న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం భయంకర వాతావరణ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోగా, మరోవైపు తీవ్రమైన చలి గాలులు నగరాన్ని తీవ్రంగా వణికిస్తున్నాయి. సోమవారం ఉదయం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 400 మార్కును దాటి ‘తీవ్రమైన’ శ్రేణికి చేరుకుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీబీసీబీ) గణాంకాల ప్రకారం నేటి (సోమవారం) ఉదయం ఢిల్లీలో సగటు ఏక్యూఐ 404గా నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన ఆనంద్ విహార్, బవానా, జహంగీర్‌పురి తదితర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు 450 మార్కును దాటాయి. గాలి వేగం తగ్గడానికి తోడు తేమశాతం పెరగడం వల్ల వాహనాల ఉద్గారాలు, దుమ్ము కణాలు భూమికి సమీపంలోనే నిలిచిపోయి దట్టమైన పొగమంచులా ఏర్పడ్డాయి. ఫలితంగా ప్రజలు శ్వాస తీసుకునేందుకు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వాయువ్య భారతం నుండి వీస్తున్న పొడి, చల్లని గాలుల కారణంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సోమవారం తెల్లవారుజామున సగటు కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే అతి తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న 48 గంటల పాటు శీతల గాలుల (Cold Wave) ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కాగా దృశ్యమానత (Visibility) 50 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో రోడ్డు, రైలు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. విమానాల రాకపోకల్లో కూడా జాప్యం చోటుచేసుకుంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (గ్రాప్)నాలుగో దశ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.
‘గ్రాప్-4’లో భాగంగా నగరంలోకి అనవసరమైన ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది ఇంటి నుండే పని (Work from Home) చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు.. వాయు కాలుష్యం, చలి తీవ్రత దృష్ట్యా వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. వారు బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా ఎన్-95 మాస్కులు ధరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: హడలెత్తిస్తున్న రైలు ప్రమాదాలు.. గత 10 ఏళ్లలో..


