అనంతపురం: కేఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ వసతి గృహంలో ఉండి చదువుతున్న నలుగురు ఇంటర్ విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నకి పాల్పడ్డారు .
వివరాల్లోకి వెళ్తే.. వసతి గృహంలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిందని భావించిన హాస్టల్ వార్డెన్, ఈ విషయం గురించి వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని విద్యార్థినులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఆందోళన చెందిన ఆ నలుగురు విద్యార్థినులు సూపర్ వేస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
ఈ విషయం గమనించిన వార్డెన్ వెంటనే వారిని చికిత్స నిమిత్తం అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినుల నుండి మౌఖిక వాంగ్మూలం తీసుకోవడంతో పాటు, హాస్టల్ వార్డెన్ వ్యవహారం, కళాశాల పరిపాలనలో ఉన్న లోపాలపై కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.


