సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్‌కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు.
గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్‌సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది.
ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు.


