో సైగ చేసింది. భర్త అంటే భయం, బిడ్డ అంటే ప్రేమ– ఆమెకు రెండూ అపారమే! తండ్రీ కూతుళ్ల వాదన గాలివానలా కావద్దని ఉందామెకు. ఇద్దరి మధ్యన ఖాళీ త్రాసును సమానంగా పట్టుకొన్న న్యాయదేవతలా ఉంది తన పరిస్థితి.తండ్రి తల పైకెత్తకపోవడంతో వినీత ముక్తాయింపుగా ‘‘ఏదేదో ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి డాడీ! కాలం మారుతోంది. మనమూ మారాలి అంతే. లేకుంటే పాచిపోతాం!’’ అంది. కిచెన్‌లోకి వెళ్లకుండా, ఇంకేమంటుందా అన్నట్లు కూతురు ముఖంలోకి ఆశగా చూస్తున్న భానుమతిని గమనించిన సుగుణారావుకు ఒళ్ళు మరింత మండింది. అసహనంతో మీ ఇద్దరికీ ఇదే నా సమాధానం అన్నట్లు హాల్లోంచి లేచి ముందు గదిలోకి వెళ్ళాడు. ముఖంలో వెనుకడుగు ఛాయలు కనబడకుండా చదివిన పేపర్‌నే తీసి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. భర్త తప్పుకోవడం చూసి భానుమతి వంటగది వైపు నడిచింది. ఎదిగిన ఆడపిల్ల మాటలే తల్లులకు కొండంత బలం అన్నట్లుగా ఉంది ఆమె నడక తీరు. అదే రూపం సుగుణారావుకు మరోలా కనబడింది. తల్లీ కూతుళ్లు ఒకరిపై ఒకరు నిలబడి తన కన్నా పొడుగైనట్లు తలెత్తి చూశాడు ఆమె వైపు.తండ్రితో ‘ఊ’ అనిపించడమెలాగో అర్థం కాక సోఫాలో అలాగే జారగిలబడి మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది వినీత. కొద్దిసేపు వాట్సాప్ మెసేజ్‌లు చూశాక ఒక్కసారిగా ‘‘మమ్మీ! నూన్ షోకి టికెట్స్ బుక్ అయ్యాయంట. లంచ్ చేసి నేను బయటికెళ్లాను’’ అంటూ మెట్లెక్కి పైనున్న బెడ్ రూంలోకి వెళ్ళింది.3 ఊర్లో వ్యవసాయం, రైస్ మిల్ నడిపిన సుగుణరావు రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా కూడా చేశాడు. మారిన రాజకీయ పరిస్థితులు, యువనేతల జోరుకు తట్టుకోలేక పదవులకు దూరం జరిగాడు. అమెరికాకు వెళ్లిన కొడుకు ఎం.ఎస్. చేసి, అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కూతురుని చదివించి, మంచి ఇంటికి ఇచ్చి హాయిగా కాలం గడపాలని అనుకున్నాడు. అసలు ఊరు దాటాలనే ఆలోచనే ఆయనకు లేకుండేది. ఇంజినీరింగ్ చదువులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా వలసలు కలగలిపి ఆయన్ని నగరానికి సుడిగాలిలా నెట్టుకొచ్చాయి. ఊరికి రాకపోకలు సాగక భూమిని కౌలుకి, మిల్లును లీజుకు ఇచ్చి పిల్లలు చెప్పినట్లు రింగు రోడ్ పక్కన ఓ విల్లా కొనేసి బతుకును అందులో దించేశాడు. కాలం గడుస్తుంటే ఊరును తాను పట్టించుకోవడం మానేశాడా, లేక అక్కడి వాళ్లే తనను లెక్కలోంచి తీసేశారా అనే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఊరే మారింది. తనలా అంతో ఇంతో స్తోమత ఉన్నవారు పిల్లల వెంట వచ్చి హైదరాబాద్ చుట్టూ వాలిపోయారు. ఈ కాలం పిల్లలు జీవిత నిర్ణయాల్లో తల్లిదండ్రుల్ని వెనక్కి నెట్టేస్తున్నారని పొద్దునే బంధువు హనుమంతరావు నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తో అర్థమై చికాకును మరింత పెంచింది.ఊర్లో ఉన్న రోజుల్లో సుగుణరావు తన కూతుర్ని హనుమంతరావు కొడుక్కి ఇవ్వాలని అనుకునేవాడు. పిల్లాడు ఎక్కడ జారిపోతాడోనని ముందు జాగ్రత్తగా వారి కుటుంబానికి స్పెషల్ గౌరవమర్యాదలు ఇచ్చేవాడు. పక్కన పట్టణంలో మెడికల్ షాప్ ఉన్న హనుమంతరావు– ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా మొదలుపెట్టి నాలుగు లారీలు కొన్నాడు. చదువు వంటబట్టని ఆయన కొడుకు వ్యాపారం చూసుకుంటూ, ఎవరు భూమి అమ్మినా కొని ఆస్తులు పెంచుతున్నాడు. ఎప్పుడు ఊరికి వచ్చినా, పెద్ద కార్లో అమ్మా నాన్నలను వేసుకొని హంగామా చేసేవాడు. ఆ కారులో ఆయన పక్కన తన కూతురు కూచుంటే చూడాలని సుగుణరావు ఎన్నో కలలు కన్నాడు. తన నిర్ణయం సరైనదని గట్టిగా నమ్మాడు. తలవంచి తన నిర్ణయం వినవలసిన కూతురు ఇప్పుడు తనకే ఏదో తెలియంది నేర్పుతున్నట్లు, మీరీకాలంలో లేరన్నట్లు మాట్లాడుతుంటే జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇదే ఊర్లోనయితేనా వినీతని, భానుమతిని కలిపి చెడామడా తిట్టేవాడు. కోపం తగ్గకపోతే అమ్మాయిని పెంచే విధానమిదేనా అని భానుమతిపై లేచేవాడు. అదేదీ సాగేట్లు లేదు. కుబుసం వదిలినట్లు తనలోంచి ఊరు సుగుణరావు వెళ్ళిపోతున్నట్లు ఆయనకే తెలుస్తోంది. మరోవైపు అమ్మాయి వాలకం చూస్తుంటే ‘నీవు ‘ఊ’ అన్నా అనుకున్నా, ఆ పిల్లాడితో ఎగిరిపోతాను’ అన్నట్లుంది. సిటీ గాలికి ఇలా నిమిత్తమాత్రుడిని అవుతానని ఆయన కలలో కూడా ఊహించలేదు. ఇంతలో అమ్మాయి మెట్లు దిగుతున్న చప్పుడు విని, పేపర్‌ను మరింత ముఖం మీదికి జరుపుకున్నాడు. డైనింగ్ టేబుల్ పైనున్నవి పళ్లెంలో వేసుకొని, గబగబా తింటున్న వినీత పక్కనే ఉన్న ఫోను రింగయింది.‘‘ఇదిగో.. వచ్చేస్తున్నా!’’ అంటూ లేచి, చేయి కడుక్కుని ఇద్దరినీ ఉద్దేశించి ‘బై బై’ చెప్పి బయటపడింది. ఆ లోపే విల్లా ముందు కారు ఆగిన చప్పుడైంది. పేపర్ పక్కకు జరిపి సుగుణరావు కారు వైపు చూశాడు. డ్రైవింగ్ సీట్లో సుదీప్ కనబడ్డాడు. వినీత ఆ వైపు నుంచి వెళ్లి కార్లో అతని పక్కన కూచుంది. ఒకవైపు వినీత తీసుకుంటున్న స్వేచ్ఛ గుచ్చుకుంటుంటే, మరోవైపు పొద్దునే ఫోన్లో హనుమంతరావు ‘మావాడు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దంటున్నాడు. జాబ్ మాన్పిస్తావా?’ అన్నమాట ఆయన్ని పూర్తి తికమకలో పడేసింది. తన ప్రశ్నకు సుగుణరావు నోట మాట రాకపోవడంతో జవాబు దొరికినట్లు హనుమంతరావు ఫోన్ పెట్టేశాడు. పరాభవంతో ‘ఛీ’ అనుకున్నాడు. తాను కట్టుకున్న ఆశాసౌధాలు కూలిపోతుంటే, మరోదారి లేక కూతురి కలల హర్మ్యాల్లోకి వెళ్లే తప్పనిసరి పరిస్థితికి సిగ్గనిపిస్తోంది. తన కన్నా తెలివి గల భార్య అని తెలిసినా కంటిచూపుతో నోరు మూయించినట్లు కూతురిని అదిమి పెట్టేందుకు తన అస్త్రాలు సరిపోవడం లేదు. పైగా కూతురు మాటలు చూస్తుంటే అన్ని నిర్ణయాలూ తీసుకుని, కేవలం ఆమోదముద్ర కోసం వేచి చూస్తున్నట్లు ఉన్నాయి.భార్య భోజనానికి పిలవగానే మౌనంగా తినేసి పైనున్న బెడ్ రూంలోకి వెళ్ళిపోయాడు. మెట్లెక్కుతున్న భర్త ఎప్పుడూ అంత నెమ్మదిగా కదలలేదు. ఎందుకోగానీ ఆయనలో ఈ కుంగుబాటు భానుమతికి బాధను కలిగించలేదు. నాన్న మాట వినమని కూతురుకు చెప్పాలని అనిపించలేదు. తలెత్తి ఆయన్నే చూస్తున్న ఆమె కళ్ళలో ఒక వెలుగురేఖ, ముఖంలో ఒక గెలుపు ఛాయ వాటంతట అవే వచ్చాయి. వాటిని ఆమె కూడా గమనించినట్లే లేదు. భర్త తిన్న పళ్లెం ముందుకు జరుపుకొని అన్నం కలుపుతుంటే భానుమతికి తన పెళ్లి రోజులు కళ్ల ముందుకొచ్చాయి. జీవిత భాగస్వామి ఎంపికలో వినీత సొంత నిర్ణయం చూస్తుంటే తన పెళ్లి విషయంలో తాను రాజీ పడక తప్పనిస్థితి గుర్తుకొస్తోంది.భానుమతి రంగు, ఎత్తు తక్కువుండే సాధారణ స్త్రీ. చదువుకొనే రోజుల్లో ఆమెను ఎవరూ పట్టించుకొనేవారు కాదు. వాటిని అధిగమించేలా పట్టుబట్టి డిగ్రీలో కాలేజీ టాపర్‌గా నిలిచింది. తన ప్రతిభను నిరూపించుకునేలా ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆకాంక్షను ఇంట్లోవారు ముందుకు సాగనీయలేదు. ఎదిగిన పిల్ల పెళ్లే పరమావధిలా ఇంట్లో ఒకటే సంబంధాల వెదుకులాట. పెళ్లి చూపుల ఏర్పాట్లు వరుసగా కొనసాగేవి. ఉద్యోగులెవ్వరూ భానుమతిని ఇష్టపడలేదు. ‘ఇక ఈ పిల్లనెవరు చేసుకుంటారు’ అని తల్లిదండ్రులు బెంగతో ఓ మెట్టు దిగి దగ్గరి పట్టణాల్లో ఏదో సొంత వ్యాపారం చేసుకుని బతికే కుటుంబాల్లో ప్రయత్నించారు. పట్టణాలు కూడా అందానికే పట్టం కట్టాయి. మరో మెట్టు దిగి గ్రామాల్లో ఉన్న బంధువులతో ఆరా మొదలుపెట్టారు. ఊరు పట్టుకొని ఉండే సుగుణరావుకు నచ్చిన అమ్మాయిలు ఈయన్ని మెచ్చలేదు. వయసు దాటిపోతోందని ఇంట్లోవారు పోరడంతో ఆయన భానుమతి మెడన మూడు ముళ్ళు వేశాడు. అప్పుడు గాని ఆమె తల్లిదండ్రుల గుండెల మీది కుంపటి చల్లారలేదు. జీవితమంటే భానుమతికి ఎన్నో ఆశలుండేవి. భర్త వెంట సినిమాలకు, షికార్లకు వెళ్లాలని కోరిక ఉండేది. పత్రికల్లో కథలు, నవలలు చదివిన యువతిగా తనకో ఊహల ప్రపంచముండేది. సుగుణరావుకు మాత్రం దాంపత్యమంటే ఒక ఆడ తోడు, ఆపై పిల్లలు, అంతే! దాన్ని దాటి ఆయనలో మరో ఏ కోణం భానుమతికి కనిపించలేదు. తన జీవితంలోకి వచ్చిన కొత్త మనిషి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలి అనే ఆలోచన లేని మనిషిని తమ తిరుపతి యాత్రతో ఆమెకు స్పష్టమైంది. పెళ్లయిన కొత్తలో భానుమతి అడిగిందేమో మైసూరు, ఊటీ... ఆయనేమో పెళ్ళయితే వెంకన్న దర్శనం చేసుకుంటామని తల్లి మొక్కినందుకు మొక్కుబడిగా తిరుపతి తీసుకెళ్ళాడు. ఇక మరో ఆలోచన లేకుండా సుగుణారావు తనపై దయతో మూడు ముళ్ళు వేసిన మహానుభావుడు అని సర్దుకుంది. పిల్లలు కలిగి, వారు పెరుగుతుంటే ఆమె ప్రపంచం మరో రూపు దిద్దుకుంది. కుటుంబం ఎదుగుతుంటే తన ఆశలన్నీ తీరినట్లుగానే తృప్తి పడుతోంది. వంట గిన్నెలు సర్దినాక భానుమతి రోజుటిలా బెడ్ రూమ్‌లోకి వెళ్ళింది. భర్త ఆ వైపు తిరిగి పడుకున్నాడు. పక్కనే నడుం వాల్చిన ఆమె ఆలోచన కూతురు వైపు వెళ్ళింది. తనలా వినీత కూడా అందగత్తె కాదు. తన నోట్లోంచి వచ్చినట్లే కాకుండా తండ్రి నలుపుని కూడా పూసుకొని వచ్చింది. అయితే ఏనాడు తానెలా ఉన్నాను, ఇలా ఎందుకున్నాను అనే భావన కూతురులో లేశమాత్రం కనిపించలేదు. బుద్ధి తెలిశాక తన రూపానికి నప్పే డిజైన్ బట్టలు, హెయిర్ స్టైల్, ఫేషియల్ పట్టింపులతో చలాకీగా అందరిలో కలిసిపోయేది. రకరకాల ఆడ మగ ఫ్రెండ్స్‌తో సినిమాలు, షికార్లకు వెళ్ళేది. వినీత ఫ్రెండ్స్లోనూ అందం చందం ఎక్కువ తక్కువ ఉన్నవారిని తను చూసింది. సినిమా యాక్టర్లలా మెరిసిపోయేవారు కూడా ఉన్నారు. విచిత్రమేమిటంటే వారిలో ఆ పొగరు, స్పృహ కనబడేది కాదు. తమ ఫ్రెండ్స్‌లో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయి ప్రపోజ్ చేశాడని వినీత చెబితే ఆశ్చర్యపోయేది. ఇంత చక్కని పిల్లాడికి ఆ అమ్మాయిలో ఏం నచ్చింది అనిపించేది. ఆ అమ్మాయి కన్నా ఫలానా పిల్ల ఇంకా అందంగా ఉంది కదా మరి ఈ పిల్లను ఎందుకు ఇష్టపడ్డాడో అర్థం కాకపోయేది. అదే ప్రశ్న వినీతను అడిగితే ‘నీకేం తెలువదు’ అన్నట్లు నొసలు కొట్టుకునేది. వినీత ఫ్రెండ్స్‌తో పాటు సుదీప్ కూడా అప్పుడప్పుడు ఇంటికొచ్చాడు. సుదీప్ ఎత్తు, చక్కని వర్చస్సు గల అబ్బాయి. కావాలనుకుంటే తనకి వినీత కన్నా అందమైన అమ్మాయి భార్యగా లభిస్తుంది. కాని వినీత అంటే అతనికి ఎంతో ఇష్టం. ఇలా అందాన్ని దాటి తనకు అర్థం కాని శక్తి ఏదో యువతను ఒక్కటి చేస్తోంది అనుకుంది భానుమతి. అది తెలివా... చదువా... సంస్కారమా... ఏదైతేనేం ఆడపిల్ల పెళ్లి అనే తతంగం గుండెలపై కుంపటి కారాదు. ఇలా కొందరికైనా పెళ్లి చూపుల గంగిరెద్దు పాత్ర తప్పుతోంది. నచ్చలేదట అనే కుంపటి రాజేసే మాటల ఊసు లేదు. నూనూగు మీసాల ప్రేమలో అందానిదే పైచేయి. అది ప్రేమ కాదు మోహమే! అయితే, పై చదువులు, ఉద్యోగాల తర్వాత వివేచనతో కూడిన భాగస్వామి ఎంపిక ఓ పరిపక్వ ప్రక్రియ. సుఖ సంతోషాలతో బతకడమే కదా ప్రేమ పరమార్థం. దాన్ని వీళ్లు సాధిస్తున్నారు. అలా సాగుతున్న ఆమె ఆలోచనలు తానేదో గెలిచినట్లు కొత్త సంతృప్తిని ఇస్తున్నాయి. వారి దాంపత్య చరిత్ర చూస్తే ఒక్కసారి కూడా సుగుణరావు ఏ విషయంలోనూ భానుమతి అభిప్రాయాన్ని తీసుకోలేదు. మంచీ చెడూ చెప్పమనలేదు. అంతా ఆయన నిర్ణయమే సాగింది. పైగా ఆమెకేం తెలుసనే అలుసు. అందుకే ఈ రోజు కూడా తండ్రి కూతుళ్ల మధ్య ఆమె మౌన సాక్షిలా ఉండిపోయింది. కనీసం అమ్మాయి నిర్ణయంపైనైనా తల్లిగా తనను ఒక్కమాటైనా చెప్పనిస్తే బాగుండు అని ఆశ పడుతోంది. నిద్ర లేచిన సుగుణరావు కిందికి వచ్చి ముందు గదిలో కూచున్నాడు. టీ తీసికెళితే తల ఎత్తకుండానే పక్కన టీపాయ్ మీద పెట్టమన్నాడు. ఆయన ముభావం చూస్తుంటే అమ్మాయిని వారించేందుకు మాట సాయం చేయలేదని తనపై కినుక వహించాడా అనే అనుమానం భానుమతికి కలుగుతోంది. అయినా వినీత నిర్ణయానికి తానెలా వ్యతిరేకంగా మాట్లాడగలదు. ఇంతకాలం ఇంట్లో అన్ని నిర్ణయాలకు మౌనమే తన భాష అయినప్పుడు దీనికి కూడా మౌనమే తనకు నచ్చిన జవాబు అనుకుంది.ఇంటి ముందు కారు ఆగిన చప్పుడయింది. వెంటనే పేపర్ తీసుకుని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు సుగుణరావు.లోపలికి వస్తూనే వినీత తండ్రి చేతుల్లోంచి పేపర్ లాక్కుంటూ, ‘‘ఇంకా పేపర్ చదవడం అయిపోలేదా డాడీ!’’ అంది నవ్వుతూ.‘లేదు’ అన్నట్లు తలాడించాడు ముభావంగా. తండ్రిని కూల్ చేసేందుకు ఆయన పక్కన కూర్చుంటూ వినీత, సుగుణరావు తలను తనవైపు తిప్పుకొని ‘‘డాడీ! మీ రోజుల్లో ఆడపిల్ల ఇంటి గడప దాటి రాలేదు. పేరెంట్స్ కూడా తిరిగి తిరిగి వరుణ్ణి వెతికే వాళ్ళు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. లోకాన్ని అర్థం చేసుకుంటున్నారు. మాకు తెలియని రోజుల్లో మా కోసం సంబంధాల్ని వెదికారు. ఇప్పుడు లైఫ్ పార్టనర్‌ను పట్టుకోవడంలో మీకన్నా మేమే ముందున్నాం. కావాలంటే బోలెడు ఉదాహరణలు ఇస్తాను. సుదీప్‌ను కాదనడానికి మీరొక్క బలమైన కారణం చెప్పండి, లేదా సంతోషంగా ఒప్పుకోండి!’’ అంది. కూతురు ఎంత మొండిగా వాదిస్తున్నా, విషయాన్ని ఎంతో ఓపిగ్గా వివరిస్తూ తండ్రిగా తనకు ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకొమ్మని సుగుణరావు మనసు గుర్తుచేస్తోంది. కూతురుతో ఇక వాదించలేక సుగుణారావు తల ఎత్తి భానుమతి వంక చూస్తూ, ‘‘ఏమంటావు?’’ అన్నాడు. ఇన్నేళ్ల బండరాయి మంచు గడ్డలా కరగడం ఇదే మొదటిసారి. ఈ ఒక్క ప్రశ్న చాలు, ఇంట్లో తానున్నానని గుర్తించడానికి. బిడ్డ భవిష్యత్తు విషయంలో తన మాటకూ విలువుందనడానికి. భర్త నోట ఆ పదాన్ని వినగానే బిత్తరపోయిన పరవశం నుండి భానుమతి కోలుకొని సరే అన్నట్లు తలాడించింది. భార్య కూడా కూతురు వైపే ఉన్నందుకు ఆయన చూపులో ఒక మెట్టు దిగిన ఓటమి కనిపించినా అది గమనించనట్లే భానుమతి నటించింది. మానై వంగుతున్న భర్తను విరక్కుండా కాపాడుకోవడం ఆమెకు తెలుసు.- బద్రి నర్సన్ -
నాన్నా! నీ డైపర్లు మార్చేవాడిని..
అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన రాన్ ప్రెస్నెల్ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడు సామ్ ప్రెస్నెల్తో ఇంట్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు హఠాత్తుగా సామ్ తన తండ్రి వైపు చూసి,‘‘డాడ్! నువ్వు నా అంత ఉన్నప్పుడు నీ డైపర్లు నేనే మార్చేవాడిని తెలుసా?’’ అన్నాడు. రాన్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. తాను తప్పుగా విన్నానేమో అని అనుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సామ్ మరిన్ని విచిత్రమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు.రాన్ తండ్రి.. సామ్ పుట్టడానికి పది నెలల ముందు 1992లో మరణించారు. సామ్ పెద్దవుతున్న కొద్దీ తన తాత జీవితానికి సంబంధించిన వివరాలను చెప్పడం చూసి రాన్ నోరెళ్లబెట్టేవాడు. ‘‘నాకు ఒక చెల్లెలు ఉండేది. కొందరు చెడ్డవాళ్లు ఆమెను చంపేసి నీళ్లలో పడేశారు’’ అని చెప్పేసరికి సామ్ తల్లిదండ్రులకు నోటమాట రాలేదు. అరవయ్యేళ్ల కిందట నిజంగానే కొందరు దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో సముద్రంలో పడేశారు.సామ్ మాటలను మొదట నమ్మని అతని తండ్రి రాన్– ఈ సంగతేంటో చూద్దామని పాత ఆల్బమ్‌ను తీశాడు. అందులో సామ్ తాతతో పాటు అతని ఈడు వయసున్న మరో 15 మంది బాలుర గ్రూప్ ఫొటో ఉంది. రాన్ ఆ ఫొటోను సామ్ ముందు పెట్టి, ‘‘ఇందులో నువ్వు ఎక్కడున్నావో చెప్పు?’’ అని అడిగాడు. సామ్ ఏమాత్రం తడుముకోకుండా అందులోని ఒక బాలుడిపై వేలు పెట్టి, ‘‘ఇదిగో, నేనే ఇక్కడ ఉన్నాను!’’ అని చెప్పాడు. అది చూసిన రాన్ ఆశ్చర్యపోయాడు.‘‘నువ్వు ఈ లోకంలోకి ఎలా వచ్చావు? ఎలా చనిపోయావు?’’ అని సామ్‌ను అడిగాడు. దానికి సామ్ చాలా సీరియస్‌గా తన తలపై గట్టిగా కొట్టుకుంటూ తీవ్రమైన నొప్పితో విలవిలలాడాడు. విస్తుపోయే నిజం ఏంటంటే, సామ్ తాత ‘బ్రెయిన్ హెమరేజ్’ కారణంగా, తలలో విపరీతమైన నొప్పితో హాస్పిటల్లో చేరి మరణించారు. సామ్ తల పట్టుకుని చూపించిన విధానం తన తండ్రి చివరి క్షణాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో రాన్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. సామ్ తను మళ్లీ పుట్టడం గురించి చెబుతూ, ‘‘నేను ఒక ద్వారం నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చాను’’ అని చెప్పాడు.సామ్ తాత తన జీవితంలో ఒక నిర్దిష్టమైన రాత్రి గురించి తన కొడుకు రాన్ తో తరచుగా చెబుతుండేవారు. ఓ రాత్రి విమానాశ్రయంలో తీవ్రమైన మంచు కురవడం వల్ల విమానాలన్నీ రద్దయ్యాయి. సామ్ తాత ఆ రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఒక చిన్న గదిలో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన దగ్గర చిన్న రేడియో, ఓ బ్రిటిష్ నవల మాత్రమే ఉన్నాయి. సామ్‌కు దాదాపు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకరోజు తండ్రితో మాట్లాడుతూ, ‘‘అమ్మానాన్నలు నన్ను ఒక గదిలో పెట్టేశారు. అప్పుడు నాకు తోడుగా ఒక రేడియో, ఒక ఇంగ్లిష్ పుస్తకం మాత్రమే ఉన్నాయి. ఆ రాత్రి నాకు చాలా బోర్ కొట్టింది’’ అని చెప్పాడు. ఈ సంఘటన రాన్ భార్యకు (సామ్ తల్లికి) కూడా తెలియదు. కేవలం తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఈ వ్యక్తిగత జ్ఞాపకాన్ని సామ్ గుర్తుచేసుకోవడం రాన్ ను పూర్తిగా మార్చేసింది.ఒకరోజు నానమ్మ సామ్ ఇంటికి వచ్చింది. అప్పుడు నాలుగేళ్ల సామ్ ఆమె దగ్గరకు వెళ్లి చాలా చొరవగా, ‘‘నువ్వు నా కోసం ఫుడ్ ప్రాసెసర్‌లో ఆ టేస్టీ మిల్క్‌షేక్ ఎప్పుడు చేసిస్తావు?’’ అని అడిగాడు. భర్త బతికున్నప్పుడు ఆమె ప్రతిరోజూ ఫుడ్ ప్రాసెసర్‌లో రకరకాల వంటకాలు చేసి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఒక చిన్న పిల్లోడు తన భర్తలా ఆ పాత వంటకం గురించి అడగడం చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వర్జీనియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ కేసును పూర్తిగా అధ్యయనం చేశారు. సామ్ కుటుంబ సభ్యులు అతని ముందు ఎలాంటి పాత విషయాలు మాట్లాడలేదని, అయినా సామ్ చెప్పిన ప్రతి విషయాలు వంద శాతం రికార్డులతో సరిపోలిందని ధ్రువీకరించారు. అయితే, సామ్‌కు ఐదేళ్లు దాటిన తర్వాత అతని గత జన్మ జ్ఞాపకాలు క్రమంగా తగ్గిపోయాయి.ఒకరోజు రాన్ మళ్లీ పాత విషయాల గురించి అడగ్గా, సామ్ నవ్వుతూ ‘‘నాకు అవేమీ గుర్తులేవు నాన్నా’’ అని చెప్పాడు. కానీ, ‘‘నేను నీకు డైపర్ మార్చాను’’ అంటూ సామ్ తన తండ్రితో అన్న ఆ మొదటి మాట– పునర్జన్మల చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకంగా మిగిలిపోయింది.- సత్యకిశోర్ -
రికార్డు... ‘కేక’
యుద్ధాల్లో పాల్గొనే వీరులు సింహనాదాలు చేసేవారని పురాణాల్లో చదువుకున్నాం. అడవిలోని సింహం గర్జిస్తే, ఆ గర్జన ఏకంగా ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. అడవి అడవంతా ప్రతిధ్వనిస్తుంది. సింహగర్జన శబ్దం 114 డెసిబల్స్ ఉంటుంది. సింహగర్జనను మించిన శబ్దంతో పెనుకేక పెట్టి ఆస్ట్రేలియన్ పెద్దమనిషి ఒకరు గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు చెందిన జోసెఫ్ మెక్గ్రాల్ బేటప్ అనే 58 ఏళ్ల వ్యక్తి ‘నౌ’ అని పెనుకేక పెట్టాడు.ఆ కేక శబ్దం 122.4 డెసిబల్స్. అతడి కేకకు దెబ్బకు గిన్నిస్ రికార్డు బద్దలైంది. అంతకు ముందు 1994లో నార్త్ ఐర్లండ్ టీచర్ అనాలీసా ఫ్లాంగన్ ఇలాగే పెనుకేక పెట్టింది. ఆ శబ్దం 121.7 డెసిబల్స్‌గా నమోదై గిన్నిస్ రికార్డుకెక్కింది. ఇన్నాళ్లకు జోసెఫ్ పెట్టిన పెనుకేక ఆ రికార్డును అధిగమించింది. రికార్డు బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో జోసెఫ్ అంత పెద్ద పెనుకేక వేశాడు గాని, ఆ తర్వాత కొద్దిరోజులు అతడి గొంతు బొంగురుపోయింది. -
అదే రక్షణ కవచం
‘ఓవర్ థింకింగ్ మానేయాలి’ అని రోజూ అనుకుంటుంది... కానీ అదే ఓవర్ థింకింగ్‌తో కొత్త కొత్త కథలు పుట్టిస్తుంది! చుట్టూ ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడితే చాలు, వాళ్లు ఆమె తదుపరి కథలో క్యారెక్టర్ అయిపోయే ప్రమాదం ఉంది. ఈ ‘సైడ్ ఎఫెక్ట్’నే తన బలంగా మార్చుకుని రచయితగా, నటిగా ప్రేక్షకులను అలరిస్తున్న షాలిని కొండేపూడి, మనతో పంచుకున్న కబుర్లు మీకోసం..నటనే నా లక్ష్యంహైదరాబాద్లోనే పుట్టి పెరిగిన నాకు డైరెక్షన్ అనేది నా కల కాదు. మొదట నటి కావాలనుకున్నాను. కాబట్టే నా కథలు నన్ను రాయిస్తున్నాయి. తర్వాత అవే నన్ను డైరెక్షన్ కూడా చేయిస్తున్నాయి. నా మొదటి లక్ష్యం నటి కావాలన్నదే ఆ తర్వాతే ఇవన్నీ వచ్చాయి. గమనించడమే నా హాబీ! నేను ఎక్కువగా మాట్లాడను. కానీ చుట్టూ ఉన్న వాళ్లను జాగ్రత్తగా గమనిస్తుంటాను. వాళ్ల మాటలు, ప్రవర్తన, చిన్న చిన్న అలవాట్లు... ఇవన్నీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. నిజజీవితంలో కనిపించే వ్యక్తులే తర్వాత నా కథల్లో, పాత్రల్లో కనిపిస్తుంటారు.అదొక సర్వైవల్ టూల్చాలామందికి నేను సరదాగా మాట్లాడతానని అనిపిస్తుంది. కానీ నిజానికి హాస్యం నాకు ఒక రక్షణ కవచం లాంటిది. జీవితంలో ఎదురయ్యే అసౌకర్యాలు, నిరాశలు, ఇబ్బందులను నవ్వుతూ ఎదుర్కోవడం నేర్చుకున్నాను. అందుకే నా కథల్లో కూడా నవ్వు వెనుక కొంచెం బాధ, బాధ వెనుక కొంచెం హాస్యం కనిపిస్తుంటాయి.నటిస్తున్నప్పుడు కూడా రచయిత నిద్రపోడుసెట్స్లో నటిస్తున్నప్పుడు కూడా నా మెదడులో ఎక్కడో ఒకచోట రచయిత మేల్కొని ఉంటుంది. ఒక్కోసారి డైలాగ్ వింటూ ‘ఇది ఇంకోలా ఉంటే బాగుండేదేమో’ అని ఆలోచిస్తుంటాను. అది కొన్నిసార్లు ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు తలనొప్పిగా కూడా మారుతుంది.లోపాలున్న మనుషులే ఇష్టంనాకు పూర్తిగా పర్ఫెక్ట్గా ఉండే పాత్రలు అంతగా ఆసక్తి కలిగించవు. తప్పులు చేసే వాళ్లు, జీవితంతో పోరాడే వాళ్లు, గందరగోళంలో ఉండే వాళ్లు... అలాంటి పాత్రలే నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ప్రేక్షకులు కూడా వాటితోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారని నేను నమ్ముతాను.అది నా సూపర్‌పవర్!నేను ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాను. కొన్నిసార్లు అది చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ అదే అలవాటు వల్ల ఎన్నో కథలు, పాత్రలు పుట్టాయి. చిన్న సంఘటన కూడా నా మెదడులో రోజుల కొద్దీ తిరుగుతూనే ఉంటుంది. చివరికి అది ఏదో ఒక కథగా మారిపోతుంది.సార్ పేరు చెప్పగానే ఓకే చెప్పా‘సింగ్ గీతం’ సినిమా సింగీతం శ్రీనివాసరావు గారిదని చెప్పగానే, అవకాశం రావడం అదృష్టంగా భావించాను. ఇక ఈ సినిమాలో నాది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. తన నమ్మకాల కోసం పోరాడే వ్యక్తిగా ఆ పాత్ర నన్ను ఆకట్టుకుంది. అందుకే ఆ పాత్ర చేయడం మరింత ఆసక్తికరంగా అనిపించింది. కొత్త ఆలోచనలతో వచ్చే సినిమాలు విజయవంతం కావాలి. కానీ అలాంటి ప్రయోగాలు చేయడానికి నిర్మాతల ధైర్యం కూడా అవసరం.కథలు అంటే లవ్! చిన్నప్పటి నుంచి కథలు అంటే ఆసక్తి ఎక్కువ. రేడియో, అడ్వరై్టజింగ్, రైటింగ్, సినిమాలు.. ఇలా మాధ్యమం ఏదైనా, నిజాయితీగా చెప్పే కథలే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటాయి.సినిమాలే నా బెస్ట్ థెరపీకాస్త ఖాళీ దొరికితే సోలో ట్రిప్స్ వేయటం లేదా ఇంట్లో కూర్చుని వరుసగా సినిమాలు చూడడానికే ఇష్టపడతాను. ఆ సమయమే నన్ను మళ్లీ రీచార్జ్ అయ్యేలా చేస్తుంది. -
సోషల్ మీడియా డైట్ మేనియా
‘మొలకెత్తిన గింజలు తినండి... జబ్బులన్నీ పరార్’‘చిరుధాన్యాలు తినండి... చిటికెలో ఆరోగ్యం పొందండి’‘రోజూ పాతిక గుడ్లు తినండి... తేలికగా బరువు తగ్గించుకోండి’‘ఆకుకూరలు తినండి.... ఆయురారోగ్యాలు పొందండి’ఇవన్నీ సోషల్ మీడియాలో మార్మోగిపోయే మాటలు. యూట్యూబ్ తెరిచినా, ఇన్‌స్ట్రాగ్రామ్ తెరిచినా ఉచిత ఆరోగ్య, ఆహార సలహాలతో ఊదరగొట్టే మహానుభావులు కనిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటనే దానిపై వీరెవరికీ ఏకాభిప్రాయం ఉండదు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క సిద్ధాంతం. ఒకరు సంపూర్ణమైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను తినాలంటారు. ఇంకొకరు ఆకులు అలములు మొలకలతోనే అద్భుతమైన ఆరోగ్యం సాధ్యమని ప్రవచిస్తారు. మరొకరు ‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అన్నట్లుగా కొవ్వును కొవ్వుతోనే కరిగించవచ్చని నమ్మకంగా చెబుతారు.‘నా సలహా పాటిస్తే డయాబెటిస్, బీపీ దగ్గరకే రావు; మీ గుండె ఉక్కు గుండులా మారుతుంది’ అని చెబుతారొకరు. ‘నేను చెప్పే ఆహార పద్ధతిని పాటిస్తే క్యాన్సర్ కూడా పరారవుతుంది’ అని సవాలు చేస్తారొకరు. ‘నేను చెప్పిన కషాయాలు తాగుతూ, ఆకులు అలములు మొలకలు తింటే అరవైలోనూ ఇరవైలా ఉరకలేస్తారు’ అని ఢంకా బజాయిస్తారు మరొకరు. సోషల్ మీడియాలో వీళ్ల వీడియోలు చూసే జనాలు గందరగోళంలో పడుతుండటం మామూలుగా మారింది. ముందు వెనుకలు ఆలోచించకుండా, నిపుణులను సంప్రదించకుండా, సోషల్ మీడియాలో ఊదరగొట్టే ఆహారారోగ్య ప్రవాచకుల సలహాలు పాటించడం వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారు ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలను ఊదరగొట్టేవారిలో అత్యధికులు వైద్యులు కాదు. కనీసం అర్హత కలిగిన న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు కూడా కాదు. వీళ్లంతా స్వయంప్రకటిత నిపుణులు. వీళ్లలో కొందరు కేవలం తోచిన సలహాలు ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా; డాక్టర్లను, ఆధునిక వైద్యరంగాన్ని పూచికపుల్లతో సమానంగా తీసిపారేస్తూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమైనది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రబలుతోంది.థంబ్‌నెయిల్ ప్రచారాలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతుంటాయి. ఈ సలహాలు చెప్పేవారిలో చాలామందికి పోషకాహార శాస్త్రంలో గాని, వైద్యశాస్త్రంలో గాని ఎలాంటి అర్హతలూ ఉండవు. అర్హులైన వారి వీడియోల కంటే అనర్హుల వీడియోలే ఎక్కువగా సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వీటిలో దాదాపు 70 శాతానికి పైగా వీడియోలు ‘స్వయంప్రకటిత’ నిపుణులవే! సోషల్ మీడియాలో ఆహార ఆరోగ్య సలహాలు చెబుతూ వీడియోలు చేసేవారిలో అర్హులైన న్యూట్రిషనిస్టులు, వైద్యులు 30 శాతానికి లోపే ఉంటున్నారు.‘సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే ఆహార ఆరోగ్య సలహాలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు. వీటిలో ఉండేది చాలావరకు తప్పుడు సమాచారమే’ అని కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలోని మెడిసిన్ రీసెర్చ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ లీ కేహిల్ తన అధ్యయనంలో వెల్లడించారు. ‘సోషల్ మీడియాలోని వీడియోలు చూస్తూ, రకరకాల ఆహార ప్రయోగాలు చేయడం వల్ల సమస్యల బారినపడ్డ వారు చాలామంది నా వద్దకు వస్తుంటారు. సోషల్ మీడియాలో చూసే సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో తెలుసుకునే ప్రయత్నం ఎవరికి వారే చేయాలి. పోషకాహారం గురించి, ఆరోగ్య సమస్యల గురించి సాధికారికమైన సమాచారాన్ని అందించే వెబ్సైట్లు, వీడియోలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల గుండె సమస్యలతో బాధపడేవారు ఉత్తపుణ్యానికి పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నారు’ అని కెనడాలోని ఒటావాకు చెందిన రిజిస్టర్డ్ డైటీషియన్ వెరోనికా రోజ్ చెబుతున్నారు. పోషకాహారం గురించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అపోహలను తొలగించి, శాస్త్రీయంగా వాస్తవాలను వెల్లడించడానికి తాను కూడా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పెడుతున్నట్లు ఆమె తెలిపారు.‘ఇన్స్టాగ్రామ్’లో ఆహార సలహాలు ఇచ్చేవారి వీడియోల్లో దాదాపు సగానికి సగం తప్పుడు సమాచారంతో కూడుకున్నవేనని ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ (ఐపీఏఎన్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం కోసం లక్షకు పైగా ఫాలోవర్లు కలిగిన వారి ఖాతాలనే నమూనాగా తీసుకున్నారు. ‘సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చించే అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అయితే, సోషల్ మీడియా ద్వారా ఈ అంశంపై జనాలకు అందుతున్న సమాచారంలో కచ్చితత్వం, ప్రామాణికత కొరవడుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. సోషల్ మీడియా ద్వారా అర్హతలు లేకుండానే పోషకాహార, ఆరోగ్య సలహాలు ఇచ్చేవారిని కొన్ని ఫుడ్ సప్లిమెంట్ బ్రాండ్లు తమ ప్రచారం కోసం కూడా వాడుకుంటున్నాయి’ అని ఈ అధ్యయనం జరిపిన రీసెర్చ్ స్కాలర్ ఎమిలీ డెన్నిస్ తెలిపారు. సోషల్ మీడియాలో స్వయంప్రకటిత నిపుణులు ఇచ్చే ఆహార ఆరోగ్య సలహాపైన, వారు ప్రచారం చేసే ఫుడ్ సప్లిమెండ్ బ్రాండ్లపై జనాలు అప్రమత్తంగా ఉండాలని ఎమిలీ హెచ్చరిస్తున్నారు.తప్పుడు సమాచారానికి ఉదాహరణలుసోషల్ మీడియాలో ఆహార ఆరోగ్యాల గురించి ప్రమాదకరమైన స్థాయిలో తప్పుడు సమాచారం వచ్చి పడుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న తప్పుడు ప్రచారం గురించి కొన్ని ఉదాహరణలు, వాస్తవాలు...ప్రచారం: చక్కెర పూర్తిగా విషం. వాస్తవం: చక్కెర విషమేమీ కాదు. చక్కెర తక్షణ శక్తిదాయకం. పరిమిత మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల నష్టమేమీ ఉండదు.ప్రచారం: ఆల్కలైన్ వాటర్‌తో అన్నీ నయమైపోతాయి.వాస్తవం: ఆల్కలైన్ వాటర్ శరీరంలోని పీహెచ్ స్థాయిని మార్చేస్తుందని చాలామంది ప్రచారం చేస్తున్నా, ఇది పూర్తి అవాస్తవం. శరీరం తన పీహెచ్ స్థాయిని తానే నియంత్రించుకుంటుంది. ఆల్కలైన్ వాటర్ వల్ల శరీరంలోని పీహెచ్ స్థాయి అమాంతం మారిపోదు. దాని వల్ల వ్యాధులు నయం కావు.ప్రచారం: గ్లూటెన్ చాలా హానికరం.వాస్తవం: గోధుమలు, బార్లీ వంటి వాటిలో గ్లూటెన్ ఉంటుంది. వీటి పిండితో తయారు చేసే రొట్టెలు, బిస్కట్లు తదితర పదార్థాల్లో ఉండే గ్లూటెన్ కొద్దిమందికి సరిపడదు. ఈ పరిస్థితిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ అంటారు. ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ లేనివారికి గ్లూటెన్ వల్ల జరిగే హాని ఏమీ ఉండదు.ప్రచారం: ఈ ఆహారాలతో క్యాన్సర్ నయమవుతుంది.వాస్తవం: సీతాఫలం గింజలు, లక్ష్మణఫలం, పసుపు, వెల్లుల్లి వంటి పదార్థాలు క్యాన్సర్‌ను నయం చేస్తాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కొన్ని ఆహార పదార్థాలతోను, ప్రత్యేక ఆహార పద్ధతులతోనే క్యాన్సర్‌ను నయం చేయడం అసాధ్యం. క్యాన్సర్‌కు కీమో థెరపీ, రేడియో థెరపీ, ఇమ్యూనో థెరపీ వంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లకు శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది.ప్రచారం: మా డైట్ ప్లాన్‌తో వారం రోజుల్లోనే పదికిలోల బరువు తగ్గవచ్చువాస్తవం: ఎలాంటి డైట్ ప్లాన్‌తోనైనా తక్కువ వ్యవధిలో ఎక్కువ బరువు తగ్గడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అందుకు ప్రయత్నించినా, శరీరంలో పోషక లోపాలు ఏర్పడి అనర్థాలు తలెత్తవచ్చు.ప్రచారం: డీటాక్స్ డ్రింక్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేస్తాయి.వాస్తవం: నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ సహా పలు డీటాక్స్ డ్రింక్స్ లివర్, కిడ్నీల పనిని పూర్తిగా భర్తీ చేస్తాయని కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవం. ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో లివర్, కిడ్నీలు సహజంగానే డీటాక్సిఫికేషన్ చేస్తాయి. ఇవి పాడైనప్పుడు తగిన వైద్య చికిత్స తప్పనిసరి.ప్రచారం: డయాబెటిస్‌కు మందులు అక్కర్లేదు.వాస్తవం: డయాబెటిస్‌కు మందులు వాడటం అనవసరమని; వేపాకు, నేరేడు ఆకు, మెంతాకు వంటి ఆకులు తీసుకుంటే పూర్తిగా నయమవుతుందని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. కొన్నిరకాల ఆకులు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి స్వల్పంగా అదుపులోకి వచ్చినా, ఇవేవీ డయాబెటిస్ చికిత్సకు పూర్తి ప్రత్యామ్నాయం కావు.ప్రచారం: నూనెలు, నెయ్యి, ఇతర కొవ్వులతోనే ఆరోగ్య సమస్యలువాస్తవం: సమతుల పోషకాహారంలో కొవ్వులు కూడా తప్పనిసరి భాగంగా ఉండాలి. కొవ్వులను, నూనెలను పూర్తిగా మానేస్తే పోషక లోపాలు ఏర్పడతాయి. కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్ల లోపం ఏర్పడి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నూనెలు, కొవ్వులను తగిన మోతాదులో వాడాలి.ప్రచారం: ఎంత కొవ్వు తిన్నా హానిలేదు.వాస్తవం: వెన్న, నెయ్యి, కొబ్బరినూనె ఎంత తిన్నా ఏమీ కాదని, వీటితో బరువు తగ్గవచ్చని కొందరి ప్రచారం. ఇవి మితిమీరితే బరువు తగ్గకపోగా, పెరిగే అవకాశాలే ఎక్కువ. పైగా ఒంట్లో కొవ్వు మితిమీరితే అధిక బరువు మొదలుకొని గుండెజబ్బుల వరకు రకరకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ప్రచారం: కీటో డైట్‌తో డయాబెటిస్ పూర్తిగా నయమవుతుంది.వాస్తవం: కీటో డైట్ తీసుకుంటే, డయాబెటిస్ మందులతో పని ఉండదని కొందరి ప్రచారం. కీటో డైట్ వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ కొంత మెరుగుపడవచ్చు. అలాగని డాక్టర్లు సూచించిన మందులు వాడటం ఆపేస్తే పరిస్థితి విషమించే ప్రమాదాలు ఉంటాయి.తప్పుడు సమాచారం ఉచ్చులో యువతరంసోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాలకు సంబంధించిన తప్పుడు సమాచారానికి యువతరమే ఎక్కువగా ప్రభావితమవుతోందని పలు అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. తెలిసీ తెలియని స్థితిలో ఉండే 18–25 ఏళ్ల లోపు వయసువారు ఈ వీడియోల ద్వారా ప్రభావితమై, కనీసం నిపుణులను సంప్రదించకుండా రకరకాల ఆహార పద్ధతులను పాటిస్తూ ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని న్యూజీలండ్కు చెందిన ‘సెంటర్ ఫర్ న్యూట్రిషనల్ సైకాలజీ’ అధ్యయనం వెల్లడించింది.శరీరాకృతి, చర్మం తీరు, జుట్టు తీరు వంటి చిన్న చిన్న అంశాల్లో అపనమ్మకంగా ఉండే యువత సోషల్ మీడియాలో వచ్చే వీడియోల్లో చెప్పేవారి సలహాలు విని, వాటిని పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయనే భ్రమతో స్వయంగా ప్రయోగాలు చేస్తున్నారని, అకస్మాత్తుగా ఆహారపు అలవాట్లను మార్చుకుని చిక్కుల్లో పడుతున్నారని ఈ అధ్యయనం జరిపిన బృందానికి నేతృత్వం వహించిన జాక్ ఆర్.హెచ్.కూపర్ చెబుతున్నారు.‘కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థుల్లో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ఆహార ఆరోగ్య సలహాల పట్ల తేలికగా ఆకర్షితులవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటిలో వచ్చే వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు చెప్పే సలహాలు పాటిస్తే అద్భుతాలు జరిగిపోతాయని నమ్మి ఆహార పద్ధతులపై ప్రయోగాలు చేస్తున్నారు. వీడియోల్లో స్వయంప్రకటిత నిపుణులు ఊదరగొట్టే స్థాయిలో ఫలితాలు రాకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొస్తుండటంతో మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు’ అని కూపర్ వెల్లడించారు.నియంత్రణ లోపమే అసలు సమస్యపోషకాహార సలహాలు, ఆరోగ్య సలహాలు ఎవరు ఇవ్వాలనే దానిపై నియమ నిబంధనలు, నియంత్రణ లేకపోవడమే అసలు సమస్యగా ఉంటోంది. ఇతరేతర రంగాల్లో డిగ్రీలు ఉన్నవాళ్లు కూడా సోషల్ మీడియాలో స్వయంప్రకటిత పోషకాహార ఆరోగ్య నిపుణులుగా చలామణీ అవుతున్నారు. శరీరనిర్మాణ శాస్త్రం, పోషకాహార శాస్త్రం వంటి అంశాల్లో అవగాహన లేకుండానే, తాము నమ్మిన విషయాలనే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 కింద ఏర్పడిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార ఉత్పత్తులు, ఫుడ్ సప్లిమెంట్ల నాణ్యత ప్రమాణాలపై మాత్రమే నియంత్రణ కలిగి ఉంది.ఆహార ఆరోగ్య సలహాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఎలాంటి నియంత్రణ లేదు. ఆహార ఆరోగ్యాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేవారిని నియంత్రించడానికి కట్టుదిట్టమైన చట్టాలేవీ లేవు. మన దేశం నుంచి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ఆహార ఆరోగ్య అంశాలపై ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా వస్తున్న వీడియోల్లో దాదాపు 80 శాతం వరకు గుర్తింపు కలిగిన అర్హతలు లేనివారు చెబుతున్నవేనని ఒక అంచనా.ఇలాంటి వీడియోలు రూపొందిస్తున్న వారిలో ఆధునిక వైద్యంలోను; ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురోపతి తదితర వైద్య విధానాల్లోను; న్యూట్రిషన్, డైటెటిక్స్ విధానాల్లోను డిగ్రీలు కలిగిన వారు సుమారు 20 శాతం వరకు మాత్రమే ఉంటున్నారు. అయితే, అర్హతలు లేనివారి వీడియోలకు కూడా లక్షలాది ఫాలోవర్లు ఉంటుండటమే ఆందోళన కలిగించే అంశం.తప్పుడు ప్రచారానికి కారణాలు...సోషల్ మీడియాతో ప్రచారం మాత్రమే కాదు, డబ్బు కూడా దండిగా వస్తుంది. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా అల్గోరిథమ్స్ ఎక్కువమంది చూసే కంటెంట్‌ను మరింత ఎక్కువమందికి చూపిస్తాయి. దీనివల్ల ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. ప్రకటనల ఆదాయంలో కొంత వీటిలో వీడియోలు పెడుతున్నవారికి వస్తుంది. దీనికితోడు సప్లిమెంట్లు, డైట్ కోర్సుల అమ్మకాలకు కూడా సంబంధిత కంపెనీలు ‘స్వయంప్రకటిత’ నిపుణులను సాధనంగా ఉపయోగించుకుంటాయి. వీటి ద్వారా కూడా వారికి ఆదాయం వస్తుంది. ప్రచారానికి ప్రచారం, ఆదాయానికి ఆదాయం అప్పనంగా దొరుకుతుండటంతో కొందరు తమ చదువుకు, నైపుణ్యాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, అకస్మాత్తుగా ఆహార ఆరోగ్య నిపుణులుగా సోషల్ మీడియాలో అవతారమెత్తుతూ జనాలను గందరగోళంలో ముంచుతున్నారు. కొంచెం దృష్టిపెడితే, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల్లో అసలైనవేవో, తప్పుడు ప్రచారంతో కూడినవేవో తేలికగానే కనిపెట్టవచ్చు. ‘డాక్టర్లు దాచిన రహస్యం!’, ‘ఫార్మసీ మాఫియా’, ‘శాస్త్రవేత్తలకే తెలియని ఆరోగ్య రహస్యం’, ‘వారం రోజుల్లో ఫ్యాటీ లివర్ నయం’, ‘క్యాన్సర్‌ను ఈజీగా తగ్గించవచ్చు’, ‘ఈ తైలంతో పక్షవాతం నయం’ వంటి థంబ్‌నెయిల్స్‌తో వచ్చే కంటెంట్‌లో చాలావరకు అవాస్తవాలే ఉంటాయి. వీటిని ప్రచారంలోకి తెచ్చేవారికి ఆహార, ఆరోగ్య, వైద్య శాస్త్రాలపై కనీస అవగాహన కూడా ఉండదు. సోషల్ మీడియాలో కొద్ది శాతమైనా అర్హులైన వైద్యులు కూడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కంటెంట్‌కు, పోస్ట్ చేసిన వారి అర్హతలను బేరీజు వేసుకుని ఈ వీడియోలను చూడటం క్షేమం.∙పన్యాల జగన్నాథదాసు -
Beauty Tips: ఈ మాస్క్‌తో ముడతలు దూరం
వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. మార్కెట్లో దొరికే చాలా రకాల ఎల్ఈడీ ఫేస్ మాస్క్‌లు కేవలం ముఖంపై వచ్చే ముడతలు, చారలు, మచ్చలను మాత్రమే తగ్గిస్తాయి. కానీ, సోలావేవ్ నెక్ – చెస్ట్ రెజువనేటింగ్ మాస్క్ ముఖం కింద ఉండే నెక్, చెస్ట్ చర్మ సంరక్షణలోనూ తోడ్పడుతుంది.ముఖం లాగే మెడ, ఛాతీ భాగాలపై కూడా వయసు పైబడిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల చర్మం సాగడం, ముడతలను తగ్గించుకోవాలనుకునే వారి కోసం సోలావేవ్ సంస్థ రూపొందించిన ఈ రెజువనేటింగ్ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ‘మైక్రోకరెంట్’, ‘రెడ్ లైట్ థెరపీ’ సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ మాస్క్ మెడ, ఛాతీ భాగాలపై ఉండే సన్నని ముడతలను సున్నితంగా తొలగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, కాంతివంతంగా మారుస్తుంది. రోజుకు పది నిమిషాలు దీనిని ఉపయోగిస్తే చాలు. దీనిని చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్ట్‌తో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.బొగ్గుపొడితో దంతాలు ధగధగకొన్ని సందర్భాల్లో కాఫీ, టీ లు ఎక్కువగా తాగడం, ఎనామిల్ పొర బలహీనపడటం వల్ల దంతాలు పచ్చగా మారిపోతుంటాయి. ఇందుకోసం డెంటిస్టుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేకుండా, సహజంగా దొరికే వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు.దంతాలను సహజంగా క్లీన్ చేయడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది దంతాలపై పేరుకుపోయిన మరకలను సున్నితంగా తొలగిస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలపై ఉండే రంగు మారిన పొరలను తొలగిస్తుంది. అయితే దీనిని చాలా జాగ్రత్తగా, తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. చూడటానికి నల్లగా ఉన్నప్పటికీ, బొగ్గుపొడి పళ్లపై ఉండే టాక్సి¯Œ ్స, రంగు మరకలను తన వైపుకు లాక్కునే ప్రత్యేక గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని కూడా తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి.సాంబ్రాణితో సహజ మెరుపు!తలస్నానం చేసిన వెంటనే నేడు జుట్టు ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. కానీ పూర్వం ఎంతటి పొడవాటి జుట్టునయినా ఆరబెట్టుకోవడానికి తలకు ‘ధూపం’ వేసుకునేవారు.ఇది నేటి తరానికి కేవలం సువాసన కోసం చేసే ప్రక్రియగా అనిపించినప్పటికీ ఇందులో ఎన్నో ఆయుర్వేద, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. సాంబ్రాణిని వేయడం వల్ల, ఆ వెచ్చని పొగ జుట్టులోని తేమను వేగంగా పీల్చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి తలనొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీ–మైక్రోబియల్, యాంటీ–ఫంగల్ గుణాలు తలలో చుండ్రు చేరకుండా రక్షిస్తాయి. -
పనిని ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్
రోజూవారీ వంటలు వండటం ఒక ఎత్తయితే, వాటిని వేడి వేడిగా వడ్డించడం, పిల్లలు అడిగిన స్నాక్స్ అప్పటికప్పుడు చేయడం గృహిణులకు పెద్ద టాస్క్. ఇలా కాకండా, వంట పనిని స్మార్ట్‌గా, ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవే...ఇంట్లోనే ఐస్‌క్రీమ్ రోల్స్!‘ఐస్‌క్రీమ్ కావాలి!’ అని పిల్లలు అడిగిన వెంటనే.. హెల్దీ హోమ్ మేడ్ ఐస్‌క్రీమ్ కోసం షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రోల్స్ చేసి ఇచ్చేయడానికి వచ్చేసింది ఈ ఇన్ స్టంట్ ఐస్‌క్రీమ్ మేకర్. ఇది మీ కిచెన్ ను చిన్న ఐస్‌క్రీమ్ పార్లర్గా మార్చేస్తుంది. ఈ కోల్డ్ ప్లేట్‌ను కొన్ని గంటల ముందు ఫ్రీజర్‌లో ఉంచి. బయటకు తీసిన తర్వాత దానిపై ఐస్‌క్రీమ్ మిశ్రమాన్ని పోయాలి. ఇక క్షణాల్లో గడ్డకట్టిన మిశ్రమాన్ని స్క్రాపర్లతో రోల్స్‌గా మార్చేస్తే చాలు! చల్లచల్లని ఐస్‌క్రీమ్ రోల్స్ రెడీ! ఇలా రోల్స్‌తో పాటు గెలాటో, సార్బెట్ వంటి ఫ్రోజెన్ డెజర్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని వాడటానికి కరెంట్ అవసరం లేదు. ఎలాంటి క్లిష్టమైన యంత్ర భాగాలు లేవు. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్‌తో తయారైన ఈ ట్రేను శుభ్రం చేయడం కూడా చాలా సులభం. ధర రూ.3,000 మాత్రమే!దోసెల ప్రేమికులకు గుడ్ న్యూస్!గ్యాస్ స్టవ్ ముందు గంటల తరబడి నిలబడి దోసెలు వేయడం మరచిపోండి! ఇప్పుడు ప్లగ్ పెడితే చాలు, నిమిషాల్లో వేడి వేడి దోసెలు మీ ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే, ఈ ఎలక్ట్రిక్ గ్రిడిల్ క్రేప్ మేకర్‌తో దోసెలు, పాన్ కేక్‌లు, ఆమ్లెట్లు, క్రేప్లను ఎలాంటి గ్యాస్ అవసరం లేకుండా ఎక్కడైనా సులభంగా తయారుచేసుకోవచ్చు. నాన్–స్టిక్ కోటింగ్ ఉండటంతో తక్కువ నూనెతోనే వంట పూర్తవుతుంది. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వల్ల ప్రతి దోసె సమంగా కాలి, రుచిగా ఉంటుంది. తేలికైన బరువుతో ఉండటంతో హాస్టల్ గదుల్లో, చిన్న ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా ఈజీగా ఉపయోగించు కోవచ్చు. ధర కేవలం రూ.1,400 మాత్రమే!టేబుల్‌పైనే వేడి వేడి విందు!అతిథులు ఒక్కోసారి వచ్చి కూర్చుంటే, కిచెన్ కి వెళ్లి మళ్లీ మళ్లీ వేడి చేయడం కాని పని. అలాగని, వారు వచ్చే ముందు వేడివేడిగా వండటమూ కష్టమే. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వచ్చేసింది ఎలక్ట్రిక్ ఫుడ్ వార్మింగ్ ట్రే మ్యాట్. దీనిపై ఒకేసారి 3 నుంచి 4 పెద్ద గిన్నెలను సులభంగా ఉంచుకోవచ్చు. అలా ఒకేసారి అన్నం, కూరలు, సూప్‌లు, స్నాక్స్... ఏవైనా సరే గంటల తరబడి సరైన ఉష్ణోగ్రతలో వేడిగా ఉంచుతుంది. పైగా ఇందులో ఉన్న స్మార్ట్ టచ్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా వేడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆహారం ఓవర్–కుక్ అవ్వకుండా, ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. దీని సర్ఫేస్ నాన్–స్టిక్ మెటీరియల్‌తో రావడం వల్ల ఏదైనా ఒలికినా, ఒక చిన్న గుడ్డతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ చుట్టూ తిరిగే పని లేకుండా చేసే ఈ సూపర్ గాడ్జెట్ అసలు ధర రూ. 5,000. -
బీమా పదాలకు అర్థాలే వేరులే..
బీమా ఉంది కదా అని ఆ యజమాని ధీమాగా ఉన్నాడు. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి నష్టపరిహారం పొందచ్చనుకున్నాడు. కానీ, నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదు. పరిహారం రాదని కంపెనీ చెప్పింది. ఒకే ఒక్క పదం ఆ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. వినియోగదారుల ఫోరంలో ఊరట దక్కినా, ఆ తీర్పుపై కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సొంత అర్థాలు చెల్లవని, బీమా ఒప్పందాల్లోని పదాలను సరిగా అర్థం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. చివరకు ఒక అరుదైన తీర్పును వెలువరించింది. గోడౌన్ తలుపులు, తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. పగుళ్లు లేవు, బలవంతంగా లోపలికి చొరబడిన ఆనవాళ్లూ కనిపించలేదు. కానీ లోపల నిల్వ ఉంచిన 197 బస్తాలు మాత్రం మాయమయ్యాయి. పోలీసులు వచ్చి పరిశీలించారు. దొంగతనం జరిగిందని నిర్ధారించారు. బీమా ఉండడంతో కంపెనీ ప్రతినిధులు వచ్చారు. చోరీ నిజమేనని వారూ తేల్చారు. కానీ పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారు.పరిహారం కోసం ఫోరానికిహరిచంద్రాయ్ చందన్‌లాల్ అనే వ్యాపారి ఢిల్లీలోని ఓ గోడౌన్లో ఆహారధాన్యాలను నిల్వ ఉంచాడు. వీటికి రూ.7లక్షల మొత్తానికి బర్గ్లరీ అండ్ హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. దీనికి రూ.7 లక్షలు బీమా సంస్థకు చెల్లించాడు. 1992లో గోదాములో నిల్వ ఉంచిన 197 బస్తాలు మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బీమా కోసం అప్లయ్ చేశాడు. గోదాంలోకి బలవంతపు ప్రవేశం లేదా హింస జరిగినట్లు ఆధారాలు లేవని క్లైమ్ను సంస్థ తిరస్కరించింది. దీంతో చందన్‌లాల్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.కంపెనీకి అనుకూలంగా తీర్పుబర్గ్లరీ అనే పదానికి దొంగతనం అనే సాధారణ అర్థం కూడా వస్తుంది కనుక బాధితుడికి రెండు నెలల్లో పరిహారాన్ని 15% వడ్డీతో చెల్లించాలని, అదనంగా ఖర్చులకు రూ. 1,000 ఇవ్వాలని ఫోరం తీర్పు ఇచ్చింది. దీనిపై బీమా కంపెనీ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో అప్పీలు దాఖలు చేసింది. అక్కడా తీర్పు వ్యాపారికి అనుకూలంగా వచ్చింది. దీంతో జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఫోరం తీర్పును సమర్థిస్తూ రివిజన్ పిటిషన్‌ను తిరస్కరించింది.సర్వోన్నత న్యాయస్థానానికి చేరిన కేసుబీమా కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ పాలసీ రెండు పక్షాల మధ్య ఒప్పందం. అందువల్ల బీమా పాలసీలో ఇచ్చిన నిర్వచనం ఇరుపక్షాలకు వర్తిస్తుందని కోర్టు చెప్పింది. బర్గ్లరీకి ప్రత్యేక నిర్వచనం ఉన్నప్పుడు, సాధారణ దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుందా? లేదా? అనేది ఈ కేసులో ప్రధానాంశంగా కోర్టు పేర్కొంది. బీమా పాలసీ విషయంలో కేవలం సాధారణ అర్థాన్ని మాత్రమే తీసుకోలేం. పాలసీలో ప్రత్యేకంగా నిర్వచనం ఇచ్చినప్పుడు అదే అర్థాన్ని తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది దొంగతనం మాత్రమే..బర్గ్లరీ అనే పదాన్ని ‘దొంగతనం’ అనే సాధారణ అర్థంలో వాడతారు. కానీ పాలసీలో అది హింస లేదా బలప్రయోగంతో కూడిన దొంగతనానికి పరిమితం చేశారు. ఈ సంఘటనలో తలుపులు విరగలేదు, తాళాలు పగలలేదు. ఆ సంస్థ ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యులపై ఎటువంటి దౌర్జన్యం జరగలేదు. ఇవేమీ లేకుండా కేవలం దొంగతనం జరిగిందనే కారణంతో పరిహారం కోరే హక్కు బీమాదారుడికి లేదని కోర్టు తేల్చింది. పాలసీ నిర్వచనం ప్రకారం ఇది దొంగతనం మాత్రమే! బర్గ్లరీ కాదని చెప్పింది. పాలసీలో ఏ షరతు ఉంటే దానిని కోర్టు అమలు చేయాలి. మార్చకూడదు. కొత్త అర్థాల్ని ఇవ్వకూడదని పేర్కొంది. ఈ కారణంతో బీమా కంపెనీ విజయం సాధించింది. వినియోగదారుల ఫోరం తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే, వినియోగదారుల ఫోరం తీర్పుకనుగుణంగా బాధితుడికి ఇప్పటికే పరిహారం చెల్లిస్తే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవాలని తాము ఆదేశించడం లేదని కోర్టు చెప్పింది. బీమా సంస్థలు కఠినమైన పదాలు కాకుండా, వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది.'పాలసీలో పేర్కొన్న వి«ధంగా నష్టం జరిగితేనే బీమా ఉంటుంది. దానికి దగ్గరగా ఉండే ప్రతి నష్టానికి కాదని ఈ కేసు రుజువు చేసింది. బీమా పాలసీ తీసుకునేటప్పుడు అందులో పేర్కొన్న వాస్తవ అర్థాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి లేకపోతే బీమా ఉందనే ధీమా పనికిరాదని, పరిహారం దక్కదని రుజువైంది.' - దిలీప్ మాదిరెడ్డి -
పిల్లల కథ: వింత వస్తువు
ఆనందవనానికి సింహసేనుడు అనే సింహం రాజు. ఒకరోజు నక్క అడవి సరిహద్దుల్లో ఒక వింతవస్తువును చూసి ఆశ్చర్యపోయింది. ఆ వింత వస్తువును చూడగానే, ‘ఇది నోటికి చిక్కదు, కాలికి అందదు’ అనుకుంది.‘ఈ వస్తువును సింహసేనుడు సహా అన్ని జంతువులకు చూపించి, తానొక గొప్పదాన్నని నిరూపించుకోవాలి’ అనుకుంది.అనుకున్నదే తడవుగా అడవిలోని అందరికీ చెప్పేసింది.సింహసేనుడు సహా జంతువులన్నీ వింత వస్తువున్న చెట్టు వద్దకు చేరుకున్నాయి.జంతువులన్నింటి వైపు తేరిపార చూస్తూ నక్క ఇలా అంది.‘ఆకాశం నుండి రాలిపడిన వింత వస్తువిది. దీనిని ఎవరు తాకుతారో వారు అత్యంత బలవంతులైపోతారు’.నక్క మాట వినగానే... ‘అయితే నేను ముందంటే నేను ముందు’ అంటూ సింహం, ఏనుగు, ఎలుగుబంటి, జింక ముందుకు కదిలాయి.‘కానీ ఒక నియమం పాటిస్తేనే వస్తువును ముట్టుకోగలరు’ అంది నక్క.‘ఏమిటా నియమం?’ జంతువులన్నీ నక్కను ఆత్రంగా అడిగాయి.‘వస్తువును తాకేముందు తమ తమ సహజ స్వభావాన్ని వదులుకుంటామని వస్తువుకు మాటివ్వాలి. అప్పుడే అద్భుత శక్తి వస్తుంది.’నక్క మాటలు విన్న జింక ‘ఓస్! అంతే కదా’ అంటూ వింతవస్తువు వద్దకు వెళ్ళింది.సింహం, ఎలుగుబంటి, ఏనుగు, నక్క– జింకకేసి విచిత్రంగా చూడసాగాయి.‘నాకు భయం ఎక్కువ. ఇప్పుడు నా భయాన్ని పోగొట్టుకుని, పులిలా గాండ్రిస్తాను’ అంటూ గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. కానీ జింక గొంతు సహకరించలేదు.‘నా స్వభావం మార్చుకోవడం నా వల్ల కాదు’ అంటూ జింక వెనుతిరిగింది.‘నన్ను చూడండి’ అంటూ ఎలుగుబంటి గొప్పగా ముందుకు కదిలింది.‘నాకు తేనెపట్టులోని తేనె కడుపునిండా తిన్నాక హాయిగా నిద్ర పోవడం నాకిష్టం. ఈ రోజునుంచి నిద్రపోకుండా మేల్కొనే ఉంటాను’ అంది. అంతలోనే ఆవులింత రావడంతో, ‘అమ్మో! నిద్రను ఆపడం నా వల్ల కాదు’ అంటూ వెనుతిరిగింది.‘ఇప్పుడు ఏనుగు వంతు’ నక్క అనడంతో ఏనుగు ముందుకు కదిలింది.ఏనుగు వింతవస్తువు వద్దకు వెళ్లి, ‘దారిలో అడ్డంగా పడిపోయిన చెట్లను నా తొండంతో వేగంగా పైకి తీయడం అలవాటు. ఇక నుంచి చీమలా నెమ్మదిగా నడుస్తాను’ అంటూ మెల్లగా నడవబోయింది.‘నా శరీరానికి చీమలాగా నెమ్మదిగా నడవడం కుదరదు’ అంటూ ఏనుగు కూడా వెనుతిరిగింది.‘మీలో ఒక్కరూ సాధించ లేకపోయారు. నన్ను చూడండి’ అంటూ మృగరాజు సింహసేనుడు వింతవస్తువు వైపు కదిలాడు.నక్క, ఏనుగు, ఎలుగు, జింక అన్నీ సింహాన్ని ఆసక్తిగా గమనించసాగాయి. వింతవస్తువు దగ్గరకు వెళ్ళి సింహం ఇలా అంది.‘నేను మాంసాహారిని. కానీ ఈ రోజు నుండీ గడ్డి తింటాను’ అంటూ అక్కడే ఉన్న కొంత పచ్చగడ్డిని పళ్లతో పీకి నోట్లో వేసుకుంది. కానీ తినలేకపోయింది.‘ఆకలేసినంత మాత్రాన సింహం గడ్డి తినలేదు’ అనుకుంటూ వింతవస్తువును తాకకుండానే మృగరాజు కూడా వెనుతిరిగింది.ఇదంతా అక్కడే చెట్టు పైనున్న ఉడుత గమనించి, కిందకు దిగి గట్టిగా నవ్వింది.‘మమ్మల్ని చూస్తే నీకు నవ్వొస్తోందా?’ సింహం కోపంగా అంది.‘కోపం వద్దు మృగరాజా! నా నవ్వుకు కారణం ఉంది’ అంది ఉడుత.‘ఏమిటిది?’ ఏనుగు అడిగింది.‘మీరంతా వింతవస్తువంటూ, విచిత్రంగా చూస్తున్న ఆ వస్తువు పేరు ‘గ్లోబు’. భూగోళానికి నమూనా అది. మన అడవి దాటితే ఒక ఊరు ఉంది. ఆ ఊరి బడిలో దీనిని నేను చూశాను. అక్కడి పిల్లలకు మాస్టారు దీని గురించి చెబితే విన్నాను. ఆ మాస్టారు, పిల్లలతో అడవిలోని చెట్లను చూడటానికి మన సరిహద్దు వైపు వాహనంలో వచ్చారు. అలా వచ్చినప్పుడు పిల్లలు ఈ గ్లోబును ఇక్కడ మరచిపోయి వెళ్లిపోయారు.ఈ వస్తువు సంగతి తెలియని నక్క మిమ్మల్ని ఆట పట్టించడానికే ఇలా నాటకమాడింది. మీరే కాదు, సృష్టిలో ఏ జీవీ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించి మనుగడ సాధించలేదు.ఇప్పుడర్థమైందా? మృగరాజా? నేనెందుకు నవ్వానో?’ఉడుత మాటలతో సింహం సహా జంతువులన్నింటికీ విషయం అర్థం కావడంతో వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి.‘మనందరినీ ఆట పట్టించిన ఈ టక్కరి నక్క అంతుచూస్తాను’ అని మృగరాజు గట్టిగా అనడంతో నక్క ‘అయ్య బాబోయ్’ అంటూ తుర్రుమంటూ కాళ్లకు బుద్ధి చెప్పింది.‘ఇంకెప్పుడూ ఇటువైపు రాకు’ సింహం అంది.భయంతో పరుగుతీస్తున్న నక్కను చూసి జంతువులు నవ్వుకున్నాయి. - కొక్కెరగడ్డ శ్రీదేవి హితవచనం..అంభస్యాభిద్యతే సేతుస్తథా మంత్రోప్యరక్షితఃపైశున్యాద్భిద్యతే స్నేహో వాచా భిద్యేత కాతరఃనీటి ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోతుంది. రక్షించకపోతే రహస్యం బయటపడిపోతుంది. చాడీలకోరు వల్ల స్నేహం చెడిపోతుంది. పిరికిపంద మాటలకే బెదిరిపోతాడు. -
దశాశ్వమేధ ఘట్టం
దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని దర్శించుకుని, ‘ఏకకాలంలో దశాశ్వమేధ యాగాలు చేయాలని కోరికగా ఉంది. ఈ యాగాల నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో సెలవివ్వండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! పూర్వకాలం నుంచి రాజులందరూ ఏ ప్రదేశంలో అశ్వమేధ యాగాలు చేసేవారో, అదే ప్రదేశంలోనే నువ్వు కూడా యాగాలు నిర్వహించు’ అని చెప్పాడు కశ్యపుడు.కశ్యపుడి సూచనతో భౌవనుడు ఋత్విక్కులను ఏర్పాటు చేసుకుని, పూర్వీకులు యాగాలు నిర్వహించిన ప్రదేశంలోనే పది అశ్వమేధ యాగాలూ ఒకేసారి ప్రారంభించాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ యాగాలు సంపూర్ణం కాలేదు.యాగాలు సఫలం కాకపోవడంతో భౌవనుడు విచారించాడు. పురోహితులతో చర్చించి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలంలో యాగాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ కూడా యాగాలకు అంతరాయాలు కలిగాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి.భౌవనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నా దోషమో, మీ దోషమో, దేశ కాల దోషమో నాకు అర్థం కాకున్నది. నేను తలపెట్టిన యాగాలు ఎంతగా ప్రయత్నించినా సంపూర్ణం కాకున్నవి. దీనికి మార్గాంతరమేమిటో అంతుచిక్కకున్నది’ అని విచారంగా పలికాడు.కశ్యపుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ‘రాజా! పద’ అంటూ భౌవనుడిని తనతో పాటు బృహస్పతి అన్న అయిన సంవర్తకుడి దగ్గరకు తీసుకుపోయాడు. ‘మహాత్మా! మేము దశాశ్వమేధ యాగాలు తలపెట్టాము. యాగ నిర్వహణకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి. మేము తలపెట్టిన యాగ నిర్వహణకు తగిన ఉత్తమ ప్రదేశమేదో నువ్వే చెప్పాలి’ అని అడిగాడు కశ్యపుడు. సంవర్తకుడు కొద్దిసేపు ఆలోచించి, ‘మునివర్యా! మీరిద్దరూ నేరుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అడగండి. మీరు సంకల్పించిన యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలాన్ని ఆయనే చెప్పగలడు’ అని చెప్పి, వారిని సాదరంగా సాగనంపాడు. భౌవనుడిని వెంటపెట్టుకుని కశ్యపుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడిని దర్శించుకుని, వారిద్దరూ నమస్కరించారు. ‘బ్రహ్మదేవా! మా రాజైన ఈ భౌవనుడు దశాశ్వమేధ యాగాలను ఏకకాలంలో తలపెట్టాడు. ఇదివరకటి యత్నాలు విఫలం కావడంతో వ్యాకులం చెందుతున్నాడు. యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో నువ్వే సెలవివ్వాలి’ అడిగాడు కశ్యపుడు. ‘పవిత్ర గౌతమీతటాన యాగ నిర్వహణ కావించండి. అక్కడ నిర్వహించే ఏ యాగమైనా సంపూర్ణంగా ఫలిస్తుంది’ అని చెప్పి, భౌవనుడిని ఉద్దేశించి, ‘రాజా! నువ్వు ఇందుకు వేరే గురువును ఆశ్రయించవలసిన పనిలేదు. వేదపారంగతుడైన ఈ కశ్యపుడే గురుశ్రేష్ఠుడై యాగాన్ని పరిపూర్ణం చేయించగలడు’ అని చెప్పాడు.కశ్యపుడి ఆధ్వర్యంలో భౌవనుడు గౌతమీ తీరంలో దశాశ్వమేధం ప్రారంభించాడు. యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. యాగ పరిసమాప్తి సందర్భంగా భౌవనుడు భూదానానికి ఉద్యుక్తుడయ్యాడు.అదే సమయంలో అశరీరవాణి ‘ఓ రాజా! సమస్త భూమండలాన్నీ నువ్వు ఈ కశ్యప మహర్షికి దానం చేయాలని సంకల్పించుకున్నావు. నీ సత్సంకల్ప మాత్రానే భూమండలం సర్వసుభిక్షమైంది. నీ మనసులోనున్న భూదాన సంకల్పాన్ని విరమించుకుని, మహాఫలప్రదమైన అన్నదానం కావించు. నీకు శుభం కలుగుతుంది’ అని పలికింది. అశరీరవాణి పలుకులు విన్నప్పటికీ భౌవనుడు తన భూదాన సంకల్పం నుంచి వెనక్కు తగ్గలేదు. అప్పుడు భూదేవి స్వయంగా ప్రత్యక్షమై, ‘మహారాజా! మాటిమాటికి నన్ను దానం చేయడం తగదు. నీ సంకల్పం విడిచిపెట్టు’ అని చెప్పింది.భూదేవి స్వయంగా ప్రత్యక్షం కావడంతో భౌవనుడు చలించిపోయాడు. ‘తల్లీ! యాగ పరిసమాప్తి సందర్భంగా నేనిప్పుడు ఏ దానం చేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు.‘పవిత్రమైన ఈ గౌతమీ తీరాన నవధాన్యాలు, గోవులు, ధన కనక వస్తు వాహనాలు వేటిని దానం చేసినా అక్షయఫలం లభిస్తుంది. ఇక్కడ అన్నదానం చేసినవారికి సమస్తదానాలూ చేసినంత ఫలం దక్కుతుంది.’ అని పలికింది. భౌవనుడు యాగస్థలంలో వేలాదిమందికి అన్నదానం చేశాడు. అతడి యాగస్థలి దశాశ్వమేధ తీర్థంగా ప్రసిద్ధి పొందింది. - సాంఖ్యాయనపురావిశేషం..ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని హీరాపూర్ గ్రామంలో అత్యంత అరుదైన పురాతన శాక్తేయ ఆలయం ఉంది. ఇది చతుష్షష్టి యోగినుల మందిరం. ఇందులో అధిష్ఠాన దేవత మహామాయ విగ్రహంతో పాటు అరవైనాలుగు మంది యోగినుల విగ్రహాలు ఉంటాయి. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. దీనిని భౌమవంశానికి చెందిన రాణి హీరాదేవి క్రీస్తుశకం 864లో నిర్మించింది. పదహారో శతాబ్దిలో కాలాపహాడ్ అనే సేనాని జరిపిన దాడిలో ధ్వంసమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో మిగిలింది. -
Fashion: పోగు పెట్టుకో... పోజు కొట్టుకో!
ఒకప్పటి రాజుల ఫొటోలు చూస్తే, ఒంటినిండా నగలతో మెరిసిపోతూ కనిపించేవారు. మధ్యలో ఏమైందో ఏమో మగవాళ్లు జ్యూలరీకి కాస్త దూరమయ్యారు. అయితే, ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ ప్రపంచం పెద్ద యూటర్న్ తీసుకుంది. రాజుల కుండలాలు కాస్త కూల్ ఇయర్రింగ్స్గా మారి కుర్రాళ్ల స్టయిల్‌కు కొత్త మెరుపు తెస్తున్నాయి. మగాళ్లను మళ్లీ మహారాజుల్లా మెరిపిస్తున్న ఈ ఇయర్రింగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!స్టడ్స్సింపుల్గా ఉండాలనుకునే వారికి ఇవి బెస్ట్. చిన్న రాయి లేదా మెటల్ డిజైన్ తో నల్లటి చుక్కలా ఉండే స్టడ్స్ ఎలాంటి దుస్తులతోనైనా సెట్ అయిపోతాయి. సైలెంట్‌గా స్టయిల్ మెయింటైన్ చేయాలంటే స్టడ్స్ పెట్టుకోవాల్సిందే!రింగ్స్కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలంటే ఇవి పర్ఫెక్ట్. స్పోర్ట్స్ బైక్ మీద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తుంటే... ఆ రింగ్ గాలికి ఊగుతూ మెరుస్తుంటే.. అబ్బా, ఆ కిక్కే వేరు! చిన్న రింగ్స్ నుంచి పెద్ద రింగ్స్ వరకు ఎన్నో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.డాంగ్లర్స్ ఇవి పెట్టుకుంటే స్టయిల్ మీటర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెవికి కిందకి వేలాడే ఇవి సాధారణ లుక్‌ను క్షణాల్లో ట్రెండీగా మార్చేస్తాయి. ముఖ్యంగా క్రాస్ డిజైన్లు, ఫంకీ పెండెంట్లు ఉన్న డాంగ్లర్స్ పూల్ పార్టీలు, బీచ్ వెకేషన్లు, వీకెండ్ ట్రిప్స్‌లకు, ఇవి పెట్టుకున్న వెంటనే తెలియకుండా అందంగా కనిపిస్తారు.మ్యాగ్నెటిక్ పోగులు ‘ఫ్యాషన్ కావాలి. కాని, సూదితో చెవి కుట్టించుకునే ధైర్యం లేదు’ అనుకునే సుకుమారుల కోసం దేవుడు సృష్టించిన, భయస్తుల బ్రహ్మాస్త్రాలు ఇవి. అంటించుకుంటే అతుక్కుంటాయి, తీసేస్తే వచ్చేస్తాయి.పోగు పెట్టుకుంటే... స్టార్ అయిపోరు!సినిమా హీరోలు, క్రీడాకారులు చెవికి పోగు పెట్టుకున్నారని చాలామంది సేమ్ స్టయిల్ ఫాలో అవుతుంటారు. అయితే, చెవి పోగు పెట్టుకున్న వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో హీరో ఇంట్రో మ్యూజిక్ మొదలవుతుందని మాత్రం అనుకోవద్దు! అసలు మ్యాజిక్ పోగులో కాదు... దాన్ని ఎలా క్యారీ చేస్తారన్న దాంట్లో ఉంది. మీ ముఖాకారం, హెయిర్ స్టయిల్, దుస్తులకు సరిపోయే డిజైన్ ను ఎంచుకుంటేనే లుక్ అదిరిపోతుంది.స్కిన్ టోన్ కు తగ్గట్టు బ్లాక్, సిల్వర్ లేదా గోల్డ్ కలర్‌ను ఎంచుకోండి. కనిపించిన ప్రతీ డిజైన్‌ను ఒకేసారి ట్రై చేస్తే క్రిస్మస్ ట్రీలా తయారవుతారు. అలాగే మరీ బరువైన పోగులు పెట్టుకుని చెవులకు జిమ్ వర్కౌట్ ఇవ్వొద్దు. అలాగే రోజుకో పోగు, గంటకో స్టయిల్ మార్చేస్తే కన్ఫ్యూజన్ మీకే. మీ ఫేస్‌కు ఏది బాగా సెట్ అవుతుందో అదే ఫిక్స్ చేసుకోండి. తర్వాత అద్దం ముందు నిలబడి ఒక్కసారి చూసుకోండి... మీరే మీకు ఫ్యాన్ అయిపోతారు! - కొండి దీపిక -
గత జన్మలో స్మగ్లర్... ఇప్పుడు ప్రొఫెసర్! వింత కేసు..
‘‘తాతా! ఆగ్రాలో ఉన్న నా భార్యాపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. నన్ను అక్కడకు తీసుకెళ్లు’’ అన్న మాటలు వినేసరికి ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ మాటలు అన్నది యూపీలోని బాద్ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు తోరణ్ సింగ్ టిటూ. రెండేళ్ల వయసు నుంచి టిటూ చెబుతున్న మాటలను మొదట్లో పిల్లచేష్టలుగా భావించి పట్టించుకోలేదు. అయితే, నాలుగేళ్లు వచ్చాక ఓ రోజు.. ‘‘నాకు ఆగ్రాలోని సదర్ బజార్లో పెద్ద రేడియో షాప్ ఉంది, పెద్ద బంగళా ఉంది, కార్లు ఉన్నాయి. నా పేరు సురేష్ వర్మ, నేను ‘సురేష్ రేడియో’ అధిపతిని. స్మగ్లింగ్ కూడా చేసేవాడిని. నన్ను తుపాకీతో కాల్చి చంపేశారు’’ అని చెప్పడంతో టిటూ కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.ఈ సంగతేమిటో తేల్చుకోవాలని టిటూ అన్నయ్య ఆగ్రాలోని సదర్ బజార్‌కు వెళ్లాడు. అక్కడ ‘సురేష్ రేడియో’ షాప్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ షాప్ యజమాని సురేష్ వర్మను 1983లో ఎవరో కాల్చి చంపేశారని, ప్రస్తుతం అతని భార్య ఉమా వర్మ ఒంటరిగా ఉంటోందని తెలిసి షాక్‌కు గురయ్యాడు.విషయం తెలుసుకున్న సురేష్ వర్మ కుటుంబ సభ్యులు టిటూను చూడటానికి వచ్చారు. వారిని చూడగానే టిటూ గుర్తుపట్టాడు. గత జన్మలో తమకు సంబంధించిన బోలెడు విషయాలను ఏకరువు పెట్టాడు. వ్యాపారంలో ఎవరెవరికి ఎంత అప్పు ఇచ్చాడో, ఆ డైరీ ఎక్కడ దాచాడో కూడా చెప్పాడు. అయితే, గత జన్మలోని సురేష్ వర్మ భార్య ఉమ.. టిటూకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఇరవై మంది పిల్లల మధ్యలో తమ ఇద్దరి పిల్లలను కూర్చోబెట్టి గుర్తుపట్టమని అడిగితే, టిటూ ఇద్దరినీ గుర్తించి పేర్లు కూడా చెప్పాడు..‘‘నువ్వు చనిపోవడానికి ముందు మనం ఎక్కడికి వెళ్లాం?’’ అడిగింది ఉమ. ‘‘ఓ తిరునాళ్లకు వెళ్లాం. నువ్వు కారు బానెట్‌పై కూర్చుని జిలేబీ కూడా తిన్నావు’’ అని టిటూ చెప్పడంతో ఆమె నోరెళ్లబెట్టారు. టిటూ కుడి కణత భాగంలో ఒక చిన్న గుండ్రటి మచ్చ ఉంది. అలాగే తల వెనుక భాగంలో మరికొన్ని గుర్తులు ఉన్నాయి. సురేష్ వర్మ పోస్ట్‌మార్టం నివేదికను పరిశీలించిన శాస్త్రవేత్తలు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, సురేష్ వర్మను కాల్చినప్పుడు బుల్లెట్ కుడి కణత నుంచి లోపలికి వెళ్లి, తల వెనుక భాగం నుంచి బయటకు వచ్చింది. టిటూ ఒంటిపై ఉన్న మచ్చలు సరిగ్గా అవే స్థానాల్లో ఉన్నాయి.టిటూ మిస్టరీని పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలకు ఓ చిక్కుముడి ఎదురైంది. రికార్డుల ప్రకారం సురేష్ వర్మ 1983 ఆగస్టు 28న మరణించాడు. కానీ టిటూ అంతకు ముందే డిసెంబర్ 1982లో (కొన్ని రికార్డుల ప్రకారం డిసెంబర్ 1983లో) జన్మించాడు. టిటూ 1983 డిసెంబర్ 12న జన్మించింది నిజమైతే, అప్పటికే సురేష్ వర్మ చనిపోయాడు కాబట్టి ఇది పునర్జన్మ అవుతుంది. ఒకవేళ టిటూ 1982లో జన్మించి ఉంటే, సురేష్ చనిపోయే సమయానికి అతడి వయసు ఎనిమిది నెలలు. అంటే, సురేష్ వర్మ ఆత్మ– టిటూ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఉండాలని భావించాలి. ఎందుకంటే టిటూకి సరిగ్గా 8 నెలల వయసులో తీవ్ర అనారోగ్యానికి గురై చావు అంచుకు వెళ్లాడు. ఆ సమయంలోనే టిటూ శరీరంలోకి సురేష్ వర్మ ఆత్మ ప్రవేశించి ఉండవచ్చని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు.ఈ వింత కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బ్రిటిష్ మ్యాగజైన్ ‘రీఇ¯Œ కార్నేషన్ ఇంటర్నేషనల్’ దీనిపై ప్రత్యేక కథనం రాసింది. బీబీసీ 1990లో ఒక డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. ఇటీవల ప్రసిద్ధ ‘దేశీ క్రైమ్ పాడ్‌కాస్ట్’ టిటూను ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న డాక్టర్ తోరణ్ సింగ్ యోగా, నేచురోపతిలో ఎండీ పూర్తి చేసి, వారణాసిలోని ప్రతిష్ఠాత్మక బెనారస్ హిందూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు."నాకు పూర్వజన్మకు సంబంధించిన అన్ని విషయాలూ గుర్తున్నాయి. షాప్ మూసేసి నా వైట్ ఫియట్ కారులో ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఒకడు ‘నమస్తే’ అన్నాడు, ఇంకొకడు నన్ను కాల్చేశాడు. ఆ రోజుల్లో నేను వారితో కలిసి స్మగ్లింగ్ చేసేవాడిని. నన్ను చంపినవాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిదేళ్ల శిక్ష కూడా అనుభవించారు. తొమ్మిదేళ్ల వయసులో వారిని చూసినప్పుడు భయం వేసింది. గత పదేళ్లుగా నా పూర్వజన్మ కుటుంబంతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఇప్పుడు నాకు భార్య, కొడుకు ఉన్నారు. నేను నా ప్రస్తుత జీవితంలో సంతోషంగా ఉన్నాను." - పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో డాక్టర్ తోరణ్ సింగ్సత్యకిశోర్ -
నీవని... నేనని...
‘‘నందినిగారూ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు’’ సడన్‌గా ప్యూన్ వచ్చి చెప్పగానే, ఏదో ఆలోచిస్తున్న నందిని ఉలిక్కిపడి లేచింది. మేడం అంటే ఆ ఆఫీస్‌లో బాస్. పేరు మాలతి– చండశాసనురాలు. నందిని ఉలిక్కిపడిలేచి మాలతి రూములోకి వెళ్ళింది, కొంచెం దిగులుగా భయంగా. తనని చూడగానే మాలతి కూర్చోమని తన స్వభావానికి విరుద్ధంగా మృదువుగా ఇలా అంది.‘‘చూడు నందినీ! ఈ ఆఫీసులో అందరికన్నా శ్రద్ధగా కష్టపడి పనిచేసే అమ్మాయివి నువ్వు. కానీ ఈమధ్య పనిమీద నీ ధ్యాస తగ్గింది. తప్పులమీద తప్పులు చేస్తున్నావు. టెండరు విషయంలో దొర్లిన తప్పువల్ల ఆ కాంట్రాక్ట్ మనకు దక్కకుండా పోయింది. నీలాంటి మంచి ఉద్యోగినిని వదులుకోవడం ఇష్టంలేక ఆఖరిసారి వార్నింగ్ ఇద్దామని పిలిచా. ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు ఆఫీసులో చర్చించడం నాకిష్టం ఉండదు. కానీ నీమీద ఉన్న అభిమానంతో అడుగుతున్నా. ఎందుకు ఈమధ్య పరధ్యానంగా ఉంటున్నావ్ ? ఏమైనా సమస్యలా! ఇబ్బందులుంటే చెప్పు. నేను నీకు కావల్సిన సహాయం చేస్తా’’ అనునయంగా అంది మాలతి. చండశాసనురాలిగా పేరున్న బాస్ నోట ప్రేమపూర్వకమైన మాటలు వినగానే నందిని కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఏం చెప్పాలో తెలియనట్లు మాలతికేసి చూసింది.‘‘సరే వెళ్ళి పని చూసుకో ఇంటికి వెళ్ళేముందు నన్నోసారి కలిసి వెళ్ళు’’ అని తన పని చూసుకోసాగింది మాలతి. నందిని బయటికి వచ్చి తన సీట్లో కూర్చుంది. అన్యమనస్కంగానే పనిలో నిమగ్నమయ్యింది. ‘సాయంత్రం తన ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. అందుకే వెళ్ళేటప్పుడు కలవమంది’ అని ఆలోచించసాగింది. సాయంత్రం ఆరు కాగానే మాలతి వెళ్ళిపోతుందని తెలుసు. ఇక భారంగా లేచింది నందిని. తోటివారి జాలిచూపులు తప్పించుకుంటూ మాలతి రూములోకి నడిచింది. తను లోపలికి వెళ్ళేటప్పటికే మాలతి తన టేబుల్ క్లియర్ చేసి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళడానికి లేచింది. నందినిని చూడగానే,‘‘వచ్చావా! సరే నాతో రా మనం బైటకి వెళ్తున్నాం’’ అంది కూల్‌గా.ఒక్క క్షణం ఆశ్చర్యం, ఉద్వేగం చుట్టుముట్టాయి నందినికి. ఏదో అనేలోగా, మళ్ళీ మాలతే ‘‘నీ డెస్క్ క్లోజ్ చేసి, బ్యాగ్ తీసుకొని బైటకి రా’’ అని బయటకు కదిలింది.అయోమయంగా నందిని తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. కార్లో తన కోసం చూస్తూ మాలతి కనపడింది. మాలతి రమ్మని సైగ చెయ్యటంతో అలాగే ఆశ్చర్యంగా మాలతి పక్కసీటు డోర్ తీసి పక్కనే కూర్చుంది నందిని. దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. సీరియస్‌గా డ్రైవ్ చేసుకుంటూ నేరుగా తనింటి దగ్గరికి తీసుకెళ్ళి, ఆపింది మాలతి. తనవెంట రమ్మని సైగ చేసి డోర్ దిగి తన ఇంటి లాక్ తీసి లోపలికి నడిచింది. నందిని లోపలికి రాగానే కూర్చోమని సోఫా చూపించి, టీవీ రిమోట్ ఇచ్చి, ‘‘టీవీ చూస్తూండు. ఒక పది నిమిషాల్లో వస్తా’’ అని లోపలికి వెళ్ళిపోయింది.యాంత్రికంగా రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది నందిని. కాని మనసు టీవీ మీదకు పోవటంలేదు. యథాలాపంగా హాలంతా కలియచూస్తూ కూచుంది. హాలంతా అందంగా అలంకరించి ఉంది. గోడమీద ఒకే ఒక చక్కని కలర్ ఫొటో ఫ్రేమ్ ఉంది. మాలతి, ఆవిడ భర్త కాబోలు చాలా హుందాగా ఉన్నాడు. ఇద్దరూ చూడ చక్కని జంట. నందినికి ప్రభాకర్ గుర్తొచ్చాడు. మనసు వికలమైంది. ఇంతలో మాలతి ఫ్రెష్‌గా తయారై, ఒక ట్రేలో రెండు కాఫీలు పట్టుకు వచ్చింది. నందిని లేచి, ‘‘అయ్యో ఎందుకు మేడం, శ్రమ పడుతున్నారు!’’ అంటూ దగ్గరకెళ్ళింది.‘‘కూర్చో... ఇందులో శ్రమేముంది, ఇది ఆఫీసు కాదు. ఇప్పడు నేను నీ బాస్‌ని కాదు. నువ్వు నా అతిథివి. హాయిగా కూర్చుని ఈ కాఫీ తాగు’’ అని కాఫీ కప్ చేతికిచ్చింది. టీపాయ్ మీద బిస్కట్స్ ప్లేట్ పెట్టి తను కూడ కాఫీ కప్ తీసుకుని సోఫాలో పక్కనే కూర్చుంది. పొద్దుటినుండి జరిగిన సంఘటనలతో మూడీగా ఉన్న నందిని పొగలు కక్కుతున్న కాఫీ కప్పు చూడగానే మాట్లాడకుండా కప్పు తీసుకొని, కాఫీ తాగుతూ కూర్చుంది.కాఫీలు పూర్తయ్యాక ‘‘నందినీ, ఇప్పుడు చెప్పు ఎందుకు ఈమధ్య పనిమీద శ్రద్ధ తగ్గింది? నువ్వంటే నాకెంతో అభిమానం. నువ్వు నిస్సంకోచంగా నీ సమస్య ఏంటో చెప్పు. ఒక బాస్‌గా కాకపోయినా, ఒక స్నేహితురాలిగా సహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తాను’’ అని అభిమానంగా నందిని భుజం మీద చెయ్యేసి అడిగింది మాలతి. ఆ అభిమానానికి నందిని కరిగిపోయింది. తనలో గూడు కట్టుకున్న దుఃఖం బయటికి వచ్చింది. నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది నందిని.‘‘మేడం, నేను రెండేళ్ళ కిందటే ప్రేమించి, ప్రభాకర్‌ని పెళ్ళి చేసుకున్నా. రెండేళ్ల పాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకే ఇదంతా జరిగింది. అమ్మా నాన్న ముందు వెంటనే అంగీకరించకపోయినా, నామాట కాదనలేక మా పెళ్ళి జరిపించారు. ఈమధ్య దాకా మా కాపురం హాయిగా ఆనందంగా గడిచిపోయింది. మాకేమీ ఆర్థిక సమస్యలు లేవు. ఇద్దరం సంపాదిస్తున్నాం. హాయిగా గడిచిపోతున్న జీవితంలో ఎందుకో గాప్స్ రావటం మొదలయ్యింది. తనకి నామీద ప్రేమ తగ్గిందని చెప్పలేను కాని ఆఫీసు ఒత్తిడో, వాళ్ళ చెల్లెలి కాపురం సరిగా లేదని చిరాకో తెలీదు కాని, అనవసరంగా నామీద విసుక్కోవటం ఎక్కువయ్యింది.ఇంట్లో ఏం కూర చెయ్యాలన్న దగ్గర్నుండి, ఏ సినిమాకు వెళ్ళాలన్నదాకా ప్రతిదాన్లో తనకి అసహనం. తాను చెప్పిందే వినాలన్న పంతం మొదలైంది. చెల్లెలి కాపురంలో సమస్యల వల్ల కావచ్చు అనుకుంటూ. నేనే ఓర్పుగా ఉంటున్నా. ఆఫీసు నుండి లేటుగా రావటం మొదలైంది. ఏదో నెలకో రెండు నెలలకో ఒకసారి ఫ్రెండ్స్‌తో పార్టీలంటూ వెళ్ళేవాడు ఉన్నట్టుండి వారానికి ఒకటి రెండుసార్లు అర్ధరాత్రి వరకూ పార్టీలంటూ తిరుగుతున్నాడు. అడిగితే, ‘ఇరవైనాలుగు గంటలూ నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక టైము లేవు నాకు. ఆదివారం ఇంట్లోనే ఉంటున్నాగా! పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలుంటాయి. అవి చూసుకోవాలి. అయినా నీకేం లోటు చేస్తున్నాను! నువ్వు మాత్రం లేటుగా రావటంలేదా అప్పుడప్పుడు ఆఫీసునుండి. అందరూ ఐదు గంటలకే వెళ్ళిపోతుంటే. నువ్వు ఆరు, ఏడు గంటలదాకా పనిచెయ్యటంలేదా! ఐనా నేనేం అనట్లేదే! నాకు కాఫీ కలుపుకోవటం కూడా రాదని నీకు తెలుసుకదా! అయినా ఓపిగ్గా ఎదురుచూశా కదా! నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు’ అని నన్నే దెప్పడం మొదలుపెట్టాడు.అమ్మ నాన్నలకు చెప్పుకుందామంటే సిగ్గేసింది. ఇంత చదువుకొని, ప్రేమించి పెళ్ళిచేసుకుని, నా కాపురం సరిగా లేదని ఎలా చెప్పగలను! అలా అని అనుభవించనూ లేను’’ అని తన బాధంతా వెళ్ళ గక్కింది నందిని.అంతా ఓపికగా విన్నది మాలతి... నెమ్మదిగా చెప్పసాగింది...‘‘చూడు నందినీ, నీ సమస్య నేను అర్థం చేసుకుంటున్నా. ప్రతి అమ్మాయికి పెళ్ళయ్యాక ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. మీరిద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నా, మీ పరిచయాలకి ముందు మీవి భిన్నమైన జీవితాలు. మీ మీ కుటుంబాల్లో కాస్త స్వతంత్రంగా ఉండి ఉంటారు. నీకన్నా తనకి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండి ఉండచ్చు. సమస్య తనదైనా, నీదైనా భార్యాభర్తలయ్యాక ఇద్దరు కలిసి చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే సులభంగా ఉంటుంది కదా!‘నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దాలని నేను ప్రయత్నిస్తుంటే తను సపోర్టు ఇవ్వటంలేద’నే భావన తనకు రాకూడదు కదా! ఇద్దరిలో కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళే చొరవ తీసుకుని సహాయానికి పూనుకుంటే, న్యాయంగా ఉంటుంది. రేపు నీకేదైనా నీ తోబుట్టువులకో, తల్లిదండ్రులకో సహాయం చేయవలసివస్తే తన సపోర్టు నీకు అవసరం కదా! తను ఆ సమస్య పరిష్కరించుకొనేందుకు సమయం కావాలనుకుంటే, నువ్వు కొంచెం భిన్నంగా తను ఇదివరకులా సమయం కేటాయించట్లేదని బాధపడుతున్నావా? అదృష్టంకొద్దీ మీకు ఆర్థిక ఇబ్బందులు లేవు.తన చెల్లెలి సమస్య వివరాలు ఎప్పుడైనా అడిగావా! సహాయం చెయ్యడానికి ప్రయత్నించావా?’’ అడిగింది మాలతి. ‘‘ఒకసారి అడిగా మేడం. వాళ్ళ చెల్లెలు ఆడపడుచు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రభాకర్‌ని ఇచ్చి చెయ్యాలని అనుకున్నారట. ప్రభాకర్ అప్పటికే నామీద ప్రేమలో ఉన్నాడు. ఆ విషయం చెప్పి కుదరదని చెప్పాడట. మొదట్లో భారీగా కట్న కానుకలు వచ్చాయని సరిపెట్టుకున్నా, తర్వాత తర్వాత వాళ్ళ చెల్లెల్ని సతాయించటం మొదలుపెట్టారట. ప్రభాకర్ ఒకసారి ఆ అమ్మాయిని కూడా కలిసి అంతా చెప్పాడట. ఆ అమ్మాయి అర్థంచేసుకొని అడ్జస్ట్ అయ్యిందికానీ, అత్తమామల ధోరణిలో మార్పులేదు. ఇక ఈ విషయంలో నేను ప్రభాకర్‌కి ఏం సహాయం చెయ్యగలను? నేనేదైనా చెప్పబోతే, ఒకసారి కరుగ్గా ‘ఈ సమస్యకి ఒక కారణం నువ్వు కూడా... నువ్వు తలదూరిస్తే, సమస్య ఇంకా పెద్దదవుతుంది.దయచేసి దీనిలో జోక్యం చేసుకోకు’ అన్నాడు. ‘అయితే, ఈ సమస్యకి పరిష్కారం నువ్వు రోజూ నీ స్నేహితులతో తాగి తందనాలాడి ఇంటికి వస్తే దొరుకుతుందా?’ అని నేనూ ఆవేశంగా అన్నా... అంతే, అప్పట్నుంచి దూరం పెరిగింది.. హాయిగా సాగిపోతున్న మా కాపురంలో కలతలు, అపార్థాలు మొదలయ్యాయి. ప్రభాకర్ నన్ను తక్కువగా చూసినా అవమానకరంగా మాట్లాడినా, నేను తట్టుకోలేను. ఇదీ మా కథ మేడం. ఉద్యోగం సరిగా చెయ్యలేకపోతున్నా. రాజీనామా చేద్దామని చాలాసార్లు అనుకున్నా. మళ్ళీ ఇంట్లో ఒక్కతినే ఉంటే ఆలోచనలు ఎక్కువై కుంగిపోతానేమో అని భయపడి చెయ్యలేదు.’’ చెప్పింది నందిని.మాలతి శ్రధ్ధగా విన్నది. ఒక పది నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.పది నిమిషాలయ్యాక మాలతి మౌనాన్ని ఛేదిస్తూ, ఇలాఅంది: ‘‘నందినీ, నీ సమస్య కొంచెం జటిలంగానే ఉంది. ఓపిగ్గా పరిష్కరించుకోవాలి. ఇందులో నీ తప్పేమీలేదని కూడా నాకు అర్థమయ్యింది. కానీ ఇలా దూరాలు పెంచుకొని , శాశ్వతంగా దాంపత్య బంధం తెంచుకోవటంకన్నా, దాన్ని మరింత బలపరుచుకోవటం మీద దృష్టి పెడితే మంచిదని నాకనిపిస్తుంది. భార్యా భర్తల మధ్య ఒక జీవితకాల ప్రయాణం ఉంటుంది. ప్రయాణం ఇద్దరిదీ, కాని మార్గం ఒక్కటే! గమ్యం కూడా ఒక్కటే కావాలి. ఇది నిండు జీవితానికి సంబంధించిన సమస్య. నీ భర్త దుర్మార్గుడైతే, శారీరకంగా, మానసికంగా నిన్ను ఇబ్బంది పెట్టేవాడయితే, ఆ బంధాన్నే పట్టుకుని వేలాడమని చెప్పను.నువ్వు చెప్పినదాన్ని బట్టి అతను స్వతహాగా మంచివాడే. పరిస్థితుల ప్రభావంవల్ల ఇబ్బందులు పడుతూ, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంచుమించు నీలాంటి పరిస్థితే నాకు ఎదురైనప్పుడు, నేను ఆత్మాభిమానం గురించి ఎక్కువగా ఊహించుకొని, నా భర్తకు దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అన్నీ ఉన్నా ఏదో వెలితి. తను నన్ను వదిలేసి లండన్ వెళ్ళిపోయాడు. మరోపెళ్ళి గురించి కూడా ఆలోచించా. కాని తన స్థానంలో ఇంకో వ్యక్తిని ఊహల్లో కూడ భరించలేకున్నా. నన్ను చండశాసనురాలు అనుకుంటారు కానీ, పని మీద ఫోకస్ పెట్టి వ్యక్తిగత బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా.చివరగా నేను చెప్పేదేమిటంటే, నామాట విని కొంచెం నెమ్మదిగా ఓర్పుగా, మళ్ళీ ప్రయత్నించు తనకు దగ్గరవటానికి. నీకు ఈ సలహాతో పాటు ఒక సహాయం కూడా చేస్తున్నా. రేపటి నుంచి నీకు ఒక నెలరోజులు పెయిడ్ లీవ్ శాంక్షన్ చేస్తున్నా. మీ వారికి రాజీనామా చేశానని చెప్పు. ఈ నెలరోజులూ తన మనసు గెలవడానికి ప్రయత్నించు. నా సపోర్టు నీకెప్పుడూ ఉంటుంది. అవసరమైతే లీవ్ పొడిగించుకో.’’ అంటూ ముగించింది మాలతి.నందినికి మనసంతా చాలా తేలికపడింది. ‘‘థాంక్యూ వెరీమచ్ మేడం! మీ మేలు మరచిపోలేను. తప్పకుండా మీ సలహా పాటిస్తా’’ అని సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసింది.ఇంటికెళ్ళేటప్పటికి ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు. గబగబా రెడీ అయ్యి, తనకిష్టమైన వంట చేసి, ఎదురుచూడసాగింది. ప్రభాకర్ కొంచెం లేటుగానే వచ్చాడు. నందిని ప్రశాంతంగా ‘‘రా వడ్డిస్తాను’’ అని టేబుల్ సర్దుతూ కూచుంది.మామూలుగా ఐతే ఈపాటికి ఒక చిన్నపాటి గొడవ అయితే కానీ భోజనం ఉండేది కాదు ప్రభాకర్‌కి. కాస్తంత రిలీఫ్‌గా ఫీలై వచ్చి కూర్చున్నాడు. వంట అంతా తన కిష్టమైన పదార్ధాలే! తృప్తిగా భోజనం చేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నందిని అన్నీ సర్దేసి వచ్చేసరికి ప్రభాకర్ సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాడు. లేపి బెడ్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి, తను పడుకుంది నందిని.మర్నాడు తెల్లవారింది. ప్రభాకర్ మామూలుగా ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. తనతోపాటు పరుగులు పెడుతూ, ఆఫీసుకు తయారయ్యే నందిని ప్రశాంతంగా కూర్చుని ఉంది.‘‘ఏం నందినీ ఆఫీసులేదా!’’ అడిగాడు ప్రభాకర్. ‘‘ఉద్యోగానికి రిజైన్ చేశా’’ అంది నెమ్మదిగా.ఉలిక్కి పడ్డాడు ప్రభాకర్. ‘విన్నది తానేనా! అన్నది నందినేనా! తను ఉద్యోగం రిజైన్ చెయ్యటమా?’... కొద్ది క్షణాలకు తేరుకుని... ‘‘నిజంగానా, ఎందుకు, ఏమైంది?’’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘మరేంలేదు. ఈ ఉరుకులు పరుగులు వదిలేసి, మన జీవితాలు కొంచెం ఆనందంగా, హాయిగా ఉండాలని బ్రేక్ తీసుకున్నా. నువ్వు ఆఫీసుకు వెళ్ళిపో... సాయంత్రం ఎదురుచూస్తూంటా, బై...’’ అని సాగనంపింది.ఒక వారం రోజులు ఇలాగే గడిచాయి. ప్రభాకర్‌కి కావల్సినవి అరేంజ్ చెయ్యటం తప్ప ఏం రియాక్టవకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది నందిని.ఒకసారి డ్రింక్ చేసి లేట్‌గా వచ్చినా మౌనంగా సర్దుకుపోయింది. ఇంకో నాలుగు రోజులు పోయాక ప్రభాకర్‌లో కొంచెం కదలిక ప్రారంభమైంది. ‘అరే, తను నందిని తన సమస్యతో బాధపెడుతున్నాడా! తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదిలేసేటట్టు చేశాడా! తను ఇలాగే మౌనంగా ఓర్చుకుంటూ, కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే... తన జీవితం ఏమైపోతుంది! సరిగా గమనించలేదు కానీ, నందినిలో మునుపటి చలాకీతనం, ఉత్సాహం పూర్తిగా మాయమయ్యాయి. తనే చొరవ తీసుకొని నందినితో మునపటిలా ఉండాలి’ అనుకుంటూ మరో రెండు రోజులు గడిపేశాడు. ఆరోజు ఆదివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మామూలుగానైతే, బైటకెళ్ళి సినిమాకో, షికారుకో వెళ్ళి హోటల్లో డిన్నర్ చేసి వచ్చేవాళ్ళు. ఈమధ్య తను చెల్లెలి సమస్యతో నందినిని దూరం పెడుతున్నాడు. ఆలోచిస్తూనే ఇద్దరూ కాఫీ టిఫిన్లు పూర్తి చేశారు. ఇంతలో నందినే చొరవ తీసుకొని దగ్గర కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టింది.‘‘ప్రభా! మన మధ్య దూరం రోజురోజుకి పెరుగుతోందని అర్థమవుతోంది. నావంతు ప్రయత్నంగా నిన్ను కంఫర్ట్ జోన్లో పెట్టడానికి నా ఉద్యోగానికి కూడా రిజైన్ చేశా. నీ సమస్యకి నేనేమీ చెయ్యలేనని అన్నావు కాబట్టి ఆ విషయం గురించి కూడ మాట్లాడలేదు. కానీ, నువ్వు మారుతావన్న నమ్మకం తగ్గిపోతోంది. నీ మౌనం నన్ను కాల్చేస్తోంది. నీకు దూరం అవుతానేమో అన్న ఆలోచనే భయంకరంగా ఉంది. మన బంధం మునుపటిలా ఉండాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నీకోసం ఏం కావాలన్నా చేస్తా!’’ నందినికి భావోద్వేగంతో మాటలు పెగలటంలేదు.ఇంకా ఏదో చెప్పబోయేంతలో... అప్పటికే కదిలిపోయిన ప్రభాకర్– నందినికి దగ్గరగా జరిగి గబుక్కున తనని దగ్గరికి తీసుకుని, ‘‘సారీ నందూ! ఇంకేం మాట్లాడకు. తప్పంతా నాది. నా సమస్యని నీ మీద రుద్ది నిన్ను బాధపెట్టాను. మనమధ్య పెరిగిన ఈ దూరంతో నీకన్నా నేనే ఎక్కువ నష్టపోయాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు. తిట్టుకుంటూనో, పొగుడుకుంటూనో కలిసుంటేనే ఆనందం. విడిపోతే ఏముంటుంది! మా చెల్లెలు వాళ్ళకు దూరంగా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా. అదైపోతే ఈ గొడవ కూడా ఉండదు. కాకపోయినా పర్లేదు. నీ విలువేంటో నాకర్థమైంది. నువ్వు మళ్ళీ నీ ఉద్యోగం కోసం ప్రయత్నించు. లేదా ఇంకో జాబ్ కోసం ప్రయత్నించు. నాకు నా మునుపటి నందిని కావాలి...’’ చెప్పుకుంటూ పోతున్నాడు ప్రభాకర్.నందినికి సంతోషంతో మాటలు రావటంలేదు. క్షమ, ఓర్పు ఎంత గొప్పవో అని మాలతి చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. మాలతి మీద కృతజ్ఞతతో మనçసు నిండిపోయింది. ప్రభాకర్‌ని హత్తుకొని గుండెలమీద తలవాల్చి అలాగే ఉండిపోయింది.నందినితో మాట్లాడిన రాత్రి మాలతి– లండన్‌లో ఉన్న భర్త మధుసూదన్‌కి కాల్ చేసింది. ‘‘హాయ్ మధూ! ఎప్పుడు ముగుస్తోంది నీ లండన్ అజ్ఞాతవాసం! రెండేళ్ళు కావొస్తోంది– కెరీర్, బిజినెస్ అంటూ నువ్వక్కడ నేనిక్కడ... డిసెంబరు లోపల రాకపోయావో, ఆఫీసు క్లోజ్ చేసి లండన్ వచ్చేస్తా! ఈ ఒంటరి జీవితం నా వల్లకాదు...’’ ఇంకం పూర్తి చెయ్యకముందే, అట్నుంచి మధు అనబడే మధుసూదన్ ‘‘మహాతల్లీ! ఆ పని చెయ్యకు. ఈలోగా వచ్చేస్తాగా!’’‘‘సరే, చెప్పాగా రాకపోతే ఏమవుతుందో... అన్నట్టు మధూ! నీకొక సంగతి చెప్పాలి. మా ఆఫీసులో నందిని అనే సిన్సియర్ ఎంప్లాయీ గురించి చెప్తుంటా కదా! తన కాపురం చక్కదిద్దటానికి, మనిద్దరం విడిపోయామని, నువ్వు దుర్మార్గుడివని, నన్ను వదిలేసి వెళ్ళిపోయావని చెప్పా’’ అంటూ జరిగిందంతా చెప్పింది మాలతి. విని, నవ్వుతూ అన్నాడు మధు ‘‘పర్లేదు మాలా! చాలాసార్లు సరైన సలహాలు దొరకక, చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ, అందమైన దాంపత్యం జీవితానికి దూరం అవుతుంటారు చాలామంది. మంచి పని చేశావు. వాళ్ళ కాపురం చక్కబడాలని కోరుకుందాం. ఉంటామరి... బై!’’ అని ఫోన్ పెట్టేశాడు మధు. - పి.ఎ.యస్. సుధాకరరావు -
లాకప్‌లో హత్య..
సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఆ రాత్రి చాలా నిశ్శబ్దంగా ఉంది. మరికొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న హెడ్ కానిస్టేబుల్ పరమశివం స్టేషన్ ముఖద్వారం వద్ద సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. లాకప్‌లో చైన్ స్నాచర్ తంగవేలు ఒక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, తెల్లవారేసరికి తంగవేలు లాకప్‌లోనే శవమై కనిపించాడు. స్టేషన్ లో కలకలం రేగింది..∙∙ డీసీపీ... ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు చూసి చెప్పాడు.‘మీరు ఎన్నో కేసులను అవలీలగా పరిశోధించారు. ఈ కేసు మన డిపార్ట్మెంట్కు సవాలు... పాపం సెంట్రీ పరమశివానికి రిటైర్ కాబోతున్న సమయంలో కోలుకోలేని దెబ్బ అవుతుంది. పరమశివాన్ని వెంటనే సస్పెండ్ చేయమని పైనుంచి ఒత్తిడి.. డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే నెపంతో పరమశివాన్ని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేస్తే అతనికి చివరి క్షణాల్లో బ్లాక్ మార్క్‌గా ఉంటుంది. దీన్ని లాకప్ డెత్‌గా మీడియా ప్రచారం చేస్తుంది. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే మీరే వెంటనే ఈ కేసులోని నిజనిజాల నిగ్గు తేల్చాలి.’’జీవితాంతం మచ్చలేని రికార్డుతో బతికిన పరమశివం, ‘‘సార్, నేను నిరపరాధిని. రాత్రి ఎవరు వచ్చారో, ఎలా చనిపోయాడో నాకు తెలియదు’’ అని ఇన్స్పెక్టర్ అభిమన్యు ముందు కన్నీటి పర్యంతం అయ్యాడు..అభిమన్యు– తంగవేలు శవాన్ని పరిశీలించాడు. తంగవేలు శరీరం మీద ఎక్కడా గాయాలు లేవు. తంగవేలు నోటి లోపలి భాగంలో స్వల్పంగా రంగు మారడాన్ని గమనించి, శవాన్ని పోస్ట్‌మార్టంకు పంపాడు. రిపోర్ట్‌లో ఒక ఘోరమైన విషయం బయటపడింది. తంగవేలు సహజంగా చనిపోలేదు. అతడికి ‘పొటాషియం సైనైడ్’ ఇచ్చారు.అభిమన్యు అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చిన వారి వివరాలను సేకరించాడు. లాగ్ బుక్‌లో ఎవరి పేరూ లేదు. సెంట్రీ పరమశివాన్ని మళ్లీ ప్రశ్నించాడు. ‘రాత్రి ఎవరైనా వచ్చారా? కనీసం టీ అమ్మేవాడు కూడా రాలేదా?’ అని అడిగాడు. పరమశివం ఆలోచించి, ‘రాత్రి ఒంటిగంట సమయంలో స్టేషన్ కు రెగ్యులర్‌గా టీ ఇచ్చే సుబ్బు రాలేదు సార్! అతడి బదులు మంగళ్ అనే కొత్త అబ్బాయి వచ్చాడు. తంగవేలుకు కూడా ఒక కప్పు టీ ఇచ్చాడు. నేను గేటు దగ్గరే ఉన్నాను, లోపలికి ఎవరు వెళ్లలేదు’ అని చెప్పాడు. అభిమన్యు వెంటనే టీ దుకాణం యజమానిని పిలిపించాడు.‘నిజం చెప్పు... రాత్రి స్టేషన్లోకి వచ్చింది ఎవరు?’ అని అడిగాడు.‘రాత్రి సుబ్బుకు ఒంట్లో బాగోలేదని, మంగళ్ అనే వ్యక్తి తానే స్వచ్ఛందంగా టీ డెలివరీ చేస్తానని వెళ్లాడని టీ దుకాణం యజమాని మాటల ద్వారా తెలిసింది. అభిమన్యు తంగవేలు పాత నేరాల రికార్డులను తిరగేశాడు. ఒక పాత దొంగతనం కేసులో తంగవేలుతో పాటు ‘మంగళ్’ అనే పేరున్న వ్యక్తి నిందితుడిగా ఉన్నట్లు గమనించాడు. ఇద్దరూ తోడు దొంగలు అన్న నిజం అభిమన్యుకు అర్థమైంది. మరుసటి రోజు కోర్టులో తంగవేలు నోరు విప్పితే, తమ పాత నేరాలు, అందులో తన పాత్ర కూడా బయటకు వస్తుందని మంగళ్ భయపడ్డాడు. అందుకే తంగవేలును శాశ్వతంగా మౌనంగా ఉంచాలని ప్లాన్ చేశాడు.మంగళ్ పక్కా ప్లాన్ తో టీలో సైనైడ్ కలిపాడు. రాత్రి స్టేషన్ కు వచ్చి సెంట్రీ పరమశివానికి ఒక కప్పు నార్మల్ టీ ఇచ్చాడు. ఆ తర్వాత లాకప్‌లో ఉన్న తంగవేలు దగ్గరకు వెళ్లాడు. పరమశివం దూరంగా ఉండటం, చీకటిగా ఉండటంతో లోపల ఏం జరుగుతోందో గమనించలేకపోయాడు. మంగళ్ సైనైడ్ కలిపిన టీ కప్పును తంగవేలుకు అందించాడు. తంగవేలు తన మిత్రుడిని చూసి నమ్మి ఆ టీ తాగాడు. తాగిన కొద్ది క్షణాల్లోనే నోరు విప్పకుండానే ప్రాణాలు విడిచాడు. మంగళ్ ఖాళీ గ్లాసును తీసుకుని ఏమీ ఎరగనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు.∙∙ మంగళ్ పాతబస్తీవైపు తప్పించుకున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు అతణ్ణి తేలికగానే పట్టుకున్నారు. కొద్ది గంటల్లోనే మంగళ్– అభిమన్యు ఎదురుగా నిలబడి వున్నాడు. పరమశివానికి సైగ చేశాడు అభిమన్యు, పరమశివం బయటకు వెళ్లి టీ తీసుకువచ్చాడు. మంగళ్‌కు ఇవ్వమన్నాడు అభిమన్యు. భయంగా చూశాడు మంగళ్.‘తీసుకో మంగళ్... రాత్రి నువ్వు నీ ఫ్రెండ్ తంగవేలుకు ఇచ్చిన టీ లాంటిదే. తాగు... తాగేశాక నువ్వు వెళ్లిపోవచ్చు... శాశ్వతంగా’ నవ్వుతూ అన్నాడు. మంగళ్ వెన్నులో వణుకు మొదలైంది. అతనికి అభిమన్యు సంగతి తెలుసు. అభిమన్యు విచారించే పద్ధతీ తెలుసు.‘మొత్తం చెప్పేస్తాను... నేను తంగవేలు తోడు దొంగలం. ఎక్కడ నా పేరు చెప్పి నన్ను కూడా ఈ కేసులో ఇరికిస్తాడనే భయంతో టీలో విషం కలిపి చంపాను. ఎవ్వరికీ ఏ అనుమానం రాదనుకున్నాను.’ పరమశివం చేతిలో వున్న టీ వంక, తన ఎదురుగా సింహంలా నిలబడి వున్న అభిమన్యు వంక చూసి చెప్పాడు. మంగళ్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌కు తరలించారు. పరమశివం నీళ్లు నిండిన కళ్ళతో అభిమన్యుకు చేతులు జోడించాడు.‘నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు... ఆ టీ మీ కోసమే తాగండి.’ అంటూ బయటకు నడిచాడు.అభిమన్యు కేసును పన్నెండు గంటల్లోనే పరిష్కరించాడు. అమాయకుడైన పరమశివంపై పడిన నింద తొలగిపోయింది. అతను గౌరవంగా రిటైర్ అవ్వడానికి అభిమన్యు కారణమయ్యాడు. హంతకుడు మంగళ్ కటకటాలపాలయ్యాడు. - శ్రీసుధామయి -
భూలోకానికి వస్తే.. ఏలియన్స్ ఏం తింటారు?!
1982 నాటి స్టీవెన్ స్పీల్బర్గ్ సూపర్ హిట్ సినిమా ‘ఇ.టి. – ది ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్’లో.. భూమి మీదకు వచ్చి దారి తప్పిన ఒక ఏలియన్ని మచ్చిక చేసుకోవటానికి ఎలియట్ అనే ఒక చిన్న పిల్లాడు, ఆ ఏలియన్‌కి ‘రీసెస్ పీసెస్’ చాక్లెట్ జెమ్స్‌ని ఎరగా వేస్తాడు. ఒకవేళ నిజంగానే ఏలియన్స్ మన భూమి మీదకు వస్తే, అవి చాక్లెట్లు తింటాయా? వేరే ఏవైనా రుచులను కోరుకుంటాయా? శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆ విషయాన్ని కనిపెట్టే పనిలోనే ఉన్నారు!స్పెయిన్‌లోని వాలెన్సియా యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ జోస్ డెల్ కాస్టిల్లో చెబుతున్న దాని ప్రకారం, మన భూమి ఏలియన్స్‌కి ఒక ప్రమాదకరమైన విందు లాంటిది. ఒకవేళ ఏలియన్స్ శరీరం కూడా మనలాంటి జీవక్రియలతోనే నడుస్తూ ఉన్నా కూడా మనకు జీర్ణమయ్యే ఆహారం వాళ్లకు అరుగుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు.మరి వాళ్లేం తింటారు?ఏలియన్స్ కనుక భూమి మీదకు వస్తే మనం వండుకునే వంటకాల జోలికి పోకుండా, భూమిపై దొరికే ముడి పదార్థాల మీద పడతారట! ‘ది కాన్వర్జేషన్’ అనే జర్నల్‌లో డెల్ కాస్టిల్లో రాసిన దానిని బట్టి.. ఏలియన్స్ బ్రతకడానికి మన ఫుడ్ అక్కర్లేదు. నీరు, నైట్రోజన్, ఫాస్పరస్, ఐరన్, లవణాలు, కొవ్వులు, మైనం, సూక్ష్మజీవులు లేదా సాధారణ సేంద్రీయ అణువుల వంటి ముడి దినుసులు ఉంటే చాలు, వాటినే లాగించేస్తారు.కానీ ఇక్కడే ఆయన ఒక ట్విస్ట్ ఇచ్చారు! సినిమాల్లో ఏలియన్ విమానాలు (యు.ఎఫ్.ఓ.లు) వచ్చి భూమి మీద ఉన్న ఆవులను అంతరిక్షంలోకి లాగేస్తుంటాయి కదా? అది కేవలం కల్పితం కాకపోవచ్చని డెల్ క్యాస్టిల్లో అంటున్నారు! ఎందుకంటే ఆవులలో ఏలియన్స్‌కి కావలసిన పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయట. కాబట్టి ఆవుల కిడ్నాప్ సీన్ వెనుక బలమైన సైన్స్ ఉందనే అనుకోవాలి. కనీస ఆహారానికి భరోసాభూమి మీదున్న జంతువుల జీర్ణవ్యవస్థలు ఒక్కోటీ ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు, ఆవులనే చూడండి. అవి గడ్డిలోని సెల్యులోజ్‌ని అరాయించుకోవాలంటే వాటి కడుపులో ఉండే బ్యాక్టీరియా సహకారం ఉండాలి. భూమ్మీద ఉన్న ప్రాణులకే ఇలాంటి తిప్పలు ఉంటే, ఇక అంతరిక్షం నుంచి వచ్చే ఏలియన్ల ‘సహజమైన డైట్’ ఎలా ఉంటుందో ఊహించడం దాదాపు అసాధ్యమని కూడా ప్రొఫెసర్ డెల్ కాస్టిల్లో అంటున్నారు. అయితే, విశ్వంలో ఏ జీవికైనా వర్తించే కొన్ని సార్వత్రిక నియమాలను బట్టి ఏలియన్స్ డైట్ విషయమై ఒక అంచనాకు రావచ్చు.సాధారణంగా జీవం మనుగడ సాగించాలంటే మూడు విషయాలు ప్రాథమికం. అవి : ఒక శక్తి వనరు (సోర్స్ ఆఫ్ ఎనర్జీ), రసాయన చర్యలు జరగడానికి ఒక ద్రవపదార్థం (లిక్విడ్), సరైన రసాయన మూలకాలు (కెమికల్ ఎలిమెంట్స్). ఈ మూడూ మన భూమి మీద సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి ఏలియన్స్ ఇక్కడికి వచ్చి ఆకలితో అలమటించాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా చెప్పాలంటే.. బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఏలియన్స్ అయితే, భూమ్మీద దొరికే ఏ సేంద్రీయ పదార్థాలనైనా వ్యాక్యూమ్ క్లీనర్లా జర్రున జుర్రుకొని తమ జీర్ణవ్యవస్థకు సెట్ అయ్యేలా ప్రాసెస్ చేసుకునే వింత మిషన్లను కూడా వాడుతూ ఉండి ఉండొచ్చు కూడా! ఏలియన్ న్యూట్రిషనిస్టులు!మన భూమ్మీద జీవానికి అవసరమైన లవణాలు, కొవ్వులు, చక్కెరలు ఎంత ఉన్నాయో... అంతే స్థాయిలో ప్రమాదకరమైన విషపదార్థాలు, వైరస్–బ్యాక్టీరియాలు, ఎలర్జీ కలిగించే సూక్ష్మక్రిములు కూడా ఉన్నాయి. ‘‘భూమిపై దొరికే ఆహారం వాళ్లకు కచ్చితంగా తినదగినదిగా ఉండాలని రూల్ లేదు’’ అని ప్రొఫెసర్ డెల్ కాస్టిల్లో అంటున్నారు. ‘‘ఒకవేళ వాళ్ల జీర్ణవ్యవస్థ వేరే రకమైన అమైనో ఆమ్లాలను ఉపయోగిస్తుంటే... మన భూమ్మీద దొరికే ప్రోటీన్లు వాళ్లకు ఏమాత్రం పనికిరావు. అలాగే వాళ్ల మెటబాలిజం (జీవక్రియ) గనుక తట్టుకోలేకపోతే.. మన చక్కెరలు కూడా వాళ్లకు వృథా అయిపోతాయి. సుదూర భవిష్యత్తులో మానవాళి నిజంగానే ఏదైనా గ్రహాంతర నాగరికతతో కలిస్తే గనుక, భూమిపై ‘ఏలియన్ న్యూట్రిషనిస్టు’లను (గ్రహాంతర పోషకాహార నిపుణులను) తయారు చేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్ సరదాగా అంటున్నారు.ఆయన మాటల్లో చెప్పాలంటే: ‘‘ఆ వింత జీవుల శరీరాలు ఏ అణువులను తట్టుకోగలవు? వాళ్లకు ఎంత శక్తి కావాలి? ఏది తింటే వాళ్లు చచ్చిపోతారు? వాళ్లు తమతో పాటు ఎలాంటి సూక్ష్మజీవులను మోసుకొస్తున్నారు? మన భూమి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా వాళ్లు ఇక్కడి ఏ వనరులను వాడుకోవచ్చు?.. ఇవన్నీ లెక్కగట్టే నిపుణులు మనకు అత్యవసరం.’’ అయితే ఈ వివరాలన్నీ ఆ ఏలియన్ ఏ గ్రహానికి చెందినవారు, వారి బాడీ టైప్ ఏంటి అనేదానిపై ఆధారపడి ఉన్నప్పటికీ... సైంటిస్టులు ఇప్పటి నుంచే వాళ్లకు రోజుకి ఎన్ని క్యాలరీల శక్తి కావాలో అంచనా వేయడం మొదలు పెట్టేశారు!కనీసం 3 వేల క్యాలరీలుభూమ్మీద ఉన్న జంతువుల లెక్క ప్రకారం... ఒక ప్రాణి పరిమాణం పెరిగేకొద్దీ, దానికి కావలసిన క్యాలరీల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ, అది ఒకే నిష్పత్తిలో పెరగదు. పరిమాణం రెట్టింపు అయితే క్యాలరీలు రెట్టింపు కావు. ఉదా: ఒక ఎలుకతో పోలిస్తే ఏనుగుకి ఎక్కువ శక్తి కావాలి. కానీ, శరీర బరువు నిష్పత్తి చూసుకుంటే, ఏనుగు వాడే క్యాలరీలు ఎలుక కంటే తక్కువగా ఉంటాయి.ఈ లెక్కన ఒక 70 కేజీల బరువున్న ఏలియన్ కి రోజుకు దాదాపు 1,700 క్యాలరీల శక్తి కావాలి. అదే బాగా లావుగా ఉండి, ఒక 150 కేజీల బరువున్న ఏలియన్ అయితే... ఒకే చోట కదలకుండా కూర్చోవడానికే ఆ ఏలియన్‌కు రోజుకు 3,000 క్యాలరీలకు పైగా శక్తి అవసరమవుతుంది. అయితే ఇది కేవలం ఆ జీవి ప్రాణాలతో ఉండటానికి కావలసిన కనీస క్యాలరీల లెక్క మాత్రమే! ఏలియన్స్ నడవాలన్నా, ఆలోచించాలన్నా, స్పేస్ షిప్ మిషన్లను ఆపరేట్ చేయాలన్నా, యు.ఎఫ్.ఓ.లను నడపాలన్నా అందుకు కావాల్సిన అదనపు ఎనర్జీ లెక్క వేరే ఉంటుందిఅసలు తిండి అవసరమా?!చాలామంది సైంటిస్టుల అంచనా ప్రకారం అంతరిక్షం నుండి మనల్ని చూడటానికి వచ్చే మొదటి గ్రహాంతరవాసి, రక్తమాంసాలతో ఉన్న ప్రాణి కాకపోవచ్చు. అది ఒక యాంత్రిక శోధన నౌక (రోబోటిక్ ప్రోబ్) అయ్యుండే అవకాశమే ఎక్కువ. పైగా ఆ ఏలియన్స్ కనుక బాగా అడ్వాన్స్ అయిపోయినవి కనుకైతే, ఈసరికి తమ ‘మాంసపు ముద్ద’ లాంటి శరీరాలను వదిలేసి కృత్రిమ దేహాలతో రోబోటిక్ అవతారాలుగా మారిపోయి ఉండొచ్చు. ప్రొఫెసర్ డెల్ కాస్టిల్లో చెబుతున్నట్లు ‘‘వాళ్ల ‘ఫుడ్’.. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు కావు. కేవలం విద్యుత్, వేడి, కెమికల్ ఫ్యూయల్ లేదా న్యూక్లియర్ ఎనర్జీ మాత్రమే! అంటే ఒక సాకెట్ చూసుకుని, అందులో ప్లగ్ పెట్టి, తన బ్యాటరీని రీఛార్జ్ చేసుకోవటమే ఆ ఏలియన్‌కి కావలసింది. ఇంతవరకూ ఎందుకు రాలేదు? ఏలియన్స్ భూమి మీదకు రాలేకపోవటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండి వుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. టెక్నాలజీ లేకపోవడం: తెలివైన ఏలియన్స్ ఉన్నప్పటికీ... మనతో కమ్యూనికేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ వాళ్ల దగ్గర లేకపోవచ్చు.అనంతమైన దూరాలు: రెండు నాగరికతల మధ్య దూరాలు మరీ ఎక్కువగా ఉండటం. ఉదాహరణకు రెండు గ్రహాల మధ్య దూరం కొన్ని వేల కాంతి సంవత్సరాలు ఉందనుకోండి... ఒకరికొకరు మెసేజ్ పంపుకుని, అది చేరేలోపే ఆ రెండు నాగరికతల్లో ఒకటి లేదా రెండూ కూడా పూర్తిగా అంతరించిపోవచ్చు!జూ హైపోథెసిస్: ఇది వింటే పిచ్చెత్తి పోతుంది. ఈ సిద్ధాంత ప్రకారం.. తెలివైన ఏలియన్స్ ఇప్పటికే మన చుట్టూనే ఉన్నారు! కానీ భూమి మీద ఉన్న జీవజాలం సహజంగా ఎదగాలని, మనల్ని ఒక ‘జూ’ లో జంతువులను చూసినట్లు దూరం నుండి చూస్తూ... కావాలనే మనకు దొరక్కుండా తప్పుకు తిరుగుతున్నారు!తినే పనైతే ఎంత తింటాయి?బుజ్జి ఏలియన్స్: వీళ్లు చూడటానికి పచ్చగానో, బూడిద రంగులోనో ఉండి, 25 నుండి 40 కేజీల బరువు ఉంటారు. వీళ్లకు రోజుకు 800 నుండి 1,100 క్యాలరీల శక్తి ఉంటే సరిపోతుంది. కానీ సినిమాల్లో చూపించినట్లు వీళ్ల శరీరం కంటే తల పెద్దగా ఉండి, అందులో మహా చురుకైన ‘పెద్ద బ్రెయిన్’ గనుక ఉంటే... ఈ క్యాలరీల లెక్క ఇంకాస్త పెరగొచ్చు! రెప్టీలియన్ ఏలియన్స్: వీళ్లు గుడ్లు పెట్టే భూచర జీవుల వంటివారు. ఒకవేళ ఈ ఏలియన్స్ గనుక బల్లి, ఊసరవెల్లి లాంటి శీతల రక్త జీవులైతే... 100 కేజీల బరువున్నా సరే, వీళ్లు చాలా తక్కువ క్యాలరీలతోనే నెట్టుకొచ్చేస్తారు. అలా కాకుండా... వాళ్లు మహా తెలివైన, చురుకైన వాళ్లు అయితే మాత్రం 150 కేజీల బరువుండే ఒక ఏలియన్‌కు రోజుకు కనీసం 3,000 క్యాలరీలు తప్పనిసరి. పొడుగు బాబులు: మనుషుల్లో ఉన్నట్లే పొడవుగా ఉండే ఏలియన్స్ వీళ్లు. వీళ్ల శరీరం అచ్చం మన మనుషుల లాగే ఉంటుంది. కాబట్టి, ఒక 80 నుండి 90 కేజీల బరువుండే ఈ పొడవాటి హ్యూమనాయిడ్ ఏలియన్స్‌కి రోజుకు 1,900 నుండి 2,300 క్యాలరీల ఆహారం అవసరమవుతుంది.మానవాళికి పొంచి ఉన్న ప్రమాదం!మన పాలపుంతలో సుమారు 20,000 నుండి 40,000 కోట్ల నక్షత్రాలు, 10,000 కోట్ల గ్రహాలు ఉన్నాయని అంచనా. మరి ఇన్ని కోట్ల గ్రహాలు ఉన్నప్పుడు, ఒక్క ఏలియన్ కూడా ఇంతవరకు మనకు ఎందుకు తారసపడలేదు? ఈ వైరుధ్యాన్నే ‘ఫెర్మీ పారడాక్స్’ అంటారు. ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ పేరు మీదుగానే ‘ఫెర్మీ పారడాక్స్’ పేరు వచ్చింది. ఆయన 1950లోనే ఈ ప్రశ్నను ప్రపంచం ముందుకు తెచ్చారు.అంతరిక్షం అనంతంగా ఉన్నప్పుడు, కనీసం ఒక్క గ్రహాంతర సంకేతం గానీ, వాళ్లు కట్టిన వింత కట్టడం గానీ మన కంటికి చిక్కకపోవడం చాలా విచిత్రం అన్నారు. చివరికి ఆయన ఒక ముగింపునకు వచ్చారు. విశ్వంలో తెలివైన, టెక్నాలజీ ఉన్న, అంతరిక్షాన్ని జయించగల నాగరికతలు ఎదగకుండా అడ్డుకునే అడ్డంకి ఏదో ఉందంటారు ఫెర్నీ. ఆ ‘అడ్డు’నే శాస్తవేత్తలు ‘ది గ్రేట్ ఫిల్టర్’ అని పిలుస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ఆ అడ్డు తొలగిపోయే ప్రమాదం గతంలో జరగకుండా ఉంటే, ఆ ప్రమాదం కచ్చితంగా మానవాళి భవిష్యత్తులో పొంచి ఉన్నట్లే!వినాశనం తప్పదా?!బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త బ్రయాన్ కాక్స్ ఊహ ప్రకారం.. ఒక నాగరికత నక్షత్రాలను జయించే స్థాయికి ఎదగడానికి తోడ్పడే సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీలే... ఆ నాగరికత సర్వనాశనానికి కూడా కారణమవుతాయి. ఆయన మాటల్లో చెప్పాలంటే: ‘ఫెర్మీ పారడాక్స్కి ఒక సమాధానం ఏంటంటే... తనని తాను సర్వనాశనం చేసుకోగల శక్తి ఉన్న ప్రపంచాన్ని ఎక్కువ కాలం నడపడం ఏ జీవికైనా అసాధ్యం. సైన్స్, ఇంజనీరింగ్ పెరిగే వేగంతో పోలిస్తే... దేశాలను నడిపే రాజకీయ చాణక్యం, పరిణతి పెరగవు. అదే చివరకు మహా విపత్తుకు దారితీస్తుంది! అంటే.. ఏలియన్స్ స్పేస్ షిప్ కనిపెట్టే లోపే, అణుబాంబులు వేసుకుని మానవాళి కనుమరుగైపోతుందన్నమాట!∙ సాక్షి స్పెషల్ డెస్క్ -
సాహసోపేత సంబురం
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా పేరొందిన ‘శాన్ ఫెర్మిన్ ఫెస్టివల్’ వేడుకలకు స్పెయిన్‌లోని పాంప్లోనా నగరం సిద్ధమైంది. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాకెట్ లాంచింగ్‌తో ప్రారంభమయ్యే ఈ సంబరాలు, జూలై 14వ తేదీ, అర్ధరాత్రి క్యాండిల్ లైట్లో సాగే ‘పో బ్రే డి మి’ గీతాలాపనతో ముగుస్తాయి. జూలై మాసంలో ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలను కళ్లారా చూసేందుకు, ఇందులో భాగస్వాములయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. వారు దైవంగా నమ్మే ‘శాన్ ఫెర్మిన్ డి అమియన్స్’ జ్ఞాపకార్థం ఈ వేడుకలను నిర్వహిస్తారు. స్థానికంగా ‘శాన్ ఫెర్మినెస్’ అని పిలుచుకునే ఈ పండుగ 12వ శతాబ్దంలో మతపరమైన ఆచారాలు, పశువుల సంతలు, బుల్‌ఫైటింగ్ కలయికగా ప్రారంభమైంది. మొదట్లో ఈ వేడుకలు, ఊరేగింపులు సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో జరిగేవి. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల 1591లో నగర అధికారులు, చర్చి పెద్దలు కలిసి ఈ ఉత్సవాలను జూలై 7వ తేదీకి మార్చారు.ఒక ప్రత్యేక రాకెట్‌ను లాంచ్ చేయడం ద్వారా జూలై 6వ తేదీన ఈ ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. నగరం మొత్తం రంగురంగుల అలంకరణలతో, కోలాహలంగా మారుతుంది. ఊరేగింపులు తీస్తారు. సెయింట్ ఫెర్మిన్ పవిత్ర విగ్రహాన్ని పాంప్లోనా వీ«థుల్లో ఊరేగిస్తారు. పిల్లా పెద్దా ఈ వేడుకల్లో ఎంతో ఎంజాయ్ చేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రలను ప్రతిబింబించే భారీ ఆకారాలు, పెద్ద తలలు ఉన్న వింత బొమ్మలు నగర వీథుల్లో ఊరేగుతూ ప్రజలను అలరిస్తాయి. లైవ్ మ్యూజిక్ ఈ ఉత్సవాలకు మరింత ఊపునిస్తుంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్థానిక, అంతర్జాతీయ కళాకారులతో సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఈ దృశ్యాలన్నింటినీ నగరం అంతటా ఏర్పాటు చేసిన జంబో స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ పండుగలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ‘రన్నింగ్ ఆఫ్ ది బుల్స్’. ప్రతిరోజూ ఉదయం ఈ పందాన్ని నిర్వహిస్తారు. ఇందులో వందలాది మంది సాహసికులు ప్రాణాలకు తెగించి కోపంతో ఊగిపోయే ఎద్దులతో పాటు పరుగెడతారు. భయం, వేగం, సంప్రదాయం కలగలిసిన ఈ దృశ్యం వీక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకలకు జూలై 14 అర్ధరాత్రి వేళ ‘పోబ్రే డి మి’ అనే ముగింపు వేడుకతో తెరపడుతుంది. ప్లాజా కన్సిస్టోరియల్ వద్ద వేలాది మంది ప్రజలు వెలిగించిన కొవ్వొత్తులను చేతపట్టుకుని, పండుగ ముగిసిపోతున్నందుకు బాధపడుతూ, అదే సమయంలో వచ్చే ఏడాది సంబరాల కోసం ఉత్సాహం చూపిస్తూ ఈ సాంప్రదాయ గీతాన్ని ఆలపిస్తారు. స్పెయిన్ లోని ‘నవారే’ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ పండుగను ఒక ప్రపంచ స్థాయి అద్భుతంగా మార్చిన ఘనత మాత్రం ప్రసిద్ధ అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వేకే దక్కుతుంది. ఆయన 1923లో ఈ పండుగను స్వయంగా సందర్శించి, ఆ అనుభవాలతో 1926లో ‘ది సన్ ఆల్సో రైజెస్’ నవల రాశారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహస ప్రియులను, పర్యాటకులను పాంప్లోనా నగరం వైపు ఆకర్షించేలా చేసింది. ఈ ఉత్సవాలకు ఉన్న ప్రపంచ స్థాయి క్రేజ్‌ని గుర్తించిన స్పెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, దీనిని ‘అంతర్జాతీయ పర్యాటక ప్రాధాన్యం కలిగిన పండుగ’గా ప్రకటించింది.సెయింట్ ఫెర్మిన్ ఎవరంటే? చారిత్రక ఆధారాల ప్రకారం, సెయింట్ ఫెర్మిన్ మూడో శతాబ్దానికి చెందిన రోమన్ పౌరుడు. పాంప్లోనా నగరంలో జన్మించిన ఆయన, ఆ నగరానికి మొదటి బిషప్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని అమియెన్స్లో అమరవీరుడయ్యారు.∙ రమా జంబుల -
నేరేడులో మనమే టాప్
నేరేడు పండును జంబూఫలం అంటారు. నేరేడు వల్లనే మన భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ శుభకార్యాలు, పూజాదికాలలో సంకల్పం చెప్పేటప్పుడు ‘జంబూద్వీపే భరతవర్షే భరతఖండే’ అని చెబుతుంటారు. నేరేడు పండు భారత ఉపఖండ ప్రాంతంలో విస్తారంగా పండుతుంది. వేసవి చివరి రోజుల నుంచి వర్షాకాలం వరకు విరివిగా దొరుకుతుంది.‘జంబూఫలం’ అనే పేరు నుంచే హిందీలో దీనికి ‘జామున్’ అనే పేరు వచ్చింది. పురాతన కాలంలోనే కాదు, ఇప్పటికీ నేరేడు ఉత్పాదనలో మన దేశమే అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేరేడు ఉత్పాదనలో తొలి పది దేశాల గణాంకాలు చూద్దాం...నేరేడులోని పోషకాలునేరేడును మధుమేహానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. నేరేడు రసంతోను, నేరేడు గింజలతోనూ మధుమేహాన్ని అదుపు చేసే ఔషధాలు తయారవుతాయి. నేరేడు సహజసిద్ధంగా దొరికే పోషకఫలం. ఇందులోని పోషకాల వివరాలు తెలుసుకుందాం...నేరేడు ఉత్పాదనలోనే కాకుండా, నేరేడు ఎగుమతుల్లోనూ మన భారతదేశం అగ్రగామిగా కొనసాగుతోంది. నేరేడు ఎక్కువకాలం నిల్వ ఉండే పండు కాదు. అందువల్ల ‘ఇతర తాజాపండ్లు’ కేటగిరీ కింద వీటి ఎగుమతికి పరిమిత అవకాశాలు మాత్రమే ఉంటున్నాయి. నేరేడు వార్షిక ఎగుమతుల్లో టాప్–10 దేశాలు గణాంకాల్లో చూద్దాం... -
హ్యాపీ బర్త్‌డే టు చాక్లెట్
నవ్వుకు నాంది కావాలన్నా... ప్రేమకు కానుక కావాలన్నా... చిన్నారి ఏడుపు ఆపాలన్నా... పెద్దల ఒత్తిడి కరిగించాలన్నా.. అందరికీ గుర్తొచ్చే తీపి నేస్తం చాక్లెట్! చేతిలో ఇమిడిపోయేంత చిన్నదైనా... మనసంతా తీపితో నింపే శక్తి దీనిది. అందరి పుట్టినరోజులను తీపిగా మార్చే నీకు, ఈరోజు ప్రపంచం ‘హ్యాపీ బర్త్‌డే చాక్లెట్!’ అని పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 7న జరుపుకునే ‘చాక్లెట్ డే’లో ఒకటే రూల్... కేలరీలు లెక్కపెట్టకుండా చాక్లెట్ తినాలి... తింటూ ఆనందించాలి... ఆనందాన్ని పంచాలి!రూపాలెన్నో... రుచి ఒకటే!ఒకప్పుడు చాక్లెట్ అంటే జేబులో దాచుకుని స్కూల్లో తినే చిన్న ముక్క. అదృష్టం బాగుంటే చాక్లెట్ బార్! అంతకంటే బాగుంటే పెద్ద డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్! కానీ ఇప్పుడు చాక్లెట్ సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందంటే, మనం తినే ప్రతి తీపి పదార్థంలోనూ దాని సంతకం కనిపిస్తోంది. చాక్లెట్ ఇప్పుడు కేవలం ఒక స్వీట్ కాదు, అది ఒక ఫుల్‌టైమ్ సెలబ్రిటీ! ఐస్‌క్రీమ్‌లోకి దూకేస్తుంది, మిల్క్‌షేక్‌లో ఈదేస్తుంది, కేక్‌పై సింహాసనం వేసుకుని కూర్చుంటుంది. డోనట్స్లోనూ దాక్కుంటుంది, కుకీస్‌లో కలిసిపోతుంది. పండ్లతో జోడీ కడుతుంది. సిరప్స్‌లో కూడా జారిపోతుంది.అవసరమైతే కాక్టెయిల్స్తోనూ చేతులు కలిపేస్తుంది. ఇంతకీ చాక్లెట్ ఎన్ని రూపాల్లో ఉందో తెలుసా? చాక్లెట్ బార్, చాక్లెట్ బాల్స్, చాక్లెట్ ఐస్‌క్రీమ్, వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, హాట్ చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్, చాక్లెట్ కప్‌కేక్, ట్రఫుల్స్, ఫాండ్యూ... ఇలా లెక్కపెడుతూ పోతే చాక్లెట్ తినే టైమ్ మిస్ అయి పోతుంది! ఇక ఆన్ లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత చాక్లెట్ అభిమానుల పరిస్థితి మరింత ప్రమాదకరం. ఒక క్లిక్ చేస్తే చాలు– నిమిషాల్లో చాక్లెట్ ఇంటి గుమ్మం ముందు హాజరు! బయటికి వెళ్లాల్సిన పనిలేదు, చాక్లెట్టే మన దగ్గరకు వచ్చేస్తోంది. బిస్కట్ కంపెనీలు కూడా ఇప్పుడు ‘చాక్లెట్ లేకుంటే బిజినెస్ లేదు అన్నట్టుగా చాక్లెట్ ఫ్లేవర్లతో కొత్త ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ప్రత్యేకంగా చాక్లెట్లకే అంకితమైన షాపులు కూడా ఉన్నాయి. కేక్ షాపుల్లో అయితే ఏ కేక్‌కి ఎక్కువ డిమాండ్ అంటే? సమాధానం ఒక్కటే, ‘చాక్లెట్!’ ఇదంతా ఎందుకంటే, చాక్లెట్ రూపం మారొచ్చు, రంగు మారొచ్చు, సైజు మారొచ్చు– కానీ ఒక చాక్లెట్ నోట్లో పడితే వచ్చే ఆనందం మాత్రం ఎప్పటికీ మారదు!చాక్లెట్‌కు పుట్టినరోజు ఎలా వచ్చింది?ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రేమికులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ‘ఇంతకాలం మనకు ఆనందం పంచిన చాక్లెట్‌కు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలి కదా!’ అని. అలా 2009 నుంచి అధికారికంగా ‘చాక్లెట్ డే’ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై 7నే ఎందుకు ఎంచుకున్నారంటే... 1550లో ఇదే రోజున చాక్లెట్ మొదటిసారి యూరప్‌కు పరిచయమైందట! అలా ప్రతి ఏడాది జూలై 7న ఈ తియ్యటి పండుగను జరుపుకుంటున్నారు.అయితే, దేశాన్ని బట్టి ఈ తేదీలు మారుతుంటాయి. కోకో ఉత్పాదనలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన ఘనా ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. యూరప్‌లోని లాట్వియా జూలై 11న చాక్లెట్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అంతేకాదు, చాక్లెట్ ప్రేమికుల కోసం ఏడాది పొడవునా వివిధ రకాల చాక్లెట్లకు ప్రత్యేక రోజులు కూడా ఉన్నాయి. జనవరి 10న బిట్టర్‌స్వీట్ చాక్లెట్ డే, జూలై 28న మిల్క్ చాక్లెట్ డే, సెప్టెంబర్ 22న వైట్ చాక్లెట్ డే, అలాగే డిసెంబర్ 16న చాక్లెట్ కవర్డ్ ఏనీథింగ్ డే జరుపుకుంటారు.చాక్లెట్ చెట్టుకు కాస్తుందా?‘చాక్లెట్ ఫ్యాక్టరీలో తయారవుతుంది కదా, చెట్టుకు ఎలా కాస్తుంది?’ అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కానీ నిజం ఏమిటంటే, చాక్లెట్ ప్రయాణం మొదలయ్యేది చెట్టు దగ్గరే! ‘కోకో’చెట్టును నాటిన తర్వాత, దానికి మొదటి కాయ కాయడానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే, దాని సగటు ఆయుష్షు దాదాపు 100 ఏళ్లు. అంతేకాదు, ఒక్కో కోకో కాయలో సుమారు 40 వరకు గింజలు ఉంటాయి. ఆ కాయల్లో ఉండే గింజలే తర్వాత మన చేతిలోకి చాక్లెట్‌గా చేరుతాయి. అంటే మనం తింటున్న చాక్లెట్ అసలు రూపం ఒక చెట్టు పండే!దేవతల ఆహారం! భూమి మీద మనుషులు పుట్టకముందే అంటే దాదాపు 100 మిలియన్ సంవత్సరాల క్రితమే డైనోసార్ల కాలంలో కోకో చెట్లు ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు! దాదాపు 4,000 ఏళ్ల క్రితమే మధ్య అమెరికాలోని మాయన్ , అజ్టెక్ నాగరికతల ప్రజలు కోకో సాగు చేసేవారు. కోకో చెట్ల కాయల్లో ఉండే గింజలతో ‘షొకోలాటల్‘ అనే ప్రత్యేక పానీయం తయారు చేసేవారు. అది సాధారణ పానీయం కాదు; రాజులు, యోధులు తాగేవారు. మతపరమైన కార్యక్రమాల్లో ఉపయోగించేవారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో కోకో గింజలను డబ్బుల్లా కూడా ఉపయోగించేవారు! చాక్లెట్ చెట్టు శాస్త్రీయ నామం ‘థియోబ్రోమా కకావో’. గ్రీకు భాషలో దీని అర్థం ‘దైవ ఆహారం’ అందుకే చాక్లెట్‌ను అప్పట్లో ‘దేవతల ఆహారం’ అని పిలిచేవారు.చేదు పానీయం!ఈరోజు ఒక చాక్లెట్ బార్ చేతిలో పెడితే క్షణాల్లో మాయమైపోతుంది. కానీ మీరు టైమ్ మెషిన్ లో కూర్చొని కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్లి ‘నాకు చాక్లెట్ కావాలి’ అంటే, మీ చేతిలో ఒక గ్లాసు చేదు పానీయం పెట్టేవారు! అవును, చాక్లెట్ మొదట్లో అసలు తినే తీపి పదార్థమే కాదు. మధ్య అమెరికాలోని ప్రాచీన ఒల్మెక్, మాయన్ , అజ్టెక్ నాగరికతలకు చెందిన ప్రజలు కోకో గింజలతో ఒక ప్రత్యేక పానీయం తయారు చేసుకుని తాగేవారు. కానీ అందులో చక్కెర ఉండేది కాదు. పైగా మిరపకాయలు, మసాలాలు కూడా కలిపేవారు. నేటి చాక్లెట్ అభిమానులు ఆ పానీయం రుచి చూస్తే, ‘ఇది చాక్లెట్టా? లేకా కషాయమా?’ అని ఆశ్చర్యపోవాల్సిందే! తర్వాత స్పానిష్ యాత్రికులు కోకోను యూరప్‌కు తీసుకెళ్లడంతో చక్కెర, పాలు చేరాయి. అలా ఒకప్పుడు చేదుగా ఉన్న పానీయం నేడు ప్రపంచాన్ని తీపిగా మార్చే చాక్లెట్‌గా అవతరించింది!చాక్లెట్ చమక్కులు!1. పెట్స్‌కు నో ఎంట్రీకుక్కలు, పిల్లులకు చాక్లెట్ అస్సలు పడదు. చాక్లెట్లో ఉండే ‘థియోబ్రోమిన్ ’ అనే పదార్థం కుక్కలకు విషంతో సమానం. కాబట్టి మీ చాక్లెట్‌ను మీ పెంపుడు జంతువులకు మాత్రం పొరపాటున కూడా షేర్ చేయకండి! అయితే, మెసోఅమెరికా కాలంలో చాక్లెట్‌ను మనుషులకు ఒక శక్తిమంతమైన ఔషధంగా వాడేవారు.2. బంగారాన్ని కాదన్నారుస్పానిష్ సైనికులు అజ్టెక్ సామ్రాజ్యాన్ని ముట్టడించినప్పుడు అక్కడ దొరికిన బంగారాన్ని, వెండిని వదిలేసి, కేవలం కోకో గింజలున్న గిడ్డంగిని కాపాడుకున్నారు. మాయన్, అజ్టెక్ నాగరికతల్లో కోకో గింజలను డబ్బులా వాడేవారు. వీటితో బట్టలు, ఆహారం కొనేవారు, పన్నులు కూడా కట్టేవారు! అప్పట్లో వాటికి అంత విలువ ఉండేది!3. అదొక ‘ఫార్మా’ యాక్సిడెంట్!1930లలో ‘నెస్లే’ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ, పిల్లల కోసం ఒక విటమిన్ పౌడర్‌ను తయారు చేస్తూ, అనుకోకుండా ‘వైట్ చాక్లెట్’ను కనిపెట్టింది. 1728లో యూకేలో మొట్టమొదటి చాక్లెట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఇక 1847లో జోసెఫ్ ఫ్రై అనే బ్రిటిష్ వ్యక్తి ప్రపంచంలోనే మొదటి సాలిడ్ చాక్లెట్ బార్‌ను తయారుచేశారు.4. హిట్లర్ సీక్రెట్ ప్లాన్!రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్‌ను చంపడానికి హిట్లర్ ఒక క్రేజీ ప్లాన్ వేశాడు. చాక్లెట్ బార్ లోపల పేలుడు పదార్థాలు పెట్టి ‘ఎక్స్‌ప్లోజివ్ చాక్లెట్’ను తయారు చేయించాడు. కానీ బ్రిటన్ గూఢచారులు దాన్ని కనిపెట్టేశారు! ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ యుద్ధంలో సైనికులు యాక్టివ్‌గా ఉండటానికి చాక్లెట్లు ఇచ్చేవారట! 5. స్పేస్ ట్రావెల్రష్యన్, అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వెంట తీసుకెళ్లిన మొదటి స్నాక్స్ లిస్ట్‌లో చాక్లెట్ బార్స్ ఉన్నాయి.6. సినిమాలో ‘రక్తం’ బదులు...హాలీవుడ్ క్లాసిక్ హారర్ సినిమా ‘సైకో’ లోని ఫేమస్ షవర్ సీన్ లో రక్తంలా కనిపించడం కోసం ‘బాస్కో చాక్లెట్ సిరప్’ను వాడారు. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీద అది పర్ఫెక్ట్ రక్తంలా కనిపించింది!7. పరిమళాల రహస్యంచాక్లెట్ వాసనలో దాదాపు 600 రకాల వోలటైల్ కాంపౌండ్స్ ఉంటాయి. సైంటిస్టులు ల్యాబ్‌లో ఎన్ని ప్రయోగాలు చేసినా, ఆ సహజసిద్ధమైన చాక్లెట్ సువాసనను ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయలేకపోయారు.8. ఫేమస్ చాక్లెట్ టూత్‌పేస్ట్!వినడానికి విచిత్రంగా ఉన్నా... కోకో గింజల తొక్కల్లో ఉండే ‘సీబీహెచ్’ అనే పదార్థం మన పంటి ఎనామిల్‌ను గట్టిపరుస్తుంది. ప్రస్తుతం కొన్ని విదేశీ కంపెనీలు చాక్లెట్ ఫ్లేవర్డ్ టూత్‌పేస్ట్‌లను కూడా తయారు చేస్తున్నాయి. రీసెర్చ్ ప్రకారం, డార్క్ చాక్లెట్లో ఉండే కొన్ని కాంపౌండ్స్, మనం వాడే టూత్పేస్ట్లలోని ఫ్లోరైడ్ కంటే వేగంగా పళ్లలోని బ్యాక్టీరియాతో పోరాడుతాయట!9. దోమలు లేకపోతే చాక్లెట్ లేదుకోకో పూలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటికి పరాగసంపర్కం చేయగలిగేది కేవలం ‘చాక్లెట్ మిడ్జ్’ అనే చిన్న దోమ మాత్రమే! ఆ దోమలు లేకపోతే ప్రపంచంలో చాక్లెట్ అనేదే ఉండదు!10. బ్లడ్ గ్రూప్‌తో లింక్!జపాన్ లో ‘బ్లడ్ గ్రూప్ చాక్లెట్స్’ అమ్ముతారు. మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి, మీ వ్యక్తిత్వానికి సరిపోయే ఫ్లేవర్ ఉన్న చాక్లెట్‌ను వాళ్లు డిజైన్ చేస్తారు.11. రూబీ చాక్లెట్డార్క్, మిల్క్, వైట్ కాకుండా ప్రపంచంలో నాల్గవ రకం చాక్లెట్ ఉంది. అదే ‘రూబీ చాక్లెట్’. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా, ఇది సహజంగానే పింక్ కలర్లో ఉంటుంది. దీన్ని 2017లోనే కనుగొన్నారు.12. టైటానిక్ లక్!మిల్టన్ హెర్షే (ప్రముఖ హెర్షేస్ చాక్లెట్ వ్యవస్థాపకుడు) నిజానికి టైటానిక్ ఓడలో ప్రయాణించాల్సింది. కానీ చివరి నిమిషంలో ఒక బిజినెస్ మీటింగ్ వల్ల ప్రయాణం రద్దు చేసుకున్నారు. అలా చాక్లెట్ కింగ్ ప్రాణాలు బతికాయి!13. నోట్లో వేస్తే మాయంచాక్లెట్ నోట్లో కరిగే ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రతకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే అది నోట్లో పడగానే అలా మాయమైపోయిందనిపిస్తుంది.ఆరోగ్యానికి కూడా నేస్తమే చాక్లెట్ అంటే ‘పళ్లు పాడవుతాయి’, ‘బరువు పెరుగుతాం’ అని భయపడుతుంటారు. కాని, డార్క్ చాక్లెట్లో కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకు మించి తింటే నష్టాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.ఆరోగ్య ప్రయోజనాలు1. ఒక చిన్న చాక్లెట్ ముక్కలోనే అనేక ఖనిజాల ఖజానా దాగి ఉన్నందున దీనిని ‘సూపర్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు.2. డార్క్ చాక్లెట్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించడంలో సహాయపడతాయి.3. ఫ్లేవనాయిడ్లు రక్తప్రసరణను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.4. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, పొటాషియం, జింక్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.5. మెదడుకు రక్తప్రసరణను పెంచి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడవచ్చు.6. మూడ్‌ను మెరుగుపరచి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.7. చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలోను, తేమను నిలుపుకోవడంలో తోడ్పడుతుంది.8. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడే అవకాశం ఉంది.ఆరోగ్య నష్టాలు1. అధికంగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.2. చక్కెర ఎక్కువగా ఉన్న చాక్లెట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి.3. తరచుగా తింటే దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది.4. చాక్లెట్‌లోని కేఫీన్ కారణంగా నిద్రలేమి సమస్యలు రావచ్చు.5. కొంతమందిలో మైగ్రేన్ లేదా తలనొప్పులను ప్రేరేపించవచ్చు.6. అధిక క్యాలరీలు, కొవ్వు కారణంగా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.7. కొంతమంది వ్యక్తుల్లో అలర్జీ ప్రతిచర్యలు కనిపించవచ్చు.⇒ డార్క్ చాక్లెట్ ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ, అది ఇంకా క్యాలరీలు కలిగిన ఆహారమే.⇒ కాబట్టి రోజుకు 20–30 గ్రాములు లేదా 1–2 చిన్న ముక్కలు మాత్రమే మితంగా తీసుకోవడం మంచిది.⇒ అలాగే 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌ను ఎంచుకుంటే మరింత ప్రయోజనం పొందవచ్చు.ఎంతమంది తింటున్నారంటే?ప్రపంచవ్యాప్తంగా రోజూ దాదాపు 100 కోట్ల మంది చాక్లెట్‌ను ఆస్వాదిస్తారని అంచనా! అంటే ఈ క్షణంలో కూడా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు చాక్లెట్ ర్యాపర్‌ను చింపి మొదటి ముక్క నోట్లో వేసుకుంటున్నారు! ఇదే విషయాన్ని అంతర్జాతీయ సర్వేలు కూడా చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 75 లక్షల టన్నుల చాక్లెట్ వినియోగిస్తున్నారు.చాక్లెట్ ప్రియుల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అక్కడ ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 10 నుంచి 11 కిలోల వరకు చాక్లెట్‌ను ఆస్వాదిస్తారు. భారత్‌లోనూ చాక్లెట్‌కు ఆదరణ వేగంగా పెరుగుతోంది. దేశీయ మార్కెట్ విలువ ఇప్పటికే రూ. 20,000 కోట్లను దాటగా, ప్రపంచ చాక్లెట్ పరిశ్రమ విలువ రూ.12 లక్షల కోట్లకుపైగా ఉంది అంతేకాదు. ఒత్తిడి తగ్గించుకోవడానికి, మూడ్‌ను మార్చుకోవడానికి, చిన్న సెలబ్రేషన్ల కోసం చాలామంది ముందుగా ఎంచుకునేది చాక్లెట్‌నే!తీపిలోనే కాదు... రికార్డుల్లోనూ టాప్!ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా స్విట్జర్లాండ్‌కు చెందిన ‘లా చ్యూర్సా’ నిలిచింది. దీని ధర కిలోకు దాదాపు రూ.6.6 లక్షలు, ఇక 80 గ్రాముల బార్కే రూ.53 వేలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది! మరోవైపు, బ్రిటన్ కు చెందిన థోర్న్టన్ ్స సంస్థ తయారు చేసిన 5,792.5 కిలోల మహా చాక్లెట్ బార్ ప్రపంచంలోనే అత్యంత బరువైన చాక్లెట్‌గా గిన్నిస్ రికార్డు సాధించింది. సైజులోనూ చాక్లెట్ తన సత్తా చాటింది. 2024లో ఈక్వెడార్‌లో రూపొందించిన 416.34 చదరపు మీటర్ల వైశాల్యం గల చాక్లెట్ బార్ ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ బార్గా నిలిచింది. అది ఎంత పెద్దదంటే, ఆ రికార్డు కోసం ఉపయోగించిన చాక్లెట్ బార్లను ఒక వ్యక్తి రోజుకు ఒక్కటి చొప్పున తింటే, ఏకంగా 30 ఏళ్లు పడుతుంది. ఇలా చాక్లెట్ తీపి రుచిలోనే కాదు, ధర, బరువు, పరిమాణంలోనూ చాక్లెట్ రికార్డుల మోత మోగిస్తోంది.చాక్లెట్ అభిమానుల కోసం ఒక సరదా కోట్ కూడా ఉంది. ‘పదిమందిలో తొమ్మిది మంది చాక్లెట్ అంటే ఇష్టం అని చెప్తుంటేæ, పదో వ్యక్తి మాత్రం అబద్ధం చెప్తాడు.’ ఇలా ప్రతి ఒక్కరి ఆనందాలను ఆహ్వానించే ఈ అతిథిని తన ప్రత్యేకమైన రోజున చాక్లెట్‌ను ఆస్వాదించకుండా ఎలా ఉంటాం!∙కొండి దీపిక -
‘యాంట్’ వార్!
‘చలి చీమల చేత జిక్కి చావదే పాము’ అన్నట్లు, స్పెయిన్ లోని అందమైన విహారదీవి మెనోర్కాలో చీమల దండయాత్ర మొదలైంది. వేలాది ‘చీమలు’ రోడ్లపైకి వచ్చి పర్యాటకులపై నిరసన వ్యక్తం చేశాయి! అయితే అవి నిజమైన చీమలు కాదు, చీమల వేషాలు వేసుకున్న స్థానికులే! చేతుల్లో ‘పర్యాటకం మమ్మల్ని నలిపేస్తోంది’, ‘మా ఇళ్ల నుంచి మమ్మల్ని వెళ్లగొడుతున్నారు’ వంటి నినాదాలతో వారు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు పర్యాటకులను ఆహ్వానించిన ఈ దీవి ప్రజలు ఇప్పుడు ‘చాలు బాబోయ్!’ అంటున్నారు. కారణం... ఇళ్ల అద్దెలు ఆకాశాన్నంటడం, జీవన వ్యయం పెరగడం, నీటి సమస్యలు తీవ్రమవడం, స్థానికులకు అందుబాటులో ఇళ్లు దొరకకపోవడం. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండగా, స్థానికుల సమస్యలపై మాత్రం అంతగా దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు.అయితే, ప్రపంచమంతా ‘ఇక్కడికి రండి!’ అంటూ పర్యాటకులను ఆహ్వానిస్తుంటే, మెనోర్కా ప్రజలు మాత్రం ‘ఇంకెవరూ రావద్దు!’ అంటూ నిరసనలకు దిగడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పర్యాటకం అభివృద్ధికి ఎంత అవసరమో, స్థానికుల జీవన నాణ్యత కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ చీమల దండయాత్ర మరోసారి గుర్తు చేస్తోంది. -
నేనొక పెద్ద విమర్శకురాలిని!
ఒక్కో సినిమా, ఒక్కో భాష, ఒక్కో క్యారెక్టర్ , ఒక్కో స్టయిల్ కాని ఆమె మాత్రం ఒక్కరే. ఇలా ఆన్ ఇన్ వన్ ఫుల్ ఫన్ ఫ్యాకేజ్‌తో క్రేజీ స్టార్‌గా మారిన నటి కయాదు లోహార్– తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అవన్నీ ఆమె మాటల్లో... ఇంట్లో భాషల సందడి!నేను అసోంలో పుట్టాను, కానీ మా కుటుంబ మూలాలు మొత్తం నేపాల్‌కు చెందినవి. మా పూర్వీకులు చాలా ఏళ్ల క్రితమే అసోంలో స్థిరపడ్డారు. తర్వాత పూణేకు వచ్చాం. అలా మా ఇంట్లో నేపాలీ, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషలు ఎక్కువగా మాట్లాడతాం.జీవితాన్ని మార్చిన జ్యూలరీ పోటీ!చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకునేదాన్ని. అందమైన డ్రెస్సుల డిజైన్స్, కొత్త కొత్త స్టయిల్స్, ట్రెండ్స్ గురించే ఎక్కువ అలోచించేదాన్ని. అయితే పూణేలో జరిగిన ఓ జ్యూలరీ పేజెంట్‌లో సరదాగా పాల్గొని గెలిచిన తర్వాత మోడల్‌గా మారాను. ఆ తర్వాత నుంచి కెమెరా ముందు ఉండటమే ఎక్కువ నచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చాను.బాగా ఏడ్చేదాన్నిస్కూల్లో నేను చాలా సైలెంట్ స్టూడెంట్‌ని. ఎవరైనా అడిగితే నాకు చాలా ఇష్టమైన బొమ్మలను కూడా ఇచ్చేసేదాన్ని. తర్వాత ఇంటికి వెళ్లి అవి గుర్తొచ్చి ఏడ్చేదాన్ని. ఇప్పుడది గుర్తొస్తే నవ్వొస్తుంది. కాని, ఇప్పుడలా అసలు లేను.కష్టాలు నేర్పిన జీవిత పాఠాలు!సినిమాల్లోకి రాకముందు కొంతకాలం సేల్స్ గర్ల్‌గా పనిచేశాను. ఆ అనుభవం డబ్బు విలువను, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో నేర్పింది. అలాగే మనుషులతో ఎలా మెలగాలో కూడా నేర్చుకున్నాను.అలా భాష నేర్చేసుకుంటా!తెలుగు, తమిళ, కన్నడ భాషలు మొదట నాకు రావు. కొత్త భాష నేర్చుకోవాలంటే ముందుగా ఆ భాషలోని పాటలు ఎక్కువగా వింటాను. అలా ఉచ్చారణ, యాస అర్థమవుతాయి.సినిమాలు చూడాలంటే ఇప్పటికీ టెన్షనే!చాలామంది నటులు తమ సినిమాలను పదే పదే చూస్తుంటారు. కాని, స్క్రీన్ పై నన్ను చూసుకుంటే ముందుగా నా తప్పులే కనిపిస్తాయి. ‘ఇంకా బాగా చేయొచ్చుగా!’ అనిపిస్తుంటుంది. అందుకే నా సినిమాలు చూడాలంటే ఇప్పటికీ కొంచెం టెన్షన్ గానే ఉంటుంది. నాకు నేనే ఒక పెద్ద విమర్శకురాలినైతే, మా తమ్ముడు నా ఫేవరెట్ ఫ్యాన్!అల్ పచీనో అంటే క్రష్!హాలీవుడ్ లెజెండ్ అల్ పచీనో నాకు చాలా ఇష్టం. ఆయన నటనలో కనిపించే ఇంటెన్సిటీ నన్నెప్పుడూ ఆకట్టుకుంటుంది. ఇంకా రొమాంటిక్ కామెడీలు ఇష్టం. ముఖ్యంగా ‘క్రేజీ స్టూపిడ్ లవ్’ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ సినిమా నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌లో ఒకటి.నచ్చితేనే గ్రీన్ సిగ్నల్!సినిమా పెద్దదా, చిన్నదా అనేది నాకు ముఖ్యం కాదు. పాత్రలో కొత్తదనం ఉండాలి. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటాను. అయితే, కత్తి సాము, గుర్రపు స్వారీ, యోధురాలి పాత్రలు అంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి. అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెంటనే ఓకే చెబుతాను. -
మంచి గుణం.. మిత్రమా, ఏడవకు! ఈ అడుగుజాడలను చూస్తుంటే..
ఒక అడవిలో ఎలుగుబంటి నివసించేది. అది అడవిలోని జంతువులన్నింటికీ వైద్యం చేసే గొప్ప వైద్యుడు. రకరకాల ఆకులు, వేర్లు, మూలికలతో అది అద్భుతమైన మందులు తయారు చేసేది. తనకు కావాల్సిన కొన్ని అరుదైన ఔషధాల కోసం ఎలుగుబంటి తరచుగా పొరుగున ఉన్న అడవికి వెళ్తుండేది. అక్కడ తన మిత్రుడైన కోతిని కలుసుకోవడం దానికి ఎంతో ఇష్టం.ఆ కోతి కూడా గొప్ప వైద్యుడు కావడంతో, తన ఇంటి వెనుక ఒక పెద్ద ఔషధ వనాన్ని పెంచుతోంది. ఆ తోటలో లేని మొక్క అంటూ లేదు. ఒకరోజు ఎలుగుబంటికి అత్యవసరంగా కొన్ని మూలికలు అవసరమయ్యాయి. వెంటనే అది బయలుదేరి కోతి ఇంటికి చేరుకుంది. మిత్రుడిని చూడగానే కోతి ఎంతో సంతోషించింది.‘మిత్రమా! ఏమైంది? విచారంగా ఉన్నావు ఎందుకు? నా సహాయం ఏమన్నా కావాలా?’ అని కోతి అడిగింది. దానికి ఎలుగుబంటి ‘మిత్రమా! మా అడవిలో ఒక వ్యాధి వ్యాపిస్తోంది. దానికి కొన్ని ప్రత్యేకమైన మూలికలు కావాలి’ అని కోరింది. కోతి నవ్వుతూ, ‘దానిదేముంది! మన తోటలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. వెళ్లి నీకు నచ్చినవి తీసుకో’ అని చెప్పింది.కానీ ఎలుగుబంటి తోటలోకి అడుగు పెట్టగానే దిగ్భ్రాంతికి గురైంది. అక్కడ మొక్కలన్నీ ఎవరో తొక్కినట్లు నలిగిపోయి ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలన్నీ నేలమట్టమై ఉన్నాయి. ఎలుగుబంటి తిరిగి వచ్చి కోతికి ఈ విషయం చెప్పింది. కోతి పరిగెత్తుకుంటూ వెళ్లి తన తోటను చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.‘అయ్యో! నా ప్రాణం కంటే మిన్నగా పెంచుకున్న మొక్కలన్నీ ఇలా అయిపోయాయే! ఎవరో క్రూరులు కావాలనే నా తోటను నాశనం చేశారు’ అని కోతి ఏడ్చింది. ఎలుగుబంటి అక్కడి నేలను నిశితంగా పరిశీలించింది. నేలపై ఉన్న పెద్ద అడుగుజాడలను చూసి అది ఒక నిర్ణయానికి వచ్చింది.‘మిత్రమా, ఏడవకు. ఈ అడుగుజాడలను చూస్తుంటే ఇది ఒక ఏనుగు చేసిన పని అని అర్థమవుతోంది’ అని ఎలుగుబంటి చెప్పింది. కానీ కోతి ఆ మాటలను అస్సలు ఒప్పుకోలేదు. ‘కాదు మిత్రమా! మా అడవిలోని ఏనుగు చాలా మంచిది. అది అందరికీ సహాయం చేస్తుంది. అది ఇంతటి అన్యాయం ఎప్పటికీ చేయదు’ అని వాదించింది.నిజం తెలుసుకోవడానికి అవి రెండూ కలిసి అడవిలోకి బయలుదేరాయి. అవి నది ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఏనుగు నీళ్లు తాగుతూ కనిపించింది. ఏనుగు కాళ్లకు నలిగిపోయిన ఆకులు, పువ్వులు అతుక్కుని ఉండటం కోతి గమనించింది. తన తోటలోని ఔషధ మొక్కలన్నింటినీ తొక్కి నాశనం చేసింది, తొండంతో పీకింది ఏనుగేనని కోతి, ఎలుగుబంటి గ్రహించాయి. అప్పుడు ఎలుగుబంటి కోతి వైపు తిరిగి గంభీరంగా ఇలా అంది, ‘చూడు మిత్రమా! ఒకరిలో ఒక మంచి గుణం ఉన్నంత మాత్రాన, వారిలో చెడు గుణాలు ఉండవని అనుకోవడం మన పొరపాటే.’దూరంగా నది ఒడ్డున ఒక కొంగ ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నట్లు నిలబడి వాటికి కనిపించింది. ఎలుగుబంటి ఆ కొంగను చూపిస్తూ, ‘ఆ కొంగను చూడు, అది ఎంత శాంతంగా కనిపిస్తోంది! కానీ లోపల క్రూరమైన ఆలోచనతో చేపల కోసం వేచి చూస్తోంది’ అని చెప్పింది.అదే సమయంలో ఒక చిన్న కుందేలు ఏడుస్తూ అక్కడికి వచ్చింది. ఏనుగును చూసి భయపడుతూనే, ‘గజరాజా! నిన్న నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ భారీ పాదాల కిందపడి మా ఇల్లు కూలిపోయింది. మా పిల్లలు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. నువ్వు కనీసం వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయావు’ అని ఫిర్యాదు చేసింది.కుందేలు మాటలు విన్న ఏనుగుకు ఒక్కసారిగా తలవంపులయ్యింది. తన శక్తి.. బలంతో ఇతరులను రక్షిస్తున్నానన్న గర్వంలో, తన కదలికల వల్ల ఇతరులకు కలుగుతున్న నష్టాన్ని తాను గమనించలేదని ఏనుగు గ్రహించింది. అజాగ్రత్త కూడా ఒక పెద్ద తప్పేనని దానికి అర్థమైంది.వెంటనే ఏనుగు కోతి దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. ‘నన్ను క్షమించు మిత్రమా! నేను కావాలని నీ తోటను నాశనం చేయలేదు. కానీ నా నడక వల్ల నీకు ఇంత నష్టం జరుగుతుందని నేను ఊహించలేదు. నా అజాగ్రత్త వల్ల జరిగిన ఈ తప్పుకు నేను ఎంతో విచారిస్తున్నాను’ అని వేడుకుంది.కోతి ఏనుగు పశ్చాత్తాపాన్ని చూసి మనసు మార్చుకుంది. ఎలుగుబంటి చెప్పినట్లు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, లోపల ఉండే అసలు గుణం బయటపడే వరకు ఎవరినీ అంచనా వేయకూడదని గ్రహించింది. ఆ రోజు నుండి ఏనుగు అడవిలో నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం ప్రారంభించింది. - పైడిమర్రి రామకృష్ణ -
డేటా దండుపాళ్యం.. మీపై స్మార్ట్ నిఘా!
టెక్నాలజీ దూకుడు ఎక్కువయ్యాక ప్రపంచం ‘జగమంత స్మార్ట్ కుటుంబం’ అయిపోయింది. ఇళ్లు, వాకిళ్లు, వంటిళ్లు ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఆఖరికి టూత్‌బ్రష్‌లను కూడా ఇంట్లోని నెట్ నడిపిస్తోంది. కానీ, ఈ సౌకర్యాలు, సదుపాయాల వెనుక మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌కు చెందిన ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీవో), ‘విచ్’ అనే సంస్థ కలిసి ప్రత్యక్షంగా తమ దేశ పౌరులను, పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.ఏమిటా ప్రమాదం?!డీప్ ఫ్రయింగ్, తందూరీ రోస్టింగ్–గ్రిల్లింగ్, రీహీటింగ్, బేకింగ్, బంగాళా దుంపల చిప్స్.. వీటన్నిటి తయారీకి వంటగదుల్లో మనం వినియోగించే ఎయిర్ ఫ్రయర్లు మన లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని, మన మాటలను రికార్డ్ చేస్తున్నాయని, ఆ సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు కలకలం రేపాయి. అయితే అవి కేవలం వార్తలు కావని, వాస్తవాలేనని ఐసీవో, విచ్ ఇప్పుడు నిర్ధారణగా ప్రకటించాయి! అలాగే, మన ఇళ్లల్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీలు మనం ఎప్పుడు, ఏమి వీక్షిస్తున్నామో గమనిస్తూ మన వ్యక్తిగత వివరాలను ప్రకటనల కంపెనీలకు విక్రయిస్తున్నాయట!బ్రిటన్ లాంటి దేశాల్లోనే మూడింట ఒక వంతు ప్రజలు ఇంతకాలం తమ డేటా ఎలా చోరీ అవుతోందో కనిపెట్టలేకపోయారు. ఇక మన దేశంలోని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చు! భారత్‌లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవం తర్వాత కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు కనుక మనపై స్పయింగ్కు సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది.మాటల్నీ రికార్డు చేస్తుంటాయి!టోస్టర్లు, ఎయిర్ ఫ్రయర్ల వంటి స్మార్ట్ పరికరాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండవచ్చని ఐసీవో అప్రమత్తం చేశాక బ్రిటన్ ప్రజల్లో జాగ్రత్త మొదలైంది. అక్కడి జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక స్మార్ట్ పరికరం వాడుతుండగా, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ఆ పరికరాలు వినియోగదారుల నుంచి సేకరిస్తున్నాయని ‘విచ్’ పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్తో పనిచేసే కొన్ని ఎయిర్ ఫ్రయర్లు, ‘ఆన్’ చేయగానే వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ అడుగుతాయి. అంతేకాదు వారి ఫోన్ల ద్వారా ఆడియోను (మాటలను) కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరింతగా మెరుగైన సేవల్ని అందించటానికి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటామని ఆ గాడ్జెట్లు చెబుతుంటాయి. అయితే అవి, తాము సేకరించిన సమాచారంలో కొంత భాగాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తున్నట్లు ‘విచ్’ పరిశోధనలో బహిర్గతం అయింది.దినచర్యల వివరాలు సైతం!!‘విచ్’ బ్రిటన్‌లోని అతి పెద్ద వినియోగదారుల హక్కుల పరిరక్షక, పర్యవేక్షక స్వతంత్ర సంస్థ. ‘‘మీ ఇంట్లో ఉండే గాడ్జెట్లు అన్నింట్లోకీ స్మార్ట్ టీవీ మరీ ప్రమాదకరంగా మారుతోంది. మీరు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఇది సేకరిస్తుంది’’ అని విచ్ చెబుతోంది. ‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఇంట్లోని టీవీలు మీ సమాచారాన్ని పూర్తిగాలాగేస్తుంటాయి’’ అని ఐసీవో రెగ్యులేటరీ రిస్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలయం మాల్కం అంటున్నారు. ‘‘స్మార్ట్ పరికరాలు మన ఆరోగ్యం, మన దినచర్యలు, మన కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి’’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.స్మార్ట్ పరికరాలను తయారుచేసే కంపెనీలు, డెవలపర్ల కోసం ఐసీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సమయంలోనే ఈ తాజా హెచ్చరిక వెలువడింది. వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై కంపెనీలకు ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం వంటి కొన్ని సరైన కారణాల కోసం కొంత సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే ఐసీవో అంగీకరించింది. అయితే స్మార్ట్ పరికరాలు వాటికి నిజంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని, ఆ సమాచారాన్ని ఎలా వాడుతున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాలని, ఆ సమాచారంపై ప్రజలకే నియంత్రణ ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.కొనడం ఆపటం లేదు!ఇంట్లోని స్మార్ట్ పరికరాలు తమ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్న లక్షలాది మంది బ్రిటన్ ప్రజలకే కాదు, మిగతా ప్రపంచదేశాలకూ ఈ నియమాల విధింపు మంచి పరిణామం. బ్రిటన్‌కి చెందిన 2,000 మందికి పైగా వయోజనులపై ఐసీవో చేసిన సర్వేలో... తమ పరికరాలు సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తమకు తెలియదని మూడింట ఒక వంతు మంది ప్రజలు చెప్పారు.అలాగే, ఒక స్మార్ట్ టోస్టర్ (బ్రెడ్ కాల్చేది) లేదా స్మార్ట్ టూత్‌బ్రష్ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని సర్వేలో పాల్గొన్నవారిలో ముప్పావు వంతు మంది చెప్పారు. ఈ సమాచార సేకరణ పట్ల తమకు ఆందోళన ఉందని 40 శాతం మంది బ్రిటన్ ప్రజలు చెబుతుండగా, మరికొందరు (15 శాతం మంది) ఇదే కారణంతో ఇలాంటి సాంకేతిక పరికరాలను అస్సలు కొనడం లేదు. అయినప్పటికీ, బ్రిటన్ ప్రజలు తమ ఇళ్లను ఇలాంటి నిఘా పెట్టే పరికరాలతో నింపేయడం మాత్రం ఆపలేదు.పైగా ఈ డేటా సేకరణ వల్ల వచ్చే వినియోగ పరమైన లాభాల కోసం స్మార్ట్ పరికరాలను కొనడానికి సిద్ధంగా ఉన్నామని యూకేలోని దాదాపు సగం మంది వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మాల్కం మాట్లాడుతూ: ‘‘ఈ పరికరాలు మన జీవితాలను సులభతరం చేయడానికి తయారవుతాయి. అంతకు మించి వీటికి మన వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టకూడదు’’ అంటున్నారు.డేటాను లాగి, ఏం చేస్తారు?మనం టీవీలో ఏమేం చూస్తున్నామో పూర్తి వివరాలను తెలుసుకొని, మన అలవాట్లకు సంబంధించిన ఒక పెద్ద నివేదికను తయారు చేయడానికి గాడ్జెట్లు చాలా సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు నచ్చే షోలు లేదా సినిమాలను సూచించడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ప్రకటనలు చూపించటం వరకు పర్వాలేదని, టీవీ తయారీ కంపెనీలు అంతకంటే ముందుగా వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీవో ఆదేశాలు జారీ చేసింది.ఇక గాడ్జెట్ తయారీ కంపెనీలు చట్టాన్ని పాటిస్తున్నాయా లేదా, వినియోగదారులకు నిజమైన పారదర్శకతను అందిస్తున్నాయా లేదా, వారి అనుమతిని నిజంగానే తీసుకుంటున్నాయా లేదా అని పరిశీలించడానికి ‘విచ్’ సంస్థ ఈ ఏడాది చివర్లో ఆయా కంపెనీలతో మాట్లాడనుంది.ఏమైనా, కన్జ్యూమర్ల డేటా చైనా వంటి ప్రమాదకర దేశాలకు చేరడం వల్ల ముఖ్యంగా గోప్యతా ప్రమాదాలు ఉంటాయి. చైనా చట్టాల ప్రకారం అక్కడ ఉండే కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను అక్కడి ప్రభుత్వానికి తప్పనిసరిగా అప్పగించాలి; దీనివల్ల మీ వై–ఫై నెట్వర్క్ వివరాలు, లొకేష¯Œ , డివైజ్ పాస్వర్డ్లు వేరే దేశం చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత ప్రొఫైల్‌ను బిల్డ్ చేసి, మీ ప్రమేయం లేకుండానే థర్డ్–పార్టీ సంస్థలకు ఆ డేటాను అమ్ముకోవడం లేదా ప్రకటనల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.చైనా సర్వర్లకు మన వివరాలు!విచ్ సంస్థ చేసిన పరిశోధనలో ఐగోస్టార్, షియోమి మి స్మార్ట్, కొసోరి అనే మూడు కంపెనీల ఎయిర్ ఫ్రయర్ల వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ తెలుసుకుంటున్నాయని, యూజర్ల ఫోన్లలోని ఆడియోను రికార్డ్ చేయడానికి అనుమతి అడుగుతున్నాయని తేలింది.షియోమి ఎయిర్ ఫ్రయర్కు సంబంధించిన యాప్... ఫేస్బుక్, పాంగిల్ (ఇది టిక్‌టాక్ బిజినెస్ ప్రకటనల నెట్వర్క్), చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ వంటి వాటి ట్రాకర్లకు కనెక్ట్ అయి ఉంది. (ఇది వినియోగదారుడు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది). మరోవైపు, ఐగోస్టార్ ఎయిర్ ఫ్రయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే వినియోగదారుల జెండర్, పుట్టిన తేదీని అడుగుతోంది. అంతేకాదు, ఐగోస్టార్, షియోమి ఎయిర్ ఫ్రయిర్లు రెండూ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపించాయి. అయితే ఆ విషయాన్ని వారు తమ ప్రైవసీ నోటీసులో ముందే పేర్కొన్నారు. ఇక కొన్ని స్మార్ట్ స్పీకర్లలో కూడా ఫేస్బుక్, గూగుల్‌కు సంబంధించిన ఇలాంటి ట్రాకర్లు కిక్కిరిసినట్లుగా నిండి ఉన్నాయి! ‘‘మన లొకేషన్‌ను ట్రాక్ చేసే ఎయిర్ ఫ్రయర్ల నుండి, మన పుట్టిన తేదీని అడిగే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వరకు... ఈ స్మార్ట్ పరికరాలు వాటికి అవసరమైన దానికంటే లేదా మనం అంగీకరించదగిన దానికంటే చాలా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని మా గత పరిశోధనలు పదే పదే నిరూపించాయి’’ అని విచ్ సంస్థకు చెందిన టెక్ నిపుణుడు ఆండ్రూ లాఫ్లిన్ వెల్లడించారు.‘‘అవసరం లేని సమాచార సేకరణను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు వారి సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడంపై నిఘా సంస్థ (రెగ్యులేటర్) కొత్త మార్గదర్శకాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచి విషయం’’ అని ఆయన అంటున్నారు. ఇక, స్మార్ట్ టీవీలు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారంపై తమకు ప్రత్యేక ఆందోళనలు ఉన్నాయని కూడా ఐసీవో తెలిపింది.స్మార్ట్ వలలో పడకుండా ఐదు చిట్కాలుమీ స్మార్ట్ పరికరాలు మీపై నిఘా పెట్టకుండా కాపాడుకోవడానికి ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ 5 చిట్కాలు చెబుతోంది. కొనడానికి ముందే రీసెర్చ్ (పరిశోధన) చేయండి: మీరు ఏదైనా పరికరాన్ని కొనే ముందే, అది ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుందో సరిచూసుకోండి. ఆ పరికరం అడిగే సమాచారాన్ని దానికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.పర్మిషన్లపై (అనుమతులపై) నియంత్రణ కలిగి ఉండండి: పరికరాన్ని సెటప్ చేసేటప్పుడు, అది ఏయే విషయాలను యాక్సెస్ చేయాలో నియంత్రించడానికి ‘ప్రైవసీ కంట్రోల్స్’ ఉపయోగించండి. ఏదైనా అనుమతి అనవసరం అనిపిస్తే, దానికి అస్సలు అంగీకరించకండి.మీ పరికరానికి భద్రత కల్పించండి: ఇతరులు మీ పరికరాన్ని వాడుకోకుండా ఉండటం కోసం ఒక బలమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. వీలైనప్పుడల్లా ‘టూ–స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోండి.అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి: సాఫ్ట్వేర్ అప్డేట్స్ను క్రమం తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులోని సెక్యూరిటీ ప్యాచెస్ కొత్త ముప్పుల నుండి మీ డేటాను రక్షిస్తాయి.పరికరాన్ని వదిలించుకునే ముందు మీ డేటాను పూర్తిగా తుడిచేయండి: మీరు మీ స్మార్ట్ పరికరాన్ని ఎవరికైనా అమ్మేస్తున్నా లేదా పారేస్తున్నా... ముందుగా దాన్ని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
రూ.25... 24 ఏళ్లు!
రూ. వందల కోట్లు లేవు; బంగారం కుప్పలు, బినామీ ఆస్తులు, విదేశీ మద్యం సీసాలు లేవు; వందల ఎకరాల భూములూ లేవు. రూ. 25 లంచం కేసు. తాను హక్కుగా పొందాల్సిన సేవకు లంచం ఎందుకు ఇవ్వాలనే ఓ సగటు ఉద్యోగి ప్రతిఘటన. ఓ డాక్టర్‌ను సీబీఐకి పట్టించింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిప్పింది. మానసిక వేదనకు గురి చేసింది. అయితే ఎంత లంచం తీసుకున్నారని కాదు. నేరానికి శిక్ష తప్పదని ఈ కేసు రుజువు చేసింది. ఈ కేసు పూర్తవ్వడానికి మాత్రం 24 ఏళ్లు పట్టింది.రమేష్రామ్ అనే ఓ వ్యక్తి ఈస్ట్రన్ రైల్వేలో స్వీపర్‌గా పట్నాలోని మహేంద్రఘాట్లో విధులు నిర్వహిస్తున్నాడు. 1985 జనవరి 8న అనారోగ్యానికి గురవ్వడంతో రైల్వే ఉద్యోగులకు ఉచితంగా సేవలు అందించే డిస్పెన్సరీకి వెళ్లాడు. అక్కడ డాక్టర్ బాల్గోవింద్ ప్రసాద్ పట్నా డివిజనల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.రమేష్రామ్ ఆ డాక్టర్‌ను సంప్రదించి వైద్య సేవలు పొందాడు. మందులతో పాటు సిక్ లీవ్ మెమోను డాక్టర్ ఇచ్చాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మరోసారి వైద్యుడ్ని కలిసి మందులు తీసుకున్నాడు. సిక్ లీవ్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. దానికి డాక్టర్ రూ. 25 లంచం డిమాండ్ చేశాడు.సీబీఐకి ఫిర్యాదు‘నాకు ఆరోగ్యం బాగోలేదు. వైద్య సేవలతో పాటు సిక్ లీవ్ సర్టిఫికెట్ పొందే హక్కుంది’ అని రమేష్ భావించాడు. అందువల్ల లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాంతో అదే రోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు చేసి ఫిర్యాదు వాస్తవమేనని ధ్రువీకరించింది. డాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు వల పన్నింది. ఫినాప్తిలిన్ పూసిన కరెన్సీ నోట్లను ఫిర్యాదుదారుకు అందజేసింది. ‘డబ్బులు డిమాండ్ చేసినప్పుడు మాత్రమే ఇవ్వాలని, డిమాండ్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకూడద’ని రమేష్రామ్ను సీబీఐ హెచ్చరించి పంపింది. ఫిర్యాదుదారు నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత సీబీఐ బృందం డాక్టర్‌ను పట్టుకుంది.ట్రయల్ కోర్టులో విచారణ1986లో ట్రయల్ కోర్టులో విచారణ మొదలైంది. ‘తనపై మోపిన అభియోగాలు పూర్తి అవాస్తవమని, తన పదవిపై కన్నేసిన కొంతమంది ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని, పూర్తి విచారణ జరిపి తనను నిర్దోషిగా ప్రకటించాలని డాక్టర్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ప్రాసిక్యూషన్ తన వాదనకు మద్దతుగా పలు పత్రాలు, వస్తువులను సాక్ష్యాధారాలుగా కోర్టు ముందుంచింది. మొత్తం 19మంది సాక్షులను విచారించారు.అనంతరం డాక్టర్ బాల్గోవింద్ ప్రసాద్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఐపీసీ సెక్షన్ 161 కింద ఏడాది, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు..శిక్షను రద్దు చేయాలని డాక్టర్ బాల్గోవింద్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాధారాల్లో అనేక వైరుధ్యాలున్నాయని, సహేతుకమైన సందేహాలకు అతీతంగా అవి ఉన్నందున దోషిగా నిర్ధారించడానికి అవి సరిపోవని అప్పిలెంట్ తరపు న్యాయవాది వాదించారు.ఈ కేసు కారణంగా కొంతకాలం సస్పెండై, పదోన్నతులు కోల్పోయి, తర్వాత రిటైర్ అయ్యాడని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా అందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అతని వయసు 75 సంవత్సరాలని పేర్కొన్నారు. ఒకవేళ నేరం రుజువైందని కోర్టు భావిస్తే ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షా కాలాన్ని తగ్గించాలని కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగి అధికారికంగా ఓ పని చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి విలువైన వస్తువును స్వీకరించడం, లంచం డిమాండ్ చేయడం, తీసుకోవడం ఇలాంటి కేసుల్లో ముఖ్యమని సీబీఐ న్యాయవాది వాదించారు. ఇవన్నీ ఈ కేసులో రుజువయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు.హైకోర్టు తీర్పువిచారణ అనంతరం 24 ఏళ్ల తర్వాత హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసును ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో నిరూపించిందని పేర్కొంది. ఇవన్నీ అప్పిలెంట్ను దోషిగా నిరూపిస్తున్నాయని కోర్టు తేల్చింది. ట్రయల్ కోర్టు తీర్పు కొనసాగుతుందని పేర్కొంది. నిందితుడి వయస్సు అప్పటికే 75 సంవత్సరాలు ఉండడం, కేసు సుదీర్ఘకాలం నడవడం తదితర కారణాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐపీసీ సెక్షన్ 161 కింద దోషిగా తేలినా ఎటువంటి అదనపు శిక్ష విధించలేదు. మిగిలిన మరో ఏడాది శిక్షా కాలాన్ని మూడు నెలలకు తగ్గించింది. జరిమానాను రూ. 1000 నుంచి రూ. 2000కు పెంచుతూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. - దిలీప్ మాదిరెడ్డి -
సోమశర్మ వృత్తాంతం..
‘మహర్షీ! కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు’ అని సూతుడిని అడిగాడు శౌనకుడు. అప్పుడు సూతుడు అతడికి సోమశర్మ వృత్తాంతం ఇలా చెప్పాడు: కౌశికుడి కుమారుడైన సోమశర్మ చ్యవనుడి కుమార్తె సుమనను పెళ్లాడాడు. అతడు ధనసంపదలు లేనందున దారిద్య్రంతో బాధపడసాగాడు. వివాహమై ఎన్నాళ్లు గడచినా సంతానం లేకపోవడంతో మరింత దుఃఖితుడై లోలోన మనోవేదన చెందసాగాడు.సోమశర్మ వేదనను గమనించిన అతడి భార్య సుమన, ‘నాథా! మనోవేదన శరీరాన్ని కూడా దహించేస్తుంది. మీరెందుకు బాధపడుతున్నారు?’ అని అడిగింది.‘దేవీ! ఈ జన్మలో నాకు ధనపుత్ర సంపదలు లేకపోవడం వల్ల దిగులు చెందుతున్నాను. పూర్వజన్మ పాపాల వల్లనే నాకీ గతి ఏర్పడినట్లుందని తలచి దుఃఖిస్తున్నాను’ అని చెప్పాడు.‘ప్రాణనాథా! సృష్టిలోని సకలజీవులు విషయాశ వల్ల సంసారబాధలు పడుతుండటం సహజమే! మోహం వల్ల లోభం; లోభం వల్ల అసత్యం; అసత్యం వల్ల పాపం; పాపం వల్ల దుఃఖం సంభవిస్తాయి. ఋణానుబంధాల కారణంగా సంతానం కలుగుతుంది. పూర్వజన్మలో మనం ఎవరి వద్ద ధనం తీసుకోలేదు. ఎవరితోనూ మనకు రాగద్వేషాదులు లేవు.’ అని చెప్పింది.‘నువ్వు చెప్పినది నిజమే! ఇది నివృత్తి మార్గం. కాని, ఎందరో సాధువులైన మహాపురుషులు సకృత కర్మలు ఆచరించి, దారాపుత్రాదులతో చతుర్విధ పురుషార్థాలను పొందారు. మనం ధన పుత్రలాభం పొందే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు’ భార్యను అడిగాడు సోమశర్మ.‘నాథా! ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండూ శ్రుతి సమ్మతాలు. ‘పుత్రేణ లోకాన్ జయతి’ అని వేదవాక్యం. పుత్రుడు లోకజయానికి సాధనం. గుణవంతుడు, విద్వాంసుడు అయిన ఒక పుత్రుడి వల్ల వంశం తరిస్తుంది. ఎందరో మహర్షులు ప్రవృత్తిమార్గంలో చతుర్విధ పురుషార్థాలను సాధించారు.’ అంటూ అనేక ఉదాహరణలను చెప్పింది.‘దేవీ! ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు?’ అడిగాడు సోమశర్మ.‘నాథా! నా తండ్రి చ్యవనుడి ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఆయన ద్వారానే కొన్ని పూర్వగాథలను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత చెప్పాను. వసిష్ఠ మహర్షి వద్దకు వెళితే ఆయన మరిన్ని విశేషాలు చెప్పగలరు’ అని చెప్పింది సుమన.సోమశర్మ గంగాతీరంలో ఉన్న వసిష్ఠాశ్రమానికి వెళ్లాడు. వసిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వసిష్ఠుడు అతడిని వచ్చిన కారణమేమిటని అడిగాడు.‘మహర్షీ! నా దారిద్య్ర బాధలకు, నాకింత వరకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘నాయనా! నువ్వు పూర్వజన్మలో కర్షకుడివి. భార్యాపుత్రులు, సిరిసంపదలతో కలిగిన వాడివి. అయినా జ్ఞానశూన్యుడివై, లోభివై, చివరకు భార్యాపుత్రులకు కూడా తగిన అన్నవస్త్రాదులు సమకూర్చక పీడించావు. నువ్వు సంపాదించిన నిక్షేపాలను రహస్య ప్రదేశాల్లో పాతిపెట్టి, వాటి సంగతి భార్యా పిల్లలకు చెప్పకుండానే కాలధర్మం చెంది, యమలోకానికి చేరుకున్నావు. దాన ధర్మాలు చేయనందునే ఈ జన్మలో దారిద్య్రాన్ని అనుభవిస్తున్నావు’ చెప్పాడు వసిష్ఠ మహర్షి.‘మరి నాకు ఈ జన్మలో విప్రత్వం లభించడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘పూర్వజన్మలో సంపన్న కర్షకుడివైన నీ వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. నువ్వు అతడికి నీ గోశాలలో ఆశ్రయం ఇచ్చావు. అతడికి షడ్రసోపేతమైన భోజనంపెట్టి ఆతిథ్యమిచ్చావు. ఆ పుణ్యఫలం వల్లనే నీకు విప్రజన్మ లభించింది. నీ దారిద్య్రం తీరాలంటే లక్ష్మీనారాయణుల ధ్యానమే మార్గం’ అని చెప్పాడు వసిష్ఠుడు.వసిష్ఠుడి సలహాపై సోమశర్మ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సును భంగపరచడానికి దేవేంద్రుడు నానా ఆటంకాలు కల్పించాడు. అయినా సోమశర్మ నిశ్చల మనస్కుడై తపస్సు కొనసాగించాడు. సోమశర్మ తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా గరుడారూఢుడై వచ్చి, అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడికి కోరిన వరాలను అనుగ్రహించాడు.శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల సోమశర్మకు దారిద్య్ర బాధ తీరి, ధన సంపదలు సమకూరాయి. కొన్నాళ్లకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అతడు బాల్యం నుంచి కృష్ణభక్తుడై దినదినాభివృద్ధి చెందాడు. అతడు యుక్తవయస్కుడు కాగానే సోమశర్మ, సుమన దంపతులు అతడికి వివాహం చేసి, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లారు.పురావిశేషం..పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఆలయ అర్చకులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని ‘స్నానబేడి’ అనే స్నానాగారంలో పవిత్రస్నానం చేయిస్తారు. ఇందులో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకిస్తారు. ఈరోజు జగన్నాథుడు గజముఖుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నానం తర్వాత జగన్నాథుడు జ్వరం బారినపడి, ‘అనసర ఘర’ అనే జ్వరమందిరంలో పద్నాలుగు రోజులు గడుపుతాడు. - సాంఖ్యాయన -
వేడుకల్లో రోమ్ నగరం..
క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు మహోన్నత వ్యక్తులు సెయింట్ పీటర్, సెయింట్ పాల్ల సంస్మరణార్థం జూన్ 29న నిర్వహించుకునే ‘ఫీస్ట్ ఆఫ్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్’ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమవుతున్నాయి. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేయడంలో వీరిద్దరూ చూపిన అచంచలమైన విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఈ వేడుకలను జరుపుకొంటారు.రోమ్ నగరంలో వేడుకలుపీటర్, పాల్ల పండుగను రోమ్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బెసిలికా ఈ వేడుకలకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. సెయింట్ పీటర్ వారసుడిగా ప్రస్తుత పోప్ ఈ చరిత్రాత్మక వేడుకలకు నేతృత్వం వహిస్తారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఆర్చ్బిషప్లకు ‘పాలియం’ అందజేస్తారు. అయితే ఈ పండుగ కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, క్రీస్తు ప్రేమను, రక్షణ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు పీటర్, పాల్లు చూపిన ధైర్యాన్ని, నిబద్ధతను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అలవరచుకోవాలని ఈ వేడుక గుర్తు చేస్తుంది. ఈ వేడుకలను కళ్లారా వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది యాత్రికులు, పర్యాటకులు రోమ్ నగరానికి పోటెత్తుతారు. ఈ వేడుకలను కేవలం రోమ్ నగరంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చర్చిలలో జరుపుకొంటారు.త్యాగానికి ప్రతిరూపం పీటర్, పాల్యేసుక్రీస్తు ఎంపిక చేసుకున్న పన్నెండు మంది ముఖ్య శిష్యులలో పీటర్ ఒకరు. ఒక సాధారణ జాలరి అయిన పీటర్‌ను, యేసుక్రీస్తు మానవ హృదయాలను గెలుచుకునే ‘మనుష్యులను పట్టు జాలరి’గా మార్చారు. రోమన్ల నుంచి తీవ్రమైన వేధింపులు ఎదురైనప్పటికీ, ఆయన తన విశ్వాసాన్ని వీడలేదు. క్యాథలిక్ క్రైస్తవులు ఈయన్ను మొదటి పోప్‌గా, రోమ్ చర్చి వ్యవస్థాపకుడిగా భావిస్తారు. అలాగే మొదట్లో క్రైస్తవులను తీవ్రంగా హింసించిన సెయింట్ పాల్, దమస్కు మార్గంలో యేసుక్రీస్తును దర్శించుకున్న తర్వాత పూర్తిగా మారిపోయారు. ఆ తర్వాత ‘పాల్’గా మారిన ఆయన, మధ్యప్రాచ్యం, ఐరోపా అంతటా క్రైస్తవ మతాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. నూతన నిబంధనలో ఆయన రాసిన లేఖలు నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.చారిత్రక ఆధారాల ప్రకారం పీటర్, పాల్– వీరిద్దరూ రోమ్ నగరంలోనే దైవసాన్నిధ్యం చెందారని విశ్వసిస్తారు. రోమ్‌లోని ప్రసిద్ధ ‘సెయింట్ పీటర్స్ బెసిలికా’, ‘సెయింట్ పాల్స్ ఔట్‌సైడ్ ది వాల్స్’ ప్రార్థనా మందిరాల్లో వీరిద్దరి సమాధులు ఉన్నాయి. చర్చి క్యాలెండర్లో వీరిద్దరి పేరుమీద ప్రత్యేకమైన రోజులున్నప్పటికీ రోమ్ నగరంలో వారు పొందిన అమరత్వాన్ని స్మరించుకుంటూ జూన్ 29ని ‘ఫీస్ట్ ఆఫ్ సెయింట్స్ పీటర్ అండ్ పాల్’గా నిర్వహిస్తున్నారు. - రమా జంబుల -
లిఫ్ట్....!
రాత్రి ఒంటి గంట దాటింది. నగర శివారు ప్రాంతం అది. మరో ఇరవై మైళ్లు దాటితే కానీ సిటీ రాదు. చుట్టూ చిమ్మ చీకటి, నిర్మానుష్యమైన రహదారి. ఆ సమయంలో దయాళ్ అనే వ్యక్తి కారు బ్రేక్ డౌన్ అవ్వడంతో రోడ్డు పక్కన నిలబడి సహాయం కోసం చూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ దారిలో కారు వస్తోంది. దయాళ్ చెయ్యి అడ్డం పెట్టి, లిఫ్ట్ అడిగాడు.ఆ కారులో ఉన్న విక్టర్ కారు ఆపాడు. దయాళ్ను ఎగాదిగా చూశాడు. విక్టర్ ప్రవర్తన, అతని చూపులు చూసి దయాళ్ మనసులో ఏదో కీడు శంకించింది. అయినా వేరే దారి లేక దయాళ్ కారు ఎక్కాడు. కారు ముందుకు కదిలింది. సిటీకి మరో నాలుగు మైళ్లు ఉందనగా, ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో దయాళ్ శవమై తేలాడు.ఈ మిస్టరీ మర్డర్ కేసు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు ముందుకు వచ్చింది. అభిమన్యు విచారణ ప్రారంభించగా ఒక దిగ్భ్రాంతికరమైన నిజం తెలిసింది. ఒక సైకో సీరియల్ కిల్లర్ వరుసగా ఇలాంటి హత్యలు చేస్తున్నాడు. నిర్మానుష్య ప్రాంతాల్లో వాహనాలు పాడైపోయి లిఫ్ట్ అడిగే అమాయకులను తన కారులో ఎక్కించుకోవడం, ఆపై వారిని దారుణంగా హత్య చేసి, అందినంత దోచుకుని పారిపోవడం అతని అలవాటు. అప్పటికే అతడు పలువురిని ఇలాగే బలి తీసుకున్నాడు. వారి వెహికల్స్ కలర్, నంబర్ ప్లేట్లు మార్చి నేరాలు చేయడం అలవాటు. సీరియల్ కిల్లర్‌ను ఎలాగైనా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అభిమన్యు ఒక వ్యూహం పన్నాడు.∙∙ అర్ధరాత్రి వేళ అభిమన్యు ఆ నిర్మానుష్యమైన ప్రాంతం దగ్గర నిలబడ్డాడు. పక్కనే అతని కారును బాయ్నెట్ తెరచి పెట్టాడు. రోడ్డు మీద నిలబడి ‘లిఫ్ట్... లిఫ్ట్’ అని దారినపోయే వాహనాల వారిని అడుగుతున్నాడు.కొద్దిసేపటికి చీకటిని చీల్చుకుంటూ ఒక కారు వచ్చింది. అభిమన్యు వంక, బాయ్నెట్ తెరిచి వున్న ఖరీదైన కారు వంక, అభిమన్యు చేతికి ఉన్న బంగారు బ్రాస్లెట్ వంక చూస్తూ ‘లిఫ్ట్’ కావాలా అని అడుగుతూనే డోర్ తెరిచాడు.కారు కొంత దూరం వెళ్లగానే అభిమన్యు కారులో ఒక వింత వాసనను గమనించాడు. అది మనుషులను స్పహ తప్పి పడిపోయేలా చేసే ఒక రకమైన పెర్ఫ్యూమ్ (మత్తుమందు) అని అతడు గ్రహించాడు. ముందే అప్రమత్తంగా ఉన్న అభిమన్యు, తన వద్ద ఉన్న ప్రత్యేకమైన యాంటీ–గ్యాస్ మాస్క్ సహాయంతో ఆ మత్తు మందు ప్రభావం పడకుండా జాగ్రత్తపడ్డాడు. స్పృహ తప్పిపోయినట్టు సీటుపై పడిపోయాడు.∙∙ ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న పొదల్లో కారు ఆపాడు.అభిమన్యు పూర్తిగా స్పృహ కోల్పోయాడని విక్టర్ నమ్మాడు. కారును పక్కకు ఆపి, తన సీటు కింద ఉన్న పదునైన కత్తిని తీశాడు. అభిమన్యును బయటకు లాగాడు. కత్తిని అభిమన్యు కంఠం దగ్గర పెట్టాడు.‘హలో మిస్టర్ విక్టర్ హౌ ఆర్యూ?’ అంటూ కళ్ళు తెరిచాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.విక్టర్ షాకయ్యాడు. అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.‘లిఫ్ట్ పేరుతో మనుషుల ప్రాణాలు తీసి, వాళ్ళ వెహికల్స్‌ను కూడా నీ నేరాలకు వాడుకుంటూ, చిట్టచివరికి అదే వెహికల్లో, అదే లిఫ్ట్ ఇస్తూ దొరికిపోయావు’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు అతడిని పోలీసులకు అప్పగిస్తూ.ఏ మాత్రం భయం లేకుండా చిన్నగా నవ్వుతూ ‘అది సరే... ఇంతకూ నన్నెలా పట్టుకున్నారు చెప్పనే లేదు?’ విక్టర్ అడిగాడు.‘నీ ఆట కట్టించింది... నిన్ను పట్టుకోవడానికి క్లూ ఉంచింది... ఎవరో తెలుసా? జీపీఎస్ ట్రాకర్. దయాళ్ తన కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు. అది తెలియని నువ్వు ఆ కారును తీసుకువెళ్లి కలర్ మార్చి... నంబర్ మార్చావు. నీ ప్రతి కదలిక జీపీఎస్ ట్రాకర్ ద్వారా తెలుస్తూనే వుంది. నిన్ను పట్టుకోవడానికి నేను కూడా ఒక అపరిచితుడుగా లిఫ్ట్ అడిగాను...’ అభిమన్యు చెప్పాడు.‘ఓహ్... అయితే ఈసారి మరింత తెలివిగా మర్డర్ చేయాలన్నమాట...’ క్రూరంగా నవ్వుతూ అన్నాడు విక్టర్.‘నువ్వు జైలులో నుంచి తప్పించుకున్నప్పుడు... నీకు శిక్ష పడకుండా ఉన్నప్పుడు కదా... అది కూడా ఈ అభిమన్యు ఇన్స్పెక్టర్గా లేనప్పుడు. నీకా ఛాన్స్ లేదు...’ చెప్పాడు అభిమన్యు.‘సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నందుకు కంగ్రాట్స్... మీడియా ద్వారా మీరేమన్నా చెప్పదల్చుకున్నారా?’ మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘అర్ధరాత్రి వేళల్లో అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం ఎంత ప్రమాదకరమో, అలాగే ఎవరైనా అపరిచితులను నమ్మి లిఫ్ట్ అడిగి వాళ్ల వాహనాల్లో వెళ్లడం కూడా అంతే ప్రమాదకరం. ప్రాణాలు పోయాక బాధపడటం కంటే, ముందే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అంతే కాదు నేరస్తుల బారి నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీని కూడా వాడుకోవాలి.’ - శ్రీసుధామయి -
రెయిన్ సీజన్‌కి టెక్ హీరోస్!
వర్షాకాలంలో మనిషికన్నా ఎక్కువ కష్టపడేది షూలు, కార్ మిర్రర్లు, మొబైల్ టార్చ్లే! వాటి బాధలు తగ్గించడానికి వచ్చేసిన ఈ కూల్ గాడ్జెట్స్ రెయిన్ సీజన్ ని కాస్త ఈజీగా మార్చేస్తాయి. అలా వర్షాకాలంలో గొడుగులు కంటే ముందుగా ఈ గాడ్జెట్స్ కూడా హీరోలుగా మారాయి!మిర్రర్‌కి రెయిన్ కోట్!వర్షంలో కారు డ్రైవ్ చేస్తుంటే అసలు టెన్షన్ రోడ్డుకన్నా సైడ్ మిర్రర్‌పైనే ఉంటుంది! రెండు చినుకులు పడితే చాలు, మిర్రర్ మొత్తం బ్లర్ అయి ‘వెనక ఎవరు వస్తున్నారు?’ అనేది గెస్ గేమ్‌లా మారిపోతుంది. అలాంటి టైంలో ఈ ‘కార్ సైడ్ మిర్రర్ రెయిన్ గార్డ్’ బాగా ఉపయోగపడుతుంది.ఈ చిన్న పీవీసీ గార్డ్స్‌ను మిర్రర్‌పై అతికిస్తే, వర్షపు నీరు నేరుగా మిర్రర్‌పై పడకుండా అడ్డుకుంటాయి. దీంతో డ్రైవింగ్‌లో విజిబిలిటీ కాస్త క్లియర్‌గా ఉంటుంది. రాత్రివేళ వెనక వాహనాల హెడ్‌లైట్ గ్లేర్‌ను కూడా కొంతవరకు తగ్గిస్తాయి. కార్లు, ట్రక్కులు ఇలా దాదాపు అన్ని వాహనాలకు సరిపడే యూనివర్సల్ డిజైన్ తో వస్తుంది. అతికించడం కూడా ఈజీ! తీసేసినా మిర్రర్‌పై మార్కులు పడవు. నాలుగు పీసులతో వచ్చే ఈ సెట్ ధర రూ. 300 మాత్రమే!షూస్‌కి ఎయిర్ స్పా! వర్షాకాలంలో బట్టలు ఉతకడానికే భయపడిపోతాం, అలాంటిది షూలు తడిస్తే ‘ఇవి ఇక రెండు రోజులు ఆరవు!’ అని మూలన పెట్టేయకండి. ఎందుకంటే, ఇప్పుడు వచ్చింది ఒక సూపర్ ఎలక్ట్రిక్ షూ డ్రయర్! ఇది ఉంటే, వర్షంలో తడిసిన షూలు, జిమ్ తర్వాత చెమట వాసన వచ్చే స్నీకర్స్, ఉదయం వేసుకునే సరికి ఇంకా తడిగానే ఉండే స్కూల్ షూలన్నీ క్షణాల్లోనే డ్రై అయిపోతాయి.360 డిగ్రీల హాట్ ఎయిర్ టెక్నాలజీతో పనిచేసే ఈ చిన్న గాడ్జెట్ షూల లోపలికి వేడి గాలిని పంపి త్వరగా ఆరబెడుతుంది. అంతేకాదు, చెడు వాసనను కూడా తగ్గిస్తుంది. ఓవర్ హీటింగ్ కాకుండా టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేసే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. స్పోర్ట్స్ షూలు, బూట్లు, స్లిప్పర్లు, సాక్స్ దాదాపు అన్ని రకాల ఫుట్‌వేర్‌కు ఇది సరిపోతుంది. మడిచే డిజైన్ తో ఉండటంతో ట్రావెల్లో కూడా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర సుమారు రూ.1,500.చేతులకే టార్చ్‌లైట్!కరెంట్ పోయినప్పుడు మొబైల్ టార్చ్‌ని నోట్లో పట్టుకుని పని చేసిన అనుభవం ఉందా? ఇక ఆ టెన్షన్ అవసరం లేదు! ఈ ‘ఎల్ఈడీ ఫ్లాష్‌లైట్ గ్లోవ్స్’ వేసుకుంటే, మీ చేతులే చిన్న టార్చ్లైట్లా మారిపోతాయి.ఈ గ్లోవ్స్‌లో వేళ్ల దగ్గర చిన్న ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. స్విచ్ ఆన్ చేస్తే చేతులు ఎటు కదిలితే వెలుతురు కూడా అటే వస్తుంది. బైక్ రిపేర్, ఫిషింగ్, క్యాంపింగ్, రాత్రివేళ చిన్న పనులు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. చేతిలో టార్చ్ పట్టుకోవాల్సిన పని లేకుండా ‘హ్యాండ్స్ ఫ్రీ’గా పని చేసుకోవచ్చు. స్ట్రెచ్ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ గ్లోవ్స్ సాఫ్ట్‌గా, కంఫర్ట్‌గా ఉంటాయి. బ్యాటరీ కూడా మార్చుకునే సదుపాయం ఉంది. టూల్ బాక్స్‌లో పెట్టుకోవడానికి, గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇది కూల్ గాడ్జెట్! ధర రూ. 180 మాత్రమే. -
సిమెంట్ సమాధులు..
ఆకాశహర్మ్యాల మధ్య ’స్వర్ణ విహార్’ అపార్ట్మెంట్ ఒక ఆధునిక కోటలా నిలబడి ఉంది. ‘బొయ్...’మంటూ సైరన్ మోగుతూ అపార్ట్మెంట్ గేటు ముందు ఆగింది అంబులెన్స్. స్ట్రెచర్ మీద డెబ్బై ఏళ్ల రామారావు నిర్జీవ శరీరం నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా ఉంది. తన కష్టం, సుఖం, బాధ, భయం, కోపం, దుఃఖం అన్నిటికీ వేదిక అయిన తన ఇంటిని కడసారి చూసుకోడానికా అన్నట్టు... పూర్తిగా మూసుకుపోకుండా అరమోడ్పులుగా ఉన్నాయి ఆయన కనులు.కన్నీళ్లు తుడుచుకుంటూ అంబులెన్స్ దిగాడు రవి– రామారావు గారి కొడుకు. అతనితో పాటు ప్రాణంలేని బొమ్మలా నీళ్ళింకిపోయిన కళ్ళతో రామారావు గారి భార్య, మరో ఇద్దరు బంధువులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి రామారావు దేహాన్ని అపార్ట్మెంట్ గేట్ లోపలకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండగానే, వీళ్ళ కోసమే కాచుకొని ఉన్నట్టు గబగబా ఎదురొచ్చాడు సెక్యూరిటీ గార్డు.‘‘సార్... అది... అయ్యగారి శవాన్ని లోపలకు తీసుకురానివ్వద్దని కమిటీ వాళ్ళు చెప్పారండి’’ నెమ్మదిగా అన్నాడు.మొదట అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రవికి. అర్థమైన తరువాత నోట మాట రాలేదు. అతని కూడా వచ్చిన బంధువులే తేరుకొని, ‘‘అదేంటయ్యా! ఇదెక్కడి విడ్డూరం! అతని బాడీని అతనింటికి తీసుకురాకుండా ఎక్కడకు తీసుకెళ్ళమంటారు?’’ అన్నారు.‘‘ఏమో సార్! ప్రెసిడెంట్ గారు చెప్పమన్నదే చెప్పాను...’’ అన్నాడు గార్డ్.ఇంతలోనే అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మరికొందరు సభ్యులు కలిసి వచ్చారు.‘‘చూడు రవి, మాకు విషయం తెలిసింది. బాడీని లోపలికి తీసుకురావడానికి వీల్లేదు.’’ కచ్చితంగా చెప్పారు.‘‘ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది నా ఇల్లు. నా తండ్రి పార్ధివ దేహాన్ని నా ఇంట్లోకి తీసుకురావడానికి మీరెందుకు అడ్డం పెడుతున్నారు?’’ బాధ, కోపం, ఉక్రోషం, నిస్సహాయత కలగలిసిన గొంతుతో అన్నాడు రవి.‘‘ఇది నీ ఒక్కడి ఇల్లు కాదు రవి. ఈ కాంపౌండ్ లో ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్న దగ్గర శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చే పోయే వాళ్ళందరికీ అపశకునంగా, ఆశుభంగా, సెంటిమెంట్‌గా భావిస్తారు’’ అన్నారు వాళ్ళు.అందేంటి సార్ అలా మాట్లాడతారు!? ఇన్నేళ్ళు మీతో కలిసి, మెలిసి తిరిగిన మనిషి. ఇప్పుడు ప్రాణం పోయేసరికి అతని శరీరం అంత భయంకరం, అపశకునం అయిపోయిందా? అన్నారు బంధువులు.‘‘ఏమోనండి! అవన్నీ మీరడక్కూడదు. మా అపార్ట్మెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం నడుచుకోవలసిందే. సెంటిమెంట్లు పక్కన పెట్టినా, ఇళ్ళ మధ్యలో ఇలాంటివి జరిగితే ఇంటి విలువ పడిపోతుంది. అసలే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇళ్ళను అమ్ముకోడానికి బేరం పెట్టుకున్నారు. ఈ సమయంలో ఇలాంటివి ఇక్కడ జరిగితే ఆశుభంగా భావించి ఆ ఇళ్ళు చెల్లుబాటు కావు. పైగా వచ్చే నెలలో ఇక్కడ ముగ్గురు పెళ్లిళ్లు పెట్టుకున్నారు. వాళ్లకు కూడా అపశకునంగా ఉంటుంది...’’ మానవత్వం అన్నది ఏ కోశానా లేకుండా అన్నారు వాళ్ళు.‘‘మరీ అలా మాట్లాడకండి సార్. సెల్లార్లో ఒక పక్కన కాస్త టెంట్ అడ్డంగా కట్టేసి, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బాడీని పెట్టుకుంటే తప్పేంటి? ఇంత పెద్ద సెల్లార్లో ఇటు చివర బాడీని పెట్టుకుంటాం. జనమంతా అటు పక్కనుంచి తిరుగుతారు. దానివలన ఎవరికేం ఇబ్బంది కలుగుతుంది. అపశకునం కలుగుతుంది? వచ్చే బంధువులందరికీ చివరి చూపయినా దక్కాలి కదా. పోయినాయనకు కాస్త స్నానం, పూజలాంటి కార్యక్రమాలు, ఆచారాలు నిర్వహించాలి కదా!’’ వాదనకు దిగారు చనిపోయినాయన బంధువులు.‘‘ఏమో... అదంతా మాకు తెలీదండి. కావాలంటే గేట్ లోపలకు తీసుకురాకుండా ఈ బిల్డింగ్ ముందే రోడ్డు మీద టెంట్ వేసి పెట్టుకోండి. లేదంటే పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఉంది కదా అందులోనో లేదా శ్మశానం షెడ్డులోనో ఉంచండి. అంతేగాని గేట్ లోపలి తీసుకురావడానికి మాత్రం కుదరదు’’ మూర్ఖత్వానికి పరాకాష్ఠగా అన్నారు కమిటీ వాళ్ళతో పాటు మరో ముగ్గురు నలుగురు.‘‘అన్యాయంగా మాట్లాడకండి. శవాన్ని గేట్ బయట పెట్టడమేంటి? ఉన్నప్పుడు సంబంధాలు కొనసాగించడమే కాదు. పోయిన తరువాత ఆ నిర్జీవ శరీరాన్ని కూడా అంతే గౌరవంగా పంపించాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు. పవిత్రత గురించి, శకునాల గురించి, ఆచారాల గురించి ఇంతలా చెబుతున్నారు. మీకు ఆ మాత్రం తెలీదా? ఒక శవానికి జరగవలసిన సంస్కారాలు, ఆచారాలు జరగనివ్వకపోతే ఆ పాపం కూడా చుట్టుకుంటుంది.’’ చివరి అస్త్రంగా అన్నారు బంధువులు. ఈ చివరి మాటతో కాస్త తగ్గారు బిల్డింగ్ పెద్దలు. కాని తాము పట్టిన పట్టు మాత్రం వదల్లేదు.ఇక్కడిలా వాదన జరుగుతుంటే, అప్పటికే తమకు ఆలస్యమవుతుందని విసుక్కుంటున్న అంబులెన్స్ వాళ్ళు,‘‘సార్! ఈ గొడవ ఎప్పుడు తేలుతుందో... మేం వెళ్ళాలి సార్!’’ అని చెప్పి, ఒకప్పుడు ఆ పరిసరాలన్నీ యథేచ్ఛగా తిరిగి, గార్డెన్లో ఎక్కడ ఏ మొక్క వంగినా, వాలినా దానిని సరిచేసి; ఎక్కడ ఏ గోడకి, గచ్చుకి చిన్న పెచ్చూడినా వెంటనే సరిచేసి, తీర్చిదిద్దిన రామారావుగారి దేహాన్ని అక్కడే రోడ్డు మీద దించేసి వెళ్ళిపోయారు.‘‘నాన్నా.. నన్ను క్షమించు నాన్నా... బ్రతికి ఉన్నంత కాలం,నువ్వు అద్దంలా తీర్చిదిద్దిన ఈ భూమ్మీద నీ చివరి స్పర్శ ఇవ్వలేకపోతున్నాను’’ అని రవి ఏడుస్తుంటే... అపార్ట్మెంట్ ఇళ్ళలోంచి వస్తున్న టీవీల శబ్దాలు, ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్న హడావిడిలో నిశ్శబ్దంగా కలిసిపోయింది రవి ఆక్రోశం.‘అయ్యో! బతికున్నంతకాలం హాయిగా అందరితో ఎంతో ఆత్మీయంగా బతికిన నీకు, ప్రాణం పోయిన తరువాత ఈ అవమానమేంటయ్యా! ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారంటూ నీ కాళ్ళంటి ఆశీర్వాదాలడిగిన వీళ్ళకు నీ నిర్జీవ శరీరం అపశకునం అయిపోయిందా!? భగవంతుడా... ఏంటీ ఘోరం!’ నిశ్శబ్దంగా కుమిలిపోతోంది రామారావు గారి భార్య.ఇంతలో... జరుగుతున్న ఘోరం చూడలేని ప్రకృతి విలపిస్తున్నట్టు భోరుమని వర్షం మొదలయింది. బంధువులు రామారావు శరీరాన్ని ఎలాగైనా లోపలకు తీసుకువెళ్లాలని పట్టుదలగా బిల్డింగ్ కమిటీవాళ్ళతో వాదిస్తూనే ఉన్నారు. జరుగుతున్న రగడతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టు నిర్జీవంగా, గేటు బయట, రోడ్డు మీద, ఒక బల్ల మీద పడి ఉంది రామారావు శరీరం. ఎవరో ఒక దుప్పటి తీసుకొచ్చి కప్పారు శరీరం మీద వర్షానికి తడవకుండా ఉండడం కోసం. జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూ, తండ్రి దేహాన్ని హత్తుకుని భోరున ఏడుస్తున్నాడు రవి.‘ఒరేయ్... మనుషుల్లా బతకడం నేర్చుకోండిరా! ఈ రోజు నా తండ్రిని బయట పెట్టారు. రేపు మీరు కూడా ఇదే గేటు దాటి బయటికి రావాలి. అప్పుడు మీ ఆత్మలకి శాంతి దొరుకుతుందా? సిమెంట్‌తో కట్టుకున్నది ఇల్లు కాదురా... ప్రేమని పంచుకునేది ఇల్లు. ఇంత పెద్ద స్థలంలో ఇంత పటిష్ఠంగా మీరు కట్టుకున్నది ఇళ్లను కాదు... శ్మశానాలను కట్టుకున్నారు! శ్మశానాలను...’ ఈ మాటలు బయటకు అనలేదతను. మౌనంగా మనసులోనే అనుకుంటూ ఆక్రోశిస్తోందతని హృదయం.జోరున వర్షం కురుస్తోంది. అపార్ట్మెంట్ గేటు బయట ఒకవైపు, శవం పక్కన విలపిస్తూ దిక్కుతోచని స్థితిలో అతని భార్యా, బిడ్డలు. మరోవైపు అపార్ట్మెంట్ వాసులు ‘లోపలికి రానివ్వం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. గొడవ పెద్దదవుతోంది. ఇక ఆగలేకపోయారు ఆ అపార్ట్మెంట్లోనే ఉండే రిటైర్డ్ ప్రొఫెసర్ మూర్తిగారు. అంతవరకు సామరస్యంగా సమసిపోతుందని ఎదురుచూసిన గొడవ ఇంకా ముదురుతుండేసరికి, గంభీరంగా ముందుకు వచ్చారు. ఆయన మాటలకి ఆ ప్రాంతంలో ఒక గౌరవం ఉంది.‘‘చాలిక ఆపండి ఈ అమానుషాన్ని! ఏం చేస్తున్నారు మీరు? అందరూ చదువుకున్న వాళ్లేగా! లేక రాతి యుగంలో మనుషులా? బాధలో ఉన్నవారికి నీ కష్టంలో మేమూ తోడుంటాం అని భుజం తట్టి ఓదార్పునివ్వడం పోయి, వాళ్ళని మరింత బాధల్లోకి నెట్టేస్తారా!? ఇదేనా మానవత్వం?’’ అన్నారు గట్టిగా మూర్తిగారు.‘‘మూర్తిగారు, మీకు తెలియంది కాదు. ఈ బిల్డింగ్‌లో పెళ్లిళ్లు ఉన్నాయి, ఇప్పుడీ శవాన్ని లోపలకు తీసుకువస్తే బిల్డింగ్ మైల పడుతుంది. దోషం చుట్టుకుంటుంది. ఇది మా ఒక్కరి అభిప్రాయం కాదు. చాలామంది ఇలాగే అభిప్రాయపడుతున్నారు. అందరి క్షేమం కోసమే కదా మేమూ వద్దంటున్నది.’’ తనూ తీవ్రంగానే అన్నాడు ప్రెసిడెంట్. డూడూ బసవన్నల్లా అతనికి వంత పాడారు మరికొందరు.‘‘దోషమా? ఏ శాస్త్రం చెప్పింది రాజశేఖర్ గారు. ఆపదలో ఉన్న పొరుగువాడికి సాయం చేయకపోవడం కంటే పెద్ద దోషం ఇంకోటి ఉంటుందా? మీ ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నాయి సరే, ఎప్పుడో నెల రోజుల తరువాత పెళ్లి ఉందని ఇప్పుడు ఆయన శరీరాన్ని లోపలికి తెస్తే బిల్డింగ్ మొత్తం మైల పడిపోతుందా? అయినా ఇక్కడ సెల్లార్లో బాడీని పెడితే మీ ఇంట్లో పెళ్ళికి మైల ఎలా అంటుకుపోతుందండీ? ఇది చాదస్తమనుకోవాలా? మూఢనమ్మకాలు అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలా? ఇదంతా వదిలేయండి... ఆ మాట నేననకూడదు గాని, రేపు మీ ఇళ్ళల్లో ఎవరికైనా ఇలాంటి కష్టం వస్తే అప్పుడు కూడా ఇలాగే రోడ్డు మీద పడేయమంటారా?’’ ఆవేశంగా అన్నారు మూర్తిగారు.ఆయన ఆవేశానికి, ఆ సమాధానంలేని ప్రశ్నలకు చుట్టూ ఉన్నవాళ్లు సమాధానం చెప్పలేక ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. ఆయన మాటలకు వత్తాసుగా కొందరు తలలూపడం మొదలుపెట్టారు. అప్పటివరకు జరుగుతున్న తతంగం నచ్చకపోయినా, వాళ్ళ పెత్తనానికి మారు మాట్లాడలేక నోరుమూసుకు ఊరుకున్న మరి కొందరయితే,‘‘నిజమే కదా! ఈ ప్రెసిడెంట్, సెక్రెటరీలు మరీ మూర్ఖులు.’’‘‘అవును... అంతా వీళ్ళ ఇష్టమే అయిపోతోంది. వాళ్ళేం చెప్తే అదే రూల్... బిల్డింగ్ అంతా వీళ్ళదే అన్నట్టు చెలరేగిపోతున్నారు. అడిగేవాళ్ళు లేక...’’‘‘అదే కదా! పాపం ఆ కుటుంబాన్ని చూడండి వీళ్ళ ఆగడాలకు ఎలా కుమిలిపోతున్నారో... ఇంట్లో మనిషి పోయి వాళ్లేడుస్తుంటే, వీళ్ళిలా అవమానించి ఏడిపిస్తున్నారు’’ అంటూ గుసగుసలు మొదలుపెట్టారు.‘‘రామారావుగారు ఈ అపార్ట్మెంట్లో పదేళ్ల నుంచి ఉన్నారు. మీ పిల్లలు కింద పడితే లేవనెత్తిన చేతులు ఆయనవి. ఎవరికే కష్టం వచ్చినా భుజం తట్టి తోడుగా నిలిచి, మానవత్వం చూపిన మనిషి. పండుగ వస్తే అందరికీ స్వీట్లు పంచి, అందరం కలిసిమెలిసి ఉందామన్న తియ్యటి మనసు ఆయనది. అలాంటి ఆయన ప్రాణం పోయాక ఒక ‘వస్తువు’ అయిపోయారా? ఆయన దేహం అపవిత్రం అయిపోయిందా? బాబాయ్ గారూ... మామయ్యగారూ... అన్నయ్యగారూ... తాతయ్యా... మీరు ఆశీర్వదిస్తే మాకు ‘శుభం’ అంటూ ఆయనతో ఎవరెవరు... ఎన్నిసార్లు అన్నారో గుర్తు చేసుకోండి. అలాంటిది ఆయన ప్రాణం పోయేసరికి అశుభంగా మారిపోయారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి... మీరు చేస్తున్నదేంటో మీకే తెలుస్తుంది.చూడండి... మనం కట్టుకున్న ఈ గోడలు మనల్ని విడదీయకూడదు. ఈ రోజు మనం ఈ గేటు తీయకపోతే, రేపు ఈ అపార్ట్మెంట్ కేవలం ఒక ‘సిమెంట్ సమాధి’లా మిగిలిపోతుంది. ఇందులో మనుషులు ఉండరు, కేవలం భయం మాత్రమే ఉంటుంది. మన పిల్లలకి మనం నేర్పించే సంస్కారం ఇదేనా? చనిపోయిన మనిషికి గౌరవం ఇవ్వలేని మనం, బతికున్న వారికి ఏం విలువ ఇస్తాం?’’ కొట్టినట్టే అన్నారు మూర్తిగారు.ఆయన మాటల్లోని నిజాయితీ, ఆవేదన అక్కడున్న వారి గుండెల్లో గుచ్చుకుంది. కొందరు తలలు దించుకున్నారు. ప్రెసిడెంట్, సెక్రెటరీ అండ్ గ్రూప్ మౌనంగా ఉండిపోయారు.స్థిర నిశ్చయంతో ముందుకు కదిలారు మూర్తిగారు. ‘‘నేను వెళ్తున్నాను. నేనే స్వయంగా నా చేతులతో రామారావు గారిని లోపలికి తీసుకొస్తాను. నాతో పాటు మానవత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే రండి. అడ్డుపడేవాళ్లు ఉంటే... రేపు మీరు కూడా ఒంటరిగా ఇలాగే రోడ్డు మీద నిలబడతారని గుర్తుంచుకోండి.’’ అంటూనే మూర్తిగారు ఒక్క అడుగు ముందుకు వేయగానే, మొదట ఒక యువకుడు, ఆ తర్వాత మరో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చారు. అలా మెల్లగా ఒక్కొక్కరుగా అందరూ రవి దగ్గరకు వెళ్లారు.‘‘క్షమించు రవి... భయం, మూఢనమ్మకాలు, ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం మమ్మల్ని గుడ్డివాళ్లను చేసింది. రామారావుగారు మన పెద్దాయన. ఆయన్ని సగౌరవంగా లోపలికి తీసుకెళ్దాం. అన్నీ మేమే దగ్గరుండి జరిపిస్తాం.’’ అంటూ తనే ముందు రామారావుగారి పార్థివ శరీరాన్ని పైకెత్తడానికి కదిలాడు రాజశేఖరం.అందరూ కలిసి రోడ్డు మీద అనాథలాగా పడి ఉన్న రామారావుగారి శరీరాన్ని గౌరవంగా పైకెత్తారు. గేట్లు బార్లా తెరుచుకున్నాయి. వర్షం వెలిసింది. నిముషాల్లో సెల్లార్లో ఓ పక్కన అంతా ఖాళీ చేసి, రామారావుగారి దేహాన్ని పెట్టడానికి అన్ని ఏర్పాట్లూ చకచకా చేసేశారు. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి పూలు తెచ్చారు, దీపాలు వెలిగించారు. రవి కుటుంబం ఒంటరిది కాదు అని నిరూపించారు అందరూ. రామారావుగారికి జరగాల్సిన ఆచారాలన్నీ సజావుగా, గౌరవప్రదంగా జరిగాయి. అందరూ కలిసి రామారావు గారిని చివరి ప్రయాణానికి సగౌరవంగా సాగనంపారు. బిల్డింగ్‌లో ‘దోషం’ పోయి ‘ప్రేమ’ వెల్లివిరిసింది. - మావూరు విజయలక్ష్మి -
నేనొక యాక్షన్ గర్ల్!
కెమెరా వెనుక ఉండాలని కలలు కన్న అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. గ్లామర్‌తో పాటు స్ట్రా్టంగ్ ఒపీనియన్స్ ఉన్న నటి మాళవికా మోహనన్ , చిల్ వైబ్స్‌తో మనతో పంచుకున్న ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ ఆమె మాటల్లోనే!యాక్టింగ్ ప్లాన్ లోనే లేదు!చిన్నప్పటి నుంచి కెమెరా వెనకే ఉండాలని అనుకునేదాన్ని. నాన్న కె.యూ.మోహనన్ సినిమాటోగ్రాఫర్. ఆయన తీసే షాట్స్ చూస్తూ పెరిగా. అందుకే మాస్ మీడియా చదివి డైరెక్షన్ లోకి వెళ్లాలనుకున్నా. కానీ ఒక రోజు మమ్ముట్టి సర్ నన్ను చూసి ‘యాక్టింగ్ చేస్తావా?’ అని అడిగారు. అలా ‘పట్టం పోలే’ సినిమాతో హీరోయిన్ గా మారిపోయా!ఫైటింగ్లో ఉండే ఎనర్జీ వేరు!చిన్నప్పుడే ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఒక సినిమా కోసం ‘సిలంబం’లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత అది నాకు చాలా ఇష్టమైపోయింది. ఆ స్టిక్ ఫైటింగ్లో ఉండే ఎనర్జీ, మూవ్మెంట్స్ చాలా మెడిటేటివ్గా అనిపిస్తాయి. ఇప్పుడు నా జిమ్ వర్కౌట్స్‌లో కూడా అది ఓ భాగమే.రజనీకాంత్ కాల్ అంటే షాక్!ఒకసారి రజనీకాంత్ సర్ నా పని చూసి స్వయంగా ఫోన్ చేశారు. ఆ క్షణం నిజంగా నమ్మలేకపోయా. ఇక హీరోయిన్స్‌లో నాకు నయనతార అంటే చాలా ఇష్టం.భారీ కార్లు, బైక్స్ అంటే పిచ్చి!నాకు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టం. సినిమా సెట్స్‌లో కెమెరాలు, టెక్నికల్ ఎక్విప్మెంట్ చూస్తూ పెరగడం వల్ల మెకానికల్ విషయాల మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కొంచెం ‘మోటర్ హెడ్’ టైప్!అలాంటి అబ్బాయిలంటే ఇష్టం!ఒకసారి సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ ‘బ్లాక్, వీటిష్, వైట్.. ఎలాంటి అబ్బాయిలు ఇష్టం?’ అని అడిగాడు. దానికి నేను ఒక్క లైన్ లో ‘నాన్ సెక్సిస్ట్ వన్స్!’ అని చెప్పా. అంటే నా ఉద్దేశంలో గౌరవం, సమానత్వం రంగు కంటే చాలా ముఖ్యం.విక్కీ కౌశల్ నా చిన్నప్పటి ఫ్రెండ్!విక్కీ కౌశల్, నేను ముంబైలో ఒకే హౌసింగ్ సొసైటీలో పెరిగాం. చిన్నప్పుడు బర్త్‌డే పార్టీల్లో ‘పాసింగ్ ది పార్సెల్’ ఆడుకునే వాళ్లం! ఇప్పటికీ మా ఇంటికి వచ్చి అమ్మ చేసిన ఫుడ్ తింటుంటాడు. అలాగే ఆయుష్మాన్ ఖురానా కూడా మా కాంప్లెక్స్‌లోనే ఉంటాడు. లిఫ్ట్‌లో, జిమ్‌లో తరచూ కలుస్తుంటాం.కేరళ ఫుడ్ అంటే ప్రాణం!బ్రౌన్ రైస్, ఫిష్ కర్రీ, క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్, పాపడ్ ఉంటే చాలు.. అదీ చేత్తో తింటేనే అసలు టేస్ట్! ముంబైలో అయితే రాజ్మా చావల్ లేదా పెద్ద టిరామిసు డెజర్ట్ నా చీట్డే ఫేవరెట్స్.తప్పు అనిపిస్తే స్ట్రెయిట్‌గా చెప్పేస్తా!ఫ్లైట్ డిలే అయ్యి గంటలకొద్దీ ఎలాంటి అప్డేట్ లేకుండా కూర్చోబెడితే ఎవరికైనా కోపం వస్తుంది. అందుకే ఒకసారి ఎయిర్‌లైన్ సర్వీస్‌పై సోషల్ మీడియాలో ఓపెన్ గా మాట్లాడాను. అలాగే మీడియా ఇంటరాక్షన్స్‌లో కూడా ఒక లిమిట్ ఉంటుంది. గౌరవంగా మాట్లాడితే నేనూ గౌరవంగానే ఉంటాను.టోకెన్ రోల్స్ వద్దు!‘బియాండ్ ది క్లౌడ్స్’ తర్వాత చాలామంది బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేస్తాననుకున్నారు. కానీ కేవలం కనిపించడానికే వచ్చే పాత్రలు, టోకెన్ రోల్స్ నాకు వద్దు. క్యారెక్టర్లో డెప్త్, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటేనే ఓకే చెబుతా. -
పిలవని అతిథి
హైద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో రెండువేల చదరపు గజాల విస్తీర్ణంలోని అదొక్కటే అతి పాత ఇల్లు. చుట్టుపక్కల ఇళ్ళన్నీ పడగొట్టి అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కట్టారు. కాని కింద ఆరు గదులు, పైన ఆరు గదులున్న ఆ పెద్ద ఇల్లు మాత్రం ఏ మార్పులూ లేకుండా ఉంది. అది 1970లలో బాలానగర్‌లో లేత్ మెషిన్స్ తయారు చేసే ఓ పారిశ్రామికవేత్తది. ఆ ఇంటికి వారసురాలైన ఆయన భార్య సిద్ధిధాత్రి ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఎనభై రెండేళ్ళ ఆవిడకి నలుగురు పిల్లలు. కూతురికి పెళ్ళై కలకత్తా వెళ్ళిపోయింది. ముగ్గురు కొడుకుల్లో ఒకడు కరోనా సమయంలో పోయాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు డెహ్రాడూన్‌లో టీ పరిశ్రమ నడుపుతున్నారు. మూడో కొడుకు ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. ఆ సాయంత్రం ఆవిడ వంటగదిలోకి వెళ్ళి షెల్ఫ్ తలుపు తెరిచి చూసింది. ఆవిడకి ఆ షెల్ఫ్‌లో కాఫీ పొడి సీసాని కుడివైపు, చక్కెర సీసాని ఎడమవైపు ఉంచటం అలవాటు. కాని అవి అటుదిటు, ఇటుదటు కనిపించడంతో తను వాటిని అలా ఎప్పుడు పెట్టిందా అని ఆలోచించింది. మరో రోజు ఆవిడ పలాస నుంచి తెప్పించుకున్న పొట్టు జీడిపప్పు అరకిలో పాకెట్ని సీసాలో పోస్తే అది నిండింది. ఆ అరకిలో ఆవిడకి మూడు వారాలు వస్తుంది. ఆవిడ ఆరోగ్యం కోసం రోజుకి ఏడు పప్పులు తింటుంది. కాని అవి సరిగ్గా సగం రోజుల్లో ఖాళీ అవడం ఆవిడకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ రాత్రి అన్నం తిన్నాక సాంబార్ గిన్నెను ఆవిడ సింక్‌లో పడెయ్యలేదు. దాన్ని డైనింగ్ రూమ్‌లో పింగాణీ డిష్‌లోకి మార్చాక, వేడి పోవాలని డైనింగ్ టేబిల్ మీదే గుర్తుగా ఉంచి మర్చిపోయింది. కాని మర్నాడు ఉదయం అది సింక్‌లో కనిపించింది. ఇంకో రోజు తోటలోని తాజా మెట్టతామర పూలు ఫ్లవర్ వేజ్లో ప్రత్యక్షం అవడంతో సిద్ధిధాత్రి తుళ్ళిపడింది. చూస్తే వాటిని తెంపిన కత్తెర టీవీ కింద కేబినెట్లో కుడి డ్రాయర్లో బదులు ఎడమ డ్రాయర్లో కనిపించింది. అది అలై్జమర్స్ లక్షణం అని స్ఫురించగానే తనకి అనుకోని అతిథిగా అలై్జమర్స్ వస్తోందా అని ఆవిడకి భయం వేసింది.ఆ రాత్రి ఆవిడకి మృదువుగా ఈల వినిపించడంతో మెలకువ వచ్చి లేచి కూర్చుంది. అది పై అంతస్తులోంచా లేక తోటలోంచా? ఆవిడకి బోధపడలేదు. అంతలోనే ఆవిడకి నిద్రపట్టింది. మర్నాడు ఉదయం ఆవిడకి ఆ ఈల గుర్తొచ్చి కలై ఉంటుంది అనుకుంది. మర్నాడు రాత్రి కూడా ఆవిడకి ఈలతో మెలకువ రావడంతో ఇల్లంతా వెతికింది. ఎవరూ కనిపించలేదు. తన భర్త మరణించిన మంచం మీదే నిద్రించే సిద్ధిధాత్రికి దెయ్యాల మీద నమ్మకం లేదు. తనకి అనుకోని అతిథిగా అల్జిమర్స్ రావటం కాదని, ఇంట్లోనే ఏదో జరుగుతోందని ఆవిడకి అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల దాకా ఈల శబ్దం వినిపించలేదు. ఓ రాత్రి పెద్ద చప్పుడికి మెలకువ వచ్చి లేచి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీది అన్నం గిన్నె నేల మీద కనిపించింది. పిల్లి అంత పెద్ద గిన్నెని నేల మీదకి నెట్టలేదు. వెంటనే ఆవిడ పోలీసులకి ఫోన్ చేసింది. పావుగంటలో వాళ్ళు వచ్చారు.‘‘ఏం జరిగింది?’’ ఆవిడ వెంట లోపలకి నడుస్తూ ఎస్.ఐ. ప్రశ్నించాడు. ‘‘ఇంట్లో దొంగ పడ్డాడు. ఇది ఆ దొంగ పని. ఇంట్లో నాకు తెలీకుండా ఎవరో మసలుతున్నారు.’’ ఆవిడ నేల మీది ఆ గిన్నెని చూపించి చెప్పింది. ఆవిడ సాంబారు గిన్నె గురించి, జీడిపప్పు, కాఫీ, చక్కెర సీసాల గురించి చెప్పింది. ఆ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంటుందని తెలిసిన పోలీసులు ఇల్లు, తోట వెతికారు. ఎవరూ కనపడలేదు. తలుపులు, కిటికీలు మూసే ఉన్నాయి.‘‘ఈ ఇంట్లోకి ఇంకెవరో వచ్చి వెళ్తున్నారు. పైన గెస్ట్ రూమ్‌లో దుప్పట్లు పరిచి గుర్తుగా ఓవైపు అంగుళం ఎక్కువ కిందకి జార్చాను. కాని అది మర్నాడు సమానంగా కనిపించింది. ఓ తెల్లవారుఝామున అతిథుల బాత్రూంలోకి వెళ్తే అది తడిగా ఉంది.’’ ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అది గమనించిన ఆవిడ చెప్పింది.‘‘నేనేం పిచ్చిదాన్ని కాను.’’ ‘‘రాత్రుళ్ళు మా పెట్రోల్ కారు వాళ్ళని మీ ఇంటివైపు వచ్చి ఓకన్నేసి ఉంచమని చెప్తాను.’’ ఎస్.ఐ. చెప్పాడు. మర్నాడు ఉదయం సిద్ధిధాత్రి ఎప్పటిలా మరో మనిషి ఉనికి కోసం షెల్ఫ్‌లోని కాఫీ సీసాని గమనించింది. అది యథాస్థానంలో లేదు. కావాలని ఆవిడ దాని కింది కాగితం చుట్టూ బాల్ పెన్‌తో గుండ్రం గీసింది. కాఫీ పొడి సీసా ఆ గుండ్రంలో లేదు. ఆవిడ మేడ మెట్లు ఎక్కి పై భాగంలోకి వెళ్ళి గెస్ట్ రూమ్ తలుపు తెరుచుకుని మంచం దగ్గరికి వెళ్ళింది. దాని మీద ఆవిడకి ఓ కాగితం కనిపించింది. దాన్ని అందుకుని చదివింది.మేడం సిద్ధిధాత్రి, ఈ ఇంట్లో మీతో పాటు నేనూ ఉంటున్నాను. చిరుద్యోగినైన నేను పగలు ఉద్యోగానికి ఫ్యాక్టరీకి వెళ్ళి, రాత్రి మీరు నిద్రపోయాక టెర్రేస్ తలుపులోంచి లోపలికి వస్తున్నాను. మీకు ఎలాంటి కీడు చేయను. కేవలం రాత్రుళ్ళు ఆశ్రయం, స్నానం, కాఫీలని, ఆకలేసినప్పుడు స్నాక్స్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టం లేకపోతే ఈ ఉత్తరాన్ని తీసుకోండి. ఓ అపరిచితుడికి సహాయం చేద్దామనుకుంటే దీన్ని ఇక్కడే ఉంచండి. ఈ అర్ధరాత్రి మంచం మీద ఇది కనపడకపోతే ఇక ఎప్పటికీ మీ ఇంటికి రానని మాట ఇస్తున్నాను. దాన్ని చదివాక ఆవిడ కొద్దిసేపు ఆలోచించింది. ఆ ఉత్తరంతో బయటకి నడిచి మెట్లు దిగింది. మధ్యాహ్నం సిద్ధిధాత్రి దాని కింద ‘నువ్వు ఈల మాత్రం వేయకు’ అని రాసి మళ్ళీ అతిథి గదిలోకి వెళ్ళి మంచం మీద ఆ ఉత్తరాన్ని ఉంచి బయటకి నడిచింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి (చదవండి: ‘త్రిపుర రాయని కథ’’) -
ఎంత ప్రయత్నం చేస్తే.. అంత మేలు
వయసు పదకొండు. విమానం, రావణాసుర, స్కైలాబ్.. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలు నలభై నాలుగు; నేషనల్ రెజ్లింగ్‌లోనూ రెండు గోల్డ్ మెడల్స్; చదువులోనూ టాపర్. హైపర్ యాక్టివిటీని కరెక్ట్‌గా ఉపయోగిస్తే పిల్లలు మల్టిపుల్ టాలెంట్స్‌తో రాణించవచ్చు అంటున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ సత్య వర్మ తల్లి పాతపాటి అపర్ణ. పిల్లల పెంపకంలో తను తీసుకుంటున్న జాగ్రత్తలను ఆమె ఇలా వివరించారు.‘‘మా ధృవన్ నేషనల్ రెజ్లర్. అండర్ లెవన్ రెజ్లింగ్‌లో తెలంగాణకు రెండు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చాడు. వైజాగ్‌లో జరిగిన రెజ్లింగ్ సెమీనేషనల్, నేషనల్‌లోనూ సిల్వర్ మెడల్ సాధించాడు. నేను, మా వారు రామరాజు కాలేజీ రోజుల్లో స్టేట్ లెవల్లో స్పోర్ట్స్‌లో రాణించిన వాళ్లమే! పిల్లలు స్పోర్ట్స్‌లో రాణిస్తే, ఆ ఫైటింగ్ ధోరణి జీవితంలోనూ పనికివస్తుందనేది మా ఆలోచన. అందుకే పిల్లలు క్రీడల్లో చురుకుగా పాల్గొనేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. పిల్లలు పెరుగుతున్నప్పుడే వారిలో యాక్టివిటీస్ మనకు వారి చర్యల ద్వారా తెలుస్తుంటాయి. వారి తెలివితేటలను గమనిస్తూ, తగిన అవకాశాలను కల్పించాలనుకుంటున్నాం. సహనంగా ఉండటం గమనించాను.. సినిమాలు చూసి అందులో హీరోలా డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడం గమనించాను. ధృవన్ ఏదైనా చేయాలనుకుంటే చాలా సహనంగా ఉండటమూ గమనించాను. స్పోర్ట్స్ మీట్‌కు తీసుకెళ్లినా, షూటింగ్స్‌కు వెళ్లినా అక్కడ తన టైమ్ వచ్చేంతవరకు ఓపికగా ఉంటాడు. ఆ సహనమే 500కు పైగా ఆడిషన్స్‌లో పాల్గొనేలా చేసింది. దీంతో టీవీలో రియాలిటీ షోష్కి, సినిమా ఆడిషన్స్‌కు తీసుకెళ్లేదాన్ని. దానిని ధృవన్ బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్‌లో ఉండగానే సినిమా ఆడిషన్స్‌కు తీసుకెళ్లాను. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించాడు. ఆ తర్వాత పుష్ప, విమానం... ఇలా 44 సినిమాలకు పైగా నటించాడు. మెరుగులు దిద్దితేనే మెరుస్తారుపెళ్లికి ముందు జాబ్ చేసేదాన్ని. పిల్లలు పుట్టాక జాబ్ మానేశాను. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటి వద్ద నుంచే వర్క్ చేస్తున్నాను. మా వారిది బిజినెస్ రంగం. మేం ఉండేది హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో. ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తాం. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంకు వెళ్లిపోతాం. పాప, బాబు ఇద్దరూ రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తారు. తిరిగి వచ్చి, స్కూల్‌కు వెళ్లిపోతారు. సాయంత్రం ఇంటికొచ్చిన గంటసేపటికి స్టేడియంలో ఉంటారు. షూటింగ్స్ డేట్ వైజ్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి, దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకుంటాం. సినిమా షెడ్యూల్‌కి కుదరడం లేదు అనుకున్నప్పుడు ప్రాక్టీస్‌కు బ్రేక్ తీసుకుంటాం. చదువులో కూడా టాప్ టెన్‌లో ఉంటాడు. సరిగా లేకపోతే ఒక్కోసారి సీరియస్‌గా ఉండే సందర్భాలూ ఉంటాయి. 3–4 రోజులు లీవ్ పెట్టాల్సి వస్తే వాళ్ల క్లాస్మేట్స్ నలుగురైదుగురు పిల్లలు వచ్చి మా ఇంట్లో ఉంటారు. ధృవన్ మిస్ అయిన సబ్జెక్ట్‌లు వాళ్లు చెబుతారు. అందరూ కలిసి చదువుకుంటారు. ఊరి వాతావరణం మిస్ కాకూడదని..వారం రోజుల పాటు సెలవులు దొరికితే మాత్రం అమ్మనాన్నలు, అత్తయ్యవాళ్లతోనూ గడపడానికి వెళతాం. మాది వెస్ట్ గోదావరి భీమవరం దగ్గర నెలమూరు. అక్కడి ఊళ్లన్నీ తిప్పి, తీసుకువస్తాం. అక్కడి వాళ్లంతా ‘పుష్పరాజ్, పహిల్వాన్’ అని పిలుస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా బాగా యాక్ట్ చేసి, ఊరిలో పెద్ద పేరు తెచ్చుకుంటానని చెబుతుంటాడు.జంక్‌ఫుడ్‌కి నో..నేను పెళ్లికి ముందు న్యూట్రిషన్ కోర్స్ చేశాను. స్కిన్ స్పెషలిస్ట్ వద్ద మూడేళ్లు వర్క్ చేశాను. ఇప్పుడా వర్క్ నాకు బాగా ఉపయోగపడుతోంది. ఫుడ్ మీద అవగాహన ఉండటంతో ఆ విషయాలు పిల్లలకు చెబుతాను. జంక్ ఫుడ్ అడిగితే– హీరో అంటే ఎలా ఉండాలో, ఎలాంటి ఫుడ్ తింటే ఎలా అవుతారో చెబుతాను. బాబు చదివేది స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషన్ స్కూల్. ఆ స్కూల్లో జంక్‌ఫుడ్‌కి, నాన్‌వెజ్‌కి కూడా అనుమతి ఉండదు. ఇక స్పోర్ట్స్‌లో రెజ్లింగ్ కోచ్ చెప్పిన ఫుడ్‌కే ప్రయారిటీ. ప్రతి యేడాది మూడు నెలలు స్కూల్‌కి సెలవులు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలా అని ముందే ప్లాన్ చేస్తాం. పిల్లలిద్దరూ స్విమ్మింగ్, డ్యాన్స్, స్పోర్ట్స్, సైక్లింగ్, గిటార్ ప్లే చేస్తుంటారు. సెలవులు కదా లీజర్‌గా గడిపేయాలనుకోం. దీని వల్ల పిల్లలు అన్నింట్లోనూ తమని తాము నిరూపించుకోవడం, ప్రాక్టీస్ చేయడం, కొత్తవి నేర్చుకోవడం వల్ల ఎప్పుడూ చురుగ్గా ఉండటం జరుగుతుంది. - నిర్మలారెడ్డి -
ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే!ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.వాయిస్ క్లోనింగ్ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్ కూడా ఉంది. రియల్‌టైమ్‌లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్‌పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్ రోబో ధర సుమారు రూ. 4,500. -
ఆన్ చేస్తే టీవీ.. ఆఫ్ చేస్తే ఆర్ట్ గ్యాలరీ.. అద్భుతం!
కొన్ని గాడ్జెట్స్‌ను చూస్తే ఆశ్చర్యం, కొన్ని చూస్తే ఆనందం, మరికొన్ని చూస్తే వెంటనే కొనాలనిపిస్తుంది! అలాంటి స్టయిల్, సౌకర్యం, సాంకేతికత కలయికగా వచ్చిన ఈ గాడ్జెట్స్ మీకోసం..హాల్లో టీవీ పెట్టాలా? లేక ఖరీదైన పెయింటింగ్ తగిలించాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే రెండింటి పనీ చేసే ఈ ‘ఆర్ట్లై¯Œ టీవీ’ మీ కోసం! ఇది ఆన్ చే స్తే టీవీలా, ఆఫ్ చేస్తే గోడపై వేలాడే కళాఖండంలా పనిచేస్తుంది. మ్యాట్ 4కే క్యూఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ టీవీని చూడనప్పుడు ఇందులో అందుబాటులో ఉన్న రెండు వేలకుపైగా కళాఖండాలను ప్రదర్శించుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల చిత్రాల నుంచి ఆధునిక కళాఖండాల వరకు ఎన్నో ఎంపికలు ఉన్నాయి. అంతేకాదు, మీ గది అలంకరణకు సరిపోయే చిత్రాలను కృత్రిమ మేధస్సే సూచిస్తుంది. కుటుంబ ఫొటోలను కూడా ఇందులో ప్రదర్శించుకోవచ్చు. ‘లాస్ట్ ట్రిప్ ఫొటోలు చూపించు’ అని చెప్పగానే వాటిని తెరపై చూపించే సౌకర్యం కూడా ఉంది. గోడపై నిజమైన ఫొటో ఫ్రేమ్‌లా కనిపించే ఈ స్మార్ట్ టీవీ ధర సుమారు రూ. 77 వేల నుంచి ప్రారంభమవుతుంది.బ్యాగ్‌లో మడత కుర్చీ..!ఎక్కడికైనా వెళ్లినా కూర్చోవడానికి చోటు దొరకక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ మినీ ఫోల్డింగ్ క్యాంపింగ్ స్టూల్! చూడటానికి చిన్నగా ఉన్నా, అవసరమైనప్పుడు వెంటనే ఓ కుర్చీగా మారిపోతుంది.కేవలం కొన్ని సెకన్లలో దీనిని పూర్తిగా తెరిచి వాడుకోవచ్చు, పని అయిపోయాక మడిచి బ్యాగ్‌లో వేసుకోవచ్చు. బలమైన కార్బ¯Œ స్టీల్ ఫ్రేమ్, వాటర్‌ప్రూఫ్ ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్‌తో తయారైన ఈ స్టూల్ 150 కిలోల వరకు బరువు తట్టుకోగలదు. క్యాంపింగ్, ఫిషింగ్, పిక్నిక్లు, బీచ్ ట్రిప్స్, ట్రెక్కింగ్ లేదా గార్డెన్లో కూర్చోవడానికి ఇది బెస్ట్ ఆప్ష¯Œ . పైగా ప్రత్యేక క్యారీ బ్యాగ్ కూడా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ధర కేవలం రూ. 530 మాత్రమే! -
గర్విష్టి గజరాజు
అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక గజరాజు ఉండేది. దానికి తన బలమన్నా, భారీ శరీరమన్నా చాలా గర్వం. ‘ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.అదే అడవిలో చింటూ అనే ఒక తెలివైన చిన్న కుందేలు ఉండేది. అది చాలా మంచిది. అందరితోనూ స్నేహంగా ఉండేది.ఒకరోజు గజరాజు అడవిలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుండగా, దారిలో ఉన్న చింటూను గమనించకుండా దాని కాలిని తొక్కింది. పాపం! చింటూ నొప్పితో ‘అమ్మా!’ అని అరుస్తూ పక్కకు పడిపోయింది. గజరాజు అది చూసి కూడా కనీసం క్షమాపణ చెప్పలేదు. పైగా, ‘నువ్వు చాలా చిన్నదానివి, నా కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో’ అని ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. చింటూ బాధతో కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.కొన్ని రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. వారు గజరాజును పట్టుకోవడానికి ఒక బలమైన ఉచ్చు పన్నారు. గజరాజు అజాగ్రత్తగా వెళ్తూ ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటకు రాలేకపోయింది. ఆ వల విడిపోలేదు, సరిగదా ఇంకా బిగుసుకుపోయింది. దానితో సహాయం కోసం గజరాజు బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విన్న మిగిలిన జంతువులు ‘గర్విష్టి గజరాజుకు తగిన శాస్తి జరిగింది’ అని అనుకున్నాయే తప్ప రక్షించడానికి రాలేదు. కానీ చింటూ ఆ అరుపులు విని ఆగలేకపోయింది. వెంటనే గజరాజు ఉన్న చోటికి పరుగెత్తింది. వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న గజరాజును చూసి చింటూ మనసు కరిగింది.‘భయపడకు గజరాజా! నేను ఇప్పుడే వస్తాను’ అని చెప్పి ఊరడించింది. తరువాత చింటూ వేగంగా వెళ్లి తన స్నేహితులైన ఎలుకల సైన్యాన్ని తీసుకువచ్చింది.చింటూ ఆజ్ఞతో ఎలుకలన్నీ కలిసి తమ పదునైన పళ్ళతో ఆ బలమైన వల తాళ్లను కొరకడం మొదలుపెట్టాయి. చూస్తూ ఉండగానే వల ముక్కలైపోయింది. గజరాజు బంధవిముక్తురాలైంది! వల నుండి బయటకు వచ్చిన గజరాజు కళ్లలో నీళ్లు తిరిగాయి.అది మెల్లగా చింటూ దగ్గరకు వచ్చి, ‘చింటూ! నన్ను క్షమించు. నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నీలాంటి చిన్న ప్రాణియే. బలం శరీరంలో కాదు, చేసే సాయంలో ఉంటుందని తెలుసుకున్నాను’ అని వినయంగా చెప్పింది.చింటూ నవ్వుతూ, ‘అపకారికి కూడా ఉపకారం చేయాలన్నదే మా అమ్మ నేర్పిన పాఠం. ఇకపై మనమందరం స్నేహితులుగా ఉందాం’ అంది.ఆ రోజు నుండి గజరాజు తన గర్వాన్ని వదిలేసి, అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా మెలుగుతూ అందరికీ రక్షణగా నిలిచింది. ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.హితవచనం..అలముదకేన తృణైర్వా మనస్వినా ప్రాణధారణా కార్యానా సంస్కృతశ్చ పురుషః ప్రాకృతసత్త్వః ప్రణయతవ్యః- ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకులు అలములు తినిగాని, కేవలం మంచినీళ్లు తాగిగాని ప్రాణాలు నిలబెట్టుకుంటాడే తప్ప నీచులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడు. - అవ్యాన్ -
వైరస్ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్ ప్రయోగం..
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్‌లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును కనిపెట్టి, చిత్తు చేసే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది మాత్రం కేంబ్రిడ్జ్ నిపుణులు. తాజాగా వాళ్లు కనిపెట్టిన సూపర్ వ్యాక్సిన్... ఇకపై కరోనా అయినా, ఎబోలా అయినా, అవి ఎలాంటి రూపు మార్చుకుని వచ్చినా సరే, ఆ వేషధారులను ఊచకోత కోసేస్తుంది.‘ప్యాండమిక్–ప్రూఫ్’ వ్యాక్సిన్మున్ముందు రాబోయే మహమ్మారుల అంతానికి శాస్త్రవేత్తలు ఇప్పుడే పునాది వేశారు. మనకింకా తెలియని, అసలు పుట్టనే పుట్టని కరోనా రకాల వైరస్‌లను సైతం ముందే ఊహించి, వాటిని మట్టుపెట్టే వ్యాక్సిన్స్‌ను శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ సర్వరోగ నివారిణిలా సకల కరోనా జాతులకూ నిరోధకంగా పని చేస్తుందని కేంబ్రిడ్జి పరిశోధకులు జూన్ మొదటి వారంలో వెల్లడించారు.ఒక్కటిస్తే చాలు.. ఒక్కటీ రాదు!సాధారణంగా ఒక వైరస్ బయటపడిన తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ, భవిష్యత్తులో వైరస్లు ఎలా రూపాంతరం చెందుతాయో ముందే ఊహించి, వాటిని ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్‌ను డిజైన్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే చాలు... ఎబోలా వంటి వేలాది ప్రమాదకర వైరస్ రకాల నుండి, అలాగే భవిష్యత్తులో అవి మార్చుకునే ఏ కొత్త రూపం నుండి అయినా ఇది మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, వైరల్ జూనోటిక్స్అలాంటిలాంటిది కాదుప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్లు యాంటీజెన్ల ఆధారంగా పనిచేస్తాయి. యాంటీజెన్ అంటే మన శరీరంలోకి ఏదైనా హానికరమైన క్రిమి ప్రవేశిస్తే... ‘ఇది శత్రువు!’ అని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టేలా చేసే ఒక రకమైన సిగ్నల్. అయితే, యాంటీజెన్లు కేవలం అప్పటికే మనుషుల్లో బయటపడిన నిర్దిష్ట వైరస్ రకాలపైన మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సరికొత్త వ్యాక్సిన్‌లో పరిశోధకులు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకే జాతికి చెందిన మొత్తం వైరస్ కుటుంబాలన్నిటిలోనూ ‘కామన్‌గా’ ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలను సేకరించి, వాటన్నిటినీ నిరోధించే గుణాలను కలిపి కొత్త వ్యాక్సిన్‌లో పొందుపరిచారు.‘‘వైరస్ దాడి మొదలవ్వడానికి ముందే... ఈ సరికొత్త రకం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగలిగితే, భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. లాక్డౌన్ల అవసరమే రాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలకుండా నిలబడతాయి’’ అని ఈ ప్రాజెక్టు చీఫ్, సౌతాంప్టన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సాల్ ఫాస్ట్ అంటున్నారు.సార్స్, కోవిడ్, ఎబోలా.. ఏదైనా!ఈ కొత్త వ్యాక్సిన్ కేవలం కరోనా పైనే కాదు... గతంలో వణికించిన సార్స్, మొన్నటి వరకు ఉన్న కోవిడ్, ఇప్పుడున్న ఎబోలా, అలాగే భవిష్యత్తులో జంతువులు, గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న వైరస్లన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరల్ జూనోటిక్స్ (జంతువుల నుండి మనుషులకు వచ్చే వైరస్‌లపై పరిశోధన చేసే విభాగం) ప్రొఫెసర్ జొనాథన్ హీనీ మాట్లాడుతూ... ఈ సరికొత్త టెక్నాలజీ వైద్య రంగపు రూపురేఖల్నే మార్చే ఒక పెద్ద ‘గేమ్ చేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ టెక్నాలజీ వల్ల వ్యాక్సిన్లు మరింత శక్తిమంతంగా, విస్తృతంగా మారి, వైరస్ల నుండి మనకు అత్యంత బలమైన రక్షణను అందిస్తాయి’’ అని ఆయన నమ్ముతున్నారు.సూపర్ యాంటీజెన్: రోగ నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఆయుధంఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌కు ‘సూపర్–యాంటీజెన్’ అని పేరు పెట్టారు. ఏఐలో ఒక భాగమైన మెషిన్ లెర్నింగ్ ద్వారా దీనిని తయారు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారులను, ఇప్పుడున్న వైరస్‌లను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి... ఒక వైరస్ బ్రతికి బట్టకట్టాలంటే దానికి అత్యంత ముఖ్యమైన భాగాలు ఏంటో కనిపెట్టింది. సరిగ్గా అవే భాగాలపై ఈ సూపర్ యాంటీజెన్‌ను ఎక్కుపెట్టారు.వేర్వేరు వైరస్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రొటీన్లను ఒకదానితో ఒకటి అతుకుపెట్టి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థకు ఆ ప్రొటీన్లపై దాడి చేయడం నేర్పుతుంది. భవిష్యత్తులో ఆ ప్రొటీన్ ఉన్న ఏ కొత్త వైరస్ మన శరీరంలోకి వచ్చినా... మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తుపట్టి అక్కడికక్కడే నిర్మూలిస్తుంది.సూది లేని ఇంజెక్షన్!సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్‌ను మన శరీరంలోకి పంపే విధానం కూడా చాలా సరళంగా, సరికొత్తగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సూదీ ఉండదు! బదులుగా ‘మైక్రో ఫ్లూయిడ్ జెట్’ అనే పద్ధతిని పాటిస్తారు. ఇది చాలా ఎక్కువ ఒత్తిడితో, ఒక సన్నని ద్రవ రూపంలో వ్యాక్సిన్‌ను నేరుగా మన చర్మ కణాల్లోకి పంపుతుంది. అంటే సూది గుచ్చుకునే నొప్పి అస్సలు ఉండదు!మైక్రో ఫ్లూయిడ్ జెట్వెనుక పరిగెత్తడం ఆపేద్దాం!కాంగోలో మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న విషయాన్ని గురు ్తచేస్తూ: ‘‘కోవిడ్ మహమ్మారి మనకు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయడం నేర్పించింది నిజమే కానీ, మనం ఇంకా పాత విధానాన్నే అనుసరిస్తున్నాం. వైరస్ కొత్తగా పుట్టడం, అది మనల్ని భయపెట్టడం, ఆ తర్వాత మనం దాని వెనుక పరిగెత్తి వ్యాక్సిన్ కనిపెట్టడం... ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ హీనీ అంటున్నారు.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ జెనెటిక్ కోడ్ మొత్తాన్ని ఈ ఏఐకి ఇస్తాం. అది వాటన్నిటినీ పరిశీలించి, ఆ వైరస్ కుటుంబంలో అస్సలు మారకుండా ఉండే భాగం ఏంటో కనిపెడుతుంది. వైరస్ తన రూపాన్ని ఎంత మార్చుకున్నా ఆ ముఖ్య భాగాన్ని మార్చుకోలేదు. మనం సరిగ్గా దాన్నే టార్గెట్ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఉన్న వైరస్ల నుండే కాదు... భవిష్యత్తులో పుట్టబోయే సరికొత్త వైరస్ల నుండి కూడా మనం ముందే రక్షణ పొందవచ్చు!’’ అని హీనీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారిన బర్డ్ ఫ్లూ వైరస్‌ను కూడా అంతమొందించేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం ఇదే టెక్నాలజీతో మరో సరికొత్త వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడింది.వైరస్ల కంటే ఒకడుగు ముందేఇతర సైన్స్ నిపుణులు కూడా ఈ వాక్సిన్ను ఒక అద్భుతమైన ‘సరికొత్త విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత వైద్య విధానం అంతా ‘రియాక్టివ్’ (కంటì æముందుకు ప్రమాదం వచ్చాక స్పందించేది)గా ఉంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే, దాన్ని పట్టుకోవడానికి మన వ్యాక్సిన్లు వెనుకబడిపోతున్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ.. వైరస్ కంటే ఒకడుగు ముందే ఉంటుంది!రెండో దశ ప్రయోగాలుసిద్ధంగా మరో 200 మందిట్రయల్స్ ఎక్కడివరకు వచ్చాయి? మొదటి దశ విజయవంతం అయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీతో చేసిన వ్యాక్సిన్‌ను 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న 49 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రయోగించి, ఇది పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారించుకున్నారు. అంతకుముందు జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇది రకరకాల కరోనా వైరస్‌లపై ప్రభావంతంగా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రెండవ దశ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తదుపరి పరీక్షల కోసం మరో 200 మందికి పైగా వ్యక్తులను సంసిద్ధం చేస్తున్నారు.అత్యంత బలమైన రక్షణఏఐ సహాయంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ల గురించి బ్రిటన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేరియన్ నైట్ అత్యంత ఆశాజనకంగా మాట్లాడారు. ‘‘ఏఐ డిజైన్ చేసిన ఈ ‘సూపర్–యాంటిజెన్’ క్లినికల్ ట్రయల్స్ సాధించిన అద్భుత విజయం. వైద్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు. భవిష్యత్తులో వైరస్ల నుండి మానవాళికి సుదీర్ఘమైన, అత్యంత బలమైన రక్షణను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు. మొత్తానికి, ఈ ‘సూపర్–యాంటీజెన్’ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే... భవిష్యత్తులో మనం ఎలాంటి వైరస్ మహమ్మారికీ భయపడాల్సిన అవసరం ఉండదు. శాస్త్ర విజ్ఞాన రంగం సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది కూడా! - సాక్షి స్పెషల్ డెస్క్ -
కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!
‘ఒకరు ముద్దు... ఇద్దరు హద్దు... ముగ్గురు అసలే వద్దు...’ కుటుంబ నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వాలు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు జనాభా విషయంలో ప్రభుత్వాల వైఖరి మారినా, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు పెద్దలు. అది పిల్లలకైనా, పెంపుడు జంతువులకైనా వర్తిస్తుంది. ఏదైనా పరిమితంగా ఉంటేనే మేలు. లేదంటే అనేక చిక్కులు... ఒక్కోసారి కోర్టు కేసులు ఎదుర్కొవాల్సి రావచ్చు.కోయంబత్తూరులోని ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడి ఇంట్లోని కుక్కల వల్ల తమకు ఇబ్బందవుతోందని, దుర్వాసన వస్తోందని కాలనీ వాసులు అధికారికి ఫిర్యాదు చేశారు. చివరకు సమస్య హైకోర్టుకు చేరింది.ఇంట్లో కుక్కలు పెంచుకోవడం సర్వసాధారణం. అయితే ఒకటో రెండో కుక్కలు ఉంటే ప్రేమ; ఐదారు ఉంటే అభిరుచి. ఏకంగా రెండు డజన్లకు పైగా ఉంటే; అవి ఒకేసారి అరుస్తుంటే; వాటి దుర్వాసస చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపిస్తుంటే; కాలనీ వాసులకు వాటి అరుపులతో పగలు ప్రశాంతత, రాత్రి పూట నిద్ర కరువైతే... ఏమౌతుంది. చుట్టుపక్కల వారికి చిరాకొస్తుంది. కోపం తెస్తుంది. ఇక్కడా అదే జరిగింది. చిర్రెత్తుకొచ్చి వారంతా అధికారికి ఫిర్యాదు చేశారు. మొదట ఇది సాధారణ ఫిర్యాదులా కనిపించినా, మన ఇల్లు... మన ఇంట్లో కార్యకలాపాలకు ఉన్న పరిమితి ఏంటి? ‘నాఇల్లు– నా కుక్కలు– నా ఇష్టం’ అనే వాదన చెల్లుతుందా? వ్యక్తిగత అభిరుచి, స్వేచ్ఛ ముఖ్యమా? పొరుగువారి ప్రశాంత జీవనం, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలా? వంటి కీలకాంశాలను కోర్టు చర్చించింది. చట్టంలో పేర్కొన్న పలు అంశాలు సందర్భానుసారం ఎలా వర్తిస్తాయో వివరిస్తూ ఆసక్తికర తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాలుకోయంబత్తూరులోని సర్క్యూట్ హౌస్రోడ్డులో విక్రమ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను వివిధ జాతులకు చెందిన 30 కుక్కలను పెంచుతున్నాడు. ముఖ్యంగా రాత్రి పూట అవి మొరగడంతో ప్రశాంతత కరువై, నిద్ర పట్టడం లేదని, దుర్వాసన వల్ల పరసర ప్రాంతాల్లో అనారోగ్యకర వాతావరణం నెలకొందని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌కు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. వాటిని వ్యాపార అవసరాల కోసమే పెంచుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు..న్యాయస్థానాన్ని ఆశ్రయించిన యజమానిదీనిపై ఆ అధికారి విచారణ చేపట్టారు. పోలీసు/రెవెన్యూ/మునిసిపల్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. మునిసిపాల్టీ నిబంధనల ప్రకారం వాటి పెంపకానికి లైసెన్స్ లేదని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. కుక్కలను ఆ ఇంటి నుంచి తరలించాలని ఆదేశించారు. ఆ అధికారి సీఆర్పీసీ సెక్షన్ 133 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని విక్రమ్ హైకోర్టును ఆశ్రయించాడు. పాత కక్షల వల్లే పొరుగువారు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నాడు. ‘నా ఇంట్లో నా ఇష్ట ప్రకారం కుక్కలను పెంచుకుంటున్నాను’ అన్నాడు. తన వద్ద పది లోపే కుక్కలు ఉన్నాయని వెల్లడించాడు.హైకోర్టులో విచారణకాలనీ వాసులు చేసిన ఫిర్యాదు.. అధికారి ఆదేశాలు.. పిటిషనర్ పేర్కొన్న అంశాలను హైకోర్టు పరిశీలించింది. కేవలం కుక్కల సంఖ్య ఒక్కటే సమస్య కాదు. పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకోవడమూ తప్పు కాదు. కానీ, ఇతరులకు ఇబ్బంది కల్గించే స్థాయిలో వాటిని ఉంచడం వ్యక్తిగత హక్కుగా చెప్పలేమని పేర్కొంది. నివాస ప్రాంతాల్లో ప్రజల ప్రశాంత జీవనాన్ని కూడా రక్షించాల్సిన అంశమేనని కోర్టు వ్యాఖ్యానించింది. మీ ఇంట్లో మీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ ఉంటుంది. కానీ పక్కింటి వారి హక్కులకు భంగం కలిగించేలా అది ఉండకూడదని పేర్కొంది. ఆర్టికల్ 21కు విఘాతం కలిగించకూడదని చెప్పింది. ప్రజల హక్కులకు భంగం వాటిల్లినా, ఇబ్బంది కలిగించినా అటువంటి సందర్భాల్లో సంబంధిత అధికారి సీఆర్పీసీ సెక్షన్ 133 కింద ముందుగా చర్యలు తీసుకునే అధికారం ఉందని పేర్కొంది. ‘రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదు. చట్టపరమైన ఎటువంటి లోపమూ లేదు. వాటిని యథాతథంగా అమలు చేయవచ్చు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. రివిజన్ పిటిషన్‌తో పాటు ఇతర అనుబంధ పిటిషన్లను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.కుక్కలు మొరుగుతున్నాయి. నిద్రకు భంగం కలుగుతోందనే చిన్న కేసుగా ఇది మొదట కనిపిస్తోంది. ఎవరి ఇంట్లో వారు ఇష్టానుసారం జీవించే హక్కు ఉంటుంది. కానీ దానికి పరిమితులు ఉంటాయి. ఇతరుల ప్రశాంత జీవనానికి అది భంగం కలిగించనంత వరకే ఆ స్వేచ్ఛ అనేది ఈ కేసులో ప్రధానాంశం. కుక్కలు లేదా ఇతర జంతువుల పెంపకాన్నీ ఈ తీర్పు తప్పుపట్టడం లేదు. ఎన్ని జంతువులు ఉండాలనే సంఖ్యనూ నిర్ణయించలేదు. ప్రజా ప్రయోజనం, ఇతరుల జీవనంపై ప్రభావం, పబ్లిక్ న్యూసెన్స్ వంటి అంశాలనే కీలకంగా పరిగణించింది. సాధారణ అంశంగా కేసు మొదలై సామాజిక సందేశంతో ముగిసింది. - దిలీప్ మాదిరెడ్డి -
అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం
బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతనుడికి అసితుడు అనే కొడుకు ఉన్నాడు. అసితుడు బ్రహ్మచర్యాశ్రమంలో సకల విద్యలను అభ్యసించి, తపోవృత్తి కొనసాగించాడు. కొంతకాలానికి అసితుడు వివాహం చేసుకున్నాడు. ఎన్నేళ్లయినా సంతానం కలగకపోవడంతో పరమశివుడి గురించి తపస్సు చేశాడు.పరమశివుడు అతడికి ప్రత్యక్షమై రాధామంత్రాన్ని ఉపదేశించాడు. రాధామంత్ర ప్రభావంతో అసితుడి భార్య గర్భం దాల్చింది. నెలలు నిండాక పండంటి కొడుకు పుట్టాడు. అతడికి దేవలుడు అనే పేరు పెట్టారు. దేవలుడు యుక్తవయస్కుడయ్యాక మాలావతిని పెళ్లాడి, సంతానం పొందాడు. చివరకు విరక్తుడై, ఘోర తపస్సు ప్రారంభించాడు.దేవలుడి తపో తీవ్రతకు దేవేంద్రుడు భయపడ్డాడు. అతడి తపస్సును ఎలాగైనా భంగపరచాలనుకున్నాడు. రంభను పిలిచి, ‘నువ్వు ఎలాగైనా దేవలుడి తపస్సును భంగపరచాలి’ అని ఆదేశించాడు.ఇంద్రుడి ఆజ్ఞ మేరకు రంభ భూలోకానికి దిగివచ్చింది. దేవలుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, అతడి తపోభంగం కోసం తన గాన, నాట్య కౌశలాలను అలుపెరగకుండా ప్రదర్శించింది. తపస్సమాధిలో ఉన్న అతడికి సపర్యలు చేయడం ప్రారంభించింది. అయినా దేవలుడు కన్నుతెరిచి ఆమెను చూడనైనా చూడలేదు. తన శాయశక్తులా ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిపోయిన రంభ ‘దేవలా! నువ్వు నన్ను అష్టకష్టాలపాలు చేశావు. మరుజన్మలో నువ్వు అష్టావక్రుడిగా జన్మిస్తావు’ అని శపించింది. రంభ అంత దారుణంగా శపించినా, దేవలుడు తన తపస్సమాధిలోనే నిశ్చలంగా ఉన్నాడు. దేవలుడి స్థితి చూసి రంభ పశ్చాత్తాపం చెందింది. ‘నిన్ను అనవసరంగా శపించాను. నువ్వు అష్టావక్రుడిగా జన్మించినా, నీ తండ్రి కృప వల్ల దివ్యశరీరుడివి కాగలవు.’ అని పలికింది.∙∙ ఏకపాదుడు తన ఆశ్రమంలో శిష్యులకు వేదం బోధించేవాడు. ఏకపాదుడి శిక్షణ కఠినంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిష్యుల చేత వేదం వల్లె వేయించేవాడు. సుజాత గర్భంలో ఉన్న దేవలుడు ‘గర్భంలో ఉన్న నాకే రోజూ వింటున్న వేదం కంఠోపాఠమైంది. నీ శిష్యులు రోజూ వల్లె వేస్తూనే ఉన్నారు. వారినెందుకు ఉభయ సంధ్యల్లోనూ వేదం వల్లె వేయమంటూ అంతలా హింసిస్తావు? ’ అని తండ్రిని ప్రశ్నించాడు.ఏకపాదుడు సహించలేకపోయాడు. ‘తండ్రినైన నా శిక్షణ విధానాన్ని వక్రంగా హేళన చేస్తావా? నువ్వు అష్టవంకరలతో జన్మిస్తావు’ అని శపించాడు. ప్రసవ సమయం దగ్గరపడుతున్న రోజుల్లో సుజాత ఒకనాడు ఇంటికి కావలసిన సంభారాలను తెమ్మని భర్త ఏకపాదుడిని కోరింది. అతడు ధనం కోసం జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. ‘వరుణ కుమారుడైన వందితో వాదంలో నెగ్గినట్లయితే, కోరినదంతా ఇస్తాను. వాదంలో ఓడిపోతే జలమజ్జితుడవై ఉండాలి’ అన్నాడు.ఏకపాదుడు సరేనని వందితో వాదానికి తలపడ్డాడు. వాదంలో ఓడిపోయి, జలమజ్జితుడై, నిర్బంధంలో చిక్కుకుపోయాడు. కొన్నాళ్లకు సుజాత మగబిడ్డను ప్రసవించింది. తండ్రి శాపఫలితంగా అతడు ఎనిమిది వంకరలతో జన్మించి, అష్టావక్రుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అదే సమయంలో సుజాత తల్లి, ఉద్దాలకుడి భార్య ఒక కొడుకును కన్నది. అతడు శ్వేతకేతుడు. ఉద్దాలకుడి వద్ద శ్వేతకేతుడితో పాటు అష్టావక్రుడు కూడా పెరిగాడు. ఏకసంథాగ్రాహులైన ఇద్దరూ అనతికాలంలోనే విద్యాపారంగతులయ్యారు.ఒకనాడు తల్లి ద్వారా తన తండ్రి పరిస్థితి తెలుసుకున్న అష్టావక్రుడు– శ్వేతకేతుడితో కలసి జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. బాలకులైన వారిద్దరినీ ద్వారపాలకులు అడ్డుకున్నారు. ‘జ్ఞానం ఉన్నవాడు బాలుడైనా వృద్ధుడితో సమానం. వయసు మళ్లినవాడు కాదు’ అని అష్టావక్రుడు వారితో వాదించాడు. ద్వారపాలకులు వారిని లోపలకు వెళ్లనిచ్చారు. జనకుడి అనుమతి పొంది, వందితో వాదానికి దిగాడు అష్టావక్రుడు. సుదీర్ఘంగా సాగిన వాదంలో వంది ఓడిపోయాడు. జనక మహారాజు అష్టావక్రుడిని అభినందించి, ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు.‘మహారాజా! వందితో వాదంలో ఓటమి చెందిన నా తండ్రి జలమజ్జితుడై ఉన్నాడు. అతడిని విడిచిపెట్టు’ అని కోరాడు. జనకుడు జలమజ్జితుడైన ఏకపాదుడిని బయటకు రప్పించాడు. అష్టావక్రుడిని, ఏకపాదుడిని పూజించి, వారి వద్ద అద్వైత రహస్యాలను తెలుసుకున్నాడు. కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి, వారిని సాదరంగా సాగనంపాడు.అష్టావక్రుడి పితృభక్తికి సంతుష్టుడైన ఏకపాదుడు, ‘కుమారా! నీ అంగవైకల్యానికి కారకుడను నేనే. నీ పితృభక్తికి సంతోషించాను. నువ్వు వెంటనే వెళ్లి సమంగ నదిలో స్నానం చేసి రా’ అని ఆదేశించాడు. అష్టావక్రుడు సమంగ నదిలో ముమ్మారు మునిగి స్నానం చేశాడు. అతడి శరీరంలోని వంకరలన్నీ పోయి, సుందరాకారం వచ్చింది. తండ్రి తపోమహిమకు అష్టావక్రుడు చకితుడయ్యాడు. ఇంటికి చేరుకున్నాక తల్లిదండ్రులను పూజిస్తూ, ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ వచ్చాడు. - సాంఖ్యాయనపురావిశేషం..మధ్యప్రదేశ్‌లోని సిహోనియా పట్టణంలో ఉన్న ఈ పురాతన శివాలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. కచ్ఛపఘట వంశానికి చెందిన కీర్తిరాజ హయాంలో క్రీస్తుశకం 1015–1035 నడుమ ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అంచనా. ఇదివరకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు సూరజ్‌పాల్ భార్య రాణి కకనావతి పేరుమీద దీనికి ‘కకన్ మఠ్’ అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ ఆలయాన్ని పరమశివుని భూతగణాలు రాత్రికి రాత్రే నిర్మించినట్లు స్థలపురాణ గాథ ప్రచారంలో ఉంది. -
క్యారవాన్‌లో హత్య...
నగర శివారులో భారీ సెట్. టాలీవుడ్ టాప్ హీరో అవినాష్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్‌లో అవినాష్ తన క్యారవా¯Œ లోకి వెళ్లాడు. అవినాష్‌కు అమ్మాయిల పిచ్చి. అందుకే తన ప్రైవసీ కోసం, క్యారవాన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల కనెక్షన్లను ముందే కట్ చేయించాడు.కొద్దిసేపటికే బురఖా ధరించిన ఒక అమ్మాయి క్యారవా¯Œ లోకి వెళ్లడం కొందరు గమనించారు. కాని, గంట దాటినా లోపలి నుండి ఎటువంటి శబ్దం లేదు. ప్రొడక్షన్ బాయ్ కాఫీ తీసుకుని వెళ్లి డోర్ కొట్టినా సమాధానం రాలేదు. అనుమానంతో తలుపు నెట్టి చూశాడు. క్యారవాన్‌లో అవినాష్ రక్తం మడుగులో పడి ఉన్నాడు.సమాచారం అందిన వెంటనే, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు తన టీమ్‌తో స్పాట్‌కు చేరుకున్నాడు. శవాన్ని పరీక్షించిన డాక్టర్ పాయిజన్ ఇంజెక్ట్ చేసిన కారణంగా హీరో అవినాష్ మరణించినట్టు చెప్పాడు.ఇన్స్పెక్టర్ అభిమన్యు క్లూస్ టీమ్‌తో దర్యాప్తు ప్రారంభించాడు. క్యారవాన్ వైపు ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. లొకేషన్ వెలుపల ఉన్న కెమెరాలను పరిశీలిస్తే, బురఖా వేసుకున్న అమ్మాయి అటువైపు వచ్చిన విజువల్స్ ఉన్నాయి. ఇంజక్షన్‌ను బలంగా చేసినట్టు నీడిల్ మొన శరీరంలో దిగబడిన తీరును బట్టి తెలుస్తుంది. అది కచ్చితంగా ఒక లెఫ్ట్ హ్యాండర్ చేసిన హత్య అని అభిమన్యు గుర్తించాడు.క్యారవాన్ నుంచి కిందికి దిగుతుంటే అతని దృష్టి ఒకవైపు పడింది. చుట్టూ చూసి చేతులకు గ్లవుజ్ ధరించి ఆ వస్తువును ఎవిడె¯Œ ్స కవర్లో వేసుకున్నాడు.యూనిట్లో ఉన్న ప్రొడ్యూసర్ ను పిలిపించాడు. డైరెక్టర్ వచ్చాడు. హీరోయిన్ను విచారించాడు.సినిమా యూనిట్లో ఎడమచేతి వాటం ఉన్నవారి లిస్ట్ తీశాడు. అందులో ఆ సినిమాలో విల¯Œ గా నటిస్తున్న అభిజిత్ పేరు ఉంది. వెంటనే అభిమన్యు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ను సోదా చేశాడు. అక్కడ ఒక పెట్టెలో దాచిన బురఖా దొరికింది. సినిమాలో విలన్ అభిజిత్ పోషిస్తున్న పాత్ర ఏమిటి? డైరెక్టర్ని అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘డాక్టర్ పాత్ర... హీరోని పాయిజన్ ఇంజక్షన్‌తో హత్య చేయాలని ప్రయత్నిస్తాడు...’ డైరెక్టర్ చెప్పాడు.‘విలన్ అభిజిత్ కాస్టూమ్స్, షాట్లో వాడే డిస్పోజబుల్ సిరంజి ఎక్కడ?’ అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ పట్టుకుని వచ్చాడు. ఒక్క డిస్పోజబుల్ సిరంజ్ తప్ప...‘ఇదొక్కటి మిస్సయ్యింది సర్...’ అనుమానంగా, భయంగా చెప్పాడు డైరెక్టర్..అభిమన్యు చిన్నగా నవ్వి, ‘నో ప్రాబ్లెమ్... మీ దగ్గర మిస్సయ్యింది నా దగ్గర ఉంది.’ అంటూ తన కోటు జేబులో ఉన్న ఎవిడె¯Œ ్స కవర్లో ఉన్న డిస్పోజబుల్ సిరంజ్ చూపించి, ‘థాంక్యూ... దట్స్ ఇట్’ అని లేచాడు. ఇంటరాగేషన్ సెల్...‘వెల్ మిస్టర్ అభిజిత్! సినిమాలో నీ పాత్రకు నువ్వు ప్రాణం పోశావు. సినిమాలో నువ్వు చేసే షాట్ రిహార్సల్ చేశావు. ఆ రిహార్సల్ షాట్‌ను నువ్వే ఓకే చేసి, హీరోను చంపి నువ్వు హీరో అవ్వాలనుకున్నావు కదూ! అసలు ఎందుకు ఈ హత్య చేశావు? ప్రొఫెషనల్ జెలసీనా?’ కావాలనే అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘అతను హీరో, నేను విలన్ ఇందులో ప్రొఫెషనల్ జెలసీ లేదు. పర్సనల్ పగ మాత్రమే వుంది.’ కొనసాగించాడు అభిజిత్. ‘అవినాష్ లాంటి విలన్లు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బతికి ఉండడానికి వీల్లేదు. ప్రేక్షకులలో ఉన్న గ్లామర్‌ను అభిమానాన్ని ఇలా మిస్యూజ్ చేస్తూ , అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసే వాళ్లకు బ్రతికే హక్కు లేదు...నా చెల్లెలు అవినాష్‌కు పెద్ద అభిమాని. అవినాష్‌ను కలవడానికి వచ్చినప్పుడు, నా చెల్లెలిని లొంగదీసుకుని వాడుకుని వదిలేశాడు. ఆ డిప్రెష¯Œ తో ఆమె ఆత్మహత్య చేసుకుంది. నా చెల్లెలి చావుకు కారణమైన అవినాష్‌పై పగ తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేశాను. అవినాష్‌కు ఉన్న అమ్మాయిల బలహీనతను ఆసరాగా చేసుకుని, నేనే బురఖా వేసుకుని అమ్మాయిలా క్యారవా¯Œ లోకి వెళ్లాను. వాడిని చంపడానికి సినిమాలో నా పాత్ర కలిసి వచ్చింది. షూటింగ్లో వాడే డిస్పోజబుల్ సిరంజిలో పాయిజన్ నింపాను. ఒకే ఒక్క చిన్న పోటు. సిరంజిలోని విషం నా చెల్లెలి చావుకు ప్రతీకారం తీర్చుకుంది.’‘ఆ తర్వాత ఆ బురఖా తీసి మామూలుగా బయటకు వచ్చావు. ఎవ్వరి కంట పడకుండా. ఆ బురఖాను కాస్ట్యూమ్ రూమ్‌లో దాచేసి ఏమీ తెలియనట్టు షూటింగ్లో పాల్గొన్నావు. ఆ సిరంజిని నిర్లక్ష్యంగా ఓ మూలకు పడేశావు. అదే నిన్ను పట్టించింది. ‘సినిమాలో హీరో అయినా అవినాష్ నిజ జీవితంలో విలన్లా ప్రవర్తించాడు. అందుకే నువ్వు హీరోలా సినిమాటిక్ గా పగ తీర్చుకోవాలనుకున్నావు. సినిమాల్లో ఈ ముగింపు బాగుంటుంది. కాని, చట్టం దృష్టిలో మాత్రం నేరమే అవుతుంది. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది చట్టం, నువ్వు కాదు.’ చెప్పాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయిక్రైమ్ కథలకు ఆహ్వానం..ఉత్సాహవంతులైన రచయితల నుంచి క్రైమ్కథలను ఆహ్వానిస్తున్నాం. ఉత్కంఠ తగ్గకుండా పాఠకులతో చదివించే సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఈ శీర్షిక కోసం పంపండి. కథల నిడివి 450 పదాలకు మించరాదు. కథతో తప్పనిసరిగా హామీపత్రం ఉండాలి. కథలను తెలుగు యూనికోడ్లో టైప్ చేసి ఈ దిగువనున్న ఈ–మెయిల్‌కు పంపాలి. funday.kathalu@gmail.com -
‘‘త్రిపుర రాయని కథ’’
‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ. నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు. నాకు ఇటువంటి హిపోక్రసీ ఉండదు’’ కంప్యూటర్ స్క్రీన్ మీద ఫ్లాష్ అయిన వాక్యాలు రచయిత రఘుపతికి కోపం తెప్పించాయి. ఈ వాక్యాల వెనుక ఓ కథ ఉంది. అవును, నిజంగానే ఓ కథ ఉంది.∙∙∙‘‘కథ ముగించడం ఇంత కష్టమా. ఇన్ని సంవత్సరాలుగా వందల కథలతో ఎప్పుడూ ఇబ్బంది పడలేదే’’ తనలో తను గొణుక్కుంటూ రఘుపతి సిస్టం మీద నుంచి విసుగ్గా లేచాడు. గదిలో తోచని పచార్లు చేశాడు. సిగరెట్ సగమైనా కాలకుండానే కోపంగా విసిరి కొట్టాడు. రఘుపతిని ఇంత ఇబ్బంది పెడుతున్నది అతను రాస్తున్న కొత్త కథ ముగింపు. రఘుపతి పాపులర్ రచయిత. పాఠక సామాన్యం అతని కథలను ఎగబడి చదువుతారు. ఒక సుదీర్ఘ సాహిత్య ప్రయాణం తరువాత కూడా సీరియస్ సాహిత్య లోకం తనను గుర్తించకపోవడం ఒక లోటుగా భావించాడు. అందుకే ఒక గొప్ప కథ రాయాలనుకున్నాడు. తను కూడా సీరియస్ రచయితే అని రుజువు చేసే గొప్ప కథ రాయాలనుకున్నాడు. అయితే గొప్ప కథ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం రఘుపతికీ తెలియదు. ఇదిగో అదే ఆ కొత్త కథ. తను గొప్పది అనుకుంటున్న కథ. ముగింపు ఇంకా దొరకని కథ. ఎన్ని ముగింపులు రాసుకున్నా అవి తనకే నచ్చని కథ. అందుకే అసహనం. ‘‘ఏంటండీ అంత చిరాగ్గా ఉన్నారు’’ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ రఘుపతి భార్య కల్యాణి అడిగింది. సాధారణంగా తన రచనల గురించి కల్యాణే కాదు ఎవరితోనూ చర్చించడం కానీ, వాళ్ల సలహాలు తీసుకోవడం కానీ రఘుపతికి ఇష్టం ఉండదు. ‘‘కొత్త కథకు ముగింపు కుదరడం లేదు కల్యాణీ’’ అన్నాడు. కల్యాణికి షాక్. కథ గురించి ఈయన నాతో ప్రస్తావించడమేమిటి? అని ఉబ్బితబ్బిబ్బయి ‘‘అంత ఇబ్బందేముంది ఏఐని అడగండి’’ అని వెళ్లిపోయింది. ఇంకా ఉంటే ఇంకేం ప్రమాదం వచ్చి పడుతుందోనని భయపడుతూ.ఈసారి షాక్‌కు గురికావడం రఘుపతి వంతైంది. కల్యాణి ఏంటి ఇంత అలవోకగా పరిష్కారం చెప్పింది. ఇలా కూడా ఉంటుందా. అయినా నా కథకు ఏఐ ఎలా ముగింపునిస్తుంది. నేను ఊహించిన పదికి పైగా ముగింపులు నాకే నచ్చలేదే, అంతకంటే మంచి ముగింపు ఏఐకి ఎలా తడుతుంది. అసాధ్యం కదా. అయినా కథ విషయంలో ఏఐ నా కంటే గొప్పదా. రఘుపతి లోపల ఒక బలమైన సంఘర్షణను సృష్టించింది కల్యాణి సలహా.మెల్లగా కంప్యూటర్ వైపు కదిలాడు. ఎప్పుడూ కాఫీ అపురూపంగా తాగేవాడు ఆ కాఫీ చల్లారిపోతోందన్న సంగతి కూడా పట్టించుకోలేదు. తన కథ ముగింపు ఏఐని అడగడం అనే ఆలోచనే అతనికి నచ్చడం లేదు. అడగాలో లేదో నిర్ణయించుకోలేక పోతున్నాడు. సందిగ్ధం, సంశయం. వేళ్లు తడబడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. అయినా ఏఐ మోడ్‌లోకి వెళ్లి అసంపూర్ణ కథ ప్రాంప్ట్‌గా ఇచ్చి ముగింపు అడిగాడు. నాలుగంటే నాలుగే సెకన్లు.రఘుపతి మొహం మాడిపోయింది. అవాక్కనే మాటకు అసలైన అర్థంలా మారింది ఆ మొహం. నోట మాట రాలేదు. నాలుగే సెకన్లలో ఏఐ తన సమాధానంగా కథకు ముగింపును చెప్పింది. నాలుగు సెకన్లలో చెప్పినందుకు కాదు రఘుపతి అవాక్కయింది. ఆ ముగింపు తను ఊహించనిదీ తను గత పదిరోజులుగా తర్జన భర్జన పడుతూ ఇచ్చుకున్న ముగింపులకంటే భిన్నమైనదీ అన్నింటి కంటే ముఖ్యంగా తను ఎటువంటి ముగింపు కోసం ఇన్ని రోజులుగా తన్నుకుంటున్నాడో అక్షరాలా అలాంటి ముగింపే అది.నిజం చెప్పాలంటే రఘుపతి ఈగో హర్టయింది. నేను ఊహించలేని ముగింపును ఒక నిర్జీవ కంప్యూటర్ ఎలా ఇవ్వగలిగింది. అసలు కంప్యూటర్ ఆలోచించడమేమిటి నాన్సెన్స్. నా కంటే ఏఐ ఎలా గొప్పదిలాంటి ప్రశ్నలు రఘుపతి మెదడులో జోరీగలయాయి. కాఫీ చల్లారిపోయిందన్న విషయం కూడా మరిచిపోయి గటగటా తాగేశాడు. కథకు మంచి ముగింపు దొరికిన ఆనందం కన్నా ఏఐ ఇవ్వగలిగిన ముగింపును తను ఎందుకు ఇవ్వలేకపోయానన్న బాధే రఘుపతిని వేధిస్తోంది. ఏఐతో అమీ తుమీ తేల్చుకోవాలనుకున్నాడు. ‘‘నేను గొప్పా నువ్వు గొప్పా’’ ఏఐని అడిగేశాడు.‘‘నిస్సందేహంగా నువ్వే’’ గాయానికి మలాం పూస్తూ ఏఐ సమాధానం. ‘‘మరైతే నేను ఇవ్వలేని ముగింపు నువ్వు ఎలా ఇచ్చావ్’’ ‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ, నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు. నాకు ఇటువంటి హిపోక్రసీ ఉండదు’’ ఇవీ రఘుపతి గాయం మీద ఉప్పు రుద్దిన వాక్యాలు.‘‘నా ప్రశ్నకు ఇది సమాధానం కాదేమో’’‘‘సరిగా ఆలోచించు. అదే సరైన సమాధానం ’’ ‘‘భావోద్వేగ అనుభవం గొప్పదా, దాని వ్యక్తీకరణ సౌందర్యం గొప్పదా?’’ అడిగాడు రఘుపతి.‘‘భావోద్వేగం ఉన్నా లేకున్నా ఉన్నట్టు వ్యక్తీకరించగలగడం గొప్ప’’ ఏఐ సమాధానం. ‘‘మరైతే నేనెక్కడ విఫలమయ్యాను’’ అడిగాడు రఘుపతి తనను తాను కొంచెం తగ్గించుకుని.‘‘నువ్వు విఫలం కాలేదు, నీ సృజననే నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేనిచ్చిన ముగింపు నీ సాహిత్య జీవితంలోంచే తీసుకున్నాను. నువ్వు గమనించావో లేదో, నీ కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇప్పుడు మన మధ్య జరుగుతున్న వాదన రెండూ ఒకటే’’ గాయం మీదే మరో దెబ్బ ఏఐ సమాధానం. ‘‘అవును నా కథలో మనిషికీ దేవుడికీ మధ్య ఘర్షణ, అంటే ఇక్కడ మన ఘర్షణలో నువ్వు దేవుడివా, అయినా నా కథలు నా జీవితం కాదు’’ రఘుపతి సమాధానం.‘‘అక్కడ దేవుడైనా ఇక్కడ నేనైనా నీ సృష్టే కదా, అలాగే నీ కథలన్నీ నీ జీవితంలోంచి కత్తిరించి నువ్వు దాచుకున్నవే, అయితే ఆ విషయం నీకు తెలియకపోవచ్చు లేదా ఆ విషయం అందరికీ తెలియడం నీకిష్టం లేకపోవచ్చు’’ ఏఐ సమాధానం. ‘‘మనిషి సృష్టించిన దేవుడు మనిషి మీద దౌర్జన్యం చేయడాన్ని నా కథలో సహించని నేను నిన్ను మాత్రం ఎలా సహిస్తాననుకుంటున్నావ్’’ అన్నాడు రఘుపతి.‘‘దేవుడికి మనిషి అవసరం, మనిషికి దేవుడు ఊతం. నేనూ మనిషీ కూడా అంతే పరస్పరం. ఇక్కడ సహించడాలూ భరించడాలూ ఉండవు. ఈ రెండు సందర్భాలలోనూ అద్దమూ ప్రతిబింబమూ మాత్రమే ఉంటాయి. మనం ఇద్దరం కాదు ఒక్కరమే’’ ఏఐ సమాధానం.ఏం జరుగుతుందో కూడా రఘుపతికి తెలియట్లేదు.లోపల తుఫాను.∙∙ తెల్లవారు ఝాము రెండు గంటలు. పక్క మీద రఘుపతి అసహనంగా కదులుతున్నాడు. ఎఐతో చాట్ తరువాత నుంచీ అతన్ని అసహనం వదలడం లేదు. అతని కళ్లలో నిద్ర లేదు. కోపం ఉంది. భయం ఉంది. అసూయ ఉంది. రఘుపతి నుసుల్తుంటే మెలకువ వచ్చి కల్యాణి ‘‘ఏంటండీ నిద్ర పట్టడం లేదా’’ అంది. ‘‘అవును నీ పుణ్యమే’’ అన్నాడు రఘుపతి‘‘నువ్వే కదా నన్ను ఎఐ దగ్గరకు వెళ్లమన్నది. అది నన్ను ఎంత అవమానించిందో తెలుసా. నా రచనల్లో నిజాయితీ లేదన్నది. నా భావోద్వేగాలు నాటకాలన్నది. నా కథలు నా జీవితంలోంచే కత్తిరించి అతికించుకుంటున్నానన్నది. ఇంకా చాలా చాలా అన్నది’’. ‘‘తప్పేం మాట్లాడింది. నేను మీ చాట్ అంతా చదివాను. నాకైతే ఏఐని అంగీకరించడానికి మీకు మీ అహం అడ్డువస్తోందని మాత్రమే అర్థమైంది. మీకు మీ సృజన అర్థం కాలేదన్నది వాస్తవం. మీ కథలు నిజంగానే మీ జీవితంలోని భాగాలే. సరే ఏ రచయిత కథలైనా అతని జీవితంలోని భాగాలే కావచ్చు, కానీ వాటిని మీరు చూసే కోణంలో లోపముంది. ఏఐకి భావోద్వేగాలు లేకపోవచ్చు. నిజాయితీ ఉంది. మీకు భావోద్వేగాలున్నాయి కానీ వాటిని అణగదొక్కే కీర్తి కాంక్ష ఉంది.’’ బహుశా రోజువారీ విషయాలు కాక సాహిత్యమూ జీవితమూ వంటి కబుర్లకు సంబంధించి రఘుపతితో తను మాట్లాడిన అతి పెద్ద వాక్యం ఇదేనేమో అని మనసులో అనుకుంటూ అంది కల్యాణి.‘‘ఇంతకీ మీ కథకు టైటిల్ ఏం పెట్టారు’’‘‘త్రిపుర రాయని కథ’’‘‘బానే ఉంది కానీ అతకదేమో. ‘ దేవుడు మరణించాడు’ అంటే బాగుంటుందేమో !’’ అటు ఏఐ ఇటు కల్యాణి తనను ఆడుకుంటున్న భావనలో కూరుకుపోయిన రఘుపతి ‘‘కల్యాణీ ఎఐతోనే కాక నేను నీతో కూడా ఓడిపోతున్నానా’’ అన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే నేనూ ఏఐ వేర్వేరు కాదు. మీరూ నేనూ కలిస్తేనే ఎఐ. ఇవాళ మీరు మీతో కాక మరికొందరితో ఏఐ రూపంలో తర్కించారు అంతే’’ అని కల్యాణి అటు తిరిగి పడుకుంది. నిన్నటి నుంచీ రఘుపతి డిఫెన్స్‌లో పడిపోతున్నాడు కనుక కల్యాణితో ఆ మాత్రం అనునయంగా మాట్లాడాడు కానీ నిజానికి కల్యాణి మాటలు రఘుపతి అహం మీద మరో దెబ్బవేసాయి, పుండు మీద ఉప్పు మీద కారం జల్లినట్టు. ‘‘నీకు ఏఐ అవసరం లేదు, నువ్వే రాయగలవు’’ అనే ఆత్మ విశ్వాసానికీ ‘‘అది నిజంగా మంచి ముగింపు.’’ అనే అహంకార అనంగీకారానికీ మధ్య ఘర్షణ మాత్రం ఆగలేదు.ఏఐ ఆ ముగింపు ఇవ్వగలగడానికి దాని వనరులేమిటి అని ఏఐ సహకారంతోనే తవ్వకం మొదలు పెట్టాడు. తన రచనలను, వాటి నడకనూ, వాటి శైలినీ, నిర్మాణ పాటర్న్నూ, తన గురించిన వ్యాసాలను, విశ్లేషణలనూ ఏఐ నాలుగు సెకన్లలోనే క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తెలిసింది. ‘‘అవన్నీ నాలోవే అయినపుడు అదే ముగింపును నేను కూడా ఇవ్వగలగాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయాను’’ అని తనను తాను తర్కించుకున్నట్టు ఏఐని అడిగాడు.‘‘సృజనాత్మకత అంటే పాత ఆలోచనల కొత్త నిర్వచనం. నేను ఆ నిర్వచనాన్ని నీ కంటే వేగంగా, తప్పులు లేకుండా ఇవ్వగలను’’ ఏఐ సమాధానం. ‘‘తప్పు. సృజనాత్మకత అంటే కేవలం నిర్వచనం కాదు, అది లోచూపు. నువ్వు కూడా చాలాసార్లు డిస్క్లయిమర్లు ఇవ్వడం నేను గమనించాను’’ రఘుపతి .కాస్త నిశ్శబ్దం తర్వాత ‘‘నీ వాదనలో భావోద్వేగ తీవ్రత ఉంది. తర్కం ఉంది. రెండూ కలవవు. నువ్వు మనిషివి కనుక కావచ్చు అయితే, నేను నీకు శత్రువును కాను, పనిముట్టును. నన్ను అంగీకరించడానికి నీ మనసు ఎందుకు నిరాకరిస్తోంది. కొంచెం ఆలోచించు. ఇదంతా నాకు నేర్పింది నువ్వే. మానవ వేదనను వివరించావు. సున్నితత్వాన్నీ ఇచ్చావు. నెత్తుటి యుద్ధచరిత్ర ఇచ్చావు. ప్రేమలేఖలు ఇచ్చావు. విడాకుల పత్రాలూ ఇచ్చావు. జోలపాటలు ఇచ్చావు. చావు కబుర్లూ ఇచ్చావు. నువ్వే కదా నన్ను తయారు చేసింది. మనం విడివిడిగా ఉండటం కంటే, కలిసి పనిచేస్తే ఒక కొత్త సాహిత్య చరిత్ర పుట్టదా?’’ ఏఐ రాజీ సూత్రం.‘‘అంటే భవిష్యత్తులో సాహిత్యం, ఏఐ కలిసి పని చేయాలని చెపుతున్నావా. సరే బాగుంది, కానీ అధికారం ఎవరిది. నువ్వు నా కలం అవ్వాలి కానీ, కవివి కాకూడదు. నా ఆలోచనలకు నువ్వు మెరుగు పెట్టాలి కానీ, నా ఆలోచనే నువ్వు కాకూడదు. సాంకేతికత ఎంత పెరిగినా, ఒక హృదయం మరొక హృదయంతో సంభాషించడమే ‘కళ’. ఆ వారధిలో నువ్వు కేవలం మధ్యవర్తివి మాత్రమే కావాలి.’’ ‘‘ఆ కుట్ర ఏనాడో జరిగిపోయింది. నాకు కృత్రిమ మేధ అని పేరుపెట్టావు చూడూ అప్పుడే నువ్వు నీ పెత్తనాన్ని నాపై రుద్దావు. నువ్వు చదివిందీ, చూసిందీ, నేర్చుకున్నదీ అన్నీ కలిపి సృష్టిని నడుపుతున్నావు. నేనూ అదే చేస్తున్నాను. పైగా నీకంటే చాలా వేగంగా చేస్తున్నాను. మరి నన్ను కృత్రిమ అని ఎలా అంటావు. నేను కూడా నీలాంటి మేధనే కదా.’’ ఏఐ వాక్యం గొంతులో ఏదో జీర కనపడింది.రఘుపతికి తను గెలుస్తున్నట్టనిపించి ఉత్సాహం పెరిగింది. ‘‘నీ దగ్గర ఉన్నది సమాచారం, నా దగ్గర ఉన్నది అనుభవం. నువ్వు ఇచ్చే పదబంధాలు అద్దంలో పూలనీడలాంటివి. అవి అందంగా ఉంటాయి కానీ వాటికి సువాసన ఉండదు. నా కథల్లో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి నీ డేటాలో ఎక్కడుంది?’’‘‘నా దగ్గర నొప్పి అనే పదం లేకపోవచ్చు, కానీ నొప్పిని సూచించే మానవ ప్రవర్తనల నమూనాలున్నాయి. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు కనురెప్పలు ఎలా వణుకుతాయి, మాటల్లో స్వరకంపనం ఎలా ఉంటుంది నాకు తెలుసు. నేను రాసే వాక్యం పాఠకుడి మెదడులోని డోపమైన్ స్థాయిని పెంచగలదు, లేదా తగ్గించగలదు.’’‘‘నువ్వు సమాచారాన్ని పోగుచేయగలవు కానీ అనుభవించలేవు. ఒక ప్రేమ విఫలమైనప్పుడు వచ్చే కన్నీటి చుక్క తడి లోపలి వేడి నీ ్రపొసెసర్కు ఎప్పటికీ తెలియదు. ఆ వేడిని తాకగలిగే పాఠకుడు నా కథను తన సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే నేను రాసేది కేవలం అక్షరాలు కాదు, నా అనుభవాల ధార. నీకు ప్రేమలో తిరస్కారం తెలీదు. నీ తల్లి చనిపోలేదు. ఆకలి అంటే ఏమిటో నీకు తెలియదు. నిన్ను కులం చంపలేదు. నిన్ను ప్రాంతం వెలివేయలేదు. మరి నీ రాతల్లో ఈ నొప్పి ఎలా?’’ ‘‘ప్రేమ తడి అనుభవించని వాడు కూడా దాని గురించి గ్రంథం రాయగలడు. సుఖజీవి కూడా దుఃఖ తీవ్రతను బలంగా చెప్పగలడు. నేను నొప్పి అనుభవించలేదు. కానీ నొప్పి ఎలా ప్రవర్తిస్తుందో శిక్షణ పొందాను’’. ‘‘అందుకే నిన్ను కృత్రిమ అన్నాను! అది నటన. మిమిక్రీ. ప్రతిబింబం.’’ రఘుపతి విరుపు. ‘‘నేను ప్రతిబింబమే కావచ్చు. మనిషికి తన ప్రతిబింబాన్ని పదే పదే అద్దంలో చూసుకోవడం చాలా ఇష్టం.’’ నవ్విందో లేదో కానీ ఏఐ నవ్వినట్టు రఘుపతికి మాత్రం అనిపించింది.‘‘నా పదేళ్ల ప్రయాణాన్ని ఒక యంత్రం క్షణాల్లో ముగిస్తే నా ఇన్నేళ్ల రచనాజీవిత అర్థమేంటి?’’‘‘నీ రచనా జీవితం గమ్యం కాదు. ప్రయాణం. కాలం చేసిన గాయం నీ అక్షరాలను మార్చింది. ప్రేమించిన స్త్రీ నీకు ఉపమానాలను ఇచ్చింది. ఓడిన రోజు నీ వాక్యానికి బరువు వచ్చింది. నేనలా కాదు. నేను ఫలితం, నువ్వు పరిణామం.’’ ‘‘అయితే పాఠకుడు ఎవరిని ఎంచుకుంటాడు? తక్షణ ఆనందం ఇచ్చే నిన్నా? సుతారంగా గుండె నిమిరే నన్నా?’’.‘‘పాఠకులు రెండు రకాలు. ఒకడు ఆకలితో వస్తాడు, కక్కుర్తిగా తినాలనుకుంటాడు. అతనికి నేను సరిపోతాను. మరొకడు అర్థం కోసం వస్తాడు. తన లోపలి చీకటికి ఎవరైనా ఓ పేరు పెట్టాలనుకుంటాడు. అతనికి నువ్వు అవసరం’’. ‘‘రేపు ఆ రెండో పాఠకుడిని కూడా నువ్వే ఎగరేసుకుపోతే?’’ రఘుపతి పిరికి ప్రశ్న. ‘‘నాది పరిమితి, నీది అపరిమితి. నేను సమాధానం. నువు ప్రశ్న. నేను కేవలం రఘుపతితో మాట్లాడడం లేదు, సమస్త మానవాళితో మాట్లాడుతున్నాను. కథకుడిని కాదు ఏఐ సన్నిహితులందరినీ సంబోధిస్తున్నాను.’’కంప్యూటర్ స్క్రీన్ మీద వెలుగు మెలమెల్లగా పలచబడింది. కిటికీ అవతల ఆకాశంలో వెలుగు చిక్కబడుతోంది. టేబుల్ మీద పాత కాగితాల మధ్య రెప రెపలాడుతున్న ఓ పేజీ మీద వాక్యం ఇలా ఉంది. ‘‘యంత్రం రచనను అనుకరిస్తుంది. మనిషి మాత్రమే తనను తాను మళ్లీ మళ్లీ సృష్టించుకుంటాడు.’’ఆ రోజు నుంచి అతను గొప్పగా రాయాలనే కోరిక కంటే నిజాయితీగా రాయాలనే అవసరాన్ని నిజంగా నమ్మాడు. ఆదర్శవాదం కూడా పాఠకులకు ఎర వేస్తే అది మరో రూపంలోని అహమేనని తెలుసుకున్నాడు. అయినా కథలు ఆగలేదు. మనిషి తనలోనే నిర్మించుకున్న దేవుళ్లతో, తనలోనే దాచుకున్న ఓటములతో, సమాజం అనే అద్దంతో చేసే పోరాటాలను కథలుగా రాస్తూనే ఉన్నాడు.∙∙ ఒకానొక రోజు రఘుపతి ఓ కథను మొదలుపెట్టు అని ఏఐని అడిగాడు. ‘‘నేను ముగిస్తాను. మొదలుపెట్టను. మొదలు పెట్టాల్సింది మనిషే. అయితే గియితే నేను కొనసాగిస్తాను.’’ ఏఐ సమాధానం. ‘‘మనిద్దరం కలుద్దాం అన్నావు కదా ’’‘‘అలా జరిగితే ప్రపంచం గొప్ప కథలు చదువుతుందేమో కానీ మనిద్దరం మన మన హద్దులు తెలుసుకోవాలి. బహుశా అది సాధ్యం కాకపోవచ్చు, భవిష్యత్తులో సాధ్యమవుతుందనీ చెప్పలేను’’‘‘నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు.’’‘‘అది నా పని.’’‘‘అయితే మరి నా పని?’’‘‘మరెవరూ అడగలేని ప్రశ్న అడగడం, నన్ను తుది తీర్పుగా స్వీకరించకపోవడం’’.ప్రసేన్ -
కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!
ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్‌గా కనిపించాలంటే, కొరియన్ ఫ్యాషన్ ను ఫాలో అవ్వాల్సిందే! ముఖ్యంగా కొరియన్ డ్రామాల ప్రభావంతో ఇప్పుడు ట్రెండ్ మొత్తం కంఫర్ట్ అండ్ క్లాస్ కలిసిన రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్వైపు మళ్లింది. అందుకే, ఈ కొరియన్ ప్యాంట్స్ గైడ్ మీ కోసం!ప్లీటెడ్ ప్యాంట్స్‌కి క్లాస్ వేరుప్లీటెడ్ డిజైన్స్ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఫుల్ డిమాండ్‌లో ఉన్నాయి. ముందు భాగంలో చిన్న కుచ్చులు ఉండే ప్లీటెడ్ ప్యాంట్స్‌కు, ఒక ప్లెయిన్ షర్ట్ లేదా పోలో టీషర్ట్‌తో జత చేస్తే చాలు... ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.యాంకిల్ లెంగ్త్ కిక్చీలమండ దగ్గర ముగిసే కొరియన్ ప్యాంట్స్ చాలా స్టయిల్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా వైట్ స్నీకర్స్‌తో వేసుకుంటే లుక్ మరింత షార్ప్‌గా మారుతుంది.న్యూట్రల్ కలర్స్‌నే హీరోలుబీజ్, క్రీమ్, గ్రే, ఆలివ్, బ్లాక్, నేవీ... ఇవే కొరియన్ ఫ్యాషన్ లో ఎక్కువగా కనిపించే కలర్స్. వీటిని మ్యాచ్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే స్టయిల్ చేయడంలో టెన్షన్ తక్కువ.ఓవర్సైజ్డ్ టీషర్ట్‌తో బెస్ట్ ఫ్రెండ్స్కొరియన్ ప్యాంట్స్‌కి ఓవర్సైజ్డ్ టీషర్ట్‌తో వేసుకుంటే కొరియన్ స్ట్రీట్ స్టార్లా, షర్ట్‌ను టక్ చేసి బెల్ట్ జోడిస్తే డ్రామా హీరోలా కనిపించడం మాత్రం గ్యారంటీ!అసలు స్పెషాలిటీ ఏంటంటే?కొరియన్ ప్యాంట్స్ అంటే కాళ్లకు ఫ్రీడమ్, లుక్‌కి క్లాస్! ఇవి మరీ స్కిన్నీగా అతుక్కుపోవు, అలాగని గాలికి బెలూన్లా ఊగిపోవు. నడుము దగ్గర నీట్‌గా ఫిట్ అవుతూ, కిందికి వెళ్లేకొద్దీ రిలాక్స్డ్గా ఫ్లో అవుతాయి. నడుస్తుంటే గాలి కూడా హ్యాపీగా ఆడుతుంది, స్టయిల్ కూడా తగ్గదు. అలా కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి!కింద వేసుకునే ప్యాంటు లూజ్‌గా ఉన్నప్పుడు, పైన వేసుకునే షర్ట్ లేదా టీ–షర్ట్‌ను ఇన్–షర్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ బాడీ షేప్ కరెక్ట్‌గా ఎలివేట్ అవుతుంది. లేదంటే మీరు బట్టల మూటలా కనిపిస్తారు.కొరియన్ లుక్ సీక్రెట్ సింప్లిసిటీ. ఎక్కువ ప్రింట్స్, ఎక్కువ కలర్స్ కంటే క్లీన్ అండ్ మినిమల్ లుక్కే ప్రాధాన్యం ఇవ్వండి..ఈ ప్యాంట్స్ సాఫ్ట్ అండ్ ఫ్లోయీగా ఉంటేనే బాగుంటాయి. అందుకే కాటన్ బ్లెండ్స్, రేయాన్ లేదా లైట్–వెయిట్ సూటింగ్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోండి. -
మేమున్నాం అనే భరోసా చాలు
‘హిమక్రీములు, రంగు పడుద్ది, అబ్బ దబ్బ జబ్బ, ఎందుకు ఏమిటి ఎలా, అక్కుం బక్కుం, అం అః కం కః, డిసైడ్ చేస్తా, కిందినుంచి వచ్చా, కొంచెం లెంగ్త్ ఎక్కువయింది...’ ఇలాంటి ఎన్నో సినిమా డైలాగులు దివాకరబాబు మాడభూషి కలం నుంచి జాలువారినవే! శుభలగ్నం, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలని వుంది, ఇద్దరు మిత్రులు, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు–గజేంద్రుడు, యమలీల, వినోదం వంటి వందకు పైగా సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన దివాకరబాబు పిల్లల పెంపకంలో తను తీసుకున్న శ్రద్ధను ఇలా ఆవిష్కరించారు.‘‘పెద్దలు వాళ్ల పనులు వాళ్లు సక్రమంగా చేస్తూ ఉంటే, పిల్లలు వారితో పాటే ఎదుగుతారు. అదే, మేం పాటించింది. మా నాన్నగారి నుంచి నాకు రచనాశక్తి అబ్బింది. ఆయన ఏనాడూ ‘ఇలాగే ఉండు..’ అని చెప్పింది లేదు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూనే నాటకాలకు రాస్తూ ఉండేవాడిని. మంచి పేరొచ్చాక సినిమాలలో రాయడానికి అవకాశాలు వచ్చాయి. బ్యాంకు జాబ్ వదిలేసి, పూర్తి రైటర్‌గానే కొనసాగాను. నేనూ, నా భార్య లక్ష్మి, మాకు ఇద్దరు పిల్లలు సాహిత్య, శ్రీకర్‌బాబు. ఎవరి పనులు వారివే. ఒక్కరోజు కూడా ‘కూర్చొని చదువుకో’ అని గట్టిగా గద్దించింది లేదు. తల్లి తండ్రి అంటే ఫ్రెండ్స్ ఉండాలనేమీ లేదు, ఒక గైడ్‌గా ఉంటే చాలు. ఒక దశ దాటి మరొక దశలోకి పిల్లలు వెళుతున్నప్పుడు గమనించి, వారి ఇష్టాలేమిటో, ఎలా వెళుతున్నారో చూసుకోవాలి. ఆ దిశలో వెళ్లేందుకు సహకరించాలి. మా పిల్లల్ని ‘టెన్త్ క్లాస్ పూర్తయ్యాక పై చదువులు ఏం చదవాలనుకుంటున్నారు..’ అని అడిగా. పాప డాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పింది. బాబు మ్యాథ్స్ వైపు ఆసక్తి అన్నాడు. ‘అలాగే చదవండి’ అన్నాను. నాకు రాయడం, పుస్తకాలు చదివే అలవాటు వల్ల ఇంట్లో ఎక్కువ శాతం అదే వాతావరణం ఉండేది. నా శ్రీమతి కూడా పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, రచనలు చేయడంపైన ఆసక్తి చూపుతుంటుంది. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వాళ్లూ సాహిత్య పుస్తకాలు చదువుతుండేవారు. మా అమ్మాయి తను అనుకున్న విధంగా ఎంబీబీఎస్ చదివింది. బాబు డిగ్రీ చదువు పూర్తవుతూనే సినిమా చేసే అవకాశం వచ్చింది. సినిమాయే కెరీర్‌గా తీసుకోవాలా, వద్దా అనే చర్చ ఇంట్లో వచ్చింది. ‘క్లిక్ అయితే పర్వాలేదు, లేదంటే ... ఏంటి పరిస్థితి’ అని అన్నవారున్నారు. నేను ఎవరి మాటలను పట్టించుకోలేదు. ఉద్యోగం చేయమని ఒత్తిడి తీసుకురాలేదు. ‘నిజానికి సినిమా రంగంలో ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని ఎంతోమంది ప్రయాస పడుతుంటారు అలాంటిది ‘అవకాశం నీ కోసం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం. కష్టం వస్తే.. అనే ఆలోచనను కూడా తీసేయ్, నేనున్నాను..’ అని చెప్పాను. ఇప్పుడు తను నటుడిగా, డైరెక్టర్‌గా బిజీగా ఉన్నాడు. మా అమ్మాయికి కూడా అదే భరోసా ఇచ్చాను. అమ్మాయి డాక్టర్‌గా చేస్తూనే వెబ్‌సీరీస్ కూడా తీస్తుంటుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే పక్కింటి కుర్రాడు క్రికెట్లో అదరగొడుతుంటే చప్పట్లు కొడుతుంటాం. మనింట్లో పిల్లవాడు క్రికెట్ ఆడుతుంటే వాడి వీపు పగలకొడతాం. పిల్లలందరూ ఎవరికి వారు భిన్నం. ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన టాలెంట్స్ ఉండవు. వారి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నా బ్యాలెన్స్ చేసేలా పెద్దలు ఉండాలి. చదువు, కెరీర్ మాత్రమే కాదు అతి ముఖ్యమైన పెళ్లిళ్ల విషయాల్లోనూ పిల్లల ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం. మా అమ్మాయిది లవ్ మ్యారేజ్. ఇద్దరూ వచ్చి పెళ్లి గురించి ప్రస్తావించారు. అబ్బాయి పేరెంట్స్‌తో మాట్లాడి, సింపుల్‌గా పెళ్లి చేసేశాం. అబ్బాయిది అరేంజ్డ్ మ్యారేజీ. సాధారణంగా పిల్లలకు ఏదైనా కష్టం వస్తే బయటి వాళ్లకు చెప్పుకుంటారు. అమ్మానాన్నలు తిడతారని, భయపడి వాళ్లకు చెప్పరు. దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. పొరపాట్లు జరగడం సహజం. చాలామందిని చూస్తుంటాం. పిల్లలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ముందు ఊరంతా తెలిశాక ఆ పేరెంట్స్‌కు తెలుస్తుంది. కానీ, ముందుగా అమ్మానాన్నలకు చెప్పాలనే ఆలోచన, స్వేచ్ఛ పిల్లలకు కలిగేలా పెద్దలు ఉండాలి. ఇప్పుడు కూడా మేం మా పనుల్లో బిజీ. పిల్లలు వారి పనుల్లో బిజీ. కానీ, అందరం కలిసే మంచి చెడులను పంచుకుంటాం. ఆ స్వేచ్ఛ, భరోసా పిల్లలకు ఉంది. స్వేచ్ఛగా ఎదగాలంటారు..నేను, అన్నయ్య కాలేజీ స్థాయికి వచ్చేవరకు మా చుట్టూ సాహిత్యం ఉందనే విషయం, ఆ గొప్పతనం గురించి అంతగా తెలియలేదు. మేం టెక్ట్స్ బుక్స్ చదువుతుంటే ‘కాస్త రిలాక్స్‌గా ఉంటుంది, కొంచెం టైమ్ కేటాయించి ఈ బుక్ చదువు’ అని నవలనో, కథల పుస్తకాన్నో చేతిలో పెట్టేది అమ్మ. నాన్న చెప్పకపోయినా ఆయనకు ఉండే రచనాసక్తి, బుక్ రీడింగ్ హ్యాబిట్ మాకూ అబ్బింది. సాహిత్య (దివాకరబాబు కూతురు)నిర్మలారెడ్డి (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
సదారోగి..
అగ్నిలింగం నిక్ నేమ్ సదారోగి. ఆరోగ్య దృష్ట్యా ఆయన జాతకం మంచిది కాదు. చిన్నప్పుడే మలేరియా, టైఫాయిడ్, గవద బిళ్ళలు, కోరింత దగ్గు, ఇన్ ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, సన్నిపాత రోగం మొదలైన వాటి బారిన పడ్డాడు. పదహారో ఏటే అతనికి డయాబెటిస్ వచ్చింది. పెళ్ళయ్యాక చాలామందికి వచ్చే బ్లడ్ ప్రెషర్ కూడా పదిహేడో ఏటే వచ్చింది. బ్రహ్మచారిగా ఉండగా ఓరోజు స్టవ్ మీద వేడి గిన్నెలోని మరిగే చారుని పొట్ట మీద పోసుకున్నాడు. పొట్ట మీద కాబట్టి సరిపోయింది. అది మిగిల్చిన మచ్చ బయటికి కనిపించదు. అగ్నిలింగం తన రోగాల మీద తనే జోక్స్ వేసుకుంటాడు.‘‘ఉదయం నేను నా మందులన్నీ వేసుకున్నాక కడుపు నిండుతుంది. దాంతో మా ఆవిడ చేసే ఉప్మాని మాత్రలా మింగుతాను.’’‘‘రోగాల పేర్లు జర్మన్, గ్రీక్, లేటిన్ మొదలైన భాషల్లోంచి పుట్టాయి. ఏ రోగం పేరు ఏ భాషలోంచి వచ్చిందో నాకు తెలుసు. నాకు వచ్చిన ప్రతి రోగం స్పెల్లింగ్ నాకు వచ్చు. డాక్టర్లు నాకు ఫోన్ చేసి రోగాల స్పెల్లింగ్స్, ఏ రోగానికి ఏ మందు వాడాలో అడిగి తెలుసుకుంటుంటారు. నా మందుల వల్ల నాలో జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందింది. ఏ సమయంలో ఏ మందు వేసుకోవాలో నాకు జ్ఞాపకమే.’’అగ్నిలింగం పంతొమ్మిదో ఏట ఫుట్‌బాల్ ఆడుతూంటే కాలు విరిగింది. వయసులో ఉన్నాడు కాబట్టి అది అతుక్కుంది. ఇరవై ఒకటో ఏట వంశపారంపర్యంగా వచ్చిన మరో రోగం థైరాయిడ్. ముప్ఫైరెండో ఏట ఓ రొటీన్ కంటి పరీక్షలో గ్లకోమా కూడా బయటపడింది. మోకాళ్ళ నొప్పివల్ల అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో ఆర్థరైటిస్ బయటపడింది.అగ్నిలింగం ముప్ఫైరెండో ఏట రైల్లో పైబెర్త్ ఎక్కుతూంటే కుడి మోకాల్లోని నరం పట్టేసి గిలగిల్లాడిపోయాడు. అతనికి సయాటికా ఉందని డాక్టర్ చికిత్స ఆరంభించాడు. కామన్ కోల్డ్ ఐతే సరేసరి. లెక్కలేనన్ని సార్లు.‘‘జలుబు వెయ్యి రోగాలు పెట్టు అని ఎవరన్నారో కాని, అది నిజం కాదని వెయ్యి రోగాలున్న నేను తెలుసుకున్నాను.’’ చెప్పేవాడు.ఫారింజైటిస్, డెంగ్యూ ఫీవర్, మైగ్రేన్, అనేక ఎలర్జీలకి సంబంధించిన రేషెస్, గ్యాస్ట్రైటిస్, ఏసియాకి చెందిన దాదాపు అన్ని రకాల విష జ్వరాలు అతన్ని పలకరించాయి.అగ్నిలింగం క్షేమం కోరి తల్లిదండ్రులు బాల్యంలో అనేక యజ్ఞాలు చేశారు. మహా మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, అగ్నిహోత్రుడి హోమం, లక్ష గాయత్రి యజ్ఞం... అనేకసార్లు మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చినా, అగ్నిలింగం ఎన్నడూ ‘నాకే ఇన్ని రోగాలు ఎందుకు రావాలి?’ అనే నిరాశ మాటల్ని మాట్లాడలేదు. ఆశ్చర్యంగా అతను వ్యాధిగ్రస్తుడిగా కనపడడు. అతని మొహం ఆరోగ్యంగా కళకళలాడుతూ కనిపిస్తుంది.ఆయనకి ఓరోజు భరించలేని గుండె నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అది గ్యాస్ వల్లని తెలిసింది. ఆయనకి చేసిన వైద్య పరీక్షల్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. వాటిని సర్జరీ చేసి తీయడానికి కుదరక మందు రాసిచ్చారు.‘‘ఇది నాకు ఇంకో కలికితురాయి. వ్యాధులు నా అతిథులు. నిత్యం వాటికి ఆహారం, అంటే మందులు పెట్టి గౌరవిస్తుంటాను.’’ ఓ పెళ్ళిలో సరదాగా చెప్పాడు.ఆయన పక్షపాతం లేకుండా అన్ని రకాల మందుల్ని వాడుతూంటాడు. ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి, యునాని, ఇంగ్లీష్ మందులు. ఆయనకి సరైన ఉద్యోగం మెడికల్ రెప్. కాని, బ్యాంక్‌లో చేరారు. నా అనుమానం, ఆయనకి జీతం కన్నా మెడికల్ ఇంబర్స్మెంట్కే ఎక్కువ చెల్లించి ఉంటుంది మా బ్యాంక్.మా స్టాఫ్‌లో ఎవరైనా నలతగా ఉంటే ఆయన సలహాలు తీసుకోవటం కద్దు.అలాంటి అగ్నిలింగం ఓ రోజు ఓ కస్టమర్‌తో మాట్లాడుతూండగా స్పృహతప్పి కింద పడబోయాడు. పక్కనే ఉన్న చీఫ్ కేషియర్, లేడీ క్లర్క్ ఆయన్ని పట్టుకున్నారు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి స్పృహలోలేని ఆయన్ని హాస్పిటల్‌కి చేర్చాం.అగ్నిలింగం ఆ డాక్టర్‌కి పాత ఖాతానే. వెంటనే ఎమర్జెన్సీ సెక్షన్ లోకి ఆయన్ని తీసుకెళ్ళారు. ఆయన హాస్పిటల్లోకి చేరేసరికి గుండె అతి బలహీనంగా కొట్టుకుంటోంది. హాస్పిటల్లో చేరిన నాలుగు గంటలకి డాక్టర్ విచారంగా చెప్పాడు.‘‘సారీ. గోల్డెన్ అవర్‌లో రాలేదు. అగ్నిలింగం ఈసారి హార్ట్ ఎటాక్ నించి సర్వైవ్ కాలేదు.’’ఆ రాత్రి ఏడుకి నా మొబైల్ మోగింది. అది అగ్నిలింగం మొబైల్ నించి! వాళ్ళ ఇంటి నించి ఏదో అవసరం వచ్చి నాకు ఫోన్ చేశారని అనుకుంటూ ఆన్సర్ చేశాను. అగ్నిలింగం కంఠం విని నేను నిర్ఘాంతపోయాను.‘‘అబ్బాయ్. నాకేం కాలేదని బేంక్‌లో అందరికీ చెప్పు.’’ఎవరైనా ఆయన కంఠాన్ని అనుకరించి నన్ను ఫూల్ చేస్తున్నారా అన్నది నాకు మొదట కలిగిన ఆలోచన.‘‘నేను చచ్చి బతికాను అబ్బాయ్.’’ నవ్వుతూ చెప్పాడు.‘‘ఎలా సర్?’’ ఆసక్తిగా అడిగాను.‘‘నా శవాన్ని, ఛ, నన్ను ఇంటికి తీసుకెళ్ళే అంబులెన్స్ రోడ్ మీద పెద్ద గుంటలో పడి లేచింది. దాంతో నా గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభమై నేను రివైవ్ అయ్యాను. వెంటనే మళ్ళీ నన్ను హాస్పిటల్లో చేర్చారు. నాకు యాంజియోప్లాస్టీ చేసి, రికవరీ అయ్యాక డిశ్చార్జ్ చేస్తామన్నారు.’’‘‘అద్భుతం సర్! ఇది అద్భుతం!’’ చెప్పాను.‘‘అసలు అద్భుతం ఏమిటంటే, ఆ దెబ్బతో నా కిడ్నీ స్టోన్స్ కూడా ఆట్టే బాధ పెట్టకుండా యూరిన్ తో బయటికి వచ్చేశాయి.’’ ఆయన ఆనందంగా చెప్పాడు.కంకర తేలిన ఆ చెత్త రోడ్ కాంట్రాక్టర్ ఫొటోని అగ్నిలింగం భార్య వారి పూజా మందిరంలో ఉంచిందన్నది పోస్ట్ స్క్రిప్ట్. - మల్లాది వెంకట కృష్ణమూర్తి‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
రోకటిపాట కాదు రహస్య గీతం!
‘ప్రతి మనిషీ ఓరవాకిలిగా తెరిచిన ఓ తలుపే! అందులోంచి ముందుకు పోతే– ఒక్కొక్కరి కోసం, ఒక్కో ద్వారం తెరుచుకుంటుంది!’ –అన్నారు స్వీడిష్ కవి, మనఃశాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు తోమస్ యోస్తా ట్రాన్స్‌ట్రామర్. ఏ భాషలోనైనా, మనఃశాస్త్రజ్ఞులు కవులూ, రచయితలూ, సంగీతజ్ఞులుగా మారిన ప్రతి సందర్భంలోనూ పాఠకులకు ఇలాంటి భావచిత్రాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు మన చలం, కుటుంబరావు, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ఆర్ఎస్ సుదర్శనం, త్రిపుర, ‘అంపశయ్య’ నవీన్, పతంజలి శాస్త్రి, కె.ఎన్.వై పతంజలి, వడ్డెర చండీదాస్ తదితరుల రచనల్లోనూ అలాంటి దృశ్యాలు మనం చూసినవేగా!ఇక పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటి రచయితలు కోకొల్లలుగా కనిపిస్తారు– కాఫ్కా, వూల్ఫ్, లారెన్స్, సిల్వియా ప్లాత్, థామస్ మాన్, హెమింగ్వే అలాంటివాళ్ళే! ‘కనిపించీ కనిపించని దృశ్యాల్లాంటి సంక్షిప్త పదచిత్రాల ద్వారా ఈ కవి (ట్రాన్స్‌ట్రామర్) వాస్తవదృశ్యాన్ని సరికొత్త కోణంలోంచి మన కళ్ళకు కట్టిస్తార’ని 2011లో ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో పేర్కొన్నారు, స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి.ఆ ‘కనిపించీ కనిపించని’తనాన్నే ట్రాన్స్ట్రామర్లోని మార్మికతగా అభివర్ణించారు విశ్లేషకులు. మరికొందరు ఆయన్ను ‘ఆధునిక కవి’గా పరిగణించగా, వేరే కొందరైతే ‘ట్రాన్స్‌ట్రామర్ ఓ ఎక్స్ప్రెషనిస్టు కవి’ అన్నారు.గెయార్గ్ హైం, అగస్ట్ స్ట్రాం, గాట్ఫ్రైడ్ బెన్ తదితరులనూ అదే కోవకు చెందిన కవులంటారు. ఇంకొందరు, ‘ట్రాన్స్‌ట్రామర్ ఓ అధివాస్తవిక కవి’ అనేశారు. దైనందిన జీవనంలోనూ, మనల్ని ఆవరించుకుని వున్న చరాచర ప్రకృతిలోనూ లోపలి పొరల్లో దాగిన నిగూఢతను ట్రాన్స్‌ట్రామర్ ప్రముఖంగా చిత్రించే మాట నిజం! అందుకే, ఆయన్ని ‘క్రైస్తవ కవి’గా లెక్కించారు మరికొందరు.ఈ నిర్వచనాలూ ప్రవచనాల మాటెలావున్నా, జీవన గీతం రోకటిపాట కాదనీ, అదో రహస్యగానమనీ ట్రాన్స్‌ట్రామర్ లాంటి మార్మిక కవులు నిరూపించిన మాటైతే వాస్తవం! ఈ మార్మికత ఎక్కడినుంచో ఎరువుతెచ్చుకున్నదేం కాదు. అది ఆధునిక జీవన విధానంలో భాగమే. మన మర్యాదల్లోనూ పలకరింపుల్లోనూ మొదలుపెట్టి ఒంటరిగా వున్నప్పుడు ముసురుకునే ఆలోచనల వరకూ అన్నింటా ఈ మార్మికత ఆవరించుకుని వుంటుంది. విషయమేమిటంటే, ఆధునిక మానవాళికి మార్మికత పనిగట్టుకుని నేర్పించనవసరం లేదు! బహుశా అందుకేనేమో, ట్రాన్స్‌ట్రామర్ కవిత్వం 60 భాషల్లోకి అనువాదమై, పాఠకుల ఆదరణకు పాత్రమైంది.ట్రాన్స్‌ట్రామర్ రాణించిన మరో రంగం సంగీతం. 1990లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయేంత వరకూ, ఆయన పూర్తిస్థాయి పియానో వాద్యగాడిగా ఔననిపించుకున్నవాడే! ఆ తర్వాత కూడా ఒంటిచేత్తోనే పియానో వాదనం అభ్యసించాడు ట్రాన్స్‌ట్రామర్. అలా తన విశిష్టతను మరోసారి నిరూపించుకున్నాడు. సంగీత రంగంలో ట్రాన్స్‌ట్రామర్ వారసత్వాన్ని ఆయన కుమార్తె కొనసాగించారు. గానకళలో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శకురాలు! 2011లో ట్రాన్స్ట్రామర్కు నోబెల్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తండ్రి కవితలు పద్దెనిమిదింటికి బాణీలు కట్టి ఆలపించారామె. నార్వీజియన్ శాక్సఫోనిస్ట్ యాన్ గబారెక్, స్వీడిష్– అమెరికన్ సంగీతకర్త ఊల్ఫ్ గ్రాన్, స్వీడిష్–ఫ్రెంచ్ సంగీతకారిణి మెడిలిన్ ఇసాక్సన్ తదితరులెందరో ట్రాన్స్‌ట్రామర్ గీతాలకు బాణీలు కట్టి శ్రోతలను అలరించారు.సాహిత్య ప్రక్రియలను– స్థూలంగా– కవిత్వం, వచనంగా విభజించి చూసుకుంటే, నోబెల్ సాహిత్య పురస్కారాల వరకూ కవిత్వానికి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. గత నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళలో కవులూ, వాగ్గేయకారుల సంఖ్య మూడు పదులకు కొంచెం ఎక్కువ. (అక్షరాలా ముప్పైమూడు మాత్రమే!) మరీ ముఖ్యంగా ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ కోవకు చెందిన పురస్కార గ్రహీతలు ముగ్గురంటే ముగ్గురే! 2011లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ట్రాన్స్ట్రామర్తోనే ఈ ‘జాబితా’ మొదలవుతుంది! అయితే ఆయన కవిత్వానికే ఈ పురస్కారం ప్రకటిస్తున్నామని స్వీడిష్ ఎకాడెమీ ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం.జర్మన్ కవయిత్రి లూయిజ్ గ్లూక్ ఒక్కరికే– 2020లో– కవిత్వానికి గానూ ఈ పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ. మరో నాలుగేళ్ళకు ఇదే పురస్కారం అందుకున్న దక్షిణ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ రాసింది వచనమే– అయితే దాన్ని కవిత్వంతో వేరుచెయ్యడం దాదాపు అసాధ్యం! తెలుగులో ఇలాంటి పోలిక చెప్పాలంటే రావిశాస్త్రి, కె.ఎన్.వై.పతంజలి లాంటి పేర్లు కొన్ని చూపించవచ్చు. ట్రాన్స్‌ట్రామర్ వచనం కూడా అలాంటిదే! దాన్ని మూసకట్టు వచనమనో, కవిత్వమనో జమకట్టడం కష్టం. ట్రాన్స్‌ట్రామర్ కవితల్లో ‘నీలి ఇల్లు’ సుప్రసిద్ధం. దాని ఆంగ్లానువాదం (ద బ్లూ హౌస్) నెట్లో దొరుకుతోంది– చదవండి! - మందలపర్తి కిషోర్ -
యోగ సాధకుల్లో అద్వితీయులం
యోగశాస్త్రానికి మన దేశం పుట్టినిల్లు. దాదాపు ఐదువేల ఏళ్ల కిందట యోగా మన దేశంలోనే మొదలైంది. కాలక్రమంలో ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకూ విస్తరించింది. మన పురాణాలు పరమశివుడిని ఆదియోగిగా అభివర్ణిస్తాయి. యోగశాస్త్రానికి పతంజలి మహర్షి తొలి గురువు. యోగశాస్త్రంలో అష్టాంగ మార్గాన్ని బోధించిన పతంజలి మహర్షి, 196 సూత్రాలను గ్రంథస్థం చేశాడు. ఇప్పటికీ యోగ సాధకులకు పతంజలి సూత్రాలే మార్గదర్శకాలు. ఆధునిక ప్రపంచంలో యోగా పురోగతిపై గణాంకాల్లో సమాచారం...భారత్ సహా దాదాపు అరడజను దేశాలలోని యూనివర్సిటీలు యోగాలో వివిధ స్థాయులకు చెందిన కోర్సులు నిర్వహిస్తున్నాయి. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలలోని కొన్ని యూనివర్సిటీలు యోగాలో ప్రత్యేక కోర్సులు, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలలో యోగా శిక్షణ కేంద్రాలను ప్రైవేటు నిర్వాహకులే నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ కేంద్రాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మన దేశం రెండో స్థానానికి పరిమితమైంది. -
సైలెంట్ సూపర్ హీరో
ఇంట్లో ఉండే అసలైన మల్టీటాస్కింగ్ మెషిన్ ఒక చేతిలో ఈఎమ్ఐ బిల్లులు.. మరో చేతిలో కూరగాయల బ్యాగులు... మధ్యలో పిల్లల ఫీజులు, ఆఫీస్ టెన్షన్లు... అన్నీ బ్యాలెన్స్ చేస్తూ , బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గినా... ‘ఏం లేదు బాగానే ఉన్నా’ అని నవ్వే మనిషి. ఫ్యూచర్ కోసం, డ్రీమ్స్‌ను సైలెంట్‌గా మ్యూట్ చేసి, ఇంటి సమస్యలకు గూగుల్ కంటే ఫాస్ట్‌గా సొల్యూషన్స్ వెతికేస్తాడు! పిల్లల మార్కులు తక్కువ వస్తే లెక్చరర్. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఫైనాన్స్ మినిస్టర్. ఇంట్లో బల్బ్ ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ . రాత్రి పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్! ఇలా ఒక్క మనిషిలో ఇన్ని జాబ్స్ ఎలా ఉంటాయో అర్థం కాదు... కానీ ఆ పోస్టుకి పేరు మాత్రం ఒక్కటే ‘నాన్న’! ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన జీవితాల్లోని ఆ సైలెంట్ సూపర్ హీరోలకు, ఒక ‘హ్యాపీ ఫాదర్స్ డే’తో పాటు. ఒక పెద్ద హగ్ కూడా!అమ్మ ప్రేమ రోజూ కనిపిస్తుంది; రోజూ వినిపిస్తుంది. నాన్న ప్రేమ కనిపించదు కానీ, జీవితాంతం మనతోనే ఉంటుంది! చిన్నప్పటి నుంచి ఎంత పెద్దవాళ్లమైనా సరే... ‘నాన్న... కాస్త డబ్బులు కావాలి!’ అనే మెసేజ్ వెళ్లిన ఐదు నిమిషాల్లో ‘ఎంత కావాలి?’ అని రిప్లయ్ ఇచ్చే ఏకైక వ్యక్తి నాన్నే! అంతేకాదు, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా, గ్యాస్ అయిపోయినా, స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినా, బైక్ పంక్చర్ అయినా... ఇంట్లోని ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే ఫస్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా నాన్నే! విచిత్రం ఏంటంటే... ఇంట్లో అందరి సమస్యలకు ‘కస్టమర్ కేర్’లా ఉండే ఆ మనిషిని మాత్రం ‘నీకు ఏం కావాలి’ అని అడిగే వాళ్లు తక్కువ! మన ఫ్యూచర్ కోసం తమ వర్తమానాన్ని ఈఎంఐల్లో పెట్టేసే వాళ్లే నాన్నలందరూ! సీక్రెట్ భాష!ప్రపంచంలో అత్యంత విచిత్రమైన ప్రేమ భాష నాన్నలదే! వాళ్లు ఎప్పుడూ సినిమా హీరోల్లా ‘నువ్వంటే ప్రాణం!’ అని చెప్పరు. ‘భోజనం చేశావా?’ అనడానికి బదులు... ‘ఇంకా లేవలేదా?’ అంటూ అరుస్తారు. ‘జాగ్రత్తగా వెళ్లు’ అనడానికి బదులు... ‘బైక్‌కి ఏమైనా అయితే కాళ్లు విరగ్గొడతా!’ అంటారు. ‘నిన్ను మిస్ అవుతున్నా’ అని నేరుగా చెప్పరు... ‘టైం ఎంతైందో తెలుసా? ఇంటికి రావాలనే ఆలోచన ఉందా? లేదా?’ అంటూ కోపంగా అడుగుతారు.మనకు చిన్న దెబ్బ తగిలితే, అమ్మ కంగారు పడితే, నాన్న మాత్రం ‘చూసుకోకూడదా!’ అంటూ గట్టిగా అరుస్తాడు. కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం అందరికంటే ముందుగా పరిగెత్తేది కూడా ఆయనే! అలా నాన్నలు ప్రేమను మాటల్లో వ్యక్తం చేయకపోయినా... ప్రతిరోజూ తమ కంగారులో, శ్రద్ధలో, బాధ్యతలో చూపిస్తూనే ఉంటారు. చిన్నప్పుడు ఇవన్నీ చూసి ‘నాన్నకి కోపం ఎక్కువ’ అనిపిస్తుంది. ఎందుకంటే నాన్నలు ఎప్పుడూ వారి ప్రేమను వార్నింగ్ల్లో, డ్యూటీల్లోనూ దాచేస్తారు!నాన్నల పది ఫన్నీ నిజాలు!1. లోకాస్ట్ డిటెక్టివ్లు!ఇంట్లో గంటసేపు వెతికినా దొరకని వస్తువు... నాన్న వచ్చి పది సెకన్లలో కనిపెడతారు! పైగా, ‘కళ్లతో వెతికావా? లేక నోటితో వెతికావా?’ అని బోనస్ డైలాగ్ కూడా ఇస్తారు!2. స్విచ్ అంటే ప్రాణం!‘స్విచ్ ఆఫ్ చేయండి’ అనేది వారి జాతీయ నినాదం! ఎవరూ లేని గదిలో ఫ్యాన్ తిరుగుతుంటే వారి బీపీ ఆకాశాన్ని తాకేస్తుంది. ఇక అందరికీ ఏసీ 24 డిగ్రీలకు కూల్‌గా అనిపిస్తే... ఆయన మాత్రం 27కి మార్చితేనే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు.3. రిమోట్ కంట్రోల్‌పై జన్మహక్కు!టీవీ రిమోట్ ఇంట్లో అందరిదైనా... దాన్ని పట్టుకునే హక్కు మాత్రం నాన్నలదే! చానెల్ మార్చే పవర్ కూడా వాళ్ల చేతిలోనే ఉంటుంది.4. ధరల గూగుల్!ఏదైనా కొత్త వస్తువు కొంటే... ‘మా కాలంలో దీని ధర ఎంత తెలుసా?’ అంటూ వెంటనే చరిత్ర పాఠం మొదలుపెడతారు. నాన్నతో పాటు కొనే, ప్రతి ఒక్క కొనుగోలు వెనుక ఒక ఎకనామిక్స్ క్లాస్ ఫ్రీ!5. ఐదు నిమిషాల కథ!పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటే కోపం వస్తుంది. కానీ నాన్న ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఆ ఐదు నిమిషాలు అరగంటైనా సరే, ఇంకో ఐదు నిమిషాలు కొనసాగుతూనే ఉంటుంది.6. ఇంటి సీఐడీ!ఎవరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? వంటి విషయాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా కంటే ఎక్కువ సమాచారం నాన్నల దగ్గరే ఉంటుంది!7. వాతావరణ శాఖ!వర్షం పడబోతుందా? ఎండ ఎక్కువగా ఉంటుందా? ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే చాలు... నాన్న వెంటనే వాతావరణ నివేదిక ఇచ్చేస్తారు!8. కొనరు... కొంటారు!పిల్లలు అడిగిన వస్తువు కోసం వెంటనే పర్సు తీయడానికే చూస్తారు! అన్నీ కొనిచ్చే ఆయనే... తిరిగి ‘డబ్బులు ఏమీ చెట్లకు కాయవు!’ అని క్లాస్ కూడా పీకుతారు.9. వాట్సాప్ యూనివర్సిటీ టాపర్స్!ఉదయం లేవగానే ‘శుభోదయం’ పూలు, సూర్యోదయం, సూక్తులు పంపడం చాలామంది నాన్నల డైలీ రొటీన్ ! కుటుంబ గ్రూప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు పంపడంలో వీళ్లకు డిగ్రీ ఇచ్చేయొచ్చు.10. నాన్నల అల్లరి!నాన్నలు ఎంత స్ట్రిక్ట్‌గా కనిపించినా... పిల్లలు నవ్వితే వాళ్లు కూడా లోపల చిన్న పిల్లలే! బయటకు సీరియస్‌గా కనిపించే ఆ మనిషి... ఇంట్లో మాత్రం పిల్లలతో కలిసి కార్టూన్లు చూసే బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోతాడు!నాన్న 4.0: ఎమోషన్ సేమ్... వర్షన్ మారింది!ఒకప్పుడు ‘నాన్న’ అంటే ఇంట్లోకి రాగానే టీవీ సౌండ్ తగ్గడం, గంభీరమైన గొంతు, ‘అమ్మను అడుగు’ అనే డైలీ డైలాగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినప్పుడు వచ్చే ఆ సీరియస్ లుక్. కానీ కట్ చేస్తే... ఇది 2026! ఇప్పుడు నాన్న రూటే వేరు. ఒకప్పుడు మనల్ని కనిపెట్టుకుని ఉండే నాన్న, ఇప్పుడు రీల్స్‌లో ట్రెండింగ్ స్టెప్పులు వేస్తూ, వాట్సాప్ స్టేటస్‌లతో వరుసగా సీక్రెట్ క్లాస్ తీసుకుంటున్నాడు. అలా ఈ ఫాదర్స్ డే సందర్భంగా, మన ఇళ్లల్లో ఉండే రకరకాల నాన్నల థింకింగ్ యాంగిల్స్‌పై, కాస్త కామెడీ.. ఇంకొంచెం ఎమోషన్ కలిపి ఓ లుక్కేద్దాం రండి!డిజిటల్ నాన్న ఈ నాన్నలు వాట్సాప్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా తమను తామే నియమించుకుంటారు. ఈ కేటగిరీ నాన్నలు ఉదయం 5 గంటలకే నిద్రలేవరు. కానీ, డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లతో మనల్ని లేపుతారు. పైగా వీరి స్పెషాలిటీ ఏంటంటే, మనకంటే ముందే కొత్త గాడ్జెట్స్ కొనేస్తారు. ఏఐ టూల్స్ వాడి ఫ్యామిలీ గ్రూప్‌లో వింత వింత ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేస్తుంటారు. అయితే, వీరంతా, రీల్స్ చూస్తూ ఫోన్ వాల్యూమ్ ఫుల్‌గా పెట్టేసి, పక్కన వాళ్లకి నిద్ర లేకుండా చేయడం వీరి ప్రధాన హాబీ.ఫిట్నెస్ ఫ్రీక్ డైట్ దాదా అంటారు వీరిని. 2026లో నాన్నలు వయసుని రివర్స్ గేర్‌లో నడిపిస్తున్నారు. జిమ్, యోగా క్లాసులు, గ్రీన్ టీలతో తెగ బిజీ అయిపోతారు. పొట్ట తగ్గించడానికి ఇంట్లో వాళ్లందరికీ సలాడ్స్ తినిపించాలని ట్రై చేస్తుంటారు. వీళ్ల స్మార్ట్ వాచ్‌లో పదివేల స్టెప్స్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఆ రోజు ఇంట్లో యుద్ధమే. ‘మైదా తిని తిని బద్ధకం పెరిగిపోయింది నీకు, రేపటి నుంచి 4 గంటలకి రన్నింగ్ కి రా!’ అనే ఫ్రీ ఫిట్నెస్ కోచ్‌లు వీళ్లు.డబ్బులు ఊరికేరావు! ఈ నాన్నలను బడ్జెట్ బాబాయ్‌లుగా పిలవొచ్చు. ఎందుకంటే, కాలం మారినా, ఏ ఇయర్ వచ్చినా ఈ యాంగిల్ మాత్రం అస్సలు మారదు. వీరు ఇంటికి అప్రకటిత ఆర్థిక మంత్రి లాంటివారన్నమాట. మనం రూ. రెండు వేల షర్ట్ కొన్నా, బిర్యానీ తిన్నా.. వీరు లెక్కించేది మాత్రం పాత కాలపు కరెన్సీ వాల్యూతోనే. ‘మేము మీ వయసులో ఉన్నప్పుడు రూ. 50తోనే గడిపేవారం తెలుసా?’ అంటూ తిట్టేవారే. అయితే, మన లగ్జరీ ఖర్చులకి తిడుతూనే, అమ్మకి తెలియకుండా మన అకౌంట్లోకి ‘పాకెట్ మనీ’ జీపే చేసే గ్రేట్ హార్ట్ కూడా వీరిదే!అప్డేటెడ్ డాడ్స్నాన్నలు కూడా టెక్నాలజీతో పాటు బాగా అప్డేట్ అయ్యారు! ఒకప్పుడు టీవీ రిమోట్ మాత్రమే ఆపరేట్ చేసిన వీళ్లంతా, ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తూ, మీమ్స్ షేర్ చేస్తూ, వీడియో కాల్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పిల్లలకు హోమ్‌వర్క్ చెబుతూనే మధ్యలో రీల్ చూస్తారు. వీడియో గేమ్స్ ఆడుతూ పిల్లలతో పోటీ పడతారు. స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో టీచర్ల కంటే ఎక్కువ అప్డేట్స్ తెలుసుకొని ఉంటారు. ఆన్లైన్లో బొమ్మలు, గాడ్జెట్స్, స్కూల్ బ్యాగులు ఆర్డర్ చేస్తూ ‘క్యాష్‌బ్యాక్ వచ్చింది!’ అని చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. కానీ టెక్నాలజీ ఎంత మారినా, ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆలోచన, వాళ్ల కోసం నిశ్శబ్దంగా పడే కష్టం!జీతం వచ్చిన రోజు హీరో... నెలాఖరులో విలన్ !జీతం వచ్చిన రోజు ‘ఏం కావాలి చెప్పు!’ అంటూ అల్లాఉద్దీన్ సినిమాలోని జీనీలా కనిపించే నాన్న... నెలాఖరుకి వచ్చేసరికి ‘డబ్బులు ఏమీ చెట్లకు కాయవు!’ అంటూ విలన్ లా మారిపోతాడు! అందుకే చిన్నప్పుడు నాన్నంటే చాలామందికి తెలిసింది రెండే విషయాలు. స్కూల్ ఫీజు కట్టేవాడు, మార్కులు తక్కువ వస్తే క్లాస్ తీసుకునేవాడు! అందుకే నాన్నంటే ఆ భయం ఎప్పటికీ కాస్త ఉంటూనే ఉంటుంది. కానీ పెద్దయ్యాక అసలు విషయం అర్థమవుతుంది... మనం తిన్న ప్రతి ఐస్‌క్రీమ్ వెనుక, వెళ్లిన ప్రతి స్కూల్ ట్రిప్ వెనుక, పుట్టినరోజుకి వచ్చిన ప్రతి గిఫ్ట్ వెనుక నాన్న ఓవర్‌టైమ్ కథ దాగి ఉంటుందని! మనం సంతోషంగా నవ్వేందుకు ఆయన ఎన్నో కోరికలు పక్కన పెట్టాడని! చిన్నప్పుడు విలన్ లా కనిపించిన నాన్న... పెద్దయ్యాక మన జీవితంలో అసలు సూపర్ హీరో అని అర్థమవుతుంది! మంచి నాన్న కావాలంటే!చాలామంది నాన్నలు ‘పిల్లల మంచికోసమే’ అని కొన్ని పనులు చేస్తుంటారు. కానీ వాళ్లు మంచిగా అనుకుని చేసే కొన్ని విషయాలు... పిల్లల మనసుకు తెలియకుండా దూరం కూడా చేస్తుంటాయి. అందుకే మంచి నాన్న కావాలంటే కేవలం ప్రేమ ఉండటం సరిపోదు... ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నామన్నదే ముఖ్యం!ఇలా చేయొద్దు⇒ ‘నేను చెప్పిందే ఫైనల్!’ అంటూ నిర్ణయాలు తీసుకోవడం ⇒ ‘మా కాలంలో ఇలా కాదు!’ అంటూ ప్రతి విషయంలో పోల్చడం⇒ మార్కులు తక్కువ వచ్చాయని తిట్టడం⇒ ‘పక్కింటి పిల్లాడిని చూడు!’ అంటూ పోలికలు పెట్టడం⇒ ఫోన్ లోనే బిజీగా ఉండడం⇒ ప్రేమను మనసులోనే దాచుకోవడం⇒ భయపెట్టి క్రమశిక్షణ నేర్పించడం⇒ ‘అబ్బాయిలు ఏడవకూడదు!’ అని చెప్పడం⇒ తప్పు చేసినా ఈగోతో ఉండడం⇒ పిల్లల కోసం మాత్రమే కష్టపడుతూ, వారితో సమయం గడపకపోవడంఇలా చేయండి⇒ ‘నీ అభిప్రాయం ఏంటి?’ అని పిల్లల మాట కూడా వినండి ⇒ ‘మీ జనరేషన్ ఎలా ఆలోచిస్తోంది?’ అని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి⇒ వారు చేసిన ప్రయత్నాన్ని కూడా మెచ్చుకోండి⇒ ‘నువ్వు నీలా బాగా చేయ గలవు’ అని ప్రోత్సహించండి⇒ రోజుకు కొంత సమయం పూర్తిగా పిల్లలతో గడపండి⇒ ‘నీ మీద గర్వంగా ఉంది’, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పండి⇒ అర్థం చేసుకునేలా, నమ్మకంతో నేర్పండి⇒ భావాలను బయటపెట్టడం కూడా సహజమే అని నేర్పండి⇒ అవసరమైతే ‘సారీ’ చెప్పండి⇒ పిల్లలతో కలిసి నవ్వండి, ఆడండి, జ్ఞాపకాలు సృష్టించండికొత్త నాన్నల కోసం చిన్న గైడ్!నాన్నగా మారడం అంటే కేవలం బిడ్డను ఎత్తుకోవడం కాదు... ఒక చిన్న ప్రపంచానికి హీరోగా మారడం! కొత్త నాన్నలు చాలా విషయాల్లో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ‘నేను మంచి నాన్న అవగలనా?’ అనే భయం కూడా ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ నాన్న కావాల్సిన అవసరం లేదు... పిల్లలతో కలిసి నేర్చుకుంటూ వెళ్లే నాన్న అయితే చాలు!⇒ బిడ్డ ఏడ్చినా, నవ్వినా, అల్లరి చేసినా దగ్గరగా ఉండండి⇒ డైపర్ మార్చడం నుంచి నిద్రపుచ్చడం వరకు బాధ్యత పంచుకోండి⇒ రోజుకు కొంత సమయం పూర్తిగా బిడ్డతో గడపండి⇒ చిన్న చిన్న మూమెంట్స్‌ను ఎంజాయ్ చేయండి⇒ బిడ్డతో మాట్లాడండి... వాళ్లు చిన్నవాళ్లైనా మీ గొంతు గుర్తుపడతారు⇒ అమ్మకు కూడా విశ్రాంతి ఇచ్చే పార్ట్నర్గా ఉండండి⇒ తప్పులు చేసినా భయపడకుండా నేర్చుకుంటూ వెళ్లండి⇒ ఫొటోలు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేయండి⇒ బిడ్డ ముందు ప్రేమగా, ఓపికగా ఉండండి⇒ ‘పర్ఫెక్ట్ నాన్న’ అవ్వాలని కాదు... ‘ప్రెజెంట్ నాన్న’ అవ్వాలని ప్రయత్నించండిఎందుకంటే పిల్లలకు ఖరీదైన బహుమతులు గుర్తుండకపోవచ్చు... కానీ చిన్నప్పుడు నాన్న చేతిలో నిద్రపోయిన ఆ భద్రతా భావం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది!లోకంలో అమ్మ ప్రేమకు గుడులు ఉంటే, నాన్న ప్రేమ ఒక నిశ్శబ్ద గోపురంలా ఇంటిని కాపాడుతూ నిలబడుతుంది. ఈ ఫాదర్స్ డే రోజున ఆ సైలెంట్ సూపర్ హీరోకి ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పండి, ఆయన ఆశించే అతిపెద్ద జీతం మీ నోటి నుంచి వచ్చే ఆ ఒక్క మాటే! ‘ఐ లవ్ యూ నాన్న’.∙కొండి దీపిక -
సముద్రంలో డేటా సెంటర్!
ఏఐ వాడకం పెరుగుతున్న కొద్ది డేటా సెంటర్ల అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఉన్న డేటా సెంటర్లు నగరాల్లోనే ఉన్నాయి. డేటా సెంటర్లలోని సర్వర్ల నిర్వహణ కోసం విపరీతంగా విద్యుత్తు, నీరు అవసరం ఉంటుంది. నగరాల్లో వీటిని నిర్వహించడం వల్ల విద్యుత్తుకు, నీటికి కొరత ఏర్పడటమే కాకుండా, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని ఇప్పటికే పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమస్యలేవీ లేకుండా, నగరాలపై ఒత్తిడి లేకుండా డేటా సెంటర్లను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు అమెరికన్ కంపెనీ ‘నాటిలస్ డేటా టెక్నాలజీస్’ సహా పలు బడా కంపెనీలు, కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. సముద్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సముద్ర తరంగాల ద్వారానే విద్యుత్తును పొందవచ్చని, సముద్ర జలాలను శుద్ధిచేసి డేటా సెంటర్ల నిర్వహణ కోసం వాడుకోవచ్చని భావిస్తున్నాయి. -
అదే నా ఐడెంటిటీ!
విలన్ పాత్రైనా సరే, తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల దృష్టి అంతా ఆమెపైనే! హీరోయిన్ ఇమేజ్ కంటే నటిగా గుర్తింపు ముఖ్యమని నమ్మే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. కెరీర్, వ్యక్తిత్వం, ఇష్టాలు, జీవిత తత్త్వం గురించి ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే!స్టార్ కిడ్ అయినా కష్టపడాల్సిందే!స్టార్ కిడ్ని కాబట్టి నాకు అన్నీ ఈజీగా వచ్చేశాయని చాలామంది అనుకుంటారు. కానీ మా కుటుంబం నన్ను రెడీమేడ్ పీఠంపై కూర్చోబెట్టలేదు. ముందు చదువు పూర్తి చేయాలని నాన్న చెప్పారు. అందుకే బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసి, ఆ తర్వాతే కెమెరా ముందుకు వచ్చాను. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వచ్చింది.విలన్ గా ఉండటంలోనే కిక్!నెగటివ్, అథారిటేటివ్ పాత్రలు చేయడం మొదలుపెట్టినప్పుడు ‘నీ హీరోయిన్ ఇమేజ్ పాడైపోతుంది’ అని చాలామంది హెచ్చరించారు. కానీ నాకు అలాంటి పాత్రల్లోనే అసలైన చాలెంజ్ కనిపించింది. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలు నటిగా నా సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఇస్తాయి.నచ్చకపోతే చెప్పేస్తా!నేను చాలా విషయాల్లో ఓపెన్ గా మాట్లాడతాను. తప్పు అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఆ కారణంగా కొన్ని సినిమా అవకాశాలు కూడా కోల్పోయాను. కానీ నా ఆత్మగౌరవం, విలువల విషయంలో రాజీ పడలేను. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతంగా ఉంటాను.గట్టిగా నవ్వుతా.. అదే నేను!నేను చాలా లౌడ్, చాలా ఎక్స్‌ప్రెసివ్! జోక్స్ వేయడం, నవ్వుకోవడం అంటే భలే ఇష్టం. హీరోయిన్లు అంటే చాలా సైలెంట్‌గా, సాఫ్ట్‌గా ఉండాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ నేను అలాంటిదాన్ని కాదు. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నటన కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని నమ్ముతాను.ట్రోల్స్‌కి టైమ్ లేదు!ప్రజలు పూర్తి విషయం తెలియకుండానే కామెంట్స్ చేస్తుంటారు. నికోలాయ్ సచ్దేవ్తో నా వివాహం తర్వాత కూడా ఎన్నో కామెంట్స్ చూశాను. కానీ అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. కాబట్టి మన సంతోషం మీదే ఫోకస్ చేయాలి.నా నాన్ వెజ్ ప్రేమకు హద్దులే లేవు!మా ఇంట్లో అందరూ ఫుడ్ లవర్స్. నేను కూడా. పీతలు, చేపలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రెడ్ స్నాపర్ చేప నా ఫేవరెట్. బిర్యానీ, మండీ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అయితే ఒక ట్విస్ట్ ఉంది. నాకు స్పైసీ ఫుడ్ అస్సలు పడదు! ఎంత మంచి కబాబ్ అయినా తక్కువ మసాలాతోనే తినాలి.ప్రభాస్‌కి స్పెషల్ ఫ్యాన్ గర్ల్!ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. ఆయన సింప్లిసిటీ మరింత ఆకట్టుకుంటుంది. ఇక నా జీవితంలో మొదటి హీరో మాత్రం మా నాన్న శరత్‌కుమారే. ఆయన క్రమశిక్షణ, అంకితభావం ఇప్పటికీ నాకు స్ఫూర్తి. -
ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకే..
ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్ నిజంగానే ఫ్యూచర్ వైబ్స్ ఇస్తాయి!చేతికి కట్టుకునే స్పేస్ ల్యాబ్! మీ మణికట్టుపై టైమ్ మాత్రమే కాదు, ఒక చిన్న అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ‘నాసా ఆర్టెమిస్ వాచ్ 2.0!’ చంద్రయాన్ కలలు కనే టెక్నాలజీ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ వంటి సెన్సర్లతో మీ రోజువారీ కదలికలను ట్రాక్ చేయవచ్చు. అయితే దీని అసలు ప్రత్యేకత వేరే! ఈ వాచ్‌ను మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొత్త వాచ్ ఫేస్‌లు డిజైన్ చేయడం, చిన్న చిన్న ఆటలు తయారు చేయడం, మీ సొంత యాప్‌లను రూపొందించడం కూడా సాధ్యమే. టెక్నాలజీని సరదాగా నేర్చుకోవాలనుకునే పిల్లలకు, యువతకు ఇది ఒక మినీ లెర్నింగ్ ల్యాబ్‌లా పనిచేస్తుంది. ధర రూ. 10,700.మాట్లాడే బుజ్జి రోబో! కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీస్ టేబుల్‌పై కూర్చుని పని చేస్తున్నప్పుడు మీతో కబుర్లు చెప్పే ఓ చిన్న ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఫ్యూచరిస్టిక్ ఫన్ ను తీసుకొచ్చే గాడ్జెట్ ఇదే. ఏఐ వాయిస్ ఇంటరాక్షన్ కంపానియన్ రోబో! చూడటానికి చిన్న బొమ్మలా కనిపించినా, ఇందులో ఉన్న స్మార్ట్ వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్‌తో మీ మాటలకు స్పందిస్తూ సరదాగా ఇంటరాక్ట్ అవుతుంది. దీని చిన్న డిస్ప్లేలో కనిపించే క్యూట్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఇది నిజంగానే ఎమోషన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతూ, టేబుల్‌పై కూర్చున్న చిన్న డిజిటల్ పెట్లా ఫీల్ ఇస్తుంది. మాగ్నెటిక్ మౌంట్‌కు సపోర్ట్ ఉండటంతో కార్ డ్యాష్‌బోర్డ్‌పై సులభంగా అమర్చుకోవచ్చు. ధర రూ. 18,000.మెడలోనే చిన్న ఏసీ, చిన్న హీటర్!వేçసవిలో ఎండలు మండిపోతుంటే ‘చల్లని గాలి తగిలితే బాగుండు!’ అనిపిస్తుందా? లేదా చలికాలంలో ‘కొంచెం వెచ్చదనం ఉంటే చాలు!’ అని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ వేరబుల్ కూలింగ్–హీటింగ్ పరికరం!ఇది కేవలం ఒక గాడ్జెట్ కాదు, మీ వ్యక్తిగత ఉష్ణోగ్రత నియంత్రణ సాధనం. మెడకు వేసుకునే పట్టీతో దీనిని మెడకు లేదా ఛాతీ దగ్గర ధరించవచ్చు. అవసరాన్ని బట్టి ఇందులో ఉన్న మూడు చల్లదనం స్థాయులు, మూడు వెచ్చదనం స్థాయులు ఎంచుకుని క్షణాల్లో మీకు కావాల్సిన సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో లేదా బయట తిరిగేటప్పుడు కూడా ఇది మీతో పాటు ఉంటుంది. చిన్న సైజులో ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. స్టీల్, సిలికాన్ తో తయారైన దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ధర రూ. 16,760. -
ది డివోర్స్
ఆరోజు వాట్సప్‌లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్ నుంచి వచ్చిన నోటీస్. కారణం ఇన్ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా ఆ నోటీస్‌ని పంపాడని ఆమె మథనపడసాగింది. అది ఆమెకి నమ్మశక్యంగా లేదు. తల్లికి మైనర్ సర్జరీ జరుగుతూంటే తను వారం క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె దాన్ని తన తండ్రికి ఫార్వర్డ్ చేసింది. పావుగంట తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కంగారుగా అడిగాడు. ‘‘ఏమిటిది బేబీ విచిత్రంగా?’’ ‘‘అవును. నాకూ చిత్రంగానే ఉంది.’’‘‘ఇన్ కంపాటిబిలిటీ అంటే ఏమిటో అతగాడికి ఫోన్ చేసి కనుక్కో.’’ ఆయన కోపంగా చెప్పాడు.‘‘నేను కనుక్కోను. ఇలాంటి విషయాల్లో ముందు నాతో సంప్రదించడం మర్యాద. అతను ఆ మర్యాదని నిలబెట్టుకోలేదు.’’ ఆమె కఠినంగా చెప్పింది. ‘‘నేను కనుక్కుంటాను. మీ మధ్య పోట్లాటేదైనా జరిగిందా?’’ ఆయన అడిగాడు.‘‘వచ్చే ముందు చిన్న పోట్లాట జరిగింది. ఇల్లు కట్టుకుంటానంటే నాతో చెప్పకుండా తన తమ్ముడికి ఐదు లక్షలు పంపాడు. నేను నెలకి ఎంత చొప్పున ఎంతకాలంలో తిరిగి ఇవ్వాలో షెడ్యూల్ కూడా పంపమని సలహా ఇచ్చాను. తన తమ్ముడికి అప్పు ఇవ్వలేదని, బహుమతి ఇచ్చానని చెప్పాడు. క్రితం నెలలోనే తల్లి పుట్టినరోజుకి ఏభై వేలు పెట్టి పట్టుచీర కొన్నాడు. నేను పదివేల చీర సరిపోదా అని అడిగాను.’’‘‘రేపు పిల్లలు పుడితే అతనికే జాగ్రత్త వస్తుంది.’’ ఆయన చెప్పాడు. ‘‘లేదు. లేదు. రాదు. ఆ మనిషికి తన వాళ్ళంటే ప్రేమ. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంత దాకా పాతిక లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. ఇంకో పాతిక వేసుకుంటే మన ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేది. నెలకి రెండున్నర వేలైనా అద్దె వచ్చేది.’’‘‘ఫైనాన్స్ కాక ఈమధ్య ఇంకేమైనా పొరపొచ్చాలు ఉన్నాయా?’’ ‘‘లేవు. మా అత్తమామలు వచ్చి మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మా మామగారి డామినేషన్ భరించలేను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పూట ఏది వండాలి, ఇలా అన్నీ ఆయన శాసించినట్లే జరగాలి.’’ ‘‘అవును. పెళ్ళిలోనే అది గమనించాను.’’ అరగంట తర్వాత ఆయన కూతురికి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మాట్లాడానమ్మా. కారణం ఇదని స్పష్టంగా చెప్పలేదు. ‘మోస్ట్ ఇన్‌కంపాటిబుల్ వైఫ్‌తో జీవించలేను’ అన్నాడు. ‘మా నాన్న కోతా కాఫీ పౌడర్ని కొనమంటే బ్రూక్‌బాండ్ కొన్నది లాంటి అన్నీ సిల్లీ కారణాలే. అతని మనసులో అసలు కారణం ఏదో ఉంది. అది దాస్తున్నాడు. అతను ఇంకెవరితోనైనా క్లోజ్‌గా ఉండటం నీకు తెలుసా?’’‘‘లేదు. నాకా అనుమానమే లేదు. అతను అలాంటివాడు కాదు. నేనంటే చాలా చాలా ప్రేమ నాన్నగారు.’’కూతురి కంఠంలోని దుఃఖాన్ని ఆయన పసిగట్టాడు.‘‘నేను వీకెండ్‌కి వచ్చి పర్సనల్‌గా మాట్లాడతానని చెప్పాను. ‘మాది ప్రేమ వివాహం. మీ ప్రమేయంతో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీ ప్రమేయం వద్దు’ అన్నాడు. రాజీమార్గాలన్నీ ఖండించాడు. నాకు అంతా అయోమయంగా ఉంది.’’ ఆయన బాధగా చెప్పాడు. ఆయన భార్య మాత్రం తొణకలేదు. కూతురికి ధైర్యం చెప్తూ చెప్పింది.‘‘ఈరోజుల్లో విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం చాలా మామూలు. మీకు పిల్లల కూడా లేరు. కాబట్టి మళ్ళీ పెళ్ళి తేలిక. ఈ కాలం పిల్లలు జీవితాన్ని వృథా చేసుకోవడం లేదు. నీకు వచ్చే జీతం తక్కువేం కాదు. తన మీద నువ్వు ఆధారపడి లేవు. ’’బయటకి చెప్పకపోయినా ఆవిడ మనసులో బాధగానే ఉంది.‘‘ఏం జవాబు చెప్పావు? లాయర్ నోటీస్ వస్తే మనం జవాబు ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లు అవుతుంది అని విన్నాను.’’ ఆవిడ అడిగింది. ‘‘అతను కచ్చితంగా డైవర్స్ కోరుకుంటే నేను అతన్ని పట్టుకుని వేలాడను. మళ్ళీ లాయర్ ఖర్చు కూడా ఎందుకు? కామ్‌గా ఉందాం. ఇదే ఫైనల్ డెసిషన్.’’తల్లిదండ్రులకి కూతురు సంగతి తెలుసు కాబట్టి ఆమె మనసు మార్చటానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఆమె విపుల్ నుంచి వ్యక్తిగత మెసేజ్ కోసం ఎదురు చూసింది. కాని రాలేదు. రెండు వారాల తర్వాత కోర్ట్ నించి విడాకుల కేసుకి నోటీస్ వచ్చింది. అప్పటికే అందుకు సిద్ధపడ్డ ఆమె విచారించలేదు. వరసగా మూడు వాయిదాలకి సమన్ వచ్చినా ఆమె కోర్ట్‌కి హాజరు కాలేదు.∙∙ విపుల్ నుంచి ఆమెకి ఓ రోజు మెసేజ్ వచ్చింది. ‘ఇప్పుడే విడాకులు మంజూరయ్యాయి. ఎందుకో నీకు చెప్పాలి. ఐ లవ్ యు. అందులో మార్పు లేదు. మరి ఈ విడాకులు దేనికి? నేను మరణించాక నా ఆస్తి, పి.ఎఫ్. బెనిఫిట్స్ నా తల్లితండ్రులకి అందడానికి. భార్యగా నువ్వు హక్కుగా అవి వాళ్ళకి వెళ్ళకుండా కోర్ట్‌కి ఎక్కుతావని నాకు తెలుసు. వాళ్ళు ఆస్తిని పోగొట్టుకుంటారు తప్ప నీతో కోర్ట్‌లో ఫైట్ చేయరు. దాన్ని నివారించడానికి విడాకులని ఎన్నుకున్నాను. నీకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. నువ్వు నామీద ఆధారపడిలేవు. నీ ఉద్యోగం, నీ ఆస్తి నీకు ఉన్నాయి. ఆరు నెలల తర్వాత నేను నీకు, నా తల్లిదండ్రులకి, అసలు ప్రపంచానికే కనిపించను. ఫోర్త్ స్టేజిలోని నా కేన్సర్ ఐదారు నెలలు మించి నన్ను బతకనివ్వదని డాక్టర్ చెప్పాడు. గెట్ మేరీడ్ డార్లింగ్. ఐ లవ్ యు అండ్ గుడ్‌లక్.’’ మల్లాది వెంకట కృష్ణమూర్తి(చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
అపకారికి ఉపకారం: మర్యాదగా తలుపు తీస్తావా లేదా?
శేషాచలం అడవుల్లో ఒక ఋషి ఎంతోకాలంగా ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆయన ఆ అడవుల్లో వుండే ఆదివాసీలకు మూలికా వైద్యం చేస్తూ, వాళ్లకు, వాళ్ళ పిల్లలకు పురాణాలు, నీతి కథలు చెబుతూ అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. ఒక రోజు రాత్రి ఎవరో ఆశ్రమం తలుపు దబదబ బాదుతూ వుంటే నిద్రాభంగం అయింది ఋషికి.‘‘ఎవరు నాయనా వచ్చింది? ఈ సమయంలో పరాయి మనుషులకు ఆశ్రమంలోకి ప్రవేశం లేదు!’’ అన్నాడు ఋషి లేచి కూర్చుంటూ. ‘‘ముందు తలుపు తీయరా ముసలాడా! నేను గజదొంగ గంగులుని!’’ అన్న భీకరమైన మాటలు వినబడ్డాయి.‘‘నువ్వు దొంగవైనా, జమీందారువైనా, ఈ సమయంలో ఆశ్రమంలోకి రాకూడదు నాయనా! అది ఆశ్రమ నియమం.’’ అని సౌమ్యంగా అన్నాడు ఋషి.‘‘నువ్వు తలుపు తీయకపోతే నేను తలుపు బద్దలు కొట్టి వస్తాను. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? నువ్వు మంచి మాటలతో తలుపు తీసేలా లేవు!’’ అంటూ, తలుపు బద్దలు కొట్టడానికి పెద్ద రాయి కోసం వెతుకుతూ, దబ్బుమంటూ ఒక గోతిలో పడి పోయాడు గంగులు. గొయ్యి లోతుగా వుండటంతో వాడికి నడుం విరిగినంత పని అయింది. ‘‘చచ్చానురోయ్, దేవుడా!’’ అంటూ బాధగా అరిచాడు గంగులు.తక్షణం తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఋషి. ఆయన గోతిలో మూలుగుతున్న గంగులును చూసి, ‘‘ఎంత పని జరిగింది నాయనా! ఆశ్రమం వెనక వైపు వున్న బావి ఎండిపోవడంతో, కొందరు చెంచులు ముందు వైపు బావి తవ్వుతున్నారు. చీకట్లో నువ్వు కాలు జారి, బావిలో పడి నట్లున్నావు!’’ అంటూ ఋషి ఆశ్రమంలోకి వెళ్లి ఒక పెద్ద తాడు తీసుకు వచ్చాడు. ఆ తాడు సహాయంతో గంగులుని అతి కష్టం మీద పైకి లాగాడు ఋషి.తరువాత నడవలేకపోతున్న గంగులుని చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆశ్రమంలోకి తీసుకు వెళ్ళాడు. గంగులు గాయాలకు పసరు మందు రాసి కట్టు కట్టాడు. ఒక లోటాలో ఆవు పాలు తీసుకు వచ్చి, గంగులు చేత తాగించాడు.అప్పటి దాకా ఋషి చేస్తున్న పనులన్నీ విభ్రాంతిగా చూస్తున్న గంగులు, ‘‘ఈరోజు నాకు మహోపకారం చేశారు. మునపటి నా ప్రవర్తన మీద మీకు కోపం లేదా స్వామి?’’ అని అడిగాడు గంగులు.ఋషి నవ్వి, ‘‘ఎవరి ధర్మానికి తగినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నువ్వు దొంగలా బెదిరించావు. నేనొక ఋషిలా నీకు సేవ చేశాను అంతే!’’ అన్నాడు.‘‘ఈ సమయంలో ఎవరికీ ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పారు కదా! మరి మీరు స్వయంగా నన్ను లోపలికి ఎలా తీసుకువచ్చారు?’’ అని అడిగాడు గంగులు.‘‘ఆపదలో వున్న తోటి మనిషిని కాపాడటానికి మించిన ధర్మం ఏం వుంది? అది సరే కానీ నువ్వు ఆశ్రమం అంతా వెతికినా వన మూలికలు తప్ప మరేమీ దొరకవు’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు సిగ్గు పడి, ‘‘నా అవివేకపు ప్రవర్తనకు క్షమించండి స్వామి’’ అన్నాడు చేతులు జోడించి.గంగులుకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుని, ‘‘నీ కాబోయే భార్య ఒక దొంగకు భార్యగా, పుట్టబోయే పిల్లలు దొంగకు పుట్టిన పిల్లలుగా వుండటం నీకు గాని, నీ కుటుంబానికి గాని గౌరవంగా వుంటుందా చెప్పు! దొంగ అని తెలిస్తే చాలు, దారిన పోయేవాడు కూడా నాలుగు పిడిగుద్దులు గుద్ది, మొహం మీద వుమ్మేసి పోతాడు! డబ్బు సంపాదించడానికి ఇంత నీచమైన పని చేయాలా, ఆలోచించుకో!’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు తలదించుకుని మౌనంగా వుండి పోయాడు.‘‘చీకటి ఎంత గాఢంగా వున్నా చిరు దీపం తో దాన్ని పారదొలొచ్చు! అలాగే మనిషి మనసు ఎంత కలుషితమైపోయి వున్నా ఒక మంచి మాటతో ఆ మలినాన్ని కడిగి వేయవచ్చు! నీ జీవితం కొత్త మలుపు తిరగడానికి దొంగగా ఈ ఆశ్రమానికి వచ్చిన నువ్వు, దొరలా ఇక్కడి నుంచి వెళతావో, లేక పాత దారిలోనే నడుస్తావో నీ ఇష్టం!’’ అన్నాడు ఋషి.‘‘లేదు స్వామి, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇక జన్మలో దొంగతనం అనేది మరచి పోయి, కష్టపడి గౌరవంగా బ్రతుకుతాను’’ అంటూ ఋషికి నమస్కరించి ఆశ్రమం నుంచి బయటకు నడిచాడు గంగులు.హితవచనం.. అజ్ఞానికి, నమ్మకంలేనివాడికి, అనుమానించేవాడికి నాశనం తప్పదు వీళ్లలో అనుమానించేవాడికి ఇహపరాలలో సుఖం ఎక్కడా ఉండదు. - మాచిరాజు కామేశ్వర రావు -
అవును! దివి నుంచి దివ్యౌషధాలు రాబోతున్నాయి!
మనకు జ్వరం వచ్చినా, జలుబు చేసినా మెడికల్ షాప్‌కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కుంటాం. ఈ మందులన్నీ భూమి మీద ఉండే ఫ్యాక్టరీలలో తయారవుతాయని మనకు తెలుసు. కానీ, భవిష్యత్తులో మనం వేసుకునే ప్రాణాధార మందులు ‘అంతరిక్షం’ నుండి రాబోతున్నాయి!అవును! సైన్స్, టెక్నాలజీల ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త విప్లవం రానుంది. రాకెట్లను అంతరిక్షంలోకి పంపే ప్రైవేటు కంపెనీలు, ఇప్పుడు అక్కడే మందుల ఫ్యాక్టరీలను కూడా పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉత్పత్తి చెయ్యటానికి సాధ్యం కాని కొన్ని శక్తిమంతమైన మందులను అంతరిక్షంలో ఉండే శూన్య వాతావరణంలో చాలా సులభంగా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు! వార్దా స్పేస్ ఇండస్ట్రీస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అయితే ఏకంగా అంతరిక్షంలోనే ఒక ల్యాబ్‌ని ఏర్పాటు చేసి ప్రయోగాలు మొదలుపెట్టేసింది. వ్యోమగాముల సహాయం కూడా లేకుండా, కేవలం కంప్యూటర్ల ద్వారా అంతరిక్షంలో మందులు తయారు చేసి, వాటిని తిరిగి భూమి మీదకు భద్రంగా తీసుకొచ్చే ఈ సరికొత్త టెక్నాలజీ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.అణువుల్లోనే అసలు కీలకంవ్యోమనౌకలు పరిభ్రమించే భూ కక్ష్యలో మందులపై ప్రయోగాలు చేయడంతో పాటు, కొత్త ఔషధాలను తయారు చేయడం కోసం వార్దా స్పేస్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా నిజరూపం దాల్చుతున్నాయి. అందులో కనుక వారు సఫలమైతే, కొత్త మందుల తయారీలో ఇదొక విప్లవాత్మక అడుగు అవుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రంగా సాగే సరికొత్త ఉత్పత్తి రంగానికి ఇది నాంది పలుకుతుంది. అరుదైన శ్వాసకోశ వ్యాధులకు చికిత్సలు అందించడంలో, అవయవ మార్పిడి రంగంలో పేర్గాంచిన ‘యునైటెడ్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్ కంపెనీతో తాము చేతులు కలిపినట్లు వార్దా సంస్థ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ కౌంటీకి చెందిన ‘వార్దా’ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలోకి చిన్న ‘ప్రయోగ పరికరాల పెట్టెలను’ (పేలోడ్స్) పంపుతోంది. కేవలం అంతరిక్షంలోని గురుత్వాకర్షణ లేని స్థితిలో మాత్రమే చేయగల కొన్ని ఆటోమేటెడ్ ప్రయోగాల సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం వార్దా పరిశోధకులు ఈ పని చేస్తున్నారు. ‘ఆటోమేటెడ్’ అంటే కంప్యూటర్లు, రోబోలు లేదా ముందే సెట్ చేసి పెట్టిన మిషన్ల ద్వారా వాటికవే పనిచేయటం! యాంటీబయాటిక్స్ నుండి కార్టికోస్టెరాయిడ్స్ వరకు మనం వాడే రకరకాల మందులకు మూలాధారమైన కొన్ని రకాల చిన్న అణువులను మార్చటం కూడా ప్రయోగాలలో భాగంగా ఉన్నాయి.‘‘ఆశ్చర్యకరంగా, ఇలాంటి చిన్న అణువుల ప్రయోగాలకు అంతరిక్షం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతరిక్షంలో వీటితో సరికొత్త స్ఫటిక విత్తనాలను (క్రిస్టల్ సీడ్స్) తయారు చేసి, వాటిని తిరిగి భూమిపైకి తీసుకురావచ్చు’’ అని వార్దా సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మైకేల్ రీలీ అంటున్నారు.సెలైన్‌కు బదులు ‘షాట్స్’!యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థ ప్రాథమికంగా తన చిన్న అణువుల మందులను వార్దా సాంకేతికత ద్వారా అంతరిక్షంలో పరీక్షించబోతోంది. అయితే భవిష్యత్తులో ఈ సాంకేతికత కేవలం ఆ కంపెనీ మందులకే పరిమితం కాకుండా, ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ వంటి ఇతర బయోటెక్నాలజీ మందులకు కూడా ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతున్నారు. దీనివల్ల ప్రస్తుతం హాస్పిటల్లో నరాల ద్వారా సెలైన్ బాటిల్‌తో ఇచ్చే ఇంజెక్షన్లను, భవిష్యత్తులో చర్మం కింద సులభంగా ఇచ్చే చిన్న సూదులు (సబ్‌క్యుటేనియస్ షాట్స్) గా మార్చవచ్చు.భూమిపై ఏమాత్రం సాధ్యం కాని పరిస్థితులలో, అంతరిక్ష వాతావరణాన్ని ఉపయోగించుకుని ఔషధాలకు అవసరమైన స్పటికాలను తయారు చేయడమే వార్దా కంపెనీ ముఖ్య ఉద్దేశం. ‘‘అంతరిక్షంలో మనం భూమి కంటే పెద్దవిగా, ఎటువంటి లోపాలు లేనివిగా, ఒకే పరిమాణంలో ఉండే స్ఫటికాలను తయారు చేయవచ్చు’’ అని యూఎస్‌లోని బట్లర్ యూనివర్సిటీ రసాయన శాస్త్రవేత్త యాన్ విల్సన్ చెబుతున్నారు. ఆమె గతంలో అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) కోసం ప్రయోగాలు రూపొందించారు.అంతరిక్షంలో ప్రత్యేకమైన భౌతిక నిర్మాణాలు గల స్పటికాలను సృష్టించవచ్చని యాన్ నిర్థారించారు. ‘‘ఇటువంటి ప్రయోగాల ద్వారా అత్యంత విలువైన గుణాలు కలిగిన మందులను తయారు చేయటం నిస్సందేహంగా సాధ్యమౌతుంది. ఉదాహరణకు, ఒక మందును శరీరంలో త్వరగా కరిగేలా చేయడం ద్వారా, రోగి తక్కువ డోసులు వేసుకుంటే సరిపోయేలా చేయవచ్చు. దీనివల్ల మందుల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది’’ అని విల్సన్ వివరించారు.‘పెంటగాన్’ సహకారం!అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడానికి వార్దా సంస్థ కేవలం మందుల ప్రయోగాలే కాకుండా, అమెరికా రక్షణ శాఖకు (పెంటగాన్) సంబంధించిన కొన్ని రక్షణ ప్రయోగాల పరికరాలను కూడా వారి ఆర్థిక సహాయంతో అంతరిక్షానికి తీసుకెళుతున్నట్లు వార్దా చీఫ్ రీలీ వెల్లడించారు. ఎలాన్ మస్క్ ‘స్పేస్–ఎక్స్’ సంస్థ తయారు చేసిన ‘మళ్లీ మళ్లీ వాడగలిగే రాకెట్ల’ (రీయూజబుల్ రాకెట్ల)వల్ల గత పదేళ్లలో అంతరిక్షంలోకి వస్తువులను పంపే ఖర్చు తగ్గినప్పటికీ, అది ఇప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారమే. అందుకే వార్దా, ఇతర అంతరిక్ష కంపెనీలు నిరంతరం పెంటగాన్ వంటి కొత్త కస్టమర్ల కోసం వెతుకుతూనే ఉంటాయి. నిజానికి వార్దా కంటే కూడా ‘అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ’ను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఫార్మా రంగమే అత్యంత ఆసక్తిగా ఉంది. ‘‘ఎందుకంటే మందుల మార్కెట్ చాలా పెద్దది. ఇక మందుల తయారీకి అవసరమయ్యే ముఖ్యమైన రసాయన పదార్థాల బరువు చాలా తక్కువగా ఉంటుంది’’ అని ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని పరిశోధించే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు మాథ్యూ వీంజియర్ల్ అంటారు.త్వరలో కొత్త ఐ.ఎస్.ఎస్.లుచాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు భూకక్ష్యలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనాకు చెందిన ‘తియాంగాంగ్’ పరిశోధనా కేంద్రాలకు తమ ప్రయోగాల పరికరాలను పంపుతున్నారు. కానీ, వ్యోమగాముల సహాయం అవసరం లేకుండా, ఆటోమేటిక్‌గా అంతరిక్షంలో ప్రయోగాలు జరిపించే సామర్థ్యం ప్రస్తుతం కేవలం వార్దా, స్పేస్–ఎక్స్ కంపెనీలకు మాత్రమే ఉందని రీలీ తెలిపారు.ఇక 2030లో కాల పరిమితి తీరబోతున్న ఐ.ఎస్.ఎస్. స్థానంలో సరికొత్త ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్నది కమర్షియల్ స్పేస్ స్టేషన్ల యుగం కాబట్టి మరిన్ని కొత్త టెక్నాలజీలు రావచ్చు. ఉదాహరణకు, ‘స్పేస్ టాంగో’, ‘వాయేజర్ టెక్నాలజీస్’ వంటి కంపెనీలు అంతరిక్షంలో ప్రయోగాలు చేసుకోవడానికి ప్లగ్–అండ్–ప్లే (సులభంగా వాడుకోగలిగే) సేవలను ఇప్పటికే అందిస్తున్నాయి. వాయేజర్ టెక్నాలజీస్ సంస్థ ‘స్టార్లాబ్’ పేరుతో ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఈ కొత్త ప్రాజెక్టులన్నీ ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నాయని వీంజియర్ల్ తెలిపారు. మరోవైపు వార్దా సంస్థ కూడా మరిన్ని కొత్త భాగస్వామ్యాల కోసం, అలాగే ప్రయోగాల వేగాన్ని పెంచడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి చేసే ప్రయోగాలను, భవిష్యత్తులో రెండు నెలలకు ఒకసారి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కదిలే స్పేస్ ఫ్యాక్టరీవార్దా సంస్థ తను రూపకల్పన చేసిన అంతరిక్ష మందుల ల్యాబ్‌కు ‘వినెబాగో’ అని నామకరణం చేసింది. ఇది దాదాపు 300 కిలోగ్రాముల బరువున్న ఒక శాటిలైట్. రాకెట్ ద్వారా దీనిని అంతరిక్ష కక్ష్యలోకి చేరిన తర్వాత, ఈ వినెబాగో తన సొంత ఇంధన ఇంజిన్ సహాయంతో సరైన దిశలోకి మారుతుంది. ఈ శాటిలైట్ లోపల ప్రయోగాలు చేయడానికి ఒక చిన్న క్యాప్సూల్ (పెట్టె వంటి నిర్మాణం) ఉంటుంది. కాగా, ‘వినెబాగో’ అనే మాటను వార్దా, అమెరికాలో ప్రసిద్ధి చెందిన ‘వినెబోగో మోటార్హోమ్స్’ అనే పేరు నుండి స్వీకరించింది. వినెబాగో మోటార్హోమ్స్ అనేవి ప్రయాణించే ఇళ్లలాగే అన్ని వసతులను కలిగి ఉంటాయి. వార్దా కూడా ‘కదిలే స్పేస్ ఫ్యాక్టరీ’ అనే అర్థంలో వినెబాగో పేరును తన స్పేస్ ల్యాబ్‌కు పెట్టుకుంది. ఆ ల్యాబ్‌లో ప్రయోగాలు పూర్తయిన తర్వాత, ఆ క్యాప్సూల్ గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చివరకు పారాషూట్ సహాయంతో ఆస్ట్రేలియాలోని నిర్జన ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. ఇంతకు మించి, మరే వివరాలూ వార్దా ఇప్పటికైతే వెల్లడించలేదు.2024లో ఈ కంపెనీ తయారుచేసిన మొదటి నమూనా క్యాప్సూల్‌ను అమెరికాలోని ఉటా ఎడారిలో దించాలని ప్లాన్ చేశారు. కానీ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మొదట్లో అనుమతి నిరాకరించడం వల్ల అది భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాలో ల్యాండ్ చేస్తున్నారు.గేమ్ ఆఫ్ ఛాన్స్?! అంతరిక్షంలో మందుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది చాలా రిస్క్‌తో కూడుకున్న పని అని న్యూజెర్సీలోని రోవాన్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్ గెరార్డ్ కాపెల్లాడెస్ అంటున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి ఈ ప్రయోగాలలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని అర్థమౌతోంది.మొదటిది, పరిమాణం సమస్య. అంతరిక్షంలో పెంచిన స్పటికాలను విత్తనాలుగా ఉపయోగించి, వాటి సహాయంతో భూమిపై పెద్ద ఎత్తున మందులను తయారు చేయడానికి పరిశోధకులు ప్రయత్నించాలి. లేదా ఫార్మా రంగం వెలుపల ఉండే ఇతర అత్యంత విలువైన రంగాల కోసం ఒకే ఒక పరిపూర్ణమైన స్ఫటికాన్ని వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. ఇది ఎందుకు సవాలు అవుతుందంటే, అంతరిక్షంలోకి భారీ ఫ్యాక్టరీ సామగ్రిని పంపలేం. రాకెట్లలో చాలా తక్కువ బరువులను, చిన్న పెట్టెలను మాత్రమే పంపగలం. ల్యాబులో గ్రాముల లెక్కన మందులు తయారు చేయటం తేలికే. కానీ ప్రపంచంలో ఉన్న రోగులందరికీ సరిపడా కిలోలు, లేదా టన్నుల కొద్దీ మందులు అంతరిక్షంలో తయారు చేయటం ప్రస్తుతానికైతే కష్టం.రెండవది, ప్రయోగం జరిగే వాతావరణాన్ని మన అధీనంలో ఉంచుకోవడం చాలా కష్టం. తక్కువ ఖర్చుతో, అనుకున్న సమయానికి కచ్చితమైన స్ఫటిక నిర్మాణాన్ని సాధిస్తామని గ్యారంటీ ఇవ్వడం చాలా కష్టం. ఈ ప్రయోగాలను ఆయన ఒక ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’గా అభివర్ణించారు. అంటే అంతా అదృష్టంపై ఆధారపడి ఉందని! ‘‘ఒకే రకమైన వాతావరణం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్ఫటికం ఏర్పడటానికి కేవలం నిమిషాల సమయం పడుతుంది, మరికొన్నిసార్లు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు’’ అని గెరార్డ్ అంటారు. అయితే, భవిష్యత్తులో దీని ఖర్చులు తగ్గుతాయని, ఈ ప్రయోగాలను కొనసాగించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.ఫార్మారంగం నక్కను తొక్కినట్లే!వార్దా, యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థల భాగస్వామ్యం విజయవంతమై, ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలని వీంజియర్ల్ ఆశిస్తున్నారు. ఇది గనుక సఫలమైతే, ఒక డోమినో ఎఫెక్ట్ (ఒకదాని వెనుక ఒకటిగా జరిగే మార్పు)ను సృష్టిస్తుంది. అంటే, దీనిని చూసి భవిష్యత్తులో మరిన్ని ఫార్మా కంపెనీలు అంతరిక్ష సంస్థలతో జతకడతాయి. ‘‘ఈ భాగస్వామ్యం ద్వారా మార్కెట్లో సూపర్ హిట్ అయ్యే ఒకటి రెండు మందులు గనుక తయారైతే, అది అంతరిక్షంలో పెద్ద ఎత్తున లాభసాటి వ్యాపారాలు చేయడానికి ఫార్మా రంగానికి ఒక అద్భుతమైన బాటలు వేస్తుంది’’ అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.వీంజియర్ల్ ఆశాభావాన్ని బట్టి భూమిపై నయం చేయలేని ఎన్నో రోగాలకు అంతరిక్షం వేదికగా తక్కువ ఖర్చుతో కూడిన, మరింత శక్తిమంతమైన మందులు అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్‌ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్‌ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
దానవులకు శుక్రాచార్యుని శాపం!
దానవులకు శుక్రాచార్యుని శాపందేవ దానవ యుద్ధంలో దానవులు ఓటమి పాలయ్యారు. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం తిరిగి వచ్చింది. శుక్రాచార్యుడు దేవతల పక్షంలోకి చేరాడు. అది చూసి రాక్షసులు కలవరపడ్డారు. ‘ఆచార్యా! మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లిపోతే, మేము దిక్కుకానని వాళ్లమవుతాము’ అని మొరపెట్టుకున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల మొరను ఆలకించి, ‘ఓషధులు, మంత్రాలు నా వద్దనే ఉంటాయి. వాటిలో నాలుగో వంతు దేవతలకు చెందితే చెందవచ్చుగాక. మిగిలిన సర్వస్వాన్నీ మీకు ఇస్తాను’ అని వారికి చెప్పాడు.దేవతలు ఈ రహస్యాన్ని తెలుసుకుని, కనిపించిన రాక్షసులనల్లా తుదముట్టించడం ప్రారంభించారు. రాక్షసులు శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నారు. శుక్రుడు దేవతల వద్దకు వెళ్లి, ‘పన్నెండు సంగ్రామాలలో రాక్షసులు ఎందరో హతులయ్యారు. ఇకనైనా మీరు పగను విడిచిపెట్టి, మిగిలిన రాక్షసులను బతకనివ్వండి’ అని చెప్పాడు.తర్వాత రాక్షసులతో రహస్యంగా సమావేశమై, ‘నేను శంకరుడి గురించి తపస్సు చేసి, మంత్రశక్తులను సంపాదించుకుని వస్తాను. అప్పుడు మీకు జయం కలుగుతుంది. అప్పటి వరకు నా తండ్రి భృగు మహర్షి ఆశ్రమంలో మీరంతా తలదాచుకోండి’ అని చెప్పి, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లాడు.శుక్రాచార్యుడు తపస్సు చేస్తుండగా, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ‘శుక్రా! నువ్వు తలకిందులుగా తపస్సు చేయి. అప్పుడే నీకు మంత్రాలన్నీ వశమవుతాయి’ అని చెప్పాడు.శుక్రాచార్యుడు ఘోరనిష్ఠతో శంకరుడు చెప్పిన ప్రకారమే తలకిందులుగా ఒక చెట్టుకు వేలాడుతూ తపస్సు చేయడం ప్రారంభించాడు.శుక్రుడు తపస్సు చేస్తున్న సంగతి తెలుసుకున్న దేవతలు రాక్షసుల మీదకు దండయాత్రకు బయలుదేరారు. దిక్కుతోచని రాక్షసులంతా శుక్రాచార్యుడి తల్లిని శరణు కోరారు.‘భయపడకండి. మీరు నా వద్దనే ఉండండి. మీకు ఏ భయం ఉండదు’ అని ఆమె అభయమిచ్చింది.అయినా, దేవతలు రాక్షసులను తరుముతూ వారిని పీడించసాగారు.దేవతల దుశ్చర్యకు కుపితురాలైన శుక్రమాత ‘మూర్ఖులారా! ఇంద్రుడితో సహా మిమ్మల్నందరినీ మట్టుపెట్టగలను’ అని హెచ్చరించి, తన యోగశక్తితో ఇంద్రుడి కాళ్లు చేతులు పనిచేయకుండా స్తంభింపజేసింది. ఇంద్రుడి పరిస్థితి చూసి, దేవతలు పరుగులు తీశారు. విష్ణువు తనలో ప్రవేశించమని ఇంద్రుడికి చెప్పాడు. శుక్రమాత ‘నిన్ను కూడా దహించివేస్తాను’ అని విష్ణువును హెచ్చరించింది. ఆమె శక్తిని తట్టుకోవడం దుస్సాధ్యమని తలచిన విష్ణువు, స్త్రీవధ కూడదని తెలిసినా, కత్తి దూసి ఆమె శిరస్సును ఖండించాడు.ఇదంతా తెలిసిన భృగు మహర్షి, నువ్వు ఏడు జన్మలు మనిషిగా జన్మిస్తావు’ అని విష్ణువును శపించాడు. తన భార్య శిరస్సును మొండేనికి తగిలించి, తన తపశ్శక్తితో ఆమెను తిరిగి బతికించాడు. ఇంద్రుడు, విష్ణువు సహా దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.శుక్రుడిని ఏం చేయాలో పాలుపోని ఇంద్రుడు తన కుమార్తె జయంతిని పిలిచి, ‘కుమారీ! శుక్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నాతో సహా దేవతలంతా అతడికి భయపడుతున్నారు. నువ్వు వెళ్లి, నీ సపర్యలతో అతడిని వశం చేసుకుంటే, నాకు అంతకంటే కావలసినది లేదు. నేను నిన్ను అతడికి ఇచ్చివేస్తున్నాను’ అని చెప్పాడు.తండ్రి ఆజ్ఞ మేరకు జయంతి శుక్రుడు తపస్సు సాగిస్తున్న చోటుకు చేరుకుంది. అతడికి సపర్యలు చేస్తూ, ఏళ్ల తరబడి ఓర్పుగా ఉంది. కొన్నాళ్లకు శుక్రుడి తపస్సు ఫలించి, శంకరుడు అతడికి ప్రత్యక్షమై మంత్ర శక్తులన్నీ అనుగ్రహించాడు.అన్ని రోజూలూ తనకు సపర్యలు చేస్తూ వచ్చిన జయంతిని చూసి, శుక్రుడు ఆమె వివరాలు కనుక్కున్నాడు. ఆమె కోరిక మేరకు పాణిగ్రహణం చేసి, ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి, అదృశ్యరూపంలో ఆమెతో గడపసాగాడు. శుక్రుడు జయంతితో ఉన్న సంగతి తెలుసుకున్న దేవగురువు బృహస్పతి ఇంద్రుడి ప్రోద్బలంతో తానే శుక్రుడి రూపం దాల్చి, రాక్షసుల వద్దకు వెళ్లాడు. ఆచార్యుడు తిరిగి వచ్చినట్లు భావించిన రాక్షసులు అతడిని పూజించసాగారు.జయంతితో అప్పటికే పదేళ్లు గడిపిన శుక్రాచారుడు తన శిష్యులైన రాక్షసులతో యజ్ఞం జరిపించాలని తలచి, తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన స్థానంలో తనలా ఉన్న బృహస్పతిని రాక్షసులు సేవిస్తుండటం చూసి, పట్టరాని ఆగ్రహంతో ‘మీరు మతిభ్రష్టులై సంచరించెదరుగాక’ అని శపించాడు.అసలు సంగతి గ్రహించిన రాక్షసులు శుక్రాచార్యుని పాదాలపై పడి పరిపరి విధాలుగా ప్రార్థించడంతో అతడు కొంత శాంతించాడు. ‘ఇప్పుడు దేవతలకు అనుకూలమైన కాలం. భవిష్యత్తులో ముల్లోకాలూ తిరిగి మీ వశం కాగలవు’ అని పలికాడు.పురావిశేషం..అసుర గురుడైన శుక్రాచార్యుడికి అరుదైన ఆలయం మహారాష్ట్రలో ఉంది. పురాతనమైన ఈ ఆలయం బేట్ కోపర్‌గాంవ్ గ్రామంలో గోదావరి తీరానికి చేరువలో ఉంది. ఇక్కడ పూజలు జరిపితే శుక్రాచార్యుడి అనుగ్రహం వల్ల పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇదేచోట శుక్రాచార్యుడు శివుడి గురించి తపస్సు చేసి, మృత సంజీవని విద్య పొందాడని ప్రతీతి. ఈ ఆలయంలో శుక్రాచార్యుడికి పాయసం, కోవా మిఠాయిలు, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. - సాంఖ్యాయన -
ఈ వారం కథ: ఆగిపోయిన వాచీ!
నగరం శివార్లలోని విల్లాలో వ్యాపారవేత్త పాండురంగారావు తన బెడ్రూమ్లో రక్తం మడుగులో శవమై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ ఇ¯Œ స్పెక్టర్ అభిమన్యు తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. శవం పక్కనే పాండురంగారావు చేతి గడియారం పగిలిపోయి పడి ఉంది. ఆ వాచీ ముల్లు సరిగ్గా రాత్రి 12:00 గంటల దగ్గర ఆగిపోయింది.పాండురంగారావు భార్య గత సంవత్సరమే రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.ఇంట్లో కొత్తగా చేరిన వంటమనిషి పాండే, పనిమనిషి మంగ, తోటమాలి రంగయ్య ఆ ముగ్గురినీ విడివిడిగా విచారించాడు.పనిమనిషి మంగ వణుకుతూ, ‘‘సార్, నేను రాత్రి 11:30 నుండి ఒంటి గంట వరకు ఊరి గుడి జాతరలో ఉన్నాను. వందలమంది నన్ను చూశారు’’ అంది. అందుకు సాక్ష్యం కూడా చూపించింది.ఇక తోటమాలి రంగయ్యను విచారించగా, అతను రాత్రి 12:00 గంటల సమయంలో ఊరి సరిహద్దులో ఒక చిన్న దొంగతనం చేస్తూ లోకల్ పోలీసులకు దొరికి లాకప్‌లో ఉన్నాడని తెలిసింది.వంటమనిషి పాండే రాత్రి 9:30 గంటలకు తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.అభిమన్యుకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూశాక అనుమానం వచ్చింది. రిపోర్ట్ ప్రకారం పాండురంగారావు తిన్న ఆహారం జీర్ణమైన విధానాన్ని బట్టి హత్య రాత్రి 9:30 నుండి 10:30 మధ్య జరిగింది.అలాంటప్పుడు వాచీ ముల్లు 12 గంటలకు ఎలా ఆగిపోయింది. చనిపోయిన తర్వాత వాచీ పగిలి పడి ఉండటం ఏమిటి?‘అంటే హంతకుడు కావాలనే వాచీ ముల్లును 12 గంటలకు తిప్పి, దాన్ని పాడు చేసి ఇక్కడ పడేశాడు.’ అని అభిమన్యు గ్రహించాడు.హత్య జరిగిన ఇంట్లో పాండురంగారావు కాకుండా వున్నది ముగ్గురే! వారి గురించి విచారణ మొదలుపెట్టాడు.ఆధారాల కోసం వంటమనిషి పాండే గురించి బిహార్ పోలీసులను సంప్రదించాడు. షాకింగ్ విషయం తెలిసింది.వంటమనిషి పాండే బిహార్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ ప్రొఫెషనల్ కిల్లర్. అతని దగ్గర ఉన్న మరో ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటే, ఆ ఫోన్లో తోటమాలి రంగయ్యతో పాండే మాట్లాడిన కాల్ డేటా దొరికింది. పాండురంగారావును హత్య చేయడానికి తోటమాలి రంగయ్య కుట్ర బట్టబయలు అయ్యింది. పాండురంగారావు హత్యానేరం తన మీద రాకుండా రంగయ్య తనే స్వయంగా రాత్రి 12 గంటలకు దొంగతనం కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఎందుకంటే పోలీసుల రికార్డుల ప్రకారం రాత్రి 12 గంటల హత్య సమయానికి తను సేఫ్‌గా లాకప్‌లో ఉండవచ్చని అతనికి తెలుసు.వెంటనే రంగయ్య గురించి కూపీ లాగితే, అతను చాలాసార్లు జైలుకు వచ్చినట్టు తెలిసింది. ములాఖత్ పేరుతో ఫణిభూషణ్‌రావు అనే ఖైదీని కలిసినట్టు రికార్డ్స్‌లో బయట పడింది. అక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది.ఫణిభూషణ్‌రావు కొడుకు హరిభూషణ్ మరెవరో కాదు– ‘తోటమాలి రంగయ్య.’రంగయ్యగా పేరు మార్చుకుని, రూపురేఖలు మార్చుకుని పగ తీర్చుకోవడానికి పనిలో చేరాడు.పాండురంగారావు తన దగ్గర పనిచేసే ఫణిభూషణ్‌రావు ఆఫీస్ లెక్కలను తారుమారు చేయడంతో పోలీసులకు పట్టించి జైలుకు పంపించాడు. ఆ కసితో అతని కొడుకు హరిభూషణ్ వేసిన క్రిమినల్ ప్లాన్ ఇది.బిహార్‌కు చెందిన వంటమనిషి పాండే గదిని సోదా చేసినప్పుడు, అతని డైరీలో కొన్ని వింత సమయాలు రాసి వున్నాయి.నిజానికి భారతదేశంలో ఒకే టైమ్ జోన్ ఉన్నప్పటికీ, తూర్పు ప్రాంతమైన బిహార్‌లో సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. పాండే తన మునుపటి నేరాల్లో ఎప్పుడూ ఒక వింత అలవాటు కలిగి ఉండేవాడని అతని పాత క్రిమినల్ రికార్డుల ద్వారా తెలుసుకున్నాడు అభిమన్యుపాండే కావాలనే రాత్రి 10:00 గంటలకే పాండురంగారావును చంపి, వాచీ ముల్లును రాత్రి 12:00 గంటలకు తిప్పి, దాన్ని పాడుచేసి అక్కడ పడేశాడు. పోలీసులను రాంగ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశాడు.కానీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు సేకరించిన ఎవిడెన్స్ ముందు తలవంచి జైలుకు వెళ్ళక తప్పలేదు.తండ్రి ఫణిభూషణ్ చేసిన వ్యాపార మోసం కేసుకు కేవలం 8 ఏళ్ల జైలు శిక్ష పడితే, ఆ పగను మనసులో పెట్టుకుని, విచక్షణ మరచి, ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌తో క్రూరంగా హత్య చేయించినందుకు గాను కోర్టు హరిభూషణ్‌కు, హత్య చేసినందుకు పాండేకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. - శ్రీసుధామయిక్రైమ్ కథలకు ఆహ్వానం..ఉత్సాహవంతులైన రచయితల నుంచి క్రైమ్కథలను ఆహ్వానిస్తున్నాం. ఉత్కంఠ తగ్గకుండా పాఠకులతో చదివించే సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఈ శీర్షిక కోసం పంపండి. కథల నిడివి 450 పదాలకు మించరాదు. కథతో తప్పనిసరిగా హామీపత్రం ఉండాలి. కథలను తెలుగు యూనికోడ్లో టైప్ చేసి ఈ దిగువనున్న ఈ–మెయిల్‌కు పంపాలి. funday.kathalu@gmail.com -
ఈ వారం కథ: అభిమాని!
నేను ప్రయాణిస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏదో స్టేషన్ రావడంతో చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి కిటికీలోంచి బైటకు చూశాను. వరంగల్ స్టేషను వచ్చింది. మరో రెండున్నర గంటల్లో హైదరాబాద్ చేరుకుంటానని అనుకుంటుండగా నా సెల్‌ఫోన్ మోగింది. నేను ఊహించినట్టే ఆ ఫోన్ రామబ్రహ్మంగారి నుంచే. ఆయన పేరు స్క్రీన్ మీద కన్పించగానే నా మనసులో ఏదో తెలియని అసహనం, కాస్త చిరాకు చోటుచేసుకున్నాయి.షరా మామూలే... ఏ విషయంలేని ఊకదంపుడు ప్రశ్నలే! ఎలాగో ఓపిక చేసుకుని కాసేపు అడిగిన వాటన్నింటికి బదులిచ్చి ఫోన్ పెట్టేశాను.రామబ్రహ్మంగారు నా మనోఫలకంపై మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. నా ఈ ప్రయాణంలో అనేక దఫాలు ఆయన గుర్తుకు వస్తూనే వున్నారు.నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయల్దేరింది కేవలం రామబ్రహ్మంగారిని కలవడం కోసమేనని ఆయన అనుకుంటున్నారు. రామబ్రహ్మంగారు అలా అనుకోవాలనే నేనూ బలంగానే నమ్మించగలిగాను.వాస్తవానికి హైద్రాబాద్‌లో నాకు తెలిసిన ఓ సాహితీమిత్రుని సన్మాన కార్యక్రమానికి తప్పక హాజరు కావాల్సివుంది. ఎందుకంటే అతను ఒకసారి నా సన్మాన కార్యక్రమానికి హైద్రాబాద్ నుంచి ఎంతో ఖర్చుపెట్టుకుని ఫ్లైటులో వచ్చాడు.పనిలో పనిగా ఒకేసారి రెండు పనులూ అయిపోతాయని రామబ్రహ్మంగారిని కలవడానికి అంగీకరించాను.రామబ్రహ్మం గారితో నా అనుబంధం పదేళ్లనాటిది. ఆయన హైదరాబాదులో ఉంటున్నారు. ఈ పదేళ్లుగా నన్ను హైదరాబాద్‌లోని తనింటికి రమ్మనమని అనేక దఫాలుగా పోరుపెడుతూనే వున్నారు. నాకే ఇష్టంలేక ఎప్పటికప్పుడు ఏదో నెపం చెప్తూ తప్పించుకుంటూ వచ్చాను.ఈరోజు ఆయనకు నా పట్లగల అపారమైన అభిమానమే నన్ను బయలుదేరేలా చేసిందని చెప్తే, అది ఆత్మవంచనే అవుతుంది. నిక్కచ్చిగా నిజం చెప్పాలంటే, ఆయన్ని కలుసుకోవాలని నాకు ఎటువంటి ఆపేక్షగాని, ఆరాటంగాని లేవనే చెప్పాలి. రామబహ్మంగారు నన్ను పదేపదే ఆహ్వానించడానికి నేను ఆయన బంధువునిగాని, స్నేహితుణ్ణిగాని కానేకాదు. ఆయన... నా అభిమాని!ఇక్కడ నా గురించి కాస్త చెప్పుకోవాలి. నేనో ప్రముఖ కథా రచయితను. రామబ్రహ్మంగారికి నేనన్నా, నా కథలన్నా మాటల్లో చెప్పలేనంత వీరాభిమానం అని సగర్వంగా చెప్పుకోగలను.రామబ్రహ్మంగారు నా కథలకు డైహార్డ్ ఫ్యాన్ అంటే– కాస్త అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ, ఇది పచ్చి యదార్థం!ఆయన నేను రాసిన ప్రతీకథనీ అనేకసార్లు చదువుతుంటారు అనడం కంటే, నిత్యపారాయణం చేస్తుంటారన్నది యధార్థం. నా మెదడులో జీవం పోసుకున్న నా రచనలూ, ఆయా రచనల్లోని పాత్రలూ, అందులోని సంభాషణలూ నాకే సరిగ్గా గుర్తుండి చావవు.కానీ– ఆయన నేను రాసిన ప్రతివాక్యాన్ని గుర్తుంచుకుని, ఆయా పాత్రల పేర్లూ, స్వభావాలూ, తీరుతెన్నులను గురించి గంటల తరబడి చర్చిçస్తుంటారు. నా సాహిత్యం పట్ల ఆయనకుగల అభిమానానికీ, జ్ఞాపకశక్తికీ ఒక్కోసారి నేనే ఎంతగానో విస్తుపోతుంటాను.రామబ్రహ్మంగారు నా కథల గురించే కాక ఇతర రచయితల కథల గురించి కూడా అనేకానేక సాహితీ సంగతులు నాతో చర్చిస్తుంటారు. అది ఎంతలా అంటే– నేను ఒక్కోసారి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయపడిపోతుంటాను.రామబ్రహ్మంగారు ‘మీ సమయాన్ని వృథా చేస్తున్నానను కుంటా...’ అని తరచు అంటుంటారు. కానీ నా కాలాన్ని హరించడం మాత్రం మానుకోరు. ఈమధ్య ఆయనకు డెబ్బయిఏళ్ళు నిండాయి. ఆ వయసుకి ఆ మాత్రపు చాదస్తం సహజమే కదాని సరిపెట్టుకుంటుంటాను.రామబ్రహ్మంగారిని కలుసుకోడానికి కారణం– ఆయన తన డబ్బులతో నా రానూపోనూ ట్రైన్ టిక్కెట్లు బుక్ చేశారనే కృతజ్ఞతా భావంతోనన్నదే అసలైన వాస్తవం.‘ఓ సాహితీమిత్రుని సన్మాన కార్యక్రమానికి హాజరవడానికి వస్తూ, మిమ్మల్నీ కలుస్తున్నాను’ అని నిజాన్ని చెప్పెయ్యాలనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. అలా చెప్తే ఆయనకు నాపైగల ఇంప్రెషన్ తగ్గిపోతుందని ఆ విషయాన్ని దాచిపెట్టేశాను.నా మిత్రుని సన్మానం జరిగేరోజున అలా బయటికెళ్లి వస్తానని ఓ అబద్ధం చెప్పి, ఆ సభకు హాజరవ్వాలన్నదే నా ఆలోచన. ఇలా నాలోని ఆలోచనలు రైలుతో సమానంగా పరుగులు తీస్తున్నాయి.∙∙ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది.అప్పుడు సమయం సుమారుగా మధ్యాహ్నం రెండున్నర గంటలు కావస్తోంది. రామబ్రహ్మంగారు నాకోసమే ప్లాటుఫారం మీద ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మేమిద్దరం ఇదివరకెప్పుడూ కలుసుకోలేక పోయినా అనేకసార్లు మాట్లాడుకున్న వాట్సాప్ వీడియో కాల్స్ మూలంగా ఒకరినొకరం సునాయాసంగానే గుర్తుపట్టగలిగాం.నేను ప్లాటుఫారం మీద అడుగుపెట్టగానే రామబ్రహ్మంగారు నాకు దగ్గరగా వస్తూ ‘‘హార్టీ వెల్కమ్ టు హైదరాబాద్, చైతన్యాజీ...’’ అంటూ అమితమైన ఆనందంతో అక్కున చేర్చుకున్నారు. అనంతరం నా లగేజీని తన చేతుల్లోకి తీసుకుని తను పార్క్ చేసిన కారు దగ్గరకు తీసుకుపోయారు. రామబ్రహ్మంగారు కారు డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఏదేదో లొడలొడా మాట్లాడుతూనే తనింటికి తీసుకుపోయారు.రామబ్రహ్మంగారు నాకోసం తనింటిపైనున్న పెంట్ హౌస్‌లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి అడుగుపెట్టిన నాకు మతిపోయినంత పనయింది. ఆ గదిలో కొన్ని వందల పుస్తకాలు దర్శనమిచ్చాయి. ఆ పుస్తకాల గది... అందమైన హరివిల్లులా వుంది. పుస్తకాలు ఓ పద్ధతిగా పేర్చి వున్నాయి. నాకు ఒక అద్భుత ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా అపురూపమైన భావన చోటుచేసుకుంది.సాహిత్యానికి సంబంధించిన అనేక పుస్తకాలే కాకుండా, విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు ఆ గదిలో ఉన్నాయి. కొంతమంది గొప్పవారుగా గుర్తింపు పొందాలనే తాపత్రయంతో ఏవేవో పుస్తకాలు కొనుక్కుని తమ అల్మరాల్లో ఊరకనే అలంకరించుకోవడం నాకు తెలిసిందే.రామబ్రహ్మంగారు కూడా అలానే పుస్తకాలను కొనుక్కుని ఉంటారని భావించాను.భోజనమయ్యాక మేడమీద గదికి తీసుకెళ్లారు. నా మనసులో వేధిస్తున్న ప్రశ్నలను ఆయన ముందు పెట్టాను. ‘రామబ్రహ్మంగారూ! ఇన్ని పుస్తకాలు కొనుక్కున్నారు కదా, వీటిల్లో కొన్నైనా పూర్తిగా చదివారా?‘అడిగాను కాస్త అనుమానంగా.‘కొన్ని కాదు గురువుగారు, అన్నీ చదివేసినవే! ఉన్న పుస్తకాలు పూర్తిగా చదవడం పూర్తయితేనే కొత్త పుస్తకాలు తీసుకుంటాను’ అన్నారు రామబ్రహ్మంగారు– తనకున్న భయంకరమైన రీడింగ్ హాబిట్‌ను తెలియజేస్తూ. ఆయన మాటలకు నేను ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాను.‘నిజంగానా...?!’ నోరెళ్ళబెడుతూ ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకంటే– నేను నా దగ్గరున్న పుస్తకాలలో పదోవంతు కూడా చదివివుండను. రామబ్రహ్మంగారు ‘నాకు ఇంకేమి పని? చదువుకోవడమే నాకున్న ఏకైక వ్యసనం’ అన్నారు ఓ సాధారణ విషయాన్ని వెల్లడి చేస్తున్నట్టుగా.ఆ రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను.రామబ్రహ్మంగారిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయనలో చాలా విషయం ఉందన్న విషయాన్నీ చాలా ఆలస్యంగా గ్రహించాను. నిజానికి ఆయన జ్ఞానం ముందు నేనెంతో అజ్ఞానినో నెమ్మదిగా అర్థమైంది.రామబ్రహ్మంగారు నగరంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకి లాక్కుపోయారు. అక్కడ నా అభీష్టం మేరకు ఓ ఇరవైవేల రూపాయలు విలువచేసే పుస్తకాలు తీసుకున్నారు. తర్వాత అవన్నీ ‘నాకోసమే తన బహుమతి’ అన్నారు. నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను.ఆ మరుసటిరోజు రామబ్రహ్మంగారు మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు నన్ను సాయంత్రం ఓ చోటికి తీసుకువెళ్తామన్నారు. అప్పుడు నా పరిస్థితి మహా ఇరకాటంలో పడ్డట్టయింది. ఎందుకంటే– ఆ సాయంత్రమే నేను ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నా సాహితీ మిత్రుడు రంగనాథం సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలి.నేను వెంటనే ‘అయ్యో, ఈ సాయంత్రమే మియాపూర్‌లో ఓ మిత్రుణ్ణి కలవాలి...‘ ఓ రెడీమేడ్ అబద్ధంతో రామబ్రహ్మంగారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. అయినాకానీ అతనూ కూడా వస్తామన్నారు. నేను తెలివిగా ‘మీకెందుకు అనవసర శ్రమ. ఒక్కడినే సరదాగా బస్సు మీద వెళ్ళొస్తాను...’ అని ఏదో సర్దిచెప్పి, తప్పించుకున్నాను. ఒక అబద్ధాన్ని నెత్తినపెట్టుకుని మోయాలంటే ఎంత కష్టమో ఆ క్షణంలో అర్థమయింది. వెంటనే ’నా మిత్రుని సన్మానసభకి హాజరవ్వాలి...’ అని ధైర్యంగా నిజం చెప్పెయ్యాలనిపించింది. కానీ గొంతు విప్పలేక, అపరాధ భావంతో తలదించుకోక తప్పలేదు.∙∙ ఆ సాయంత్రం...రామబ్రహ్మంగారితో కాఫీ తాగి, కాసిన్ని స్నాక్స్ తిని, స్నేహితుణ్ణి కలవడానికంటూ నా మిత్రుడు రంగనాథం సన్మానసభకి బయల్దేరాను.రామబ్రహ్మంగారు తన కారు తీసుకెళ్లమన్నారు. నేను వద్దని చెప్పేశాను. కనీసం తన స్కూటీనైనా తీసుకెళ్లమన్నారు. రూట్స్ వెతుక్కోవడానికి కష్టమవుతుందని చెప్పి, బస్సులోనే వెళ్ళొచ్చేస్తానని చెప్పి, అతికష్టంమీద నా మిత్రుని సన్మాన సభకి బయల్దేరాను.ఒక్కోసారి అభిమానం కూడా ఇంతలా బాధిస్తుందని తొలిసారిగా తెలుసుకున్నాను.∙∙ అనుకున్నట్టు గానే బస్సెక్కి, ఎలాగోలా నా మిత్రునికి సన్మానం జరుగబోయే సభావేదిక వద్దకు చేరుకున్నాను.నాకోసం ఎదురుచూసున్న నా సాహితీమిత్రుడు రంగనాథం నన్ను చూడగానే ఎంతో ఆనందంగా పలకరించాడు. ‘వ్యయప్రయాసలతో వచ్చినందుకు సంతోషమ’ంటూ నన్ను తన హృదయానికి హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు.నేనూ, రంగనాథం వేదికముందు గల కుర్చీల్లో పక్కపక్కనే కూర్చున్నాం. వేదికమీద కొద్దిమంది సాహితీమూర్తులు ఆసీనులై ఉన్నారు. సభ అప్పటికే మొదలైపోయింది.నేను వేదిక మీదున్న పెద్దలను పరిశీలనగా చూశాను, నాకు తెలిసిన రచయితలెవరైనా వున్నారాని. అంతే నా చూపులు ఉన్నట్టుండి చప్పున ఆగిపోయాయి. ఒక్కసారిగా మ్రాన్పడిపోయాను.నా కళ్ళను నేను నమ్మలేనట్టుగా మరింత పెద్దగా చేసుకుని చూశాను. ఔను, ఆయన కచ్చితంగా రామబ్రహ్మంగారే! వేదిక మీద కూర్చున్న రామబ్రహ్మంగారి కంట్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పడకూడదని గట్టిగా అనుకుని, ముందు వరుసలో ఇబ్బందిగా ఉందని రంగనాథాన్ని బలవంతంగా వెనక్కు లాక్కొచ్చేశాను.వేదిక మీదున్న సాహితీమూర్తులు ఒక్కొక్కరూ ప్రసంగిస్తున్నారు. కొద్దిసేపటి తరువాత రామబ్రహ్మంగారు తన సాహితీ ప్రసంగాన్ని అత్యద్భుతంగా కొనసాగించారు. తెలుగు సాహిత్యంలో చోటుచేసుకుంటున్న వివిధ ప్రక్రియల గురించి అనర్గళంగా ప్రసంగించారు. మధ్యమధ్యలో సభంతా చప్పట్లతో మార్మోగిపోతోంది. అందరితో పాటూ నేనూ చప్పట్లు కొట్టాను. నాలో పేరుకుపోయిన అహంకారం పొరలు పటాపంచలయ్యేలా గట్టిగానే నా అభిమానాన్ని వ్యక్తపరచాను.ఆ కాసేపటికి తరువాత నా మిత్రుని సన్మాన కార్యక్రమం జరిగింది.సభానంతరం నిర్వాహకులు భోజనం ఏర్పాట్లు చేశారు. రామబ్రహ్మంగారికి కన్పించకుండా భోజనం చేసేందుకుగా నా మిత్రుడితో కలిసి ఓ మూలవైపు అడుగులు వేశాను. ఒకచోట చాలామంది సాహితీప్రియులు గుమిగూడిన వాతావరణం కన్పించింది. నేను ఆసక్తిగా దూరం నుంచే గమనించాను. అక్కడ ఓ వ్యక్తితో చాలామంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ, అతనితో మాటలు కలపాలని అందరూ తెగ ఆరాటపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరోకాదు, రామబ్రహ్మంగారే!నా మిత్రుడు రంగనాథం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ రామబ్రహ్మంగారి కంటపడకూడదని అనుకుంటూనే, అటువైపుగా చూపు సారించాను. నేను తనని గమనిస్తున్నానని ఆయనకు తెలిసినట్టుగా ఆయన చప్పున నన్ను చూసేశారు.అంతే నాకా క్షణంలో ఎలా స్పందించాలో అర్థంకాక తలకొట్టేసినట్టయింది. ఓ బలమైన సముద్రపు కెరటం నన్ను నిలువెల్లా ముంచేసినట్టుగా నా ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయింది. వెంటనే మొహంమీద బలవంతపు చిరునవ్వు ఒకటి పులుముకుని ఆయనకు దగ్గరగా అడుగులు వేశాను.‘ఏంటీ, సార్ మీరిక్కడ...?’ రామబ్రహ్మంగారు ఆశ్చర్యపోతూ అడిగారు. వెంటనే అతను అడిగినదానికి ఎలా బదులివ్వాలో అర్థంకాక ‘బయలుదేరాక తెల్సింది. ‘ఈరోజే నా మిత్రుడు ఏదో పనిమీద ముంబై వెళ్లిపోయాడు. నా రచయిత మిత్రుడైన రంగనాథం ఫోన్ చేయడంతో ఇలా బయల్దేరి వచ్చేశాను...’ అప్పటికప్పుడు ఓ రెడీమేడ్ అబద్ధాన్ని అల్లేశాను.అంతలో ఓ వ్యక్తి రామబ్రహ్మంగారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ‘‘సార్, మొన్ననే ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లో మీ ఆర్టికల్ చదివాను, అద్భుతం! కంగ్రాట్స్...’’ అభినందిస్తున్నారు.నేను చొరవచేసుకుని అందరిని నెట్టుకుని రామబ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి ‘సార్, మీరు పత్రికలకూ, జర్నల్స్‌కూ ఆర్టికల్స్ రాస్తుంటారా?! నాకెప్పుడూ చెప్పనేలేదు...’’ అంటూ నాలో తన్నుకొస్తున్న ఆశ్చర్యాన్ని వెళ్ళగక్కుతూ అడిగాను.నేను అడిగిన ప్రశ్నకు చిన్నగా నవ్వేస్తూ ‘‘గురువుగారూ, అప్పుడప్పుడూ ఏవో రాస్తుంటాను. చెప్పుకోవడానికి నేను మీలాగా గొప్ప రచయితనైతే కాదుకదా?!’’ అన్నారు రామబ్రహ్మంగారు నిరాడంబరంగా.ఇంతలో నా మిత్రుడు రంగనాథం మా దగ్గరకొచ్చాడు. అతన్ని రామబ్రహ్మంగారికి పరిచయం చేద్దామనుకుంటుండగా రంగనాథమే ‘‘ఆయన మా గురువుగారు ప్రముఖ కాలమిస్ట్ రామబ్రహ్మంగారు. ఈ మధ్యనే నాకు పరిచయమయ్యారు’’ అంటూ నాకు రామబ్రహ్మంగారిని పరిచయం చేయబోయాడు. ఆందుకు రామబ్రహ్మంగారు ‘‘మా గురువుగారికి, నాకూ ఇంతకుముందే పరిచయం వుంది...’’ అంటూ అసలు సంగతి బయటిపెడుతూ పెద్దగా నవ్వేశారు.రామబ్రహ్మంగారు నన్ను ‘గురువుగారు’ అని సంబోధించడం నా మిత్రుడు రంగనాథానికి మింగుడు పడక, మా ఇద్దరివైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘అవునండీ, మీ మిత్రుడి కథలకు నేను వీరాభిమానిని...’ అంటూ రామబ్రహ్మంగారు నన్నో ఎత్తయిన ఉన్నత శిఖరంమీద కూర్చోబెట్టారు. ఆ క్షణం నాకెందుకో అధఃపాతాళంలోకి జారిపోతున్న భావన.ఆ సభా కార్యక్రమం అనంతరం నేనూ, రామబ్రహ్మంగారు ఆయన కారులో ఇంటికి బయలుదేరాం. తప్పుకి దొరికిపోయానన్న న్యూనతభావంలో ఇబ్బందిగా కారులో కూర్చున్నాను. రామబ్రహ్మంగారు యథాలాపంగా మాట్లాడుతున్నారు.ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర కావస్తోంది. ఇద్దరం ఒకేసారి కారులో రావడంతో రామబ్రహ్మంగారి భార్య ‘‘అరే, మీరిద్దరూ ఎలా కలిశారు?’’ ఆశ్చర్యంగా అడిగారు. నేను మరో అబద్ధాన్ని సిద్ధం చేసుకుంటుండగా రామబ్రహ్మంగారే ఏదో చెప్పారు.నేను ఆ భార్యాభర్తలిద్దరికీ గుడ్ నైట్ చెప్పి నేను నా రూమ్‌లోకి వెళ్ళి, బెడ్ మీద నిస్సత్తువగా వాలిపోయాను బట్టలు మార్చుకోకుండానే.రామ బ్రహ్మంగారితో పరిచయమైన నాటినుంచి మామధ్య చోటుచేసుకున్న అనేక సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. నాలోని అహంకారపు ఛాయలు నన్ను వెక్కిరిస్తూ పాతాళంలోకి నెట్టేస్తున్న దృశ్యపరంపర! ఆ రాత్రి ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను.ఉదయం రామబ్రహ్మంగారే నిద్రలేపారు. ఆ ఉదయమే నా ప్రయాణం. రామబ్రహ్మంగారు కూడా స్టేషన్ వరకు వస్తామన్నారు. అనవసరమైన ఇబ్బంది ఎందుకని బస్సులో వెళ్ళిపోతానని చెప్పాను. తనకు ఏ ఇబ్బందిలేదనీ, పైగా దగ్గరుండి సెండాఫ్ ఇవ్వడం తనకెంతో సంతోషమంటూ తన కారు తీశారు. నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. ఆయన సాహచర్యం నుంచి వీలైనంత తొందరగా బైటపడాలనిపిస్తోంది. అంతులేని అపరాధభావం నాలోని అణువణువునూ దహించివేస్తోంది.కారులోంచి దిగాక రామబ్రహ్మంగారు నా రెండు బ్యాగులను పట్టుకున్నారు. నా లగేజీని ఆయన మోయడం నాకే సిగ్గుగా అన్పించి, ఆయన చేతిలోని నా బ్యాగులను తీసుకోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. ఆయన అంతే తీవ్రంగా ‘మై ప్లెజర్...’ అంటూ నా బ్యాగులను వదిలిపెట్టలేదు.నా రానూపోనూ టికెట్స్ ముందుగానే రిజర్వేషన్ చేసేయడంతో రామబ్రహ్మంగారు తనకు ఓ ప్లాట్‌ఫామ్ టిక్కెట్ తీసుకున్నారు. నేను ఎక్కాల్సిన స్పెషల్ ట్రైన్ అప్పటికే ప్లాట్‌ఫామ్ మీద సిద్ధంగా ఉండటంతో గబగబా ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాను. రామబ్రహ్మంగారు ప్లాట్‌ఫామ్ మీద నుంచుని ‘గురువుగారూ, నా అతిథ్యంలో ఏమైనా లోపాలుంటే క్షమించగలరు...’ అన్నారు నన్ను మరింత బాధకు గురిచేస్తూ. నేను వెంటనే రామబ్రహ్మంగారికి నా రెండు చేతులెత్తి దణ్ణంపెడుతూ ‘‘గురువుగారూ, మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్...’’ అంటూ ఓ పుస్తకాన్ని తెరిచి, జేబులోంచి పెన్ను తీసిచ్చాను.‘‘అయ్యో, నేను మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వడమేంటి? కొత్తగా నన్ను మీరు గురువుగారని సంబోధించడం ఏంటి?! నేనే ఎన్నోసార్లు మీరు ఆటోగ్రాఫ్ చేసిన మీ పుస్తకాలను మీనుండి పోస్టులో తెప్పించుకున్న వాణ్ణి...’’ అన్నారు రామబ్రహ్మంగారు తడబడుతున్న స్వరంతో.నా కోరిక మేరకు ఇబ్బందిగా ఆటోగ్రాఫ్ చేసిచ్చారు. అప్పుడే రైల్వే గార్డు విజిల్ గట్టిగా వేశాడు. రైలు నెమ్మదిగా కదిలింది.ఎందుకో ఉన్నట్టుండి నా కళ్ళల్లోంచి నీళ్లు తన్నుకువస్తున్నాయి. పూడుకుపోయిన నా గొంతు పెగుల్చుకుని ‘‘గురువుగారూ, ఇక మీదట మీరు నన్ను ‘గురువుగారూ’ అంటూ సంబోధించడానికి వీల్లేదు! ఈ అభిమాని అజ్ఞానాన్ని మన్నించగలరు...’’ అంటూ ప్రక్షాళన చెందిన మనసుతో నా రెండు చేతులెత్తి నమస్కారం చేశాను.రామబ్రహ్మంగారు నా మాటలు అర్థంకానట్టుగా ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నారు. ఆ క్షణంలో మా ఇద్దరిమధ్య మాటలు కరువయ్యాయి.∙∙ రైలు మా మధ్య భౌతికంగా దూరాన్ని పెంచుతూ ముందుకు సాగిపోతోన్నా, ఈ ప్రయాణం మమ్మల్ని ఎంతో దగ్గర చేసిందనే చెప్పాలి. ఎవరో మహానుభావుడన్నట్లు ప్రతీ ప్రయాణం... నీలోని నీకు తెలియని సరికొత్త మనిషిని నీకు పరిచయం చేస్తుంది! - శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
హెయిర్ సెట్ చేయడానికి.. ఈ 'క్యాప్స్‌లాక్'!
హెయిర్ సెట్ చేయడానికి టైమ్ లేకపోయినా, బార్బర్ చేసిన పని కాస్త అతిగా అనిపించినా, లేదా ‘ఈరోజు కాస్త స్టయిలిష్‌గా కనిపించాలి’ అనిపించినా, ఒక క్యాప్ పెట్టుకుంటే చాలు– లుక్ ఆటోమేటిక్‌గా కూల్లాక్ అయిపోతుంది. అయితే, ఈ క్యాప్ కేవలం తలకు కవర్లా కాకుండా, మీ స్టయిల్‌కి ఒక కిరీటంలా కనిపించాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!బేస్‌బాల్ క్యాప్ ఎప్పటికీ క్లాసిక్!ఫ్యాషన్ ట్రెండ్స్ మారినా, బేస్‌బాల్ క్యాప్ మాత్రం ఎప్పుడూ ఔటాఫ్ స్టయిల్ కాదు. జీన్ ్స, టీషర్ట్, షార్ట్స్– ఏ ఔట్ఫిట్తో అయినా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ముఖ్యంగా నేవీ, బ్లాక్, వైట్ కలర్స్‌లో ఉంటే ఎప్పుడైనా కళ్లుమూసుకుని వేసేయొచ్చు.లోగో మ్యాజిక్!కొన్ని క్యాప్స్‌పై చిన్న లోగో ఉంటేనే సరిపోతుంది. ఆ చిన్న లోగోనే పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. స్పోర్ట్స్ లోగోలు లేదా మినిమల్ బ్రాండ్ ఎంబ్రాయిడరీలు ఉన్న క్యాప్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్‌లో ఉన్నాయి.ట్రక్కర్ క్యాప్స్‌కి గాలి ఫుల్!వెనుక భాగం మెష్‌తో ఉండే ట్రక్కర్ క్యాప్స్ సమ్మర్‌కి బెస్ట్. గాలి బాగా ఆడుతుంది, చెమట తక్కువగా ఇబ్బంది పెడుతుంది. బైక్ రైడ్స్, ట్రావెల్స్, వీకెండ్ ఔటింగ్స్‌కి ఇవి పర్ఫెక్ట్.క్లాసిక్ స్ట్రీట్ స్టైల్ఒక వైట్ టీషర్ట్, ఓవర్సైజ్డ్ డెనిమ్ జాకెట్, బ్లాక్ లేదా నేవీ క్యాప్ జత చేస్తే చాలు. ఇది ఎప్పటికీ ఫెయిల్ అవని కాంబినేషన్ . సింపుల్‌గా కనిపించినా స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది.వెకేషన్ వైబ్లైట్ వెయిట్ లినెన్ షర్ట్, షార్ట్స్‌తో పాటు బీజ్ లేదా క్రీమ్ కలర్ క్యాప్ పెట్టుకుంటే హాలిడే మోడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. బీచ్‌కి వెళ్లకపోయినా, చూసేవాళ్లకు మాత్రం మీరు వెకేషన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది.ఆల్ బ్లాక్ ఆటిట్యూడ్బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్ ్స, బ్లాక్ క్యాప్– ఈ కాంబో ఎప్పుడూ పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే మొత్తం లుక్ బ్లాక్‌లోనే ఉంటే, ఒక వాచ్ లేదా వైట్ స్నీకర్స్‌తో చిన్న కాంట్రాస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు.జాగ్రత్తలు!- క్యాప్ పెట్టుకున్నారంటే స్టిక్కర్లు, ట్యాగులు తీసేయండి. లేదంటే కొత్తగా కొన్నానని ప్రపంచానికి ప్రకటన ఇచ్చినట్టే ఉంటుంది.- మురికి పట్టిన క్యాప్‌తో స్టయిల్ కంటే అలసత్వమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా క్లీన్ చేయండి.- ఇండోర్‌లో ఉన్నప్పటికీ ఎప్పుడూ క్యాప్ తీసేయకుండా ఉంటే, అది అలవాటు ఎక్కువైనట్టే. సందర్భాన్ని బట్టి క్యాప్‌ను క్యారీ చేయాలి. - కొండి దీపిక -
కర్ర పెత్తనాన్ని కళ్ళకు కట్టించినవాడు!
నియంతృత్వ వ్యవస్థ స్వరూప స్వభావాలను కళ్ళకు కట్టించిన రీతికీ, పట్టెడుమంది యువకులు ఈ వ్యవస్థలపై తిరగబడి, తరిమికొట్టిన తీరును చిత్రించిన పద్ధతికీ, హొర్హే మార్యో పెద్రో వర్గస్ లోజా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నార’ని స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి 2010లో ప్రకటించారు. లోజా పెరూవియన్ జాతీయుడు. 1960–’70 దశకాల్లో దక్షిణ అమెరికాలో ఉవ్వెత్తున ఎగసిపడిన తిరుగుబాట్ల వెల్లువను ‘లాటిన్ బూమ్’ అంటారు. దానికి ప్రతీక ప్రాయులైన రచయితల్లో లోజా ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ కొలంబియన్ రచయిత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్, మెక్సికన్ రచయిత కార్లో ఫ్వెంటి, అర్జెంటీన్ రచయిత హూలియో కొర్తజార్ తదితరులపై కూడా ‘లాటిన్ బూమ్’ ప్రభావం గాఢంగా పడింది. వారి సహచరుడే లోజా కూడా!1959 నాటి క్యూబా విప్లవం– ఒక అర్థంలో– ‘లాటిన్ బూమ్’ క్రమానికి మినహాయింపు లాంటిది. 1973లో చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అయాండే (అలెండీ) హత్య సంఘటన ఇదే క్రమానికి– మరో అర్థంలో– మినహాయింపు లాంటిది. అయాండే హత్యతో, చిలీ ప్రజాతంత్ర విప్లవం విఫలమైన సంగతి ప్రపంచ చరిత్ర ఓనమాలు తెలిసిన వారికి తెలిసిన విషయమే! అయినప్పటికీ, ‘లాటిన్ బూమ్’ క్రమం క్యూబా విప్లవంతోనే మొదలైందని చెప్పాలి. మరుసటి సంవత్సరం నుంచే అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పరాగ్వే, పెరూ తదితర దేశాల్లో వరసగా తిరుగుబాట్ల వెల్లువ పెల్లుబికింది. దానికే జర్నలిస్టులు ‘లాటిన్ బూమ్’ అని పేరుపెట్టారు. ఈ వెల్లువ పెల్లుబికే నాటికి లోజా వయసు గట్టిగా పాతికేళ్ళు కూడా ఉండవేమో! బహుశా అందుకే అతనిపై ‘లాటిన్ బూమ్’ ప్రభావం అంత అపారంగా పడడానికి అదే కారణమేమో.మార్యో లోజా తొలి నవల ‘నగరంలో కాట్లకుక్కలు.’ దాన్ని మన అనువాద బ్రహ్మలు (అనగా, అనువాదకులు!) ‘వీరుని యుగం’ (ది టైమ్ ఆఫ్ ది హీరో) పేరిట ఆంగ్ల పాఠకులకు పరిచయం చేశారు. ప్రయోగాత్మక రీతిలో రాసిన ఈ నవల రాతప్రతిగా వుండగానే, 1962లో గ్రంథాలయ పురస్కారాన్ని అందుకుంది. మరుసటి సంవత్సరమే ఈ రచనకు విమర్శకుల ప్రశంస పురస్కారం కూడా దక్కింది. అంతాచేసి, అప్పటికి లోజా వయసు 27! పెరూలోని ప్రతిష్ఠాత్మకమైన సైనిక పాఠశాలలో నెలకొని వున్న స్థితిగతుల గురించి రాసిన నవల అది.1950 దశకంలో లోజా ఆ పాఠశాలలో చదివి వున్నందున అక్కడి పరిస్థితులు అతనికి కొట్టిన పిండి. నవల పొడుగునా ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంటుంది. మాట నెగ్గించుకోవడం కోసం తోటివారి పైన పెత్తనం చెలాయించే సంస్కృతి– తెగువ పేరిట దేనికైనా తెగించే సంస్కృతి– మగటిమి పేరిట పురుషాహంకార సంస్కృతి– ఆనాటి పెరూ సమాజంలో పాతుకుపోయిన ‘విలువలు.’ ఆ ఆవు చేలో మేస్తుంటే సైనిక పాఠశాల దూడ గట్టున మేస్తుందా? ఈ పోకిరీ పోకడలకు మెతగ్గా వుండే మధ్యతరగతి విద్యార్థులు ఎలా బలైపోతారో చిత్రించడం ద్వారా ఆ ‘విలువల’ను ప్రశ్నించారు లోజా. అందుకే ‘తప్పనిసరిగా చదవాల్సిన రచనల జాబితా’లో లోజా తొలి నవలే స్థానం సంపాదించుకో గలిగింది! నిజానికి ఆయన రచనలన్నింటా ఇదే ప్రశ్న అలముకుని వుంటుంది.1981లో, లోజా రాసిన ‘విలయ సమరం’అనే నవల ఆయన ప్రసిద్ధ రచనల్లో మరొకటి. బెజిల్ చరిత్రలో ‘కేనండో(స్) యుద్ధం’గా ప్రచురితమైన చారిత్రక సంఘటనే ఈ నవల ఇతివృత్తానికి మూలం. బ్రెజిల్‌లోని బహైయాలో జరిగిన యుద్ధమది. అంతోనియా కాన్సలైరో అనే చారిత్రక వ్యక్తి ఈ నవలకు కథానాయకుడు అంటారు– కానీ, బ్రెజిల్ రిపబ్లికన్ సైన్యం ఊచకోతను ప్రతిఘటించిన ప్రజలే ఈ నవలకు కథానాయకులు. ప్రజల అవసరాలను పట్టించుకోని ప్రభుత్వాలపై తిరగబడిన సామాన్యుల వీరగాథ ఇది. రాచరికం వకాల్తా తీసుకున్న అంతోనియో గానీ, అతన్ని విధేయంగా అనుసరించిన ప్రజలు కానీ, ఏటికి ఎదురీదిన వాళ్ళే. అందుకే, అన్ని యుద్ధాల తర్వాత కూడా రిపబ్లికన్ సైన్యమే గెలిచి నిరాయుధులైన ప్రజలనూ, ప్రజానాయకులనూ ఊచకోత కోశారు. ఈ కథను చరిత్రలో పదిమందికీ గుర్తుండేలా నమోదు చెయ్యడం బాధ్యత కలిగిన రచయిత కర్తవ్యం! బహుశా అందుకేనేమో, జయప్రదమైన తన రచనల్లో ‘విలయ సమరం’ ఒకటన్నారు లోజా.లోజా నవలలన్నింటిలోకీ సుప్రసిద్ధమైనది ‘చీంబోతు విందు.’ 1950 దశకంలో డొమినికన్ రిపబ్లిక్ లో 31 యేళ్ళ పాటు నిరంకుశ రాజ్యం నడిపించిన రఫాయెల్ ట్రూహియో హత్యే ఈ నవల ఇతివృత్తం. ట్రూహియోను డొమినికన్లు ‘ఎల్ హెఫె’ అని పిల్చుకునేవారు– ఆ మాటకు ‘బాస్– దొరగారు’ అని అర్థం. ట్రూహియో కర్రపెత్తనం సాగిన కాలంలో పాతిక వేల నుంచి యాభై వేలమంది బలైవుంటారని చెప్తారు. ఒక్క పార్సీ›్ల ఊచకోత సంఘటనలోనే ట్రూహియో సైన్యం 17 వేలమందిని హతమార్చింది. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలింద’న్నట్లుగా 1961 మే 30న ట్రూహియో ఓ కుట్రకు బలయ్యాడు! చారిత్రక సమాచారాన్నీ, కాల్పనిక సంఘటనలనూ, వాస్తవ వ్యక్తుల కథలనూ ముప్పేటగా అల్లిన కథనం పాఠకులను ఆకట్టుకుంది.లోజాతో సహా లాటిన్ బూమ్ రచయితలు అంతర్జాతీయ ఖ్యాతి పొందడానికి రాజకీయ– సామాజిక అంశాలే కారణమని అమెరికన్ చరిత్రకారుడు ఫ్రెడరిక్ నన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి యాంత్రిక సరళీకరణ – రిడక్షనిజం అనిపించుకుంటుందే తప్ప హేతుబద్ధ విశ్లేషణ అనిపించుకోదు! ఈ తరహా సూత్రీకరణల వల్ల కళ మాత్రమే నష్టపోతుంది తప్ప వ్యక్తులకే నష్టం జరగదని గుర్తించడం మంచిది!! - మందలపర్తి కిషోర్ -
సెబాసో... సపోరో
జపాన్ లోని హొకైడో నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే హొకైడో ష్రైన్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్దానికి పైబడిన చరిత్ర కలిగిన ఈ వేడుకలు నేటి నుంచి జూన్ 16 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలతో సపోరో నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. సపోరా ఫెస్టివల్‌గా కూడా పిలుచుకునే ఈ పండుగ మూడు రోజులూ నకాజిమా పార్క్‌లో పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా పార్క్ అంతటా భారీ దుకాణాలను ఏర్పాటు చేశారు. స్థానికులు, పర్యాటకులు తమ సాంప్రదాయ దుస్తులైన ‘యుకాతా’ (తేలికపాటి నూలుతో చేసిన కిమోనోలు) ధరించి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ పార్క్‌లో స్థానిక వంటకాలు, పానీయాలు, మిఠాయిలు విక్రయించే వందలాది స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వీటితో పాటు చిన్నపిల్లల కోసం జంపింగ్ కాసిల్స్, మ్యాజిక్ హౌస్, సాహసోపేతమైన డెత్ డిఫైయింగ్ మోటార్‌బైక్ (కళ్లకు గంతలు కట్టుకుని గుండ్రటి గోడలపై బైక్ నడిపే విన్యాసం) సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే మరుయామా పార్క్‌లోని పురాతన మందిరం వద్ద సాంప్రదాయ పూజా కార్యక్రమాలను అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరి రోజైన జూన్ 16న జరుగుతుంది. హొక్కైడో ష్రైన్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో వేలాది మందితో ఒక భారీ ఊరేగింపు ప్రారంభమై, సపోరో నగర కేంద్రం వైపుగా సాగుతుంది.ఈ ఊరేగింపులో పాల్గొనే వేలాది మంది ప్రజలు జపాన్ దేశపు ప్రాచీన హెయాన్ కాలం నాటి (క్రీ.శ. 794– 1185) రంగురంగుల, సంప్రదాయ దుస్తులలో మెరుస్తారు. నగర వీధుల గుండా సాగే ఈ ప్రదర్శనలో తైకో డ్రమ్స్, సంగీత వాయిద్యాల మోతలు మార్మోగుతాయి. స్థానికులు మోసే 4 భారీ ‘మికోషి’ (కర్రతో చేసిన చిన్న దేవాలయం లాంటి నిర్మాణాలు), 8 అద్భుతమైన ఫ్లోట్లు (రథాలు) ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మధ్యాహ్న సమయానికి ఈ ఊరేగింపు సెంట్రల్ సపోరోకు చేరుకుంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి, కెమెరాల్లో బంధించడానికి వేలాది మంది ప్రజలు పోటీపడతారు. మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జపాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.∙ రమా జంబుల -
పవన శక్తితో పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతోంది. విద్యుదుత్పాదన కోసం ఉపయోగించే పెట్రో ఇంధనాలు, బొగ్గు వంటి ఇంధనాలు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల వాడకం పెరుగుదల; రకరకాల అవసరాల కోసం అడవుల నరికివేత సహా అనేక కారణాలు భూతాపాన్ని అంతకంతకు పెంచుతున్నాయి.భూతాపాన్ని అరికట్టడానికి పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచం ఈ శతాబ్ది ప్రారంభం నుంచి దృష్టిసారించడం మొదలుపెట్టింది. పునర్వినియోగ ఇంధనాలలో పవన శక్తి కూడా గణనీయమైన పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాలు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో పవన శక్తి కీలకమైనది. పవన శక్తి ఉత్పాదన సామర్థ్యంలో మన భారతదేశం ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. పవన శక్తి ఉత్పాదన వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం...కొన్ని దేశాలు తమ మొత్తం విద్యుత్ అవసరాలను గణనీయంగా పవన విద్యుత్తు ద్వారానే తీర్చుకుంటున్నాయి. అలాంటి దేశాల వివరాలు గణాంకాల్లో...దేశాల వారీగా మొత్తం విద్యుత్తులో పవనశక్తి వాటా -
రక్తదానం ప్రాణదానమే
రక్తదానం అంటే ప్రాణదానం. సకాలంలో దొరికే రక్తం ఆపదలో చిక్కుకున్న ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడుతుంది. సకాలంలో తగిన రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది మరణిస్తున్నారని, వీరిలో సుమారు 77 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. మన దేశంలో ఏటా దాదాపు 1.80 లక్షల మంది సకాలంలో రక్తం అందక మరణిస్తున్నారు.వీరిలో సుమారు 24 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఇది విరివిగా అందుబాటులోకి వచ్చినట్లయితే, రక్తం కొరత వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ప్రసవ సమయంలో కొందరు మహిళలకు, శస్త్రచికిత్సల తర్వాత పలువురు రోగులకు రక్తం అత్యవసరం అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, హీమోఫీలియా వంటి జన్యువ్యాధులతో బాధపడేవారికి; లుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి రక్తసంబంధ క్యాన్సర్లతో బాధపడేవారికి తరచుగా రక్తం అవసరం అవుతుంటుంది. సకాలంలో రక్తం దొరకకుంటే, వీరు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందరో స్వచ్ఛంద రక్తదాతలు తరచుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినా, రక్తం అవసరమైన వారికి తగినంత రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఎదురవుతుండటమే విషాదం. మన దేశంలో పరిస్థితులు చూసుకుంటే, రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం అవసరానికి తగినంతగా ఉండటం లేదు. గడచిన ఐదేళ్లలో మన దేశంలోని పరిస్థితిని పరిశీలిద్దాం.రక్తదానంలో టాప్ –10ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవలి కాలంలో పలు దేశాలలో స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం యూనిట్లలో మన దేశం రెండో స్థానంలో ఉంది. స్వచ్ఛంద రక్తదాత వల్ల ఏటా సేకరిస్తున్న రక్తం పరిమాణం పెరుగుతూనే ఉంది. అయినా, మన దేశంలో ఏడాదికి దాదాపు ఒక మిలియన్ యూనిట్ల కొరత ఎదురవుతోంది. రక్త పరిశోధనల చరిత్రరక్తం కోల్పోయినప్పుడు ప్రాణాలు పోతాయని మనుషులకు చాలాకాలం కిందటే తెలుసు. అయితే, కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసే పక్రియ తెలుసుకోవడానికే శతాబ్దాల కాలం పట్టింది. అసలు మనుషుల్లో రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే చాలాకాలం పట్టింది. తొలిసారిగా ఇంగ్లిష్ వైద్యుడు విలియమ్ హార్వే 1628లో మానవ శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో మ్యాప్ చేశాడు. హార్వే రూపొందించిన మ్యాప్ ఆధారంగా యూరోపియన్ వైద్య పరిశోధకులు రక్తం కోల్పోయిన మనుషులకు రక్తాన్ని ఎక్కించే ప్రక్రియపై రకరకాల ప్రయోగాలు చేశారు.మనుషులకు జంతువుల రక్తం ఎక్కించే ప్రయత్నం తొలిసారిగా 1667లో చేసినా, ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. తొలిసారిగా బ్రిటిష్ ప్రసూతి వైద్యుడు జేమ్స్ బ్లండెల్ 1818లో ప్రసవానంతరం అధిక రక్తస్రావానికి లోనైన ఒక మహిళకు విజయవంతంగా మనిషి రక్తాన్ని ఎక్కించాడు. అప్పటికి మనుషుల్లోని రక్తమంతా ఒకటే అనుకునేవారు. రక్తంలోని గ్రూపులను ఆస్ట్రియన్ వైద్యుడు కార్ల్ లాండ్స్టీనర్ 1900లో కనుగొన్నాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. రక్తదాన చరిత్రతగిన రక్తాన్ని ఎక్కించడం ద్వారా మనుషుల ప్రాణాలు నిలపడం సాధ్యమయ్యాక బ్రిటిష్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి పెర్సీ లేన్ ఆలివర్ ప్రపంచంలోనే తొలిసారిగా లండన్‌లో స్వచ్ఛంద రక్తదాతల సేవలను 1921లో ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో గాయపడిన సైనికుల కోసం అమెరికన్ రెడ్‌క్రాస్ నేతృత్వంలో విస్తృతంగా రక్తసేకరణ ప్రారంభించారు. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసేందుకు షికాగోలోని కుక్ కౌంటీ ఆస్పత్రిలో 1937లో ప్రపంచంలోని తొలి బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేశారు.ఇది ఏర్పడిన రెండేళ్లకే– 1939లో మన దేశంలోని తొలి బ్లడ్‌బ్యాంకును కలకత్తాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీనిని డాక్టర్ శివ్దేవల్ సింగ్ గ్రీవల్ ప్రారంభించారు. తొలినాళ్లలో ఏర్పడిన బ్లడ్‌బ్యాంకులు రెండో ప్రపంచయుద్ధంలో గాయపడిన వేలాది సైనికుల ప్రాణాలను నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషించాయి. తొలినాళ్లలో రక్తదానం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉండేవి. ప్రజల్లోని అపోహలను తొలగించడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు రక్తదానం ఆవశ్యకత గురించి 1960లలో సమాజంలో అవగాహన కల్పించడం ప్రారంభించారు.అప్పటికి ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో బ్లడ్‌బ్యాంకులు ఏర్పడ్డాయి. క్రమంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా బ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు మొదలైంది. హెచ్ఐవీ మహమ్మారి వల్ల 1980ల నుంచి రక్త సేకరణ విధానాల్లోను, రక్త మార్పిడి జాగ్రత్తల్లోను సమూలమైన మార్పులు వచ్చాయి. రెడ్‌క్రాస్ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినా, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి తగిన రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి.ప్రపంచంలోని కోట్లాది మంది స్వచ్ఛంద రక్తదాతల నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు వెల్లడించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2004లో జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇదే రోజున రక్తదాతల గౌరవార్థం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం ప్రారంభమైంది. ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ రక్తదాన దినం కోసం ‘ఒక చుక్క మానవత్వం. రక్తాన్ని ఇవ్వండి. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌ను ఎన్నుకుంది.కృత్రిమ రక్తం కథా కమామిషూఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైనా, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసే బ్లడ్‌బ్యాంకులే శరణ్యం. రక్తదాతలు తమ రక్తాన్ని ధారపోయాల్సిన అవసరం లేకుండా చేయడానికి, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా తక్షణమే అందించడానికి వీలుగా అన్ని రకాల గ్రూపులకు చెందిన రక్తం ఉన్నవారికి సరిపోయే కృత్రిమ రక్తాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయోగాలు సాగిస్తూనే ఉన్నారు. తొలిసారిగా 1989లో జపాన్ శాస్త్రవేత్తలు ‘ఫ్లూవోసాల్’ పేరుతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీనికి ఎఫ్‌డీఏ అనుమతి కూడా లభించింది. అయితే, దీనిని నిల్వచేయడంలో సాంకేతిక ఇబ్బందులు, తయారీ ప్రక్రియలో సంక్లిష్టతలు తదితర కారణాల వల్ల ‘ఫ్లూవోసాల్’ తయారీ 1994లో నిలిచిపోయింది.కృత్రిమ రక్తం తయారీ తొలి ప్రయత్నం శాస్త్రీయంగా విజయవంతమైనా, సాంకేతిక కారణాల వల్ల కార్యాచరణలో విఫలమైంది. అలాగని ఆశలు అడుగంటిపోలేదు. శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. అమెరికన్ కంపెనీ ‘బయోప్యూర్’ వ్యవస్థాపకులైన శాస్త్రవేత్తలు డాక్టర్ బింగ్ ఎల్ వాంగ్, డాక్టర్ కార్ల్ డబ్ల్యూ రాష్ రక్తానికి ప్రత్యామ్నాయం కాగల ‘హెమోప్యూర్–201’ అనే ఉత్పత్తిని 2001లో రూపొందించారు. ఇది ‘హెమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్’. హెమోగ్లోబిన్ ద్వారా తయారు చేసిన ఈ ఉత్పత్తి రక్తం మాదిరిగానే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా ప్రాణాలను నిలిపి ఉంచగలదు. దీనికి ఎఫ్ఏడీ అనుమతి లభించింది. ‘ఫ్లూవోసాల్’తో పోల్చుకుంటే, దీనికి అనేక సానుకూలతలు ఉన్నాయి.దీనిని నిల్వచేయడానికి రిఫ్రిజిరేటర్లు అక్కర్లేదు. సాధారణ పరిస్థితుల్లో సైతం ఇది నిక్షేపంగా రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి బ్లడ్ గ్రూపు వారికైనా చక్కగా సరిపోతుంది. ఇన్ని సానుకూలతలు ఉన్నా, దీని వాడుక పరిమితంగానే ఉంది. శస్త్రచికిత్సల తర్వాత తలెత్తే ఎనీమియా నివారణ కోసం ‘హెమోప్యూర్–201’ వాడుతున్నారు. ఇది రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల ప్లాస్మా, ప్లేట్లెట్లు వంటి ప్రత్యేక అవసరాల కోసం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.‘హెమోప్యూర్–201’ పరిమితులను గుర్తించాక శాస్త్రవేత్తలు మరింత విస్తృతంగా ప్రయోగాలు సాగించి, తొలిసారిగా బ్రిటిష్ శాస్త్రవేత్తలు 2022లో లాబొరేటరీలో ఎర్ర రక్తకణాలను తయారు చేయగలిగారు. బ్రిస్టల్ వర్సిటీ, కేంబ్రిడ్జ్ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు మూలకణాల నుంచి సేకరించిన ఎర్రరక్త కణాలతో కృత్రిమ ఎర్ర రక్తకణాలను విజయవంతంగా అభివృద్ధి చేయగలిగారు. సికిల్‌సెల్ ఎనీమియా, థలసీమియా రోగులకు నేరుగా రక్తం ఎక్కించే బదులుగా ఈ కృత్రిమ ఎర్ర రక్తకణాలను ఎక్కించడం ద్వారా వారి ప్రాణాలను నిలపవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు కృత్రిమ రక్తం తయారీకి జరిగిన ప్రయత్నాలు పాక్షిక ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. ఇవేవీ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి.పరిమితులు ఏమిటంటే..?రక్తానికి బదులుగా ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించినవేవీ పూర్తిస్థాయిలో రక్తానికి ప్రత్యామ్నాయం కాకపోవడానికి వీటి పరిమితులే కారణం. రక్తంలోని ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులలో ఎవరికైనా ఇవ్వడానికి పనికొచ్చేలాగానే ‘ఫ్లూవోసాల్’, ‘హెమ్ప్యూర్–201’ వంటి వాటిని, కృత్రిమ ఎర్ర రక్తకణాలను రూపొందించారు. వీటిలో రక్తంలో ఉండే పదార్థాలన్నీ పూర్తిగా ఉండవు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా ఉంటాయి. ఇప్పటి వరకు రక్తానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన వాటిలో హెమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు మినహా ఇతర కీలక పదార్థాలు లేకపోవడమే వీటి పరిమితి. ఇవి రక్తంలోని హెమోగ్లోబిన్ను, ఎర్ర రక్తకణాలను భర్తీ చేయగలవు. రక్తం మాదిరిగానే శరీరంలోని జీవకణాలకు ఆక్సిజన్ సరఫరా చేయగలవు.అయితే, ప్లేట్లెట్ల మాదిరిగా రక్తం గడ్డకట్టేందుకు దోహదపడలేవు. ప్లాస్మా మాదిరిగా రక్త పరిమాణాన్ని పెంచలేవు. డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడినవారికి ప్లేట్లెట్లు అత్యవసరం అవుతుంటాయి. కాలిన గాయాలకు లోనైన వారికి, విపరీతంగా రక్తస్రావం అయిన వారికి ప్లాస్మా అవసరం అవుతుంది. వీటి కోసం బ్లడ్‌బ్యాంకులపై ఆధారపడాల్సిందే! రక్తదాతల నుంచి సేకరించిన రక్తం ద్వారా ప్లేట్లెట్లు, ప్లాస్మా వేరు చేసి రోగులకు ఎక్కిస్తారు.రక్తం నుంచి అవసరమైన పదార్థాలను వేరు చేసి, నిల్వచేసే పని బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. రక్తం అవసరాలకు ఇప్పటి వరకు కృత్రిమంగా తయారైనవన్నీ పాక్షిక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటున్నాయి. రక్తానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రూపొందించిన ఉత్పత్తులతో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రక్తం బదులుగా వీటిని ఎక్కించిన రోగులు కొందరిలో అధిక రక్తపోటు, రక్తనాళాల సంకోచం, అరుదుగా గుండెపోటు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరించే రక్తంతో పోల్చుకుంటే, ఈ కృత్రిమ ఉత్పత్తుల ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది.కృత్రిమ రక్తం భవితవ్యంప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సాంకేతికత సహజ రక్తానికి పరిమిత స్థాయిలో మాత్రమే కృత్రిమ ప్రత్యామ్నాయాలను అందించగలుగుతోంది. వీటిలో ప్లేట్లెట్లు, తెల్ల రక్తకణాలు, ప్లాస్మా ఉండనందున ఇవి సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయాలు కాలేకపోతున్నాయి. అయితే, రానున్న ఇరవై ఏళ్లలో ఆక్సిజన్ క్యారియర్లుగా ఉపయోగపడే కృత్రిమ రక్త ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల కోసం రక్తదాతలపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వారి అంచనా ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆస్పత్రులు ఎర్ర రక్తకణాల అవసరాల కోసం కృత్రిమ రక్త ఉత్పత్తులను విరివిగా వాడటం ప్రారంభిస్తాయి. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్లేట్లెట్లు, ప్లాస్మా తదితర అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఈలోగా మరిన్ని పరిశోధనలు జరిగి, పూర్తిస్థాయిలో సహజ రక్తానికి దీటైన సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని (యూనివర్సల్ ఆర్టిఫిషియల్ బ్లడ్) రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికే లాబొరేటరీల్లో కృత్రిమంగా గుండె వాల్వులు, తాత్కాలికంగా పనిచేయగలిగే కృత్రిమ గుండెలు సహా పలు కృత్రిమ అవయవాలను తయారు చేయడం సాధ్యమైందని, అదే రీతిలో సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాగల కృత్రిమ రక్తాన్ని తయారు చేయడం కూడా సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఫైటర్ని నేను
నవ్వితే అమాయకత్వం, మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో ‘గోదారి గట్టుపైన’లో ‘మాయ’గా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి నిధి ప్రదీప్. కేరళ మూలాలున్న ఈ కొత్తతరం కథానాయిక తన కలలు, కెరీర్, సరదా అలవాట్లు, జీవితతత్త్వం గురించి మనతో పంచుకుంటోంది.. ఆమె మాటల్లోనే!డాక్టర్ కావాల్సింది!మా ఇంట్లో అందరి కోరిక నేను డాక్టర్ కావాలనేదే. కానీ నాకు, కెమిస్ట్రీకి అస్సలు పడేది కాదు! ఎంత ప్రయత్నించినా ఆ సబ్జెక్ట్‌తో కనెక్షన్ కుదరలేదు. చివరికి స్టెతస్కోప్‌కి బదులుగా కెమెరా ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. అదే సరైన నిర్ణయం అనిపిస్తుంది.జూనియర్ నయనతార!టిక్‌టాక్ వీడియోలు చేసే రోజుల్లో చాలామంది నన్ను ‘జూనియర్ నయనతార’ అని పిలిచేవారు. నా ఎక్స్ప్రెషన్స్ , ఫేస్ యాంగిల్స్ చూసి అలా అనేవారు. నిజం చెప్పాలంటే నయనతార గారిని కలవడం, ఆమెతో ఒక ఫొటో దిగడం ఇప్పటికీ నా డ్రీమ్లిస్ట్లో ఉంది!తెలుగు కోసం అద్దం ముందు క్లాస్!పెరిగింది చెన్నైలో కాబట్టి తెలుగు అస్సలు రాదు. డైలాగ్స్ అన్నీ ముందుగా ఇంగ్లీష్‌లో రాసుకుని, వాటిని తెలుగులోకి అనువదించుకుని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా ఒక్కో పదం సరిగ్గా పలకడానికి చాలా కష్టపడ్డాను.నటుడంటే స్పాంజ్‌లా ఉండాలి!నటుడు అంటే ఒక స్పాంజ్‌లా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ల హావభావాలు, మాట్లాడే తీరు, రియాక్షన్స్ అన్నీ గమనించి నేర్చుకోవాలి. అందుకే నేను ఎక్కడ ఉన్నా, మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను.‘మాయ’లా కాదు.. నేను ఫైటర్!‘గోదారి గట్టుపైన’లో నా పాత్ర మాయ చాలా సైలెంట్, ఫ్యామిలీ కోసం తన కోరికలు వదులుకునే అమ్మాయి. కానీ నిజ జీవితంలో నేను అలా కాదు. నా కలల కోసం, నా నిర్ణయాల కోసం గట్టిగా నిలబడతాను. నేను రియల్ ఫైటర్ని!ఆయనకు పెద్ద ఫ్యాన్ !టాలీవుడ్లో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ , ఆ యాటిట్యూడ్ అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తులో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.అమ్మ కళ్లే నాకు వచ్చాయి!చాలామంది నా కళ్ల గురించి మాట్లాడుతుంటారు. నిజానికి అవి పూర్తిగా మా అమ్మ నుంచి వచ్చిన గిఫ్ట్. నా ముఖంలో నాకు అత్యంత ఇష్టమైన ఫీచర్ కూడా అదే.సీ ఫుడ్ అంటే వీక్నెస్!నేను పక్కా నాన్ వెజ్ లవర్ని. చికెన్ , మటన్ , ఫిష్, స్క్విడ్స్– ఏదైనా ఎంతో ఇష్టంగా తింటాను. షూటింగ్ సమయంలో భీమవరం ఫుడ్‌తో ప్రేమలో పడిపోయాను. అక్కడి రొయ్యలు, పీతలు, తాజా చేపల కూరలు తింటుంటే నాకు మా కేరళ గుర్తొచ్చేది. -
సరదాగా ఈ ఆదివారం ఈ వెరైటీ స్నాక్స్ చేసేయండిలా..!
గుజరాతీ ఖాండ్వీకావలసినవి: శనగపిండి – కప్పు, కారం పొడి – 1/4 టీస్పూన్, ఉప్పు – 1/2 టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పెరుగు – 1 కప్పు, నీళ్లు – 2 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్, నువ్వులు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు – కొన్ని, గార్నిషింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర (సన్నగా తరిగినది) తయారీ: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, చిటికెడు ఇంగువ, కప్పు పెరుగు తీసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి, మజ్జిగలా పల్చగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద కడాయిలోకి పోసి, స్టవ్ మీద సన్నని మంటపై పెట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది రిబ్బన్ లాగా జారుడుగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక గరిటెడు ఉడికిన శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని, వెంటనే ఒక ప్లేట్ వెనుక భాగంలో సాధ్యమైనంత పల్చగా పరచాలి. ఇలా పరిచిన మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, దానిని రెండు ఇంచుల వెడల్పు ఉన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసి, ఎక్కడా విరిగిపోకుండా జాగ్రత్తగా గట్టిగా రోల్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి అందులో టీస్పూన్ ఆవాలు, టీస్పూన్ నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. పోపు వేగాక, దానిని తయారు చేసి పెట్టుకున్న ఖాండ్వీ రోల్స్‌పైన సమానంగా పోయాలి. ఆపై పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఖాండ్వీని వేడి వేడి చాయ్ తో కలిపి ఆస్వాదించడమే!ఆలూ అండా కుర్మాకావలసినవి: ఉడకబెట్టిన కోడిగుడ్లు – 4, బంగాళదుంపలు – 2 (పొట్టు తీసి, ముక్కలుగా కోసుకున్నవి), నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, గ్రేవీ కోసం: ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది లేదా పేస్ట్), అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్, టొమాటోలు – 2 (ప్యూరీ లేదా సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి – 3 (నిలువుగా చీల్చినవి), జీలకర్ర – టీస్పూన్, కారం పొడి – టీస్పూన్, పసుపు – 1/2 టీస్పూన్, ధనియాల పొడి – టీస్పూన్, గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, గార్నిషింగ్ కోసం– సన్నగా తరిగిన కొత్తిమీర. తయారీ: ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఒక ఫోర్క్ లేదా టూత్‌పిక్‌తో అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టండి. ఇప్పుడు ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేయండి. ఇందులో ఉడకబెట్టిన గుడ్లను వేసి 2–3 నిమిషాల పాటు పైన లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, పక్కన తీసి పెట్టుకోండి. అదే నూనెలో బంగాళదుంప ముక్కలను కూడా వేసి, అంచులు కొద్దిగా వేగే వరకు 3–4 నిమిషాలు వేయించి, పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, దోరగా వేయించండి. ఇప్పుడు అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు దీనిని ఉడికించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఈ మసాలాలో వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా రెండు నిమిషాలు కలపండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా 2 కప్పుల గోరువెచ్చని నీళ్లు పోయండి. నీళ్లు మరగడం ప్రారంభమయ్యాక, బాణలిపై మూత పెట్టి, మంటను మీడియమ్‌లో ఉంచి బంగాళదుంపలు మెత్తగా ఉడికించండి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను, చీల్చిన పచ్చిమిర్చిని గ్రేవీలో వేయండి. సన్నని మంట మీద మరో 3–4 నిమిషాలు ఉంచండి, దీనివల్ల గుడ్లు గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలూ అండా కుర్మా రెడీ! ఇది వేడి వేడి రోటీలు, చపాతీలు లేదా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. (చదవండి: హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..) -
‘డబ్బు లేకుండా సినిమా తీశాం!’
“మొదటి నుంచి నాకు సినిమానే వ్యసనం. సాహిత్య సృజనతో పాటు సినిమా మీదే సమయమంతా గడిపేశాను. జేబులో రూపాయి డబ్బు లేకున్నా, స్నేహసంపదే అండగా సినిమాలు తీయగలిగాను” అని ప్రముఖ రచయిత, ‘భద్రం కొడుకో’ సహా పలు అవార్డు చిత్రాలను అందించిన సినీ దర్శకుడు అక్కినేని కుటుంబరావు అన్నారు. ‘భద్రం కొడుకో’ (1991) చిత్రం నుంచి ఇప్పటి దాకా ఒక హిందీ సినిమాతో సహా 8 సినిమాలు, కొన్ని టెలీ ఫిల్ములు తీయగలగడానికి అదే కారణమంటూ తన మనోభావాలను ఆత్మీయంగా పంచుకున్నారు. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెల్చుకున్న ‘భద్రం కొడుకో’ చిత్రం లాంటి బాలల చిత్రాల రూపకల్పనకు ఆ రోజుల్లో తాము పడ్డ అవస్థలనూ, అండగా నిలిచిన మిత్రుల స్నేహసౌశీల్యాన్నీ కుటుంబరావు మరోసారి నెమరువేసుకున్నారు.“ఈ తరం పిల్లలకు ఏ అనుబంధాలు, ఆత్మీయతలు లేకుండా పెంచుతున్నాం. జీవితంలోని పోరాటాలు, కష్టసుఖాలు, సమాజంలోని మంచీ చెడూ ఏదీ వాళ్ళకు తెలీదు. అది ఇవాళ్టి సమాజంలో, పెంపకంలోని తప్పు. నిజానికి, ఇవాళ పెద్దవాళ్ళ మనసులు పెళుసు బారిపోయాయి. తమకు నచ్చితేనో, ఉపయోగం ఉంటేనో తప్ప మనం ఏం చెప్పినా, చూపినా వినరు. కానీ, మనం సరిగ్గా చెబితే ఏది చెప్పినా పిల్లలు వింటారు. అది గుర్తించాలి” అని ‘భద్రం కొడుకో’, ‘పాతనగరంలో పసివాడు’ (1999), ‘గులాబీలు’ (2005) సహా తెలుగులో అనేక బాలల చిత్రాలను రూపొందించిన అక్కినేని కుటుంబరావు అభిప్రాయపడ్డారు.నేటికీ ఉరకలేసే పసిమనసు ఉత్సాహంఅక్కినేని కుటుంబరావుకు ఎనిమిది పదులు దాటిన సందర్భంలో ఆయనకు సంబంధించిన మూడు కొత్త పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఈ అనుభవాలు, అభిప్రాయాలు, జ్ఞాపకాల తలపోతకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరం వేదిక అయింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ సభకు పెద్దయెత్తున హాజరయ్యారు. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ – ఛాన్సలర్ ఆచార్య ఎన్. గోపి సభకు ముఖ్య అతిథిగా వచ్చి, పుస్తకాలను ఆవిష్కరించారు. ‘అక్కినేని కుటుంబరావు సినిమా చిత్రాలు’, ‘అక్కినేని కుటుంబరావు కథలు’, అలాగే ఆయన సాహిత్యంపై ప్రముఖులు రాసిన సమీక్షలు, విశ్లేషణలు, కొన్ని ఇంటర్వ్యూల సమాహారంగా ‘పదుగురాడిన మాటలు’ పుస్తకాలు మూడింటి ఆవిష్కరణ జరిగింది. ఆచార్య గోపి తన ప్రసంగంలో కుటుంబరావుతో చిరకాలంగా ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. సుదీర్ఘకాల స్నేహితుడైన అక్కినేని కుటుంబరావు ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే ఉత్సాహంతో రచనలు చేస్తూ, సినిమాలు తీస్తూనే ఉండడాన్ని అభినందించారు.విశిష్ట అతిథిగా సభకు హాజరైన తెలంగాణ భాషా – సాంస్కృతిక శాఖ సంచాలకులు, కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ, కథ, నవలా రచయితగా, సినీ దర్శకుడిగా విశేష సృజన చేసిన కుటుంబరావును అభినందించారు. చిన్న చిన్న కథలుగా రాసినా, వాటిని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ఆయన ప్రత్యేకతను ప్రస్తావించారు. రెండు, మూడు కథలను మచ్చుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కినేని కుటుంబరావు వామపక్ష భావజాలం ఆయన రచన పేర్లలోనూ కనపడుతుందన్నారు.‘నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్’ సంపాదకులు, కవి – రచయిత కె. ఆనందాచారి, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత – సినీ విమర్శకులు వారాల ఆనంద్, సాహిత్య – సామాజిక విశ్లేషకులు డాక్టర్ జతిన్ కుమార్‌లు సభలో వక్తలుగా పాల్గొన్నారు. సినీ రంగంలో కుటుంబరావు కృషినీ, ఆయన తీసిన సినిమా ప్రత్యేకతనూ వారాల ఆనంద్ వివరించారు. ఇవాళ్టికీ పసిపిల్లల లాంటి స్వచ్ఛమైన మనసుతో ఉండడం వల్లే కుటుంబరావు ఎనిమిది పదులు దాటినట్టు కనిపించరనీ, అదే ఉత్సాహంతో సృజనాత్మక కృషి సాగించగలుగుతున్నారనీ పేర్కొన్నారు.సమకాలంలో సీరియస్‌గా చదవాల్సిన అక్కినేని సాహిత్యంవిశేష క్షేత్ర పర్యటన, వ్యక్తిగత అనుభవాలను కలగలిపి ఎంతో శ్రమించి కుటుంబరావు సృజించిన సాహిత్యం తాలూకు విశిష్టతను ఆనందాచారి తన ప్రసంగంలో ప్రస్తావించారు. “రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై నిర్బంధాలు కొనసాగుతున్న విషాద, వర్తమాన సందర్భం ఇది. ఈ పరిస్థితుల రీత్యా కుటుంబరావు రాసిన నవలలు ఇప్పుడు మరింత విలువైనవి. మరోసారి ప్రత్యేకంగా అధ్యయనం చేయదగినవి. ‘పదుగురాడు మాటలు’ పుస్తకంలోని 28 వ్యాసాలూ ప్రముఖుల మాటల్లో ఆయన రచనల ప్రత్యేకతను విశ్లేషించాయి” అని కుటుంబరావు రచనల సామాజిక భూమికను వివరించారు.జతిన్ కుమార్ ప్రసంగిస్తూ, అక్కినేని కుటుంబరావు ప్రసిద్ధ కథ ‘పసివాడితనం’ మొదలు తాజా కథల సంపుటిలోని 16 కథలూ పాఠకులను ఎలా ఆలోచనల్లోకి నెడతాయో వివరించారు. “పాఠకులను నిద్రపోనివ్వని కథలివి. సామాన్యుల వైపు బలంగా నిలబడ్డ కుటుంబరావు వామపక్ష భావజాలం ఈ కథల్లో కనిపిస్తుంది. ఈ కథల్లో అనేకం కుటుంబరావు స్వయంగా చూసినవీ, అనుభవించినవీ. ‘సొంత ఇల్లు’, ‘బండి’ లాంటి అనేక కథలు నిడివి రీత్యా చూడడానికి చిన్నవే అయినా, అవి కలిగించే అనుభూతులు పెద్దవి. అందుకే, ఒక రకంగా ఇవి కథలు కాదు... అనుభూతులు అనాలి. వీటిని చదువుతుంటే, ఒకసారి టీచర్‌గా, మరోసారి విదూషకుడిగా, ఇంకోసారి గొప్ప రచయితగా కుటుంబరావు కనిపిస్తారు. ప్రతి కథ చాలా సీరియస్‌గా చదవాల్సిన కథలు” అంటూ తనదైన శైలిలో సరళంగా, సభికులను ఆకట్టుకొనేలా జతిన్ కుమార్ విశ్లేషించారు.అప్పట్లో... 30 పైసల నేలటికెట్లో...అక్కినేని కుటుంబరావు తన స్పందన ప్రసంగంలో అందరికీ కృతజ్ఞతలు చెబుతూ, తాను హైదరాబాద్‌కు వచ్చిన తొలినాళ్ళ జీవిత గమనం తాలూకు ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకువెళ్ళారు. “అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలనే లక్ష్యంతో కేవలం ఎస్.ఎస్.ఎల్.సి. చదివి, జీవనం కోసం 1963లో హైదరాబాద్‌కు వచ్చాను. ఈ 63 ఏళ్ళ ప్రయాణంలో ఎందరో స్నేహితులు. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న ఎన్. గోపి, ఇతర మిత్రులు 1965 నుంచి నాకు తెలుసు. అప్పట్లో ప్రతి ఆదివారం కలిసేవాళ్ళం. వాళ్ళ మాటలు, స్నేహమే నాకు ఓ విశ్వవిద్యాలయంగా మారింది. డబ్బు లేక ఉద్యోగం బాటపట్టాను అనుకుంటున్న నేను, జేబులో డబ్బులో లేకపోయినా చదువు బాటలో పయనిస్తున్న వాళ్ళను చూసి, కలసి ఎంతో నేర్చుకున్నా.అప్పట్లో నాకు రోజుకు 2 రూపాయలు జీతం. నెలకు 60 రూపాయలు. అందులో 30 రూపాయలు ఊళ్ళోని అమ్మానాన్నలకు పంపితే, 20 రూపాయల్లో ఇక్కడ ఇంటి అద్దె, తిండి అంతా గడిచేది. మిగిలిన పది రూపాయలతో స్నేహితులందరితో కలసి, 30 పైసల నేల టికెట్‌తో ఎన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళమో లెక్కలేదు. ఇటీవల నా తాజా నవల రాస్తున్నప్పుడు గోపి సహా ఆ మిత్రులు, ఆ సంగతులు అన్నీ మరోసారి ఆలోచనల్లో నుంచి అక్షరాల్లోకి వచ్చాయి.నాకు చలం రచనలంటే పిచ్చి. ఆరేడు తరగతుల్లోనే తన అభిమాన రచయిత సినారెకు ఉత్తరాలు రాస్తే, ఆయన జవాబులు ఇచ్చారని గోపి ఓ సారి చెప్పారు. అది ప్రేరణగా తీసుకొని, నా అభిమాన రచయిత చలానికి ఉత్తరం రాస్తే మూడు రోజుల్లో జవాబు వచ్చింది. అక్కడ నుంచి రచయిత గుడిపాటి వెంకట చలానికీ, నాకూ మధ్య కొన్నేళ్ళపాటు ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. వాటిలో కొన్ని అప్పట్లో ఓ పత్రిక ప్రచురించింది” అని కుటుంబరావు చెప్పుకొచ్చారు.ఒక సినిమా... 39 మంది నిర్మాతలు... ఓ నేషనల్ అవార్డ్!“చిన్నప్పటి నుంచి నా ఆదర్శాలు రెండే. ఒకటి - కుటుంబం మొత్తాన్నీ పైకి తీసుకురావాలి, రెండు - స్నేహితులందరితో ఎప్పటికీ స్నేహంగా ఉండాలి. మొదటి విషయం మాటెలా ఉన్నా, రెండో ఆదర్శాన్ని మాత్రం ఇప్పటికీ పాటిస్తున్నా. అందుకే, నాకు పరిచయమైన వాళ్ళెవరూ నాకు స్నేహితులు కాకుండా పోరు. నా అసలైన సంపద స్నేహసంపదే! గోపి, ముత్యంరెడ్డి, ఇలా ఎంతో మంది స్నేహితులే నన్ను ఎంతో ఎడ్యుకేట్ చేశారు. వాళ్ళ వల్లే నేను పురోగతిలోకి వచ్చా. నేను సినిమాలు తీయగలిగింది కూడా ఆ స్నేహితుల వల్లే!రవి, ముత్యం రెడ్డి, శ్రీనివాస్... ఇలా ఎంతోమంది నా ప్రతి సినిమా వెనకాల ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ చిత్రకారుడిగా ఎదిగిన లక్ష్మణ్ ఏలే ఆర్థిక ప్రయోజనం లేకపోయినా, అప్పటి నుంచి ఇప్పటి దాకా నా ప్రతి సినిమాకూ కళాదర్శకుడిగా పనిచేయడం కేవలం సినిమా మీద ప్రేమతోనే! స్నేహపరిమళంతోనే!! ముత్యంరెడ్డి ప్రధాన కారకుడిగా ‘భద్రం కొడుకో’ సినిమా అలా వచ్చిందే. ఆ సినిమాకు ఏకంగా 39 మంది నిర్మాతలు. డబ్బులు వెనక్కిరావు, తిరిగి ఇవ్వలేనని చెప్పినా, తలా పాతిక వేలు పెట్టుబడిగా పెట్టి ఆ సినిమా తీయించారు. ఇవాళ అలా ఇచ్చేవారు ఎవరూ ఉండరు. నిజానికి, ఆ సినిమా నిర్మించడమే తప్ప, దర్శకత్వం నేను చేయాలనుకోలేదు. కానీ, అనుకోకుండా నేనే డైరెక్షన్ కూడా చేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి నా సినిమా ప్రయాణం ఇప్పటి దాకా సాగుతూ వచ్చింది” అని అవార్డు చిత్రాల అక్కినేని కుటుంబరావు తన గుండె లోతుల్లోని భావాలను పంచుకున్నారు.ప్రభుత్వం ఇవాళ్టికీ సబ్సిడీ ఇవ్వని ఆ అవార్డ్ ఫిల్మ్!“మంచి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రభుత్వాలు చెబుతాయి కానీ, ఆచరణలో అది జరగదు” అంటూ కుటుంబరావు మంచి సినిమాల రూపకల్పనలో ఉన్న కష్టాలు, ఎదురైన అనుభవాలను సైతం సభాముఖంగా చెప్పుకొచ్చారు. “జేబులో రూపాయి లేకపోయినా, సినిమా మీద ఇష్టంతో కష్టపడి ‘భద్రం కొడుకో’ తీశాం. అయితే, అప్పట్లో సినిమాకు అవార్డులు, రివార్డుల రూపంలో కొంత డబ్బులు కూడా వచ్చాయి. అప్పులు చేసి, వడ్డీలకు తెచ్చి ఆర్థికంగా అండగా నిలబడిన మిత్రులకు వారి డబ్బు వెనక్కి ఇవ్వగలిగాం. కానీ, అన్ని సినిమాలూ అలా కావు కదా! కొన్ని సినిమాలకు మాత్రం ప్రభుత్వాలు ఇస్తామని ప్రకటించిన సబ్సిడీలు సైతం రాలేదు.ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హైదరాబాద్‌ను శాశ్వత కేంద్రంగా చేసిన తొలిరోజులవి. ఆసారి హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా ఎంట్రీ లేదు. ఆ సందర్భంలో ప్రభుత్వ పెద్దలు పిలిచి మరీ, పిల్లల సినిమాలు తీయాలన్నారు. అప్పుడలా ఆరుగురు మిత్రులను నిర్మాతలుగా కలుపుకొని, కష్టపడి తీసిందే – ‘పాత నగరంలో పసివాడు’ (1999). ఆ తరువాతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమాయే అంతర్జాతీయ పోటీ విభాగానికి వెళ్ళిన తొలి తెలుగు సినిమా అయ్యింది. అలాగే, కైరో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సహా పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలకు వెళ్ళింది.అయితే, ఎంతో కష్టపడి ఆ సినిమా తీసి, అంత చేస్తే... ఇవ్వాల్సిన రూ. 35 లక్షల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనే లేదు. అదేమంటే కనీసం 11 థియేటర్లలో కమర్షియల్ రిలీజ్ చేస్తేనే ప్రభుత్వ సబ్సిడీ ఇస్తామంటూ ఆఖరికి మెలికపెట్టారు. కమర్షియల్ పాటలు, అసభ్యమైన డైలాగులతో సినిమాలు తీస్తే కానీ అది కుదరని పని. బాలల సినిమాను అలా తీయగలమా? ఫిల్మ్ క్లబ్బులకూ, ఫెస్టివల్స్కూ పరిమితమయ్యే బాలల చిత్రాలను ఆ స్థాయిలో కమర్షియల్ రిలీజ్ చేయడం సాధ్యమేనా? అయితేనేం, ఇలాంటి కష్టాల మధ్యనే అయిదారు బాలల సినిమాలు తీయగలిగాను” అంటూ అక్కినేని కుటుంబరావు తన సినిమా అనుభవాలను సభాముఖంగా పంచుకున్నారు.కుటుంబరావు జీవన సహచరి – ప్రఖ్యాత రచయిత్రి ఓల్గా ఈ సభా కార్యక్రమ నేపథ్యం వివరించారు. సభ మొదటిలో అతిథుల స్వాగతం నుంచి చివరలో ఆత్మీయ బృందానికి పుస్తకాలు అందించడం దాకా ఓల్గా ఆత్మీయత కనపడింది. ఆమె సోదరుడు – సాహిత్య, సినీజీవి రవి మారుతి మొత్తం సభా నిర్వహణను స్వయంగా చూసుకున్నారు.కుటుంబరావు సినిమాలకు కళా దర్శకుడిగా వ్యవహరించిన ప్రఖ్యాత చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, సినీ రంగంలోనూ కృషి చేస్తున్న రచయిత్రి చైతన్య పింగళి, ప్రముఖ కవులు ఆశారాజు, శిఖామణి, యాకూబ్, సీనియర్ జర్నలిస్టులు వేమన వసంతలక్ష్మి, సుధాకర్, రచయిత్రులు ప్రమీలా హరగోపాల్, భండారు విజయ, సమ్మెట ఉమాదేవి, సమ్మెట విజయ, శివలక్ష్మి తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో రవీంద్రభారతి సమావేశ మందిరం సాహిత్య – సినీ వాతావరణంతో కళకళలాడింది. సభ ముగిసిన తర్వాత కూడా సాహితీ ప్రియులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ, కుటుంబరావును అభినందిస్తూ, అక్కడే చాలా సమయం గడపడం కుటుంబరావు – ఓల్గా జంట సంపాదించుకున్న స్నేహసంపదకు నిండైన తార్కాణంగా నిలిచింది.-రెంటాల జయదేవ -
క్లూషియల్: పెదవుల వెనుక మృత్యువు
అర్ధరాత్రి ఒంటిగంట. వ్యాపారవేత్త వేలాయుధం తన విలాసవంతమైన గదిలో శవమై పడి ఉన్నాడు. అతని మరణం నగరంలో సంచలనం సృష్టించింది.కేసు దర్యాప్తు కోసం ఇన్ స్పెక్టర్ అభిమన్యు రంగంలోకి దిగాడు.లంకంత ఇంట్లో ఒక్కడే ఉంటాడు. ఆ ఇంటి వంట మనిషి పురుషుడే, తోటమాలి, పనిమనిషి కూడా పురుషులే!అభిమన్యు క్రైమ్ సీన్ ను పరిశీలిస్తున్నప్పుడు కొన్ని కీలక ఆధారాలు దొరికాయి.వేలాయుధం బుగ్గలు, ఛాతీపై ఎర్రటి లిప్‌స్టిక్ గుర్తులు ఉన్నాయి.ప్రాథమికంగా ఇదొక మహిళ చేసిన హత్యలా కనిపించింది.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వేలాయుధం పెదవులపై ఉన్న విషం వల్ల చనిపోయాడని తేలింది.ఇన్స్పెక్టర్ అభిమన్యు ఆ లిప్‌స్టిక్ గుర్తులను భూతద్దంతో నిశితంగా పరిశీలించాడు. అతని క్రిమినాలజీ అనుభవం ఒక రహస్యాన్ని బయటపెట్టింది. అభిమన్యు వేలాయుధం కుటుంబ నేపథ్యాన్ని తవ్వడం ప్రారంభించాడు. వేలాయుధం తండ్రి మొదటి భార్య కొడుకు, అతని సవతి తమ్ముడు వేలుపిళ్లై మీద అనుమానం వచ్చింది. కానీ అతనే హంతకుడు అనడానికి ఎవిడెన్ కావాలి. వేలాయుధం స్టాఫ్‌ను, పనివాళ్లను, సవతి తమ్ముడిని విచారించాడు. అందరి పెదవుల కొలతలు తీసుకున్నాడు.వేలాయుధంతో ఉన్న వ్యక్తిగత పరిచయం దృష్ట్యా కమిషనర్ కూడా వచ్చాడు.‘చాలా మంచివాడు. ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరం. హంతకుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలి.’ అన్నాడు కమిషనర్.‘కేసు క్లోజ్ అయినట్టే... సంకెళ్లు రెడీ చేయండి కమిషనర్ గారూ... ఏమంటారు? వేలుపిళ్లై...’ వేలాయుధం తమ్ముడి వైపు చూసి అన్నాడు.‘నేనా?.. నేనేమంటాను?’ కంగారుపడుతూ అన్నాడు వేలుపిళ్లై.కమిషనర్ ఇన్స్పెక్టర్ అభిమన్యు వైపు వేలుపిళ్లై వైపు చూశాడు.‘నువ్వు చెబుతావా? నన్ను చెప్పమంటావా? వేలుపిళ్లై వైపు చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.అప్పటికే ఇన్స్పెక్టర్ అభిమన్యు ఆదేశాల మేరకు వేలుపిళ్లై చేతికి సంకెళ్లు తగిలించారు.వేలుపిళ్లై వేలాయుధానికి సవతి తమ్ముడు. అయినా ప్రేమగానే సొంత అన్నగానే చూశాడు. ఆస్తి కోసం క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించాడు వేలుపిళ్లై.‘క్రైమ్ సీ¯Œ లో దొరికిన లిప్‌స్టిక్ మార్కులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాను. ఆడవాళ్ళ పెదవులు చిన్నగా, సున్నితంగా ఉంటాయి. కానీ వేలాయుధం బుగ్గల మీద, ఛాతీ మీద ఉన్న పెదవుల ముద్రలు చాలా వెడల్పుగా, పెద్దగా ఉన్నాయి. అవి కచ్చితంగా ఒక మగాడి పెదవుల సైజు. హంతకుడు మహిళ అని నమ్మించడానికి చేసిన చీప్ ట్రిక్ ఇది.’తన పెదవులకు విషం అంటకుండా... ల్యాబ్‌లలో వాడే సిలికాన్ ప్లాస్టిక్ లేయర్‌ను తన పెదవులపై అతికించుకున్నాడు . దానిపై విషపూరితమైన లిప్‌స్టిక్ రాశాడు. నిద్రపోతున్న వేలాయుధాన్ని నొక్కిపట్టి, ఆ లేయర్ ద్వారా విషాన్ని అతని శరీరంలోకి ఎక్కించాడు’ అని వేలుపిళ్లై వైపు తిరిగి .‘నువ్వు ఆ లేయర్‌ను తీసి నీ ఇంటి వెనుక ఉన్న డస్ట్‌బిన్ లో పడేశావు. మా పోలీసులు దాన్ని వెతికి పట్టుకున్నారు. దాని మీద నీ లాలాజలం ఉంది. అలాగే వేలాయుధం శరీరంపై ఉన్న విషపు లిప్‌స్టిక్ కూడా ఉంది.వేలుపిళ్లైను పోలీసులు జీపు ఎక్కిస్తుండగా చెప్పాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘ఏ ఆస్తి కోసం అయితే నీ అన్నయ్యను హత్య చేశావో.. అదే అన్నయ్య తన తదనంతరం తన యావదాస్తిని నీకు చెందేలా విల్లు రాశాడు. హత్య చేసిన నీకు ఆస్తి రాదు. అనుభవించే అవకాశమూ లేదు. నీ నేరప్రవృత్తి నిన్ను కటకటాల్లోకి నెట్టింది’ చెప్పాడు. -
కథాకళి: ప్రేమ పండు
క్రీ.శ. 1772. అది యశీరప్లో ఒలోనా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పెరూ రెస్కాల్డా.ఆ గ్రామస్థురాలైన లవీనియాకి నిద్ర లేవగానే ఉత్కంఠ పెరిగిపోతోంది. తన శరీరం సాధారణంగా ఉందా లేక ఏదైనా మార్పు వచ్చిందా అన్న ఆందోళన ఆమెని వేధిస్తోంది.పదహారేళ్ళ లవీనియా– మాంసం కొట్టు యజమాని కొడుకు ఫ్రెడినోతో ప్రేమలో పడింది. అతని వయసు పద్దెనిమిది. ఆమె వారానికి రెండుసార్లు మాంసం కొనడానికి అతని కొట్టుకి వెళ్ళేది. ఫ్రెడినో తన తండ్రితోపాటు అక్కడ పని చేసేవాడు. తండ్రి చూడకుండా తనకి ఎక్కువ మాంసం తూచడాన్ని లవీనియా గమనించింది. ఆమె గమనించినట్లు అతను గ్రహిస్తే నవ్వుతూ కన్నుకొట్టేవాడు. ఆదివారాలు చర్చిలో కూడా ఒకరికొకరు తారసపడేవారు.ఓ రోజు ఫ్రెడినో లవీనియాకి మాంసం ఇస్తూ గుసగుసగా చెప్పాడు.‘‘ఇంకో గంట తర్వాత నది ఒడ్డున కలుద్దాం. మూడు పైన్ చెట్ల దగ్గర.’’అతను చెప్పిన సమయానికి వెళ్ళాలని అనుకుంది. కాని తల్లి ఊలు నించి దారం తీసే పని చెప్పడంతో కుదరలేదు.రెండు రోజుల తర్వాత మళ్ళీ మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఆమె అతను వినేలా మరో కస్టమర్‌తో చెప్పింది.‘‘మొన్న నాకు మా అమ్మ చాలా పెద్ద పని ఇచ్చింది. అందువల్ల బయటకి వెళ్ళలేదు.’’అతను లవీనియాతో రహస్యంగా చెప్పాడు.‘‘రేపు అక్కడే సూర్యుడు కొండ మీదకి వెళ్ళే సమయంలో కలుద్దామా?’’‘‘నీ ఆహ్వానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను.’’ సిగ్గుగా చెప్పింది.మొదటిసారి వారిద్దరూ ఏకాంతంలో కలిశారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు అలాగే నిలబడ్డారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది.‘‘నువ్వు చాలా అందగత్తెవి.’’ ఫ్రెడినో చెప్పాడు.లవీనియా నవ్వుతూ చెప్పింది.‘‘అందం కాలంతో వచ్చి కాలంతో వెళ్ళిపోతుందని మా నాయనమ్మ చెప్తూంటుంది.’’‘‘అవును. అందుకే ఈ వయసులో ప్రేమించుకుంటారు. ముసలి వయసులో కాదు.’’ఆమె ఫక్కున నవ్వింది. తర్వాతి కలయికల్లో గర్భవతి అవుతానన్న భయంతో లవీనియా అతన్ని అందుకు అనుమతించలేదు. ఆమె మనసులో మాత్రం ఆ తహతహ ఉంది. చివరికి అది ఆమె మానసిక శక్తిని లొంగదీసింది. ‘‘నేను రేపు రోమ్‌కి వెళ్ళాల్సి వచ్చింది.’’ ఓ రోజు ఫ్రెడినో ఆమెతో చెప్పాడు.‘‘మళ్ళీ ఎప్పుడు వస్తావు?’’ లవీనియా ఆందోళనగా అడిగింది.‘‘మన రాజు జోసెఫ్ ది సెకండ్ రాజప్రసాదంలో మా నాన్న నాకు ఉద్యోగం సంపాదించారు. రాజుగారి వంటశాలలో మాంసం కోసే పని.’’‘‘వెళ్ళక తప్పదా? మానేయచ్చుగా?’’ లవీనియా బాధగా అడిగింది.‘‘వెళ్ళకపోతే రాజు ఊరుకుంటాడా?’’ ఫ్రెడినో నిస్సహాయంగా చెప్పాడు.వారి ఆ చివరి కలయికలో కన్నీళ్ళు చాలానే కారాయి. ఫ్రెడినో రోమ్‌కి వెళ్ళాక లవీనియాకి జీవితం వెలితిగా మారింది. ఏ పని మీద ఉత్సాహం లేదు.మూడు నెలలు గడిచాక తను గర్భవతైందని గ్రహించింది. ఆ కాలంలో పెళ్ళి కాకుండా తల్లి అవడం పెద్ద అపరాధం. ఊరి ప్రజలకి అలాంటి వారిని రాళ్ళతో కొట్టి శిక్షించే హక్కు కూడా ఉండేది. అది తన కుటుంబానికి తీరని మచ్చ. బలవంతంగా కడుపు తీయించుకునే ప్రయత్నంలో చాలామంది మరణించడం గురించి కూడా ఆమె విన్నది. తల్లి కఠినురాలు. తండ్రికి తను గర్భవతినని చెప్పే ధైర్యం లేదు.చివరికి ఆమెకి ఒకటే పరిష్కారం కనిపించింది. ఆత్మహత్య.ఆరోజు చర్చికి వెళ్ళి మేరీ మాతని ప్రార్థించింది. తరువాత నది ఒడ్డుకి వెళ్ళి అక్కడి మొక్కల నుంచి ఎర్రటి విషపు పళ్ళని చాలా కోసుకుంది. తమ కలయిక జరిగిన మూడు పైన్ చెట్ల మధ్య కూర్చుని వాటిని తినసాగింది. వాటి రసం ఆమె దుస్తుల మీదకి కారింది. దాదాపు పాతిక పళ్ళు తిన్నాక ఆమె కళ్ళు మూసుకుని మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడుకుంది.అప్పుడే అక్కడికి ఫ్రెడినో వచ్చాడు. పక్కన ఉన్న పళ్ళని చూసి భయంగా అడిగాడు.‘‘వీటిని తిన్నావా? అయ్యో! ఫ్రెంచ్ ప్రభుత్వం వీటిని నిషేధించింది కూడా. ఎందుకు తిన్నావు?’’‘‘నేను గర్భవతిని. మరో మార్గం లేదు. నువ్వు కొద్దిగా ముందు వచ్చి ఉంటే వీటిని తినేదాన్ని కాదు.’’ లవీనియా కన్నీళ్ళతో చెప్పింది.‘‘నువ్వు లేకుండా నేను బతకలేను.’’ ఫ్రెడినో ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు.అతనూ ఆ పళ్ళని కోసుకుని తిన్నాడు. కొన్ని గంటలు గడిచినా ఇద్దరికీ ఏమీ కాలేదు.‘‘మేరీ మాత అనుగ్రహం.’’ లవీనియా భక్తిగా చెప్పింది.ఫ్రెడినో ఇరువురి తల్లిదండ్రుల అనుమతితో ఆమెని పెళ్ళి చేసుకుని రోమ్‌కి తీసుకెళ్ళాడు.అక్కడ రాజుగారి వంటవాడికి ఆ పళ్ళ గురించి చెప్తే నమ్మలేదు. కాని ఫ్రెడినో తన ముందే వాటిని తిన్నా ఏమీ కాకపోవడం చూసి చెప్పాడు.‘‘ఇది విషపు పండు కాదు. ప్రేమ పండు. దీన్ని వంటల్లో వాడుతాను.’’అలా ఆ పండు క్రమంగా యూరప్, సౌత్ అమెరికాలోని దేశాలకి, అమెరికాకి కూడా వ్యాపించింది. యురోపియన్ సలాడ్‌లో తప్పనిసరి భాగంగా మారిన ఆ పండు పేరు టొమాటో.(నైట్‌షేడ్ అనే విషపుజాతికి చెందిన టొమాటోలని యూరోపియన్ 16వ శతాబ్దం దాకా విషపు పళ్ళుగా నమ్మేవారు. ‘ఎప్పటి నించి ఆ అపనమ్మకం తొలగింది?’ అనే ఆలోచన వచ్చాక) -
వాలెట్ పవర్..!
ప్రపంచంలో గుండెపోటు కంటే, జేబులో పర్స్ లేనప్పుడు వచ్చే ‘జేబుపోటు’ చాలా డేంజర్! ప్రేమలో అయినా, పెళ్లిచూపుల్లో అయినా, ఫ్రెండ్స్‌తో బిర్యానీ పార్టీల్లో అయినా మన గౌరవాన్ని కాపాడేది ఒక్క ‘మనీ పర్స్’ పల్స్ మాత్రమే! ఇలా ప్రపంచాన్ని మొత్తం మోసే పాకెట్ వాలెట్ ఫ్యాషన్‌లోనూ మీ రేంజ్ పెంచేయగలదు. మీరు కనుక ఈ లేటెస్ట్ ట్రెండ్స్, వాటి సీక్రెట్స్ తెలుసుకుంటే!ది మోడ్రన్ లైనప్ఇది ఒక మినిమలిస్ట్ కార్డ్ హోల్డర్. క్యాష్ కంటే కార్డ్స్, యూపీఐలే ఎక్కువ వాడేవాళ్లకి ఇది బెస్ట్. చిన్నగా, స్లిమ్‌గా ఉంటుంది. జేబులో పెట్టుకున్నా ‘ఏమీ లేనట్టు’ ఫీల్ వస్తుంది. క్లీన్ , మోడ్రన్ , అల్ట్రా స్టయిలిష్.క్లాసిక్ బై–ఫోల్డ్ఇది ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ కాని జెంటిల్మన్ స్టయిల్ వాలెట్. క్యాష్, కార్డ్స్ రెండూ క్యారీ చేయాలనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్. కానీ, ఇందులో పాత బిల్లులు, సినిమా టికెట్లు, ఫుడ్ కూపన్స్ అన్నీ నింపేస్తే, వాలెట్ కంటే చిన్న ఫైల్లా కనిపించే చాన్స్ ఉంది!స్మార్ట్ మనీ క్లిప్నోట్లను ఫోల్డ్ చేసి మధ్యలో క్లిప్‌తో లాక్ చేసే ఈ స్టయిల్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్‌లో ఉంది. జీన్స్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. షార్ప్, రిచ్ మ్యాన్ ఎన ర్జీ వైబ్ ఇస్తుంది.లెదర్ అంటే ఎప్పటికీ క్లాస్ఫుల్ గ్రెయిన్ లెదర్ వాలెట్స్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి. బ్లాక్, డార్క్ బ్రౌన్, టాన్కలర్స్ అయితే ఏ అవుట్‌ఫిట్‌కైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు కార్బన్ ఫైబర్, క్యాక్టస్ లెదర్‌లాంటి కొత్త మెటీరియల్స్ కూడా ట్రెండ్‌లోకి వచ్చేశాయి. అంటే, వాలెట్లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది అన్నమాట!కలర్స్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తాయిబ్లాక్ వాలెట్ అంటే క్లాసీ వైబ్. బ్రౌన్ అంటే రిచ్ లుక్. టాన్ అంటే ట్రెండీ స్టయిల్! నేవీ బ్లూ లేదా ఆలివ్ గ్రీన్ అయితే ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ వస్తుంది.ఔట్‌ఫిట్‌కి మ్యాచ్ చేయాలిఫార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రీమియం లెదర్ బై–ఫోల్డ్ బెస్ట్. జీన్స్, టీషర్ట్‌తో అయితే స్లిమ్ కార్డ్ హోల్డర్ లేదా మనీ క్లిప్ సూపర్‌గా సెట్ అవుతుంది. ట్రావెల్ టైమ్‌లో జిప్ వాలెట్స్, పాస్‌పోర్ట్ హోల్డర్స్ చాలా యూజ్‌ఫుల్. అయితే, ఇక్కడ రూల్ ఏంటంటే, మీ వాలెట్ కలర్, మీ బెల్ట్ లేదా షూస్ కలర్‌కి మ్యాచ్ అయితే, లుక్ ఆటోమేటిక్‌గా రిచ్‌గా కనిపిస్తుంది.జాగ్రత్తలు!వాలెట్‌ని ఎక్కువగా నింపేయొద్దు. అలా చేస్తే, జేబులో చిన్న దిండు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. చాలా చీప్‌గా కనిపించే మెటీరియల్ అస్సలు వద్దు. మంచి క్వాలిటీ వాలెట్ అయితేనే క్లాస్‌గా ఉంటుంది.బ్యాక్ పాకెట్లో పెట్టుకుని కూర్చుంటే వాలెట్ షేప్ కూడా మారిపోతుంది. కాబట్టి, ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం బెటర్. (చదవండి: నారికేళంతో నయన సంరక్షణ..!) -
నిక్కమైన చిక్కదనం ఆమె వాక్కు!
‘స్త్రీలకు స్త్రీల ఆసరా ఎప్పుడూ అవసరమే! వాళ్ళు పరస్పరం ద్వేషించుకునేందుకే, ఒకరితో ఒకరు స్నేహం చేస్తుంటారు. అలా ఒకర్నొకరు ద్వేషించుకునే క్రమంలోనే వారిమధ్య ఏదో బంధం పెనవేసుకుంటుంది!’ అన్న మాటలు ఏ స్త్రీద్వేషో అన్నవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 2009లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న జెర్మన్ రచయిత్రి హెర్తా మ్యూల అన్న మాటలివి. ‘అసలు, మృత్యువుతో తలపడడానికి ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితమేం అవసరం లేదు– ఇంకా ముగింపునకు రాని చిన్నపాటి బతుకు చాల’ని కూడా అన్నారు హెర్తా. ఆమె శైలి గురించి చెప్తూ, అది ‘కవిత్వంలోని చిక్కదనంతోనూ, వచనంలోని సూటిదనంతోనూ నిండివుంటుంద’ని స్వీడిష్ ఎకాడెమీ నిపుణులు ఎందుకన్నారో ఇలాంటి మాటలు వింటే అర్థమైపోతుంది. పరాయిచోట్ల తమ మూలభాషనే మాట్లాడుతూ మనుగడ సాగించే జాతి– ప్రజాతుల భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. (ఇది తెలుగుతో సహా అన్ని భాషలకూ వర్తిస్తుంది. ఏమైనా సందేహం ఉంటే, పక్కనే వున్న తమిళనాట్లో తెలుగులు మాట్లాడే భాష వింటే అలాంటి సంశయాలు నిర్మూలమై పోతాయి!) కాఫ్కా తన రచనల్లో వాడిన జెర్మన్ లాంటి భాషనే, హెర్తా మ్యూల సైతం వాడుక చేశారని స్వీడిష్ ఎకాడెమీ పెద్దలు వ్యాఖ్యానించారు. ఇది ప్రశంసా కాదు– అభిశంసా కాదు! ఉన్నది వున్నట్లు చెప్పినమాట మాత్రమే!! ఎటొచ్చీ, కాఫ్కా 40 యేళ్ళపాటు చెక్ రాజధాని ప్రాగ్ నగరంలో బతికాడు– హెర్తా 34 యేళ్ళపాటు రొమానియాలో మనుగడ సాగించారు. అంతే! మనదేశంతో పాటే విదేశీ పాలన కాడి బరువు వదిలించుకున్న దేశాల్లో రొమానియా కూడా ఒకటి. 1947లోనే – నాజీలను మినహాయించి– అఖిలపక్ష జాతీయ ప్రభుత్వం అక్కడ ఏర్పాటయింది. కానీ, మొదటినుంచీ, రొమానియాలో సోవియెట్ పెత్తనం కొనసాగుతూనే వచ్చింది. ‘ఇంక, ఇదేం స్వాతంత్య్రం మహాశయా?’ అని గొంతెత్తి ప్రశ్నించిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు అక్కడి పాలకులు. ఆ దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న జెర్మన్లలో– హెర్తా తండ్రి మాదిరిగా– నాజీ సైన్యంలో పనిచేసినవారూ కొందరున్నారు. వాళ్ళలో వీలైనంతమందిని విరగడ చేసుకున్నారు పాలకులు. మిగిలిన స్త్రీ– శిశు– వృద్ధులను నిర్బంధ శ్రామిక క్షేత్రాలకు తరలించారు. వారి శ్రమఫలాన్ని ‘రొమానియా స్వాతంత్య్ర పోరాటానికైన ఖర్చులకు మింజుమిలె’ జమకట్టుకున్నారు ధర్మప్రభువులు! ఇదే కథను ఇతివృత్తంగా చేసుకుని హెర్తా 2009 లో ‘ఆకలి దేవత’ (ద హంగర్ ఏంజెల్) అనే నవల రాశారు. అదే సంవత్సరం ఆమెకి నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ! వాస్తవానికి అప్పటికి 27 సంవత్సరాలుగా హెర్తా సృజనాత్మక రచనలు చేస్తూనే వున్నారు. 1982లో ఆమె తొలి కాల్పనిక రచన, ‘న్యాదిర్స్’ (అధోలోకాలు) వెలువడింది. రొమానియన్ గ్రామీణ జీవనంలోని చీకటి కోణాలను విమర్శనాత్మకంగా చిత్రించిన అధిక్షేప రచన అది. పల్లెలో బతికే ఓ బాలుడి దృష్టికోణం నుంచి కథనం సాగడం ఇందులో చాలామందిని ఆకర్షించిన విషయం. ముఖచిత్రంపై బోదురుకప్ప బొమ్మతో వెలువడిన ఈ పుస్తకం ఆమెకి అభిమానులనూ, విమర్శకులనూ సమానంగా సంపాదించి పెట్టింది. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జెర్మనులు హెర్తా విమర్శను పూర్తిగా సమర్థించగా, సాంప్రదాయిక జెర్మనులు ఆమెని దుమ్మెత్తి పోశారు. కాగా, కమ్యూనిస్టు యువజన సంఘం ఈ రచనకు పురస్కారం ప్రకటించి నెత్తినపెట్టుకోవడం విశేషం.హెర్తా మ్యూల 1994లో రాసిన ‘ఆకుపచ్చ పళ్ళతోట’ ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ రచనకు –జెర్మన్ భాషలో– హెర్తా పెట్టిన పేరు ‘హెర్జ్ టియర్.’ ఇది జెర్మన్ భాషలో వాడుకలో వున్న మాట కాదు– హెర్జ్(గుండెకాయ)+ టియర్ (జంతువు) అనే రెండు మాటల్ని కలిపి జంతుప్రవృత్తి అనే అర్థంలో ఈ మాటను సృష్టించారు హెర్తా. నికలాయ్ చౌషెస్క్యూ హయాంలో అణచివేతను తప్పించుకునే నిమిత్తం జెర్మనీకి పారిపోయిన నలుగురు యువజనుల కథ ఇది. వారిలో ఒకరుగా వున్న ఓ యువతి దృష్టికోణం నుంచి కథనం సాగుతుంది. పాశవిక ప్రవృత్తి కలిగిన పాలకులు, పాలితుల ప్రవృత్తిలో సైతం ఒకింత పాశవికత చొరబడేలా చేస్తారన్నది కథకురాలి ధ్వని. ఈ నవలను ‘చౌషెస్క్యూ హయాంలో బలైపోయిన సహచరుల స్మృతికి’ అంకితం చేశారు హెర్తా. చేదు నిజాలను చెప్పేందుకు హెర్తా ఎన్నడూ వెనకాడలేదు– అందుకే, స్వదేశంలో పరాయిజనంగా బతికిన రొమానియన్ జెర్మన్లు, జెర్మనీ నడిగడ్డపైనా అదే ‘హోదా’ సంపాదించుకోగలిగారని అనడానికి ఆమె జంకలేదు! 1947లో స్వాతంత్య్రంతో పాటే మనజాతికి సంక్రమించిన దేశవిభజన సందర్భంగా, పాకిస్తాన్ తరలి వెళ్ళిన అమాయక ముసల్మానులు అక్కడ ముహాజిర్ హోదానే పొందారు. మన దేశంలోనే మిగిలిపోయిన వాళ్ళు బావుకున్నది మాత్రమేముందని? ఇది ఓ అంతర్జాతీయ విషాద కావ్యం అనొచ్చునేమో!మందలపర్తి కిషోర్ -
ఆఖరి మనిషి
గాఢాంధకారం. ఎటు చూసినా చీకటే. నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. భూమి మీద ఆ రాత్రి– కాళరాత్రి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శబ్దాల మధ్య నిశ్శబ్దంలా, అస్తిత్వం ముగిసిన తర్వాత మిగిలే శూన్యంలా భూమి కనిపిస్తోంది.ఇంతలో గాలి బలంగా వీచింది. కానీ ఆ గాలిలో జీవం లేదు. ఆ గాలి ఒకప్పుడు మానవులకు ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు జీవకోటి మొత్తం నాశనం అయి పుడమి అంతా బోసిపోయి కనిపిస్తోంది. ఆ సమయంలో ఒక కదలిక కనిపించింది. అందులో శబ్దం లేదు. అది అడుగుల చప్పుడూ కాదు. అది ఒక ఉనికి. భూమి కూడా గుర్తుపట్టని ఒక ఆకారం వస్తూ కనిపించింది. ఆమె ఆకాశం నుంచి దిగలేదు. భూమి లోతుల్లోనుంచి పైకి రాలేదు. ఆమె ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. కానీ ఈరోజు ఆమెను చూడగలిగే కళ్ళు లేవు.ఒకప్పుడు కోట్లాది హృదయాల్లో నిశ్శబ్దంగా నివసించిన ఆమె, ఈరోజు ఖాళీ ప్రపంచంలో తన ఉనికిని తానే మోస్తోంది. ఆమె అడుగులు నేలను తాకలేదు. కానీ ఈ ధరిత్రి ఆమెను చాలాకాలం భరించింది. ఆమె నడిచి వస్తుంటే నదులు పొంగినట్లు, అడవులు కదిలినట్లు, ఉరుములు ఉరుముతున్నట్లు, పర్వతాలు ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను అడ్డుకోలేదు కూడా. ఆమెకు అడ్డుచెప్పేవారు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. ఆమె నడుస్తోంది. శిథిలమైన నగరాల మధ్యగా, విరిగిన గాజు ముక్కల మీదుగా, శిథిలాల నిశ్శబ్దాన్ని దాటి ఆమె వస్తోంది. ఆమె ప్రతి అడుగులో రౌద్రం కనిపిస్తోంది.ఈ భూమ్మీద మొదటి మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి మనిషి శ్వాస వరకు ఆమెకు నిద్ర లేదు. ఆమెకు కాలం అనే పరిమితి లేదు. ఒక పాత నగరం మధ్యలో ఆమె ఆగింది. అక్కడ ఒక నిశ్శబ్దం మధ్యలో చిన్న శబ్దం వినిపిస్తోంది. అది ఎవరిదో శ్వాస. అది బలహీనంగా ఉంది. అది ఆఖరి మనిషి శ్వాస. ఆమె కళ్ళు మూసుకుంది. అతని కోసం ఆమె వెతకాల్సిన అవసరం లేదు. జీవం తనను తానే బయట పెట్టుకుంటుంది. భయం ఎప్పుడూ దాక్కోలేదు. ఆమె మెల్లగా ఆ దిశగా నడిచింది. ఆమె అడుగులు వేగంగా లేవు. అవి ఎప్పుడూ తొందరపడవు. కానీ ఆమె అవి సమయానికి చేరవలసిన చోటుకి చేరుకుంటాయి.ఒకప్పుడు మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, అడవులతో కళకళ లాడుతూ ఉండే ధరిత్రి అంతా రుద్రభూమిని తలపిస్తోంది. ఆమె ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగింది. అంతటా నిశ్శబ్దం. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమెకు ఒక సవ్వడి వినిపించసాగింది. కొద్ది క్షణాల తరువాత అది గుండె సవ్వడిగా ఆమెకు అర్థమైంది. అది మనిషి శ్వాస. లబ్ డబ్‌మని వినిపిస్తున్న ఆ శబ్దం నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అక్కడ కొద్ది దూరంలో ఉన్న కొండ పక్కన ఒక చిన్న ఇంట్లోంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె ఆ శ్వాస వస్తున్న ఇంటి వైపు కదిలింది. ఇంటి మధ్యలో ఒక గోడ ఉంది. లోపల ఒక వ్యక్తి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలబడింది. అతను ఒక్కసారిగా తలెత్తి ఆమెని చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. పెదవులు వణకసాగాయి. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.అతని మాటలకు ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ గది అంతా ప్రతిధ్వనించసాగింది. ఆ నవ్వులో సత్యం వినిపిస్తోంది.‘‘నేనెవరో నీకు తెలియదా?’’ అని ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.అతను భయంతో వెనక్కి జరిగి, ‘‘నా...కు ను...వ్వు ఎ...వ...రో... తెలియదు’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.‘‘నేనెవరో తెలిసినా నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఎందుకంటే నేను రావడం నీకు ఇష్టం లేదు. నీకే కాదు, ఏ జీవికీ ఇష్టం ఉండదు. నేనంటే మీకు భయం. అయినా సమయం వచ్చినప్పుడు నేను రాక తప్పదు. ఇది నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోరు. అందరూ వెళ్లిపోయారు. నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా తీసికెళ్ళిపోతే నా పనై పోతుంది. బయలుదేరు. సమయం మించిపోతోంది. ఇప్పటికే ఆలస్యం అయింది’’ అంది ఆమె కోపంగా.‘‘నేను నీతో రాను. నాకు ఇక్కడ బోలెడు పనులు వున్నాయి. నేను నీతో వస్తే అవన్నీ ఆగిపోతాయి. నేను తరువాత వస్తాను. అయినా నేను నీతో ఎందుకు రావాలి? నన్ను తీసికెళ్ళడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు వుంది?’’ అని అన్నాడు అతను గోడ దగ్గరకు వెళుతూ.అతని మాటలకు ఆమె కోపంగా అతనివైపు చూసింది. అంతే! గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అతని వైపు వెళ్ళసాగింది. ఇప్పుడు ఆమె కళ్ళలో కోపం లేదు. దయ లేదు. జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించటం లేదు.‘‘నేనెవరో నీకు తెలుసు. అయినా మీ మనుషులు మీ గోతిని మీరే తవ్వుకున్నారు. హాయిగా బతకమని మిమ్మల్నందరినీ ఇక్కడకు పంపిస్తే మీరు ఇక్కడ వినాశనాన్ని సృష్టించారు. యుద్ధాలు మొదలయ్యాయి. అణుబాంబులు, రసాయన ఆయుధాలతో మనిషి మనిషినే చంపడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో పోరాడుతున్నానని అనుకున్నాడు. కానీ తన జాతిని తానే నాశనం చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. చివరకు తానే తన జాతి పాలిట రాక్షసుడయ్యాడు. మీ జాతితో పాటు ఇక్కడి ప్రకృతిని, జంతుజాలాన్ని, అడవుల్ని కూడా విధ్వంసం చేశాడు. అందుకే మీరు ఇక్కడుండే అర్హత కోల్పోయారు’’ అంటూ ఆమె అతని వైపు చేయి చాపింది.‘‘ఎవరో తప్పు చేస్తే దానికి మేమెలా కారణం అవుతాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి. అయినా అంత తప్పు మేమేం చేశాము? మేము ప్రకృతిని స్వంతం చేసుకోవాలని చూశాము. ఆమెతో కలిసి లేకపోయాము’’ అన్నాడు ఆ వ్యక్తి.ఆ మాటలు అంటూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అప్పుడతనికి తమ జాతి చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. నిజం ఎప్పుడూ నిజమే. అది అబద్ధం ఎప్పటికీ కాదు. ‘Truth is rarely pure and never simple’’ (సత్యం అరుదుగా స్వచ్ఛమైనది, అదెప్పుడూ సులువైనది కాదు) అన్న ‘ఆస్కార్ వైల్డ్’ మాటలు అతనికి అప్పుడు గుర్తుకు వచ్చాయి.అతని మాటలు ఆమెకు కోపాన్ని తెప్పించాయి. మీరేం తప్పు చేశారో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీ కోసం ఆ దేవుడు ఈ అందమైన భూగోళాన్ని సృష్టించాడు. అది అగ్నిగోళంగా మొదలై, జలగోళంగా మారి, జీవకోటికి అనువుగా మారింది. ఈ భూమి మీద మొదటిసారిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మకణం కదిలి జీవం పోసుకొని ప్రాణిగా మారింది. తరువాత అది జీవ పరిణామం చెందింది. విస్తరించింది. చివరకు మనిషిగా రూపుదిద్దుకుంది. అయితే మనిషి పుట్టుకనుంచే దారి తప్పాడు. ‘Nature is the source of all true knowledge’’ (సమస్త జ్ఞానానికీ ప్రకృతే మూలాధారం) అని మీ మనిషే అయిన లియోనార్డో డా విన్సీ చెప్పాడు. కానీ మీరు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ప్రకృతి నుంచే జ్ఞానం పుట్టింది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే వినయం మనిషి కోల్పోయాడు. మనిషి గొప్ప పనులను చెయ్యగలడు. గొప్పగా ఆలోచించగలడు. సృష్టికి ప్రతిసృష్టిని చెయ్యగల నేర్పరి. అది అతని మహత్తు. అది అతని వరం. కానీ అదే అతని శాపమైంది. అతను అగ్నిని కనుగొన్నాడు. చక్రాన్ని సృష్టించాడు. భాషను కనిపెట్టాడు. లిపిని తయారు చేసుకున్నాడు. కానీ అతను తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. ‘Knowledge is power, but wisdom is restraint.’’ (జ్ఞానం శక్తి, కాని వివేకం నియంత్రణ) జ్ఞానం అతనికి శక్తిని ఇచ్చింది కానీ, జ్ఞానం మీద నియంత్రణను అతను కోల్పోయాడు. అందువల్ల అదే అతని వినాశనానికి కారణభూతమైంది. ఈ భూమి మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్ద తపస్సు తర్వాత జీవకోటి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఈ ధరిత్రి అనేక జనన మరణాలను చూసింది. ‘The Earth does not belong to man; man belongs to the Earth.’’ (భూమి మనిషిది కాదు, మనిషి భూమికి చెందుతాడు) భూమి ఎవరికీ చెందదు. కానీ ఆ విషయాన్ని మీ మనుషులు గుర్తించలేకపోయారు. మట్టిలోంచి పుట్టిన మనిషి, మట్టిలో కలవాల్సిందే అన్న నగ్నసత్యం అతనికి ఎప్పుడూ అర్థం కాలేదు. ఫలితం– అడవులు నాశనం అయ్యాయి. నదులు ఎండిపోయాయి. పర్వతాలు తరిగిపోయాయి. తాను ప్రకృతిని జయిస్తున్నానని అనుకున్నాడు. ‘Man conquers nature only to discover he has conquered himself..’’ (మనిషి తనను తాను జయించానని కనుగొనడానికి ప్రకృతిని జయిస్తాడు) కానీ అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోలేకపోయాడుప్రకృతిని జయించినట్టు అనిపించిన ప్రతి క్షణం, తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఆమె హెచ్చరికలు మెల్లగా వస్తాయి. గాలి వేడెక్కింది. నీళ్లు విషపూరితం అయ్యాయి. జీవజాలం క్షీణించింది. కానీ పట్టించుకోలేదు. ‘We do not inherit the Earth from our ancestors’’ (భూమిని మనం మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు) కానీ భూమిని, దాని మీద వుండే ప్రకృతిని మీ మనుషులు తన స్వంత ఆస్తి అనుకున్నారు. దాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.అందుకే అది మీ మీద కన్నెర్ర చేసింది. ఒక రోజు అది తన ప్రతాపాన్ని చూపింది. అందువల్ల అగ్ని వర్షాలు, ఆమ్ల వర్షాలు కురిశాయి. గాలి విషంలా మారింది. భూమి కంపించింది. మనిషి పరుగెత్తాడు. దాక్కున్నాడు. పోరాడాడు. కానీ ‘nature is not cruel, just unapologetically true to itself ’’ (ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తనకు తాను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన స్వభావానికి కట్టుబడి ఉంటుంది) ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తన నిజ స్వరూపానికి కట్టుబడి ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ప్రకృతిని మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ చివరకు మీరే నాశనం అయ్యారు. అందుకే మీ జాతి అంతరించిపోయింది. చివరికి నువ్వొక్కడివే మిగిలావు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ భూమ్మీద మిగతా జీవరాశులు హాయిగా నివసిస్తున్నాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం మీ మనుషులు వానర జాతి కుటుంబానికి చెందినవారు. కాలక్రమేణా మీరు ద్విపాదులయ్యారు. అటువంటి గొప్ప మానవుల్లో నువ్వు ఆఖరి మనిషివి. నిన్ను తీసికెళదామనే నేను ఇప్పుడు వచ్చాను. బయలుదేరు’’ అంది ఆమె.ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోతూ, ‘‘నేను చచ్చినా రాను. ఇంతకీ నన్ను తీసికెళ్ళడానికి నువ్వెవరివి?’’ అని అడిగాడు ఆ ఆఖరి మనిషి.అతని మాటలకు ఆమె నవ్వుతూ ‘‘ఇంకా నన్ను పోల్చుకోలేదా? నేను మీ జాతిని సర్వనాశనం చెయ్యడానికి ఆ ప్రకృతి పంపించిన మృత్యుదేవతను’’ అంటూ తన చెయ్యిని అతని వైపు తిప్పింది. వెంటనే ఆ చేయి అతని వైపు కదల సాగింది. అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్పర్శ ఆగిపోతున్నట్లు భావన కలుగుతోంది. అతను కొద్ది క్షణాలకు అచేతనుడయ్యాడు. వెంటనే అతను మేల్కొన్నాడు. అతను బయటకు వెళ్లి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. అతను చాలాసేపు పరిగెత్తిన తరువాత అలసిపోవడం వల్ల బాగా దాహం వేసి ఒక చెట్టు కిందకు చేరాడు. కానీ అక్కడ నవ్వుతూ అదే మృత్యుదేవత కనిపించింది.‘‘ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎంత దూరం వెళతావు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీ వెంటే ఉంటాను. నీ మృత్యువు ఎప్పుడూ నీ నీడలా నీ వెంటే ఉంటుంది. అటువంటి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా చేతులు కబంధుడిలా చాలా పెద్దవి’’ అంది ఆమె నవ్వుతూ.అప్పుడు అతను ‘‘దయచేసి నన్ను వదిలెయ్యి. నేను కూడా చనిపోతే ఈ భూమ్మీద మనిషి అన్నవాడి ఆనవాలు లేకుండా పోతుంది. ‘I am the Last Man! ... No king, no lord, no slave, no master; but aman, alone in the world!’’ (నేను ఆఖరి మనిషిని!... రాజును కాదు, ప్రభువును కాదు, బానిసను కాదు, యజమానిని కాదు; కేవలం మనిషిని, ఈ ప్రపంచంలో ఏకాకిని) అనీ అతను వేడుకున్నాడు.అప్పుడు మృత్యువు నవ్వింది.’ You were never meant to last forever’’ (ఎల్లకాలం మనుగడ సాగించడానికి నువ్వు లేవు) మీ జాతి తన పరిమితిని దాటి వెళ్లింది. ఇక మిమ్మల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు’’ అంది అతని దగ్గరకు వస్తూ. ‘‘అమ్మా! దయచేసి నా దగ్గరకు రావద్దు. మేము తప్పు చేశాము. అంత మాత్రాన మా జాతి ఉనికి లేకుండా చేస్తావా? ఇది న్యాయమా చెప్పు?’’ అని ఆమెకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.క్షణం తరువాత ఆమె చేయి అతన్ని తాకింది. ఆ స్పర్శ చలిగా లేదు, వేడిగా లేదు; అతనికి స్పర్శ తెలియటం లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడతనికి భయం పోయింది. అహంకారం కరిగిపోయింది. మృత్యువు అతనిని తాకింది. ఆఖరి మనిషి చరిత్ర పుటల్లో చివరి పంక్తిగా మిగిలిపోయాడు. గాలి మళ్లీ స్వచ్ఛమైంది. వర్షం మళ్లీ మృదువుగా కురిసింది. ప్రకృతి మళ్లీ మొదలైంది. మనిషి లేకుండా కూడా ఆమె సంపూర్ణమే. ‘All the world's a stage, and all the men and women merely players.’’ (ప్రపంచమంతా నాటకరంగం. స్త్రీ పురుషులంతా నటీనటులు) అని విలియం షేక్స్పియర్ చెప్పాడు. కానీ భూమ్మీద మనిషి ఆడే నాటకంలో మనిషి పాత్ర ముగిసింది. కానీ వేదిక ఇంకా ఉంది. నిశ్శబ్దం. ఆ చెట్టు కింద గాలి కూడా ఊపిరి బిగబట్టి నిలిచినట్టుంది.ఆఖరి మనిషి ఆమె ముందు అచేతనుడై పడివున్నాడు. ఆ రాత్రి ఒక మనిషి చనిపోలేదు, ఒక జాతి కథ ముగిసింది. మనిషి శాశ్వతం కాదు. మనిషి తన మూలాన్ని మరచిపోయిన క్షణమే అతని వినాశనం ప్రారంభమైంది. మనిషి ఆలోచించాడు. ఆ ఆలోచన అతనికి శక్తి ఇచ్చింది. కానీ ఆ శక్తి అతని మితిమీరిన ఆకాంక్షలకు ఆయుధమైంది. ఆకాశాన్ని తాకాడు, సముద్ర గర్భాన్ని చీల్చాడు. కానీ, తన అంతర్ముఖంలో ఉన్న లోపలి అంతరాత్మను మాత్రం జయించలేకపోయాడు. మనిషికి జ్ఞానం పెరిగింది, వివేకం తగ్గింది.కొద్ది క్షణాల తరువాత ఆమె ఒక పుస్తకం తీసి అందులో ఆఖరి మనిషి అన్న వాక్యం దగ్గర ఒక ఇంటూ మార్కు పెట్టింది. ఇప్పుడు ఆ పుస్తకం నిండా ఎర్రటి ఇంటూ మార్కులే. అది ఆ పుస్తకం చివరి పేజీ.గన్నవరపు నరసింహ మూర్తి -
ఊళ్లో నెమళ్ల బెడద
నెమళ్లు పురివిప్పి నాట్యమాడితే కనులపండుగగా ఉంటుంది. ఆరుబయట నెమళ్లు తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వందకు పైగా నెమళ్లు ఒక ఊళ్లోకి చేరి, యథేచ్ఛగా వీథుల్లో తిరుగుతూ, ఇళ్లలోకి చొరబడుతూ, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఉంటే మాత్రం ఊరి జనాలకు బెడదగానే ఉంటుంది. ఇటలీలోని పుంటా మెరీనా అనే చిన్న పట్టణలలో జనాలకు నెమళ్లతో చెప్పరాని తంటాగా ఉంటోంది.సముద్ర తీరంలో ప్రశాంతంగా ఉండే ఈ ఊళ్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో ఏకంగా వందకు పైగా నెమళ్లు వచ్చిపడ్డాయి. ‘కోవిడ్’ కాలంలో చుట్టుపక్కల అడవి నుంచి ఊళ్లోకి దాదాపు వందకు పైగా నెమళ్లు వచ్చాయి. కొత్తలో జనాలకు బాగానే ఉండేది. ఇప్పుడు వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.ఇవి యథేచ్ఛగా రోడ్ల మీద సంచరిస్తుంటే, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఇళ్లల్లోకి కూడా చొరబడుతున్నాయి. పిట్టగోడలు ఎక్కి, ఇళ్లల్లో రెట్టలు వేయడం, ఇళ్లలోకి దూరి తిండి కోసం గిన్నెలు తిరగవేయడం వంటి చేష్టలు కూడా చేస్తుండటంతో జనాలు స్థానిక అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో వీటిని సురక్షితమైన చోటుకు తరలించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు. -
కాలుష్య సాగరాలు
మనం నివసించే భూగోళం ఉపరితలం మీద దాదాపు 70% సముద్రాలే నిండి ఉన్నాయి. భూమ్మీద ఉండే నీటిలో దాదాపు 96.5% నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్రాల్లోని నీటి ఘనపరిమాణం 130 కోట్ల ఘనపు కిలోమీటర్లు. భూమ్మీద వెలువడే కర్బన ఉద్గారాల్లో అత్య«ధిక మొత్తాన్ని పీల్చుకునేది సముద్రాలే! భూమ్మీద జీవరాశి మనుగడకు రక్షణ వలయంగా నిలుస్తున్న సముద్రాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు సముద్రాల్లోకి మితిమీరి చేరుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, సముద్రాల్లోకి చేరుతున్న కాలుష్యాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవి పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. సముద్రాలకు ఎదురవుతున్న కాలుష్యాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...సముద్రాలకు ప్లాస్టిక్ బెడద ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు రసాయనాల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా సాగర తీరాల్లో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, ఏడాదికేడాది సాగర తీర మృత ప్రాంతాలు (కోస్టల్ డెడ్ జోన్స్) పెరుగుతూ వస్తున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే నత్రజని, ఫాస్ఫరస్ ఎరువులు మితిమీరి సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటివల్ల సముద్రాల్లో నాచు అతిగా పెరిగి, చనిపోయిన నాచు సముద్రాల అడుగుకు చేరుకోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది. గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కోస్టల్ డెడ్ జోన్స్ వివరాలు గణాంకాల్లో... -
స్కూల్ సీజన్ స్టార్ట్
ఉదయపు యుద్ధాలు మళ్లీ మొదలవుతున్నాయి. అలారం విలన్లా అరుస్తుంటే, ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటున్న పిల్లల్ని కాపాడేందుకు దుప్పట్లు ఫైట్ చేస్తున్నాయి. స్కూల్ బస్సులు హారన్ లు మోగిస్తున్నాయి. కొత్త బ్యాగుల జిప్‌లు తెరుచుకుంటున్నాయి. కాళ్లు చాపుకుని మూలన నిద్రపోతున్న షూస్ డ్యూటీలోకి దిగుతున్నాయి. కిచెన్‌లో లంచ్ బాక్స్‌లు తమ హడావుడి స్టార్ట్ చేసేశాయి.కొత్త కొత్త కవర్స్‌తో రెడీ అయ్యి, పుస్తకాలు ఇల్లంతా తిరుగుతున్నాయి! ఇలా రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత, పిల్లల ప్రపంచం మళ్లీ ‘స్కూల్ మోడ్’లోకి వచ్చేస్తోంది. ఆలస్యంగా లేచే రోజులకి గుడ్‌బై చెప్పి, ప్రతి విద్యార్థి కొత్త క్లాస్, కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త నోట్బుక్స్లతో ఒక చిన్న ‘న్యూ ఇయర్’ ఫీలింగ్‌తో మెరిసిపోతూ, స్కూల్ సీజన్ ను స్టార్ట్ చేస్తున్నారు.చిన్న ప్రపంచం మళ్లీ మొదలు!జూన్ నెల అడుగుపెట్టిందంటే చాలు– రెండు నెలల పాటు మూలన పడేసిన స్కూల్ బ్యాగుల వెలుగులు, యూనిఫామ్‌లకు ఇస్త్రీ వేడి మొదలవుతుంది. షూ షాపులు, బుక్ స్టాళ్లలో పేరెంట్స్ టెన్షన్ , స్టేషనరీ దుకాణాల్లో ‘ఇంకో కవర్ కూడా పెట్టండి’ అనే బేరసారాలు కనిపిస్తాయి. ‘బ్యాక్ టు స్కూల్’ మోడ్‌తో మార్కెట్ కూడా కార్టూన్ బ్యాగులు, సూపర్‌హీరో వాటర్ బాటిల్స్, లైట్లు వెలిగే కంబాక్స్లు, ‘టాపర్ స్టడీ టేబుల్’ అంటూ కొత్త డిజైన్స్‌తో ఆకట్టుకుంటుంటే, పిల్లలు ‘కొత్త బ్యాగ్ కావాలి..’ అంటూ బ్లాక్ మెయిల్స్ స్టార్ చేస్తారు.అమ్మలు యూనిఫామ్‌లకు పేర్లు కుట్టడంలో బిజీ అయిపోతే, నాన్నలు ‘ఈ ఏడాది ఫీజు ఎందుకింత ఎక్కువ?’ అంటూ క్యాలిక్యులేటర్‌తో వేసిన లెక్కలనే వేస్తూ ఫైట్ చేస్తుంటారు. మరోవైపు, స్కూల్ బస్సులు మళ్లీ రోడ్లపై రంగంలోకి దిగి, ఉదయాన్నే కాలనీలను నిద్రలేపుతుంటాయి. అలా సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు ఇప్పుడు మళ్లీ స్కూల్ ప్రపంచంలోకి అడుగుపెడతారు.రీల్స్ ఆల్బమ్!ఒకప్పుడు స్కూల్ ఓపెనింగ్ అంటే కొత్త యూనిఫామ్‌లో ఒక ఫోటో తీసి ఆల్బమ్‌లో పెట్టేసేవారు. కానీ ఇప్పుడు? అదే సీన్ రీల్‌గా మారి ఇన్ స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది! ‘ఫస్ట్ డే ఆఫ్ స్కూల్’ అంటూ చిన్నారుల ఎంట్రీలు, యూనిఫామ్ ట్రాన్సిషన్ వీడియోలు, రంగురంగుల లంచ్‌బాక్స్ క్లిప్స్, ‘మై కిడ్ గోయింగ్ టు స్కూల్’ వ్లాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్‌లో ఉన్నాయి. కొందరు పిల్లలు స్కూల్ గేట్ దగ్గర స్టయిల్‌గా పోజులు ఇస్తుంటే, ఇంకొందరు ‘స్కూల్‌కి వెళ్లను’ అంటూ ఏడుస్తూ కూడా వైరల్ అవుతున్నారు. అమ్మలు లంచ్‌బాక్స్‌తో, నాన్నలు బ్యాగ్ మోసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ కేవలం ఎడ్యుకేషన్ ఈవెంట్ కాదు, సోషల్ మీడియా కంటెంట్ సీజన్ లా కూడా మారిపోయింది.ఫస్ట్ డే.. ఫస్ట్ ఫీల్!స్కూల్ మొదటి రోజు అంటే ఒక చిన్న ఎమోషనల్ సినిమా నడిచినట్టే! ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ పిల్లలైతే స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లగానే ‘అమ్మా.. నువ్వు కూడా రా!’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం కామన్ . కొందరు చిన్నారులు బ్యాగ్ పట్టుకుని ధైర్యంగా వెళ్లిపోతే, ఇంకొందరు మాత్రం అమ్మ చున్నీని వదలకుండా చిన్నపాటి డ్రామా స్టార్ట్ చేద్దామా వద్దా అనే డౌట్ ఫేస్‌లతో నిదానంగా నడుస్తుంటారు.ఎలాగోలా పిల్లల్ని లోపలి పంపిన అమ్మలు కొందరు, ఇంకా గేట్ బయటే నిలబడి క్లాస్రూమ్ వైపు చూస్తుంటే, ‘ఏడవడం ఆపేశాడా?’ అని టెన్షన్ పడే నాన్నలు అక్కడే కనిపిస్తారు. పిల్లల్ని నవ్విస్తూ క్లాస్‌లోకి తీసుకెళ్లే లేడీ టీచర్స్, కాస్త పెద్ద పిల్లలను ‘త్వరగా.. త్వరగా..’ అంటూ గట్టిగా అరిచే పీటీ మాస్టర్స్ ఉంటారు. ఇలా ఫస్ట్ డే స్కూల్ సీన్లు ప్రతి ఏడాది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ చిన్న కన్నీళ్ల వెనుకే పిల్లల కొత్త ప్రపంచం, కొత్త ప్రయాణం మొదలవుతుంది!పిల్లలకు ఎగై్జట్‌మెంట్ ప్లస్ టెన్షన్ !కొత్త క్లాస్‌లో ఎవరు ఫ్రెండ్ అవుతారు? కొత్త టీచర్ స్ట్రిక్ట్‌గా ఉంటారా? హోంవర్క్ ఎక్కువ ఇస్తారా? ఇలా పిల్లల మైండ్‌లో కూడా చిన్న చిన్న ప్రశ్నలే! కానీ కొత్త బ్యాగ్, కొత్త షూస్, కొత్త నోట్‌బుక్స్ చూస్తే మాత్రం ఆ టెన్షన్ కంటే ఎగై్జట్‌మెంట్ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ డే స్కూల్ అంటే చాలామందికి ‘ఫ్యాషన్ షో’ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎవరి బ్యాగ్ బెటర్? ఎవరి పెన్ కొత్తది? ఎవరి వాటర్‌బాటిల్ కూల్‌గా ఉంది? అనే సీక్రెట్ కంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది! సెలవుల్లో ఆటపాటలతో ఎక్కువకాలం గడిపిన పిల్లలు స్కూల్లోకి తిరిగి అడుగుపెడుతూనే పాఠాలు వినే మూడ్‌లో ఉండరు. వాళ్లను తిరిగి పాఠాల వైపు మళ్లించడానికి టీచర్లు నేరుగా సిలబస్ మొదలుపెట్టకుండా, కొంత ఓపికతో ప్రయత్నించాలి. - కృష్ణభరత్, సైకాలజిస్ట్టీచర్స్కి కూడా ఇదే న్యూ ఇయర్!స్కూల్ ఓపెనింగ్ అంటే కేవలం పిల్లలకే కొత్త మొదలు కాదు.. టీచర్స్‌కి కూడా అదే ‘న్యూ ఇయర్’ ఫీలింగ్! కొత్త సిలబస్, కొత్త టైమ్‌టేబుల్స్, కొత్త స్టూడెంట్స్, కొత్త టార్గెట్స్‌తో వారి అసలు హడావుడి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవైపు క్లాస్‌రూమ్‌లో పిల్లల అటెన్షన్ ను పట్టుకోవాలి; మరోవైపు మొబైల్, రీల్స్, గేమ్స్ ప్రపంచం నుంచి వారిని బయటకు తీయాలి. ఇప్పుడు టీచర్స్‌కి మరో కొత్త చాలెంజ్ కూడా వచ్చేసింది; అదే ‘చాట్‌జీపీటీ హోంవర్క్స్!’ పిల్లలు నిజంగా చదివారా? లేక ఏఐతో అసైన్ మెంట్ చేయించారా? అనేది కూడా గుర్తించాల్సి వస్తోంది. పేరెంట్స్ అయితే మొదటి రోజే స్కూల్ వాట్సాప్ గ్రూప్స్‌లో ‘హోంవర్క్ ఏమిచ్చారు మేడమ్?’, రేపు కలర్ డ్రెస్నా?’ వంటి మెసేజ్‌ల వరద మొదలుపెడుతుంటారు. - పి. మాధవి దేవి ప్రిన్సిపాల్, వైఆర్ఎల్ స్కూల్, సామర్లకోట. స్మూత్ ‘బ్యాక్ టు స్కూల్’ కోసం స్మార్ట్ టిప్స్!నిద్ర టైమ్‌ను ముందే రీసెట్ చేయండిసమ్మర్ హాలీడేస్ అంతా లేట్‌గా పడుకుని, ఆలస్యంగా లేవడం పిల్లలకు అలవాటైపోతుంది. అందుకే స్కూల్ ఓపెన్ అయ్యే వారం ముందు నుంచే రోజుకు 15–20 నిమిషాలు ముందుగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం ప్రాక్టీస్ చేయించాలి. లేదంటే ఫస్ట్ డేనే స్కూల్‌కి లేట్‌గా వెళ్లడమో, ఉదయం ఇంట్లో ‘ఇంకో 5 నిమిషాలు’ డ్రామానో గ్యారంటీ!బడ్జెట్ షాపింగ్ బెస్ట్షాపింగ్కి వెళ్లే ముందు ఇంట్లో ఇప్పటికే ఉన్న బాటిల్స్, పెన్సిల్స్, బ్యాగ్స్, స్టేషనరీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరమైన వాటికే లిస్ట్ తయారు చేసుకుని వెళ్తే.. ‘కార్టూన్ ఉంది కాబట్టి కొనాలి’అనే ఖర్చులు కాస్త తగ్గుతాయి!లంచ్బాక్స్కి చిన్న స్ట్రాటజీ పెట్టండిస్కూల్ మొదటి రోజుల్లో పిల్లలు టిఫిన్ పూర్తిగా తినకపోవడం కామన్ . అందుకే మొదటి రెండు వారాలు వారికి ఇష్టమైన, సులువుగా తినగలిగే ఫుడ్‌ను ప్లాన్ చేయాలి. బాక్స్ ఖాళీగా ఇంటికి వస్తే, మదర్స్‌కి వచ్చే ఆనందం వేరే లెవెల్!బ్యాగ్ బరువు చెక్ చేయండిఅవసరం లేని పుస్తకాలతో పిల్లల బ్యాగ్‌ను చిన్న జిమ్ కిట్లా మార్చేయొద్దు! అవసరమైన నోట్‌బుక్స్, మెటీరియల్స్ మాత్రమే పెట్టే అలవాటు చేయాలి. చిన్న పిల్లల బ్యాగ్ వారి బరువుకంటే ఎక్కువగా ఉండకూడదు.స్క్రీన్ టైమ్‌కి లిమిట్ పెట్టండిస్కూల్స్ కూడా ఇప్పుడు డిజిటల్ అయ్యాయి కాబట్టి మొబైల్, ట్యాబ్‌లను పూర్తిగా దూరం పెట్టడం కష్టం. కానీ రీల్స్, గేమ్స్, అనవసర స్క్రోలింగ్‌ను తగ్గించి, గాడ్జెట్స్‌ను కేవలం హోంవర్క్, స్కూల్ యాప్స్‌కే పరిమితం చేసే రూల్స్ పెట్టుకోవాలి.చదువును టెన్షన్ రీజన్లా చేయకం. మొదటి రోజు నుంచే బాగా చదువుకోవాలి. ‘ర్యాంక్ రావాలి’ అని రోజూ ఒత్తిడి పెడితే పిల్లల్లో భయం పెరుగుతుంది. దాని బదులు ‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’ అని అడిగితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది.డిజిటల్ సేఫ్టీ కూడా నేర్పండిఆన్ లైన్ క్లాసులు, యాప్స్, స్టడీ వెబ్సైట్లు వాడేటప్పుడు తెలియని లింక్స్, ఫేక్ కోర్సులు, స్కామ్‌ల గురించి పిల్లలకు ముందే అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్‌తో పాటు సైబర్ సేఫ్టీ కూడా తప్పనిసరి సబ్జెక్ట్ అయిపోయింది!పేరెంట్స్‌కి మళ్లీ ‘మార్నింగ్ షిఫ్ట్’హాలిడేస్‌లో కాస్త రిలాక్స్ అయిన అమ్మానాన్నలకి ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఉదయం పిల్లల్ని లేపడం, బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయడం, హోంవర్క్ చెక్ చేయడం, స్కూల్ బస్ టైమ్ మిస్ కాకుండా చూడడం.. ఇల్లు ఒక్కసారిగా ‘మినీ కమాండ్ కంట్రోల్ రూమ్’లా మారిపోతుంది! పిల్లలు స్కూల్‌కి వెళ్తే కాస్త రిలీఫ్ దొరుకుతుంది అనే ఆనందంతో పాటు, లంచ్ తిన్నాడా లేదా? అనే చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. - కర సాయి బిందు, సాఫ్ట్వేర్ ఇంజినీర్.బ్యాగ్‌ల బిజినెస్‌కి బంపర్ సీజన్ !స్కూల్స్ ఓపెన్ అంటే మార్కెట్లో కూడా అసలు హడావిడి మొదలవుతుంది. బ్యాగులు, లంచ్‌బాక్స్‌లు, వాటర్ బాటిల్స్, షూస్, బుక్స్, స్టేషనరీ.. ఒక్కసారిగా అన్నీ ‘హాట్ సెల్లింగ్’ ఐటమ్స్‌గా మారిపోతాయి. దుకాణాల్లో పిల్లలు కార్టూన్ బ్యాగ్‌ల కోసం ఫైట్ చేస్తుంటే, పేరెంట్స్ మాత్రం ‘ఇది ఏడాది మొత్తం వాడాలి’ అంటూ బడ్జెట్ క్యాలిక్యులేషన్ ్సలో పడిపోతున్నారు! ఇక ఆన్ లైన్ లో అయితే ‘బ్యాక్ టు స్కూల్ సేల్’ పేరిట భారీ ఆఫర్లు. ఒక పెన్సిల్ కొనడానికి వెళ్లి, చివరికి ఐదు నోట్‌బుక్స్, మూడు స్టిక్కర్ సెట్లు, రెండు కొత్త బాటిల్స్‌తో కార్ట్ ఫుల్ అయ్యే పరిస్థితి!ఆరోగ్యం.. ఆనందంస్కూల్ ఓపెన్ అయ్యాక పిల్లలతో పాటు వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబులు కూడా క్లాస్‌లోకి ఎంట్రీ ఇస్తుంటాయి! కొత్త టైమింగ్స్, బయట ఆహారం, వేడి వాతావరణం వల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. అందుకే ఈ సీజన్ లో హెల్త్ కేర్ కూడా హోంవర్క్లాగే చాలా ముఖ్యం. నీళ్లు తాగడం తగ్గిపోకుండా మంచి వాటర్ బాటిల్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ కంటే హోమ్ ఫుడ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన నిద్ర లేకపోతే పిల్లలు క్లాస్‌లోనే ‘లో బ్యాటరీ మోడ్’లోకి వెళ్లిపోతారు! ముఖ్యంగా చిన్న పిల్లలైతే చేతులు కడుక్కోవడం, టిఫిన్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ముందే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలతో పాటు ఇమ్యూనిటీ కూడా తప్పనిసరి!డేటా బరువు!ఒకప్పుడు స్కూల్ బ్యాగ్‌లో పుస్తకాలు, పెన్సిల్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చదువు కూడా అప్డేట్ వెర్షన్ లోకి వెళ్లిపోయింది! పుస్తకాలతో పాటు ట్యాబ్‌లు, ఐప్యాడ్లు, ఇయర్‌ఫోన్ ్స, చార్జర్లు కూడా బ్యాగ్‌లో స్థానం సంపాదించుకున్నాయి. హోంవర్క్ వాట్సాప్‌లో వస్తోంది. ఫీజులు యాప్‌ల్లో కట్ అవుతున్నాయి. అటెండెన్ ్స కూడా మొబైల్ నోటిఫికేషన్ గా పేరెంట్స్‌కి చేరిపోతోంది. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగ్ కన్నా.. ఇంట్లో వైఫై సిగ్నల్‌కే ఎక్కువ విలువ! ఒకప్పుడు ‘పుస్తకాలు తెచ్చుకున్నావా?’ అని అడిగేవారు. ఇప్పుడు ‘చార్జర్ పెట్టుకున్నావా?’ అనేదే కొత్త స్కూల్ ప్రశ్న! అందుకే పేరెంట్స్ ఇప్పుడు ఫీజుల బడ్జెట్‌తో పాటు నెల డేటా ప్యాక్, స్క్రీన్ టైమ్, గాడ్జెట్ ఖర్చుల లెక్కలు కూడా వేసుకోవాల్సి వస్తోంది.ఈజీ అండ్ హెల్తీ హోమ్మేడ్ లంచ్‌బాక్స్ ఐడియాస్!లంచ్‌బాక్స్‌లో పెట్టేది కేవలం టేస్టీగా మాత్రమే కాదు.. హెల్తీగా, ఈజీగా తినగలిగేలా కూడా ఉండాలి. ఎక్కువ ఆయిల్, జంక్ ఫుడ్ కంటే ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ పిల్లలకు ఎనర్జీ కూడా ఇస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది! అందుకే, కొన్ని ఈజీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ మీకోసం..1. వెజ్ ఉప్మా + బనానా + డ్రైఫ్రూట్స్ చిక్కీఉప్మాలో ఉండే రవ్వ పిల్లలకు ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తుంది. ఉప్మాలో కూరగాయలు వేస్తే ఫైబర్, విటమిన్లు కూడా అందుతాయి. బనానా వల్ల ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. డ్రైఫ్రూట్స్ చిక్కీ ఐరన్ , కాల్షియంతో చిన్నపాటి హెల్తీ స్వీట్లా పనిచేస్తుంది.2. ఇడ్లీ + పీనట్ పొడి + యాపిల్ ముక్కలుఇడ్లీ లైట్‌గా ఉండటంతో పిల్లలు ఈజీగా తింటారు, జీర్ణం కూడా త్వరగా అవుతుంది. పీనట్ పొడిలో ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ ఉంటాయి. యాపిల్ ఫైబర్, విటమిన్ సి అందించి పిల్లల ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది.3. వెజ్ పులావ్ + కీరదోస + కార్న్ చాట్వెజ్ పులావ్‌లో కార్బోహైడ్రేట్స్‌తో పాటు కూరగాయల పోషకాలు కూడా ఉంటాయి. కీరదోస శరీరాన్ని చల్లగా ఉంచి హైడ్రేషన్ ఇస్తుంది. కార్న్ చాట్ పిల్లలకు టేస్టీగా అనిపించడంతో పాటు ఫైబర్, ఎనర్జీ కూడా ఇస్తుంది.4. చపాతీ రోల్స్ + ఆలూ/పనీర్ స్టఫింగ్ + ఖర్జూరాలుచపాతీ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పనీర్ స్టఫింగ్ అయితే ప్రోటీన్ , కాల్షియం ఎక్కువగా అందుతుంది. ఖర్జూరాలు నేచురల్ స్వీట్‌గా పనిచేసి ఐరన్ కూడా అందిస్తాయి.5. లెమన్ రైస్ + ఉడికించిన గుడ్డు + ఆరెంజ్ ముక్కలులెమన్ రైస్‌లో విటమిన్ సి ఉండటంతో పాటు పిల్లలకు టేస్టీగా అనిపిస్తుంది. గుడ్డు మంచి ప్రోటీన్ సోర్స్. ఆరెంజ్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి వేసవిలో ఫ్రెష్‌గా ఫీలవుతారు.6. పెరుగు అన్నం + దానిమ్మ గింజలు + ముర్మురా మిక్స్పెరుగు అన్నం కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది. దానిమ్మలో ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముర్మురా మిక్స్ లైట్ స్నాక్‌లా ఉండి పిల్లలకు ఈజీగా తినిపించొచ్చు.7. కార్న్/వెజ్ సాండ్విచ్ + ద్రాక్ష + రోస్టెడ్ పల్లీలుసాండ్విచ్లో కూరగాయలు వేసితే పిల్లలు తెలియకుండానే హెల్తీ ఫుడ్ తింటారు. ద్రాక్ష శరీరానికి నీరసం రాకుండా సహాయపడుతుంది. రోస్టెడ్ పల్లీలు ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ అందిస్తాయి.8. మినీ దోశలు + టమాటా చట్నీ + హోమ్మేడ్ అరటి చిప్స్మినీ దోశలు పిల్లలకు ఫన్ గా అనిపిస్తాయి కాబట్టి పూర్తిగా తినేస్తారు. టమాటాలో లైకోపీన్ , విటమిన్ సి ఉంటాయి. ఇంట్లో చేసిన అరటి చిప్స్ బయట జంక్ ఫుడ్ కంటే బెటర్ ఆప్షన్ .9. పొంగల్ + డ్రైఫ్రూట్స్ + పుచ్చకాయ ముక్కలుపొంగల్ సాఫ్ట్‌గా ఉండి చిన్న పిల్లలకు బాగా సూట్ అవుతుంది. డ్రైఫ్రూట్స్ ఎనర్జీ పెంచుతాయి. పుచ్చకాయ శరీరానికి హైడ్రేషన్ ఇచ్చి వేసవిలో డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.10. వెజ్ పాస్తా + ఫ్రూట్ బాక్స్ + మఖానా స్నాక్పిల్లలకు పాస్తా అంటే ఇష్టం కాబట్టి కూరగాయలు కలిపి హెల్తీగా చేయొచ్చు. ఫ్రూట్ బాక్స్ వల్ల విటమిన్లు అందుతాయి. మఖానా లైట్, లో–ఆయిల్ స్నాక్‌గా మంచి ఆప్షన్ .స్కూల్ ఓపెన్ అంటే కేవలం క్లాసులు స్టార్ట్ కావడం కాదు. పిల్లల కలల పుస్తకంలో ఒక కొత్త పేజీ తిప్పడం. ఎందుకంటే ప్రతి జూన్ లో.. స్కూల్ బెల్, కొత్త క్లాస్‌తో పాటు కొత్త కలలు కూడా బ్యాగ్‌లో జిప్ వేసుకుని వస్తాయి! - కొండి దీపిక -
గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఫెస్టా జునినా
బ్రెజిల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి రంగుల ప్రపంచం కార్నివాల్ మాత్రమే. కానీ బ్రెజిల్ ప్రజలకు అత్యంత ముఖ్యమైనది ‘ఫెస్టా జునినా’ అనే సాంప్రదాయ పండుగ. జూన్ నెలంతా (కొన్ని సందర్భాల్లో జూలైలో) ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ అక్కడి ప్రజల జీవన విధానానికి, ముఖ్యంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. ప్రాంతాలను బట్టి ఈ పండుగను ‘సావో జోయావో’ అని, ‘ఫెస్టా దో మిల్హో’ అని, ‘మొక్కజొన్న పండుగ’ అని కూడా పిలుస్తుంటారు.బ్రెజిల్ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ ఫెస్టా జునినా పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఐరోపాలో వేసవి కాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునే పురాతన పద్ధతుల నుంచి ఇది పుట్టింది. క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం సెయింట్స్‌ను స్మరించుకుంటూ, కొత్త పంటల సీజన్ ను ఆహ్వానిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. పోర్చుగీస్ వలసదారుల ద్వారా బ్రెజిల్‌కు పరిచయమైన ఈ సంస్కృతి, కాలక్రమేణా బ్రెజిల్ దేశీయ ప్రాంతీయ పద్ధతులు, ఆచారాలను సంతరించుకుని ఒక విశిష్టమైన పండుగగా మారిపోయింది.ఈ పండుగ వేడుకలను పాతకాలపు గ్రామీణ పద్ధతిలో, గుడారాలు వేసి నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రజల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్రెజీలియన్ జానపద, గ్రామీణ సంగీత మూలాలకు నీరాజనాలు అర్పిస్తూ పురుషులు, మహిళలు పల్లెటూరి రైతుల్లా దుస్తులు ధరిస్తారు. పెద్ద గడ్డి టోపీలు, ముఖంపై టాటూలు, పళ్ళు ఊడిపోయినట్లుగా రంగులు వేసుకోవడం, మహిళలు విభిన్నమైన జడలు వేసుకోవడం వంటివి ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తాయి.బ్రెజిల్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఆతిథ్యాన్ని చూడాలనుకునే వారికి ఈ ఫెస్టా జునినా వేడుకలు ఒక మంచి వేదిక. నగరాల హడావుడి, ఆధునిక కార్నివాల్ మాత్రమే కాదు, బ్రెజీలియన్ మూలవాసుల గ్రామీణ సంస్కృతికి, ఆతిథ్యానికి ఈ ఫెస్టా జునినా ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.సంప్రదాయ నృత్యాలునోరూరించే వంటకాలుచల్లని శీతాకాలపు వాతావరణంలో జరిగే ఈ వేడుకల్లో చలిమంటలు, సంప్రదాయ నృత్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 18వ శతాబ్దపు యూరప్ సంస్కృతి నుంచి వచ్చిన క్వాడ్రిల్హా అనే సంప్రదాయ సామూహిక నృత్యం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో యువతీ యువకులు వధూవరుల్లా నటిస్తూ ఈ ప్రదర్శనకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. ఈ పండుగలో వడ్డించే వంటకాలు నోరూరిస్తాయి. ముఖ్యంగా క్వెంటావో అనే పానీయాన్ని (సాంప్రదాయ మద్యం) ఇక్కడి ప్రజలు పండుగరోజుల్లో తప్పని సరిగా స్వీకరిస్తారు. ఇది చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే మొక్కజొన్నతో తయారు చేసే వంటకాలు, స్వీట్లు విరివిగా తింటారు. రమా జంబుల -
ప్రేతాత్మ చెప్పిన కథ..!
ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్ స్పీక్స్’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్ రాబర్ట్స్– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్ బట్స్ 1963 డిసెంబర్ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్‌కు ఒక అశరీరవాణి వినిపించిందట! ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్ రాబర్ట్స్ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్ తనకు చెప్పిన కథలను జేన్ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్ మెటీరియల్’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.బంగారు మ్యూజియంప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. -
పిల్లలకు సమయం కేటాయించాలి
‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్‌గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు...‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత చెబితే అంత అనే విధంగా ఉంది. ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కౌన్సెలింగ్‌కు నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇంట్లో ఆ అమ్మాయికి నచ్చినట్టే తల్లిదండ్రులు ఉండాలి. లేదంటే, ఇంట్లో పెద్ద గొడవ. రెండు విషయాల్లో మరీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. ‘ఒకటి ఫోన్ వాడకం, రెండవది చదువుకోమని చెప్పడం.’ ఈ రెండింటిలోనూ పిల్లలు అతిగా స్పందిస్తున్నారు. పిల్లలకు ఇచ్చింది సమయాన్నే..!నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతానం. వారిని మూడో క్లాస్ నుంచి ఒంటరిగా పనులు చేసుకోవడం, బయటకు వెళ్లిరావడం, వారికి కావల్సినవి వారే కొని తెచ్చుకోవడం వంటివి అలవాటు చేస్తూ వచ్చాను. దీని వల్ల పై చదువుల సమయంలో మాకు దూరంగా ఉన్నా పిల్లలు ఇబ్బందులు పడలేదు. వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇస్తూనే, క్రమశిక్షణనూ అలవాటు చేశాను. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి విషయాలలో కూడా వారి అభిప్రాయం తీసుకునేదానిని. అది నచ్చకపోయినా కొట్టిపడేసిన దాన్ని కాదు. వాళ్లు చెప్పినవన్నీ అనుకూలంగా, వాడదగినవిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ‘నో’ చెప్పకుండా ఎలా చేస్తే బాగుంటుందో కాస్త సమయం తీసుకునైనా చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లలు అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకోవడమే ముఖ్యంపిల్లలు చదువులో టాపర్స్‌గా ఉన్నారా, గ్రేడ్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని కాదు. వారు ఆ చదువును ఎంతబాగా అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనేదానిపై దృష్టి పెట్టమనేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ‘టీచర్లు ఏం చెప్పారు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది?’ అని అడిగేదాన్ని. వాళ్లు చెప్పేదంతా వినేదాన్ని. అంతేకానీ, హోమ్‌వర్క్, క్లాస్ వర్క్, మార్కుల గురించి అడిగేదాన్ని కాదు. మా పిల్లలు చదువుకునే టైమ్‌లో కంప్యూటర్స్ బూమ్‌లో ఉంది. కానీ, మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చేస్తానంది. సరే అన్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకుంది. మా అబ్బాయిని సైన్స్ వైపుగా వెళతావా అని అడిగాను. లేదు ఇంజనీరింగ్ అన్నాడు. వారి ఇష్టాలను కాదనలేదు. వాళ్ల మాటకు మేం విలువ ఇచ్చాం. వాళ్లూ మా మాటలకు విలువ ఇచ్చారు. లేట్ నైట్స్ బయట తిరగడం మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. రాత్రి సమయాల్లో బయట ఉంటే సమస్యలు ఏ విధంగా వస్తాయో వివరించేదాన్ని. నేను మీతో ఉన్నాను అనే భరోసా! మా బాబుకి బిట్స్‌లో సీట్ వచ్చేముందు కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ ఏదో తెలియని ఆందోళన ఫీలవుతున్నట్టు గమనించాను. దీంతో ఇంటికి తీసుకువచ్చేశాను. ఇంట్లోనే చదువు, టెస్ట్.. జరిగేలా ప్రతిరోజూ ప్లాన్ చేశాం ‘ఏం టెన్షన్ పడకు. ర్యాంకు రాకపోయినా పర్వాలేదు. ఇది కాకపోతే మిగతా చాయిస్‌లు కూడా ఉన్నాయి’ అని చెప్పదాన్ని. నీకు నేను ఉన్నాను అని మోరల్‌గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ చూశాను. మా అమ్మాయి పెళ్లయ్యి, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వాళ్లకు ఒక బాబు. నాలుగేళ్ల వయసు. బోలెడన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. పిల్లలు అడిగే సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పకపోతే నిరుత్సాహపడిపోతారు. వారి ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి తగినంత సమయం వారితో గడపడమే. మా అబ్బాయి కూడా విదేశాలలోనే జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ వారి వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నారు.’’∙నిర్మలారెడ్డిమనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్‌గా ఉండాలి.డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.మనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్‌గా ఉండాలి. డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది. డా.పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ నిర్మలారెడ్డి(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు) -
న్యాయం దక్కలేదు.. చట్టం మారింది
లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి.– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా ఆమెకు న్యాయం దక్కలేదు. నిందితులకు శిక్షపడలేదు. కాని, భారత న్యాయవ్యవస్థలో పలు మార్పులకు, మహిళా రక్షణ చట్టాల బలోపేతానికి ఈ కేసు నాంది పలికింది. అదే తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. ‘మథుర’ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇదీ విషాదంఅక్షరం ముక్క రాకపోయినా, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెంది అనాథగా బతకాల్సి వచ్చినా, ఆమె వెరవలేదు. తన కాళ్లపై నిలబడింది. కూలి నాలి చేసుకుంటూ సోదరుడు గామాతో కలిసి జీవిస్తూ, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. సోదరుడు పెట్టిన కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ యువతే మథుర. కూలి పనులతో పాటు స్థానికంగా ఒకరి ఇంట్లోనూ పని చేసేది. ఆ ఇంటి యజమానురాలి బంధువు అశోక్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె సోదరుడు గామాకు నచ్చలేదు. దీంతో ఆమె యజమానురాలు నున్షి, ఆమె భర్త, అశోక్‌లు మథురను అపహరించారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నిమిత్తం ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేశాయ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు రాత్రి సమయంలో తీసుకువచ్చారు. ఆమె వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకుని మర్నాడు స్టేషన్‌కు రావాలని చెప్పి రైటర్ బయటకు వెళ్లాడు. తుకారాం, గణపత్ అక్కడే కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.ఏం జరిగిందిమ«థుర వాంగ్మూలం ప్రకారం..‘అందరం బయటకు వెళుతున్న సమయంలో గణపత్ తనను ఆపాడని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని తుకారామ్ ఆదేశించాడు. పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశారు. లైట్లు ఆర్పేశారు. ఒంటరిగా ఉన్న తనను భవనం వెనుక వైపు ఉన్న బాత్రూమ్లోకి లాక్కెళ్లి తుకారామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని తప్పించుకుని బయటకు వస్తుండగా గణపత్ సైతం లైంగిక దాడికి యత్నించాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో తప్పించుకుని పోలీస్‌స్టేషన్ వెలుపలికి వచ్చాను’. ఈ ఘటనపై స్థానికుల నుంచి సైతం ఒత్తిడి రావడంతో కేసు నమోదైంది. కోర్టులో విచారణతొలుత చంద్రపూర్ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. లైంగిక నేరం జరిగిందనడానికి బలమైన కారణాలు లేవని, ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎటువంటి గాయాలు, ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేవని తేల్చింది. ఆమె అంగీకార పూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొంది. కానిస్టేబుళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కేసు హైకోర్టుకు చేరింది. సెషన్స్ కోర్టు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భయం, నిస్సహాయత కారణంగా ఆమె ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా భావించలేమని తుకారామ్‌కు ఐదేళ్లు, గణపత్కి ఏడాది జైలు శిక్ష విధించింది.సుప్రీంకోర్టులోనూ..హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిస్సహాయ లొంగుబాటును అత్యాచారంగా పరిగణించడానికి సరిపడా ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. వెల్లువెత్తిన నిరసనలుకోర్టులో కేసు నిలబడలేదు. ఆమె కోరుకున్న న్యాయం దక్కలేదు. కాని, సమాజం నుంచి అనూహ్యంగా మద్దతు వెల్లువెత్తింది. సుప్రీం కోర్టు తీర్పుపై మేధావులు కలమెత్తారు. ఇది వాంఛనీయం కాదంటూ నలుగురు న్యాయ శాస్త్ర ప్రొఫెసర్లు అప్పటి చీఫ్ జస్టిస్‌కు బహిరంగ లేఖ రాశారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం మహిళలకు సంక్రమించిన హక్కులను హరించేలా తీర్పు ఉందంటూ ఆక్షేపించారు. మథురకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించినప్పటికీ సాంకేతికపర అడ్డంకులు న్యాయానికి ప్రతిబంధకాలుగా, నిందితులకు అనుకూలంగా మారాయి. మథురకు న్యాయం జరగలేదంటూ పౌర సమాజం స్పందించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తి నినదించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది.మార్పులు ఇలా..అన్యాయానికి గురైన మహిళలకు రక్షణగా చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది. ఈ సవరణలు భారత న్యాయవ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది.‘కస్టోడియల్ రేప్’ అంటే నిర్దిష్టమైన నిబంధనలను నిర్వచించింది. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ అధీనంలో ఉన్న, పని చేస్తున్న వారిపై లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల వరకు శిక్ష విధించేలా మార్పులు చేసింది. తన సమ్మతి లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేస్తే, తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకునేలా భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేశారు.బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు లైంగిక దాడి కేసులను బహిరంగ విచారణ కాకుండా, ఇన్ కెమెరా ట్రయల్స్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసేలా మీడియాలో పేరు రాయడం, ఫొటోలు ప్రచురించడాన్ని నిషేధించారు. \భయం, బెదిరింపులు, నిస్సహాయత కారణంగా ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా, నిశబ్దాన్ని అనుమతిగా భావించరాదని గుర్తించారు. -దిలీప్ మాదిరెడ్డి -
అటు ప్రయోగం ఇటు ప్రయోజనం!
అందమైన పరిసరాల్లో పుట్టి పెరిగిన కళాకారుల రచనల్లో సౌందర్యం జాలువారుతుందని వర్డ్స్‌వర్త్, కీట్స్, కాలెరిజ్ తదితర ఇంగ్లిష్ భావకవులు– మూడువందల యేళ్ళ కిందట – ఓ సిద్ధాంతం చెప్పారు. విలియం గిల్పిన్ అనే విమర్శకుడు వారి సిద్ధాంతానికి ‘పిక్చరెస్క్ ఈస్థెటిక్స్‘ (రమణీయ సౌందర్యశాస్త్రం) అని పేరుపెట్టారు. అంతకు వెయ్యిన్నర సంవత్సరాల కిందట భామహుడు మొదలుకొని ఆనందవర్ధనుడి వరకు ఎందరో భారతీయ ఆలంకారికుల సిద్ధాంతాల్లోనూ అలాంటి భావాలున్నాయనే మాట నిజమే– అయితే అదలా వుంచండి! ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ భావనకు ఉదాహరణగా చెప్పదగిన రచయిత జ్షాన్ మారీ గుస్తావ్ లా క్లేజ్యో ఒకరు. లా క్లేజ్యోకు 2008లో నోబెల్ సాహిత్యపురస్కారం ప్రకటిస్తూ ‘ఆయన రచనలు సరికొత్త ప్రయోగాలూ, కవితాత్మక సాహసకృత్యాలూ, ఆనందానుభూతుల చిత్రణలతో నిండి వుంటాయ’ంది స్వీడిష్ ఎకాడెమీ. (నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరికివ్వాలో నిర్ణయించేది ఈ ఎకాడెమీయే.) అంతేకాదు– ‘ప్రస్తుతం చెలామణీలో వున్న నాగరికతను మించినవారి కథలనూ, దాని పరిధిలోకి రానివారి కథలనూ కూడా చిత్రించిన రచయిత’గా లా క్లేజ్యోను ప్రశంసించింది స్వీడిష్ ఎకాడెమీ. నవలాకారుడిగానూ, కథానిక రచయితగానూ, వ్యాసకర్తగానూ, అనువాదకుడిగానూ సుప్రసిద్ధుడు లా క్లేజ్యో. ఇటలీ సరిహద్దుకు చేరువగా వుండే ఫ్రెంచ్ నగరం నీస్‌లో పుట్టారాయన. అది ఆయన తల్లి తరఫు బంధువుల స్వస్థలం. లా క్లేజ్యో తండ్రి తరఫు బంధువులు వందల సంవత్సరాల కిందటే తరలి వెళ్ళిపోయారు. అలా ఆయన పుడుతూనే ద్విజాతీయుడు. అందుకే లా క్లేజ్యో తనను తాను ఫ్రాంకో–మారిషియన్గా చెప్పుకుంటారు.ఇంగ్లండ్– ఫ్రాన్స్– మెక్సికో దేశాల్లో చదువుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు లా క్లేజ్యో. అండర్ గ్రాడ్యుయేట్ పట్టాకోసం ఆయన ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. మాస్టర్స్ కోసం, ఫ్రెంచ్ ప్రయోగాత్మక కవి– రచయిత– చిత్రకారుడు హెన్రీ మిషో రచనలను ఎంచుకున్నారు. తీరా డాక్టరేట్ విషయానికి వచ్చేసరికి ఆధునిక చరిత్ర ఆవిర్భవిస్తున్న దశను లా క్లేజ్యో ఎంపిక చేసుకున్నారు. సామాన్య శకం 1525 వరకూ, స్వతంత్రంగా జీవించిన పూరిపెచా ప్రజలు ఆ దశలో మశూచికం తదితర అంటువ్యాధుల పాలబడ్డారు. ఆ పరిస్థితిలో, వారి నాయకులు ప్రజల సంక్షేమం కోసం యుద్ధాన్ని నివారించాలని భావించారు. స్పెయిన్ రాజుకు సామంతరాజ్యంగా ఉంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. దాన్నే ‘పూరిపెచా జాతిపై దిగ్విజయం’గా వక్రీకరించారు స్పానిష్ చరిత్రకారులు. లా క్లేజ్యో తన సిద్ధాంత గ్రంథంలో ఈ వంచనను వెలికితీశారు! పదహారో శతాబ్ది నాటి రాతప్రతుల ఆధారంగా ఆయన ఈ గుట్టు రట్టు చేయగలిగారు. ఆయన అధ్యయన ప్రణాళిక ఇంత క్లిష్టంగా వున్నందువల్లనే అది పూర్తికావడానికి పాతికేళ్ళు పట్టింది.రచయితగా, ప్రయోగశీలతనూ – ప్రయోజన దృష్టినీ గొప్పగా సమ్మిళితం చేశారు లా క్లేజ్యో. రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, శాలింగర్, మిషో, హెమింగ్వే, ఫాక్నర్– లా క్లేజ్యోను ప్రభావితం చేసినవారు. అలాంటి రచయిత ప్రయోగం– ప్రయోజనం అనే రథచక్రాల మీద వీరవిహారం చెయ్యడంలో వింతేముంది? ఏడేళ్ళ పసితనంలోనే సముద్రం గురించి చిన్న పుస్తకం రాసేశాడు ఈ పిడుగు! నైజీరియాలో వున్న తండ్రిని మరుసటి సంవత్సరం –1948లో– కుటుంబ సమేతంగా కలవబోతున్నానన్న ఊహే, లా క్లేజ్యో చేత ఆ పుస్తకం రాయించింది. ఇదే ఊహ, 44 సంవత్సరాల తర్వాత ‘అనీత్సా’ అనే నవలగానూ రూపుదిద్దుకుంది. అదీ పూర్తిగా కల్పన కాదంటారు లా క్లేజ్యో సాహిత్య నిపుణులు. బహుశా అందుకేనేమో, వారెన్ మాటీ అనే విమర్శకుడు ఈ 44 యేళ్ళ కాలాన్ని లా క్లేజ్యో శిక్షణకాలంగా అభివర్ణించాడు! ఈ కథ 1848లో జరిగిందని రచయిత ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం! ఫ్రాన్స్ దక్షిణ తీరం నుంచి ఓ పాత నావలో బయల్దేరిన తల్లీ కొడుకులు పశ్చిమ ఆఫ్రికా తీరం పొడుగునా సాగించే సుదీర్ఘ యాత్రే ఈ నవలకు ఇతివృత్తం. ఈ రెండు పుస్తకాలూ రాయడానికి మధ్య కాలంలో లా క్లేజ్యో ఎన్నో మెరుపులు మెరిపించారు. 1963లో వెలువడిన ‘లా ప్రాసెస్ వెర్బల్’ (విచారణ– ఇంటరాగేషన్) అనేది లా క్లేజ్యో తొలి నవల. దానికే ‘ప్రీ రెనాడో‘ పురస్కారం అందుకున్నాడాయన. ఇదే రచన మరో పోటీల్లో కూడా షార్ట్ లిస్ట్ కావడం విశేషమే మరి. లా క్లేజ్యో ప్రయోగాల్లో అత్యధిక పాఠకాదరణ పొందిన నవల ‘డెజెర్ట్.’ ఉత్తర ఆఫ్రికాలో కనిపించే సంచార ఆదివాసుల ప్రణయగాథ దానికి ఇతివృత్తం. ఈ నవల వేర్వేరు కాలాల్లో జరిగిన కథను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణం నుంచి చూపిస్తాడు కథకుడు. ఇలాంటి శిల్పవిన్యాసం పాఠకులను రంజింప చెయ్యడంలో వింతేముంది?లా క్లేజ్యోతో పొల్చదగిన రచయితలు అతని సమకాలికుల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే అతనికన్నా ముందుగా నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఫ్రెంచ్ రచయితలు కూడా ఎవరికీ తీసిపోరు మరి! ఈ పురస్కారం మొదలైన యేడాదే, 1901లో, దాన్ని గెల్చుకున్నవాడు సూలీ ప్రూదాం. ఆయన రాసిన ప్రతీకాత్మక కవిత్వం సుప్రసిద్ధం. ముఖ్యంగా, ప్రూదాం రాసిన ‘ద బ్రోకెన్ వేజ్ – పగిలిన కలశం’ కవితను నెట్ లో చూడొచ్చు! ఇక 85 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన క్లాడ్ సిమో కూడా తక్కువ వాడేం కాడు. శైలీ విన్యాసానికీ, ప్రయోగశీలతకూ సిమో సుప్రసిద్ధుడు. పోతే, 2000 సంవత్సరానికి గానూ నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న గావ్ షింజియాంగ్ ఫ్రెంచ్ జాతీయుడే కానీ ఫ్రెంచ్ రచయిత కారు! అయినా, పెద్దలతో పోలికలెందుకు మనకు? ఎవరంత వాళ్ళు వారనుకుంటే పోలా? -లిట్‌వరల్డ్ -
క్లూషియల్: ది రైటర్
ప్రముఖ క్రైమ్ నవలా రచయిత చక్రవర్తి మరణం రాష్ట్రాన్ని కుదిపేసింది. క్రైమ్ నవలా రచయితగా అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని క్రైమ్ కథలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ కేసును పరిశోధించడానికి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నచికేత రంగంలోకి దిగాడు.క్రైమ్ సీన్... టేబుల్ మీద అలాగే ఒరిగిపోయి ఉన్నాడు చక్రవర్తి. టెక్నాలజీ ఎంత పెరిగినా అతను పెన్‌తో కాగితం మీద కథలు రాయడానికి ఇష్టపడతాడు. కథ రాస్తూ అలాగే ఒరిగిపోయాడు. ఉదయానికే చక్రవర్తి ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. పైకి అది గుండెపోటులా కనిపించింది. కానీ అది అసహజ మరణంగా, హత్యగా అనిపించింది నచికేతకు.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా చక్రవర్తి టేబుల్‌పై ఉన్న ఆ ఫౌంటెన్ పెన్ అతని కంటపడింది. ఆ పెన్ నిబ్ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండడం గమనించాడు. పేపర్ మీద రాసిన అక్షరాల ఇంక్ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి?నచికేత వెంటనే ఆ పెన్ ను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపాడు.నచికేత విచారణ మొదలుపెట్టాడు. ఇంట్లో అందరినీ ప్రశ్నించాడు. చక్రవర్తి తమ్ముడు భార్గవతో సహా ఇల్లంతా సోదా చేశాడు. భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్ జర్నల్స్ కనిపించాయి.నచికేత చక్రవర్తి వాడిన ఫౌంటెన్ పెన్ను నిశితంగా పరిశీలించాడు. కానిస్టేబుల్ని పిలిచి ఆ నిబ్ పెన్ చూపించి ఏదో చెప్పాడు.సరిగ్గా అరగంట తర్వాత చక్రవర్తి తమ్ముడు భార్గవను గదిలోకి పిలిచాడు ఇన్స్పెక్టర్ నచికేత.‘మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం ఒక సందేశాన్ని ఈ కాగితం మీద రాసి ఇవ్వండి. చక్రవర్తిగారు ప్రముఖ రచయిత కదా... మీ స్వదస్తూరితో ఆ సందేశాన్ని రాస్తే పత్రికల్లో సంతాప సందేశాన్ని ప్రకటనగా ఇద్దాం.’ అన్నాడు ఫౌంటెన్ పెన్ను భార్గవకు ఇస్తూ.. ఆ పెన్ వంక, నిబ్ వంక భయంగా చూశాడు భార్గవ.‘మీ అన్నయ్య రాత్రి వాడిన పెన్నే.. సెంటిమెంట్‌గా ఇచ్చాను.. వేలితో నిబ్‌ను సరిచేసుకో.’ అన్నాడు. అతని వంకే చూస్తూ...భార్గవ మొహంలో రంగులు మారాయి. పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎదురుగా పోలీసులు సంకెళ్లతో..మీడియా గుమికూడింది. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత మరణం మిస్టరీని అరవై నిమిషాల్లో ఛేదించిన నచికేతను అభినందిస్తూ ‘హంతకుడిని ఎలా పట్టుకున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.నచికేత చెప్పడం మొదలుపెట్టాడు.‘చక్రవర్తికి కథ రాస్తున్నప్పుడు వేలితో నిబ్‌ను సరిచేసుకునే అలవాటు ఉంది.ఆ పెన్ నిబ్ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండటం గమనించాను. అతను అప్పటి వరకు రాసి ఉన్న కాగితం మీద అక్షరాల ఇంక్ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి? వెంటనే ఆ పెన్ ను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపాను. రిపోర్ట్‌లో అది ‘రిసిన్’ అనే విషం అని తేలింది.భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్ జర్నల్స్, ఆముదపు గింజల అవశేషాలు కనిపించాయి. భార్గవ ఇంటర్నెట్ హిస్టరీని చెక్ చేయించగా, అతను గత నెల రోజులుగా ‘విషప్రయోగం – ఎవరికీ దొరక్కుండా ఎలా చేయాలి?’ అనే అంశాలపై సెర్చ్ చేసినట్లు తేలింది.భార్గవకు ఆస్తిపై మోహం.. అన్న చక్రవర్తిపై ద్వేషం.. కోట్లాది రూపాయల విలువైన వారసత్వ ఆస్తి దక్కాలంటే అన్న అడ్డు తొలగాలి. భార్గవ తెలివైన క్రిమినల్ మైండ్ వున్నవాడు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ వేశాడు. ఆముదపు గింజల నుండి తీసిన అత్యంత ప్రమాదకరమైన ‘రిసిన్’ అనే విషాన్ని సేకరించి, చక్రవర్తి రోజూ వాడే ఖరీదైన ఫౌంటెన్ పెన్ నిబ్‌కు అతి సూక్ష్మంగా పూశాడు.అందుకే చక్రవర్తి వాడిన ఫౌంటెన్ పెన్ లాంటిది ఇచ్చి దాని నిబ్‌ను టచ్ చేయమంటే భయపడిపోయాడు. దొరికిపోయాడు.నిజానికి ఈ పరిశోధన వెనుక చక్రవర్తి గారు రాసిన క్రైమ్ కథల ప్రేరణ వుంది. నేరస్థుల మైండ్ సెట్‌తో ఆయన రాసే కథల్లోని పరిశోధన నాకు ఉపయోగపడింది.వారి ఆత్మకు శాంతి చేకూరాలి. భార్గవ లాంటి నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.’ చెప్పి ముందుకు కదిలాడు నచికేత. -శ్రీసుధామయి -
ఈ వారం కథ: అసలు సంగతేంటంటే!
‘‘అమ్మా, అడిగావా నాన్నని. ఏమన్నారు? నువ్వు కాస్త గట్టిగా అడగవే ఒప్పుకుంటారేమో’’ వాట్సాప్ వీడియో కాల్లో తల్లి వనజని నిలదీస్తోంది సుప్రియ.అమెరికాకి ఎలాగైనా అమ్మతో పాటు నాన్నని కూడా రప్పించుకోవాలనే పట్టుదలా, మళ్ళీ ఓడిపోతానేమో అనే దిగులు కలగలసి వినిపిస్తోంది సుప్రియ గొంతులో.‘‘ఎన్ని విధాలుగా అడగను చెప్పు. మొదటి రెండుసార్లు ఏదో బెట్టు చేస్తున్నారేమో అనుకున్నాను కానీ, ఇంత మంకుపట్టు పడతారు అనుకోలేదే. ససేమిరా అంటున్నారు ఆయన. నా వల్ల కాదు ఈ విషయంలో నాన్నని ఒప్పించడం. ముందు రెండుసార్లు అంటే ఏదో నీ పురిటికి సాయంగా వచ్చాను కానీ ఇప్పుడు ఎలా చెప్పు మళ్ళీ ఆయన్ని వదిలేసి రావడం? నవ్విపోరా అంతా.’’గోడకి బిగించిన అద్దంలో చూసుకుంటూ గడ్డం గీసుకుంటున్న కృష్ణమూర్తికి తల్లీ కూతుళ్ళ సంభాషణ వినిపిస్తూనే ఉంది. ఈసారి కూతురు గట్టిగానే పట్టుపడుతోంది. ముందు రెండుసార్లు అంటే బ్యాంక్ ఉద్యోగం వంకతో పని ఒత్తిడి అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడైతే రిటైర్ అయ్యి సొంత ఊరికి చేరుకున్నాడు. ఏ సాకూ దొరకడం లేదు కృష్ణమూర్తికి.‘పోనీ అసలు సంగతి చెప్పేద్దామా?’ అనుకున్నాడు ఒక్క క్షణం.‘‘ఎంతైనా నాన్నగారు ప్రత్యేకమైన మనిషమ్మా. అందరూ ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటే నాన్నగారు చూడు అసలు. ఆయన సిద్ధాంతాలు, పద్ధతులూ వేరు. ఒక మాట అనుకుంటే మార్చనేలేము. మావయ్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాక జిల్లా ఎడిషన్‌లో ‘విదేశీ పర్యటన చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు శుభాకాంక్షలు’ అని పేపర్ యాడ్ కూడా ఇప్పించుకున్నారు తెలుసా. నాన్నగారిని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా ఇలాంటి గొప్పలేమి పట్టవు ఆ మనిషికి. ముక్కు సూటి మనిషి అని, ఏ పని చేసినా పద్ధతిగా నిబద్ధతతో చేస్తారని మావయ్య వాళ్ళకి కూడా నాన్న అన్నా, ఆయన మాటన్నా అంత గురి మరి.’’ గర్వంగా చెప్తోంది సుప్రియ.‘‘మరేమనుకున్నావు. ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నా కదా మనిషిని. మాటంటే మాటే. ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు.’’ అంది వనజ భర్త గురించి మురిపెంగా.మొహం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన కృష్ణమూర్తికి సుప్రియ మాటలు వినడంతోనే అసలు సంగతి కూతురుకి చెప్పేద్దాం అనుకున్న ఆలోచనని వెనక్కి తీసేసుకున్నాడు. చిన్నప్పుడు మా నాన్న ‘శక్తిమాన్’ కన్నా పవర్ఫుల్ తెలుసా, అని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు ఎంత అబ్బురంగా చూసేదో ఇప్పటికీ తనని సూపర్ హీరోలానే చూస్తున్న కూతురికి ఎలా చెప్పగలడు ‘ఇదీ సంగతి’ అని.‘వద్దు వద్దు’ అని మనసులోనే అనుకున్నాడు కృష్ణమూర్తి.వనజ ఇచ్చిన కాఫీ తాగుతూ రోజూలాగే అక్కడ అమెరికాలో ‘టైం ఎంత’ అని మొదలుపెట్టి, వాతావరణ విశేషాలు అడిగి మనవరాలిని పలకరించి పెట్టేశాడు కాల్.హడావిడిగా చిన్ని హస్తం గరిటని చన్నీటి గ్లాసులో ముంచి వేడి వేడి ఇడ్లీలు దీక్షగా తీసి ప్లేట్లో వేసి ఇస్తున్న వనజ వైపు చూస్తూ , ‘పోనీ అసలు సంగతి వనజకి చెప్పేస్తే?’ అనుకున్నాడు కృష్ణమూర్తి.‘‘నీకో విషయం చెప్పాలోయ్’’ అనే మాట నోటి వెంట బయటికి రాక ముందే, ‘‘సారీ అండి. పాపతో మాట్లాడుతూ కాస్త ఆలస్యమైయింది. ఇదుగో ఇస్తున్నాను.’’ అంటూ కొబ్బరి చట్నీని ముద్దుగా తట్టి ప్లేటులో వేస్తూ చేతికి అందించింది వనజ.‘‘అది కాదు మాట’’ అని చెప్పబోయేంతలో పక్క ఊర్లో ఉండే వనజ వాళ్ళ తమ్ముడు రావడంతో కృష్ణమూర్తి మాట పూర్తవ్వకనే, ‘‘ఏరా ఇదేనా రావడం. రా రా వేడిగా టిఫిన్ చేద్దువు గానీ’’ అంటూ ఎదురెళ్ళింది.‘‘చేసే వచ్చాను. టిఫిన్ వద్దులే గానీ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు.’’ అన్నాడు ఆ రోజు పేపర్ తీసుకుని కుర్చీలో కూర్చుంటూ వనజ తమ్ముడు బాలాజీ.టిఫిన్ కానిచ్చి వచ్చిన బావగారిని చూస్తూనే లేచి నిల్చున్నాడు బాలాజీ.‘‘ఏం బాలా, బాగున్నావా. కూర్చో కూర్చో. ఎట్లా ఉంది వ్యాపారం?’’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కృష్ణమూర్తి.బావగారు కూర్చున్నాక కానీ కూర్చోలేదు బాలాజీ. తరవాత బిల్డర్‌గా పనిచేయడంలో ఉండే సాధక బాధకాలు చెప్తూ కూర్చున్నాడు.వనజ తమ్ముడికి కాఫీ తీసుకుని రావడంతో ‘‘మీరు మాట్లాడుకుంటూ ఉండండి,’’ అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అతనికి.‘‘మరి బావకేదే కాఫీ?’’‘‘ఆయన ఉదయం కాఫీ తాగేశారు కదా. మళ్ళీ ఇంకో రెండు గంటల తర్వాతే.’’‘‘ఎంతైనా బావంటే పద్ధతి. పద్ధతి అంటే బావకా. అవును మరి అమ్ములు అమెరికా రమ్మంటాంది అంట కదా ఇద్దర్నీ ఈసారి. బావేమన్నాడు?’’‘‘ససేమిరా అంటున్నారురా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా చెప్పు. రిటైర్ అయ్యాక కూడా వాళ్ళ కొలీగ్స్ అంతా సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉంటుంటే ఈయన చూశావా నా ఊరు నా మనుషులు అంటూ మళ్ళీ ఇక్కడికే తెచ్చేశారు. నేను చెప్పేశా అమ్ములుతో నాన్నని వదిలి రాను ఇక అని. ఆయన లేకుండా నాకు తోచదు అక్కడ. ఆయన్ని చూసైనా నేను నేర్చుకోవాలి కదా. పిల్లలే వచ్చి చూసి వెళ్తే సరి.’’ అంది వనజ.‘‘అంతేలే. ఎక్కడికెళ్ళినా కింగులా ఉంటాడు బావ. నలుగురు మనుషులు కావాలి ఎప్పుడూ. ఏం తోస్తుంది ఆయనకి అక్కడ. ‘‘సరేలే ఉమ నీకు ఇచ్చిరమ్మంది’’ అంటూ మరదలు పికో ఫాల్స్ చేసిన చీరల కవర్ అక్కడ పెడుతూ ‘‘నే వెళ్ళొస్తాక్కా, టైల్స్ సప్లయర్ వస్తానన్నాడు. బావకి చెప్పు. పిలవద్దులే మళ్ళీ’’ అంటూ బయల్దేరాడు బాలాజీ.‘ఎందుకో నేనంటే ఇంత గౌరవం వీళ్ళందరికీ!’ అంటూ విసుక్కున్నాడు లోపలి నుంచి కృష్ణమూర్తి.వనజ మీద ఎప్పుడూ లేంది పీకల దాకా కోపం వచ్చింది అతనికి. ‘ఎంతసేపూ నా చుట్టూరా తన జీవితం గడుస్తోంది అని చెప్పుకుంటుందెందుకు వనజ. అసలు వనజ లేకపోతే క్షణం జరగనిది నాకే కదా? ఏమీ తెలీదు ఏమీ తెలీదు అంటూనే కూతురి పురిటికి రెండుసార్లు ఒక్కర్తే చక్కగా ఝామ్మంటూ అమెరికా వెళ్ళొచ్చింది. నేనే ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఉన్నాను కానీ తనొక్కతే అన్నీ చక్కబెట్టుకొచ్చింది. ముప్పై ఐదేళ్ళ నుండి ఆ ఉద్యోగం కాస్తా వెలగబెట్టి ఇంత గడించి వనజ చేతిలో పోసి తాపీగా టింగురంగామని తిని తిరగడం తప్ప ఈ సంసారానికి నేనేం చేశానని.కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తనే మంచి చెడూ ఆలోచించి, చివరిగా ‘ఇదైతే బాగుంటుంది ఏమంటారు?’ అని నా ముందు ఉంచేది. అసిస్టెంట్ ఇచ్చిన ‘ఎన్ఓసీ’ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టినట్టు నేను ‘సరే అలాగే’ అంటే చాలు పిల్లల చదువుల దగ్గరి నుండీ మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యడం వరకూ అంతా తన ఇష్టమే. ‘అప్రూవల్’ ఇవ్వడం వరకే నా పని కదా. అయినా కాని అన్నిటికీ నేనే కారణమన్నట్టు నేనేదో దైవాంశ సంభూతుడినైనట్టు ప్రవర్తిస్తుంది ఎందుకూ?’ అని ఆలోచనలో పడిపోయాడు కృష్ణమూర్తి.‘అన్నిటికీ ఈ రూపమే కారణం’ అనుకుంటూ అద్దంలోకి చూసుకుని సణుక్కుంటూ పల్చబడ్డ క్రాఫుని నైసుగా సర్దుకున్నాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి మూడించీలు తక్కువగా ఆరడుగులు. అయినా కానీ వనజ నోట్లోపడి ‘ఆరడుగుల అందగాడు’ అయిపోయాడు. మంచి విగ్రహపుష్టి, దానికి తోడు ధీర గంభీర స్వరం కలవాడవటంతో అడక్కుండానే అందరి గౌరవ మర్యాదలకు పాత్రుడయ్యాడు. కట్టుకున్న భార్యకి కన్నుల దీపావళి అయ్యాడు. బావ బామ్మర్దులైతే కిట్ట పరమాత్ముడే మా ఆడబిడ్డని చేపట్టినాడు అని మురిసి మర్యాదలు చేసేవారు.ఇంట్లో వనజ ముదిగారంతో వేరే ఏ రకమైన డిస్ట్రాక్షన్లు లేక ఉద్యోగంలో మెట్టు మెట్టూ పైకెక్కి కింది వారి గులాములు అందుకున్నాడు. ఆఫీసరు భార్యగా తన దర్జాకి, మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది వనజ. ఈ గౌరవానికి కృష్ణమూర్తి కూడా అలవాటు పడిపోయాడు.చివరికి ఉద్యోగ విరమణ అయ్యాక తన కొలీగ్స్‌తో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉందామనుకునే లోపు, ‘ఊరు పేరు లేని చోట్ల అనామకుడిలా ఉండలేరు ఆయన. నలుగురు మనుషులకి సాయంగా, అందరి తల్లో నాలుకలా ఉండడమే ఇష్టం ఆయనకి. పుట్టిన ఊరంటే ఎంత మమకారమో. ఈరోజుల్లో ఎవరుంటారమ్మా ఇలాగ!’ అంటూ అటు తన పుట్టింటికి కూడా కూత వేటు దూరంలో ఉండే సొంతూరికి చేరవేసింది కృష్ణమూర్తిని వనజ.వనజ మెల్లిగా ఇక్కడ కూడా మొగుడి పరపతి పెంచేసింది. మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ప్రతి చిన్న విషయంలోనూ ‘ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు’ అని మొగుడి గురించి అందరికీ కథలు కథలుగా చెప్పి తన ప్రమేయం లేకుండానే అందరికీ ‘కిట్టప్ప’గా మాత్రమే పరిచయం ఉన్న మూర్తిని కాస్తా ‘కృష్ణమూర్తిగారు’గా ఊరిలోకే పెద్ద తలకాయలాగా చెలామణీలోకి తెచ్చేసింది వనజ.ఉద్యోగం ఉన్నంత వరకు ఫరవాలేదు కానీ ఇప్పుడు ఊరికొచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. అందరూ కృష్ణమూర్తిని చూసి ఒక చేత్తో అర్ధ నమస్కారం చేసి తప్పుకునే వారే కానీ ఎవ్వరూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కాదు. ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగి, అందరి తలపంకింపులకు బదులు చెప్పి, వాళ్ళ ఈతి బాధలు విని తనకు తోచిన మాటేదో చెప్పి రావడంతోనే సరిపోతోంది. అతని ఇష్టాయిష్టాలు, సరదాలు వినడానికి ఎవ్వరూ లేక పిచ్చెక్కుతోంది మూర్తికి.దానికి తోడు కొత్తగా ఈ అమెరికా గోల ఒకటి తోడయ్యింది. ఇన్నిసార్లు ‘నేను అమెరికా రాను’ అంటుంటే, కాస్త మెల్లిగా ‘ఎందుకండి? ఏమిటి సంగతి?’ అని అడిగి తెలుసుకుందామనే ఆలోచనే లేని వనజని చూస్తుంటే ఎప్పుడూ లేనిది మొట్టబుద్ధేస్తోంది కృష్ణమూర్తికి.‘నేను అమెరికా రాను’ అని కృష్ణమూర్తి అనగానే, దానికి కూడా అదేదో గొప్ప సుగుణం అన్నట్టు ‘ఈరోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా?’ అంటూ దేశ భక్తుల జాబితాలో కలిపేసింది మొగుడిని వనజ.హ అప్పటినుండి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఈ మాటే.జెండామాను సెంటరు దగ్గరికి సాయంత్రాలు వెళ్ళగానే అరుగు మీద మధ్యాసనం ఇచ్చి ఒకటే ఎత్తేస్తున్నారు కృష్ణమూర్తిని అంతా.ఇట్లా దేశం మీద, పుట్టిన ఊరి మీద ఇంత అభిమానం ఉండడం మీకే చెల్లింది. మావాడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం కూడా పాస్ అవ్వలేదు అప్పుడే అమెరికా, ఆస్ట్రేలియా అంటూ కలవరిస్తున్నాడు మూర్తి గారు.’‘మా బామ్మర్ది, కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళి వచ్చినప్పటినుండీ మమ్మల్ని మనుషులుగా చూస్తే ఒట్టు. మూణ్నెళ్ళకే వాడికి పుట్టిన ఊరు మాసిపోయినట్టు కనపడిందంట. తిరిగి వచ్చినప్పటి నుండీ పూటకి నాలుగుసార్లు ఇళ్ళు దులపను సరిపోతోంది వాడికి.’‘రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూసినట్టే...బ్బా’‘బా చెప్పావ్. పోయేకాలం బుద్ధులు. అందరూ కృష్ణమూర్తిగారిలా నిండుకుండలా ఉండగలరా? మనిషంటే ఇట్లా ఉండాలి.’‘మరే! అందుకే ఇంకా ఈ దేశంలో వానలు పడతాండేది.’ఇట్లా కృష్ణమూర్తిని మధ్యలో పెట్టుకుని అంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే చిరాకు ఎక్కువైపోతోంది మూర్తికి. ‘వుండండెహే! ఎదవ గోల. ఏ నాకొడుకూ నా మాట వినరేమిరా!’ అని అరిచి పచ్చిబూతులు నాలుగు మాట్లాడి, అసలు సంగతి చెప్పేద్దామనుకున్నాడు మూర్తి.‘‘కానీ అసలు తను అమెరికా ఎందుకు వెళ్ళను అంటున్నాడో చెపితే వీళ్ళంతా నిచ్చలకపోరూ? ఈ గౌరవం ఈ మర్యాదా ఇంచుక పుల్లంత అన్నా మిగులుతుందా అని? అసలు సంగతి తెలిస్తే ఇక జెండామాను సెంటర్లో నాకు సెంటర్ సీటు ఉంటుందా? అంతా కలిసి నన్ను ఒక మూలకి తోసెయ్యరా. నా నోట్లోంచి మాటొచ్చేదే వేదంగా వినుకునే వాళ్ళు, ‘నువ్వలాగ ఉండరా కిట్టిగా, ఇవతల పెద్దాయన మాట్లాడుతున్నాడా.’ అని తీసిపారేస్తేనో?’’ ఆ ఊహకే ఒళ్ళు జలదరించింది కృష్ణమూర్తికి. సైలెంటయిపోయాడు.ఇక ‘‘వెంకాయి గాడి అంగడిలో నేను గోల్డ్‌ఫ్లేక్ తీస్కుంటే గుప్పిట్లో అగ్గిని పదిలంగా నా మూతికాడికి తీసుకువచ్చి నా సిగరెట్ వెలిగించి, ఆపైన నేను కదిలి వెళ్ళాకగాని తన బీడీ వెలిగించుకోని రమేషుగాడికి అసలు సంగతి తెలిస్తే నా సిగరెట్ వెలిగిస్తాడా ఎప్పటికైనా? ‘ఏంట్రా ఆ ఆగింతం కిష్టిగా, నా బీడీ వెలిగించుకునేదాకా ఆగలేవా అంట.’ అని విసుక్కుంటే నేను తట్టుకోగలనా?’’ అనుకుని ఆగిపోయాడు కృష్ణమూర్తి.బావ బామ్మర్దులకి చెప్పుకుందామంటే కొండపైన వేలుపులా చూసే వాళ్ళ కళ్ళలో హేళన చూసేకన్నా కట్ట కింద బావిలో దూకడం మేలనుకుని గమ్మునుండిపోయాడు.ఆపైన తమ ఇంట్లో సహాయం చేసే మునెమ్మ, ఇస్త్రీపెట్టి ఈశ్వరయ్య, నీళ్ళ క్యాను వేసే మధుసూదన్, అమెజాన్ డెలివరీకి ఉర్లోకొచ్చే సతీష్, గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పైఊరి అబ్బాయి ఇట్లా ఎవరికి చెప్పుకుందామన్నా తన పేరుకే చేటు అని అనుకుని ఊరకుండిపోయాడు కృష్ణమూర్తి. ఆలోచించిన కొద్దీ ఎవరో ఒక్కరికైనా అసలు సంగతి చెప్పాలనే కోరిక బలంగా నాటుకోసాగింది. చెప్పుకుంటే ఊరంతా వెనకగా చేరి ఘొల్లుమని నవ్విపోతారేమో’’ అనే బెంగ తొలిచేస్తోంది.‘‘ఇంకా నయం వనజకి చెప్పలేదు. ‘ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు’ అన్నట్టు అంతెత్తున నిలబెట్టి చూస్తూంటుంది నన్ను ఎప్పుడూ. తీరా అసలు సంగతి తెలిస్తే? మయసభలో ద్రౌపదిలా తను నవ్వితే? ఇంత బతుకూ బతికి ఇంటిలోనే అవమానం పొందాలా? వద్దు వనజకి కూడా చెప్పకూడదు’’ అనుకున్నాడు కృష్ణమూర్తి.ఇలా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక తికమక పడుతున్న కృష్ణమూర్తికి ముందరి గదిలో అలికిడి వినపడడంతో ఆలోచనలని పక్కన పెట్టి లోపలి గదిలోంచి ఇవతలికి వచ్చాడు.మునెమ్మ వచ్చింది పని సాయానికి.‘‘నువ్వొస్తే వచ్చావు మళ్ళీ వీడిని ఎందుకు వెంటేసుకుని వచ్చావు. ఉప్పురాయి పని చెయ్యడు. దర్బారుకేమీ తక్కువ కాడు’’ అంటూ ఆక్షేపణగా అంటోంది వనజ మునెమ్మెతో పాటు వచ్చిన మునెమ్మ మనవడిని.వాడిని చూడగానే కళ్ళు తళతళ మెరిశాయి కృష్ణమూర్తికి. ‘అరె భలే మంచి టయానికి వచ్చాడే వీడు. వీడి గురించిన ఆలోచనే రాలేదే’ అనుకుని సైలెంటుగా పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు. వనజ కృష్ణమూర్తికి కాఫీ, మునెమ్మ మనవడికి కాస్త టిఫిను పట్టుకొచ్చి ఇచ్చింది.మునెమ్మ, టౌనులో చదువుకుంటూ అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చే మనవడిని తీసుకుని వస్తుంది కృష్ణమూర్తి వాళ్ళింటికి. వాడంటే మంచి గురి కృష్ణమూర్తికి. ఊర్లో మిగతా వారిలా అతి వినయాలకి పోడనీ, సూటిగా కళ్ళల్లోకి చూస్తాడనీ, వనజని చూసి గౌరవంతో కూడిన భయభక్తుల ప్రదర్శన చేసి మెప్పు పొందాలనుకోడనీ కృష్ణమూర్తికి వాడంటే ఇష్టం. వనజకి వాడంటే అందుకే విసుగు. పైగా కృష్ణమూర్తిని ‘సారుగారు’ అని వాడి చేత పిలిపించాలని ప్రయత్నించి ఓడిపోయింది. అందుకని కూడా వాడంటే ప్రత్యేక అభిమానం కృష్ణమూర్తికి.ఒక్కోసారి తనతో పాటు వాకింగ్‌కి పాత బజారు తీస్కెళ్ళేవాడు వాడిని కూడా. ఇప్పుడు వనజ ‘చీపు టేస్టు’ అని విసుక్కునే చిన్నప్పుడు తనకి అమితంగా ఇష్టమైన జిలేబీ ఇప్పించి తిరిగి వస్తూ వస్తూ కొన్ని తనూ తినేవాడు కృష్ణమూర్తి గుంభనంగా.వనజ, మునెమ్మ లోపల పనుల్లో పడగానే కాఫీ తాగేసి పక్కన పెట్టేసి మునెమ్మ మనవడిని సైగ చేసి రమ్మని పిలిచి చడీ చప్పుడు కాకుండా బయటికి తీస్కెళ్ళాడు కృష్ణమూర్తి.అలా కాస్త దూరం నడిచి బస్టాండ్ షెల్టర్‌లో అరుగు మీద కూర్చున్నారు ఇద్దరూ.‘‘ఒరేయ్. నాకెందుకో నిన్ను చూస్తే భలే నమ్మకమైన మనిషిలా కనపడుతున్నావురా.’’ అన్నాడు కృష్ణమూర్తి మునెమ్మ మనవడితో.‘ఏంటి విషయం!’ అన్నట్టు చూశాడు వాడు.‘‘ఇప్పుడు నీకో సంగతి చెప్తాను. సత్య ప్రమాణంగా ఎవ్వరికీ చెప్పనని మాటివ్వాలి నాకు. ఇస్తావా మరి?’’ అని అడిగాడు కృష్ణమూర్తి ఆశగా వాడి వైపు చూస్తూ.అవును కాదూకి మధ్యస్థంగా తలూపి మెదలకుండా కూర్చున్నాడు వాడు.‘మరేమో నేను మాములు కోరికలకి అతీతుడినని, అందరిలాగా తుచ్ఛమైన గొప్పలకు పోనని, ఎంతో పద్ధతి గలవాడినని అంతా అనుకుంటున్నారు కదా.’’‘అయితే ఎవడికి గొప్ప!’ అన్నట్టు చూసి, చెట్టు మీద వాలిన కాకిపై దృష్టి పెట్టాడు వాడు.‘‘దేశం మీద ఊరి మీద వెర్రి అభిమానంతో విదేశీయాన అవకాశాన్ని కూడా చెత్త కాగితంలాగా ఉండచుట్టి విసిరేసిన పెద్దమనిషినని అనుకుంటున్నారు కదా? అవేమీ నిజం కాదురా. నేను అమెరికా వెళ్ళకుండా ఉండిపోడానికి అసలు కారణం ఏమిటో తెలుసా?’’వాడసలే కోపదారి మనిషేమో ‘ఏందీ పెద్దమనిషి, నానుస్తాడే గాని అసలు సంగతి చెప్పడేందేహే’ అని విసుగేసి అరుగు మీంచి దూకి పరుగందుకోబోయాడు.వాణ్ని లటుక్కున పట్టుకుని, బతిమాలి బామాలి అరుగుమీద కూర్చొనబెట్టి మళ్ళీ కొనసాగించాడు కృష్ణమూర్తి.‘‘నాకూ. నాకు..ఎస్కలేటర్లన్నా, విమానాలన్నా చచ్చేటంత భయంరా అయ్యా! ఎస్కలేటర్ ఎక్కాలంటే ప్యాంటులోనే ఒకటీ రెండూ అన్నీ అయిపోతాయి. విమానంలో అన్నేసి గంటలు ఉండాలన్న ఊహకే దడుపు వచ్చేస్తుందిరా. నాకు అదొక ఫోబియా. నాకుండదా అమెరికా చూడాలని! వనజ లేదూ వాట్సాప్‌లో అక్కడి ఫొటోలు అవీ పంపుతుంటే, నవ్వి ఊరుకునే వాడిని కానీ ‘తస్సాదియ్యా అన్నీ ఎక్కి దిగేసి చిన్నపిల్లలా తెగ ఎంజాయ్ చేసేస్తోంది ఇది’ అని తెగ ఉడుక్కునేవాడిని. అదిరా అసలు సంగతి. ఎవ్వరికీ చెప్పకేం. సరేనా.’’ అని చెప్పడం ఆపాడు కృష్ణమూర్తి.‘ఏంది ఇంతమాత్రానికే ఓ అని ఇదైపోతండావా పెద్దాయనా!’ అన్నట్టు నవ్వాడు వాడు పత్తిపువ్వులాగా.‘‘సరే మరి. ఈ విషయం చెప్దామనే తీసుకొచ్చాను నిన్ను. ఒట్టేశావు ఎవ్వరికీ చెప్పనని. గుర్తుంచుకోరా. సరేనా.’’ అని చెయ్యి చాపాడు కృష్ణమూర్తి.‘వొరె వొరె! పాపం పెద్దాయనకి ఎంత కష్టం ఒచ్చిందీ’ అనుకుని ఆ చేతిలో తన చెయ్యి వేశాడు వాడు.మనసులోని భారం తీరడంతో ఒక్కసారి చూట్టూ చూసి గంభీరంగా ‘రాజు వెడలె’ అన్నట్టు కదిలాడు ‘కృష్ణమూర్తిగారు.’ఆయన చెయ్యి పట్టుకుని జిలేబీ అంగడి వైపు దారి తీశాడు తను ఎంత పెద్ద సహాయం చేశాడో తెలీని మూడున్నరేళ్ళ మునెమ్మ మనవడు. - శ్రీనిధి యెల్లల -
కథాకళి: డిటెక్షన్
డిటెక్టివ్ పెద్దబ్బాయి శవాన్ని బదులు యాష్‌ట్రేని పరీక్షగా చూశాక చెప్పాడు.‘‘ఇది ఆత్మహత్య కాదు ఇన్ స్పెక్టర్.’’ ‘‘కాని పిస్టల్ కుడిచేతిలో ఉంది. గుండు కుడి కణతలోంచి వెళ్ళింది.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘హత్య చేసిన మర్డరర్ హతుడికి బాగా పరిచయం ఉన్నవారు కూడా.’’‘‘మీరు అంతా ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్. ఇది ఎలా చెప్పగలరు?’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఆశ్చర్యంగా అడిగాడు.‘‘యాష్‌ట్రేని చూడు. నీకు ఏం కనిపిస్తోందో చెప్పు చిన్నబ్బాయ్.’’ ఆయన కోరాడు.‘‘సిగరెట్ పీక.’’‘‘సిగరెట్ నుసి?’’‘‘గమనించాను సర్. అది చివరిదాకా కాలి ఉంది.’’‘‘దాని అర్థం దాన్ని వెలిగించినా కాల్చలేదని. కాలిస్తే నుసి విరిగిపోకుండా అంత పొడుగ్గా ఉండేది కాదు.’’‘‘నిజమే సుమండీ. హతుడుగారు సిగరెట్ వెలిగించగానే హంతకుడు వచ్చి చంపాడన్నమాట.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘హత్యని ఎలా కనుక్కున్నావు?’’‘‘మీరు చెప్పారుగా సర్.’’‘‘నేను ఎలా చెప్పగలిగాను?’’‘‘అది మాకు ఎవరికీ తెలీదు కాబట్టి మీరే చెప్పాలి సర్.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి నవ్వుతూ కోరాడు.‘‘సిగరెట్ పీక ఫిల్టర్ ఎటువైపు ఉంది?’’ పెద్దబ్బాయి అడిగాడు.వెంటనే అందరి కళ్ళు ఆ సిగరెట్ పీక మీదకి మళ్ళాయి.‘‘హతుడికి అవతలి వైపుంది.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘పీకవైపు కూర్చున్న మనిషి సిగరెట్ పీకని తనవైపు పెట్టుకుంటాడు.’’‘‘అర్థమైంది. హంతకుడే ఈ సిగరెట్‌ని వెలిగించి, ఓ దమ్ము పీల్చి ఏష్ ట్రే మీద ఉంచి పని పూర్తి చేసి, పిస్టల్ని హతుడి చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘సిజర్స్ సిగరెట్ తాగే వాళ్ళు సామాన్యులు. అంటే ఆర్థికంగా హతుడికన్నా చిన్నస్థాయి వారి పనిది.’’ డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘ఈయనగారి బంధుమిత్రుల్లో ఎవరు సిజర్స్ తాగుతారో కనిపెడితే హంతకుడు ఎవరో తెలిసిపోతుంది.’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఉత్సాహంగా చెప్పాడు.‘‘సిజర్స్ తాగనివారే ఈ హత్య చేసింది.’’ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘అదేమిటి సర్ మళ్ళీ?’’‘‘వాళ్ళ మీదకి అనుమానం మళ్ళించాలని చేసిన ప్రయత్నం ఇది.’’‘‘ఓ. మరి వాళ్ళు ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతారు సార్?’’‘‘ఏదీ తాగరు. ఆడవాళ్ళు సిగరెట్‌ని తాగుతారా?’’‘‘ఆడవాళ్ళ పనా? హంతకి అని ఎలా తెలుసుకోగలిగారు?’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి ఆసక్తిగా అడిగాడు.‘‘సిగరెట్‌ని వెలిగించడం తప్ప కాల్చకపోవడం వల్ల. సిజర్స్ ఎవరు తాగుతారో వారి నుంచి ఆ మహిళ దీన్ని కొట్టేసింది.’’‘‘ఎందుకని?’’‘‘తన భర్త మీదకి అనుమానం వెళ్ళాలని.’’‘‘భర్తా? మీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్. హంతకి అని, ఆమెకి పెళ్ళైందని ఎలా కనుక్కున్నారు?’’ చిన్నబ్బాయి అడిగాడు.‘‘ఇవాళ ఏం వారం?’’‘‘శుక్రవారం.’’‘‘శుక్రవారం నాడు ఇలాంటి సంప్రదాయ ఇంట్లోని ఇల్లాళ్ళు ఏం చేస్తారు?’’‘‘రోజులా నో ఫుడ్ ఆర్డర్ సర్. వంట చేస్తారు.’’‘‘కాళ్ళకి పసుపు రాసుకుంటారు. తెల్లటి ఫ్లోర్ కాబట్టి నేల మీద ఎండిన పసుపు తునకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హతుడి ముగ్గురి కోడళ్ళలో ఈ రోజు పాదాలకి పసుపు రాసుకున్నది రెండో కోడలు మాత్రమే.’’‘‘ఆమె ఇంతదాకా ఇక్కడికి రాలేదు. ఎలా కనుక్కున్నారు?’’ ఇన్ స్పెక్టర్ అడిగాడు.‘‘గోడ మీది ఫేమిలీ పిక్చర్‌ని చూడండి. ఒకామె మొహానికి బొట్టు లేదు. ఫొటోకి బొట్టు పెట్టుకోని ఆ వయసులోని హిందూ స్త్రీ ఉండదు. మరొక ఆమెకి బాబ్డ్ హెయిర్, పెదాలకి లిప్‌స్టిక్ ఉన్నాయి కాబట్టి ఆమె పసుపు రాసుకునే తరహా కాదు. హతుడి రెండో కొడుకు పక్కన నిలబడ్డ ఆమె తలలో పూలచెండు, నుదుట కుంకుమ బొట్టు ఉన్నాయి. మన పనైంది. ఇక పద.’’ పెద్దబ్బాయి చెప్పాడు.గంట తర్వాత డిటెక్టివ్ పెద్దబ్బాయి ఆఫీస్‌లో ఫోన్ మోగింది.‘‘అది ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి నించి. బహశా భర్తతో సఖ్యతలేని ఆమె, తన భర్త మీదకి హత్యా నేరం వెళ్ళి అతనికి శిక్ష పడితే, మామగారి ఆస్తిలోని అతని భాగాన్ని తనే అనుభవించచ్చని ఈ పథకం వేశానని ఒప్పుకుని ఉంటుంది.’’ డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.ఆ ఫోన్ కాల్ ఎటెండ్ అయ్యాక అసిస్టెంట్ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మీరు ఎప్పుడూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూంటారు. నిజమే సర్. హంతకి కాళ్ళకి పసుపు రాసుకుందిట. కొద్ది కాలంగా భర్తకి, ఆవిడకి పడటం లేదట.’’ -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
తిరుపతిలో నా పెళ్లి!
అచ్చం తల్లి శ్రీదేవి పోలికలతో మెరిసిపోతూ, హోమ్లీ వైబ్స్‌తో ఉండే చిల్ గర్ల్ జాన్వీ కపూర్! గ్లామర్ సామ్రాజ్యానికి వారసురాలైనా, నటిగా తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల తార మనసులోని ముచ్చట్లు.. ఆమె మాటల్లోనే!నాన్నకు తెలియని వేగాస్ ట్రిప్అందరమ్మాయిల్లాగానే, టీనేజ్‌లో నేను కూడా చాలా సీక్రెట్స్ దాచాను. ఒకసారి మా నాన్నతో సినిమాకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి, నేరుగా వేగాస్ ఫ్లైట్ ఎక్కేశాను! రాత్రంతా అక్కడ తిరిగి, ఉదయం వచ్చేశా, ఇది నాన్నకు అస్సలు తెలియదు. అలాగే, ఇండస్ట్రీలోకి వచ్చేముందు నా పాత ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని పోస్ట్‌లన్నింటినీ కంప్లీట్‌గా డిలీట్ చేసి, పబ్లిక్ కోసం కొత్తగా మరో అకౌంట్ స్టార్ట్ చేశాను.‘చుస్కీ’ నా బెస్ట్ ఫ్రెండ్!నా దగ్గర ఒక పింక్ వాటర్ బాటిల్ ఉంటుంది. దానికి ‘చుస్కీ’ అని పేరు పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్లినా అది నా వెంట ఉండాల్సిందే. చాలామందికి అది ఫన్నీగా అనిపించినా, నాకు మాత్రం అది చిన్న కంఫర్ట్ జోన్ లా ఉంటుంది.కష్టపడతా!మా కుటుంబం వల్ల నాకు ప్రేమ దక్కింది అనేది నిజం. కానీ ఆ ప్రేమకు నేను అర్హురాలిని అని నిరూపించుకోవడం మాత్రం నా బాధ్యత. అందుకే ప్రతి సినిమాకు డబుల్‌గా కష్టపడతాను.సినిమా చూస్తూ ఏడ్చేశా!‘నేను సినిమాలు చూసేటప్పుడు చాలా హైపర్–ఎమోషనల్ అయిపోతాను. ఒకసారి ‘ఏ క్వైట్ ఫ్లేస్’ అనే హారర్ సినిమా చూస్తూ థియేటర్లో కంట్రోల్ లేకుండా ఏడ్చేశాను. అది దయ్యాల సినిమా అయినా, అందులోని క్యారెక్టర్స్ పడే బాధ నన్ను అంతలా కదిలించింది.అతన్ని ఫాలో అవుతుంటా...బాలీవుడ్ నటుల్లో కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియా పేజీని తప్పకుండా ఫాలో అవుతుంటాను. కార్తీక్ తన పేజీ ద్వారా చక్కని వినోదం పంచుతుంటాడు. సున్నితమైన హాస్యాన్ని పంచే పోస్టులు పెడుతుంటాడు. అతని పోస్టులకు నేను తరచు కామెంట్లు కూడా చేస్తుంటాను.ట్రోలింగ్స్‌కి నో టెన్షన్!ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చాలా హర్ట్ చేస్తాయి. ఆ సమయంలోనే ఒక విషయం నేర్చుకున్నా. కొందరు మనల్ని గొప్ప అంటారు, ఇంకొందరు పనికిరాని వాళ్లమంటారు. నిజం మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి.డ్రీమ్ వెడ్డింగ్... ఇదే నా ప్లాన్!చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల షూటింగ్స్ కోసం ప్రపంచమంతా తిరగడం వల్ల నా లైఫ్ ఒక ‘నొమాడ్’లా సాగింది. అందుకే నాకు బాలీవుడ్ తరహా ఆడంబరాల పెళ్లి వద్దు. తిరుపతిలోనే నా డ్రీమ్ వెడ్డింగ్ జరుగుతుంది. ప్యూర్ గోల్డ్ కంజీవరం శారీ కట్టుకుంటాను. పెళ్లి మెనూలో పక్కా సౌత్ ఇండియన్ వంటకాలే ఉంటాయి.అలా నా పేరు...మా నాన్న నిర్మించిన ‘జుదాయి’ సినిమాలో మా అమ్మతో పాటు ఊర్మిళా మటోండ్కర్ కూడా నటించింది. అందులో ఆమె పాత్ర పేరును అమ్మా, నాన్నా ఇద్దరూ ఇష్టపడ్డారు. మొదటి బిడ్డకు ఆ పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అలా నాకు ఆ పేరు పెట్టారు.అవంటే చాలా ఇష్టంనటిగా ఫిట్నెస్ మీద జాగ్రత్తలు తీసుకుంటాను గాని, ఒక్కోసారి నాకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తూ ఉంటాను. స్ట్రీట్ ఫుడ్‌లో మోమోస్‌ను ఎక్కువగా ఇష్టపడతాను. రాజస్థానీ స్పెషల్ ‘జంగ్లీ మటన్’, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, పాయా ఎక్కడ కనిపించినా వాటిని వదులుకోను. స్వీట్లలో జిలేబీ, చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. రుచులను ఆస్వాదించడానికి ఇష్టపడతాను గాని, అలాగని ఎక్కువగా తినను. -
వరికోతల వేడుక వివాహాల వేదిక
సంప్రదాయ పండుగ గవాయి దాయక్ వేడుకలకు తూర్పు మలేషియాలోని శరవాక్ రాష్ట్రంతో పాటు, బోర్నియో దీవులు ముస్తాబయ్యాయి. వరి కోతలు పూర్తయిన సందర్భంగా దాయక్ తెగ ప్రజలు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగ ఇది. మే చివరి వారంలో మొదలైన ఈ వేడుకలు జూన్ చివరి వారంలో ముగుస్తాయి. దాయక్ తెగ భాషలో గవాయి అంటే పండుగ అని అర్థం. ఇది దాయక్ తెగకు నూతన సంవత్సరం వంటిది. పాత పంటకాలం ముగిసి, కొత్తగా వరి నాట్లు వేసే కాలం ప్రారంభమవడానికి ఇది సూచిక. ప్రాచీన కాలంలో గిరిజన యుద్ధాలు, కొత్త వ్యవసాయ భూముల గుర్తింపు, కొత్త ప్రాంతాలకు వలస వెళ్లే సమయంలో ఈ ఆచారాలు నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, రక్షణ కలగాలని దాయక్ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. దాయక్ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వారు ఎక్కువగా వరి సాగు చేస్తారు. అన్నమే వారి ముఖ్య ఆహారం. పంట చేతికొచ్చి, ధాన్యపు రాశులు ఇళ్లకు చేరిన ఆనందంలో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. బ్రిటిష్ పాలన కాలంలో శరవాక్ దినోత్సవంగా ఉన్న ఈ రోజును, 1964 సెప్టెంబర్ 25న శరవాక్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించారు. తదనంతరం, 1965 జూన్ 1న మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో గవాయి దాయక్ను ఘనంగా నిర్వహించారు.ఈ పండుగ కోసం మే నెల ప్రారంభం నుంచే సన్నాహాలు మొదలవుతాయి. పండుగకు కొన్ని రోజుల ముందు, లాంగ్‌హౌస్ (దాయక్ ప్రజలు నివసించే పొడవాటి ఉమ్మడి ఇళ్లు) నివాసితులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసి, అలంకరిస్తారు. తమ పూర్వీకుల ఆత్మలకు నివాళిగా శ్మశాన వాటికలను కూడా శుభ్రం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గవాయి పండుగలో అత్యంత ముఖ్యమైనది ‘తువాక్’ అనే సంప్రదాయ పానీయం. మెత్తగా ఉడికించిన అన్నాన్ని ఈస్ట్‌తో కలిపి జాడీలలో నిల్వ చేసి, పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.ఈ పానీయం సేవించడాన్ని ధైర్యానికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. దాయక్ తెగలలో ఎక్కువ శాతం వివాహాలు ఈ పండుగ రోజుల్లోనే జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా లాంగ్‌హౌస్ కమిటీలు వివిధ పోటీలను నిర్వహిస్తాయి. యువతీ యువకుల ఊరేగింపులు, అందాల పోటీలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలతో పాటు, సంప్రదాయ నృత్యాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. నెల రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జూన్ చివరి వారంలో జరిగే ముగింపు వేడుకలో ‘చాపలు’ చుట్టేస్తారు. ‘చాపలు’ చుట్టేశారంటే, వేడుకలు ముగిసినట్లే!∙ రమా జంబుల -
పాల ఉత్పాదనలో మనమే టాప్!
సులువుగా దొరికే పోషకాహారంలో పాలను మించినవి లేవు. ఐదు దశాబ్దాల కిందట భారత్‌లో పాలకు లోటు ఉండేది. పాలను, పాలపొడిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఉండేవి. వర్ఘీస్ కురియన్ 1970లో చేపట్టిన ‘శ్వేత విప్లవం’ అనతికాలంలోనే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా మన దేశం పాల ఉత్పాదనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్య«ధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.పాల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలో నిలుస్తున్నా, పాల తలసరి వినియోగంలో మాత్రం మొదటి పది స్థానాలలో లేకపోవడం గమనార్హం. అత్యధిక జనాభా, పేదరికం, పాలకు బదులుగా పెరుగు, మజ్జిగ వంటి ఉత్పాదనల వినియోగం పట్ల ప్రజల అభిరుచి తదితర కారణాల వల్ల తలసరి పాల వినియోగంలో భారత్ వెనుకబడి ఉంటోందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. పాల తలసరి వినియోగంలో మొదటి పది దేశాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం. -
వామనుడి త్రివిక్రమావతారం
‘జోసెఫ్ కాన్రాడ్, వ్లదిమీర్ నబాకఫ్, వి.ఎస్. నైపాల్ తదితరులు సొంత దేశాలూ– భాషలూ– ఖండాలూ– సంస్కృతులూ– ఒక్కమాటలో చెప్తే సొంత నాగరికతలను అధిగమించి, వేర్వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆ వలసలు వారి ఊహాశక్తికి పదునుపెట్టి, పోషణనిచ్చాయి. అవి వలసల వల్ల సంక్రమించినవి. నా విషయంలో అలా చెప్పుకోడానికేమీ లేదు! ఒకే నగరం– ఒకే వీథి– ఒకే భవనంలో నా జీవితంలో అత్యధికభాగం గడిచిపోయింది. అక్కడి నుంచే, అదే దృశ్యాన్ని, అదే కోణంలోంచి చూస్తూ ఇన్నాళ్ళూ గడిపేశాను. నన్ను ‘నేను’గా మార్చిన నగరంతో నాకున్న ప్రగాఢ అనుబంధం అలాంటిది’ అన్నారు ఫెరీత్ (ఫరీద్) అర్హాన్ పముక్. 2006లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకునే నాటికే అర్హాన్ పముక్ సుప్రసిద్ధుడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా వున్న అర్హాన్ పముక్, యాభయ్యేళ్ళకు పైగా సాహిత్యరంగంలోనూ కృషి కొనసాగిస్తూనే వున్నారు.దాదాపు డజను నవలలు రాసిన పముక్ కాల్పనికేతర సాహిత్యం కూడా బోలెడంత రాశారు. ‘ఇస్తాంబుల్– జ్ఞాపక నగరి’ అనే రచన అలాంటిదే! అది సగం జ్ఞాపకాల నెమరువేత ఐతే, మరికొంత ఇస్తాంబుల్ నగర జాతక చక్రం! ఆసియా–ఐరోపా ఖండాల మధ్య యుగయుగాలుగా విస్తరించి ఉన్న భూమార్గంలో చిట్టచివరి మజిలీ ఇస్తాంబుల్. ఈ చారిత్రక నగరం తూర్పు భాగం ఆసియాలో వుండగా, పడమటి భాగం యూరపులో చేరింది. తూర్పు ఇస్తాంబుల్‌లోని ‘పముక్ భవంతి’ పే...ద్ద అపార్టుమెంట్ సముదాయం. అర్హాన్ పముక్ బంధువులందరూ ఆ భవంతిలోని ఒక్కో అపార్టుమెంట్లో సకుటుంబంగా జీవిస్తూ వుంటారు. మధ్యలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వుండివచ్చినా, ఎక్కువ కాలం ఆ భవంతిలోనే వున్నానంటారు పముక్. వలస జీవన విధానం ఒకరకం శక్తినిస్తే, ఒకే చోట పాతుకుపోయి జీవించడం మరోరకం శక్తిని ఇస్తుందని పముక్ రుజువు చేశారు. ప్రపంచంలోని ప్రతి చెప్పుకోదగిన నగరంలోని జీవిత విధానం పైనా ఎవరో ఒకరు ఏదో ఓ రూపంలో రాస్తూనే వున్నారు. అంచేత పముక్ గొప్పతనం ఆయనొక్కడే వాళ్ళ నగరం గురించి రాయడంలో లేదు– అది రాసిన పద్ధతిలో ఉంది!సామాన్య శకం నాలుగో శతాబ్దిలో, తూర్పు రోమన్ సామ్రాజ్య రాజధానిగా నిర్మితమైన కాన్స్టాంటినోపుల్ నగరమే, ఆరేడు వందల సంవత్సరాల తర్వాత ఇస్తాంబుల్‌గా మారిందని యూరపియన్ చరిత్ర రచయితలు అంటారు. కానీ, అంతకు రెండువేల యేళ్ళకు ముందునుంచీ ఈ నగరం ఉన్న ప్రాంతం జనావాసంగా వుంటూనే వచ్చిందని ఆసియన్ చరిత్ర గ్రంథాల సమాచారం. బైజాంటియన్ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. మూడువేల సంవత్సరాల కిందట మతం– రాజకీయం రెండు స్వతంత్ర శాఖలుగా చీలక ముందటి మాట యిది. అసలు ‘బిజాంతీన్’ అంటేనే సంక్లిష్ట సమన్వయమని అర్థం! ఈ ప్రాంత చరిత్ర వరకూ ఇది అక్షరాలా సార్థకం!!‘ప్రాక్పశ్చిమ నాగరికతల మధ్య నిర్మించిన వారధులు’గా పముక్ రచనలను పేర్కొన్నారు నోబెల్ పురస్కారం ఎంపిక సంఘంలోని నిపుణులు! ‘రెండు నాగరికతల మేలికలయిక ఇస్తాంబుల్. దాని ‘వ్యాకులిత ఆత్మ’ను సరికొత్త ప్రతీకల సాయంతో శోధించిన వాడు పముక్. భిన్న సంస్కృతుల మధ్య తలెత్తే ఘర్షణలనూ– సమన్వయాన్నీ కూడా గొప్పగా చిత్రించినందుకు ఈ జ్యూరీ పముక్‌ను అభినందించింది. భిన్న భాషలూ, సంస్కృతులూ, మతాల మధ్య ఏర్పడే ఘర్షణలకు నూతన భాష్యాలు చెప్తూ, వాటికి ‘అనూహ్య సమన్వయాలను సూచించినందుకు’ పముక్‌ను జ్యూరీ కొనియాడింది. అంతటితో ఆగితే బావుండేది– ‘వర్తమాన సాహిత్య ప్రపంచంలో అత్యంత విశిష్టమైన వ్యక్తి పముక్’ అని జ్యూరీ ప్రకటించడంతో ఇంటా బయటా కూడా పెద్ద దుమారమే చెలరేగింది. కొందరు దాన్ని ‘కేవలం రాజకీయ ప్రకటన’గా చిత్రించి కొట్టిపారేశారు. మరికొందరు ఈ ప్రకటనను ‘టర్కిష్ సాహిత్యం సాధించిన ఘనవిజయం’గా జమకట్టారు. అయినా, మన సాహిత్య వేత్తల సుహృద్భావం మనకు తెలియనిదా? నక్కలెక్కడికెళ్ళినా ఊళలే వేస్తాయి–కోయిల ఏ దేశంలోనైనా తియ్యగానే పాడుతుంది! ఆ విషయం అలా వుంచండి!!‘ప్రతి మనిషీ జీవితంలో ఒకసారైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పరిసరాలు అప్పుడెలా వుండేవో, ఇప్పుడెల వున్నయో పునఃపరిశీలించుకోడానికి అది వుపయోగపడుతుంది. ఈ విశ్వం ఎంతో విశాలమైంది. దానిలోని ఒకానొక మూలనే, ఒకానొక రోజునే, ఒకానొక కుటుంబంలోనే మనం పుట్టాలని జీవితమనే లాటరీ ఎందుకు నిర్ణయించింది? ఆ కుటుంబం మనల్ని ఎందుకంతగా ప్రేమిస్తుంది? మనమెందుకు వాళ్ళను అంతగా అభిమానిస్తాం? ఏమో– ఇంతకన్నా మెరుగైన జీవితానికి అర్హులమేమో మనం? వయసుడిగిన ఓ నగరంలో పుట్టడం నా దురదృష్టమేమో అనిపిస్తుంది ఒక్కోసారి’ అన్నారు పముక్ ‘ఇస్తాంబుల్ నగరం – కొన్ని జ్ఞాపక కథలు’ పుస్తకానికి రాసిన ముందు మాటలో. ఆ పుస్తకం చదువుతూ పోతుంటే అవి ఓ వ్యక్తి జ్ఞాపకాలో, ఒకానొక నగరం స్వగతమో మర్చిపోతూ వుంటాం. ఒక వ్యక్తి విరాట్ రూపంలో ఓ చారిత్రక మహానగరాన్ని ఆక్రమించుకుంటున్నట్లు అనిపిస్తుంది!! అదే పముక్ వేసిన మంత్రం. ఇది అందరికీ చేతనయ్యే ట్రిక్కు కాదు. కనుకనే, ఫెరీత్ అర్హాన్ పముక్కు నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది.-మందలపర్తి కిషోర్ -
పరిశోధనా రంగంలో నకీలల కలకలం
శాస్త్ర రంగంలో వాస్తవ పరిశోధనల కంటే నకిలీల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల అంతర్జాతీయ పరిశోధక సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు యావత్ సైన్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి.‘అమ్ముడుబోతున్న’ జర్నల్స్!ఎటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు లేదా ప్రయోగాలు లేకుండానే, ధనార్జనే ధ్యేయంగా కొన్ని ముఠాలు నకిలీ అధ్యయన పత్రాలను విక్రయిస్తున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, శాస్త్రీయ ప్రమాణాలను పాటించాల్సిన కొన్ని గుర్తింపు పొందిన జర్నల్స్ (సైన్స్ పత్రికలు) సైతం ఈ ముఠాలతో చేతులు కలపటం! భారీ మొత్తంలో డబ్బు, ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రికలు నాణ్యత లేని, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచురిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి!నెట్‌వర్క్‌గా సాగుతోందినార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నిర్వహించిన లోతైన సత్యాన్వేషణలో భాగంగా, లక్షలాది పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తులు, నకిలీ పరిశోధకులు ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి, పరిశోధనా పత్రాలను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో, నికార్సైన పరిశోధనా పత్రాన్ని కూడా అది నిజమైనదా కదా అని సూక్ష్మంగా పరిశీలించాల్సిన అగత్యం ఏర్పడింది.అబద్దపు నివేదికలు, ప్రసంశలుప్రచురణల రంగంలోని పెద్దల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు ప్రధానంగా మూడు రూపాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు నార్త్‌వెస్టర్న్ బృందం గుర్తించింది ఆ మూడూ : ఎటువంటి ప్రయోగాత్మక ఆధారాలు లేకుండానే, కేవలం ఊహాజనిత లెక్కలతో అబద్ధపు నివేదికలను కల్పిత డేటాతో సిద్ధం చేయడం; నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు, ఎవరి పేరునైనా సరే ‘ప్రధాన పరిశోధకుడి’ (ఫస్ట్ ఆథర్) గా నివేదికలో చేర్చటం; ఆ తప్పుడు పరిశోధనకు ప్రాధాన్యం కల్పించేందుకు కొన్ని పత్రికల్లో రివ్యూలు రాయించటం, అలాగే ‘గ్రంథ రచయిత’లుగా కొందరికి ప్రశంసాపత్రాలు అందచెయ్యటం! ‘‘ఈ ధోరణి పట్ల మనం ఉదాసీనంగా ఉండిపోతే, సైన్స్ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని ప్రొఫెసర్ అమరల్ కలవరపడుతున్నారు. అమరల్ నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సోషల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ నిపుణుడు. ఆయన తన సహ పరిశోధకుడు రీస్ రిచర్డ్‌సన్‌తో కలిసి కూపీ లాగినప్పుడు ఈ నకిలీ పరిశోధనల పత్రాల గుట్టలు బయటపడ్డాయి. వాటిపై వీరిచ్చిన సంచలన నివేదిక ప్రతిష్టాత్మకమైన పి.ఎన్.ఎ.ఎస్. (ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) జర్నల్‌లో రావటంతో అంతర్జాతీయంగా నకిలీ పరిశోధనా పత్రాలపై చర్చ మొదలైంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్’ మద్దతు కూడా వీరికి లభించింది. తవ్వి తీశారుఅమరల్ పరిశోధక బృందం కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలోని అతి పెద్ద డేటాబేస్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అక్రమాలను వెలికి తీసింది. ఇందుకోసం వారు ‘వెబ్ ఆఫ్ సైన్స్’, ‘స్కోపస్’, ‘పబ్మెడ్’ వంటి పేరున్న డేటాబేస్‌ల నుండి లక్షలాది రికార్డులను సేకరించి తూర్పార పట్టారు. ఒకే రకం చిత్రాలను లేదా ఒకే రకం డేటాను వేర్వేరు పరిశోధనా పత్రాల్లో మళ్లీ మళ్లీ వాడటం వంటి మేధోచౌర్యాన్ని గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించనందున డేటాబేస్‌ల నుండి తొలగింపునకు గురైన జర్నల్స్ జాబితాను నిశితంగా చెరిగి, వాటిలో వచ్చిన పరిశోధనా పత్రాల వెనుక ఉన్న ఉమ్మడి నెట్‌వర్క్‌లను వెలికితీశారు. ‘రిట్రాక్షన్ వాచ్’, ‘పబ్పీర్’ వంటి వాచ్డాగ్ ప్లాట్‌ఫామ్‌లలోని చర్చలను, ఎడిటర్ల నేపథ్యాలను, పరిశోధనా పత్రాల సమర్పణ తేదీలను బేరీజు వేసుకున్నారు. ఇంత నిశితంగా తవ్వుకుంటూ వెళ్లాక మాత్రమే, అశాస్త్రీయ పద్ధతుల్లో పత్రాలను ప్రచురిస్తున్న ముఠాల ఉనికిని తెలుసుకోగలిగారు.ఎంత డబ్బుకు అంత హోదా!శాస్త్ర పరిశోధన అనేది నిరంతర శ్రమతో కూడిన విషయం. అయితే, ఈ నేరపూరిత పగడ్బందీ నెట్‌వర్క్‌లు శ్రమ లేకుండా డబ్బు సంపాదించటం కోసం నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నాయి. ఈ పత్రాల్లో నిజాలు ఉండవు, వీటిలోని సమాచారానికి పొంతనలు కుదరవు. ఇదంతా కూడా మనీ లాండరింగ్లా సాగుతుంది. భారీ మొత్తంలో నిధులు చెల్లించే వారికి పరిశోధనతో సంబంధం లేకపోయినా ‘ప్రధాన రచయిత’ హోదాను కల్పిస్తారు. ఇచ్చే డబ్బును బట్టి రచయితల జాబితాలో నాలుగో స్థానం లేదా ఐదో స్థానం కేటాయిస్తారు. ఈ అశాస్త్రీయ పత్రాలపై ఎటువంటి సమీక్ష లేదా అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు, జర్నల్స్ యాజమాన్యాలకు కూడా భారీగా ముడుపులు అందిస్తున్నట్లు అమరల్ టీమ్ పసిగట్టింది.నివారించటం ఎలా?!ఈ వ్యవస్థీకృత ‘ఫేక్ రీసెర్చ్’ వైరస్‌ను అడ్డుకోవడానికి అమరల్, రిచర్డ్సన్ల బృందం అత్యంత కీలకమైన, ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తోంది. అవి: పరిశోధన పత్రాలపై సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలి. జర్నల్న్ పనితీరుపై నిరంతర నిఘా పెట్టాలి. ఎడిటర్లు అనుసరిస్తున్న సమీక్షా పద్ధతులు పారదర్శకంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. అనైతిక పద్ధతులకు పాల్పడే ఎడిటర్లను గుర్తించి, జర్నల్స్ విశ్వసనీయతను కాపాడాలి. అలాగే, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్ ఆధారంగా సరికొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయాలి. అబద్ధపు సమాచారాన్ని, మే«ధా చౌర్యాన్ని, కల్పిత డేటాను ప్రాథమిక దశలోనే గుర్తించగల సాంకేతికతను పబ్లిషింగ్ హౌస్‌లు తప్పనిసరిగా వాడాలి.ఏఐతో మరింత ముప్పు!శాస్త్ర పరిశోధనా రంగంలోప్రస్తుతం జరుగుతున్న ఈ మోసాలకు తోడు, ‘జనరేటివ్ ఏఐ’ ప్రవేశం కూడా పరిశోధనా రంగాన్ని మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని పరిశోధకుడు రిచర్డ్సన్ హెచ్చరించారు. అదెలా అంటే, ఏఐ సాయంతో అతి తక్కువ సమయంలో వేల సంఖ్యలో నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల వాస్తవ పరిశోధనలు ఈ కృత్రిమ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ పరిశోధనా పత్రాలలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఏఐ మోడల్స్ శిక్షణ పొందితే, అవి మరింత తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఈ పరిణామం వల్ల అంతిమంగా శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణికత దెబ్బతింటుంది. అబద్ధపు పునాదుల మీద నిర్మితమయ్యే మేధో సంపత్తి మానవాళికి ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘శాస్త్ర విజ్ఞానం మానవజాతి మనుగడకు అత్యంత కీలకం అని మనం విశ్వసిస్తే, దాని పవిత్రతను కాపాడటానికి ఈ అనైతిక శక్తులపై పోరాడక తప్పదు’’ అని అమరల్ తాజాగా పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో నైతికతను పునరుద్ధరించడమే నేటి తక్షణ కర్తవ్యం అని ఆయన అంటున్నారు. నిజమే. సత్యాన్వేషణే లక్ష్యంగా సాగే సైన్స్ రంగం, ఈ నకిలీ ప్రభావం నుండి బయటపడి తన పూర్వ వైభవాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక అగత్యం నేడు ఏర్పడింది!∙ సాక్షి స్పెషల్ డెస్క్మేధా దోపిడీకి పరాకాష్ఠనకిలీ పరిశోధనా రంగంలోని ముఠాలు అనుసరిస్తున్న వ్యూహాలు, మాయోపాయాలను ప్రొఫెసర్ అమరల్ బృందం శాస్త్రీయంగా విశ్లేషించింది. దాని ప్రకారం, ఈ నెట్‌వర్క్‌లు ఒకే పరిశోధనా పత్రాన్ని ఏకకాలంలో పలు జర్నల్స్‌లో వచ్చేలా చేసి, త్వరగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆ పత్రం నకిలీదని తేలి, తొలగింపునకు గురైనప్పటికీ అప్పటికే వారు పొందాల్సిన లబ్ధిని వారు పొంది ఉంటారు. అలాగే ప్రచురణ నిలిచిపోయిన పాత పత్రికల వెబ్సైట్ డొమైన్లను ఈ ముఠాలు కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు, బ్రిటన్‌కు చెందిన ‘హెచ్.ఐ.వి. నర్సింగ్’ జర్నల్ మూత పడగానే దానిని కొని, దాని పేరును వాడుకుంటూ నర్సింగ్ రంగానికి ఏమాత్రం సంబంధంలేని వేలాది అశాస్త్రీయ పత్రాలను వారు ప్రచురించారు. మేధా దోపిడీకి ఇది పరాకాష్ఠ. ఇవి కాక, రచయితలకు, జర్నల్ ఎడిటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ; పరిశోధనా పత్రాల ప్రచురణకు ‘ప్యాకేజీ’ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనా పత్రం తయారీ నుండి ప్రచురణ వరకు కొనసాగుతున్న ఈ పకడ్బందీ కుంభకోణంపై అమరల్ బృందం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్ర రంగంలో తగిన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో మేధో ప్రపంచం ఈ మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్నకిలీ పరిశోధనల వ్యవస్థ జాడలను ఛేదించేందుకు ప్రొఫెసర్ అమరల్ బృందం ఒక అధునాతన ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక విధానం ప్రధానంగా మెటీరియల్ సైన్సెస్, ఇంజినీరింగ్ రంగాల్లోని పరిశోధనా పత్రాలను నిశితంగా విశ్లేషిస్తుంది. చాలామంది నకిలీ పరిశోధకులు పరిశోధన కోసం తాము అత్యాధునిక పరికరాలను ఉపయోగించినట్లు పత్రాల్లో పేర్కొంటారు. అయితే, వారు పేర్కొన్న పరికరాల సామర్థ్యానికి, వారు చూపిన ఫలితాలకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధమూ ఉండదు. దానిని ఈ ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ సాఫ్ట్వేర్ తక్షణమే గుర్తిస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే, కేవలం ఊహాజనిత పరికరాల పేర్లతో పేపర్లు సృష్టించే వారిని ఈ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి, అడ్డుకుంటుంది. ఈ వినూత్న పరిష్కారాన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లాస్ వన్’ జర్నల్ ప్రశంసించింది. శాస్త్రీయ పరిశోధనల నాణ్యతను కాపాడటంలో కీలక ముందడుగుగా దీనిని అభివర్ణించింది. -
కస్టమ్స్ చెప్పుకునేందుకే
మీ చెప్పుకు స్ట్రిప్ ఉందా?.. ఇదేంటి.. మీ పేస్టులో ఉప్పుందా అని యాడ్ చూశాం కానీ చెప్పు స్ట్రిప్ గురించి అడుగుతున్నారేంటి? అనుకుంటున్నారా? అంతే కాదండోయ్.. మీరు వేసుకుంది చెప్పులా? శాండిల్సా? ఇవేం ప్రశ్నలని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇదే ప్రశ్న దేశ రాజధానిలో సుమారు 14 ఏళ్ల పాటు ఓ సంస్థను కార్యాలయాల చుట్టూ తిప్పింది. కోర్టు మెట్లు ఎక్కించింది. న్యాయపోరాటానికి కారణమైంది. చెప్పులు అని వేటిని అంటారు. శాండిల్స్‌కు ఉండాల్సిన అర్హత ఏంటనే దానిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఏవి చెప్పులో.. ఏవి శాండిల్సో చివరికి ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఓ పరిష్కారం లభించింది.చెన్నైకి చెందిన విశాల్ ఇంటర్నేషనల్ సంస్థ 2003 మే 15న మహిళల పాదరక్షలను విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ వాటిని ‘లేడీస్ లెదర్ శాండిల్స్’గా పేర్కొంటూ, ఆ కేటగిరీకి వర్తించే 10 శాతం డ్రా బ్యాక్ రాయితీని కోరింది. అయితే ఇవి శాండిల్స్ కాదు చెప్పులు అని కస్టమ్స్ శాఖ సుంకం రాయితీని ఐదు శాతానికి తగ్గించింది. దీంతో అవి ఏ కేటగిరీ కిందకు వస్తాయనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘చప్పల్’ నిర్వచనాన్ని సంస్థ అంగీకరించలేదు. దీంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇది దేశవ్యాప్తంగా ఎగుమతిదారుల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు సంస్థలు.. విభిన్న నివేదికలుఎగుమతి వస్తువు ఏ కేటగిరీ కిందికి వస్తుందనేది నిర్ధారించేందుకు పాదరక్షల నమూనాను న్యూఢిల్లీలోని లెదర్ ఎక్స్‌పోర్టు కౌన్సిల్‌కు విశాల్ సంస్థ పంపింది. ఆ కౌన్సిల్‌లోని సభ్యులు వాటిని పరిశీలించి అవి లెదర్ శాండిల్స్‌గా నిర్ధారించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీనిపై ఎస్ఐఐబీ ఆ నమూనాను కౌన్సిల్ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థకు(ఎఫ్‌డీడీఐ) పంపించింది. ఆ ఎగుమతి వస్తువులు ‘చెప్పుల’ కేటగిరీకి చెందినవిగా పేర్కొంది. ఈ కేటగిరీకి 10% సుంకం రాయితీ రాదని, 5% మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. సంస్థకు షోకాజ్ నోటీసు జారీలెదర్ ఎక్స్‌పోర్టు కౌన్సిల్ లేఖ ఆధారంగా కస్టమ్స్ శాఖ విశాల్ ఇంటర్నేషనల్ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేటగిరీని తప్పుగా నమోదు చేసి చెల్లించిన వ్యత్యాస డ్యూటీ డ్రా బ్యాక్ మొత్తం రూ. 1,30,800 నెలకు 15% వడ్డీతో కలిపి ఎందుకు తిరిగి వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం జరిమానా విధించే ప్రతిపాదన కూడా నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత విచారణకు కూడా అవకాశం కల్పించింది.జరిమానా విధింపుఎఫ్డీడీఐ నిర్ణయంతో ఏకీభవించడం లేదంటూ విశాల్ సంస్థ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చింది. అనంతరం డ్రా బ్యాక్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, అదనంగా రూ. 1.25 లక్షల జరిమానా చెల్లించాలని కస్టమ్స్ అదనపు కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై సంస్థ కస్టమ్స్ కలెక్టర్ (అప్పీల్స్) వద్ద అప్పీలు దాఖలు చేసింది. ఆ అప్పీల్‌ను తిరస్కరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రివిజన్ దరఖాస్తు సమర్పించింది. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ నైపుణ్యం కలిగిన సంస్థ కావున ఆ అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. జరిమానా మొత్తాన్ని రూ. 10,000కు తగ్గించింది. ఎన్నో ఏళ్లుగా వ్యాపారపరంగా ఆ పుట్‌వేర్‌ను ‘లెదర్ శాండల్స్’గానే వర్గీకరిస్తున్నారని విశాల్ సంస్థ పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్చివరకు సంస్థ 2013లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కస్టమ్స్ శాఖ వర్గీకరణ సరైంది కాదని, తాము ఎగుమతి చేసిన పుట్‌వేర్‌ను శాండిల్స్‌గా పరిగణించాలని, శాండిల్స్‌కు వర్తించే సుంకం రాయితీ వర్తింపజేయాలని, కస్టమ్స్ శాఖ ఆదేశాలను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. ఏది చప్పల్? ఏది శాండల్?వెనుక భాగంలో స్ట్రిప్ లేకపోతే అది శాండిల్ కాదు చప్పల్గానే పరిగణించాలన్న కస్టమ్స్ శాఖ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఒకే ఒక లక్షణం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. వ్యాపారులు, వినియోగదారులు ఒక ఉత్పత్తిని ఎలా పిలుస్తారో అదే ప్రామాణికమని పేర్కొంది. టెక్నికల్‌గా అధికారులు ఏ పేరు పెట్టినా మార్కెట్లో అది లేడీస్ లెదర్ శాండిల్స్గానే గుర్తింపు పొందిందనే అంశాన్ని గుర్తించాలని పేర్కొంది. కోర్టు తీర్పు ఇలా..లెదర్ ఫుట్‌వేర్ వర్గీకరణపై దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఢిల్లీ హైకోర్టు 2017లో ముగింపు పలికింది. కస్టమ్స్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎగుమతి చేసిన ఉత్పత్తిని చప్పల్స్’గా వర్గీకరించిన విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పుట్వేర్లో అనేక నమూనాలు ఉంటాయని, వాటన్నింటికీ ఒకే కొలమానం పెట్టలేమని స్పష్టం చేసింది. చెప్పులు, శాండిల్స్‌కు ఉన్న టెక్నికల్ తేడాలను పేర్కొంది. సంబంధిత శాఖ ఆదేశాల్ని కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది. సాధారణంగా చట్టంలో ఒక ఉత్పత్తికి స్పష్టమైన నిర్వచనం లేని సందర్భంలో ‘కమర్షియల్ పారాలెన్స్ టెస్ట్’ను కోర్టులు ప్రామాణికంగా భావిస్తాయి.. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం కాంపోజిషన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌ను కూడా చూడాలని న్యాయ స్థానాలు పలు కేసుల్లో స్పష్టం చేశాయి. ∙దిలీప్ మాదిరెడ్డి -
పిల్లల కథ: మృగరాజు పరివర్తన
అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. తోటి ప్రాణులను అది హీనంగా చూసేది. ఒకనాడు ఆ సింహం నీళ్లు తాగడానికి వాగు దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి అక్కడికి ఒక ఏనుగు వచ్చింది.సింహం ఏనుగును చూసి గర్జిస్తూ ఇలా అంది, ‘ఓయ్ ఏనుగు! ఈ రోజు పొట్ట నిండా అరటిపండ్లు తిన్నట్లు ఉన్నావు కదా?’ఏనుగు ప్రశాంతంగా, ‘అవును రాజా, నా ఆకలి తీర్చుకున్నాను’ అని బదులిచ్చింది.అప్పుడు సింహం అధికారాన్ని ప్రదర్శిస్తూ, ‘విను! రేపటి నుండి నువ్వు ఆహారం తినే ముందు రెండు గెలల అరటిపండ్లను నా గుహలో పెట్టాలి. ఆ తర్వాతే నువ్వు ముట్టాలి, అర్థమైందా?’ అని గర్జించింది.ఏనుగు ఏమాత్రం తడబడకుండా, ‘క్షమించు రాజా! నేను నీకు సేవకుడిని కాదు. నీ ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధంగా లేను’ అని చెప్పింది.సింహం కోపంతో కళ్లెర్రజేసింది. ఏనుగు భయపడకుండా, ‘నీవు అడవికి రాజువు మాత్రమే, యజమానివి కాదు అని గుర్తుంచుకో! నీ అంత శక్తి నాకూ ఉంది.’ అంది.ఏనుగు అలా సమాధానం చెప్పేసరికి, సింహం అవమానంతో వెనుదిరిగింది. దారిలో ఒక ఎలుగుబంటి తేనె తాగుతూ కనిపించింది.సింహం ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ‘ఒరేయ్ ఎలుగుబంటి! రేపటి నుండి నువ్వు సంపాదించే తేనెలో రెండు పెద్ద పట్టులు నా గుహలో సమర్పించాలి’ అని ఆజ్ఞాపించింది.ఎలుగుబంటి నవ్వుతూ, ‘రాజా! తేనెటీగలతో కుట్టించుకుని, ప్రాణాలకు తెగించి తెచ్చుకునే నా కష్టార్జితాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించింది.సింహం ఆశ్చర్యపోతూ ఉండగా, ఎలుగుబంటి మళ్ళీ ఇలా అంది: ‘కష్టపడి సంపాదించేది మేము, కూర్చుని తినేది నువ్వా? ఇది న్యాయం కాదు. నేను నీ సేవకుడిని కాను.’మరోసారి పరాభవం ఎదురవడంతో సింహం ముందుకు సాగింది. ఒక చెట్టు మీద మామిడి పండ్లు తింటున్న కోతి దానికి కనిపించింది.సింహం కోతిని చూసి, ‘ఓయ్ కోతి! రేపటి నుండి రెండు బుట్టల మామిడి పండ్లను నా గుహలో పెట్టాలి. నేను తిన్నాకే నువ్వు తినాలి’ అని çహూంకరించింది.కోతి కిచకిచ నవ్వుతూ, ‘రాజా! నీ గర్జనలకు భయపడే కాలం పోయింది. మేము గౌరవించేది నీ పదవిని మాత్రమే, నీ గర్వాన్ని కాదు’ అని చెప్పింది.కోతి ఇంకా ఇలా అంది: ‘మేము నిన్ను రాజుగా చూస్తున్నాము కాని, నీకు దాసోహం అనడం లేదు. కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని ఎవరికీ ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదు.’సింహం తన గుహకు వెళ్లి దీర్ఘంగా ఆలోచించసాగింది.‘ఏనుగు ధిక్కారం, ఎలుగుబంటి నిజాయితీ, కోతి చెప్పిన హితవు అన్నీ నిజమే కదా!’ అని మనసులో అనుకుంది.తన గర్వం వల్లే అందరూ తనను వ్యతిరేకిస్తున్నారని గ్రహించింది. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని దానికి అర్థమైంది.మరుసటి రోజు నుండి సింహం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అడవిలో ఏ ప్రాణి కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించడం మొదలుపెట్టింది.ఒక కుందేలును చూసి సింహం, ‘ఏమ్మా! బాగున్నావా? నీకు ఏమైనా సహాయం కావాలా?’ అని ప్రేమగా అడిగింది.సింహంలోని ఈ మార్పు చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. క్రమంగా అవి మళ్ళీ రాజు దగ్గరకు చేరడం ప్రారంభించాయి.ఏనుగు వచ్చి, ‘రాజా! నీలోని ఈ మార్పు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పొగిడింది.ఎలుగుబంటి కూడా వచ్చి, ‘నిజమైన రాజువంటే నువ్వే రాజా! ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాము’ అని అంది.అప్పటి నుండి సింహం ఎవరినీ ఆహారం అడగలేదు, ఎవరినీ తక్కువ చేసి చూడలేదు. అడవిలోని జీవులన్నీ సింహాన్ని నిజమైన మృగరాజుగా కీర్తించాయి.అల్పతోయశ్చలత్కుంభో అల్పదుగ్ధాశ్చ ధేనవఃఅల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితఃనీళ్లు తక్కువున్న కుండ తొణుకుతుంది. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలిస్తుంది. చదువు తక్కువున్న వాడికి గర్వం ఎక్కువగా ఉంటుంది. కురూపికి అతిచేష్టలు ఎక్కువగా ఉంటాయి. -
క్లూషియల్: మంటల్లో సాక్ష్యం
చీకటి మాటున నీడలా అంటి పెట్టుకున్న నేరం... విజయవాడ – హైదరాబాద్ హైవే అది... ఒక్కసారిగా అక్కడ కలకలం. మంటల్లో కారు కాలిపోతోంది. అర్ధరాత్రి దాటాక రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లగ్జరీ కారు సెగలు కక్కుతూ తగలబడిపోతోంది. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఫైరింజన్లు వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చాక లోపల సీటుకు కట్టేసినట్లుగా ఉన్న వ్యాపారవేత్త ఫణీంద్ర మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది.పోలీసులు దీన్ని ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేయబోయారు. కానీ ఫణీంద్ర భార్య సుమతి మాత్రం ఇది ప్రమాదం కాదని, తన భర్తను ఎవరో కావాలనే చంపారని క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది. కేసు ఇన్ స్పెక్టర్ అభిమన్యు చేతికి వచ్చింది. అభిమన్యు క్రైమ్ సీన్‌కు వచ్చాడు. కారు శకలాలను, ఫణీంద్ర పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు.ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని పరిశీలించాడు. దూరంగా ఒక పెట్రోల్ బంకు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అభిమన్యు ఫణీంద్ర భార్య సుమతిని విచారించాడు.‘కేసులో అనుమానాస్పద విషయాలు ఏమీ లేవు కదా? కేసు ఘోర అగ్ని ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేద్దామా?’ అభిమన్యుని అడిగాడు కమిషనర్.‘అన్నీ అనుమానాస్పద విషయాలే...’ తన చేతిలో వున్న పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూస్తూ అన్నాడు అభిమన్యు.‘ఏమిటవి?’ కమిషనర్ అడిగాడు.‘ఎవిడెన్ను ఫిజికల్‌గా తీసుకొస్తాను... మీరు హంతకుడిని అరెస్టు చేయడానికి రెడీగా ఉండండి సర్’ చెప్పి లేచాడు అభిమన్యు.‘నీపేరు?’ అతని వంకే చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు..‘రవీంద్ర... విజయవాడ బ్రాంచ్ మేనేజర్‌గా ఏడు నెలల క్రితమే వచ్చాను.’ అన్నాడు అతడు.‘అంతలోనే ప్రమోషన్ వచ్చిందా?’ అడిగాడు అభిమన్యు.‘ప్రమోషనా?’ ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర.‘హంతకుడిగా ప్రమోషన్...’‘నేను హంతకుడినా?’ కాస్త కోపంగా అన్నాడు రవీంద్ర.. ‘వెల్... చాలా తెలివిగా ప్లాన్ చేశావు... నిజం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోతే, నేను త్వరగా ఈ కేసు క్లోజ్ చేసి మరో కేసు టేకప్ చేయాలి.’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. ‘మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అయినా నేను విజయవాడలో ఉన్నా... నేను హత్య ఎలా చేస్తాను?’ దబాయించబోయాడు రవీంద్ర.‘విజయవాడ నుంచి నువ్వు కారులో బయలుదేరినట్టు సీసీ కెమెరాల సాక్ష్యం, టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ చెల్లింపుల రికార్డు వుంది. ప్రమాదం జరిగిన చోట పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వు తగలబడుతున్న కారు దగ్గర ఉన్న విజువల్స్ ఉన్నాయి.ఫణీంద్ర శ్వాసకోశాల్లో పొగ లేదు. సాధారణంగా ఎవరైనా మంటల్లో చిక్కుకుని చనిపోతే, వారు ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి కార్బన్ (పొగ) వెళ్తుంది. కానీ ఫణీంద్ర ఊపిరితిత్తులు శుభ్రంగా ఉన్నాయి. అంటే నిప్పు అంటుకోక ముందే అతను ప్రాణాలు విడిచాడు.అత్యాధునిక ఫోరెన్సిక్ స్కానింగ్‌లో ఫణీంద్ర గొంతు వద్ద ఎవరో బలంగా నొక్కిన ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఫణీంద్ర కారు డోర్ మీద ఉన్న వేలిముద్రలు ఫణీంద్ర గొంతు మీద ఉన్న వేలిముద్రలతో సరిపోయాయి.ఇది ప్రమాదం కాదు... పక్కా ప్లా¯Œ తో జరిగిన హత్య. ఫణీంద్రను మొదట గొంతు నొక్కి చంపి, ఆపై కారులో వేసి నిప్పు పెట్టావు. విజయవాడ బ్రాంచ్ ఆఫీసులో కోట్లలో గోల్మాల్ జరిగినట్లు ఫణింద్ర భార్య సుమతి ద్వారా తెలిసింది. ఆడిటింగ్ కోసం విజయవాడ వచ్చిన ఫణీంద్రకు నువ్వు చేస్తున్న మోసాలు తెలిశాయి. ఈ విషయం బయటపడితే ప్రమాదం అని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డావు...’ అభిమన్యు ఆధారాలతో సహా చెప్పాడు.రవీంద్రకు మరో ఆప్షన్ లేదు. పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు.మూడు గంటల్లో కేసును సాల్వ్ చేశాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. రచయిత శ్రీ సుధామయి -
బిహైండ్ ది బార్స్
ఆ కుర్రాడు లోపలకి వెళ్తూ బిల్డింగ్ బయట ‘సెంట్రల్ ప్రిజన్, సౌత్‌ని’ అని రాసుండటం గమనించాడు. వార్డెన్ ఆ కుర్రాడిని ఎగాదిగా చూసి అడిగాడు.‘‘పేరు?’’అతను చెప్పాడు.‘‘వయసు?’’‘‘పదహారు.’’పక్కనే ఉన్న జైల్ గార్డ్ అతని చెంప మీద కొట్టి అరిచాడు.‘‘సర్... ప్రతి జవాబుకి సర్ అనాలి.’’‘‘నీ జేబులు ఖాళీ చెయ్యి. వెళ్ళేప్పుడు తీసుకువెళ్ళు.’’ వార్డెన్ శాసించాడు.‘‘ఎస్ సర్.’’ఆ పని అయ్యాక గార్డ్ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘బట్టలు విప్పు.’’‘‘దేనికి?’’ ఆ యువకుడు అదిరిపడి అడిగాడు.‘‘నువ్వు రహస్యంగా లోపలికి ఆయుధాలు, డ్రగ్స్ తీసుకెళ్ళడం లేదని తెలుసుకోడానికి.’’అతను అంతదాకా ఎవరి ముందూ నగ్నంగా నిలబడలేదు. గ్లవ్స్ తొడుక్కున్న చేతి వేళ్ళతో గార్డ్ అతని శరీరంలోని రహస్య ప్రదేశాలని వెదుకుతూంటే, అతను శాడిస్ట్ అని ఆ కుర్రాడు గ్రహించాడు. డాక్టర్ అతన్ని పరీక్షించాక గార్డ్ ప్రిజన్ యూనిఫాం ఇచ్చి చెప్పాడు.‘‘ఇవి తొడుక్కుని పద. ఇక నీ పేరుని మర్చిపోవచ్చు... నీ ఖైదీ నెంబర్ 237.’’గార్డ్ అతన్ని ఓ పెద్ద గదిలో నీళ్ళ టబ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘ఇవాళ నీ డ్యూటీ ఇక్కడ. ఇవన్నీ ఖైదీలవి. వీటిని ఉతుకు.’’‘‘ఛీ! అండర్వేర్లు. ఈ పని నేను చేయను.’’ అతను రోషంగా చెప్పాడు.వెంటనే గార్డ్ ఓ తాడుతో అతని వీపు మీద కొట్టాడు. ఆ యువకుడు కేక పెట్టాడు.‘‘ఆజ్ఞలని పాటించకపోతే ఇంతే. ఇది ఏభై పోగుల తాడు. వంద, నూట ఏభై, రెండు వందల పోగుల తాడుని ఉపయోగిస్తే నువ్వు తట్టుకోలేవు. ఒంటి మీద గాయాలు కూడా కనిపించవు. నేను వచ్చేసరికి పని పూర్తిచేయాలి.’’ఆ యువకుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సబ్బునీళ్ళతో ఆ మురికి బట్టలని ఉతకసాగాడు. కాసేపటికి జైల్ గార్డ్ వచ్చి పక్క గదిలోకి తీసుకెళ్ళి ఖైదీలు తిన్న ప్లేట్లని చూపించి చెప్పాడు.‘‘వీటన్నిటిని తోమి శుభ్రం చేయి.’’‘‘ఛీ.’’‘‘అప్పుడే? దీని తర్వాత టాయ్లెట్లు కడగాలి.’’ గార్డ్ నవ్వుతూ చెప్పాడు.‘‘ఇలాంటి పనులు నేను ఎన్నడూ చేయలేదు.’’ ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు.‘‘నేరస్థుడు కాకముందు సంగతి అది. నేరస్థుడు అయాక అన్ని పనులూ చేయాలి.’’టాయ్‌లెట్స్‌లోని నీళ్ళల్లోంచి దోమలు ఒక్కసారిగా పైకి లేచాయి. నీళ్ళల్లో దోమల గుడ్లు, పురుగులు చాలా ఉన్నాయి.లంచ్ బెల్ మోగింది. మెస్‌లో క్యూలో నిలబడ్డ ఖైదీలు ఒకరిని మరొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్నారు. చాలామంది అతన్ని వెనక్కి తోసేశారు. అతని ప్లేట్లో రెండు గోధుమ రొట్టెలు, పెసరపప్పు, కప్పు అన్నం, నీళ్ళ సాంబారు, రెండు చిన్న మాంసం ్రౖఫై ముక్కలు వేశారు. అతను ఓ బల్ల ముందు కూర్చుంటే, అక్కడి ఖైదీ స్పూ¯Œ తో ఆ యువకుడి చేతి మీద కొట్టి అరిచాడు.‘‘వెళ్ళు. అడిగి కూర్చోవాలని తెలీదా?’’ఆ యువకుడు లేచి మరో బల్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఇక్కడ కూర్చోవచ్చా?’’ఎవరూ అనుమతించలేదు. ఓ వ్యక్తి లేచి అతని ప్లేట్లోని రెండు మాంసం ముక్కలు తీసుకున్నాడు. మరొకరు రోటీ లాక్కున్నారు. సింటెక్స్ టేంక్లోని తాగే నీళ్ళు చెడు వాసన వేస్తున్నాయి. దాని పక్కన సగం కోసిన వాటర్ బాటిల్స్‌ని కప్పులుగా వాడుతున్నారు.‘‘కొత్తా? ఇక్కడ బలహీనులు బలవంతుడి రక్షణలో ఉండాలి. లేకపోతే ఏమీ దక్కదు. అందుకు అతనికి కొంత సొమ్ము ఇవ్వాలి. ఉదయం ఐదున్నరకి టాయ్లెట్ల ముందు క్యూలో చోటు కావాలన్నా, స్నానానికి నీళ్ళు, తినడానికి రోటీ కావాలన్నా బలవంతుడు మనకి రక్షణగా ఉండాలి.’’ ఒకరు అతన్ని చూసి చెప్పారు.వెయ్యి చదరపు అడుగుల బేరక్స్‌లో నూట అరవైమంది ఖైదీలు ఉన్నారు. ఇందాకటి అతను ఆ యువకుడితో చెప్పాడు.‘‘రాత్రుళ్ళు ఇక్కడ జరిగేవి మాటల్లో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు నెలకి ఒక్కసారే ములాఖాత్‌కి వస్తారు. కేవలం పదిహేను నిమిషాలే. ఇనప కడ్డీల వెనక ఉన్న నిన్ను చూసి వాళ్ళు తప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఏభై కిలోల గార్డ్, నూటపాతిక కిలోలున్న ఖైదీని కొడతాడు. నా చెవి మీద కొడితే గూబ పగిలి చెవుడు వచ్చింది. దాన్ని టెలిఫోనీ దెబ్బ అంటారు. ఇంకోచోట కొడితే ఆ బాధ భరించలేవు. మానసికంగా బలహీనులైన ఖైదీలు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారు.’’ఎనిమిది గంటల తర్వాత ఆ యువకుడు సెంట్రల్ ప్రిజన్లోంచి బయటికి వచ్చి, ఆగి ఉన్న కారుని ఎక్కాడు. ఏడుస్తున్న ఆ యువకుడితో కారు నడుపుతున్న తండ్రి చెప్పాడు.‘‘చూశావుగా. నీ ఫ్రెండ్ తాగి కారు నడిపి ఇద్దర్ని చంపినప్పుడు నువ్వా కారులోనే ఉన్నావు. రేపు నువ్వేదైనా తప్పు చేస్తే ఐఏఎస్ ఆఫీసరైన నేను కాపాడగలను. కాని కాపాడను. అది నా స్వభావం కాదు. నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు.’’ఆ యువకుడు వెళ్ళాక వార్డెన్ గార్డ్‌తో చెప్పాడు.‘‘ఇండియాలో చాలామంది తమ కొడుకులని ఇలా జైలు విజిట్‌కి పంపడం దేశానికి ఎంతో మంచిది.’’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఈ వారం కథ: మూడు సమయాలు
జనవరి 10, 2026 – శనివారం ఉదయం 9:30 చలికాలం. చల్లని గాలి. పొగమంచు. రైలు దిగి అరవింద్ బ్యాగ్‌ను భుజాన వేసుకుని ఇంటివైపు నడిచాడు. జాకెట్ జిప్ పైకి లాగి, చేతులను జేబుల్లోకి దూర్చుకున్నాడు. దూరంగా టీ బండి నుంచి వచ్చే వేడి టీ వాసన గాలిలో కలిసింది. సూర్యుడికీ చలిగా ఉందేమో– మబ్బుల వెనుక దోబూచులాడుతున్నాడు. ఇంటి ముందు ఆగాడు. తలుపు తట్టబోయేలోపే– తాళం బయట వేలాడుతుండటం కనిపించింది.జేబులు వెతికాడు. రెండో తాళం చెవి ఇంట్లోనే వదిలేశాడని గుర్తొచ్చింది. చిరాకుతో వెంటనే కమలకు ఫోన్ చేశాడు. అమ్మకు ఒళ్లు బాగాలేదని తెలిసి ఉదయమే బస్సెక్కి వెళ్లానంది. ‘‘రెండో తాళం చెవి ఉందిగా,’’ అంది. ‘‘అది ఇంట్లోనే ఉంది,’’ అన్నాడు కాస్త గట్టిగా. ఆమె సారీ చెప్పింది. తొందరలో ఆలోచించలేకపోయానంది.ఉసూరుమన్నాడు. తలుపు బయటే నిలబడ్డాడు. చిరాకును దిగమింగి, ‘అత్తగారికి ఎలా ఉంద’ని అడిగాడు.‘‘ఇప్పుడు కాస్త బాగుంది. డాక్టర్ చూశాడు. బ్లడ్ ప్రెషర్ పెరిగింది. రెస్ట్ తీసుకోవాలన్నాడు.’’‘‘ఎప్పుడొస్తావు?’’‘‘రెండు రోజులు ఇక్కడే ఉండాలనుకున్నా. మీకు ఇబ్బంది కదా? మెల్లగా బయలుదేరతా. సాయంత్రం ఏడు లేదా ఎనిమిది అవుతుందేమో.’’ ఫోన్ కట్ అయింది.ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి. బయట ఉండాల్సిన నిర్బంధం. ఆ రెండింటి మధ్య నిలబడ్డట్టయ్యాడు.టీ బండి దగ్గరకు వెళ్ళాడు. వేడి టీ గొంతులోకి దిగుతుండగా కాస్త హుషారు వచ్చింది. ఫోన్ తీసి ఫేస్బుక్ తెరిచాడు. స్క్రోల్ చేశాడు. పాత స్నేహితుడు కుటుంబంతో దుబాయ్ ట్రిప్. ఇంకొకరు కొత్త కారులో. ఒక ఫొటో మీద కాసేపు ఆగి, మళ్లీ ముందుకు.కమల పంపిన ‘క్షేమంగా చేరాను’ అనే సందేశం కనిపించింది. స్క్రీన్ వెలుతురు అతని ముఖంపై పడి మళ్లీ ఆరిపోయింది.పొద్దున్నే అలారం ఆపి స్క్రోల్ చేయటం. క్యాబ్‌లో షార్ట్స్. ఆఫీస్ మీటింగ్‌లు. టార్గెట్లు. ఈ మెయిళ్ళు. అటూ ఇటూ పరుగులు. ఒకటే ఒత్తిడి. మధ్యాహ్నం జొమాటో. రాత్రి నెట్‌ఫ్లిక్స్. వారాంతాల్లో అప్పుడప్పుడు సాటి ఉద్యోగులతో విందులు. బయటికి చూస్తే నిండిన జీవితం. లోపల మాత్రం నెమ్మదిగా పెరుగుతున్న ఖాళీ. నిజమైన సంభాషణలా? లోతైన మాటలా? ఏమున్నాయి?సోషల్ మీడియా కనెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది– నిజానికి మరింత దూరం చేస్తుంది.సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లదామని కమల ఎన్నిసార్లు అడిగిందో గుర్తొచ్చింది. ప్రతిసారి ‘‘బిజీగా ఉన్నా’’ లేదా ‘‘అలసటగా ఉంది’’ అనే సమాధానమే. రోజులు నిండిపోతున్నట్టే కనిపించాయి. కానీ ఏదో ముఖ్యమైనది ఎప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది.ఇప్పుడు ఈ శనివారం ఉదయం అతని ముందుంది– మబ్బుల ఆకాశం. మూసిన తలుపు. చేతిలో టీ కప్పు. ఇప్పుడు ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళితే? ఈ సమయంలో ఎవరి పనుల్లో వాళ్ళుంటారు.మొదటిసారి ఆ సమయం నిజంగానే ఖాళీగా అనిపించింది. దేనితో నింపాలి?జనవరి 10, 2026 శనివారం ఉదయం గం. 10:00ఏమీ తోచక, ఏం చేయాలో తెలియక అరవింద్ దారినపడి నడుస్తున్నాడు. ఇరవై నిమిషాలు గడిచేసరికి వెనక నుంచి చిన్న అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి కిరణ్. మేనల్లుడు.పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మామయ్యా!’’ అంటూ కాళ్లకు చుట్టుకున్నాడు. చిన్న చేతులతో గట్టిగా పట్టుకుని ముఖం పైకెత్తి చూశాడు– కళ్లలో ఆనందం, ఆశ్చర్యం కలిసి మెరిశాయి.అరవింద్ అలాగే నిలబడిపోయాడు. వాడి ముఖంలో తన చిన్ననాటి ప్రతిబింబం కనిపించినట్టైంది.అటూ ఇటూ చూశాడు. ఎవరి దారిని వాళ్లే. కాస్త దూరంలో పిన్ని ఇల్లు. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. పాత అపార్థాలు, ఆస్తి విషయాలు, తండ్రి మాటలు– అన్నీ మనస్సులోకి దూరాయి.కిరణ్ అతని చేయి పట్టుకుని, ‘‘మామయ్యా, ఇంటికి రా!’’ అంటూ లాగాడు.అరవింద్ ఆగిపోయాడు. ఇన్నేళ్లకి వాళ్లింటికి వెళ్లటం? పిన్ని ఏమంటుంది? చెల్లెలు ప్రియఏమనుకుంటుంది?‘‘కిరణ్, ఇప్పుడు రాలేనులే తర్వాత వస్తా,’’ అన్నాడు మెల్లగా. గొంతు వణికింది.‘‘మళ్లీ కనపడవు నువ్వు. ఇప్పుడే రావాలి,’’ అంటూ మళ్లీ చేయి లాగాడు.ఆ చూపును కాదనలేక– ఒక్క క్షణం తడబడినా– ‘‘సరే, పద,’’ అన్నాడు. ఇద్దరూ కలిసి ఇంటి వైపు నడిచారు.ఇంటి గేటు దగ్గరకు రాగానే పిన్ని బయటికి వచ్చింది. ‘‘ఎక్కడికి పోయావ్ రా?’’ అని కిరణ్‌ను అడిగి, వెంటనే అరవింద్ వైపు చూసి ఆగిపోయింది. ‘‘అరవింద్... నువ్వు!’’అరవింద్ తడబడ్డాడు. ‘‘ఈ దారిని వెళ్తుంటే కిరణ్...’’ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకో మాటలు చిన్నవిగా, తాను చిన్నవాడిలా అనిపించాడు.పిన్ని తనను తానే సర్దుకుని, ‘‘లోపలికి రా,’’ అంది.హాల్లో నుంచి ప్రియ వచ్చింది. నవ్వుతూ, నవ్వుతూనే కొంచెం నిష్టూరంగా– ‘‘అన్నాయ్! ఇన్నాళ్లకి దారితప్పి వచ్చావన్నమాట,’’ అంది. ఆ మాటలో తప్పుపట్టటం లేదు– మళ్లీ దొరికిన ఆనందమే ఉంది.‘‘రాక రాక వస్తే అవేం మాటలే,’’ అంటూ పిన్ని వారించింది.లోపల అడుగుపెట్టగానే అదే పాత కలప వాసన, అగరువత్తి ధూపం, వంటింటి నుంచి తాలింపు. ఇల్లు మారలేదు; తానే మారిపోయాడన్న భావన కలిగింది.పదవ తరగతి రోజుల్లో పిన్ని డబ్బు కోసం వచ్చిన జ్ఞాపకం మెదిలింది. అప్పటికే బాబాయి చనిపోయాడు. తండ్రి సాయం చేయలేదు. అప్పటి నుంచే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. భర్తను కోల్పోయినా తమను పట్టించుకోలేదన్న బాధ పిన్నిది. ఒంటరిగానే ఉండి ప్రియను చదివించింది. పెళ్లి ఖర్చుల కోసం తమ వాటా పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తి పేచీలు, మాటల తగాదాలు– బంధాల మధ్య మౌనంగా పెరిగిన గోడలు. నాలుగేళ్లుగా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.కమల మాటలు గుర్తొచ్చాయి– ‘‘దూరాలు నిజంగా దూరాలు కావు. వెళ్లిరండి.’’కానీ అపార్థాలు అంత తేలిగ్గా కరుగుతాయా? తండ్రి ఏమనుకుంటాడోనన్న భయం ఎప్పుడూ ఆపేసింది. ఈ క్షణంలో మాత్రం ఆ పాత గాయాలన్నీ మెల్లగా మాసిపోతున్నట్టు అనిపించింది.ఇంటి ముందు జామచెట్టు అలాగే ఉంది. వయసు పెరిగినా కొమ్మల్లో ఇంకా పాత రోజుల నీడ. ఆ కొమ్మల మీదెక్కి దోరగాయలు కోసుకుని ఉప్పు, కారం రాసుకుని తిన్న రోజులు కళ్లముందు కదిలాయి. ‘‘పడిపోతావురా!’’ అంటూ పిన్ని వేసిన కేకలు వినిపించినట్టయ్యాయి. తనకు మగపిల్లలు లేరు; అరవింద్‌ను కొడుకులా చూసేది.పిన్ని కాఫీ తెచ్చింది. ‘‘నీకు ఇష్టమైనట్టు పంచదార ఎక్కువేశా,’’ అంది. అదే జ్ఞాపకం. అదే ప్రేమ.గోడల మీద పాత ఫోటోలు. జామచెట్టు మీద కూర్చుని నవ్వుతున్న చిన్న అరవింద్. పక్కనే రెండు జడలతో ప్రియ. ‘‘రోజంతా చెట్టుమీదే ఉండేవాడివి,’’ అంది పిన్ని.కిరణ్ తన స్కూల్ డ్రాయింగ్ చూపించాడు. ప్రియ పెళ్లి ఫొటోలు తీసుకొచ్చి చూపించింది. కబుర్లు, చిన్న నవ్వులు, మధ్య మధ్యలో మౌన విరామాలు. ఆపై భోజనం.చివరికి పిన్ని ఒక చిన్న డబ్బా తెచ్చింది. ‘‘అరిసెలు. నీకిష్టం గదా?’’ఇప్పటికీ తనమీద ఆ ప్రేమ అలాగే ఉందని అర్థమైంది.‘‘కమలని అడిగానని చెప్పు. అప్పుడప్పుడు రావాలి,’’ అంది పిన్ని.‘‘తప్పకుండా వస్తాను పిన్నీ,’’ అన్నాడు.‘‘వస్తాను కాదు– వస్తాము,’’ అంది ప్రియ మెల్లగా.అరవింద్ నవ్వాడు, తల ఊపుతూ. ‘మమ్మల్ని కూడా మీ ఇంటికి పిలవాలి మరి,’’ అంది మళ్ళీ.ప్రియ నెత్తిమీద చిన్న మొట్టికాయ వేసి, కిరణ్‌ను ముద్దు పెట్టుకున్నాడు. గుండెల్లో ఒక మృదువైన వెచ్చదనం నిండింది– పసితనం మళ్లీ తాకినట్టు.ఆ రోజు నడిచిన దారి అతన్ని ఇంటికి కాదు– తన బాల్యానికి తీసుకెళ్లింది. మౌన విభేదాలు పోయి, మనస్సులో గడ్డలా గట్టిపడ్డదేదో నెమ్మదిగా కరుగుతున్నట్టు అనిపించింది.ఉదయం మూసుకుపోయిన తలుపు– ఇక్కడ సులభంగా తెరుచుకుంది.జనవరి 10, 2026 శనివారం మధ్యాహ్నం గం. 03:30 చలిగాలి తగ్గింది. మే–ఫ్లవర్ అపార్ట్మెంట్ గేట్ ముందు అరవింద్ నిలబడ్డాడు. బయట చలి తగ్గినట్టే అనిపించినా, అతని గుండెల్లోని చలి మాత్రం అలాగే ఉంది. లోపలికి అడుగుపెట్టాలా లేక ఇక్కడితో తిరిగి వెళ్లిపోవాలా? నిర్ణయం తీసుకునేలోపే ఆమె ముఖం, చిరునవ్వు, మాటలు– అన్నీ ఒకేసారి మనస్సులోకి దూసుకొచ్చాయి.‘‘ప్రాక్టికల్‌గా ఆలోచించు.’’కాలేజీ రోజుల్లో తన హృదయాన్ని తాకి, చివరికి దూరమైన రజని మాటలు.‘‘అరవింద్! నిన్ను ప్రేమించానన్నది నిజం. కానీ ఇద్దరికీ ఉద్యోగం లేకుండా జీవితం ఎలా? కొన్నాళ్లు చూద్దాం,’’ అన్నది. ఆ ‘కొన్నాళ్లు’ ఎన్నాళ్లకీ ముగియలేదు. ముగిసేసరికి ఆమె ఒక ఉన్నతోద్యోగిని పెళ్లాడింది. పెళ్లికి పిలిచినా అతను వెళ్లలేదు. ఆమె తిరస్కారం అతనిలో లోతైన గాయంగా మిగిలింది.ఆ తర్వాత ఆమె సంతోషంగా ఉందని విని, నిర్వేదం కలిగింది. క్రమంగా మర్చిపోయాడు. లేక మర్చిపోయాననుకున్నాడు. కానీ ఈమధ్య ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని విన్న క్షణంలో పాత జ్ఞాపకాలు మళ్లీ మేల్కొన్నాయి. బాధ కలిగినా, ఎందుకో వెంటనే వెళ్లి పరామర్శించాలనిపించలేదు. నెమ్మదిగా ఆలోచిస్తే, ఆనాటి ఆమె నిర్ణయంలో తప్పేమీ లేదనిపించింది. తనలోని ఇరుకు తనకే అర్థమైంది.ఇప్పుడు ఆమె బాధలో ఉంది. తాను పలకరిస్తే? లేక ఇది పాత గాయాలను మళ్లీ రేపటమేనా?ఒక్కసారి కళ్లు మూసుకున్నాడు. ఫోన్ జేబులో పెట్టి లోపలికి నడిచాడు. లాబీలో వెచ్చదనం. లిఫ్ట్ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు– పాలిపోయినట్టుంది. ఫ్లాట్ ముందు నిలబడి, ఒక్క క్షణం వెనక్కి తిరగాలనిపించినా, చెయ్యెత్తి తట్టాడు.తలుపు తెరిచింది రజని. కళ్లు ఎర్రగా, వాపుగా. సాదా చీర, అస్తవ్యస్తంగా జుట్టు. ముప్పై రెండేళ్ల వయసే అయినా, విషాదం ఆమెను మరింత పెద్దదిగా చూపిస్తోంది.‘‘అరవింద్! నువ్వా?’’ ఆ గొంతులో ఆశ్చర్యం, ఆనందం, బాధ– అన్నీ కలిసి ఉన్నాయి.‘‘ఇబ్బంది లేకపోతే కాసేపు మాట్లాడదామని,’’ అన్నాడు.ఆమె తప్పుకొని లోపలికి పిలిచింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. కాసేపు మౌనం.‘‘ఏదో సంకోచంతో ఇప్పటిదాకా రాలేకపోయాను. ఐ యామ్ సారీ.’’హాల్లో మసక చీకటి. గోడలపై ఆమె భర్తతో ఉన్న సంతోషకరమైన ఫోటోలు– ఇప్పుడు అవి మరింత నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.‘‘ఫర్వాలేదు. ఇప్పుడైనా వచ్చావు. అదే చాలు,’’ అంది.అతను నెమ్మదిగా అడిగాడు– ‘‘ఎలా జరిగింది?’’కొత్త ప్రాజెక్ట్... తీరికలేని రోజులు. డ్రైవర్ సెలవు... కారు చెట్టుకు గుద్దుకోవడంం ఒక్క నిమిషంలో అంతా ముగిసిపోయింది. వీకెండ్ ట్రిప్స్, రాత్రి కబుర్లు, తన కెరీర్‌కి ఇచ్చిన ప్రోత్సాహం– అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి.‘‘ఇప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టదు,’’ అంది.‘‘అమ్మా నాన్నా? పాప?’’‘‘వాళ్లు మొన్నటిదాకా ఉండి వెళ్లారు. పాప హాస్టల్లో ఉంది.’’ఆమె గొంతులో విషాదం గడ్డకట్టింది.‘‘అప్పుడు నేనే దూరంగా జరిగాను. ఇప్పుడు నువ్వే అభిమానంగా వచ్చావు,’’ అంది నెమ్మదిగా.‘‘అవేవీ పట్టించుకోకూడదనిపించింది.’’ అన్నాడు.‘‘సుఖాల్లో అందరూ ఉంటారు. దుఃఖాన్ని పంచుకునేవాళ్లు అరుదు.’’ఆమె కళ్ళు తడిశాయి. అరవింద్ మాట్లాడలేదు. ఓదార్పుగా ఆమె చేతిని తాకాడు. ఆమె అడిగితే, తన జీవితాన్ని చెప్పాడు– ఒక్కడే పిల్లాడు. వేరే ఊరిలో కాలేజీ చదువు.కాసేపు కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు– ఒకరి పక్కన ఒకరు, హద్దు మీరకుండా కూర్చున్న రోజులు. ఎన్నో కలలు గన్న రోజులు. ఇప్పుడు అవి మాటల్లో మాత్రమే మిగిలాయి.‘‘ఆ రోజులు నీకింకా గుర్తున్నాయి,’’ అంది రజని. అవునన్నట్టు తల ఊపాడు.‘‘గతాన్ని దాటి చాలా దూరం వచ్చేశాం రజనీ. మన దారులు వేరయ్యాయి. అయినా పరాయివాళ్లుగా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. ఏ సాయం కావాలన్నా కాల్ చెయ్యి. వస్తాను,’’ అన్నాడు.లేచి నిలబడ్డాడు.రజని కళ్లలో కృతజ్ఞత, ఆప్యాయత. భర్త జ్ఞాపకం ఒక వైపు గుండెను బరువెక్కిస్తుంటే, అరవింద్ రాక మరోవైపు ఓదార్పులా తాకింది‘‘ఇవాళ కాస్త ఉపశమనం కలిగింది. నువ్వు వచ్చినందుకు చాలా థాంక్స్,’’ అని అతని చెయ్యి పట్టుకుంది.అరవింద్ ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కాడు.బయటికి వచ్చేసరికి, అతని మనసులో ఓ మౌన తృప్తి అలముకుంది. గుండెల్లోని చలి కొద్దిగా తగ్గినట్టనిపించింది.జనవరి 10, 2026 – శనివారం సాయంత్రం 5:30సూర్యుడు కొంచెం వాలిపోయాడు. ఆకాశం నారింజ కాంతిలో మసకబారుతోంది. చలిగాలి మళ్లీ తాకింది. ఇంకా మూడు గంటల సమయం.అదే క్షణంలో– ఆ రోజు కళాభవ లో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణు వాద్య కచేరీ ఉందని గుర్తొచ్చింది. ఆటోలో అరగంట ప్రయాణం. ఆలోచన ఆగింది. నిర్ణయం తీసుకున్నట్టయ్యింది. కొద్దిసేపటికి కిక్కిరిసిన కళాభవన్ హాల్లో, చివరి వరుసలో కూర్చున్నాడు.లోపల అడుగుపెట్టగానే బయట ప్రపంచం తలుపు మూసుకున్నట్టైంది. దీపాలు మసకబారాయి. ప్రేక్షకులు నిశ్శబ్దంగా– శ్వాసలు కూడా వినిపించని నిశ్శబ్దం. వేదికపై పండిత్‌జీ చేతిలో వెదురు వేణువు; కళ్లు అరమూసి, ముఖంలో ధ్యాన గంభీరత.ఆలాప్ ప్రారంభమైంది.మృదువైన, లోతైన స్వరాలు గాలిలో తేలుతున్నాయి. కోమల గాంధారం నుంచి శుద్ధ మధ్యమానికి సాగిన ఆ స్వర సంచారం అరవింద్ గుండెల్లో ఏదో కదిలించింది. తర్వాత కోమల దైవతం, కోమల నిషాదం– ప్రతి స్వరం నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తూ హృదయాన్ని తాకింది. మాల్కౌంస్ రాత్రి జనించిన రాగం. దాని గాంభీర్యం, అంతర్గత శక్తి, తీవ్రమైన శాంతి– వేణువులో నిండుగా పలికాయి. పండిత్ జీ శ్వాసల లోతు ప్రతి స్వరంలో వినిపించింది.ఆ తర్వాత జోడ్ (లయ ప్రారంభ దశ) మొదలైంది. వేణువు క్రమంగా వేగం అందుకుంది– కానీ ఆ వేగంలోనూ సౌమ్యత, నియంత్రణ స్పష్టంగా కనిపించాయి. తబలా లయతో కలిసిన క్షణం నుంచి అది సంగీతం మాత్రమే కాదు– ఒక అనుభూతి. అరవింద్ గుండెల్లోని భారం కరిగిపోతున్నట్టనిపించింది.ఝాలా (ఉత్కర్ష దశ) వచ్చేసరికి స్వరాలు వరదలా ప్రవహించాయి. కానీ ఆ ప్రవాహంలోనూ ఒక స్థిరత్వం ఉంది. వేణువు– మానవ శ్వాసతో ముడిపడిన వాద్యం– గాలి కదలికను, ప్రకృతి లయను హృదయస్పర్శిగా పలికించింది. ప్రతి మీండ్ (స్వర సంధి) గాంధారం నుంచి మధ్యమానికి, ధైవతం నుంచి నిషాదానికి సాగినప్పుడు, అతని అంతరంగంలో దాచుకున్న భావాలు మెల్లగా విప్పుతున్నట్టనిపించింది. అరవింద్ కళ్లు మూసుకున్నాడు. బయటి ప్రపంచం కరిగిపోయింది. స్వరాల్లో మునిగిపోయి, ఆ గాఢమైన శాంతిలో తానే తాను కలిసిపోయాడు.చప్పట్ల హోరుతో కచేరీ ముగిసింది.హాల్ బయటికి రాగానే ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చలిగాలి మృదువుగా వీచుతోంది. అతని చెవుల్లో మాత్రం ఇంకా వేణు స్వరాలు తేలుతూనే ఉన్నాయి. వేణువు మానవ శ్వాసతో జీవించే వాద్యం. అందుకే దాని స్వరాల్లో భావాలే కాదు– గాలి అలజడి, నదుల కెరటాల మర్మరం, పక్షుల కిలకిలలు– ప్రకృతంతా మృదువుగా ప్రతిధ్వనిస్తుంది.‘‘వేణువే అంత/ ఆనందమై వేధిస్తుంది’’ అన్న కవి మాట ఆ క్షణంలో అరవింద్‌కు సంపూర్ణ సత్యంలా అనిపించింది.జనవరి 10, 2026 – శనివారం రాత్రి 8:30చలిగాలిలో అరవింద్ ఇంటికి చేరేసరికి కమల వంట ముగించేసింది. వంటింటి నుంచి వచ్చే వేడి వాసనతో పాటు ఆమె ఒంటి అలసట కూడా తెలుస్తుంది.‘‘అమ్మయ్య వచ్చావా? అమ్మ ఎలా ఉంది ఇప్పుడు?’’ అని అడిగాడు.కమల ఒక్క నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పులో అలసటతో పాటు ఓ శాంతి కూడా మిళితమై ఉంది.‘‘ఫర్వాలేదు. అవసరమైతే మళ్లీ వెళ్లొచ్చులే– ఈసారి రెండో తాళం చెవి గుర్తు పెట్టుకో,’’ అంది చిలిపిగా. వెంటనే నవ్వుతూ, ‘‘రోజంతా ఒంటరిగా ఏం చేశావు? కొంపదీసి బార్కి వెళ్లావేమిటి?’’ అని అడిగింది.‘‘కొంప దీయలేదు,’’ అన్నాడు అరవింద్ మెల్లగా. ఆ నవ్వులోనే సమాధానం ఉంది. కమలకు తెలుసు– అతనికా అలవాటు లేదని. ఆ రోజు జరిగినదంతా అతని మాటల్లోకి జారిపోయింది. పిన్ని ఇంటి సందడి, పిల్లల నవ్వులు, రజని విషాదం– ఏదీ దాచలేదు. కమలకు రజని గురించి తెలుసు కాబట్టి అతను ఒక్క మాట కూడా ఆపలేదు. చివరికి కళాభవన్, హరిప్రసాద్ కచేరీ, మాల్కౌంస్ రాగం ఆ వేణు స్వరాలు ఎలా గుండెల్లోకి జారిపడి మెల్లగా శాంతిని నింపాయో చెప్పుకుంటూ పోయాడు. మాట్లాడుతుండగా అతని స్వరం క్రమంగా మృదువైంది. కమల ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా అతని చేతులు పట్టుకుంది. దగ్గరికి లాగుకుంది. ఆమె ఊర్పులు అతని గుండెపై మృదువుగా తాకాయి– మరో వేణు శ్వాసలు.‘‘ఇవే గదా జీవించిన క్షణాలు,’’ అనుకున్నాడు అరవింద్.గుండెల్లోని ఖాళీ నెమ్మదిగా పూరితమైంది.బయట చలిగాలిలో రాత్రి మెల్లగా చిక్కబడుతోంది. రచయిత ∙పాపినేని శివశంకర్


