లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి.. | Liver Damage without Symptoms the Silent Spread of Hepatitis | Sakshi
Sakshi News home page

లక్షణాలు లేకుండా కాలేయాన్ని కరిగించి..

Feb 12 2026 9:23 AM | Updated on Feb 12 2026 10:41 AM

Liver Damage without Symptoms the Silent Spread of Hepatitis

ఆ వైరస్‌ బారినపడినవారు బయటకు ఆరోగ్యంగానే కనిపిస్తారు.. రోజువారీ పనులన్నీ చురుగ్గానే చేసుకుంటారు.. కానీ వారి శరీరంలోని కాలేయం (Liver) మెల్లమెల్లగా క్షీణిస్తుంటుంది. అది పూర్తిగా దెబ్బతిన్న తర్వాత కానీ అసలు విషయం బయటపడదు. అదే హెపటైటిస్ వైరస్ చేసే దారుణ మాయాజాలం. ప్రస్తుతం భారతదేశంలో హెపటైటిస్ బి (HBV), హెపటైటిస్ సి (HCV) ఇన్ఫెక్షన్లు ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తున్నాయి.

కోటి మందికి పైగా..
దేశంలో హెపటైటిస్ ఒక ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. దేశ జనాభాలో సుమారు మూడు నుంచి నాలుగు శాతం మంది హెపటైటిస్ బి (HBV) బారిన పడగా, మరో 0.5 నుంచి ఒక శాతం మంది హెపటైటిస్ సి (HCV)తో పోరాడుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, సుమారు కోటి మందికి పైగా భారతీయులు ఈ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల ముప్పులో ఉన్నారని అంచనా.

లక్షణాలు కనిపించకపోవడం..
ఈ వైరస్ శరీరంలో ఉన్నప్పటికీ ఎటువంటి బాహ్య లక్షణాలు కనిపించకపోవడం అత్యంత ప్రమాదకరమైన అంశమని నోయిడాలోని మెదాంత ఆస్పత్రి నిపుణులు డాక్టర్ సౌరదీప్ చౌదరి హెచ్చరిస్తున్నారు. దీని బారినపడినవారు ఆరోగ్యంగా ఉన్నట్లు  కనిపించినప్పటికీ, వైరస్ లోపల కాలేయాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ, చివరకు సిరోసిస్, కాలేయ వైఫల్యం లేదా క్యాన్సర్‌కు దారితీస్తుందని డాక్టర్ సౌరదీప్ తెలిపారు.

హెపటైటిస్ వ్యాప్తికి కారణాలివే..
హెపటైటిస్ వ్యాప్తిపై సమాజంలో పలు అపోహలు ఉన్నాయి. కాలేయ వ్యాధులు కేవలం మద్యం సేవించే వారికే వస్తాయని చాలా మంది  అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. అపరిశుభ్రమైన ఇంజెక్షన్లు, తనిఖీ చేయని రక్తం ఎక్కించడం, కలుషితమైన పరికరాలతో శస్త్రచికిత్సలు చేయడం లేదా పచ్చబొట్లు (టాటూలు) వేయించుకోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అలాగే ప్రసవ సమయంలో తల్లి నుండి బిడ్డకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. అయితే కౌగిలించుకోవడం, కలిసి భోజనం చేయడం లేదా దగ్గు ద్వారా ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల బాధితులు సామాజిక వివక్షకు గురవుతున్నారు. ఇదే వారు సకాలంలో పరీక్షలు చేయించుకోకుండా అడ్డుపడుతోంది.

కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం
హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్ 'సి' ని ప్రారంభ దశలో గుర్తిస్తే వైద్యం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. ఆలస్యమైతే కాలేయం కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. హెపటైటిస్ 'బి' కి మాత్రం దీర్ఘకాలిక చికిత్స అవసరం. మద్యం సేవించడం, అనారోగ్యకర ఆహారం, ఊబకాయం, మధుమేహం తదితర అంశాలు కాలేయం దెబ్బతినే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా హెపటైటిస్ ఉన్నవారు స్వల్పంగా మద్యం సేవించినా అది ప్రాణాంతక పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణ రక్త పరీక్ష ద్వారా వైరస్ ఉనికి..
ప్రస్తుత కాలంలో హెపటైటిస్ పరీక్షలు, చికిత్స సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా వైరస్ ఉనికిని గుర్తించవచ్చు. హెపటైటిస్ ‘బి’ నివారణకు సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉండగా, హెపటైటిస్ 'సి' ని  ఎనిమిది నుండి 12 వారాల పాటు మందులు వాడటం ద్వారా శాశ్వతంగా నయం చేయవచ్చు. గతంలో ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్న వారు, రక్తమార్పిడి జరిగిన వారు లేదా తెలియక అపరిశుభ్రమైన ఇంజెక్షన్లు తీసుకున్న వారు వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చేయడమే.. కాలేయాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement