పంచాయతీ ముచ్చట్లు | The first phase of Panchayat elections was very exciting | Sakshi
Sakshi News home page

పంచాయతీ ముచ్చట్లు

Dec 12 2025 2:15 AM | Updated on Dec 12 2025 2:15 AM

The first phase of Panchayat elections was very exciting

తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైనా గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రాగా, టాస్‌లో పలువురిని అదృష్టం వరించింది. ఇంకొన్ని చోట్ల ఎన్నో ప్రయాసలు పడి ఓటు వేసి తమ బాధ్యత ఏంటో తెలియజెప్పారు.

టెంట్ల కిందే ఓటింగ్‌..
దుద్యాల్‌ /దండేపల్లి: పాఠ శాల గదుల్లోనో, పంచాయతీ భవనంలోనో నిర్వహించే సర్పంచ్‌ ఎన్నికలను ఈసారి టెంట్ల కింద పూర్తిచేశారు. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం సట్రకుంటతండాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల స్కూల్, జీపీ భవనాలు మంజూరైనా, ప్రస్తుతం అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక టెంట్ల కింద పోలింగ్‌ జరిపించారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చెల్కగూడెంలో ప్రభుత్వ పాఠశాల లేదు. పైగా పంచాయతీకి పక్కా భవనమూ లేదు. అంగన్‌వాడీ కేంద్రం కూడా ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రం ఆవరణలోనే టెంట్లు వేసి పోలింగ్‌ నిర్వహించారు.

ఫ్యామిలీ పాలిటిక్స్‌
తల్లిపై కూతురు విజయం
కోరుట్లరూరల్‌/ ఉట్నూర్‌రూరల్‌: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయి పల్లె సర్పంచ్‌ పదవికి తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లపు సుమలత పోటీ పడగా, కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆరుగురు బరిలో ఉన్నా, ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

భార్య సర్పంచ్‌.. భర్త ఉప సర్పంచ్‌
ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం లింగోజీతండా సర్పంచ్‌గా జాదవ్‌ మాయ 88 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి జాదవ్‌ విమల బాయిపై గెలుపొందారు. ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మాయ భర్త జాదవ్‌ హరినాయక్‌ను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే గ్రామ పంచాయతీకి జాదవ్‌ హరినాయక్‌ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

మద్యం మత్తులో బ్యాలెట్‌ పేపర్‌ మింగాడు
కోరుట్లరూరల్‌/ శంషాబాద్‌ రూరల్‌: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామ పోలింగ్‌ బూత్‌కు పిట్టల వెంకటి ఓటు వేసేందుకు వచ్చాడు. పోలింగ్‌ సిబ్బంది ఆయనకు సర్పంచ్, వార్డు సభ్యుడికి సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లు ఇచ్చి ఓటు వేసి తీసుకురమ్మన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటి తెలుపు కలర్‌ బ్యాలెట్‌ పేపర్‌ నమిలి మింగాడు. పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ పేపర్‌ నములుతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి పిట్టల వెంకటిని జీపులో ఎక్కించుకొని పోలింగ్‌ స్టేషన్‌కు దూరంగా తీసుకెళ్లి వదిలేశారు.

తప్పు జరిగిందని బ్యాలెట్‌ పేపరు చించివేత 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బుర్జుగడ్డతండాలోని పోలింగ్‌ స్టేషన్‌లోకి ఓటు వేసేందుకు ముడావత్‌ సత్యనారాయణ వెళ్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే మరో అభ్యర్థికి వేసినట్టు గుర్తించి, ఆ బ్యాలెట్‌ పేపరును చించివేశాడు. గమనించిన ఎన్నికల అధికారి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు. సత్యనారాయణ పోలింగ్‌ ఏజెంటుగా తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.

బ్యాలెట్‌లో వార్డు అభ్యర్థి గుర్తు గల్లంతు
నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్‌ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. దీంతో గంటపాటు పోలింగ్‌ నిలిపివేయించి.. కొత్త బ్యాలెట్స్‌ తెప్పించి ఓట్లు వేయించడంతో వివాదం ముగిసింది.

నాగారంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం
నాగారం: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి నాగారం సర్పంచ్‌గా కాంగ్రెస్‌ మద్దతుదారుపై 136 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి తన స్వగ్రామానికి సర్పంచ్‌గా సేవ చేయాలన్న కల సాకారమైంది. తండ్రి గెలుపు కోసం కుమారులు జగదీశ్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు కృషి చేశారు. యువతతో పోటీ పడుతూ ఈ వయసులో రామచంద్రారెడ్డి విజయం సాధించడంపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

సర్పంచ్‌గా గెలిచిన 80 ఏళ్ల వృద్ధురాలు
మంథనిరూరల్‌: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల సర్పంచ్‌ బరిలో ముగ్గురు నిలిచారు. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కాసిపేట వెంకటమ్మ 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.

చెక్కు చెదరని అభిమానం
చనిపోయిన వ్యక్తికి మెజారిటీ ఓట్లు 
సర్పంచ్‌గా గెలిచినట్టు ధ్రువీకరించిన అధికారులు 
వేములవాడఅర్బన్‌: రాజన్నసిరిసిల్ల జిల్లా వేము లవాడ మండలం చింతాల్‌ ఠాణా సర్పంచ్‌ పదవికి 1,717 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెర్ల మురళికి 739 ఓట్లు, సమీప ప్రత్యర్థులు సురువు వెంకటికి 369, కొలాపూరి రాజమల్లయ్యకు 357 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈ నెల 4వ తేదీన చెర్ల మురళి గుండెపోటుతో మృతి చెందాడు. అయినా గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమానంతో ఓట్లు వేశారు. అయితే సర్పంచ్‌ పదవికి పోటీ చేసిన మురళికి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పారు.

ఆయనకు 160 ఓట్లు..
మహబూబా బాద్‌ రూరల్‌ : మహబూబా బాద్‌ జిల్లా నడి వాడ సర్పంచ్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ మద్ద తుతో రాగిపాటి బుచ్చిరెడ్డి పోటీ చేశాడు. ఈ నెల 9న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బుచ్చిరెడ్డి భార్య సావిత్రమ్మ గ్రామ ప్రజల కోరిక మేరకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలోనూ గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమా నాన్ని చాటుకుంటూ ఓటేశారు. దివంగత బుచ్చిరెడ్డికి 160 ఓట్లు వేశారు.

ఓటు.. బాధ్యత
కొడుకు చనిపోయిన బాధలో ఉన్నా...
దుద్యాల్‌/బోధన్‌ /ఇబ్రహీంపట్నం: వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట్‌కు చెందిన భూకల వెంకటయ్య–పద్మమ్మల కొడుకు మల్లేశ్‌యాదవ్‌ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంట్లో మృతదేహం ఉండగానే, రోదిస్తూనే వెళ్లి ఓటు వేశారు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించారు.

అంబులెన్స్‌లో వచ్చి.. 
నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం జాడి జమాల్‌పూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి మల్లవరపు ఆరోగ్యరాజు అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన రోడ్డు ప్రమాదానికి గురికాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నడవలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్‌లో తీసుకొచ్చారు.

ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
కొడంగల్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండలం ఖాజాఅహ్మద్‌పల్లి సర్పంచ్‌ అభ్యర్థి  లక్ష్మి తన ఓటమి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.  

వీఐపీ విలేజ్‌ 
ఆ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో... 
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు«ద్‌రెడ్డి (కాంగ్రెస్‌) స్వగ్రామం రంగారెడ్డిగూడెం (రాజాపూర్‌) గ్రామపంచాయతీలో బీజేపీ మద్దతుదారు కాటేపాగ రేవతి విజయం సాధించారు. తొలుత రేవతికి 6 ఓట్ల మెజార్టీ రాగా.. అధికార పార్టీ నాయకుల డిమాండ్‌తో రీకౌంట్‌ చేయడంతో రేవతి మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. \

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్‌) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్‌ఎస్‌‡ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది.  

జోగుళాంబ గద్వాల జిల్లా గట్ట మండలం గంగిమాన్‌దొడ్డి పంచాయతీలో బోయపద్మ (ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గం) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం గుట్టల్లపల్లిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కొలను ప్రశాంత్‌రెడ్డి కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు.  

ఊరు తరలినా.. ఓట్లు అక్కడే.. 
కడెం: నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్, మైసంపేట్‌ వాసులను పునరావాసంలో భాగంగా ధర్మాజీపేట్‌ సమీపంలోని పునరావాస గ్రామా నికి తరలించారు. అయినా వీరి ఓట్లు ఉడుంపూర్‌ పరిధిలోనే ఉన్నాయి. దోసండ్ల లచ్చన్న గ్రామస్తుడి సహాయంతో మోటారుసైకిల్‌పై 32 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్‌ వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లచ్చన్నకు కళ్లు సరిగ్గా కనబడకపోయినా ఓటేసేందుకు అంత దూరం వెళ్లడం విశేషం.

ఓటేసిన శతాధిక వృద్ధుడు 
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పంచాయతీ ఎన్నికల్లో  105 ఏళ్ల వృద్ధుడు లాడే లింగన్న  ఓటేశాడు. హుషారుగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన లింగన్నను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హరిత పోలింగ్‌ కేంద్రం 
వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్‌ కేంద్రంలో వీల్‌ చైర్‌పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధురాలు.  

ఓటరు దేవుళ్లకు దండాలు..
వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం వద్ద తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న మద్దతుదారులు..  

లక్కీ.. లక్కీచాన్స్‌..
చీటీ తీసి... సర్పంచ్‌ ఎంపిక 
టేక్మాల్‌/రఘునాథపల్లి /రాజాపేట/కొందుర్గు /మంథనిరూరల్‌: మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం సూరంపల్లి సర్పంచ్‌ స్థానానికి 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు పడగా, 3 ఓట్లు చెల్లలేదు. బీఆర్‌ఎస్‌ మద్దతుతో బరిలో ఉన్న మైలారం పోచయ్య, కాంగ్రెస్‌ బలపరి చిన రామచంద్రయ్యకు 276 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. 

రెండుసార్లు కౌంటింగ్‌ చేసినా, మళ్లీ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరు అభ్యర్థుల సమ్మతితో ఒక్కొక్కరి పేర ఐదైదు చీటీలు రాశారు. ఆ పది చీటీల నుంచి ఒక చీటీ తీయగా, అందులో మైలారం పోచయ్య పేరు ఉంది. దీంతో ఆయన్ను సర్పంచ్‌గా ఎన్నికైనట్టు ప్రకటించారు.

టాస్‌తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్‌ మద్దతుతో గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం జోజి బరిలో నిలిచారు. పంచాయతీ పరిధిలో 474 ఓట్లు ఉండగా, 420 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ ఇద్దరికి సమానంగా 210 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు రెండుమార్లు రీకౌంటింగ్‌ చేశారు. అయినా ఓట్లు సమానంగానే వచ్చాయి. దీంతో టాస్‌ వేయగా అదృష్టం స్వతంత్ర అభ్యర్థిని జోజి వరించింది.

లక్ష్మక్కపల్లిలో...
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండ లం లక్ష్మక్కపల్లి సర్పంచ్‌గా బీఆర్‌ఎస్‌ మద్దతు దారుడు ఇండ్ల రాజయ్య టాస్‌ ద్వారా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో మొదట ఇండ్ల రాజ య్యకు 147 ఓట్లు, వేముల సురేందర్‌రెడ్డికి 148 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓపెన్‌ చేయ డంతో ఇండ్ల రాజయ్యకు ఒక్క ఓటు వచ్చింది. దీంతో ఇద్దరి ఓట్లు సమానం అయ్యాయి. ఎన్ని కల అధికారులు టాస్‌ వేయగా, రాజయ్యను అదృష్టం వరించింది. ఇదే పంచాయతీ పరిధి లోని 3వ వార్డులో బీమనపల్లి కృష్ణకుమార్, అయిల కిరణ్‌లకు చెరి 27 ఓట్లు రాగా, టాస్‌ వేయగా, కృష్ణకుమార్‌ను గెలిచాడు. 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి  సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులకు సమానంగా 392 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ నుంచి మెండే రాజ య్య, బీఆర్‌ఎస్‌ నుంచి కనవేన కొమురయ్య బరిలో నిలిచారు. డ్రాలో కనవేన కొమురయ్య గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.

కోటినాయక్‌ తండాలో... 
ఆత్మకూర్‌(ఎస్‌): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం కోటినాయక్‌ తండాలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి ధరావత్‌ చిట్టి టాస్‌లో విజేతగా నిలిచింది. ధరావత్‌ చిట్టికి, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్‌ మద్దతుదారు ధరావత్‌ తులసికి 315 చొప్పున ఓట్లు సమానంగా రాగా.. అధికారులు టాస్‌ నిర్వహించారు. టాస్‌లో ధరావత్‌ చిట్టి గెలుపొందింది. 

పోస్టల్‌ ఓటుతో సమానం..ఆపై టాస్‌తో గెలుపు  
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్‌ స్థానానికి 616 ఓట్లు పోలయ్యాయి. మరాఠి రాజ్‌ కుమార్‌కు 211, గోపి రాములుకు 212, వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కించగా, రాజ్‌కుమార్‌కు ఒక ఓటు వచ్చింది. దీంతో రాజ్‌కుమార్, రాములుకు ఓట్లు సరిసమానం అయ్యాయి. టాస్‌ వేయగా, రాజ్‌కుమార్‌ను విజయం వరించింది.  

వాసాలమర్రిలో... 
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొమ్మాట అనురాధకు, బీఆర్‌ఎస్‌ బలపరిచిన పలుగుల ఉమారాణికి ఓట్లు 615 చొప్పున సమానంగా వచ్చాయి. దీంతో అధికారులు టాస్‌నిర్వహించగా దొమ్మాట అనురాధను విజయం వరించింది.  

డ్రా ఫలితంపై  అభ్యంతరం.. లాఠీచార్జ్‌  
సాక్షి, సిద్దిపేట: మర్కూక్‌ మండలం గంగాపూర్‌–యూసుఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్‌ఎస్‌ మద్దతుదారులే. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మి కి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచి్చందో పూర్తిగా చూపించకుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్‌ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు.  

ఒక్క ఓటుతో విజయం..
గూడూరు/ రేగోడ్‌ /మంథనిరూరల్‌: మహబూ బాబాద్‌ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్‌గా కాంగ్రెస్‌ మద్దతుదారు సనుప సుజాత ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. పంచాయతీ పరిధిలో 1,140 ఓట్లు పోలవ్వగా, బీఆర్‌ఎస్‌ మద్దతుదారు నూనావత్‌ స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ మద్దతుదారు సుజాత అభ్యంతరం చెబుతూ రీకౌంటింగ్‌ చేయాలని అధికారులను కోరారు. 

రీ కౌంటింగ్‌లో సుజాతకు 550 రాగా, స్వాతికి 549 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మళ్లీ రీకౌంటింగ్‌ చేయాలని కోరగా, మరోసారి రీ కౌంటింగ్‌ చేశారు. అయినా కాంగ్రెస్‌ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో రిటర్నింగ్‌ అధికారులు సుజాతను విజేతగా ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకులు కౌంటింగ్‌ హాల్‌ గేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. 

కొండాపూర్‌లో...: మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం కొండాపూర్‌ సర్పంచ్‌గా బేగరి పండరి ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. ఓట్ల కౌంటింగ్‌లలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి సత్తయ్యకు 287 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ మద్దతులో పోటీలో ఉన్న బేగరి పండరికి 288 ఓట్లు వచ్చాయి. 

ఇదే మండల పరిధిలో గజ్వాడ సర్పంచ్‌గా మున్నూరి సరోజన 570 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. 

మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్‌గా ఒక్క ఓటుతో బీఆర్‌ఎస్‌ మద్దతుదారు   తోంబూరపు సుజాత విజయం సాధించారు. ప్రత్యర్థి కోరవేన వైష్ణవికి 559 ఓట్లు రాగా సుజాతకు 560 ఓట్లు వచ్చాయి.  

వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్‌ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది.

ఓటు కోసం పల్లెబాట
చౌటుప్పల్‌: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం పెద్ద సంఖ్యలో పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరుగుపయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌ మార్గంలోనూ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement