టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్‌యాదవ్ కంపెనీకి మరో అ‘ధనం’
పోలవరం ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో చేసిన పనులకు చెల్లింపునకు ఓకే
2016–19 మధ్య మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ అదనంగా చేశామంటూ బిల్లులు
ఈ ఏడాది జూలై 30న ఆమోదముద్ర వేసిన ఎస్‌ఎల్‌టీసీ
2016లో రూ.142.88 కోట్ల పనులు నామినేషన్ పద్ధతిలో అప్పగింత
హార్డ్ రాక్ బ్లాస్టింగ్‌కు రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించేలా గతంలో ఉత్తర్వులు
ఇలాగే కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పులకు రూ.38 కోట్లు ఇచ్చేలా 2018లో ఆదేశాలు
కంట్రోల్ బ్లాస్టింగ్ విధానంలో మట్టి పనిచేశారని చూపి రూ.13.25 కోట్లు చెల్లింపు
ఇప్పటికే అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల ప్రయోజనం
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ సంస్థ పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ (జేవీ)పై ప్రభుత్వం వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తోంది. పోలవరం ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో అడుగు (బెడ్) భాగం వెడల్పు పెరగడం వల్ల 2016–19 మధ్య అదనంగా మట్టి తవ్వకం, కాంక్రీట్ లైనింగ్ పనులు చేశారని, అందుకు రూ.4.40 కోట్లను అదనంగా చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో చేసిన పనులకు అదనపు బిల్లులు చెల్లించాలని పుట్టా సంస్థ పోలవరం సీఈకి ప్రతిపాదించగా... అధికారి ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ఈ ఏడాది జూలై 30న స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదం తెలిపింది. అనంతరం ఎస్‌ఎల్‌టీసీ సిఫార్సుతో పుట్టా సంస్థకు అదనంగా చెల్లించాలని సెప్టెంబరు 7న పోలవరం సీఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
⇒ పోలవరం ఎడమ కాల్వలో ఐదో ప్యాకేజీ (93.7–111.487 కి.మీ.) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. అయితే, 5.754 కి.మీ. కాల్వ తవ్వకం, 11.001 కి.మీ. లైనింగ్, 33 కాంక్రీట్ పనులను ఆ సంస్థను నుంచి తప్పించి రూ.142.88 కోట్లకు పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ (జేవీ)కి నామినేషన్ పద్ధతిపై 2016 నవంబర్ 30న చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది.
⇒ 100.3 కి.మీ. నుంచి 102.5 కి.మీ., 110.5 కి.మీ. నుంచి 111.487 కి.మీ. వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేయాలని, 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని దీనికి రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న నాటి టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న మరో ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దాంతో ఆ సంస్థకు రూ.180 కోట్లకు పైగా విలువైన పనులను అప్పగించినట్లైంది.
⇒ 2019 అక్టోబర్ 3 నాటికి పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ సంస్థ రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. కాగా, పుట్టా సంస్థకు నామినేషన్‌పై అప్పగించిన పనులను రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలన్న నిపుణుల కమిటీ చేసిన సూచనను గత ప్రభుత్వం అమలు చేసింది. కానీ, మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. పుట్టా సంస్థ ఎడమ కాల్వ 5–ఏ ప్యాకేజీలో 100.3 కి.మీ. నుంచి 102.50 కి.మీ. వరకు 2016–19 మధ్య కంట్రోల్ బ్లాస్టింగ్‌లో 16,69,476 క్యూబిక్ మీటర్ల మట్టిపని చేశారని చూపి క్యూబిక్ మీటర్‌కు అదనంగా రూ.78 చొప్పున రూ.13,25,59,128 చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అక్టోబర్ 15న ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టు 6న ఎల్‌ఎస్‌సీ (డిస్ట్రిక్ లెవల్ శాంక్షన్ కమిటీ) ప్రతిపాదన మేరకు చెల్లించిన రూ.9,94,19,274 పోగా మిగిలిన రూ.3,31,39,854 మంజూరు చేయాలని పేర్కొంది. గతంలో డీఎల్‌ఎస్‌సీ చేసిన ప్రతిపాదనపై ఈ ఏడాది జూన్ 25న అంటే ఎనిమిదేళ్ల తర్వాత నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఎల్‌టీసీ (స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ) ఆమోద ముద్ర వేసిందని, ఆ మేరకే అదనపు బిల్లులు చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే పుట్టా సంస్థకు అదనపు బిల్లుల రూపంలో రూ.53.34 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది.


