
మహిళలు శాంతి దూతలు. శాంతి కోసం అవసరం అయితే వారు వీధి పోరాట యోధులు కూడా కాగలరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కళ్లెదుటి వర్తమానం. నోబెల్ బహుమతులు మొదలయ్యాక ఈ 125 ఏళ్లలో ఇప్పటి వరకు 19 మంది మహిళలు శాంతి విజేతలయ్యారు. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, శాంతి సాధనలో మహిళల సంకల్ప బలానికి ఆకాశమంత సాక్ష్యం. 20 వ మహిళా శాంతి బహుమతి విజేత ఎవరన్నది (ఒకవేళ మహిళే విజేత అయితే) ఈ నెల 10 న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఈసారి ‘శాంతి’ బహుమతికి 224 మంది వ్యక్తులు, 94 సంస్థలు పోటీలో ఉండగా... వాళ్లలో కొందరు మహిళలూ ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిని పొందిన పందొమ్మిది మంది మహిళల వివరాలు.. మీ కోసం, క్లుప్తంగా.
1905
బెర్తా వాన్ సట్నర్ (1843–1914) ఆస్ట్రియా
యుద్ధాన్ని వ్యతిరేకించటంలో చూపిన తెగువకు బెర్తాకు ‘నోబెల్ శాంతి’ లభించింది. 19వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటైన యుద్ధ వ్యతిరేక నవల ‘లే డౌన్ యువర్ ఆర్మ్‌స్’ (1889) బెర్తా రాసిందే. ఈ నవల పేరు అప్పట్లో చాలామందికి రెచ్చగొట్టేదిగా అనిపించింది. బెర్తా అంతర్జాతీయ శాంతి ఉద్యమ నాయకులలో ఒకరు. 1891లో ఆస్ట్రియన్ శాంతి సమాజాన్ని స్థాపించారు. పురుషాధిక్య శాంతి సమావేశాలలో శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారు.
1931
జేన్ ఆడమ్స్ (1860–1935), అమెరికా
మానవాళిలో శాంతి స్ఫూర్తిని రగిలించడానికి చేసిన నిరంతర కృషికి జేన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. జేన్ 1915లో ‘విమెన్స్ ్స ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ను స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లండ్స్‌లోని హేగ్‌లో జరిగిన మహిళల శాంతి సమావేశానికి జేన్ అధ్యక్షత వహించారు. అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్స్ అమెరికాను యుద్ధంలోకి దింపినందుకు వ్యతిరేకంగా జేన్ చాలా బిగ్గరగా నిరసన తెలిపారు.
1946
ఎమిలీ గ్రీన్ బాల్చ్ (1867–1961), అమెరికా
నిరాయుధీకరణ, శాంతి స్థాపనల కోసం ఎమిలీ జీవితాంతం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఆమెకు అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అభినందనలూ అందలేదు! మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె 1931 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జేన్ ఆడమ్స్‌తో కలిసి, యుద్ధాన్ని ఆపడానికి జోక్యం చేసుకోవాలని తటస్థ దేశాల దేశాధినేతలను ఒప్పించారు. 1935లో ఎమిలీ ‘విమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ కు నాయకత్వం వహించారు.
1976
బెట్టీ విలియమ్స్ (1943–2020), యు.కె.
ఉత్తర ఐర్లండ్‌లో ప్రొటెస్టెంట్‌లకు, కేథలిక్కులకు మధ్య రగులుతున్న హింసాత్మక సంఘర్షణలకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి, మైరీడ్ కొరిగన్ అనే మహిళతో పాటుగా బెట్టి విలియమ్స్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1976 ఆగస్టులో, బెల్‌ఫాస్ట్‌లో (ఉత్తర ఐర్లండ్) జరిగిన కాల్పుల ఘటనలో అమాయకులైన ముగ్గురు చిన్నారులు మరణించారు. గృహిణి అయిన బెట్టీ విలియమ్స్ ఆ విషాదాన్ని చూసి, ఉత్తర ఐర్లండ్‌లో ఘర్షణలు ఆపాలని నిర్ణయించుకుని, శాంతి పునరుద్ధరణకు పాటు పడ్డారు.
1976
మైరీడ్ కొరిగన్ (1944 –), యు.కె.
మైరీడ్ బెల్‌ఫాస్ట్‌లో ఒక పేద కుటుంబంలో పెరిగారు. యువతిగా ‘లెజియన్ ఆఫ్ మేరీ’ అనే కాథలిక్ సంస్థలో సేవలందించారు. 1976, 1977లలో ఉత్తర ఐర్లండ్‌లో ఘర్షణలు, హింసకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వేలాది మందిని ఒకచోట చేర్చారు. బెట్టీ విలియమ్స్‌తో కలిసి పని చేశారు. ఆమెతో నోబెల్ శాంతిని పంచుకున్నారు.
1979
మదర్ థెరిసా (1910 – 1997), ఇండియా
మానవాళికి అసమాన సేవలను అందించినందుకు మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అల్బేనియా కేథలిక్ బాలిక అయిన ఆగ్నెస్ గోంక్షా బోజాక్షియు తన పన్నెండేళ్ల వయసులోనే మానవాళి సేవకు అంకితం అయ్యారు. తదనంతర కాలంలో ఇండియాకు వచ్చి థెరిస్సాగా మారిపోయారు. పేదలను ఆదుకునేందుకు ఆమె స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ కలకత్తాలో అనాథల కోసం ఇళ్లు, కుష్ఠురోగులకు నర్సింగ్ హోమ్‌లు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాలను నిర్మించింది.
1982
అల్వా మిర్డాల్ (1902–1986), స్వీడన్
1962లో స్వీడిష్ పార్లమెంటుకు ఎన్నికవటానికి ముందే అల్వా మిర్డాల్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. యుద్ధానంత కాలంలో సోషల్ డెమోక్రాట్ పార్టీ ద్వారా కార్మికవర్గ పరిస్థితులను మెరుగుపరచడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. మహిళల హక్కుల ప్రచారకర్తగా ప్రసిద్ధి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ పదవులను నిర్వహించారు. ఆమె చేసిన నిరాయుధీకరణ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
1991
ఆంగ్ సాన్ సూకీ (1945–) బర్మా
బర్మాలో పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాలని సైనిక నాయకులతో పోరాడారు. 1990లో ఆమె పార్టీ ఎన్.ఎల్.డి. స్పష్టమైన విజయం సాధించినా, అప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న సూకీని విడుదల చేయటానికి సైన్యం నిరాకరించింది. 21 సంవత్సరాలలో దాదాపు 15 సంవత్సరాలు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 1న సైనిక దళాలు తిరుగుబాటు చేసి, సూకీకి మళ్లీ 8 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. ఆమె అహింసాయుత ప్రజా పోరాటం ఆమెకు నోబెల్ శాంతిని తెచ్చిపెట్టింది.
1992
రిగోబెర్టా మెంచు తుమ్ (1959–) గ్వాటెమాలా
రిగోబెర్టా మెంచు తుమ్ స్థానిక ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్న సైన్యం ఆమె సొంత కుటుంబంలోని అనేక మందిని చంపింది. దాంతో ఆమె 1980ల ప్రారంభంలో మెక్సికోలో తలదాచుకున్నారు. అక్కడ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న యూరోపియన్ సమూహాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్వాటెమాలా తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం – గెరిల్లా సంస్థల మధ్య చర్చలలో మధ్యవర్తిగా పని చేశారు.
1997
జోడీ విలియమ్స్ (1950 –) అమెరికా
జోడీ మందు పాతరల వ్యతిరేక ఉద్యమ నాయకురాలు. 1980లలో యుద్ధంలో దెబ్బతిన్న ఎల్ సాల్వడార్‌లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కాలంలో మందు పాతరలు పౌర జనాభాకు నిరంతరం ముప్పుగా ఉండేవి. వాటి వల్ల చేతులు, కాళ్లు కోల్పోయిన పిల్లలకు కృత్రిమ అవయవాలను అందించే బాధ్యతను ఆమె తీసుకున్నారు. 1991 నుండి మందుపాతరలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించడంలో ముందు నిలిచారు. నోబెల్ విజేత అయ్యారు.
2003
షిరిన్ ఎబాది (1947–), ఇరాన్
ఇస్లామిక్ ప్రపంచం నుంచి తొలి మహిళా శాంతి బహుమతి గ్రహీత. ఇరాన్ తొలి మహిళా న్యాయమూర్తులలో ఒకరు. బ్యూరోక్రసీ పీడనను వ్యతిరేకించారు. పై అధికారులను విమర్శించినందుకు జైలుపాలు అయ్యారు. కనీస మానవ హక్కుల కోసం; ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటాన్ని చేపట్టారు. ఇందుకే ఆమెకు నోబెల్ లభించింది. మతం నుండి రాజకీయాలను వేరుచేయాలనే వాదనకు ఎబాది మద్దతుగా నిలిచారు.
2004
వంగారి మాతై (1940–2011), కెన్యా
నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆఫ్రికన్ మహిళ. తూర్పు, మధ్య ఆఫ్రికా నుండి డాక్టరేట్ (జీవశాస్త్రంలో) పొందిన తొలి మహిళ. స్వదేశమైన కెన్యాలో తొలి మహిళా ప్రొఫెసర్ కూడా. కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. 1977లో అడవుల సంరక్షణకు ఉద్యమం ప్రారంభించారు. ‘గ్రీన్ బెల్ట్’ అనే ఆ ఉద్యమం ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది, మూడు కోట్లకు పైగా చెట్లను నాటడానికి దోహదపడింది. సుస్థిరాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ దక్కింది.
2011
ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ (1938 –), లైబీరియా
ఆఫ్రికాలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి మహిళా దేశాధినేత. శాంతిని ప్రోత్సహించ డానికి, మహిళల హక్కుల కోసం పోరాడారు. 2005లో అధికారంలోకి వచ్చి, దేశంలో శాంతి సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి, మహిళల హక్కుల కోసం పాటుపడ్డారు. ఇందుకే నోబెల్ పొందారు. ఇతర ఆఫ్రికన్ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అమెరికాలో చదువుకున్నారు. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక రాజకీయ ఉద్యమబాట పట్టారు.
2011
లేమా బోవీ (1972–), లైబీరియా
శాంతిని నెలకొల్పటానికి, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1990లో లైబీరియాలో అంతర్యుద్ధంలో గాయపడిన బాల సైనికుల సంరక్షణ కోసం ట్రామా థెరపీలో శిక్షణ పొందారు. లేమా నేతృత్వంలోని ‘విమెన్ మాస్ యాక్షన్ ఫర్ పీస్’.. క్రైస్తవ, ముస్లిం మహిళల సంయుక్త ఆధ్వర్యంలో శాంతి, అహింసల సందేశాన్ని అందించే సమావేశాలను నిర్వహించారు. 2008లో, లైబీరియన్ అంతర్యుద్ధంలో మహిళల పోరాటంపై వచ్చిన అవార్డు డాక్యుమెంటరీ చిత్రం ‘ప్రే ది డెవిల్ బ్యాక్ టు హెల్‘లో లేమా కీలక పాత్ర పోషించారు.
2011
తవక్కోల్ కర్మాన్ (1979–), యెమెన్
జర్నలిస్ట్. యెమెన్స్ లో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం కృషి చేశారు. అధ్యక్షుడు సలేహ్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. ‘విమెన్ జర్నలిస్ట్స్ వితౌట్ చైన్స్ ్స’ అనే సంస్థను స్థాపించారు. ఉద్యమశీలిగా జైలు శిక్ష అనుభవించారు. హింసలకు గురయ్యారు. 2011లో షియా– సున్నీ ముస్లింల మధ్య; ఇస్లాం–ఇతర మతాల మధ్య సయోధ్యను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రశంసలు అందుకున్నాయి.
2014
మలాలా యూసఫ్‌జాయ్ (1997–), యు.కె.
ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కు ఉందని పోరాడినందుకు మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె పాకిస్తాన్స్ లోని స్వాత్ లోయలో జన్మించారు. 2012లో తాలిబాన్‌లు పాఠశాల బస్సుపై కాల్పులు జరిపినప్పుడు మలాలా తలపై గాయమైంది. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అవటంతో ఆమె బ్రిటన్‌లో ప్రవాసంలో నివసించాల్సి వచ్చింది. ఆమె తన 16వ పుట్టినరోజున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యకు సమాన హక్కుల కోసం పిలుపునిచ్చారు.
2018
నాదియా మురాద్ (1993–), ఇరాక్
లైంగిక హింసను యుద్ధాలలో ఆయుధంగా ఉపయోగించటంపై పోరాటం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల నాదియాను, ఇతర యువతులను ‘ఐ.ఎస్.’ ఉగ్రవాదులు అపహరించి లైంగిక బానిసలుగా చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత, నాదియా తప్పించుకుని 2015లో జర్మనీ చేరుకున్నారు. ‘ది లాస్ట్ గర్ల్‘ అనే పేరుతో ఆత్మకథను రాశారు. తనపై జరిగిన దురాగతాలను అందులో వివరించడం ద్వారా, భవిష్యత్ తరాల బాలికలు, యువతులు యుద్ధంలో లైంగిక హింసకు బాధితులుగా మారకుండా ఉంటారని ఆకాంక్షించారు.
2021
మరియా రెస్సా (1963–), ఫిలిప్పీన్స్
పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడారు. ఫిలిప్పీన్స్ ్స డిలిమాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రెస్సా, సీఎన్‌ఎన్ స్థానిక కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రధానంగా ఆగ్నేయాసియాలో ఉగ్రవాదం విస్తరించడంపై ప్రత్యేక వార్తా కథనాలు రాశారు. అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పాలనాధికార దుర్వినియోగాన్ని, హింసాత్మకమైన నిరంకుశత్వాన్ని బహిర్గతం చేశారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులను వేధించడానికి డూటెర్టే సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో బయటపెట్టారు.
∙∙
2023
నర్గేస్ మొహమ్మది (1972–), ఇరాన్
ఇరాన్స్ లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా 20 ఏళ్లకు పైగా పోరాడారు. మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసి 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఎంపిక జరిగినప్పుడు ఆమె టెహ్రాన్స్ లోని ఎవిన్ జైలులో బందీగా ఉన్నారు. నర్గేస్ తన శాంతి బహుమతి గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేయటాన్ని నేను ఎన్నటికీ ఆపను..’’ అని వ్యాఖ్యానించారు.
· సాక్షి, స్పెషల్ డెస్క్