సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని.. ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్సార్సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు. చివరికి మంత్రి సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించారు. గత వైయస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని విడదల రజని వివరించారు.
వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిజిటలైజ్ చేసి ఆ రికార్డులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైయస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైయస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైయస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది.
చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైయస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇచ్చిన ఈ పిలుపునకు ప్రజలు భారీగా తరలి వచ్చి సంతకాలతో మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు.
ఫేక్ సభ్యత్వాలు, ఫేక్ పెట్టుబడులు, ఫేక్ సూపర్ సిక్స్ కాదు
లోకేష్ చెప్పే టీడీపీ ఫేక్ సభ్యత్వాలు మాదిరిగా కాకుండా, చంద్రబాబు ప్రకటించే ఫేక్ పెట్టుబడుల ఒప్పందాల మాదిరిగా కాకుండా, సూపర్ సిక్స్ ఫేక్ హామీల మాదిరిగా కాకుండా ప్రజలు స్పష్టంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా పేపర్లపైన చేసిన సంతకాలు. కిక్ బ్యాగ్స్ కోసం పేద విద్యార్థుల మెడికల్ సీటు కలను పణంగా పెడుతూ, వైద్యాన్ని పేదలకు అందని ద్రాక్షగా మారుస్తూ జరుగుతున్న కుట్రలను గుర్తించిన ప్రజలు ప్రైవేటీకరణ వద్దని నినదిస్తూ ప్రభుత్వానికిచ్చిన మెమోనే ఈ కోటి సంతకాలు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేసింది. 108, 104 అంబులెన్స్‌లు కనుమరుగు చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసేసింది. బిల్లులు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది.
ఎకరా వంద రూపాయల చొప్పున మెడికల్ కాలేజీల భూములను అప్పనంగా ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతిటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్పత్రులను వారికే ఇచ్చేసింది. అందులో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు చేస్తున్న ధన యజ్ఞాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. దానికి సాక్ష్యమే వైయస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు వచ్చిన అపూర్వ స్పందన. ప్రైవేటీకరణ నిర్ణయం చాలా గొప్పదన్నట్టు కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం ఆపేస్తే మంచిది. ఇప్పటికైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి.
గవర్నర్‌కి డిజిటల్ రికార్డులు సమర్పిస్తాం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసిన వైయస్సార్సీపీ శ్రేణులందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతాభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10న రచ్చబండ పేరుతో ప్రతి గ్రామంలో మొదలైన కోటి సంతకాల ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువత, మేథావులు, వివిధ రంగాల నిపుణులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా చేయాలనుకుంటే అంతకుమించి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన రెండు నెలలుగా స్టాప్ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో చర్చలు జరుపుతూ నష్టాలను వివరిస్తూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అవగాహన కల్పించారు. తమకు ఎదురైన అనుభవాలను పార్టీ నాయకులు మీడియాకు వివరించడం కూడా జరిగింది. 26 జిల్లాల్లో ఊహించని స్పందన వచ్చింది.
ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక బాక్సుల్లో జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి నేతృత్వంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కి సమర్పించడం జరుగుతుంది. ప్రజలే తమ పేరు నియోజకవర్గం, గ్రామం, మొబైల్ నంబర్, సంతకాలను పేపర్లపై పొందుపరిచారు. ఈ మొత్తం సంతకాలను డిజిటలైజ్ చేసి గవర్నర్‌కి అందించడం జరుగుతుంది. కోటి మంది ప్రజల గుండె చప్పుడుగా ఈ కోటి సంతకాలను ప్రభుత్వం పరిగణించి పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజా నిర్ణయాన్ని కాదని ముందుకెళితే ఈ కోటి సంతకాలు ప్రభుత్వం పతనానికి శాసనంగా మారతాయని వైయస్సార్సీపీ హెచ్చరిస్తుంది.
నియంత పాలనకు మూల్యం చెల్లించక తప్పదు
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మంత్రి స్వయంగా చెప్పాడంటే వైద్యారోగ్య రంగం నిర్వీర్యం అయిందని ప్రభుత్వమే అంగీకరించినట్టు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వైద్యారోగ్య రంగాన్ని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ లక్ష్యంగా దూది సూది కూడా అందుబాటులో లేనివిధంగా ప్రభుత్వ వైద్యశాలలను మార్చేశారు. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారబోతోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే దించేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని స్పష్టంగా చెబుతున్నా. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదని వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హిట్లర్ మాదిరిగా నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబుకి హిట్లర్‌కి పట్టిన గతే పడుతుందని విడదల రజని హెచ్చరించారు.


