సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మంత్రులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లైట్ తీసుకుంటున్నారా?. పద్దతి మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా.. తమ దారి తమదేనన్న రీతిలో వాళ్లు వ్యవహరిస్తుండడం, దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం రోటీన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో..
ఇవాళ కేబినెట్ మీటింగ్‌లోనూ సీన్ రిపీట్ అయ్యింది. ఏకంగా మంత్రులపైనే చంద్రబాబు చిందులు తొక్కినట్లు సమాచారం. ఇంతకీ ఎందుకు అంటారా?.. మంత్రులు కాస్త లేట్‌గా కేబినెట్ మీటింగ్‌కు వచ్చారట!. దీంతో నా అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీనే పట్టించుకోరా? అని మండిపడ్డారట!. ఆపై ఏమనుకున్నారో ఏమో కాస్త శాంతించి..
మంత్రులు అయ్యి ఉండి మీరే టైంకి రాకపోతే ఎలా?.. అని కాస్త తగ్గిన వాయిస్‌తో చంద్రబాబు మాట్లాడారట. అలా లేట్‌గా వచ్చిన వాళ్లలో ఆనం రామనారాయణరెడ్డి, సంధ్యారాణి, సుభాష్‌లు ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మంత్రుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడంతో ఆయనలోని కోపధారి బయటకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.
బుధవారం ఏం జరిగిందంటే.. రాష్ట్ర మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన హెచ్‌ఓడీల (హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు సూచనలు చేసినప్పటికీ మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. ‘‘చాలా మంది మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా తెలియడం లేదు. మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫైళ్ల పురోగతి, ప్రాజెక్టుల స్థితి, బడ్జెట్ వినియోగం వంటి అంశాలపై రోజువారీగా సమీక్ష చేయాలి’’ అన్నారు. అలాగే.. కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో మంత్రులు అట్టర్‌ప్లాప్ అవుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారని అధికార వర్గాలు తెలిపాయి.


