సాక్షి, ఢిల్లీ: ఓట్ చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ అంశంపై చర్చకు రావాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. అయితే.. ఆ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
లోక్‌సభలో ఎస్‌ఐఆర్‌పై చర్చకు అమిత్ షా భయపడుతున్నారు. మొదటిసారి ఈసీకి పూర్తి ఇమ్యూనిటీ ఇచ్చారు. హర్యానాలో 19 లక్షల నకిలీ టోర్లు ఉన్నారు. ఓట్ల చోరీ వ్యవహారంలో నా ఆరోపణలకు జవాబివ్వగలారా? చర్చకు సిద్ధమా? అని రాహుల్ అన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ..
నేను ఎప్పుడు మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో ఎవరూ నిర్ణయించలేరు. వాళ్లకు(రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ, అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు.
నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రధాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పుబట్టలేదు’’ అని అమిత్ షా అన్నారు.
ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేశీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు.


