గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో అర్వింద్, ఈటల, డీకే అరుణ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్ తదితరులు
తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
ప్రతిపక్ష పాత్ర పోషించలేక పోతున్నారు
సోషల్ మీడియాలోనూ వెనుకబడుతున్నారు
విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలన్న ప్రధానమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ పరిస్థితి, తాజా పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ ఉన్నా దాన్ని ఉపయోగించుకోవ డంలో నేతలు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని ప్రత్యేకంగా బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎంపీలతోనూ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగానే రాష్ట్రంలో పార్టీ పనితీరు, నేతల వ్యవహారంపై మోదీ గరం గరం అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రం నుంచి 8 మంది చొప్పున బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సైతం వెనుకబడుతున్నారంటూ మందలించారు. విభేదాలు వీడి పార్టీ ఎదుగుదల కోసం అంతా ఐక్యంగా పనిచేయాలని, పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి..
‘సమష్టి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లి అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాలి. కేంద్రం అంది స్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమై కేంద్రం అందిస్తున్న నిధుల గురించి వివరించాలి. మండలం నుంచి పార్లమెంట్ స్థాయి వరకు క్రీడా పో టీలు నిర్వహించాలి. యువతలో క్రీడా స్ఫూర్తి నింపాలి. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటినుంచే మరింత బలంగా పనిచే యాలి..’ అని ప్రధాని మోదీ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని విందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు
గురువారం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇచ్చారు. మోది నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ విందుకు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు..బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేష్ హాజరయ్యారు.


