'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ | Kantara Chapter 1 Review Telugu | Sakshi
Sakshi News home page

Kantara Chapter 1 Review: థియేటర్లలోకి వచ్చిన 'కాంతార 1'.. హిట్టా? ఫట్టా?

Oct 2 2025 1:04 AM | Updated on Oct 2 2025 1:42 AM

Kantara Chapter 1 Review Telugu

మూడేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా 'కాంతార'. తర్వాత పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేస్తే తెలుగు, హిందీలోనూ సక్సెస్ అయింది. దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే 'కాంతార ఛాప్టర్ 1'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. రిషభ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు. ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. ఈసారి హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి పార్ట్‌కి మించి ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
అది బాంగ్రా రాజ్యం. దీనికో రాజు. ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అ‍క్కడ చనిపోతారు. పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు(జయరామ్) బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్దయ్యాక కూడా అటు వైపు వెళ్లే సాహసం చేయడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతార అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బెర్మి(రిషభ్ శెట్టి) అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దవుతాడు. మరోవైపు రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు(గుల్షన్ దేవయ్య) కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి.. బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖరుడితో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి(రుక్మిణి వసంత్) ఎవరు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
2022లో వచ్చిన 'కాంతార'లో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే. చివరలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్‌ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? అంటే లేదు. తొలి భాగమంతా మెప్పించిందా? అంటే లేదు. తొలి పార్ట్‌తో దీనికి కచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా చాలా సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్‌లో భారీతనం కనిపించింది. కానీ నేటివిటీ మిస్ అయింది.

తొలి పార్ట్‌లో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంత కథ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపటి దిక్కువాళ్లు, కాంతార అనే ప్రదేశం.. ఇలా చాలా కొత్త విషయాలు కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్టాప్ అలా నడిచిపోతుంది. టైగర్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ పడుతుంది.

సెకండాఫ్‌ మొదలయ్యాక స్టోరీ ఎటెటో వెళ్తుంది. అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది. స్క్రీన్‌పై అన్నీ జరుగతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైమ్ పడుతుంది. సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరలో మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడొచ్చిన 'కాంతార' స్టోరీ ఎవరైనా సరే సింపుల్‌గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు. సినిమా చూసొచ్చాక ఎవరినానై స్టోరీ ఏంటో చెప్పమని అడగండి. కచ్చితంగా తడబడతారు. అలా ఉంది! అయితే యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గ సెటప్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి.

ఎవరెలా చేశారు?
రిషభ్ శెట్టి నటన బాగానే ఉంది గానీ తొలి పార్ట్‌ కంటే డిఫరెన్స్ ఏముందా అని సందేహం వస్తుంది. మిగతా వాళ్లలో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. యువరాణిలా అందంగా ఉంది. ఈమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరలో ఈమె పాత్రని ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్‌కి అస్సలు మింగుడుపడదు. జయరామ్, గుల్షన్ దేవయ్య.. రాజులుగా బాగానే చేశారు. మిగిలిన వాళ్లలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు. 

టెక్నికల్ విషయాలకొస్తే పాటలు రొటీన్‌. గుర్తుండవు అలానే అర్థం కావు కూడా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం రిషభ్ శెట్టి ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషభ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడేంటా అని కచ్చితంగా అనిపిస్తుంది.

- చందు డొంకాన 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement