కేంద్రంపై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో సామాన్య ప్రజల సమస్యలపై చర్చించి, పరిష్కరించిన రోజున మాత్రమే భారత మాతకు నిజమైన నివాళి అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. త్వరలో బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ వందేమాతరంపై చర్చను చేపట్టారని ఆయన విమర్శించారు. నిరుద్యోగం, దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ, రూపాయి విలువ పతనం తదితర దేశం ముందున్న ప్రధానమైన సమస్యలపై అందరి దృష్టినీ మళ్లించేందుకు కూడా ఈ చర్చను కేంద్రం నిర్వహిస్తోందని ఆరోపించారు.
మంగళవారం ఆయన వందేమాతర గీతానికి 150 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొని, దాదాపు గంటపాటు మాట్లాడారు. వందే మాతర గీతాన్ని రెండు చరణాలకే పరిమితం చేశారంటూ నెహ్రూపై ప్రధాని మోదీ, అమిత్‌షాలు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ అంశంపై మహాత్మాగాంధీ, సుభాష్ చంద్ర బోస్, మదన్ మోహన్ మాలవీయ, ఆచార్య కృపలానీ, రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహామహులతో కలిసి ఆయన తీసుకున్న నిర్ణయమన్నారు. అప్పట్లో వందేమాతరం ఆలపించేందుకు ఇష్ట పడిన వారు సైతం నేడు వందేమాతరం అంటున్నారని, ఇదే జాతీయ గీతం గొప్పదనమని ఖర్గే చెప్పారు.
‘దక్షిణాసియా దేశాలను బాహాటంగానే చైనా తన వైపు లాక్కుంటోంది. తన ఛాతీ 56 అంగుళాలని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ చైనాకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడారా?’అని ఖర్గే ప్రశ్నించారు. యూపీఏ హయాంలో 55 రూపాలయ వరకు ఉన్న డాలరు విలువ నేడు ఏకంగా ఆకాశమంత ఎత్తుకు పెరిగి రూ.90కి చేరుకుందన్నారు. వందేమాతరం గురించి మాట్లాడటమంటే, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పరిణామాలను గురించి మాట్లాడుతున్నారంటూ అధికార పక్షాల సభ్యులు అభ్యంతరం తెలపగా అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వారితో ఏకీభవించారు.


