పోలాకి మండలంలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి
మద్యం మత్తులో కొడుకే కంఠం కొరికి చంపినట్లు ప్రచారం
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని బెలమర గ్రామంలో దండుపాటి అప్పమ్మ(68) అనే వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలాకి పోలీసులు బుధవారం కేసు నమో దు చేశారు. వివరాల్లోకి వెళితే.. మృతురాలి కుమారుడు మద్యానికి బానిసగా మారి భార్యాపిల్లలకు దూరంగా తల్లి అప్పమ్మ వద్ద కొంతకాలంగా ఉంటున్నాడు. తల్లీకొడుకులపై కోడలు అనురాధ గతంలో వేధింపుల కేసు పెట్టడంతో ఆ కేసు విచారణ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో అప్పమ్మ కంఠంపై గాయంతో మృతిచెందటంతో కొడుకు వెంకటరమణ మద్యం మత్తులో తల్లి కంఠం కొరికి చంపినట్లు ప్రచారం జరిగింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ రంజిత్ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతురాలు అప్పమ్మకు అనారోగ్య సమస్యలు సైతం ఉన్నాయని, దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.


