ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్న తాజా నివేదిక ఆందోళనకరం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక పరిశోధన విభాగం అధ్యయనం ప్రకారం వేగంగా రుణగ్రస్థమవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ముందున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వాలు చేస్తున్న పదేళ్ల టర్మ్ అప్పులు మరీ ఎక్కువ భాగంగా మారుతున్నాయని, చేసిన అప్పులు సక్రమంగా వాడకపోవడం, ఉద్దేశించిన పథకాలకు కేటాయించకపోవడం, ఆశించినంత రాబడి లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అడిగినా అప్పులివ్వడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం వల్ల కొత్త అప్పులు పుట్టడం లేదని కూడా వాపోయారు. అయితే... ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమిటి? అప్పటి సీఎం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడని.. తాను సంపద సృష్టించి ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేస్తానని కదా? ఏమైంది? అధికారం దక్కగానే స్వరం మారింది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ఆరంభించారు. అలాగని కొత్తగా సంపద సృష్టించారా? ఊహూ.. అదీ లేదు. పైగా నిధుల ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నారన్న వస్తున్న విమర్శలనూ పట్టించుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో రూ.40 వేల కోట్ల అప్పు చేసేందుకు అవకాశం ఉండగా రూ.49 వేలు, తెలంగాణ రూ.31 వేల కోట్ల స్థానంలో రూ.60 వేల కోట్లు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తాల్లోనూ పదేళ్లలో తిరిగి చెల్లించవలసిన సెక్యూరిటీలే ఎక్కువ. దీనివల్ల వచ్చే పదేళ్లలో రాష్ట్రాలు మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కునే ప్రమాదం ఉంది. అయితే హైదరాబాద్ మహానగరంలోని ప్రభుత్వ భూముల వేలం ద్వారా తెలంగాణ ఏటా రూ.5 నుంచి రూ.పది వేల కోట్ల వరకూ సంపాదిస్తోంది. పైగా రాజధాని పేరుతో ఇష్టమొచ్చినట్లు అప్పు చేయాల్సిన అవసరమూ ఆ రాష్ట్రానికి లేదు. పరిశ్రమల పేరు చెప్పి అణాకు, బేడాకు భూములు కూడా ఇవ్వడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి.ఆదాయమేమో తక్కువ. దుబారా ఎక్కువ.
విజన్ విజన్ అని చంద్రబాబు చెప్పే మాటలు చేతల్లో మాత్రం అస్సలు కనిపించడం లేదు. చంద్రబాబు తాను చేతల మనిషిని కూడా అన్నది రుజువు చేసుకోవల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే అధికారం దక్కిన తరువాత కేవలం 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఎకాఎకి రూ.2.5 లక్షల కోట్ల వరకూ ఉంది. ఈ డబ్బు ఎలా సద్వినియోగమైందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజలకు ఆరోగ్య వరప్రదాయిని కాగల 17 వైద్యకళాశాలలను ప్రైవేట్ పరం చేయడం, రూ.6500 కోట్లకు పైగా ఫీజ్ రీయంబర్స్‌మెంట్ బకాయిలు, రూ.3000 కోట్ల ఎన్టీఆర్ ఆరోగ్యసేవ బకాయిలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. మరో వైపు సూపర్ సిక్స్ అని, ఎన్నికల ప్రణాళిక అని ఏటా సుమారు లక్షన్నర కోట్ల విలువైన హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. వాటిలో కొన్నిటిని అరకొరగా చేసి.మిగిలిన వాటిని మంగళం పలకడానికి ఇప్పుడు తాజాగా అప్పులు పుట్టడం లేదన్న గాత్రం అంందుకున్నట్లు అనిపిస్తుంది. రాష్ట్ర జీఎస్టీ రాబడి తగ్గడం కూడా మరో ప్రమాద సూచిక. జీఎస్టీ స్లాబ్‌లు తగ్గడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఎల్లోమీడియా డబ్బా కొట్టినా ఇప్పుడు మాటమార్చి రాబడి తగ్గిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సెంట్రల్ యూనివర్శిటీ లోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ఫ్రొషెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి వంటి వారు కూడా అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒక్క కరోనా సంక్షోభ సమయంలో తప్పు నిర్ణీత పరిమితిలోపే అప్పులు చేసేవని, 2025లో పలు రాష్ట్రాలు హద్దులు దాటి అప్పులు చేస్తూ భావితరాలను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వాలు ఏ స్కీమ్ కింద అప్పులు చేస్తాయో దానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం వల్ల అప్పు తీర్చడానికి అవసరమైన ఆదాయం రాదు.
దాంతో అప్పులకు వడ్డీ తోడై భారం తడిసి మోపెడవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసలు అప్పుల్లేకుండానే రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పినా ఇప్పటివరకూ రూ.40 వేల కోట్లు అప్పులు చేశారు. తెచ్చిన అప్పులతో రోడ్ల వంటివి నిర్మించినప్పటికీ ఆ తరువాత ఆదాయమేమీ రావడం లేదు. దీంతో అప్పులపై వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతోంది. భూమి ఇచ్చిన రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత మిగిలిన భూమిని అమ్మి మాత్రమే ప్రభుత్వం డబ్బు సంపాదించుకోవాలి. లేదంటే అప్పు ఓ గుదిబండగా మారుతుంది. ఈ దృష్టితోనే రాజధాని పేరుతో విపరీతమైన ఖర్చులు వద్దని నిపుణులు వారించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.
కేవలం కంప చెట్లు కొట్టించేందుకే రూ.40 కోట్లు వ్యయం చేశారంటే ఈ ప్రభుత్వం దుబారా స్థాయి ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. వందల కోట్ల రూపాయలతో వరదనీరు తోడటం, కిలోమీటర్ రహదారికి ఎక్కడా లేనంతగా రూ.75 కోట్ల నుంచి రూ.174 కోట్ల వరకూ ఖర్చు చేస్తూండటం, మహా నగరాల్లోనూ లేని విధంగా చదరపు అడుగు భవన నిర్మాణానికి రూ.పదివేలకు మించి వ్యయం చేస్తూండటం కూడా ప్రభుత్వం తీరుకు అద్దం పట్టేవే. ఇలా లక్షల కోట్లు వ్యయం చేసి ఆ తర్వాత తిరిగి రాబట్టుకునే మార్గం లేకపోతే ఆ భారం రాష్ట్ర ప్రజలు మోయవలసిందే. ఈ మధ్యకాలంలో పరిశ్రమలకు ఇస్తున్న భారీ రాయితీలు కూడా ఆర్థిక పరిస్థితిపై మరిన్ని సందేహాలను లేవనెత్తుతున్నాయి.
విశాఖపట్నంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.22 వేల కోట్లకుపైగా రాయితీలు ఇవ్వడం దీనివల్ల వచ్చే ఉద్యోగావకాశాలు రెండువేలు కూడా లేకపోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రతిపాదనలో 200 ఉద్యోగాలే వస్తాయని తెలిపారు. అదే జరిగితే ప్రభుత్వం ఈ భారం అంతా మోయవలసి వస్తుంది.ఇక కొన్ని పరిశ్రమలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్నారు. అలాకాకుండా ప్రభుత్వం హేతుబద్దమైన రీతిలో ఈ ధరలు నిర్ణయించి ఉంటే అది అమ్మకమైన, లీజు అయినా ప్రభుత్వానికి కొంత ఆర్జన ఉంటుంది. ఇలా ఒకవైపు రాయితీలు ఇచ్చుకుంటూ పోయి, మరో వైపు ప్రభుత్వానికి ఏళ్లతరబడి వచ్చే ఆదాయం లేని పరిస్తితి ఏర్పడితే అది ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చన్నది నిపుణుల అంచనా.
తీసుకునే రుణాలు ఏ పాతికేళ్లకో చెల్లించేలా తీసుకోగలిగితే అది ఒక రకంగా ఉండవచ్చు.కాని కేవలం పదేళ్లకే తిరిగి చెల్లించేలా ఒప్పందం అయితే ఏటాటే ఆర్ధిక భారం పెరుగుతుంది. అప్పులు తీర్చడానికే అప్పులు చేసే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు రాష్ట్రాలు ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం,ఆ తర్వాత వాటిని అమలు చేయలేక చేతులెత్తేసి జనాన్ని మోసం చేయడం, అరకొరగా చేసి అన్నీ చేసేశామని బొంకడం, ఇంకో వైపు ఎక్కడ వీలైతే అక్కడ అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడం,దానిని కప్పిపుచ్చుతూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం..ఇదే 
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


