కొత్త సంవత్సరంలో కానుక
వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి అమలులోకి కొత్త చార్జీలు
ఇప్పటికే ప్రజలపై రూ.17,349 కోట్ల మేర చార్జీల భారం
కొత్త చార్జీలపై ఏపీఈఆర్‌సీ వద్ద నివేదిక
ఏపీఎస్పీడీసీఎల్ లో రూ.7,733.85 కోట్ల వడ్డన.. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో రూ.3,465.35 కోట్ల పెంపు
ఏపీఈపీడీసీఎల్ ద్వారా రూ.4,452.73 కోట్లు భారం
ఏపీఈఆర్సీ వద్ద డిస్కంల ప్రతిపాదనలు
సాయంత్రానికి వెబ్‌సైట్ నుంచి మాయం
సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకూ కొత్త టారిఫ్
జనవరి 20, 22, 23, 27 తేదీల్లో బహిరంగ విచారణ
తిరుపతి, విజయవాడ, కర్నూలులో అభిప్రాయ సేకరణ
ఆపై విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం
సాక్షి, అమరావతి: ‘‘విద్యుత్ చార్జీలు పెంచం..ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం’’ బుధవారం అమరావతిలో హెచ్‌ఓడీల సదస్సు సాక్షిగా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. ఎన్నికల ముందు కూడా ఆయన ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్పారు. ఊరూవాడా ప్రచార సభల్లో ఊదరగొట్టారు. ఒకవైపు వఖ్యమంత్రి బుధవారం ఇలా మాట్లాడుతుండగానే రాష్ట్ర ప్రజలపై కొత్త సంవత్సరంలో మోపనున్న కరెంటు చార్జీల భారం విషయం బైటపడింది.
కొత్తగా రూ.15,651.93 కోట్ల మేర విద్యుత్ చార్జీల బాదుడుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) వద్ద నున్న ప్రతిపాదనలు తెలియజేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రూ.17,349 కోట్ల మేర కరెంటు చార్జీల భారం రాష్ట్ర ప్రజలపై మోపింది. కొత్తగా మరో రూ.15,651.93 కోట్ల మేర కరెంటు చార్జీల భారం మోపనున్నట్లు తెలుస్తోంది.
ఏపీఈఆర్‌సీ వద్ద ఏఆర్‌ఆర్ నివేదిక
ఏపీఈఆర్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో చార్జీల పెంపు ప్రతిపాదనలు బయటపడ్డాయి. 2026–27 ఆర్ధిక సంత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు(ఏపీఈపీడీసీఎల్), మధ్య(ఏపీసీపీడీసీఎల్), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్‌మెంట్–ఏఆర్‌ఆర్)లను ఏపీఈఆర్‌సీకి గత నెల(నవంబర్) 30న సమర్పించాయి. అయితే ఆ వివరాలేవీ బయటపెట్టకుండా రహస్యంగా ఉంచాయి.
ఈ విషయాన్ని ‘లెక్కలు చెప్పని డిస్కంలు’ శీర్షికతో సాక్షి మంగళవారం వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో బుధవారం టీడీపీ కరపత్రం ఈనాడు పత్రికలోనూ, మరో ఆంగ్ల పత్రికలోనూ ఏఆర్‌ఆర్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. మధ్యాహ్నానికి ఏపీఈఆర్‌సీ వెబ్‌సైట్‌లోనూ అవే వివరాలు ప్రత్యక్షమయ్యాయి.
కానీ చిత్రంగా సాయంత్రానికి వెబ్‌సైట్‌ను మెయింటెనెన్స్ పేరుతో పూర్తిగా ఆపేశారు. దీంతో డిస్కంల ప్రతిపాదనలేవీ ఏపీఈఆర్‌సీ వెబ్‌సైట్‌లో కనిపించకుండా మాయమైపోయాయి. చార్జీలు పెంచడం లేదని సీఎం ప్రకటించిన నేపధ్యంలోనే ఏపీఈఆర్‌సీ వెబ్‌సైట్ నుంచి ఏఆర్‌ఆర్ వివరాలను ఎవరూ చూడకుండా చేసినట్లు తెలిసింది.
బాదుడు ఇలా..
2025–26 ఆర్ధిక సంవత్సరంలో డిస్కంల ఖర్చులు, ఆదాయాలను లెక్కించి, 2026–27 సంవత్సరానికి అంచనాలను రూపొందించారు. దాని ప్రకారం..దక్షిణ డిస్కంలో నెట్‌వర్క్ నిర్వహణ, విద్యుత్ సరఫరా వ్యయం రూ.23,777.87 కోట్లుగా లెక్కించారు. అందులో రూ.14,016.06 కోట్ల మేర ప్రస్తుత ధరల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తే సమకూరుతుంది. అలాగే టారిఫ్ యేతర రాబడి మరో రూ.1838.31 కోట్లు వస్తుంది.
ఈ రెండూ పోగా ఇంకా రూ.7923.50 కోట్లు లోటు ఉంటుంది. దీంతో రూ.7733.85 కోట్లను చార్జీల ద్వారా వసూలు చేస్తే ఈ లోటు తీరుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదించింది. అదే విధంగా మధ్య డిస్కం వచ్చే ఏడాది ఖర్చు రూ.14,446.93 కోట్లు అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత టారిఫ్ ప్రకారం అయితే రూ.10,344.51 కోట్లు, టారిఫ్‌యేతర రాబడి రూ.613.27 కోట్లు వస్తుందని చెప్పింది. అంటే ఇంకా రూ.3465.35 కోట్ల ఆదాయం అవసరం అవుతుందని ఏపీసీపీడీసీఎల్ అడిగింది.
అదే విధంగా తూర్పు డిస్కం వచ్చే ఆర్ధిక సంవత్సరానికి రూ.21,730.59 కోట్లు కావాలని అడిగింది. ఇందులో ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.16,550.98 కోట్లు, టారిఫ్ కాకుండా ఇతర ఆదాయం రూ.567.29 కోట్లు పోగా ఇంకా రూ.4,612.32 కోట్లు లోటు ఉంటుందని వివరించింది. అందుకే కొత్త చార్జీల ద్వారా రూ.4,452.73 కోట్లు వసూలు చేసుకుంటామని ఏపీఈపీడీసీఎల్ చెప్పుకొచ్చింది.
ఈ లెక్కన మొత్తం రూ.15,651.93 కోట్ల ఆదాయ లోటును డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో చూపించాయి. ఈ మొత్తాన్ని 2026–27 ఆర్ధిక సంవత్సరం టారిఫ్(చార్జీలు) ద్వారా వసూలు చేసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని కోరాయి.
కొత్త చార్జీల భారం చిన్న వినియోగదారులపైనే
ఏఆర్‌ఆర్‌లో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం చార్జీల భారం లోటెన్షన్(ఎల్‌టీ)విద్యుత్ సర్వీసులు అంటే గృహ, వాణిజ్య, చిన్న పరిశ్రమలు, సంస్థలు, వ్యవసాయ సర్వీసుల నుంచే వసూలు చేయనున్నారు. అయితే కొన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ, ఉచిత విద్యుత్‌ను అందించాల్సి ఉంది. ఆ మేరకు వారిపై కొత్త చార్జీల భారం పడకుండా ప్రభుత్వమే రూ.15,651.93 కోట్ల లోటును భరిస్తామని ప్రకటిస్తే ప్రజలపై ప్రస్తుత భారాలు కొనసాగినా, కొత్త చార్జీల భారం తప్పే అవకాశం ఉంది.
కాగా సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమలకు కొత్త టారిఫ్‌ను ఈ సారి డిస్కంలు ప్రతిపాదించాయి. మొదటి 7 సంవత్సరాలకు యూనిట్ రూ.4 చొప్పున, తర్వాత 8 సంవత్సరాలకు యూనిట్‌కు రూ.4.50 చొప్పున చార్జీలు వసూలు చేస్తామని వెల్లడించాయి. అదే విధంగా టైమ్ ఆఫ్ డే(టీఓడీ) ధరలను కూడా సవరించాయి. ప్రస్తుతం పీక్ అవర్స్(విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయం)లో యూనిట్‌కు రూ.0.50 అదనంగా వసూలు చేస్తుండగా దానిని రూ.1 కి పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
అంతేకాకుండా పీక్ అవర్స్‌గా లెక్కించే నిర్ధేశిత సమయాలను కూడా మార్చాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పీక్ అవర్స్‌గా ప్రస్తుతం లెక్కిస్తుండగా, ఇకపై ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకూ, రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకూ పీక్ అవర్స్‌గా పరిగణిస్తామని తెలిపాయి.
మూడు ప్రాంతాల్లో బహిరంగ విచారణ
డిస్కంలు ఇచ్చిన ఏఆర్‌ఆర్ ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ జనవరి 20,22,23, 27 తేదీల్లో హైబ్రిడ్ పద్ధతిలో బహిరంగ విచారణ చేపట్టనుంది. అంటే నేరుగానూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానూ ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుంటుంది. 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ తిరుపతిలోనూ, 22, 23 తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ విజయవాడలోనూ, 27వ తేదీన అదే సమయాల్లో కర్నూలులోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలోనూ బహిరంగ విచారణ నిర్వహించనుంది.
ఈ విచారణ అనంతరం వచ్చిన సూచనల ఆధారంగా డిస్కంల ప్రతిపాదనలను పరిశీలించి కొత్త టారిఫ్‌పై ఏపీఈఆర్‌సీ నిర్ణయాన్ని వెలువరిస్తుంది. దాని ప్రకారం వచ్చే ఏడాది అంటే 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ చార్జీలు అమలులోకి వస్తాయి.
ఇప్పటికే రూ.17,349 కోట్ల మేర కరెంటు చార్జీల భారం
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే తగ్గిస్తామని, వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. కానీ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల చార్జీల భారాన్ని వేసి విద్యుత్ చార్జీల బాదుడికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాదికి వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి లభించింది.
అంటే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలోనే ఏకంగా రూ.17,349 కోట్ల మేర కరెంటు చార్జీల భారం ప్రజలపై మోపినట్లయ్యింది. రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయమని ఏపీఈఆర్‌సీ చెప్పకపోతే చార్జీల భారం మొత్తం రూ.18,272.55 కోట్లు అయ్యేదే.. ఇది చాలదన్నట్లు ఇప్పుడు రూ.15,651.93 కోట్ల బాదుడుకు రంగం సిద్దమైంది.




