ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో జరగబోయే పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీసీ)అతని బాబాయి శరద్ పవార్ సారధ్యంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ)వర్గం పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్వయంగా ప్రకటించారు.
‘రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’
ఆదివారం పింప్రి-చించ్వాడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రెండు వర్గాల మధ్య ఐక్యతను ఆయన తెలియజేస్తూ.. ‘కుటుంబం (పరివార్) మళ్లీ ఒక్కటైంది’ అని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే సమయంలో, కలిసి పోటీ చేయాలని రెండు వర్గాలు నిర్ణయించుకున్నాయని అజిత్ పవార్ తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఫలితం ఎలా ఉంటుందనే దానిపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
అభివృద్ధిని గుర్తుచేస్తూ..
స్థానిక నేతలతో ఈ పొత్తు, సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అజిత్ పవార్ తెలిపారు. పింప్రి-చించ్వాడ్‌లో జరిగిన అభివృద్ధి పనుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, తాము తెచ్చిన అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా హింజేవాడిలో నిర్మించిన ఐటీ హబ్ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తు ఆయన చేశారు. 1992 నుండి 2017 మధ్యకాలంలో కార్పొరేషన్‌లో తన పదవీ కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అజిత్ పవార్ పేర్కొన్నారు.
‘వారు కలవడం కొత్తేమీ కాదు’
పవార్ కుటుంబం తిరిగి ఏకమవడంపై పలువురు నేతలు స్పందించారు. వారిలో కొందరు శరద్ పవార్ త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అజిత్ పవార్.. శరద్ పవార్ ఆదేశాల మేరకే బీజేపీలో చేరారు. వారు తిరిగి కలవడం కొత్తేమీ కాదు. వారు ఏకం కావడం మాకు సంతోషంగా ఉంది. శరద్ పవార్ కూడా త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరతారని ఆశిస్తున్నాను’ అని బీజేపీ మహిళా నేత నవనీత్ రాణా అన్నారు. ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం) నేత జీషన్ సిద్ధిఖీ కూడా ఈ కలయికను స్వాగతిస్తూ ‘రెండు కుటుంబాలు కలవడం మంచి విషయమే. దీనివల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుంది. మేము దీనిని స్వాగతిస్తున్నాం. ఇకపై రెండు పార్టీలు కలిసి పోరాడతాయి’ అని అన్నారు.
‘ఇంటి పేరు ఇక్కడ పనిచేయదు’
అయితే ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం.. పవార్ల పొత్తును విమర్శిస్తూ.. ‘వారు కలిసిపోవచ్చు, కానీ ప్రజలు ఇంటి పేరును చూసి ఓట్లు వేయరు. మహారాష్ట్రలో ఇంటి పేరు రాజకీయాలు పనిచేయవు," అని పేర్కొంది. శివసేన మహిళా నేత షైనా ఎన్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఏ అన్నదమ్ములైనా కలిసిపోవచ్చు. ఇంటి పేరు రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. వారు అధికారం కోసమే కలిసి వస్తున్నారు. అయితే ప్రజలు కేవలం పనిని మాత్రమే చూస్తారు. పేరును కాదు. పవార్లు కలిసి వస్తున్నారని అంతా చర్చించుకోవచ్చు. దీనివల్ల వారికి ఓట్లు రావు. ప్రజలు పేరు ఆధారంగా ఓట్లు వేయరు’ అని ఆమె అన్నారు.
29 మున్సిపల్ కార్పొరేషన్లకు..
పింప్రి-చించ్వాడ్, పుణె సహా మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మర్నాడు జనవరి 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలుకు డిసెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. 2023లో ఎన్సీపీ చీలిక తర్వాత, అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం రాష్ట్ర స్థాయిలో బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కలిసి ‘మహాయుతి’ కూటమిలో భాగస్వామిగా చేరింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోసం తిరిగి ఇరు పార్టీలు జట్టు కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: యమ డేంజర్‌లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!


