ఏలూరులో జరిగిన కోటి సంతకాల ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు
నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల బాక్సులు తరలింపు
ఆ వాహనాలకు జెండా ఊపి.. ర్యాలీలను ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను బాబు సర్కారు ఉపసంహరించుకోవాలని నినదించిన విద్యార్థులు, యువత, మేధావులు
సాక్షి, విశాఖపట్నం, నెట్‌వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు.
ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. 
కాకినాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు
అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్‌కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్‌కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. 
సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు.
⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు.
⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్‌కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్‌కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు.
⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు.
⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్‌లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్‌కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్‌లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు.


