న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఎనిమిదవ రోజున(బుధవారం) లోక్‌సభలో.. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కసరత్తుపై లోక్‌సభ చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మనీష్ తివారీ ఈ చర్చను ప్రారంభించారు. ఆయన ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలను డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ చర్చను ముందుకు తీసుకెళుతూ.. ఎన్నికల కమిషన్.. ఎన్నికలను రూపొందించేందుకు పాలక భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కుమ్మక్కవుతున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓటు చోరీని మించిన జాతి వ్యతిరేక చర్య మరొకటి లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎలక్షన్ కమిషన్, సిబిఐ , ఈడి, ఐటి విభాగాలను బిజెపి కబ్జా చేసిందన్నారు. ఎన్నికల కమిషనర్ల సెలక్షన్ల కమిటీ నుంచి సిజెఐ ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదని చెబతూ, ఈవీఎం వెరిఫికేషన్ కు యాక్సెస్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల జాబితాలో 22 సార్లు బ్రెజిల్ మహిళ ఫోటో ఉందని, దీనిపై తన ప్రశ్నలకు ఎన్నికల సంఘం జవాబులు చెప్పడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, తాను అధికారంలోకి వస్తే అన్నింటిని చక్కదిద్దుతామని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ఇండిగో వైఫల్యం వల్ల ఆర్థిక నష్టం అత్యంత భారంగా మారిందని అన్నారు. ఇప్పటివరకు మొత్తం ఆర్థిక నష్టం ఎంతో తెలియదు. ఎన్ని టిక్కెట్లు రద్దు చేశారో తెలుస్తోంది.ఈ విషయంలో ఇతర నష్టాల సంగతేంటి? హోటల్ బుకింగ్, ఈవెంట్లు రద్దు అయ్యాయి. వీటన్నింటినీ ఎవరు భరిస్తారు? ఈ భారీ వైఫల్యం కారణంగా ప్రయాణికులు ఎంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారో ప్రభుత్వానికి ఏమైనా అంచనా ఉందా?" అని కార్తీ చిదంబరం ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనను సమర్థించారు. పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. అయినప్పటికీ కాలుష్యం గురించి లేదా ఎన్నికల సంస్కరణల గురించి ప్రధానమంత్రికి పెద్దగా పట్టింపు లేదు.
వారు 150 ఏళ్ల నాటి వందేమాతరం గురించి మాట్లాడుతున్నారు, కానీ యువత నిరుద్యోగం గురించి ఎటువంటి ఆందోళన లేదు అని రంజీత్ రంజన్ ఎద్దేవా చేశారు. వారు ఎవరి సమస్యలను పరిష్కరిస్తున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నారు? అని అడుగుతున్నారు. 140 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందా?" అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ చేపట్టనున్నారు. దీనికి ముందు వందేమాతరం 150వ వార్షికోత్సవంపై చర్చ కొనసాగింది. అంతకు ముందు రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వందేమాతరం 150వ వార్షికోత్సవంపై రాజ్యసభలో ప్రత్యేక చర్చను చేపట్టారు. వందేమాతరంపై విమర్శలు చేసేవారు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.


