సాక్షి, నెల్లూరు: పార్టీ మారిన గంటల వ్యవధిలోనే.. కార్పొరేటర్ కిడ్నాప్ కావడం నెల్లూరులో కలకలం రేపుతోంది. సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర మరో నలుగురితో కలిసి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆయనకు కండువా కప్పారు. అయితే..
నెల్లూరకు తిరిగి వస్తున్న ఆయన్ని పోలీసులమని చెప్పి కొందరు తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర ఆచూకీ కోసం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నారు. మరోపక్క.. నెల్లూరులో బలం ఉన్నా టీడీపీ బరి తెగించిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
మేయర్‌పై అవిశ్వాసం వేళ.. నెల్లూరులో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్)లను మాజీ మంత్రి అనిల్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దగ్గరుండి వైఎస్ జగన్‌ను కలిపించి.. పార్టీలో చేర్పించారు. అయితే మరింత మంది కార్పొరేటర్లు పార్టీ మారే భయంతో ఉన్న టీడీపీ.. ఇలా కిడ్నాప్‌ల పర్వానికి దిగిందని స్పష్టమవుతోంది.


