సౌత్ ఏసియన్ లివర్ ఇన్‌స్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్ సమీపంలోని సెమీ రూరల్ ప్రాంత రోగుల్లో అధికంగా సమస్య
యాంటీబయోటిక్స్ కూడా పనిచేయని స్థితిలో బాధితులు ఉన్నట్లు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కాలేయ మార్పిడి రోగుల్లో సగం మందికిపైగా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ (ఎండీఆర్) ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు హైదరాబాద్‌కు చెందిన సౌత్ ఏసియన్ లివర్ ఇన్‌స్టిట్యూట్ తాజా అధ్యయనం వెల్లడించింది. 26 నెలలపాటు జరిగిన ఈ అధ్యయనంలో 67 మంది కాలేయ శస్త్రచికిత్స రోగులను పరిశీలించారు. వారిలో 24 శాతం మందిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను గుర్తించారు. 46 మంది కాలేయ మార్పిడి పొందిన రోగుల్లో 16 మందికి ఇన్ఫెక్షన్లు విస్తరించగా వారిలో 94% మందికి తొలి, రెండో దశ యాంటీబయోటిక్స్ కూడా పనిచేయలేదని నివేదిక తెలిపింది.
ఇన్ఫెక్షన్ కేసుల్లో 56 శాతం మందికి శస్త్రచికిత్సకు ముందే రక్త నమూనాల్లో ఎండీఆర్ బాక్టీరియా కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రోగుల్లో సగానికిపైగా ఎండీఆర్ ఇన్ఫెక్షన్‌తో వస్తే ఆసుపత్రుల్లో అందించే ఇన్ఫెక్షన్ నిరోధక చర్యలు పనిచేయవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ టామ్ చెరియన్ పేర్కొన్నారు. శస్త్రచికిత్సకు ముందు రోగులలోని క్రియాశీల ఇన్ఫెక్షన్లను గుర్తించి నియంత్రించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
తీవ్ర స్థాయిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్
తాజా అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం భారత్‌లోని రోగుల్లో 80 శాతం మందిలో ఎండీఆర్ సూక్ష్మజీవులు ఉన్నాయని వెల్లడైంది. ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జీఎల్‌ఏఎస్‌ఎస్–2025 నివేదికలో భారత్‌లో ప్రతి మూడు బాక్టీరియా ఇన్ఫెక్షన్లలో ఒకటి సాధారణ యాంటీబయోటిక్స్‌ను ప్రతిఘటిస్తున్నట్లు తేలింది.
బ్యాక్టీరియా కల్చర్‌లను ముందుగానే నిర్వహించడం వల్ల శస్త్రచికిత్సల సమయంలో 30 శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చినా సరైన యాంటీబయోటిక్స్‌తో సమస్యను నియంత్రించగలిగామని సౌత్ ఏసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు చెబుతున్నారు. భారత్‌లో జరుగుతున్న తాజా అధ్యయనాల ప్రకారం చివరి దశలో వాడే ‘కార్బాపెనమ్’ యాంటీబయోటిక్స్‌కే రెసిస్టెన్స్ పెరుగుతోందని తేలింది. ఇందులో ఇ.కోలికి 22 శాతం, కె.నిమోనియాకు 31 శాతం రెసిస్టెన్స్ ఎదురైనట్లు తేలింది.
ద్వితీయశ్రేణి నగరాల్లో స్క్రీనింగ్ తప్పనిసరి
నిపుణుల సూచన ప్రకారం సెమీ–రూరల్, ద్వితీయశ్రేణి నగర ప్రాంతాల్లో ప్రీ–ఆపరేటివ్ స్క్రీనింగ్ విధానాలు తప్పనిసరి చేయడం ద్వారా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్‌ను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాంటీబయోటిక్స్ వినియోగం, పర్యవేక్షణ వ్యవస్థల బలోపేతం అత్యవసరమని సూచించారు.


